వక్కంతం వంశీ ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే ఒక సినీరచయిత, నటుడు . కథ ఎలా ఉన్నా ఆ సినిమాలో హీరోకి పాత్రకి ఓ కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు.

వక్కంతం వంశీ
వక్కంతం వంశీ.jpg
వక్కంతం వంశీ
జననంవక్కంతం వంశీ
చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్,
భారతదేశం
నివాసంహైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్,
భారతదేశం
చదువుశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ
వృత్తిరచయిత,
నటుడు,
క్రియాశీలక సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రీవిద్య
పిల్లలుఆర్ణవి

జీవిత విశేషాలుసవరించు

వంశీ చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని అరికెల అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వక్కంతం సూర్యనారాయణరావు ప్రముఖ నవలా రచయిత. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశాడు. తల్లి స్వర్ణకుమారి గృహిణి. వంశీ తన తల్లిదండ్రులకు కలిగిన ముగ్గురు సంతానంలో పెద్దవాడు. తండ్రి ఉద్యోగరీత్యా ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో జరిగింది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందాడు.

తండ్రి రచయిత కావడంతో ఇతనికి చిన్నతనం నుండి సాహిత్యం పట్ల, రచనల పట్ల ఆసక్తి కలిగింది. పాఠశాలలో చదివే రోజులలో నాటకాలలో నటించేవాడు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇతడు మొదట ఈటీవీలో న్యూస్‌రీడర్‌గా చేరాడు. మొదటిసారిగా చిత్రం భళారే విచిత్రంలో కెమెరా ముందు కనిపించాడు. దానికంటే ముందు జె. కె. భారవి తీసిన రంగవల్లి సినిమాలో గుడి ముందు బిచ్చగాడి పాత్రను ధరించాడు[1]. తరువాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో సుమ హీరోయిన్‌గా 1996లో విడుదలైన కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోవడంతో ఇతనికి తరువాత నటుడిగా అవకాశాలు రాలేదు. తిరిగి హైదరాబాదుకు వచ్చి ఈటీవిలో ఫ్రీలాన్సర్‌గా పనిచేశాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు సుమారు ఏడు టెలివిజన్ సీరియళ్లలో నటించాడు. వాటిలో బాపు దర్శకత్వంలో వచ్చిన భాగవతం సీరియల్‌లో శుకమహర్షిగా నటించాడు. భక్త మార్కాండేయ అనే సీరియల్‌లో ఎన్.టి.ఆర్.జూనియర్‌తో కలిసి నటించాడు.

వంశీ సినిమా రచయితగా ఎన్.టి.ఆర్.జూనియర్‌ నటించిన అశోక్ సినిమాకు కథను అందించాడు. తరువాత వరుసగా కిక్, ఉసరవెల్లి, ఎవరు, రేసుగుర్రం వంటి హిట్ చిత్రాల రచయితగా పేరు గడించాడు. ఇతడు ఉదయ్ కిరణ్, జూనియర్ ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, రవితేజ, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, గోపీచంద్ వంటి హీరోలు నటించిన సినిమాలకు కథలను అందించాడు. ఆర్.రఘురాజ్, సురేందర్ రెడ్డి, మల్లికార్జున్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్, విక్రం సిరికొండ, బి.గోపాల్ వంటి దర్శకుల సినిమాలకు పనిచేశాడు. ఇతడు అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించడమే కాకుండా ఆ సినిమాకు కథను కూడా అందించాడు. ఇతని భార్య పేరు శ్రీవిద్య. వీరికి ఒక కుమార్తె ఆర్ణవి జన్మించింది[2].

వివాదాలుసవరించు

ప్ర‌ముఖ సినీ న‌టుడు నిర్మాతకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పు ఇచ్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ ద‌ర్శ‌క‌త్వంలో గ‌ణేష్ టెంప‌ర్ చిత్రాన్ని నిర్మించాడు.ఈ చిత్రానికి ర‌చ‌యిత వ‌క్క‌ంతం వంశీ క‌థ‌ని అందించిన విష‌యం తెలిసిందే. అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది. నష్ట పరిహారం కింద వంశీకి రూ. 15,86,550 చెల్లించాలని బండ్ల గణేష్‌ను కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యంగా వహించినందుకు ఆయనపై 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం బండ్ల గణేష్ బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకోగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశాడు. ఈ వార్త‌ టాలీవుడ్‌లో సంచలనంగా మారింది[3].

ఇతడు దర్శకత్వం వహిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథను కాపీ కొట్టాడని విమర్శలు వచ్చాయి. 2002లో విడుదలైన ‘యాంట్‌వోన్‌ ఫిషర్‌’ అనే సినిమాను ఫైండింగ్‌ ఫిష్‌ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. డెంజిల్ వాషింగ్టన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అమెరికా నేవీ అధికారిగా కనిపిస్తాడు. ఈ పాత్రకు, అల్లు అర్జున్ పాత్రకు దగ్గర పోలికలు ఉండడంతో కాపీ కొట్టాడని వార్తలు వచ్చాయి. [4] అయితే ఇతడు దానిని ఖండించాడు.[5]

పనిచేసిన చిత్రాలుసవరించు

 1. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018) - దర్శకత్వం, కథ
 2. టచ్ చేసి చూడు (2018)
 3. కిక్ 2
 4. టెంపర్ (2015)
 5. రేసుగుర్రం (2014)
 6. ఎవడు (సినిమా) (2014)
 7. ఊసరవెల్లి (సినిమా) (2011)
 8. కళ్యాణ్ రామ్ కత్తి (2010)
 9. కిక్ (సినిమా) (2009)
 10. అతిథి (2007)
 11. అశోక్ (సినిమా) (2006)
 12. కలుసుకోవాలని (2002)
 13. ఎంత బావుందో! (2002) - నటుడు
 14. కల్యాణ ప్రాప్తిరస్తు (1996) - నటుడు
 15. చిత్రం భళారే విచిత్రం (1992) - నటుడు
 16. రంగవల్లి (1992) - నటుడు

మూలాలుసవరించు

 1. Script by destiny
 2. సంపాదకుడు (22 June 2014). "తారక్‌కు కథ చెప్తే కిక్ ఉంటుంది - వక్కంతం వంశీతో ఇంటర్వ్యూ". ఈనాడు ఆదివారం. Retrieved 3 April 2018.
 3. బండ్ల గణేష్‌కు ఆరునెలల జైలు శిక్ష..
 4. ఆంధ్రజ్యోతి, బృందం (31 January 2018). "బన్నీ ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..!". ఆంధ్రజ్యోతి. మూలం నుండి 30 ఏప్రిల్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 30 April 2018.
 5. శ్రీధర్, . (21 April 2018). "పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఒకే వేదికపై, ఎప్పుడో తెలుసా?". Filmi beat తెలుగు. మూలం నుండి 30 ఏప్రిల్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 30 April 2018.

బయటి లంకెలుసవరించు