ఒగ్గు కథ

తెలంగాణ లోని జానపద కళారూపం
(బొగ్గుగొల్లల ఒగ్గుకథలు నుండి దారిమార్పు చెందింది)

ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం.  ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి  మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే.

ఒగ్గు కథ కళాకారులు
బండారు (పసుపు) తో గంట , పట్న్హం వేసాక ఒగ్గుకలకారులు ఒగ్గుకథ చెప్పుతూ దేవునికి జోల పాడుతారు, తర్వాత ప్రసాదం సమర్పించే సమయానికి దేవునికి మేలుకోలేపే డానికి ఈ గంటని వాడుతారు.
2015, ఆగస్టు 15న హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018, అక్టోబరు 25న తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించబడిన ఒగ్గుకథ-ఒగ్గుడోలు మహోత్సవంలో పాల్గొన్న మామిడి హరికృష్ణ, ఒగ్గు కళాకారులు

రాగ బావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించ వచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రధాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు ఒగ్గు కథలో. ఒగ్గు కథలను చెప్పే కళాకారులను ఒగ్గు గొల్లలు అంటారు.

ప్రేక్షకుడికి విరామం లేకుండా కట్టి పడేసే కళ ఒగ్గు కథ. బోనం ఎత్తుకొని, వేప మండలు పట్టుకుని ఊగుతూ, తూలుతూ ఎల్లమ్మ కథ చెప్తుంటే జనం ఊగిపోతారు. బోనం నెత్తిమీద పెట్టుకొని, ఎంతో సేపు దాన్ని కదలనివ్వ కుండా కింద వేసిన నాణాల్ని నొసటితో అందుకునే దృశ్యం అద్భుతం. జానపద కళారూపాళ్లో 'ఒగ్గు కథ' ప్రముఖమైంది. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం - గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. ఈ కథా ప్రక్రియకు, చదువు అవసరం లేదు. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.

కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. కురుమలకు ప్రత్యేక పూజారులు, కుల వాయిద్యకారులు ఉన్నారు. తెలంగాణలో ఒగ్గువాళ్లు, బీర్లోళ్లు, రాయలసీమలో గొరవయ్యలు అని వీరిని పిలుస్తారు. వైవిధ్యం కలిగిన ఒగ్గుకథ గాన, కళారూపం ఒక్క తెలంగాణాలోనే కనిపించడం విశేషం. కురుమ కుల పురోహిత వర్గానికి చెందినవారు ఒగ్గుకథని చెప్పే వృత్తిని స్వీకరించారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం ఒగ్గు (ఢమరుకం) ఉపయోగించి చెప్పే వృత్తి పురాణం గురించి తెల్సుకోవడం అంటే కురుమ జాతి చరిత్ర, సంస్కృతుల్ గురించి తెలుసుకోవట మన్నమాట. ఒగ్గు దీక్ష ఒకటి ఈ కురుమల్లో కనిపిస్తోంది. ఒగ్గు కథలో తర్ఫీదు పొందాలంటే కులపెద్దల అనుమతితో శైవక్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలువేసి విభూతి ధరించి, నామాలను జపించుకొంటూ మల్లన్న దేవుడినే ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతులు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన ఏడు గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. ఈ ఒగ్గు దీక్ష తర్వాతే వారు బీరన్న, మల్లన్న కథలు చెప్పేందుకి అర్హత సంపాదించు కొన్నట్లు అవుతుంది. కురుమలు బీరోళ్ల దీక్ష తీసుకున్న వాళ్లు బీరోళ్లు. ఈ సంప్రదాయం పూర్వం నుంచే వస్తోంది. కురుమల్లో పౌరోహిత్యం చేసేది ఈ ఒగ్గులే. కొంత మంది ఒగ్గులు దేవుని పెట్టెలో మల్లన్న దేవుని విగ్రహాలు పెట్టు కొని కావడి కట్టుకొని ఊరూరా తిరుగుతారు. వీరు నెత్తి విరబోసుకోని, నుదిటిని పసుపు రాసుకొని, కళ్లకి కాటుక రాసుకొని ఎర్రని పొట్టి చేతుల చొక్కా, మువ్వల లాగు ధరించి కాళ్లకి గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తూ శైవగీతాలు పాడతారు.

పుట్టుక

మార్చు

ఒగ్గు కళారూపం శైవమత వాప్తిలో ప్రచార మాద్యమంగా ఉద్భవించి ఉంటుంది. ఎందుకంటే పాల్కురికి సోమనాధుడు తెలంగాణ ప్రాంతంలో పుట్టి, శైవమత వ్యాప్తికి విశేషమైన కృషి చేసారు. అటువంటి గొప్పవ్యక్తి ప్రభావం ఈ ప్రాంతంలో కళలపై ఉందనడానికి నిదర్శనం ఒగ్గు కథ. ఈ కథల ఇతివృత్తాల్లో శివుడు కథానాయకుడిగా ఉంటాడు. లేదా శివుని అంశతో జన్మించిన వారు నాయకులుగా ఉంటారు. ఉదాహరణకు శివుని తొలి చెమట నుండి బీరప్ప మలి చెమట నుంచి మల్లన్న పుట్టారని, ఎల్లమ్మ శివుని కూతురని ఆయా కథల్లో వివరిస్తుంటారు.

ఒగ్గుకథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కుల పురాణంగా భావిస్తారు. కుర్మలు ఈ కథల్ని ఎక్కువ ప్రచారం చేసారు. తరువాతి కాలంలో ఇతర కులాల వాళ్ళు కూడా ఈ కళారూపాన్ని నేర్చుకొని ప్రచారం చేసారు. ఇటువంటి వారి సంఖ్య చాల తక్కువ. బీరయ్య, మల్లయ్య కథలు మెదటి నుంచి ఉన్నాయి.ఆ తరువాత ఇతర కథలు పుట్టుకొచ్చాయి.

కళారూపం

మార్చు

ఒగ్గు కళారూపం చూస్తుంటే ఒక నాటకం చూసిన అనుభూతి, ఒక నాట్యకళని వీక్షించినంత ఆనందం, ఒక ప్రవచనం విన్నంత సంతృప్తి, ఒక సంగీత కచేరిలో దొరికేంత రసాస్వాదన లభిస్తుంది.అదోక సముద్రం. శ్రోతలు తమకు కావల్సిన ఆనందాన్ని కళ్ళ దోసిళ్ళతో తీసుకపోతారో లేక మనస్సు కుండల్లో పట్టుకెల్తారో వారిష్టం. ఇక ఒగ్గుకథా ప్రదర్శనా తీరుతెన్నుల్ని గమనిస్తే...

ఇటువంటి గాన కళా రూపాలు మన రాష్ట్రంలోనే అనేకం ఉన్నాయి. జముకుల కథ, గొల్ల సుద్దులు, వీర ముష్టి కథ, పిచ్చు కుంటుల కథ, పంబ కథ, మొదలైనవి. ఆంధ్ర దేశంలో వివిధ ప్రదేశాలలో ప్రచారంలో ఉన్నాయి. కథ చెప్పే తీరులోనూ, సహకార వాయిద్యాలలోనూ, స్వీకరించే కథలలోనూ ఈ కళా రూపాలు భిన్నంగా వుంటాయి. కాని సంగీతం అభినయాలను ఆశ్ర యించడం ఏదో ఒక కథను ఆలంబనం చేసుకోవడం, ఈ కళా రూపాల యొక్క సామాన్య లక్షణం. అందుకే ఈ కళా రూపాలనన్నింటినీ కలిపి కథా గాన కళ అని నామకరణం చేయ వచ్చు. అన్నిటిలోనూ ఛందో బద్ధమైన రచనలతో పాటు అనేక రకాలైన పాటలు చోటు చేసుకున్నాయని కొత్త డేశి పతి రావు గారు నాట్య కళ పత్రికలో ఉదహరించారు.

కథను బట్టి కళారూపం పేరు

మార్చు

ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి. సహకార వాయిద్యం ఆధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు పంబ కథ, జముకుల కథ, బుర్ర కథ, ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు జంగం కథ, పిచ్చు కుంటుల కథ, గొల్ల సుద్దులు మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వహాగృతమౌతున్న కళారూపాలు హరి కథ, పాండవుల కథ, రేణుకా కథ మొదలైనవి.

భిన విభిన్న మైన కథా గాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ కరీంనగర్, వరంగల్, నల్లగొండ ,హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో ఉంది. ఈ నాలుగు జిల్లాలలోనూ సుమారు వందలాది బృందాలు కథలు చెపుతూ ఉన్నాయి.

శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని డమరుకాన్ని జగ్గు అంటారు. దీనికి ఒగ్గు అని పేరు కూడ ఉంది. దీనిని వాడుతూ కథ జెప్తరు కాబట్టి కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందని.. ఈ కథలు శైవ మతానికి సంబంధించినవనీ మల్లన్న, బీరయ్య ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ... బీరయ్య, మల్లన్నలు వీరి కుల దైవాలని ... డా.బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలో వివరించారు.

వరంగల్ జిల్లా, జనగాం తాలూకా నెల్లుట్ల గ్రామ వాసి బండి ఈనయ్య, నల్గొండ జిల్లా, రామన్నపేట తాలూకా, ఆత్మకూరు గ్రామ వాసి, చర్ల కొండయ్య, వరంగల్ జిల్లా, జనగాం తాలూకా మాణిక్యపురం గ్రామస్థుడు, చౌదరి పల్లి చుక్కా సత్తయ్య. మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం జనగాం ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య, జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...

వీరిలో చుక్కా సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతి లోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడం లోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యు లున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.

కథావాయిద్యాలు

మార్చు

ఒగ్గుకథలో తప్పకుండ ఉండేది ఒగ్గు. దీన్ని పలుసన్నివేషాల్లో తాళానికి అనుగుణంగా సంఘటనలకి అనుకూలంగా వాయిస్తూంటారు.ఒక్కోసారి ఈ వాయిద్యాన్ని ఆయా పాత్రలుగా ఊహింపజేస్తారు.ఉదాహరణకి చిన్నపిల్లాడిని లాలించే సందర్భం వచ్చినప్పుడు ఒగ్గుని ఆ చిన్నపిల్లాడిలా ఊహింపజేసి ప్రేక్షకులని ఆ సంఘటనలో లీనం చేస్తారు. కథానడకలో ఒగ్గు కొంచెం డోలుకన్న తక్కువ ప్రాధాన్యతని కలిగుంటుంది.జానెడు పొడవుతో మధ్యభాగం ఇత్తడి లేదా చెక్కతో ఉండి ఇరువైపులా మేక చర్మాన్నిబిగించి ఈ ఒగ్గుని తయారుచేసుకుంటారు.

అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది, ముఖ్యమైనది డోలు. డోలు మోతతోనే కథా ప్రారంభమవుతుంది. సుమారు ఒక మీటరు పొడవుండీ డ్రమ్ము ఆకారంలో ఇత్తడితో కాని చెక్కతో కాని నిర్మాణమై ఇరువైపులా మేక చర్మాన్ని అమర్చి తాళ్ళతో బిగిస్తారు.గంభీరమైన ధ్వని చేస్తూ ప్రతి సన్నివేషంలో తప్పక మోగే వాయిద్యం డోలు. గోల్ల కుర్మల పెళ్ళిలో జరిగే మైలపోలు, ఎదురుకోలు, ఊరేగింపు సందర్భాల్లో డోలు తప్పకుండా ఉంటుంది.కథాగమనంలో కొన్ని సన్నివేషల్లో ఉద్రేకం కలిగించడానికి డోలుని మెళ్ళో వేసుకుని నృత్యం చేస్తారు, పళ్ళతో బిగించి పట్టుకుని తాండవం చేస్తారు, గ్రుండంగా ఆవేషంతో తిరుగుతారు. వీపుకు తగిలించుకుని విన్యాసంగా వాయిస్తారు.ఇలా చిత్రవిచిత్ర చేష్టలతో జనాలకి విసుగు రాకుండా, రాత్రుల్లు నిద్రపోకుండా ఆసక్తిగా కథని నడిపిస్తారు.

తాళాలు

మార్చు

అరచేతికి రెండింతలు పెద్దగా ఉండి ప్రతీరాగానికి లయని అందింస్తూ శ్రావ్యంగా మోగే వాయిద్యమే ఒగ్గులో ఉపయోగించే తాళాలు.వీటికి తోడుగా చిన్నతాళాలని కూడా ఉపయోగిస్తారు.మెండు తాళం, దుయ్యర, మెండుదుయ్యర, ఆదితాళం, మెండు బైరవి, వలపోత బీగడ వంటి వివిధ రకాల తాళగతులను ఉపయోగిస్తారు.

నపీర ఇత్తడి లోహంతో తయారవుతుంది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఒక చివర సన్నగా ఉండి మరోవైపు కొంచెం వెడల్పుగా ఉంటుంది . నోటితో గట్టిగా ఊదితే భీకరమైన ధ్వని వినిపిస్తుంది. ఇంకా కాళ్ళకు గజ్జెలు, భుజంపై రుమాలు, చేతిలో చిన్న కర్రని కథానడకకి ఉపయోగించుకుంటారు.

కథా నడక

మార్చు

ఇతివృత్తం దగ్గర నుంచి కథనం వరకు ప్రత్యేకమైన శైలిలో నిర్మాణం పొందిన ప్రక్రియ ఒగ్గుకథ. జీవిత చరిత్రల్ని ఇతిహాసాలుగా మలిచే పద్ధతి ఒగ్గు కథని చూసి నేర్చుకోవచ్చు. గొల్ల కుర్మల కులదైవాలు దైవాంశ సంబూతులైనా మానవ మాత్రులుగా జీవించిన తీరు వారికి కుల వృత్తిపైన ఉండే అభిమానం కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.ఈ కథలు విన్న ఏ మనిషైన ఈ కులాల్ని గౌరవభావంతో చూస్తారు. కథని ఉపన్యాస ధోరణిలో లేక నాటక రూపంలోనో లేక సంగీత రూపకంలోనో లేదా పద్యాల రూపంలోనో చెప్పటం ఆయా కళారూపాల స్వభావం. ఇవన్ని విభాగాలను తనలో పలికించడం ఒగ్గుకథ ప్రత్యేకత. ఒక ప్రధాన కథకుడు ఒక సహాయకుడు ముగ్గురు వంతగాళ్ళు ఉంటే చాలు ఒగ్గు కథ అలవోకగా సాగిపోతుంది. ఒగ్గు కళాకారులకి ముఖ్యంగా నాలుగు విషయాలపైన పట్టుంటుంది. వీరు ప్రదర్శించే ఈ అంశాల్లోని నైపుణ్యమే ఒగ్గుకథని జానపదుల హృదయస్పందనల్లో ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో నిలబెట్టింది.

సంగీతం, ఉచ్చారణలో నైపుణ్యం

మార్చు

‘పువ్వుకి పరిమళం, కళాకారుడికి కంఠం’ ఉండాలి. మంచి పరిమళం లేని పువ్వుకి విలువలేదు. మంచి గొంతులేని కళాకారునికి భవిష్యత్తులేదు. ఒగ్గుకథా నిర్వహణలో శబ్దం పాత్ర కీలకమైంది. సంభాషణలు, ధన్యనుకరణలు, రాగాలు అన్నీ శబ్దంపైనే ఆదారపడి ప్రవర్తిల్లుతాయి. సంభాషణలు స్త్రీ, పురుష పాత్రలకి అనుగుణంగా మలుచుకుంటారు. కొన్ని స్త్రీ పాత్రలు ఏడ్చే సందర్భంలో కళాకారులు కూడా ఏడుస్తారు, శ్రోతల్నీ ఏడిపిస్తారు. కొన్ని కొన్ని చోట్ల ధ్వన్యాను కరణ చేస్తుంటారు. గొర్రెలాగా అరవటం, గొర్ల కాపర్లు చేసే విచిత్రమైన ధ్వనిని అనుకరిస్తూ శ్రోతల్ని నవ్విస్తూ ఉంటారు. ఇక దేశీసంగీత ఆలాపనలో ఒగ్గుకళాకారులు దిట్టలు . దాదాపు అన్ని జానపద సంగీత బాణీలు ఒగ్గుకథలో ఉన్నాయి. జోలపాటలు, సువ్వి పాటలు, మంగళహారతి పాటలు, బతుకమ్మ పాటలు, శృంగార పాటలు వంటివి ఒగ్గు కథల్లో వినిపిస్తుంటాయి. వీటితో పాటు కథని నడిపించడానికి ఆ...ఆ.... అని వంతకారుల గొంతు ఊతమిస్తుంది. ‘రామరామ రామన్నరామ రాఘవా రామన్నరామ’ అనే వాక్యాన్ని కూడా కథానడకకి ఉపయోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒగ్గుకళాకారులు గొంతుతో అభినయిస్తారు. మనలోని ఊహల ప్రపంచానికి రెక్కలు తొడుగుతారు, కల్పనా చాతుర్యాన్ని పరిగెట్టిస్తారు.

ఆశు రచనా

మార్చు

ఒగ్గు కళాకారులు ఆశురచనా నైపుణ్యం కూడా కలిగి ఉంటారు.యతి, ప్రాసలు తప్పకుండా మాత్రాచందస్సులో కథాసందర్భానికి తగిన విధంగా పాటలు అల్లుతారు.మూలకథకి ఏమాత్రం భంగం కలగకుండా వీటిని జొప్పిస్తారు.అప్పుడప్పుడు హాస్యపు సంఘటనల్ని కూడా శ్రోతల్లో ఉత్సాహం కలిగించడం కోసం సృష్టిస్తుంటారు.

మానసిక పరిపక్వత

మార్చు

ఇది అన్నిటికన్నా ప్రధానమైనది. ఒగ్గు కళాకారుల్లో విస్తృతంగా ఉంటుంది. ప్రేక్షకుల మనసు తెలుసుకుని వారికి నచ్చే విధంగా కథని చెప్తారు. ఎక్కడ ప్రేక్షకుడు ఏడుస్తాడు, ఎక్కడ నవ్వుతాడు, ఎక్కడ భక్తి భావంతో ఉంటాడో తెలుసుకొని కథను నడిపిస్తాడు. కథచెబుతూ వెంటనే పాత్రదారునిగా మారటం అందులో పూర్తిగా లీనమై వెనువెంటనే కథకుడిగా మారటం సంయమనం ఉన్న కళాకారుడు తప్ప ఇతరులకి అసాధ్యం.ఒగ్గుకళాకారుడు ఇవన్నీ కలిగుంటాడు.

ప్రార్థనాగీతం

మార్చు

ప్రార్థనాగీతంలో మొదట గంగని తలవటం ప్రత్యేకమైన అంశం. దేశీయత ఉట్టిపడేటట్టుగా గంగ గొప్పతనాన్ని చెప్పడం, జనాల్ని మంత్ర ముగ్దుల్ని చేసేరాగాలాపన, విస్మయం కలిగించే ఆహార్యం, పొడుపు కథలు, జాతియాలు, సామెతలు, ఇతర అన్యదేశ్యాలు కథలో సహజంగా ప్రవర్తిల్లుతాయి. సీన్ కి తగిన స్టేజ్ ఉండకపోయినా, పాత్రకి తగిన వేషదారణ కనబడకపోయినా ప్రేక్షకులు తమ హృదయసభల్లో ఆ లోటుని భర్తీ చేసుకుంటారు. మిద్దెరాములు, చుక్కసత్తయ్య, పూడూరు మల్లయ్య మొదలైన ఒగ్గు కళాకారులు ప్రపంచపు జానపద కళాయవనికపై ఒగ్గుకథా రూపాన్ని స్థిరంగా నిలిపారు.

ఆహార్యం

మార్చు

ఒగ్గుకథ నాటక ప్రక్రియ కాదు. అయిన నాటక సన్నివేషాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ వేషదారనే కాని పాత్రోచిత వేషదారణ ఉండదు. కూచిపూడి కళాకారులకి ఉండేంత అభినయ నైపుణ్యం ఒగ్గుకళాకారులకీ ఉంటుంది. కథకులు కథని చెబుతూ వెంటనే తమను తాము పాత్రలుగా మలుచుకుంటారు. గాంభీర్యప్రదర్శనలో, లాలిత్య పోషణలో, రసాబాస కలిగించటంలో ఇతర నాటక కళాకారులకి ఏమాత్రం తక్కువ కాకుండా నటిస్తారు. ముఖకవలికలు కదపటంలో. చేతుల్తో నాటక ముద్రల్ని ప్రదర్శించటంలో, ఒంటితో సాత్వికతని ప్రదర్శించండంలో విశేషమైన ప్రజ్ఞని ప్రదర్శిస్తారు.

కత్తి సాములూ, కఱ్ఱ సాములూ....

మార్చు

పూర్వం ఏ గ్రామంలో చూసినా వ్వాయామ శాలలకు సంబంధించిన తాలింఖాలు వుండేవి. ముఖ్యంగా వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత తీరుబడిగా వున్న సమయంలో గ్రామంలో వుండే యువకులందరూ పైన సూచించిన తాలింఖానాలలో చేరు కర్ర సాము, కత్తి సాము, గరిడీలను చేసే వారు. వారు ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసం ఈ విద్యను నేర్చుకునే వారు. ఒకప్పుడు రాజాధి రాజులు తమ దేశ రక్షణకోసమూ, ఆత్మ రక్షణ కోసమూ నైనికులకు శిక్షణ ఇచ్చేవారు. పాలకులు కూడా ఈ విద్యలో ఆరి తేరిన వారై యుండేవారు.

మారిని పరిస్థితులు

మార్చు

రాజులు, సామత రాజులూ పోయిన తరువాత ఆంగ్లేయులు భారత దేశాన్ని హస్త గతం చేసుకున్న తరువాత అత్యాధునిక మారణాయుధాలు వచ్చిన తరువాత కత్తిసాము, కర్రసాము ప్రాముఖ్యం తగ్గి పోయిన తరువాత వీటి మీద ప్రజలకు ఆసక్తి తగ్గి పోయిందని డా: బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాల సంచికలో ఉదహరించారు. ఆనాడు ఈ విద్యకు అధిక ప్రాముఖ్య మిచ్చేవారు. ఈ విన్యాసాలలో పోటీలు ఏర్పరచేవారు. ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ ప్రదర్శనాలను ప్రదర్శించేవారు.ఆంగ్లేయుల కాలంలో కూడా సంస్థానాల లోనూ, జమీందారీల లోనూ ఈ విద్యను పోషించే వారు. విజయనగర సామ్రాజ్యం లోని సంస్థాన సామంత రాజులు కత్తి సాము కర్ర సాములను ఔత్సాహిక ప్రదర్శనలుగా నిర్వహించే వారట. ఎంతో సాహస వంతంగా ప్రాముఖ్య వహించిన ఈ కర్ర సాము, కత్తి సాము విద్యలు వినోదాత్మక ప్రదర్శనలుగా విరాజిల్లాయి. ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేక పోయి నప్పటికి ఈ ప్రదర్శనాలు ఒక ప్రక్రియగా, ఒక కళగా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనాలు వెనుకటి రోజుల్లో కత్తి సాములో రక్షణ కొరకు కృపాణాలనూ, కవచాలనూ ధరించి సైనికుల్లాగాఏ పోరాటం జరిపే వారు. అయితే ఈ నాడు మామూలు వస్త్ర ధారణ తోనే ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా కర్ర సాములో ఒక కర్ర తోనూ రెండు చేతులతో రెండు కర్రల తోనూ ఒకరి కొకరు పోటీ పడి, ఒకరు కొట్టిన దెబ్బను మరొకరు కాచు కుంటూ ప్రేక్షకులకు భయం కలిగే విధంగా ఉధృతంగా కర్ర సాము చేసేవారు. అదే విధంగా కత్తి, డాలును ధరించి కూడా అలాగే పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో ఎత్తుకు పై ఎత్తులు, దెబ్బ కొట్టడం, దెబ్బ కాచు కోవడం ఒకరి కొకరు తల పడి ఉధృతంగా పోరాటం జరిపే వారు. ఈ పోరాటంలో కొందరు డప్పు వాయిద్యంతో పోరాట కారుల్ని ఉద్రేక పర్చే వారు. ప్రేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షాలుగా విడిపోయి ఇరువుర్నీఉద్రేక పర్చే వారు. ప్రేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షాలుగా విడిపోయి ఇరువుర్నీ ఉత్సాహ పర్చే వారు.

టాసా వాయిద్యం

మార్చు

కర్ర సాము, కత్తి సాము జరిపేవారు అడుగులనూ, భంగిమలనూ చాల అట్ట హాసంగా చూపించే వారు. అడుగులకు అనుగుణంగా టాసా అనే వాయిద్యాన్నివాయించేవారు. తొలి చెమట, మలి చెమట ......... శివుని తొలి చెమట బీరప్పగానూ, మలి చెమట మల్లన్న గానూ పుట్టి నట్లు కురుమల కథలు చెపుతున్నాయి. బీరప్పను కురుమల గులగురువుగా భావిస్తారు. మల్లన్న సాక్షాత్తు జన్మ నిచ్చిన వాడు. కురుమలకు మరొక కథనం ప్రకారం, ఆది రెడ్డి నీలమ్మల సప్తమ సంతానం, అతను పద్మాక్షి, రత్నాక్షి అనే ఇద్దరిని పెండ్లాడ తాడు.అనగనగ ఒక పేదరాసి పెద్దమ్మ ఉందట.

బీరప్ప కథ, చుక్కయ్య కథనం

మార్చు

ముఖ్యంగా మేము చెప్పే కథలు వీర భద్రుని గూర్చి. దీనినే వీరప్ప కథ అని పిలుస్తాం అంటాడాయన. వారి కుల దైవం అయనే గనక అతని పేరు మీద వచ్చే పండగలకు బీరప్ప ఒగ్గు కథలను చెపుతారు. అలాగే మల్లన్న కథలను కూడా చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో వీరప్ప దేవుడు, మల్లన్న దేవుడు గుళ్ళు వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు కుర్మ వారే ఒగ్గు కథలు చెపుతారు. ఇది పారం పర్యంగా వస్తున్న సంప్రదాయం. బీర్ఫప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్ర గురించి ఒగ్గు కథా రూపంలో చెపుతారు. ఒక్క కురుమలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడా ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథ యొక్క విశిష్టత అంతటిది. ఆ కళా రూపం యొక్క గొప్పతనమది.

ఒగ్గు కథకు ఈ పేరెలా వచ్చింది?

మార్చు

వీర భద్రుడూ, మల్లి ఖార్జునుడు వీరి చేతుల్లో వుండే వాయిద్యం డమరుకం ( అంటే జగ్గు) ధరించేవారు. చుక్కా సత్తయ్య గారి పెద్దలు, రెండు వందల సంవత్స రాల క్రితం మల్లిఖార్జునుడు ఇచ్చినటు వంటి గొర్రెలను కాచు కుంటూ ఈ జగ్గు పైనే, అడవులలో చెట్ల క్రింద ఒగ్గు కథలు చెప్పే వారట. రాను రాను ఈ జగ్గుతో చెప్పే బగ్గు కథ ఒగ్గు కథగా రూపాంతరం చెందింది.

తాతలు చెప్పిన కథలు

మార్చు

ఈ ఒగ్గు కథలు ఈ నాటి కళాకారులు వ్రాసిన కథలు కావు. వీరి తండ్రులు చెప్పిన కథలు వీరు చెపుతున్నారు. వీరి తండ్రులకు తాతలకు వీరి తాతలు చెప్పిన కథలివి. ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే వారి వృత్తి గొఱ్ఱెలను కాయడం. నిపుణూలైన వారు ఒగ్గు కథలు చెప్పడం, ముఖ్యంగా వీరు కథను ప్రారంభించే ముందు డోలును వాయిస్తూ, వీరణంతో శబ్దం చేస్తూ డమరుకంతో దడ దడ లాడిస్తూ గంగా దేవిని ప్రప్రథమంగా ప్రార్థిస్తారు.

కథా బృందం

మార్చు

ఈ ఒగ్గు కథలు చెప్పే వారు అయిదు నుంచి పది మంది వరకూ వుంటారు. అయితే ఇంత మంది వుండాలనే నిబంధనా లేదు. వారి వారి సౌలభ్యాన్ని బట్టి బృందాలను ఏర్పాటు చేసు కోవచ్చు. ముఖ్యంగా కథకు కనీసం అయిగురు సభ్యులైనా వుండాలి. ఈ అయిదుగురిలో ఒకరు ప్రధాన కథకుడు. మరొకరు సయాయకుడు. వీరిద్దరూ ముందు భాగంలో వుంటారు. వారి వెనుక భాగంలో ముగ్గురు నిలబడతారు. వారిలో ఒకరు డోలు, మరొకరు తాళం, ఇంకొకరు కంజిరా ధరిస్తారు. వీరందరూ ఒక వంక వాయిద్యాన్ని సాగిస్తూ వంత గానాన్ని కూడా అందు కుంటారు. ప్రధాన కథకుడు సందర్భాన్ని బట్టి ఆయా పాత్రలు ధరిస్తూ కథా గానం చేస్తూ వుంటాడు. వంత దారుడు కూడా పాత్ర ధారణలో సందర్భాని బట్టి సహకరిస్తూ వుంటాడు. వీరిరువురూ పాత్రాను గుణ్యంగా కొంత కొంత ఆహారాన్ని మారుస్తూ వుంటారు. అయితే ఈ ఆహారం మార్పుల్లో కథ ఏమాత్రం కుంటు పడదు.

స్త్రీ వేషం

మార్చు

ప్రధాన కథకుడే చీర కట్టి, కొప్పు పెట్టి, ముత్తైదువుగా స్త్రీ పాత్రను ధరిస్తాడు. ఇప్పటివరకూ ఈ కథ తెలంగాణా హద్దులు దాట లేదు. కథనంలో ముఖ కథకుడు మైల పోలూ, తెల్ల పాలు తీసినపుడు నాగవల్లి, వీర బోనం సమయాల్లోనూ డోలు వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సన్ని వేశాల్లో ఎన్నో డోళ్ళ తోళ్ళ నుపయోగిస్తారు. ఉధృత యాయిద్యపు వరుసలతో పాటూ రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడమే కాక డోలుకు కఠిన తాళ్ళను పళ్ళతో కరిచి పట్టి నృత్యం చేస్తూ వాయిస్తారు. కూర్చొని డోలును వీపునకు ఆనించి చేతులను వెనకకు త్రిప్పి, డోలును వాయిస్తూ నియాసాలు చేస్తారు. ఈ డోళ్ళు ధిళ్ళెం, భళ్ళెం..... ధిళ్ళెం.... భళ్ళెం అని ధ్వని నిస్తాయి. ఈ విన్యాసాలకు తోడు కళాకారుల నైపుణ్యానికి తగినట్లు మరి కొన్నీంటిని జోడించి డోలు నృత్యంగా తయారు చేశారు. ఇలాంటి ఒగ్గు డోలు నృత్య బృందాలు, తొలి మహిళా ఒగ్గు కళాకారిణి జమ్మ మల్లారి గారు, పెద్దాపురం, జట్టు, మల్లెల బీరప్ప జట్టు, సుక్కా సత్తెయ్య జట్టు, బర్మ బీరయ్య జట్టు మొదలైనవి ప్రఖ్యాతి వహించాయి. ఇలా ఒగ్గు కథా బృందాలు దినదిన ప్రవర్దమానం అవుతున్నాయి.

కథా ప్రారంభం.

మార్చు
 
హర్యానాలో జరిగిన ప్రతిష్టాత్మక సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన

ఒగ్గుకథ ఉజ్జయిని మహంకాళీ స్తుతితో ప్రారం భిస్తారు. అనంతరం గణపతి ప్రారథన, శారద ప్రార్థన చేసి కథకుడు వ్రేలి అందెలు పట్టు కుంటాడు. వంత గాడు గొంగడి మీద వేసుకుని కర్ర చేత బట్టుకుని గొర్రెల కాపరి లా వుంటాడు. తాళం వేసే వ్వక్తి అవసరమైనప్పుడు కంజరి వాయిస్తూ వుంటాడు. ఇటీవల కొంత మంది ఒగ్గు కథలుగా హరిశ్చంద్ర, పార్వతి పరీక్ష, శివ తాండవ మహారాజు, నలపతి మహారాజు, దుర్గ పతి మహారాజు, సారంగధర, రత్న మాణిక్యం, సూర్య చంద్రుల కథ, నాగరాజు కథ మొదలైన జానపద, పౌరాణిక, కాల్పనిక కథలు కూడా చెపుతున్నారు.

నేటి ఒగ్గు కథకులు

మార్చు

ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు కరీంనగర్, వరంగల్, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న వందకు పైగా బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుశ ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, భువనగిరి తాలూకా, నల్లగొండ జిల్లా. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడ ప్రాంతములు అత్యదిక ఒగ్గు కథ కళా బృందములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తీగల రాజేశం - నూకలమర్రి (కీ. శే. శ్రీ మిద్దె రాములు గారి ప్రియ శిష్యుడు),మారుపాక శంకర్ (కనగర్తి), గాదర్ల బుగ్గయ్య - అచ్చనపల్లి, బర్మ బీరయ్య, బర్మ తిరుపతి - నిజామాబాద్ ఇలా వందల బృందాలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో తొలి ఒగ్గు కళాకారిణి జమ్మ మల్లారి కురుమ ఈ అమ్మగారు తొలి ఒగ్గు కళాకారిణి ఈమె గత 70 సంవత్సరాలు గా కథ చెప్తూ ఉంది ఉత్తమ మహిళ అవార్డు కూడా అందుకుంది

మిద్దె రాములు గౌడ కులస్తుడై నప్పటికీ ఒగ్గుకథ పట్టుపట్టి మరీ నేర్చుకుని అందులో ప్రసిద్ధుడయ్యాడు.<ref>http://www.ourtelangana.com/node/1733</r[permanent dead link]

ప్రపంచ జానపద కళల దినోత్సవం , World Village Arts Day

మార్చు

ప్రపంచ జానపద కళల దినోత్సవం -- ప్రతిసంవత్సరము ఆగస్టు 22 న జరుపుకొంటారు .

తెలంగాణ వికాసంలో జానపద కళలు భావమయ్యాయి . ఇవి జనజీవన సంస్కృతికి ప్రతిబింబాలు . జీవన సమరంలో సుఖదు:ఖాలను బాణీలుగా చేసుకొని వెలసిన జానపదాలు .... విజ్ఞాన, వినోదాలను పంచేవిగా ఉన్నాయి . జానపదం అంటే పల్లె, పల్లె జనాలు పాడుకునే పాటలు, ఆటలు, నృత్యాలు, సామెతలు ఈ కోవకిందకు వస్తాయి . ఉత్తరాంద్రకే వన్నె తెచ్చిన " తప్పెటగుళ్ళ ", శ్రీకాకుళం గిరిజన రైతాంగ పొరారటంలో సరికొత్త రుపాన్ని సంతరించుకొన్న " జముకు" కళారూపము జానపదకళల ప్రాశస్త్యానికి మచ్చుతునకులు .

మన ప్రాచీన సాంస్కకళలు : కళలు 64 రకాలుగా విభజించారు.వీటిలో ప్రధానమైనవి సంగీతం, నాట్యం, నాటకం, కవిత్వం.

1. ఇతిహాసము 2. ఆగమము 3. కావ్యం 4.అలంకారం 5.నాటకం 6.గాయకత్వం 7.కవిత్వం 8. కామశాస్త్రం 9. దురోదరం జ్ఞానం 10.దేశభాషలిపి 11.లిపికర్మం 12.వాచకం 13.అవధానం, 14.సర్వశాస్త్రం 15.శాకునం 16.సాముద్రికం 17.రత్నశాస్త్రం 18.రథాశ్యాగజ కౌశలం 19.మల్ల శాస్త్రం, 20.సూదకర్మం 21.దహదం 22. గంధవాదం 23. ధాతువాదం 24. ఖనివాదం 25. రసవాదం, 26. జలవాదం 27. అగ్ని స్తంభం 28. ఖడ్గ స్తంభం 29. జలస్తంభం 30.వాక్ స్తంభం 31. వయ స్తంభం, 32. వశ్యం 33. ఆకర్షణం 34. మోహనం 35. విద్వేషం 36. ఉచ్చాటనం 37.మారణం, 38. కాలవంచనం39. పరకాయప్రవేశం 40. పాదుకాసిద్ధి 41. ఐంద్రిజీవితం 42. అంజనం 43.దృష్టి చనం, 44.సర్వ వంచనం 45. మణి మంత్రేషధాదిక సిద్ధి 46. చోరకర్మం 47. చిత్రక్రియ 48. లోహక్రియ, 49. అశ్వక్రియ 50.మృత్ర్కియ 51. దారుక్రియ 52. వేణుక్రియ 53. చర్మక్రియ 54. అంబరక్రియ, 55. అదృశ్యకరణం 56. దూతీకరణం57. వాణిజ్యం 58. పాశు పాలనం 59. కృషి 60. అసవకర్మం, 61. ప్రాణిదూతృత కౌశలం 62. వాక్సిద్ది 63. చిత్రలేఖనం 64. సంగీతం .

జానపద కళలు : భారత గ్రామీణ ప్రాంతంలో ఇవి ఎక్కువ ప్రాచుర్యం కలిగిఉన్నాయి .

ఉరుము నృత్యము, ఒగ్గు కథ, కోలాటం, గొరవయ్యలు, జ్యోతినృత్యం, తెలుగునాట చోది చెప్పడం, తెలుగునాట జానపద ఉడుపు పాటలు, తోలుబొమ్మలాట, పగటి వేషాలు, బుట్టబొమ్మలు, బుర్రకథ, యక్షగానం, రికార్డింగ్ డాన్స్, హరికథ-హరిదాసు, డప్పు, తప్పెట గుళ్ళు, జముక గిరిజ నృత్యము, లంబాడీ, బోనాలు, ధింసా, కోలాటం, జ్యోతి నృత్యం, ఉరుము నృత్యం, కత్తిసాము, కర్రసాము, కొమ్ము కథ, కొమ్ముల నృత్యం లేదా రేలా నృత్యం, గరగలు, గరిడి, గాన కళారూపం ఒగ్గు కథ, గురవయ్యలు, గొండ్లి నాట్యం, గొల్ల సుద్దులు, చెక్కభజన, యక్షగానం, చిందు యక్షగానం, చెంచు భాగవతం, చెక్కబొమ్మలాట, జడకోలాటం (కులుకుభజన), జిక్కికి, డప్పులు, తంబుర (కడ్డీ తంత్రి), పగటి వేషాలు, పల్లెసుద్దులు, పులివేషాలు, పొంబల వాయిద్యం, మరగాళ్ళు, రాయలసీమ కొరవయ్యల నృత్యం, లవకుశల, వగ్గుడోళ్ల విన్యాసం, వీధి బాగోతం, వీరనాట్యం, వీరభద్ర విన్యాసం, శ్రీ కాళీమాత నృత్యం, కోయ నృత్యము ., బుడబుక్కల పాట, గంగిరెద్దులు వారు, బుట్ట పాములు ఆటవారు, చెంచు వారి పాటలు, జంగాల వారి పిట్టకథలు,

మానవుడి మనోవికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలు ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి.

కళలను నమ్ముకుని జీవనం సాగించిన కళాకారులకు నేడు ఆదరణ కరవవ్వడంతో కళలను నమ్ముకోలేక, నమ్ముకున్న కళలు కూడు పెట్టక దుర్భర జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నాటి కళలను, కళాకారులను రక్షించుదామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆదుకునేందుకు చర్యలు మాత్రం తప్పడం లేదు. విదేశీ సంస్కృతిని, వారి అలవాట్లను పుణికిపుచ్చుకుంటున్న నేటి తరం నాటి జ్ఞాపకాలను, కళలను పట్టించుకునే అవకాశం లేకుండా పోతోంది. గ్రామాల్లో జానపద కళాకారులు వివిధ రకాలైన ప్రదర్శనలు ఇచ్చేవారు. వీరు నాటి రాజుల చరిత్రను, భాగవతం, రామాయణం, హరికథలతో పాటు, పద్యాల రూపంలో అందులో విషయాలను వివరించేవారు. రామాయణ, మహా భారతం, భాగవతంలోని సారాంశాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలు ఇచ్చే తృనమో, పణమో తీసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. బుడగ జంగాలు, గంగిరెద్దులవాళ్లు, చెంచులు సగం రాత్రివాళ్లు, జంగాలు, పాముల వాళ్లు, హరికథా దాసులు, ఎర్రగోళ్లు వారు ఇలా చెప్పుకుంటూ చాలా మంది జానపద పాటలను, వేదాల్లోని సారాంశాన్ని పాటల ద్వారా పలికిస్తూ జీవనం సాగించేవారు.

కాలాన్నిబట్టి కళలు

గంగిరెద్దులు వాళ్లు సంక్రాంతి వచ్చిందంటే గ్రామాల్లో ఎద్దులను ఇంటింటికి తిప్పుతూ, పాటలతో సారాంశాన్ని చెబుతూ భిక్షాటన చేసేవారు. హరికథా దాసులు కూడా అంతే. సగం రాత్రి వాళ్లు కూడా వేకువ జామున గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేసేవారు.

జానపద, సాంస్కృతిక కళలు, కళా రూపాలు మానవ శ్రమ నుండి పుట్టి పురుడు పోసుకొన్నవే. మానవ వికాసానికి, శ్రమ నుంచి సేద తీరడానికి కళలను శ్రమజీవులే సృష్టించుకున్నారు. ప్రకృతిలో విహరిస్తూ పాటలు అల్లిన కష్టజీవులు, చెట్టునుండి పుట్టవరకు అన్నింటిని తమ జానపదంలో శిల్పంగా తీర్చిదిద్దారు.ఇదే సమయంలో అనేక ప్రాంతాలకు బతుకు తెరువు కోసం సంచరించిన సంచార జాతులు అనేక ప్రాంతల సంస్కృతులను, సంప్రదాయాలను పాటలుగా అల్లి సమాజానికి జ్ఞానాన్ని అందించారు.

ఇదే కోవలో వృత్తి కులాల వారైన గొర్రెల కాపర్లు, గొల్ల కుర్మలు అడవిలో సంచరిస్తూ ప్రకృతిని వర్ణిస్తూ ‘ఒగ్గు కత’ను సృష్టించారు. సుక్క సత్తయ్య మిద్దె రాములు వంటి కళాకారులు ఒగ్గుకథను ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి కీర్తిప్రతిష్ఠలు అందించారు. ఒగ్గు కథలను పుస్తక రూపంలో మారిస్తే వేల పేజీల పుస్తకాలుగా ముద్రించవచ్చు. ఇందులో ఎన్నో పదాలు, ఎన్నో పదప్ర యోగాలు, కమనీయమై న ప్రజల వాడుక భాష, తమ దేవతల గొప్పత నం, తమ పూర్వీకుల త్యాగాలు, వీర గాథలు కళ్లకు కట్టినట్లు నాట్య మాడుతాయి.

ఇదే కోవలో చిందు భాగవతం తెలంగాణలో ఎంతో ప్రాధాన్యత సంతరిం చుకుంది. చిందు ఎల్లమ్మవంటి వారు ప్రపంచ వేదికలపై తమ కళను ప్రదర్శించారు. దేశీయ కవి అంబాల మల్లగౌడ్‌ తెలంగాణ ప్రాంతం నుండి జానపద కళలను వెలికి తీయడానికి ఎంతో ప్రయత్నించి డోలు విన్యాసం, డప్పుల నృత్యం, భాగవతం, కోలాటం వంటి కళలను ప్రపంచ కళావేదికలపై పరిచయం చేశారు. అదే విధంగా ఎన్నో భాగవత రచనలు చేసి ఇక్కడి దేశీయ సంస్కృతిని ప్రతిబింబిచారు. శ్రమైక జీవనం నుంచి ఆవిష్కరించిన ఈ కళలు అనేక రూపాలుగా విలసిల్లి వర్థిల్లాయి. సంస్కృతి సత్సంప్రదాయా లను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ దేశ విదేశాల్లో గుర్తింపు పొందాయి.

అదే సందర్భంలో ఈ సాంస్కృతిక కళలనే వృత్తిగా జీవనం చేసు కొని బతుకుతున్నవారు అనేకమంది. జానపద కళారూపాలను వారే సజీవంగా కాపాడుతున్నారు. అంతే కాకుండా సమాజంలో నడిచే జీవన విధానాన్ని, పూర్వీకుల చరిత్రను, కుల పురాణాలను చెబుతూ ఒక సూత్రబద్ధమైన జీవన విధానానికి అలవాటు పడే విధంగా వీరి కళలు తోడ్పడ్డాయి. మానవుడి మనోవికాసానికి, వినోదానికి, మంచి నడవడికి జానపద కళారూపాలు ఆలంబనగా నిలిచాయి. సినిమాలు, టి.వి.లు లేని ఆ రోజుల్లో ఈ వృత్తి కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అలిసిపోయిన పల్లె ప్రజలకు వీరి ప్రదర్శనలు సేదతీర్చేవి.

చిందు, యక్షగానం, గౌడ శెట్టిల గౌడపురాణం, ఎనూటి వారి పటం కథ లు, మంద హెచ్చు కథలు, కొమ్ములవారి కథలు, పొడప్రొతుల కథలు, ఝం జ కథలు, విప్రవినోదులు, బైకాని కథలు, సాధనా శూరులు, పిచ్చకుం ట్లవారు, కాకి పడిగల పంట కత, గుర్రం పటం కథ, మాచయ్య పటం కథలు, గంచీ కూటిపటం కథలు, కొర్రొజులోటి కథలు, ఆడేంఎల్లయ్య కథ లు, పూజారి పటం కథలు, డోలి, పట్టి కథలు ప్రధానమైనవి. ఇవేకాకుండా వృత్తికళాకారులు ప్రదర్శించే కళారూపాలు- కొన్ని బైండ్ల కథలు, రాజన్నల వారు, హరిదాసులు, బుడబుడకలవారు, కాటిపాపలు, చెక్కబొమ్మలాట, గంగిరెద్దులాట, పగటివేషాలు, పాములాట, తోలుబొమ్మలాట, నాటకాలు, భాగవతం, వీధినాటకం, యక్షగానం, బుర్రకథ, చిరుతల రామాయణం, చెక్కభజన కర్రసాధన, డోళ్ళ విన్యాసం, తప్పెటగుళ్ళు ఆట . ఇవన్నీ మన సంస్కృతికి కళల ప్రతిరూపాలు.

వీటిని ప్రోత్సహిం చేది కూడా ప్రధానంగా గ్రామాల్లో రైతాంగం, చేతి వృత్తి దారులు, గిరిజనులు, హరిజనులే. నేడు వ్యవ సాయ సంక్షోభంవల్ల, ప్రపంచ పరిణామాల ప్రభా వం వల్ల చేతివృత్తులు దెబ్బతిన్నాయి. కరవు కాటకాలు మన జానపద రూపా లను క్షీణదశకు తీసుకువచ్చాయి. ప్రధానంగా గ్రామీణ ప్రజానీకంపై ఆధారపడ్డ సాంస్కృతిక వృత్తులు నేడు అంతరించి పోతున్నాయి.ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా మన జానపద సాంస్కృతిక వృత్తులను కాపాడడంలో సవతి తల్లి ప్రేమనే చూపుతోంది.అయినా గ్రామాల్లో ఈ వృత్తి కళాకారులు కూలి, నాలి చేసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. ఊపిరి ఉన్నంతకాలం జానపద కళారూపాలను కాపాడుకుంటాం. ముందు తరాలకు మా వృత్తి కళలను అందిస్తాం అంటూ ఈ వృత్తి కళాకారులు ఇప్పటికీ ధీమాగా ఉన్నారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

https://www.ntnews.com/EditPage/article.aspx?category=4&subCategory=1&ContentId=454946

  • తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.అనే గ్రంథం
"https://te.wikipedia.org/w/index.php?title=ఒగ్గు_కథ&oldid=4353559" నుండి వెలికితీశారు