ఏదేని క్రొత్తగా సృష్టించిన గ్రంథమును, పెద్దది గాని లేక చిన్నది గానివాఙ్మయమున "కృతి" యనబడును. సంగీతమునందు కృతి రచన వేరు. తాళ నిబంధనలు, సాహిత్య భావనల నిబంధనలును ఏవియు కృతి రచయితను బంధింపవు. రాగమును తనిష్ట ప్రకారం ఏరుకొనవచ్చును. తాళము, నడక అన్నియు అతనిష్టములే. రాగము యొక్క భావములు ఎన్ని విధముల ఎన్ని స్వరూపముల, ఎన్ని ఫక్కీలలో రూపించుటకు వీలున్నదో అట్లు చూపుటయే కృతి రచయిత ధర్మము. మెదడు నుండి పొరలివచ్చు తన సాహిత్యముతో తనలోని భావములు విపులముగా జూపుటకు ఇతనికి వీలున్నది. గడచిన రెండు శతాబ్దములుగా సంగీత రచయిత లందరును కృతులనే రచించియున్నారు. కృతి రచయిత తన మనస్సు తన భావములు ఎట్లెట్లు పారునో అట్లెల్ల అతను కృతిని తన స్వంత సృష్టిగా, నూతనముగా రచించును. గనుక ఈ రచనకు కృతియని పేరిడినారు.

భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

కృతి లక్షణము మార్చు

కృతికి కనిష్టము, పల్లవి, అనుపల్లవి, చరణము అను అంగములుండవలెను. చరణ ఉత్తర భాగము సాధారణముగా అనుపల్లవిని బోలి యుండును. సాహిత్యము దేవతాస్థుతిగానైనను, రాజపోషకుని స్థుతిగా నైనను లేదేని వేదాంతముతో కూడుకొన్నది నైనను ఉండవచ్చును. కృతి లోని సాహిత్యము రాగ భావమును వెదజల్లు యంత్రముగా ఉంది. గాబట్టి మిత పదములతోనే కృతి రచయిత తృప్తిపడును. 1½ నుండి 2 స్థాయిలలో కృతి రచింపవచ్చును. చరణము ఒక్కటైనను ఉండవచ్చును. లేక 4,5 చరణములు ఉండవచ్చును. కృతులలో రచయిత అతీత, అనాగత గ్రహములతో చాకచక్యము చూపుటకు వీలున్నది. సాధారణ రాగములే కాక అపూర్వ రాగములతో కృడ కృతులను రచింపవచ్చును. కృతికి చాలా ముఖ్యమైన అంగము "సంగతి". సంగతి లేనిదే కృతి రాణింపదు. సంగతులు లేనిది కృతి సాహిత్య భావము అన్ని ఫక్కీలతో మనకు గోచరింపజాలదు. మేడమెట్ల వలె ఈ సంగతులు, సాహిత్యములోని భావమును ఒక్కొక్క ఫక్కీతో ప్రారంభించి కట్టకడపటి పై శిఖరమున చేర్చును. ఒక్క సంగతి లోపించిననూ, భావమునకంతకునూ లోపమే. సంగతి అను అంగమును మొట్టమొదట శ్రీ త్యాగరాజు ల వారే కల్పించిరి. వారికి మనమెంతయో కృతజ్ఞులము.

కృతికి సంబంధించిన సంగతులు మూడు విధములుగా ఉండును.

 1. కొన్ని కృతులలో సంగతులు చివరి నుండి ప్రారంభించుట మనము చూచుచున్నాము. క్రమేణ చివరినుండి కొంచెము కొంచెముగా ప్రాకి ఆవర్త ఆరంభమునకు వచ్చి శోభించును.
  ఉదాహరణ:"గిరిపై నెలకొన్న - శహన" -ఆదితాళం - త్యాగయ్య
 2. రెండవ రకం సంగతులు ఆవర్త ప్రారంభములోనే ప్రారంభించి కొద్ది కొద్దిగా చివరి వరకు ప్రాకును.
  ఉదాహరణ: శ్రీ రఘువరాప్రమేయ - కాంభోజి - ఆది - త్యాగయ్య.
 3. మూడవ రకము సంగతులు ఆవర్త మధ్యలో ప్రారంభించి కొద్దికొద్దిగా ఇరుప్రక్కల ప్రాకునవి.
  ఉదాహరణ: చేతులార శృంగారము - భైరవి - ఆది - త్యాగయ్య.

దీనిలో శృంగారము అను భాగము మారదు.

పల్లవి, అనుపల్లవి, చరణము, కృతికి ముఖ్యాంగములు అని చెప్పబడినవి. ఆ ముఖ్యాంగములలో కొన్ని కృతులు ఉన్నాయి. అవి,

 • చిట్టస్వరము
 • స్వరసాహిత్యము
 • మధ్యమకాల సాహిత్యము
 • కోల్ కట్టు స్వరము
 • స్వరాక్షరము
 • మణి ప్రవాళ సాహిత్యము

చిట్ట స్వరము మార్చు

చిట్ట స్వరము అనుపల్లవి తరువాతయు, చరణము తరువాతయు పాడుట వాడుకలో యున్నది. చిట్ట స్వరము 2,4,6 ఆవర్తముల స్వరముల చిన్ని రచన. సాధారణముగా మధ్యమ కాలముగా పాడదగియుండుట, కొన్ని కృతులకు కృతి రచయితుడు కాక మరియొకరు రచియించి పొంకించుటయు కద్దు. రఘువంశ అను కదన కుతూహల కృతి యందును, కృంగార లహరి అను నీలాంబరి కృతి యందును, బ్రోచేవారెవరురా అను ఖమాస్ కృతియందును, ఇంకను చాలా కృతులలో చిట్ట స్వరములు కాననగును.

చిట్ట స్వరములోనే విలోమ చిట్ట స్వరము అను నొక రకము ఉంది. ఆరోహణ, అవరోహణాలలో ఒకే స్వరములుగా ఉండి, ఆరోహన అవరోహణములు, ఒకే రకముగా ( అనగా రెండును సంపూర్ణములు గానో, షాడవములు గానో, ఔఢవములు గానో) నుండినవే. ఇటువంటి చిట్ట స్వరము రచించుటకు సాధ్యమగును. ఈ రకపు చిట్ట స్వరమును మొదటి నుండి చివర వరకూ పాడిననూ, చివరి నుండి మొదటికి పాడిన రాగము చెడక యుండవలెను. దీనికి ఉదాహరణము ముత్తుస్వామి దీక్షియుల వారి కళ్యాణి కృతి "కమలాంబాంభజరే"లో కాననగును. ఇటువంటి చిట్టస్వరము రచించుట అంత సులభం కాదు. కనుక ఇటువంటివి ఎక్కువ లేవు.

స్వర సాహిత్యము మార్చు

చిట్ట స్వరము వలెనే ఇవియు స్వరము, దానికి సాహిత్యము కలిగి యుండును. అనుపల్లవి చివరను, చరణము చివరయు పాడు అంగము. ఒక్కొక్కప్పుడు స్వరము అనుపల్లవి కనుక వెనుకను, సాహిత్యము చరణము పాడిన వెనకనూ పాడుట కొన్ని కృతులకు ఆచారములై యున్నవి. ఓ జగదంబ అను ఆనందభైరవి కృతిలో ఈ రకముగా పాడు స్వర సాహిత్యమున్నది. సాహిత్యము లోని పదముల అర్థము చరణములోని సాహిత్యము యొక్క అర్థమును పాడుచేయక పొంకముగా నుండును. దురుసుగా అను సావేరీ రాగ కృతియు ఈ జాతికి చెందినదే.

మధ్యమ కాల సాహిత్యము మార్చు

అనుపల్లవి తరువాతనో లేక చరణాంతముననో మధ్యమ కాల సాహిత్యములు రచింపబడును. ఈ సాహిత్యము కృతి కాలము కన్న త్వరగా పాడు అంగము. ముత్తుస్వామి దీక్షితుల కృతులన్నింటిలోనూ ఈ అంగమును కాననగును. ముత్తుస్వామి దీక్షితుల కృతులు చాలా నెమ్మదిగా నడుచునవి. మధ్యమ కాల సాహిత్యము వీరి కృతులకు విలువ లేని శోభ యిచ్చును.

శోల్ కట్టు స్వరము మార్చు

ఇది చిట్ట స్వరమే కాని చిట్ట స్వరము లోని కొన్ని స్వరములకు బదులు జతులను కూర్చి యుండును. ఆనంద నటన ప్రకాశం అను కేదార కృతియందు కాననగును.పా నీ నీ స తకఝనుత స నీ నీ ఝంతరిత సమగమ మొదలగునవి.

స్వరాక్షరము మార్చు

స్వరాక్షరము అనగా స్వర భాగములోని స్వరములును సాహిత్య భాగములోని అక్షరములు ఒక్కొక్కటిగానే యుండుట. అనగా "మా మా" అని స్వర భాగమందున్న "మామ" అని సాహిత్యములోనూ సాహిత్యార్థము చెడక యుండుటకు "స్వరాక్షర" మందురు. ఇటువంటి అంగమును రచించుటకు భాషయందు చాలా పాండిత్యము కలిగి యుండవలేను. చాల కొద్ది రచయితలు ఈ రక అంగమును ప్రయత్నించిరి. స్వాతి తిరుణాల్ మహారాజు గారు ఈ రకము అంగములలో చాల వరకు తన కృతుల నలంకరించిరి.

కొన్ని ఉదాహరణలు:

 1. శ్రీరామ {పా ద మా}
  శ్రీరామ {పాదమా} అను అమృత వర్షిణి కృతియందు మొదటి పదంలో "పాదమా" అనునది స్వరభాగం రెండవ పదంలో అది సాహిత్య భాగం అయి ఉంది.
 2. {నీ దా రి ని ద ప గ మ ని ని}
  {నీదారినదప్పకమానిని} అను కృతిలో {నీ దా రి ని ద ప గ మ ని ని} పదం మొదటి సారి స్వరభాగం, రెండవసారి సాహిత్య భాగం అయి యున్నది.
 3. {స రి గ పా గా} ఇచ్చెనే {సా దా పా గా} ఇచ్చెరా.
  {సరిగపాగా} ఇచ్చెనే {సాదాపాగా} ఇచ్చెరా అను కృతిలో మొదటి సారి స్వరభాగంగానూ, రెండవ సారి సాహిత్య భాగం గానూ యున్నది.

మణి ప్రవాళము మార్చు

సాహిత్యములో వ్యాకరణ నిబంధనలు చెడకుండా రెండు మూడు భాషలు కలిపి సాహిత్యమును రచించునది మణిప్రవాళము.ముత్తుస్వామి దీక్షితుల వారి "వేంకటాచలపతే" అను కాఫీ రాగ కృతి సంగీత కళా శిఖామణి ప్రొఫెసర్ సాంబమూర్తి గారి కృతిలు "నీ సరిసమాన " అను భైరవ రాగ కృతి, శ్రీ త్యాగరాజస్వామి "నీ మహిమ " అను వాచస్పతీ రాగ కృతి ప్రశంశనీయములు.

ప్రాస, యతులు మార్చు

కొన్ని కృతులు సాహిత్యములో ప్రాసములు, యతులు చాలా చక్కగా యున్నవి. "ఎదుట నిలిచి" అను శంకరాభరణం రాగ కృతి చరణములో,

తరాను దొరకని పరాకు నా యెడ
నిరామ జేసితే సురాసురులమే
త్తురా ఇపుడు ఈ హరామితనమే
అరా భక్త త్యాగరాజనుతః

అని రకారము గంభీరముగా త్యాగరాజు వాది ఈ కృతిని ఎంతో చక్కగా రచించియున్నారు.

పైన చెప్పిన అంగములు చాలా మట్టుకు ప్రయత్నించి రచింపదగిన అంగములు. ఈ అంగములు లేకపోయిననూ కృతికి లోపము కలుగజాలదు. కాని ఈ అంగములుండుట వల్ల కృతికి మరియొక క్రొత్త భూషనము తొడిగినట్లగును.

కృతి - కీర్తన మార్చు

కృతి యొక్క రచన మనకు ఒక్కసారిగా సంగీత ప్రపంచమున అందజేయలేదు. కృతికి పునాది కీర్తన. కొందరు కీర్తన, కృతి రెండునూ ఒక్కటే అనవచ్చును. కాని ఈ రెంటికీ కొన్ని భేదములున్నవి. కీర్తన పురాతన రచన. కీర్తనలు మతమును భక్తిని వ్యాపన చేయుటకై మన పూర్వులు చేయూతగా తీసికొనిన రచన. కీర్తన పూర్తిగా పుణ్య రచన అని చెప్పవచ్చును. భక్తిని, మతమును వ్యాపింపజేయదలచి ఆభావమును సంగీతముతో ఏదో ఒక మెట్టులో రచించి జనుల నాకర్షించిరి. కీర్తనలో సంగీతము కంటే సాహిత్యము ప్రాధాన్యము. కృతిలో సంగీత మే ప్రాధాన్యము. కీర్తన ఉపయోగములోనికి 15 వ శతాబ్దమున వచ్చినట్లు శ్రీ సాంబమూర్తి గారు వారి గ్రంథమున సెలవిచ్చి యున్నారు. కీర్తన లోని సాహిత్యము, భక్తుల గురించి గాని తెలుపునదియై యుండును. సాహిత్యములో పదము లెక్కువగా నుండును. సాధారనముగా ఒక్క స్థాయిలోనే ఇమిడి యుండును. అనుపల్లవి ఉంది తీరవలెనను నిబంధన లేదు. చరణముల మెట్టు పల్లవిని పోలి కొన్ని కీర్తనలలో ఉన్నాయి. కీర్తన నడక నెమ్మది. సంగీత పు ఫక్కీ చాలా సుళువుగానూ సాధారనముగాను సామాన్య రాగములలో రచింపబడుటచే వినికిడితో చేర్చుకొనుటకు సులభముగా యున్నవి.

కృతులు, కీర్తనల రచయితలు మార్చు

కొందరు రచయితలు కొన్ని అనగా ఏవో, తొమ్మిదో, ఐదో కృతులను ఒక గుంపు క్రింద, రచించి యున్నారు. ముత్తుస్వామి దీక్షితులవారు నవగ్రహ కృతులను, నవావర్ణ కృతులని, పంచలింగస్థల కృతులని, కమలాంబానవావర్ణములని కొన్ని గుంపులను, త్యాగరాజుల వారు పంచరత్నములు, కొవ్వూరు పంచరత్నములు, తిరుత్తియూరు పంచరత్నములు అను గుంపులు రచించియున్నారు.

కీర్తనలలో కూడా శ్రీ త్యాగరాజులవారు దివ్య నామ కీర్తనలని, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలని, కొన్ని గుంపులు రచించి యున్నారు. శ్రీ త్యాగరాజులవారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు, శ్రీ స్వాతితిరుణాల్, ఆనయ్య, పల్లవి గోపాలయ్య, వీణ కుప్పయ్య, సుబ్బరాయ శాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, పల్లవి శేషయ్య, మైసూరు సదాశివరావు, గోపాల కృష్ణ భారతి, రామస్వామి శివన్ మొదలగువారు కృతి రచయితలు.

భద్రాచల రామదాసు, పురందరదాసు, తాళ్ళపాక నిన్నయ్య, తీర్థ నారాయణ స్వామి, సదాశివ బ్రహ్మేంద్ర, రామచంద్ర యతీంద్ర, త్యాగరాజు, అరుణాచల కవిరాయర్, కవికుంజర భారతి, గిరిరాజకవి, విజయగోపాలస్వామి, గోపాలకృష్ణ భారతి మొదలగువారు కీర్తన రచయితలు.

ఇవి కూడా చూడండి మార్చు

సూచికలు మార్చు

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కృతి&oldid=3868070" నుండి వెలికితీశారు