సీమబద్ధ
సీమబద్ధ (బెంగాలీ:সীমাবদ্ধ) 1971లో నిర్మించబడిన బెంగాలీ సినిమా. ఈ చిత్రానికి సత్యజిత్ రే దర్శకత్వం వహించాడు. 19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి బంగారు పతకం గెలుచుకుంది[1][2]
నటీనటులు
మార్చు- వరుణ్‌చందా
- షర్మిలా టాగూర్
- హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ
- హరధన్ బంధోపాధ్యాయ్
- పరుమిత చౌదరి
- ఇందిరా రాయ్
- ప్రమోద్ గంగూలీ
సాంకేతిక వర్గం
మార్చు- కథ : శంకర్
- సంగీతం : సత్యజిత్ రే
- దర్శకత్వం : సత్యజిత్ రే
- నిర్మాత : భరత్ షంషేర్ జంగ్ బహదూర్ రాణా
చిత్రకథ
మార్చుశ్యామలేందు ఛటర్జీ స్వగ్రామం పాట్నా. కాలేజీ జీవితంలో తెలివైన వాడిగా పేరు తెచ్చుకున్న శ్యామలేందు చదువు ముగియగానే కలకత్తాలో బల్బులు, ఫ్యాన్‌లు ఉత్పత్తి చేసే ఒక పెద్ద బ్రిటీష్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన భార్య డోలన్‌తో పాట్నా నుంచి కలకత్తాకు మకాం మార్చాడు.
ఉద్యోగంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపించిన శ్యామలేందు కొద్ది కాలంలోనే తను పనిచేస్తున్న హిందుస్తాన్ - పీటర్స్ లిమిటెడ్ కంపెనీకి మేనేజర్ అయ్యాడు.
ఇప్పుడతనిది ఆడంబరమైన జీవితం. పెద్ద బంగళా, కారు ఇంకా ఎన్నో వసతులు అతనికి ఏర్పడ్డాయి. సౌకర్యాలతో పాటు కోరికలూ అతనిలో పెరగసాగాయి.
ఇప్పుడు అతడి లక్ష్యం ఒక్కటే. అది తను పనిచేస్తున్న కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ కావడం!
డోలన్ చిన్న చెల్లెలు సుదర్శన (తుతుల్). పాట్నాలో శ్యామలేందు ఛటర్జీ వున్నప్పుడే ఆమె ఎవరికీ తెలియకుండా అతనిపట్ల మనసులో ఒక విధమైన అభిమానాన్ని పెంచుకుంది. అతనికీ, తన అక్కగారైన డోలన్‌కూ వివాహమైనా అతని మీదున్న అభిమానం మాత్రం తగ్గలేదు.
ఒకసారి తుతుల్ సెలవులకు కలకత్తాలో వుంటున్న తన సోదరి ఇంటికి వచ్చింది. శ్యామలేందు తుతుల్‌కు ఒక గడియారాన్ని బహూకరించాడు. ఆమె కూడా అతని పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేసింది.
నిరంతరం యాంత్రిక జీవితంలో అనేక ఒత్తిడులకు లోనౌతున్న శ్యామలేందుకు ఆమె మాటలు వసంతకాలంలో కోయిల పాటల్లా వినిపించాయి.
సరిగ్గా ఆ సమయంలోనే శ్యామలేందుకు అనుకోని ఓ చిక్కు వచ్చి పడింది. ఇరాక్ దేశంలో వున్న ఒక కంపెనీకి, తమ కంపెనీ ఎగుమతి చేయనున్న సీలింగ్ ఫ్యానులు చిట్టచివరి పర్యవేక్షణలో నాణ్యత లోపించినట్లుగా కనుగొనబడ్డాయి. అంటే తమ కంపెనీ పరువు ప్రతిష్ఠలకు పెద్ద నష్టం వాటిల్లబోతుందన్నమాట. ఆ పరిస్థితులలో తను ఏమీ చేయలేక పోతే ఇక కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ కావడం అన్నది కలలోని మాట.
వెంటనే మళ్ళా ఫ్యాన్‌లు తయారు చేయించి పంపడమూ జరిగే పనికాదు. ఇచ్చిన గడువు లోపల సరుకు ఎందుకు రాలేదని ఇరాక్‌లోని ఆ కంపెనీ వాళ్ళు అడిగితే ఏం సంజాయిషీ ఇచ్చుకోవాలి?
అతని మస్తిష్కంలో తీవ్రమైన అలజడి ప్రారంభమైంది. చివరికి అతనికి ఒకటే దారి కనిపించింది. అదేమంటే ఫ్యాక్టరీలో కార్మికులలో ఘర్షణ సృష్టించి, సమ్మె కల్పించి, ఆ అల్లర్లలో కొంతకాలం ఫ్యాక్టరీని లాక్-అవుట్ చేయించడం; దాంతో ఈ గొడవలవల్ల ఉత్పత్తికి ఆటంకాలు కలిగాయని ఇరాక్‌లోని ఆ కంపెనీ వాళ్ళకు చెప్పి సమస్య నుంచి తప్పించుకోవచ్చు!
వెంటనే అవకాశవాది అయిన తన కంపెనీ కార్మిక సంక్షేమశాఖ అధికారితో రహస్యంగా సంప్రదింపులు ప్రారంభించాడు శ్యామలేందు. ఫలితంగా ఫ్యాక్టరీ కార్మికుల్లో కలవరం సృష్టించబడింది. "మేము తీవ్రవాదులం" అని కొందరు విజృంభించి దౌర్జన్యాలు ప్రారంభించారు. ఫ్యాక్టరీ ఆవరణలో బాంబు పడింది. ఒక కాపలాదారుకు తీవ్రమైన గాయాలు తగిలాయి. ఒకవేళ అతనే చనిపోయి వుంటే?
'తాను మార్కెటింగ్ డైరెక్టర్ కావడానికి ఒక సామాన్యుడు చనిపోయినా ఏం?' అన్న తన ధోరణి సరియైనదేనా? అని మధనపడసాగాడు శ్యామలేందు.
"ఛటర్జీ! మీరెందుకు అలా అలోచిస్తారు? కలకత్తలో జనం చావడం లేదా?" అన్న కార్మిక సంక్షేమశాఖ అధికారి మాటలకు నవ్వుతూ అతనికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శ్యామలేందు.
అయితే అతని మస్తిష్కంలో తుతుల్ అన్న మాటలు ఒక ప్రక్క నుంచి అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఆమె శ్యామలేందును నిలదీసి అడిగింది "ఆ తీవ్రవాదులెవరో మీకు తెలియదా?" అని.
"ఎవరూ... ఆ అల్లర్లలో గాయపడ్డవాళ్ళా?" అని ఎగతాళిగా అడిగింది డోలన్ మధ్యలో కలుగజేసుకుంటూ.
"కాదు... ఆ అల్లర్లకు అసలు కారకులైన వాళ్ళు?" ఆవేశం ధ్వనించింది తుతుల్ మాటల్లో.
"భలే దానివే! ఆ సంగతి ఈయనకెలా తెలుస్తుంది?" అంది ఆమె తన భర్తను సమర్థిస్తూ.
అనుకున్నట్లుగానే అంతటి క్లిష్ట పరిస్థితి నుంచి కంపెనీ పరువు ప్రతిష్ఠలను కాపాడినందుకుగాను శ్యామలేందుకు మార్కెటింగ్ డైరెక్టర్ పదవి లభించింది! భోగలాలసత్వానికి బానిస అయిన డోలన్ ఈ వార్త విని సంతోషంతో ఉప్పొంగిపోయింది. జీవితంలో అతను సాధించిన ఆ ఉన్నతమైన పదవికి అందరూ అతన్ని మెచ్చుకున్నారు.
కాని అందుకు హర్షించనిదల్లా తుతుల్ ఒక్కతే! కారణం ఫ్యాక్టరీలో జరుపబడిన ఆ కుట్ర శ్యామలేందువల్ల జరిగిందన్న సంగతి ఆమె తెలుసుకుంది.
"ఒకరు పైకి రావడానికి ఇలా ఎందరినో బాధ పెట్టడం ఎంతటి క్రూరత్వమో గ్రహించలేని వాళ్ళు వీళ్ళూ మనుషులేనా?" అని బాధతో నిట్టూర్చింది తుతుల్. ఆమెకు శ్యామలేందు పట్ల ఏహ్యభావం కలిగింది.
అతను తనకు బహూకరించిన గడియారాన్ని తిరిగి అతనికే అప్పగించింది, అది చూపిన కాలంలో తాను చూసినదేమిటో తెలుసుకున్నట్లుగా!
అంతే! ఆమె సున్నితమైన మనసు మళ్ళా శ్యామలేందు ఛటర్జీ గురించి మళ్ళా ఆలోచించనే లేదు.
పురస్కారాలు
మార్చు- 1971: 19వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమా
- 33వ వెనీస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం - FIPRESCI అవార్డు
మూలాలు
మార్చు- ↑ "సీమబద్ధ". విజయచిత్ర. 6 (12): 8–9. 1 June 1972.
- ↑ Roy Armes (29 July 1987). Third World Film Making and the West. University of California Press. pp. 237–. ISBN 978-0-520-90801-7.