రక్తం

(రక్తము నుండి దారిమార్పు చెందింది)

నెత్తురు లేదా రక్తము (ఆంగ్లం: Blood) ద్రవరూపంలో ఉన్న శరీర నిర్మాణ ధాతువు లేదా కణజాలం (tissue). జీవి మనుగడకి రక్తం అత్యవసరం; ఈ సందర్భంలో రక్తం బహుముఖ ప్రజ్ఞ, సర్వతోముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తుంది. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హిమటాలజీ' (Hematology) అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న ఉత్తరపదము ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది.

రక్తం
Venous and arterial blood.jpg
Venous (darker) and arterial (brighter) blood
వివరములు
లాటిన్haema
Identifiers
TAA12.0.00.009
FMA9670
Anatomical terminology

భాషా విశేషాలుసవరించు

తెలుగు భాషలో రక్తము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] రక్తము n. అనగా Blood. నెత్తురు. Redness, ఎరుపు. adj. Bloody, red. నెత్తురుగా నుండే, ఎర్రని. రక్తము తీయు to bleed or draw blood. రక్త చందనము అనగా red sandal wood. రక్తమాల్యములు purple or red garments. రక్తవాహిక n. అనగా A blood vessel రక్త నాళములు. రక్తపము n. A blood drinker. A leech. జెలగ. రక్తపుచ్ఛిక n. A green lizard with a red tail. నలికండ్ల పాము. రక్తపుడు n. A blood-drinker, a vampire, a devil. రాక్షసుడు. The ghosts are described an Odyssey as drinking blood. రక్తపెంజెర or రక్తపింజర n. The boa, or rock snake. సర్పవిశేషము. రక్తమందుచెట్టు a kind of shrub. రక్తాక్షి n. The name of a Telugu year ఒక తెలుగు సంవత్సరము. రక్తిక n. A plant, Abrus precatorius, the seeds of which are used as weights. గురుగింజ లేదా గురివింద. రక్తిమ or రక్తిమము n. Crimson, blood colour. రక్తవర్ణము. రక్తోత్పలము n. The red lotus. కెందమ్మి, ఎర్ర తామర పుష్పము.

రక్తపు రంగు nethuruసవరించు

రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న రక్తచందురం అనే ప్రాణ్యం (protein). ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్‌ (hemoglobin) అంటారు. 'రక్తం ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉండకూడదు, ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానం ఉందో లేదో తెలియదు కాని వృక్ష సామ్రాజ్యానికి (plant kingdom) ఆకుపచ్చరంగు ఉన్న పత్రహరితం (chlorophyll) ఒక వ్యాపారచిహ్నంలా (trademark) ఎలా చలామణీ అవుతోందో అదే విధంగా జంతు సామ్రాజ్యంలో (animal kingdom) ఎర్ర రంగు ఉన్న రక్తచందురం చలామణీ అవుతోంది. కనుక 'పత్రహరితం ఆకుపచ్చగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి, 'రక్త చందురం ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానాలు ఒక్క చోటే దొరకవచ్చు.

రక్తానికి మూలాధారం నీరుసవరించు

రక్తంలో దరిదాపు 80% నీరే. రక్తం నెరవేర్చే గురుతర బాధ్యతలన్నిటిని నీరు నిర్వర్తించినంత బాగా మరే ఇతర ద్రవ పదార్ధమూ నిర్వర్తించలేదు. అందుకనే రక్తం తయారీకి నీరు ముఖ్యమయిన ముడి పదార్థం. ఉదాహరణకి మనకి సర్వసాధారణంగా ఎదురయే ద్రవ పదార్ధాలన్నిటిలోకీ నీటి యొక్క విశిష్ట తాపం (specific heat) ఎక్కువ. అంటే నీటిని వేడి చెయ్యటానికి ఎక్కువ సేపు పడుతుంది; చల్లార్చటానికీ ఎక్కువ సేపు పడుతుంది. (కుంపటి వేడెక్కినంత త్వరగా గిన్నెలో నీరు వేడి ఎక్కక పోవటానికి నీటి యొక్క విశిష్ట తాపం ఎక్కువగా ఉండటమే కారణం.) అంటే నీరు నిలకడ మీద వేడెక్కుతుంది, నిలకడ మీద చల్లారుతుంది. కనుక శరీరంలోని జీవన ప్రక్రియల వల్ల పుట్టిన వేడిని రక్తంలోని నీరు పీల్చుకున్నప్పుడు నీరు గభీమని సలసల మరిగిపోదు. అలాగే చెమట పట్టి శరీరం చల్లబడ్డప్పుడు రకం మంచుముక్కలా చల్లబడి పోదు. ఈ రకపు నిదానపు గుణం - ఉదాహరణకి - ఆల్కహాలుకి లేదు, నీటికే ఉంది. అందుకని రక్తానికి నీరు మూలాధారం.

రక్తానికి ప్రాణం రక్తచందురం == సగటున 70 కిలోలు తూగే మగవాడి శరీరంలో సుమారు అయుదున్నర లీటర్ల రక్తం ఉంటే, సగటున 50 కిలోలు తూగే ఆడవారి శరీరంలో మూడున్నర లీటర్ల రక్తం ఉంటుంది. కనుక సగటు మగవాడి శరీరం లోని అయిదున్నర లీటర్ల రక్తంలో సుమారు నాలుగుంపావు లీటర్లు నీళ్ళే. ఈ నీరు 37 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న ఒక లీటరు నీటిలో సుమారు 7 మిల్లీగ్రాముల ఆమ్లజని కరుగుతుంది. ఈ 7 ని నాలుగుంపావు చేత గుణిస్తే ఊరమరగా 30 మిల్లీగ్రాములు వస్తుంది. కనుక మనం పీల్చే గాలిలోని ఆమ్లజని సుమారు 30 మిల్లీగ్రాముల ప్రాప్తికి శరీరంలోని రక్తంలో కరుగుతుంది. కాని ఒక సగటు మనిషికి, పరిశ్రమ లేకుండా కదలకుండా కూర్చున్న మనిషికి, బతకటానికి సెకండు ఒక్కంటికి ఆరున్నర మిల్లీగ్రాముల ఆమ్లజని సరఫరా ఉండాలి; లేక పోతే ఆ శాల్తీ బతకదు. ఈ లెక్కని శరీరంలోని రక్తంలోని నీటిలో కరిగి ఉన్న ఆమ్లజని నాలుగున్నర సెకండ్లలో ఖర్చు అయిపోతుంది. కాని మనం ముక్కు మూసుకుని, గాలి పీల్చకుండా నాలుగున్నర సెకండ్ల కంటే ఎక్కువ కాలమే బతకగలం. నీటిలో బుడక పెట్టి ఒక నిమిషం ఉండటం కష్టం కాదు. అనుభవం ఉన్న వాళ్ళు రెండు నిమిషాలు కూడా ఉండగలరు. వీరికి ఆమ్లజని సరఫరా ఎక్కడ నుండి వస్తున్నట్లు? ఈ ప్రశ్నకి సమాధానంగా ప్రయోగం చేసి ఒక విషయం నిర్ధారణ చెయ్యవచ్చు. నిజానికి లీటరు రక్తంలో 285 మిల్లీగ్రాముల ఆమ్లజని కరిగి ఉంటుంది. లీటరు నీటిలో 7 మిల్లీగ్రాములే కరిగి ఉన్నప్పుడు, ఈ మిగతా ఆమ్లజని ఎక్కడ దాగున్నట్లు? ఈ మిగతా ఆమ్లజని రక్తచందురంలో దాగి ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే, ప్రతి రక్తందురం బణువు తనలో నాలుగు ఆమ్లజని అణువులని ఇముడ్చుకుని ఊపిరితిత్తుల నుండి శరీరం నలుమూలలకీ తీసికెళ్ళ ఉంది.

రక్తంలో ఉండే వివిధ పదార్ధాలుసవరించు

 
స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా రక్త కణాల చిత్రం

రక్తాన్ని పరీక్ష నాళికలో పోసి నిలడితే కొద్ది సేపటిలో రక్తం మూడు స్తరాలు (layers) గా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న స్తరం, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా, పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని తెలుగులో రసి అనిన్నీ ఇంగ్లీషులో ప్లాస్మా (plasma) అనిన్నీ అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో తెల్లటి స్తరం ఒకటి కనిపిస్తుంది. ఇవే తెల్ల రక్త కణాలు (white blood cells), లేదా సూక్ష్మంగా తెల్ల కణాలు (white cells or leukocytes). నాళికలో అట్టడుగున దరిదాపు రసి స్తరం ఉన్నంత మందం గానూ ఎర్రటి స్తరం మరొకటి కనిపిస్తుంది. ఇవి ఎర్ర రక్త కణాలు (red blood cells), లేదా సూక్ష్మంగా ఎర్ర కణాలు (red cells or erythrocytes). ఉరమరగా రసి స్తరం 55 శాతం ఉంటే ఎర్ర కణాల స్తరం 45 శాతం.

ఎర్ర రక్త కణాలు (ఎరిత్రోసైట్లు) : ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం ఉండడం వలన అవి ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 450 నుండి 500 కోట్ల ఎర్ర రక్త కణాలుంటాయి. ఈ కణాలు ఎముకల మధ్య ఉన్న మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిత్రోపాయిసిస అంటారు. ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. ఇవి ఆక్సిజన్ రవాణాకు తోడ్పడతాయి. వీటి జీవితకాలం తరువాత ఇవి ప్లీహంలో, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి.

తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు) : వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు. ఇవి అమీబా వంటి ఆకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 50 నుండి 90 లక్షల రక్త కణాలుంటాయి. ఇవి లింపు కణుపులలోను, ప్లీహంలోను ఉత్పత్తి అవుతాయి. ఇని ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఇవి సుమారు 12-13 రోజులు జీవిస్తాయి. వ్యాధులనుండి సంరక్షించడం తెల్ల రక్తకణాల పని. వీటి జీవితకాలం తరువాత తెల్లరక్తకణాలు కాలేయంలోను, లింపు ద్రవంలోను విచ్ఛిన్నమవుతాయి.

రక్తంలో రసి చాల ముఖ్యమైనది. పోషణకి కావలసిన విటమినులు, ఖనిజాలు, చక్కెరలు, ప్రాణ్యములు, కొవ్వులు, మొదలయిన వాటి రవాణాకి ఒక రహదారి కల్పిస్తుందీ రసి. ఈ రసిలో - కొన్ని చిల్లర మల్లర సరుకులు మినహా - తేలియాడే పదార్ధాలలో మూడు ముఖ్యమైన ప్రాణ్యాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో ఆల్బ్యుమిన్‌ (albumin), గ్లాబ్యులిన్ (globulin), ఫైబ్రినోజెన్‌ (fibrinogen) అని అంటారు. ఆల్బ్యుమిన్‌ని తెలుగులో 'శ్వేతధాతువు' అంటారు. గ్లాబ్యులిన్‌కి ప్రస్తుతానికి తెలుగు పేరు లేదు కాని ఇది మూడు రకాలు: ఆల్ఫా, బీటా, గామా. నీటిని పుట్టించేది ఉదజని (hydrogen), ఆమ్లాన్ని పుట్టించేది ఆమ్లజని (oxygen) అయినట్లే ఫైబర్‌ని పుట్టించేది ఫైబ్రినోజెన్‌. ఫైబర్‌ అంటే నార, పీచు, తాంతవం అని తెలుగు మాటలు ఉన్నాయి. కనుక నార వంటి పదార్ధాన్ని పుట్టించే ఫైబ్రినోజెన్‌ని తెలుగులో 'తాంతవజని' అనొచ్చు. దెబ్బ తగిలి రక్తం స్రవిస్తూన్నప్పుడు, రక్తానికి గాలి సోక గానే ఈ తాంతవజని రక్తం లోంచి బయటకి పుట్టుకొచ్చి, సాలెపట్టులా దెబ్బ చుట్టూ అల్లి పక్కు కట్టేలా చేస్తుంది. మనం ఆహారంతో తినే పిప్పి పదార్ధాలు ఇవి కావు; అవి మరొకటి.

రక్తం చేసే పనులుసవరించు

 • ఎర్ర కణాలలో ఉండే రక్తచందురంతో కణజాలాలకు ప్రాణవాయువును సరఫరా చెయ్యటం.
 • గ్లూకోజు, ఎమైనో ఆమ్లాలు, ఫాటీ ఆసిడ్ ల వంటి పోషకాలను సరఫరా చెయ్యటం.
 • కార్బన్ డై ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ ఆమ్లంల వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలించటం.
 • వ్యాధి నిరోధక విధులు, తెల్ల కణాల సరఫరా, ఆంటీబాడీ లతో కొత్త క్రిములను, రోగకారకాలను నిరోధించటం.
 • దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అది గడ్డ కట్టేలా చూడటం.
 • హార్మోన్ల సరఫరాకి వాహకిగా పని చెయ్యటం.
 • దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేయటం.
 • శరీరంలో ఆమ్ల-క్షార తుల్యతని (pH విలువని) నియంత్రించటం.
 • శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం.
 • హైడ్రాలిక్ (పంపింగ్) విధులు నిర్వర్తించటం.

రక్తంలో వర్గాలుసవరించు

ABO రక్త వర్గాలు

1902లో కార్ల్ లేండ్‌స్టయినర్ అనే ఆస్ట్రియా దేశస్తుడు స్థూల దృష్టితో చూడటానికి అందరి రక్తం ఒకేలా ఉన్నా సూక్ష్మ లక్షణాలలో తేడాలు గమనించేడు. కొన్ని ఎర్ర కణాల ఉపరితం మీద చక్కెర పలుకుల వంటి పదార్ధాలు అంటిపెట్టుకుని ఉండటం గమనించేడీయన. మంచి పేరు తట్టక వీటికి A, B రకాలు అని పేర్లు పెట్టేడు. ఈ పరిశోధన సారాంశం ఏమిటంటే కొందరి ఎర్ర కణాల మీద ఎ-రకం చక్కెర పలుకులు ఉంటే, కొందరి ఎర్ర కణాల మీద బి-రకం చక్కెర పలుకులు ఉంటాయి. కొందరి కణాల మీద రెండు రకాల పలుకులూ (ఎబి) ఉంటాయి. కొందరి కణాల మీద ఏ రకం చక్కెర పలుకులూ ఉండవు (ఓ). దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన రక్తాన్ని నాలుగు వర్గాలుగా విడగొట్టేడు: ఎ, బి, ఎబి, ఓ. ఇలా రక్తాన్ని వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం ఏమిటంటే ఒక వర్గపు రక్తం మరొక వర్గపు రక్తంతో కలిస్తే ఆ రక్తం పాలు విరిగినట్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం అర్ధం చేసుకోకుండా రక్త దానం చేస్తే - అంటే ఒక వ్యక్తి రక్తం మరొకరికి ఎక్కిస్తే - ప్రమాదం.

 • ఒక వర్గం వారు అదే వర్గానికి చెందిన ఇతరులకి రక్తం దానం చెయ్యవచ్చు.
 • ఓ (O) వర్గపు వారి రక్తం ఎవ్వరికైనా ఎక్కించవచ్చు. కనుక ఓ రక్తం ఉన్న వారు సార్వజనిక దాతలు (universal donors).
 • ఎ (A) వర్గం వారి రక్తాన్ని ఎ వర్గం వారికిగాని ఎబి వర్గం వారికి కాని దానం చెయ్య గలరు.
 • బి (B) వర్గం వారి రక్తాన్ని బి వర్గం వారికిగాని ఎబి వర్గం వారికి కాని దానం చెయ్య గలరు.
 • ఎబి (AB) వర్గం వారు తమ రక్తాన్ని తమ వర్గం వారికి తప్ప ఇతర వర్గాల వారికి ఎవ్వరికీ దానం చెయ్య కూడదు, కాని ఎవ్వరిచ్చినా పుచ్చుకోవచ్చు. వీరు సార్వజనిక గ్రహీతలు (universal receivers).

ఒక వ్యక్తి ఏ వర్గపు రక్తంతో పుట్టేదీ నిర్ణయించే జన్యువు (gene) ఆ వ్యక్తి యొక్క 9వ వారసవాహిక (chromosome) లో ఉంటుంది.

Rh కారణాంశాలు

కార్ల్ లేండ్‌స్టయినర్, లెవీస్, తదితరులు 1940లో రక్తంలో మరొక వర్గాన్ని కనుక్కున్నారు. దీనిని మొదట రీసస్ కోతులలోను తరువాత మానవులలోను కనుక్కోవడం జరిగింది కనుక రీసస్‌ కోతుల గౌరవార్ధం దీనికి Rh-కారణాంశం (Rh-factor) అని పేరు పెట్టేరు. ఈ కారణాంశం కలిగిఉన్న వారిని 'Rh+' అని లేని వారిని 'Rh-' అని అంటారు. మానవులలో ఎక్కువ శాతం మంది 'Rh+' వారున్నారు. ఇప్పుడు 'Rh+' జాతి మగాడు 'Rh-' జాతి ఆడదానిని పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టబోయే సంతానం 'Rh+' అయినా కావచ్చు, 'Rh-' అయినా కావచ్చు. ఈ గర్భస్థ శిశువు 'Rh+' అయిన పక్షంలో తల్లి రక్తం ఒక వర్గం, పిల్ల రక్తం మరొక వర్గం అవుతుంది. పిల్ల రక్తంలోని 'Rh+' కారణాంశాలు తల్లి రక్తంలో ప్రవేశించగానే వాటిని పరాయి కణాలుగా గుర్తించి తల్లి శరీరం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ఈ యుద్ధం వల్ల మొదటి కాన్పులో తల్లికి, పిల్లకి కూడా ఏమీ ప్రమాదం ఉండదు. కాని రెండవ కాన్పులో తల్లి గర్భంలో మళ్ళా ఉన్న శిశువు, మళ్ళా 'Rh+' అయిన పక్షంలో ఆ పిల్ల బతకదు. అందుకని పెళ్ళికి ముందే ఆడ, మగ రక్త పరీక్ష చేయించుకుని జన్యుపరంగా ఎవరెవరి వైఖరి (genetic profile) ఎలా ఉందో తెలుసుకోవటం ఉభయత్రా శ్రేయస్కరం.

కృత్రిమ రక్తంసవరించు

ఎడిన్‌బరో, బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎముకమజ్జ నుంచి గ్రహించిన మూలకణాల నుంచి ఎర్ర రక్తకణాలను సృష్టించారు.దీంతో గుండెమార్పిడి, బైపాస్‌, క్యాన్సర్‌ బాధితులకు ఆపరేషన్‌ చేసే సమయంలో తగినంత రక్తం అందుబాటులో ఉండటం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడే వీలుంది. మూలకణాల నుంచి సృష్టించిన ఈ కృత్రిమరక్తంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బెడద ఉండదు. పైగా దీన్ని దాదాపు అన్ని రక్తం గ్రూపుల వారికి ఎక్కించొచ్చు కూడా. తొలిదశలోని పిండం నుంచి సేకరించిన మూలకణాలతో ఎర్రకణాలను పెద్దసంఖ్యలో సృష్టిస్తే అప్పుడది నిజం రక్తంలాగానే ఉంటుంది..ఒక్క పిండం నుంచే లక్షలాది మందికి సరిపడిన ఎర్రకణాలను సృష్టించొచ్చు. (ఈనాడు28.10.11)

రక్త ప్రవాహంసవరించు

శరీరంలో ఏభాగానికైనా గాయమైనప్పుడు రక్తం వస్తుంది. అయితే కొంచెం సేపటికే రక్తం గడ్డకట్టి, రక్తం స్రవించడం ఆగిపోతుంది. రక్తంలో ద్రవపదార్థంలాంటి ప్లాస్మా కాకుండా ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్ అనే మూడు రకాల కణాలు కూడా ఉంటాయి. రక్తం గడ్డకట్టడానికి ఈ ప్లేట్‌లెట్సే కారణం. గాయం తగిలినప్పుడు ప్లేట్‌లెట్స్ గాయం చుట్టూ చేరి రక్తంలోని ప్లాస్మానుంచి త్రాంబో ప్లాస్టిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ పదార్థం రక్తంలోని కాల్షియం. ప్రోత్రాండిన్‌లతో కలుస్తుంది. ఇవి ఫ్రైబ్రొనోజిన్ అని రక్తంలో ఉండే ఒక ప్రోటీన్‌తో ప్రతిక్రియ జరుపుతాయి. దాంతో ఫైబ్రెన్ దారాలు ఒక దానితో ఒకటి పెనవేసుకునిపోయి రక్తాన్ని బయటకుపోనివ్వకుండా ఒక విధమైన అడ్డుకట్టలాగ నిలుస్తాయి.

దాంతో ఫ్రైబ్రెన్ దారాలు గట్టిగా అతుక్కుపోతాయి. ఈ కణాల పై పొర చనిపోతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చాక పైన ఏర్పడిన పొర ఊడిపోతుంది. ప్లేట్‌లెట్స్ నుండి సిరోటినిన్ అనే హర్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తాన్ని సంకోచింపజేస్తుంది. దాంతో రక్తప్రవాహం ఆగిపోతుంది.

వ్యాధులుసవరించు

వనరులుసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రక్తం&oldid=2889510" నుండి వెలికితీశారు