మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ

మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (MCF) అనేది కర్ణాటక లోని హసన్ నగరంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఏర్పాటు చేసిన సదుపాయం. 1982లో స్థాపించిన ఈ సదుపాయం ఇస్రో ప్రయోగించిన భూస్థిర, భూ సమన్వయ ఉపగ్రహాలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.[1] 2005లో భోపాల్‌లో మరొక సదుపాయాన్ని స్థాపించే వరకు ఇస్రోకున్న ఏకైక మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఇది.

ఇన్‌శాట్-1B - MCF నియంత్రించిన మొదటి ఉపగ్రహాలలో ఒకటి

స్థాపన

మార్చు

నియంత్రణ సదుపాయాన్ని ఏర్పాటు కోసం ఇస్రో భారతదేశంలో వివిధ సైట్‌లను తనిఖీ చేసి, హాసన్‌ను ఎంచుకుంది. ఇది ధ్వని తక్కువగా ఉంది. ఇతర స్థలాల కంటే ఇక్కడ తక్కువ భూస్థిత ప్రసారాలు ఉన్నాయి. ఉపగ్రహాల నుండి చాలా బలహీనమైన సంకేతాలను కూడా అందుకోవాలంటే, అతి తక్కువ జోక్యం ఉండాలి. ఈ సదుపాయాన్ని 17.2 హెక్టార్లలో నిర్మించారు.

అంతర్గత విభజనలు

మార్చు

MCF లో మూడు విభాగాలున్నాయి. అవి: స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్ సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్, ఎర్త్ స్టేషన్ .

అంతరిక్ష నౌక నియంత్రణ కేంద్రం (స్పేస్‌క్రాఫ్ట్ కంట్రోల్ సెంటర్)

మార్చు

ఈ కేంద్రం నుండి ఉపగ్రహాలను నియంత్రిస్తారు. కావలసిన కార్యకలాపాలను చేపట్టడానికి ఉపగ్రహానికి ఆదేశాలను ఈ కేంద్రం నుండే పంపిస్తారు.

మిషన్ కంట్రోల్ సెంటర్

మార్చు

ఈ కేంద్రం ఉపగ్రహ ప్రయోగ సమయం లోను, అంతరిక్షంలో దాని ప్రారంభ కాలంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మిషన్ డైరెక్టర్, ఉపగ్రహంలోని వివిధ మాడ్యూల్స్ యొక్క వివిధ రూపకర్తలు ఉపగ్రహ పనితీరుపై నిఘా ఉంచే ప్రదేశం ఇది. ఉపగ్రహాలు పంపే టెలిమెట్రీ సిగ్నల్స్ ద్వారా ఉపగ్రహం యొక్క వివిధ పారామితులను అధ్యయనం చేయడం, దాని లోని వివిధ మాడ్యూళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వాటిని అర్థం చేసుకోవడం ద్వారా పనితీరును గమనిస్తారు. పారామితుల నిర్దేశిత పరిమితుల నుండి ఏదైనా విచలనం సంభవించినట్లయితే, ఆటోమేటిగ్గా అలారం మోగుతుంది. దానికి అనుగుణంగా ఈ కేంద్రం నుండి ఉపగ్రహానికి సవరణలను పంపుతారు.

ఎర్త్ స్టేషన్

మార్చు

MCF లో ఏడు ఎర్త్ స్టేషన్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ సదుపాయం ఉంది. ఉపగ్రహం, MCF ల మధ్య కమ్యూనికేషన్ లింక్‌ను అందించే యాంటెన్నాల శ్రేణి ఎర్త్ స్టేషనుకు సహాయపడతాయి. MCFలో 3 ఫుల్-మోషన్ యాంటెన్నాలు, దాదాపు డజను పరిమిత చలనంతో కూడిన యాంటెన్నాలూ ఉన్నాయి. ఫుల్-మోషన్ యాంటెన్నాలను 360° చుట్టూ తిప్పవచ్చు. అలాగే ఎత్తులో సున్నా° నుండి 90° వరకు వంచవచ్చు. వాటి ద్వారా ఉపగ్రహానికి ఆదేశాలను పంపడం, దాని నుండి సంకేతాలను అందుకోవడం చేస్తారు. తద్వారా ఉపగ్రహం కక్ష్యలో ఉందో లేదో తనిఖీ చేయడంలో కూడా సహాయపడుతాయి. ఫుల్ మోషన్ యాంటెనాలను ఉపగ్రహ ప్రయోగ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపగ్రహం నిర్దేశించిన కక్ష్యలో ఉన్నప్పుడు, పరిమిత చలన యాంటెనాలు ఉపగ్రహ సమాచార లింకును స్వాధీనం చేసుకుంటాయి.

ఉపగ్రహాలు

మార్చు

ప్రస్తుతం MCF కింది 19 ఉపగ్రహాలను నియంత్రిస్తోంది: ఇన్‌శాట్-3C, KALPANA-1, ఇన్‌శాట్-3A, ఇన్‌శాట్-4A, ఇన్‌శాట్-4B, ఇన్‌శాట్-4CR, జీశాట్-8, జీశాట్-12, జీశాట్-10, IRNSS-1A, ఇన్‌శాట్ -1A . 3D, జీశాట్-7, జీశాట్-14, IRNSS-1B, IRNSS-1C, జీశాట్-16 IRNSS-1D, జీశాట్-6, జీశాట్-15 ఉపగ్రహాలు. ఈ 19 ఉపగ్రహాలలో 16 ని MCF హసన్ నుండి, మూడింటిని MCF భోపాల్ ( ఇన్‌శాట్-3C, ఇన్‌శాట్-4CR, జీశాట్-12 ) నుండి నియంత్రిస్తున్నారు. 1997 అక్టోబరులో MCF ఇన్‌శాట్-2D ఉపగ్రహంతో సంబంధాన్ని కోల్పోయింది. ఇది ISROకి తీవ్రమైన దెబ్బ. ఈ లోపం ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను కూడా ప్రభావితం చేసింది.[2] 1997 అక్టోబరు 3 న దీనిపై ఆధారపడిన VSAT టెర్మినళ్ళను ఇన్‌శాట్-2Aకి బదిలీ చేసేవరకు ఎక్స్‌ఛేంజిలో ట్రేడింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది. [3] ఇంతకుముందు, ఈ సదుపాయం నుండి ఇన్‌శాట్-1B వంటి మునుపటి తరం ఉపగ్రహాలను కూడా నియంత్రించేవారు.

మూలాలు

మార్చు
  1. "Master Control Facility (MCF)". www.vssc.gov.in. Archived from the original on 2022-09-26. Retrieved 2022-09-26.
  2. "Insat-2d Failure Cripples Nse, No Trading Today". Business Standard India. 1997-10-03. Archived from the original on 2022-09-26. Retrieved 2022-09-26.
  3. "Business Line Twenty Years Ago Today". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 2017-10-05. Archived from the original on 2022-09-26. Retrieved 2022-09-26.