పోతుకూచి సాంబశివరావు

పోతుకూచి సాంబశివరావు కవి, రచయిత, న్యాయవాది.

పోతుకూచి సాంబశివరావు
కృష్ణానంద డా.పోతుకూచి
జననంపోతుకూచి సాంబశివరావు
1927, జనవరి 27
ఆలమూరు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2017, ఆగష్టు 6
హైదరాబాదు
మరణ కారణంవృద్ధాప్యము
వృత్తిన్యాయవాది
ప్రసిద్ధికవి, రచయిత, సాహితీవేత్త
పదవి పేరుసాహితీచైతన్య,
సాహితీభీష్మ,
కళాప్రపూర్ణ
తండ్రినరసింహమూర్తి
తల్లిసూరమ్మ

ఈయన తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో పోతుకూచి నరసింహమూర్తి, సూరమ్మ దంపతులకు 1927, జనవరి 27 వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య కోటిపల్లి, ఆలమూరు గ్రామాలలో, ఉన్నత పాఠశాల విద్య రామచంద్రపురంలో, కళాశాల విద్య కాకినాడలో చదివాడు. హైదరాబాదులో ఎల్.ఎల్.బి. చదివి న్యాయవాదిగా వృత్తిని కొనసాగించాడు.[1] ఇతడు అవివాహితుడు.

సాహిత్యరంగంలో కృషి

మార్చు

కథారచయితగా

మార్చు

కథారచయితగా ఇతడు దాదాపు 350 కథలు వ్రాశాడు. ఇతని కథలు ఆంధ్రపత్రిక, కిన్నెర, యువ, ఆంధ్రప్రభ, పుస్తకం, కృష్ణాపత్రిక, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, అనామిక, చిత్రగుప్త, భారతి, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈ కథలు సాంబశివరావు కథలు (6 సంపుటాలు), శేఖరం కథలు, ఏడుప్రశ్నలు, కొత్త విలువల బ్రతుకు, పోతుకూచి కథలు, ఎదురు ప్రశ్నలు, నవకథంబం, మందారాలు, విక్రమ, వేదప్రియ, హైదరాబాదులో, బ్రతుకుల పతనం పేర్లతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఇతని కథలు హిందీ, కన్నడ, తమిళ, రష్యన్, జర్మనీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇతని కథలపై చలం ప్రభావం కనిపిస్తుంది.

నవలారచయితగా

మార్చు

ఇతడు ఐదు నవలలు వ్రాశాడు.[2] అన్వేషణ నవలకు మద్రాసు తెలుగు భాషాసమితి నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆధునికాంధ్రుల సాంఘిక జీవితాన్ని ఈ నవల చక్కగా చిత్రించింది. దీనిని మద్రాసు విశ్వవిద్యాలయం బి.ఎ.లో ఉపవాచకంగా నిర్ణయించింది. ఉదయకిరణాలు నవల 1956లో ఆంధ్ర సచిత్రవార పత్రిక నడిపిన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ నవల 1967లో రష్యన్ భాషలోకి అనువదించబడింది. ఏడురోజుల మజిలీ శృంగార రసప్రధానమైన నవల. చలమయ్య షష్టిపూర్తి, నీరజ ఇతని తక్కిన నవలలు.

నాటకరచయితగా

మార్చు

పోతుకూచి సాంబశివరావు స్వయంగా నటుడు. నాటకకర్త కూడా. ఇతడు వ్రాసిన హంతకులు నాటకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీచే ఉత్తమ నాటకంగా ఎంపిక కాబడింది. పల్లెకదిలింది నాటకం ఆంధ్రదేశం నలుమూలలా ప్రదర్శించబడింది. దొంగ-దొర, ఇదీ తంతు,[3] ఏడు సున్నాలు, ప్రతిధ్వనులు, పెళ్ళి పిలుపు, రెండు నాలికలు, అద్దెకొంపలో ఒక నెల, ఒన్ టూ త్రీ ఫోర్, ఏం ప్రేమలో ఏం గొడవలో, అంతరించే అంతరాలు, దీన్ దయాళ్‌గారి దేవుడిలో, సరిహద్దుల్లో, చుట్టాలరభస, అంత్యక్రియలు మొదలైనవి ఇతడు వ్రాసిన ప్రసిద్ధమైన నాటకాలు/నాటికలలో కొన్ని. ప్రతిధ్వనులు అనే నాటికల సంపుటి ప్రచురించాడు.

కవిగా

మార్చు

పద్యకవిగా, వచనకవిగా, గేయకవిగా ప్రసిద్ధుడైనాడు. మొదటి పద్య రచన జనుషాంధుడు కాలేజీ పోటీలలో బహుమతి గెలుచుకొంది. రాసి-సిరా, అనురాగం - అను - రాగం, సామ్బశివానందలహరి, పోతుకూచీయం, శిఖరాలు, అగ్నినాదాలు, చైతన్యకిరణాలు మొదలైన కవితా సంపుటాలు పదికి పైగా వెలువరించాడు. అనేక కవితా సంకలానాల్లో, కవి సమ్మేళనాల్లో ఆయన పాల్గొన్నాడు. అనేక పత్రికల్లో ఇతని కవితలు వెలువడ్డాయి. ఇతర భాషా సాహిత్య కవితలను తెలుగులోనికి అనువాదం చేశాడు. చుక్కలు అన్న నూతన లఘు కవితా ప్రక్రియను ప్రారంభించిన ఘనత ఇతనికి దక్కుతుంది.

అనువాదకుడిగా

మార్చు

ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కవి సమ్మేళనాలలోని ఆంగ్ల కవితలు, కొంకణి, కన్నడ, ఒరియా, మరాఠి, హిందీ, నేపాలీ కవితలు అనేకం ఇతడు తెలుగులోకి అనువదించాడు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆలిండియా అనువాదకుల వర్క్‌షాప్‌లో ప్రముఖ పాత్ర వహించాడు. దక్షిణభారత భాషలకు సంబంధించి సాహిత్య అకాడమీ నిర్వహించిన అనువాదకుల వర్క్‌షాప్‌లలో కూడా పోతుకూచి ప్రముఖంగా నిలిచాడు. అమెరికా రీజనల్‌ ఆఫీస్‌ (మద్రాస్‌) వారికి సంబంధించిన 'వాట్‌ డూ యు నో అబౌట్‌ లేబర్‌' అన్న పుస్తకాన్ని తెలుగులోనికి అనువాదం చేశాడు. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌వారి ఆంగ్ల బాలసాహిత్యాన్ని ఎక్కువ శాతం మేరకు ఆంధ్రీకరించిన ఘనత ఇతడిదే. కన్నడ రచయిత సి.కె.నాగరాజారావు రాసిన ప్రముఖ కన్నడ నాటకం 'సంకోలు బసవన్న' కూడా ఆంధ్రీకరించాడు. హిందీ భాషలోభీమసేన్‌ నిర్మల్‌ వ్రాసిన 'హిందీకి- అచ్చీ- కహా నియా'కు అనువాదం వెలువరించాడు. వచన కవితా రీతులను అనువాదాలతో సహా 1977లో ప్రచురించాడు.[4]

కార్యకర్తగా, నిర్వాహకుడిగా

మార్చు

పోతుకూచి సాంబశివరావు హైదరాబాదులో సాహిత్య సంస్థా నిర్మాణదక్షుడిగా పేరుపొందినవాడు. నవ్యసాహితీసమితి, ఆంధ్ర విశ్వసాహితి అనే సంస్థలను నెలకొలిపాడు. అఖిలభారత తెలుగు రచయితల మహాసభలను తొలిసారిగా 1960లో హైదరాబాదులోను, 1963లో రాజమండ్రిలోను, 1967లో తిరుపతిలో, 1969,1971లలో మళ్లీ హైదరాబాదులోను ఘనంగా నిర్వహించాడు. 1965లో ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలు హైదరాబాదులో నిర్వహించాడు. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంకు కార్యదర్శిగా పనిచేసి ఆసంస్థ వజ్రోత్సవాలు విజయవంతంగా నడిపాడు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులలో ఒకడిగా ఉన్నాడు. ఇతనికి ఇతర సాహిత్య సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడెమీ సభ్యుడిగా, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం సలహాసంఘ సభ్యుడిగా, ఆంధ్ర మహిళాసభ సాహిత్య నిర్వాహక మండలిలో సభ్యునిగా, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహాసంఘ సభ్యుడిగా సేవలను అందించాడు. 1959లో బరోడాలో జరిగిన అఖిల భారత రచయితల మహాసభలలో పాల్గొన్నాడు. 1961లో మద్రాసులో యునెస్కో ఏర్పాటు చేసిన సదస్సులో దక్షిణభారతదేశం తరఫున పాల్గొన్నాడు. మారిషస్ దీవులలోని ఆంధ్రుల గురించి తెలుసుకోవడానికి, వారితో సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పడానికి మారిషస్ సందర్శించాడు.

సంపాదకునిగా, జర్నలిస్టుగా

మార్చు

విశ్వరచన, విశ్వ, యూనిలిట్ మొదలైన పత్రికలను నడిపాడు. యువ కవులను, రచయితలను ప్రోత్సహించాడు. దక్కన్‌ క్రానికల్‌ ఆంగ్ల దినపత్రికలో 'ది తెలుగు వరల్డ్‌' అనే శీర్షికతో తెలుగు సంస్కృతి సాహిత్యాలపై అనేక వ్యాసాలు వ్రాశాడు. ఆంధ్రప్రతిక (దినపత్రిక) లో 'న్యాయం', 'చట్టం' గురించి సామాన్యులకు అర్ధమయ్యేలా అందరికీ న్యాయం అనే శీర్షికతో పలు వ్యాసాలు వ్రాశాడు. ఆంధ్రప్రదేశ్‌ సంగీత, నాటక అకాడమీ ప్రచురించే నాట్యకళ మాసపత్రికకు సహాయ సంపాదకత్వం వహించాడు. ఏ.పి.టైమ్స్‌ ఆంగ్ల పత్రికలో దాదాపు సంవత్సరం పైగా ఇతడు వివిధ సాహిత్య విషయాలు, సభలు, సమావేశాలు గురించి రిపోర్టింగ్‌ చేశాడు. 'సిటిజన్స్‌ ఈవినింగ్‌' అనే పత్రిక ద్వారా వారం వారం జ్యోతిష ఫలితాలు ఆంగ్లంలో ప్రచురించాడు.

రచనలు

మార్చు

పైన పేర్కొన్న రచనలే కాక ఈ క్రింది గ్రంథాలను కూడా ఇతడు ప్రకటించాడు.

  1. నా జీవితంలో ప్రయత్నాలు ప్రయోగాలు
  2. అంతరాత్మ ఆవేదన
  3. సంజీవయ్య దర్శనం (జీవిత చరిత్ర)

కథల జాబితా

మార్చు

కథానిలయంలో లభ్యమవుతున్న ఇతని కథల జాబితా.[5]

  1. అంతర్భావాలు
  2. ఆమె చివరకు నవ్వింది
  3. ఆమె స్వగృహంలో
  4. ఆశలేని రేపు
  5. ఆహ్వానం
  6. ఎదురు ప్రశ్న
  7. ఏకాంతం
  8. కలిసివిడిన ...
  9. కాలయంత్రంలో...
  10. కాలిన పేగు
  11. కెరటాలు...
  12. కొత్త విలువల బ్రతుకు
  13. గాలిబుడగలు
  14. గోదావరి...
  15. చుట్టాల రభస
  16. చౌకులో
  17. జీవితం విలువ
  18. టెలిఫోను...
  19. డాక్టరు చంపిన రోగి
  20. తప్పనిసరి అలలు
  21. తప్పిన అశుభం
  22. తిక్కచావు
  23. తిరుగుడు తలుపులు
  24. తెలియని ప్రతీకారం
  25. దయ్యం దేవత
  26. దారితప్పిన ప్రేమ
  27. దీపాల నీడల్లో
  28. నడుస్తున్న నవ్వులాట
  29. పంజరంలో పక్షి
  30. పండగనాటి శాపం
  31. పా-పాల సరఫరా
  32. పాపఫలం
  33. పార్వతి
  34. పెంపుడు జంతువు
  35. పెళ్ళి భయం
  36. పెళ్ళికి వచ్చివుంటే
  37. బస్సులో 10 నిమిషాలు
  38. బ్రతుకుల పతనం
  39. బ్రిడ్జికింద రోడ్డుమీద
  40. మతిమాలిన కథ
  41. మా ఆవిడక్కావాలి
  42. మాజీ యజమాని
  43. మాతృమూర్తి
  44. మామ్మనడిపిన విప్లవం
  45. మారిన స్నేహం
  46. మూడవ తరగతి...
  47. మెరుపులో చెరుపు
  48. రంగడు
  49. రసికశ్రీ
  50. రాయబారి
  51. రేపుమీద ఆశ
  52. వయసు వరదలు
  53. వారసులు
  54. వివాహంలో కలహం
  55. వీడ్కోలు
  56. వెలుగుదారి
  57. సంఘర్షణ
  58. సంతాపసభ
  59. సామాన్యుని సమాధి
  60. సాలిగూళ్లు
  61. స్మృతి వెలుగులు
  62. హత్యా ఆత్మహత్యా

పురస్కారాలు, సత్కారాలు

మార్చు

అనేక సాహిత్య సంస్థలు ఇతని కృషిని గుర్తించి ఇతడిని సత్కరించాయి.[6]

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ (1993)
  • అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్‌ (భూపాల్‌) నుంచి సరస్వతి సమ్మాన్ పురస్కారం
  • భారతీయ లేఖక్ నికాయ్ అవార్డు
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
  • పోలిశెట్టి పర్వతరాజు స్మారక అవార్డు
  • జూలూరి నాగరాజరావు స్మారక అవార్డు మొదలైనవి కొన్ని.

బిరుదులు

మార్చు
  • సాహితీ చైతన్య
  • సాహితీ భీష్మ
  • సాహితీ చైతన్య సంవర్థక
  • విశ్వ ఆంధ్రా సంధాత్‌
  • యువజన మిత్ర
  • కళారత్న

పరిశోధనలు

మార్చు

ఇతడి సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. 2010లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోతుకూచి నాటకాలు- ఒక పరిశీలన అనే సిద్ధాంత గ్రంథానికి ఎస్‌.విజయభాస్కర్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేశారు. 2000లో కాకతీయ విశ్వవిద్యాలయం పోతుకూచి వారి రచనలు- ఒక పరిశీలన అనే గ్రంథానికి ఎక్కలదేవి వెంకటేశ్వర్లుకు పిహెచ్‌.డి. లభించింది. 1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.చంద్రరేఖ ఎం.ఫిల్‌ పరిశోధన చేసింది.

రచనల నుండి ఉదాహరణ

మార్చు

మసకలోని మమత

తాటి చెట్టు మొవ్వ నీడ
తలవిరియ బోసుకుని
చిరునవ్వుల నొలికించే
తరుణీ! నీ వెవ్వతవే!

వెనుకనున్న పచ్చ చేలు
పరుచుకున్న తివాసియా!
పైన ఉన్న చందమామ
పడకింటింటి దీపమా!

దూరమున్న సంపెంగలు
భారమైన మత్తు జల్లె
నీ నవ్వుల గాలిసోకి
నే నవ్వుల పాలైతి!

అవిగవిగొ మబ్బుతెరలు
అణచివేసె చంద్రదివ్వె
మసక మసక వెలుగుల్లో
మై మరచి పోదామె!!

నిత్య సాహిత్య కార్యశీలిగా అలరారిన పోతుకూచి సాంబశివరావు తన 91వ యేట 2017, ఆగష్టు 6వ తేదీన మరణించాడు[7].

మూలాలు

మార్చు
  1. త్రిపురనేని, సుబ్బారావు (మార్చి 1974). రజతాంజలి (1 ed.). హైదరాబాద్: పోతుకూచి సాహిత్య రజతోత్సవ సంఘము. p. 38-42. Archived from the original on 5 March 2016. Retrieved 15 December 2014.
  2. ఎడిటర్ (2011-01-26). "అలుపెరగని సాహితీ తపస్వి". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 15 December 2014.[permanent dead link]
  3. పోతుకూచి, సాంబశివరావు (August 1956). ఇదీ తంతు (1 ed.). సికిందరాబాదు: వాణీగ్రంథమాల. Retrieved 15 December 2014.
  4. ఎస్., విజయభాస్కర్ (2011-01-26). "బహుముఖ ప్రజ్ఞాశాలి పోతుకూచి". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 4 March 2016. Retrieved 15 December 2014.
  5. పోతుకూచి, సాంబశివరావు. "కథలు". కథానిలయం. కథానిలయం. Retrieved 16 December 2014.[permanent dead link]
  6. కొండ్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి (2014-06-11). "సాహిత్య సవ్యసాచి పోతుకూచి" (PDF). నేటి నిజం దినపత్రిక. Retrieved 15 December 2014.[permanent dead link]
  7. సాహితీవేత్త పోతుకూచి కన్నుమూత