గిరీశం

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంలోని పాత్ర

గిరీశం కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన కాల్పనిక పాత్ర. కన్యాశుల్కం నాటకానికి ఉన్న తొలి, మలి కూర్పులు రెంటిలోనూ గిరీశం ప్రధాన పాత్ర. కన్యాశుల్కం నాటకంలో అతనిది ప్రధాన పాత్రే అయినా నాయక పాత్ర కాదు.

గిరీశం
నాటకం ఆధారంగా తీసిన 1955 నాటి కన్యాశుల్కం సినిమాలో గిరీశంగా ఎన్.టి.రామారావు
మొదటి దర్శనంకన్యాశుల్కం (మొదటి కూర్పు)
సృష్టికర్తగురజాడ అప్పారావు
Portrayed byఎన్.టి.రామారావు (కన్యాశుల్కం సినిమా)
జె. వి. రమణమూర్తి (వెయ్యికి పైగా కన్యాశుల్కం ప్రదర్శనలు, దూరదర్శన్ సీరియల్)
గొల్లపూడి మారుతీరావు (మాటీవీ సీరియల్, నాటక ప్రదర్శనలు)
గోవిందరాజు సుబ్బారావు (నాటక ప్రదర్శనలు)
ఉత్తేజ్ (నాటక ప్రదర్శన)
తదితరులు.
సమాచారం
పూర్తిపేరునేమాని గిరీశం
లింగంపురుషుడు
దాంపత్యభాగస్వామిఅవివాహితుడు
బంధువులులుబ్దావధానులు (పెదతల్లి కుమారుడు; అన్నయ్య)
మతంహిందూ మతం
జాతీయతబ్రిటీష్ ఇండియా, భారతీయుడు

కన్యాశుల్కంలో విజయనగరంలో అప్పులు, చేసిన తప్పులు చుట్టుముట్టడంతో శిష్యుడు వెంకటేశానికి చదువుచెప్పే మిషతో అతని ఊరైన కృష్ణరాయపుర అగ్రహారానికి వెళ్తాడు. అక్కడ బాల్యవివాహం వల్ల మీదపడ్డ వైధవ్యంతో కాలం గడుపుతున్న వెంకటేశం అక్క బుచ్చమ్మను ప్రేమలోకి దింపి పెళ్ళాడదామని, తద్వారా రకరకాలుగా డబ్బు, ఆస్తి కలిసివస్తుందని ఆలోచిస్తాడు. బుచ్చమ్మ చెల్లెలికీ ముసలివాడితో పెళ్ళిచేయబోగా, దాన్ని తప్పించేందుకు అని వంక పెట్టి బుచ్చమ్మను తీసుకుపోతాడు. విజయనగరంలో సంస్కర్త, న్యాయవాది అయిన సౌజన్యారావు పంతులు వద్ద వినయం నటించి నమ్మిస్తాడు. ఇతను మొదట్లో ఉంచుకున్న మధురవాణి బండారం బయటపెట్టడంతో కథ అడ్డం తిరుగుతుంది.

గిరీశం వేశ్యాసాంగత్యం, మోసాలు, అబద్ధాలు, ఆడంబరాలు మరిగిన పాత్ర. అవసరానికి ఏదోక చక్రం అడ్డువేసి రోజులు గడుపుకుంటూ, వీలుంటే కొండకు వెంట్రుక వేద్దామని చూస్తూంటాడు. ఈ పాత్ర లక్ష్యం, దాని సిద్ధి, అసలు స్వభావంలోని కీలకం వంటి విషయాల మీద విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గిరీశం పాత్రలోని కీలకం "బ్రతుకుతెరువు" అనీ, అది హానికరమైన పాత్ర కాదని కొందరు భావిస్తే, ఆ స్థితి లేక కించిత్తు అధికారం ఉన్నా దాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసే పాత్రేనని మరికొందరి అభిప్రాయం. గిరీశం పాత్ర మీద ప్రేక్షకులకు అసహ్యం కలగకపోవడం వల్లనే నాటకం రక్తికట్టిందని ఒకరు అంటే, ఆ పాత్ర ప్రేక్షకులను ఆకర్షించడం వల్ల నాటకం సాంఘిక ప్రయోజనం దెబ్బతిందని మరికొందరు విశ్లేషించారు.

గిరీశం పాత్ర, దాని సంభాషణలు, నాటకాల్లో గిరీశం పాత్ర రూపురేఖలు కన్యాశుల్కం నాటకం పరిధిని దాటి తెలుగు జన జీవితం మీద ప్రభావం చూపుతూనే ఉన్నాయి. గురజాడ రాసిన కొండుభొట్టీయం నాటకంలోనూ, ముళ్ళపూడి వెంకటరమణ రాసిన గిరీశం లెక్చర్లులోనూ, బాపు-రమణల సినిమా రాంబంటులోనూ గిరీశం పాత్ర మళ్ళీ వస్తుంది. "డామిట్! కథ అడ్డంగా తిరిగింది", "నాతో మాట్టాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్" వంటి అతని సంభాషణలు తెలుగు నుడికారంలో భాగమయ్యాయి. వెయ్యికి పైగా నాటక ప్రదర్శనల్లోనూ, దూరదర్శన్ సీరియల్లోనూ గిరీశంగా నటించిన జె. వి. రమణమూర్తి మరో గిరీశంగా పేరు తెచ్చుకున్నాడు. 1955 నాటి కన్యాశుల్కం సినిమాలో ఎన్.టి.రామారావు, 2005 నాటి మాటీవీ సీరియల్లోనూ, మరికొన్ని రంగస్థల ప్రదర్శనల్లో గొల్లపూడి మారుతీరావు వంటివారు గిరీశంగా నటించారు. అలనాడు గోవిందరాజు సుబ్బారావు నుంచి ఇటీవల ఉత్తేజ్ దాకా పలువురు గిరీశం పాత్ర ధరించారు.

జీవిత చరిత్ర

మార్చు

గిరీశం పాత్ర కన్యాశుల్కం రెండవ కూర్పు ద్వారానే బాగా ప్రాచుర్యం పొందింది. అందులో అతని జీవితం సాగిన తీరుకు, ఇతర రూపాలైన గురజాడ రాసిన తొలి కూర్పులోనూ, 1955 నాటి కన్యాశుల్కం సినిమాలోనూ పాత్ర విషయంలో కొన్ని భేదాలున్నాయి.

కన్యాశుల్కం రెండవ కూర్పులో

మార్చు

కన్యాశుల్కం నాటకంలో తొలిసారిగా విజయనగరంలోని బొంకుల దిబ్బ వద్ద గిరీశం ప్రవేశిస్తాడు. వేశ్య అయిన మధురవాణిని ఉంచుకుని, పూటకూళ్ళమ్మతోనూ నేస్తం కట్టి, సంబంధం కలిగివుండి రోజులు నడుపుతూ ఉంటాడు. ఊరి నిండా ఆడంబరాలకు చేసిన అప్పులు గొంతుమీదికి వచ్చాయి. పూటకూళ్ళమ్మ కూరలకు ఇచ్చిన డబ్బు డాన్సింగర్లు మీద ఖర్చుచేశాడు. వీటన్నిటివల్లా సమస్యలు ఎదురు కావడంతో ఏదోక మిషతో విజయనగరం నుంచి తప్పుకోవాలని ప్రయత్నించాడు.[1] ఈ క్రమంలో అవసరార్థం జనం నుంచి తప్పుకోవడానికి మధురవాణి మంచం కింద దాక్కుని తాను తినవలసిన చీపురు దెబ్బలు ఒడుపుగా రామప్పంతులుకు తగిలేలా చేస్తాడు. చదువు చెప్తానని మభ్యపెట్టి వెంట తిప్పుకుంటున్న శిష్యుడు వెంకటేశం సాయంతో అతనికి సెలవుల్లో చదువు చెప్పే మిషతో వెంకటేశం ఊరైన కృష్ణరాయపుర అగ్రహారానికి జారుకుంటాడు.[2]

సెలవుల్లో వెంకటేశానికి పాఠాలు చెప్పడం మాని, అతని అక్క బుచ్చమ్మకు ప్రేమ పాఠాలు చెప్పడం ఆరంభిస్తాడు. బాల్య వివాహం చేసుకుని, చిన్ననాటే భర్త చనిపోయిన బుచ్చమ్మ గిరీశం మాటల్లో "యంగ్ బ్యూటిఫుల్ విడో".[2] బుచ్చమ్మను పెళ్ళిచేసుకుంటే కీర్తి సుఖం కూడా దక్కుతాయన్నది గిరీశం ఉద్దేశం. విడో రీ మారియేజి అసోసియేషన్ వాళ్ళు తృణమో పణమో ఇస్తారు, దానికి తోడు బుచ్చమ్మకీ కొంత ఆస్తి ఉంది. అతనికి అన్న వరసయ్యే లుబ్దావధాన్లనీ వల్లో వేసుకుంటే అతని ఆస్తికి వారసుడూ కావచ్చని గాలిలో మేడలు కడతాడు. వీటిన్నిటితో హాయిగా కాలక్షేపం చేయవచ్చు అనుకుంటాడు.[1] బుచ్చమ్మ తల్లి వెంకమ్మ నూతిలో దూకినప్పుడు గిరీశం తన లవ్ ఇంట్రెస్టు కోసం వెనుకనే దూకేసి కాపాడతాడు. అమాయకురాలైన బుచ్చమ్మని ప్రేమలోకి దింపడానికి తమకు పెళ్ళైనట్టు, తాను పెద్ద ఉద్యోగం చేసి బంగళాలో కాపురం పెట్టినట్టు, పిల్లలు పుడితే ఆడించినట్టు, వెంకటేశాన్ని తమవద్దే చదివించినట్టు లేనిపోని కబుర్లు చెప్తాడు.[2] ఎన్ని కబుర్లు చెప్పినా బుచ్చెమ్మ బోల్తాపడదు. బుచ్చెమ్మ చెల్లెలు సుబ్బిని ఓ ముసలివాడికిచ్చి పెళ్ళిచేస్తున్న సమయంలో ఆ పెళ్ళికి అందరూ తరలివెళ్తుండగా, అలాంటి బాల్యవివాహాన్ని తప్పించడానికి తామిద్దరం లేచిపోవడం ఒక్కటే మార్గమని నమ్మించి బండిదారి తప్పించి బుచ్చెమ్మను తీసుకుపోతాడు.[1]

విజయనగరంలో సంస్కర్త, న్యాయవాది అయిన సౌజన్యారావు పంతులను ఆశ్రయిస్తాడు. అతనిని దారికి తెచ్చుకుని, ఉత్తముడినని నమ్మించేందుకు సౌజన్యారావులానే తాను కూడా వేశ్యా వ్యవస్థకి వ్యతిరేకిననీ, యాంటీ నాచ్ ని అని చెప్పుకుంటాడు. మధురవాణి వేరే సమస్యను పరిష్కరించేందుకు సౌజన్యారావు వద్దకు వచ్చినప్పుడు తన గురించి బయటపెట్టవద్దని గిరీశం బ్రతిమాలుకుంటే ఒప్పుకుంటుంది. కానీ, సందర్భవశాత్తూ గిరీశం చర్చ రావడంతో సౌజన్యారావు బలవంతంతో మధురవాణికి గిరీశం చరిత్రను చెప్పక తప్పదు. దానితో బుచ్చెమ్మలాంటి అమాయకురాలిని ఇతనికి ఇచ్చి పెళ్ళి చేసే ప్రసక్తి లేదంటాడు సౌజన్యారావు. చదువుకునేందుకు ఆర్థికంగా సాయం చేస్తాననీ, చదువు పూర్తిచేయమనీ తేలుస్తాడు.[1] బుచ్చెమ్మ పూనాలోని విడో రీమారియేజి సొసైటీకి పంపే ఏర్పాటు కూడా చేస్తాడు. దీనితో గిరీశం "డామిట్! కథ అడ్డంగా తిరిగింద"నుకుంటూ నిష్క్రమిస్తాడు.[3]

పూర్వ చరిత్ర

మార్చు

కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు అక్కడా ఇక్కడా గిరీశంతో చెప్పించినదాన్ని బట్టి నాటకానికి ముందు అతని చరిత్రను కె.వి.రమణారెడ్డి కల్పించాడు. దీన్నే ఆరుద్ర కూడా మరో వ్యాసంలో ఊహించాడు. ఇదిలా ఉంటుంది: గిరీశం తల్లి పుట్టినిల్లు రాజమహేంద్రవరం. ఆ ఊరికి చెందిన రామావధాన్లు గిరీశం మేనమామ. ఎక్కడో కృష్ణరాయపుర అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు రాజమహేంద్రవరం పేరు రాగానే రామావధాన్లునే ఎన్నిక చేశాడంటే అతను చాలా గట్టివాడని ఆరుద్ర అభిప్రాయం. పెత్తండ్రి కాకనాడలోకెల్లా తెలివైన ప్లీడరునని చెప్పుకుంటాడు, కాబట్టి అతని తండ్రిదీ కాకినాడే అయివుండవచ్చు. పెదతల్లి మెట్టిన ఊరు విశాఖ ప్రాంతానికి చెందిన రామచంద్రాపురం. ఆమె కుమారుడే లుబ్ధావధాన్లు. అంటే గిరీశానికి అన్న వరుస. గిరీశం కొన్నాళ్ళు పెదతల్లి వద్ద రామచంద్రాపురంలో పెరిగివుంటాడు. అతని వంకర వేషాలన్నీ రామచంద్రాపురంలో అందరికీ తెలిసినవే. ఈ వేషాల వల్లే ఊళ్ళోవాళ్ళంతా గిరీశాన్ని గిర్రడని పిలిచేవారని రామచంద్రాపుర అగ్రహారానికే చెందిన రామప్పంతులు గుర్తుచేసుకుంటాడు. వైదీకపు కుదురు కావడంతో చిన్నతనంలో తండ్రి తనచేత ఉపనిషత్తులన్నీ భట్టీయం వేయించాడని చెప్పడమే కానీ ఏ ఉపనిషత్తునూ ఉదహరించిన పాపాన పోడు. తెలుగు పద్యాల విషయంలోనూ విద్య అంతంతమాత్రమే. కాబట్టి చిన్నతనంలో సంస్కృతాంధ్రాలు చదివింది అరకొరేనని చెప్పవచ్చు. గిరీశం తండ్రి ప్రయోజకుడో, అప్రయోజకుడో తెలియదు.[4] ఎలాంటివాడైనా గిరీశానికి ఆస్తి పాస్తులేమీ మిగిల్చలేదన్నది మాత్రం స్పష్టం. కనీసం ఇంటికి రానిచ్చే స్థితి ఉందో లేదో కూడా అనుమానమే. కాబట్టే జానెడు పొట్టకోసం, బ్రతుకు తెరువు కోసం తిప్పలు పడాల్సి వచ్చింది.[1] అందువల్లనే మగసంతతి లేని లుబ్ధావధాన్లు అన్న ఆస్తి ఏమైనా అతని తదనంతరం దక్కుతుందేమోనని కనిపెట్టుకుని ఉంటాడు. అతనికి పెళ్ళయి పిల్లలు పుడితే తనకు మిగిలేదేమీ ఉండదనే సుబ్బి పెళ్ళి ఆపాడేమోనని రమణారెడ్డి సందేహించాడు. ఏం చదివాడన్నది తెలియదు కాదు కానీ పూనా డక్కన్ కాలేజీలో చదివానని చెప్పిన మాటలు మాత్రం వట్టి కోతలే. పట్నవాసాల్లో పెరిగి డక్కామొక్కీలు తిన్నందువల్ల ఇంగ్లీషులో పెద్ద చదువులు చదివిన భ్రమ కలిగించగలిగాడు. మధురవాణికి, డిప్యూటీ కలెక్టరు కొడుక్కీ చదువు చెప్పేంతవరకే చదివాడు. కాకినాడ-రాజమహేంద్రవరాల మధ్య తిరుగుతూన్న క్రమంలో సంస్కరణోద్యమ నాయకుడు వీరయ్య పంతులుతో పరిచయం, సాన్నిహిత్యం ఏర్పడింది. అలాగే అతనికి సంస్కరణోద్యమానికి సంబంధించిన సంగతులు తెలిసి, ఆ మాటలు అబ్బాయి. సౌజన్యారావు పంతులుకు గిరీశాన్ని పరిచయం చేస్తూ ఉత్తరం రాసే స్థాయికి వీరయ్య పంతులును గిరీశం నమ్మించగలిగాడు. ఇంతవరకూ కె.వి.రమణారెడ్డి ఊహించాడు. ఆరుద్ర ఊహ ప్రకారం ఇతని విద్యాభ్యాసం కాకినాడ, రాజమహేంద్రవరంలో ఏదో మేరకు జరిగివుండవచ్చు. కాబట్టే సంస్కరణోద్యమ నాయకుడు, తన గురువు వీరయ్య పంతులుతో అనుబంధం ఏర్పడివుంటుందనీ, అతనితో ఏదో సందర్భంలో పూనా వెళ్ళి వచ్చివుంటాడనీ ఆరుద్ర భావించాడు.[4]

ఇతర రూపాల్లో

మార్చు

కన్యాశుల్కం తొలి కూర్పులో చివరిదైన ఐదవ అంకంలో మధురవాణి కాక సౌజన్యారావు పంతులే గిరీశం రంగు తెలుసుకుని చదువుకొమ్మని, సహాయం చేయిస్తానని పంపేస్తాడు.[5] డి.ఎల్.నారాయణ నిర్మాతగా, పి.పుల్లయ్య తీసిన 1955 నాటి కన్యాశుల్కం సినిమాలో మరికొన్ని మార్పులు కనిపిస్తాయి. సినిమా ప్రకారం గిరీశం చివరిలో మంచివాడిగా మారిపోతాడు. అతనికీ, బుచ్చమ్మకీ పెళ్ళి జరుగుతుంది.[6] గురజాడ అప్పారావు రాసిన మరో నాటకం కొండుభొట్టీయంలో గిరీశం పాత్రను మళ్ళీ ప్రవేశపెట్టినా, ఆ పాత్ర తీరుతెన్నులు మారిపోయాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన వ్యంగ్య వ్యాసాలైన గిరీశం లెక్చర్లలో గిరీశం సినిమా రచయితనని కోస్తూంటాడు. పుస్తకాల గురించి ఒకటి, కొటేషన్ల గురించి మరొకటి, గురజాడ అప్పారావుది శబ్దాశ్రయ హాస్యమన్న విమర్శపై ఇంకొకటి తప్పించి మిగతా లెక్చర్లన్నీ సినిమాల మీదే ఉంటాయి.[7]

నేపథ్యం

మార్చు

నిజ జీవిత ప్రభావం

మార్చు

గిరీశం పాత్ర మరెవరో కాదు స్వయానా గురజాడ అప్పారావేనని బుర్రా వెంకట శేషగిరిరావు విశ్వసించేవాడు. దాన్ని అతని నుంచి విని, నమ్మిన కొడవటిగంటి కుటుంబరావు గిరీశం పాత్రలోని మంచి లక్షణాలు ఎత్తిచూపుతూ వ్యాసాలు రాశాడు. అయితే కె.వి.రమణారెడ్డి ఈ వాదన కొట్టిపారేస్తూ "హతోస్మి! ఏ పాత్ర అయినా రచయిత చేతిబంకమన్నే.. అప్పారావు హాస్యం, అపహాస్యం, చమత్కారం, సూక్ష్మబుద్ధి గిరీశానికి సంక్రమించాయి" తప్ప గిరీశం అప్పారావు అంశ కాదని వ్యాఖ్యానించాడు. అంశ కాకపోవడం అటుంచి కనీసం అభిమాన పాత్ర కూడా కాదనీ, కాబట్టే తన్ని తగలేయగలిగి నాటక లక్ష్యాన్ని కాపాడుకోగలిగాడని రమణారెడ్డి వాదన.[4]

కొంతమంది సాహిత్యవేత్తలు గిరీశానికి గురజాడకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఒక నిజ జీవిత మాతృక ఉండివుంటుందని ఊహించారు. నిష్టల చలపతిశాస్త్రి, చిరంజీవి, వేములకొండ సీతారామమూర్తి కుమారుడు వంటి నిజ జీవిత వ్యక్తుల పేర్లు ఆ క్రమంలో తెరమీదికి వచ్చాయి. వేములకొండ సీతారామమూర్తి కొడుకు గిరీశానికి మూలం అన్న విషయాన్ని గురజాడే స్వయంగా ఎవరితోనో చెప్పినట్టు పి.ఎస్.ఆర్.అప్పారావు రాశాడు. అయితే ఎవరితో చెప్పాడు, ఎక్కడ చెప్పావు వంటి వివరాలు లేవు. అయితే గురజాడకు ఎవరైనా విశిష్ట లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎదురుపడితే ఆ వివరాలు, వారి విలక్షణత ఓపికగా పుస్తకానికెక్కించి, తర్వాత వాడుకునే లక్షణం గురజాడ వారికి ఉందని కె.వి.రమణారెడ్డి రాశాడు. అయితే ఆ మాతృక కేవలం ఒక వ్యక్తి అయివుండదనీ, ఎందరో వ్యక్తుల్లోని లక్షణాలు, గుణాలు గిరీశంలాంటి పాత్రలో లీనమై ఉంటాయని, అంతేకాక గురజాడకు పాత్ర సృష్టించేప్పుడు తన పూర్వ సాహిత్య ప్రభావమూ ఉండేదని రమణారెడ్డి సూచించాడు.[4]

సాహిత్య ప్రభావం

మార్చు

గురజాడ రూపొందించిన గిరీశం పాత్ర, మృచ్ఛకటికమ్‌ అన్న సంస్కృత నాటకంలోని శకారుని పాత్రల నడుమ కొన్ని పోలికలున్నాయని విమర్శకుల అభిప్రాయం.[4] అయితే శకారుడు రాజుగారి బావమరిది, గిరీశం ఈ పూటపూటకు ఏదోలా గడుపుకోవాల్సిన బికారి. కానీ గిరీశం తెలిసినదీ, తెలియనిదీ కలిపి డబాయించేదీ, శకారుడు మూర్ఖుడిలా వ్యవహరించేదీ తాము అనుకున్న పనులు సాగించుకోవడానికే. ఇద్దరూ సమయానుకూలంగా చక్రం తిప్పగల ప్రాప్తకాలజ్ఞులే. కాకపోతే బికారి అయిన గిరీశానికి విధి నిత్యమూ ఎదురు తిరుగుతూనే ఉండి ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించాల్సిన అగత్యం కల్పిస్తూండగా, శకారునికి మాత్రం హత్యచేసి తప్పించుకోవాల్సిన విషమ పరిస్థితి వచ్చినప్పుడే చక్రం తిప్పాల్సిన అవసరం ఎదురొస్తుంది. అలానే కించిత్తు అధికారం చూపగల అవకాశమే వస్తే గిరీశమూ శకారునికి సమానంగానే దాన్ని ప్రదర్శిస్తూంటాడు. రాంభట్ల కృష్ణమూర్తి పాత్రల మధ్య భేదాలను, సారూప్యాలను - "అనుకున్నట్లు హైదరాబాదు నవాబు గారి దగ్గర ముసాహిబుద్యోగమే అయి హమేషా హుజూర్న ఉండగలిగే అదృష్టమే పట్టివుంటే అప్పుడు ఈ శకారుడికి తీసిపోయేవాడా గిరీశం?; మొదటినుంచీ ఎక్కడ బిఛాణా వెయ్యాలన్న సమస్యేవుంటే పూర్రిచర్డుని తలుచుకోకపోయేవాడా శకారుడు?" అంటూ విశ్లేషించాడు.[8]

అన్నిటిలోనూ ఉండి దేనితోనూ గట్టి ప్రమేయం లేకపోవడమనే లక్షణాన్ని సామాన్య ధర్మంగా తీసుకుని చార్లెస్ డికెన్స్ రాసిన పిక్నిక్ పేపర్స్ లోని జింగిల్ పాత్రకు, కన్యాశుల్కంలోని గిరీశానికి పోలిక తెచ్చాడు సర్దేశాయి తిరుమలరావు.[4] గిరీశం పాత్రకీ, విలియం షేక్‌స్పియర్ రాసిన హెన్రీ IV నాటకంలోని ఫాల్ స్టాఫ్ అన్న పాత్రకీ ఉన్న పోలికలు ఆర్.యస్.సుదర్శనం వివరించాడు. వాగ్ధోరణి, వయసు, రూపురేఖలు, అభిరుచులు, వగైరాల్లో భేదాలున్నా, వారిద్దరికీ జీవితం పట్ల ఉన్న దృక్పథం ఒకటేననీ, వారు జీవితంలో దేన్నీ సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల, జీవితం అనుభోగ్యవస్తువై, ఇతర పాత్రలన్నీ వారిద్దరికీ సాధనోపకరణాలుగా మారిందనీ సుదర్శనం భావించాడు.[4]

చారిత్రక నేపథ్యం

మార్చు

గిరీశం ప్రవర్తన వెనుక కారణంగా అతని స్థలకాలాల యుగలక్షణాలను వివరించిన విమర్శకులు ఉన్నారు. అప్పటిదాకా ఉన్న భూస్వామ్య వ్యవస్థ బలహీనపడి, ఆచారాలు నీరసించి, కొత్త వ్యవస్థ తోసుకువచ్చే దశ కన్యాశుల్కం నాటిది. అప్పటికే బెంగాల్లో జరుగుతున్న సంస్కరణోద్యమాలు, బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ దశలో కొత్త చదువు సంధ్యల ద్వారా పొట్టపోసుకోవడానికి తిప్పలు పడేవారి మహాజనంలో గిరీశం ఒకడు. అయితే ఆ క్రమంలో స్థిరపడినవారు కొందరు ఉండగా, స్థిరపడకుండా కొత్తలోనూ, పాతలోనూ ఉన్న దుర్లక్షణాలు మాత్రమే అలవరుచుకున్న దౌర్భాగ్యుడు ఇతను. రాంభట్ల కృష్ణమూర్తి దీన్నే వివరిస్తూ "రాజస" సమాజంలో ఉండి "కౌబేర" లక్షణాల తొలి రేకలు సోకినవాడే మన గిరీశం అన్నాడు.[4]

ప్రాధాన్యత, ఉద్దేశం

మార్చు

గిరీశం పాత్ర కన్యాశుల్కం నాటకంలో నాయక పాత్ర కాదు. ఆ పాత్ర వల్ల కథలో ప్రధానమైన సంఘటనల్లో మార్పులు ఏర్పడవు. అలాగని కేవలం హాస్యానికి ఏర్పడ్డ విదూషక పాత్రా కాదు. ప్రధానమైన సంఘటనలు అన్నిటిలో అతని చేయి అంతో ఇంతో లేకుండా నాటకం సాగదు. కాబట్టి ఉప నాయకుడు అనుకోవడానికి సాధ్యం కాదు. ఇక ప్రతినాయకుడు అసలే కాదు. నాయకుడూ, ఉపనాయకుడు, విదూషకుడు, ప్రతినాయకుడు ఏదీ కాని ప్రాధాన్యమున్న విచిత్రమైన పాత్ర - గిరీశం. నాటకంలోని ప్రధాన ఇతివృత్తాన్ని మార్చే ఘటనలకు కేంద్రం కాకున్నా, సుబ్బి పెళ్ళి తప్పించే గందరగోళంలో బుచ్చెమ్మను తీసుకుపోవడం కొంత తోడ్పడింది. ఇక నాటకంలోని ప్రధానమైన ఉప కథలకు అతనే ఆయువు పట్టు.[4]

స్వభావం, స్థితిగతులు

మార్చు

గిరీశం ద్వేషించదగిన పాత్ర కాదు. అలాగే నెత్తిన బెట్టుకుని పూజించ దగిన వాడు కాదు. ఒక్కోసారి కోపం, ఒక్కోసారి విసుగు కలిగిస్తాడు.

-కె.వి.రమణారెడ్డి, గురజాడ వారి గిరీశం, నాట్యకళ, ఏప్రిల్-మే 1971

చిన్నా చితకా నేరాలు, మీద పడి తన్నడాలు, అప్పులు ఎగ్గొట్టడాలు, స్త్రీలతో విచ్చలవిడి శంగార సంబంధాల యావ, వివాహితలైన యువతులకు లవ్‌ లెటర్లు రాయడాలు, ఆధునికత ముసుగులో, ఒక నేరపూరిత, దగుల్బాజీ మనస్తత్వం గల వ్యక్తి.[9] మాటలు చెప్పి మభ్యపెట్టేందుకు సరిపడా తప్ప ఉద్యోగం చేయగలిగేంత చదువు చదివినవాడు కాడు. కానీ హైదరాబాద్ నవాబు నెలకు వెయ్యి హాళీ సిక్కాలిస్తామని హమేషా తమతో ఉండమని పిలిచారని చెప్పుకు తిరుగుతూంటాడు.[2] దొంగ పెద్దమనుషులకు ప్రతీకగా ఈ పాత్రను గురజాడ సృష్టించాడని ద్వానా శాస్త్రి విశ్లేషించాడు. ఒక సిద్ధాంతం, లక్ష్యం లేకుండా స్వప్రయోజనం కోసం ఇతరులు కష్టపడినా పట్టించుకోని పద్ధతి ఇతనిది.[10]

పూట గడవని పక్కా ఫకీరు గిరీశం. ఈ పూటకు ఎక్కడ బిచాణా వెయ్యాలన్నదే ఎప్పుడూ అతని తక్షణ సమస్య. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అతనికి ఉన్న శక్తులు: వాగ్ధాటి, చురుకైన బుద్ధి.[1] అబద్ధాలూ, మోసాలు - ఆత్మరక్షణకు సాధనంగా వాడుకున్నాడు. వీలు, అవకాశం జీవితాదర్శాలు. ఆత్మరక్షణ కోసం, పూట గడుపుకోవడం కోసం వెంకటేశంతో వచ్చి బుచ్చమ్మను తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. ఉన్న ఆస్తి వెంట్రుకలే, ఎప్పటికప్పుడు కొండకు ఆ ఉన్న వెంకట్రుకే వేసే తత్వం అలవరుచుకున్నాడు. క్షణాల్లో అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకుంటాడు. మాటల్లోనూ, అభిప్రాయాల్లోనూ ఏముంది పని జరగాలన్నదే ఉద్దేశం. గిరీశంలోని ప్రత్యేకత తరగని ఉత్సాహం.[4][11] కథ అడ్డం తిరిగినా మరో కాంపేనుకు అవకాశం వెతుక్కోవడమే తప్ప నిరుత్సాహపడడం, నీరసించడం తెలియని విద్యలు. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తొణకడం బెణకడం అతని వల్ల కాని పనులు. అతని కోణంలో ఇదంతా ఒక ఆట. ఆటలో జయాపజయాలు దైవాధీనాలన్నట్టే ఎదురయ్యే ఫలితాలనూ గిరీశం తీసుకుంటాడు.[11]

నాటక రచయిత, విమర్శకుడు శ్రీనివాస చక్రవర్తి విశ్లేషణ ప్రకారం గిరీశం పాత్ర ప్రవర్తనకు కారణం "వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు ఆర్పి మేడలు మిద్దెలు కడదా"మని కాదు, "జానెడు పొట్ట కోసరం, బ్రతుకు తెరువు కోసం తిప్పలు పడ్డాడు." గిరీశాన్ని "హాని లేని మనిషి"గానూ, "ఎవరికీ అపకారం చేసి ఎరగ"ని వాడనీ వ్యాఖ్యానించాడు. ఆ పాత్రలోని కీలకం ఇది కాబట్టే దానిపై అసహ్యం కలగదని, లేకుంటే నాటకం రక్తి కట్టేది కాదనీ భావించాడు.[1] మరోవైపు అతను నూతిలో పడ్డ వెంకమ్మను బయటకు తీయడం అగ్నిహోత్రావధాన్లు ఇంట్లో ఆడిన నాటకంలో భాగమేనని ఉద్దేశాన్ని బట్టి కొట్టిపారేసిన విశ్లేషకులూ ఉన్నారు. ఆ విధంగా నైతిక దృష్టితో చూస్తే గిరీశంలో మెచ్చదగ్గదేమీ ఉండదు. అయితే చెడ్డ పాత్ర అయిన గిరీశంలో తెలియని ఒక ఆకర్షణ సృష్టించి, అతన్ని చూసి నవ్వాల్సిన సందర్భంలో అతనితో కలిసి నవ్వేలా అతని ఉద్దేశాలకు సంబంధం లేకుండా అతనితో ఒక విధంగా ప్రేక్షకులు మమేకం అయ్యేలా చేశాడంటూ నాటక కర్త ఔచిత్యాన్ని యస్.టి.నరసింహాచారి విమర్శించాడు. "పార్వతీశంలా మొదట నవ్వేసినా పాపం అమాయకుడని జాలిపొందే రకం కాదు. గిరీశాన్ని చూచి నవ్వే సాహసం మనకు లేదు. ఆ గడుగ్గాయి చేతిలో ఆంధ్రులు పూర్తిగా ఓడిపోయారు. స్వయంగా గురజాడ వారే నీ మానాన్న పొమ్మని వదిలేస్తే ఇతరులు చేసేదేం లేదు" అని అతను తేల్చాడు.[11]

గిరీశం పాత్ర బాల్యవివాహం నిర్మూలన, వేశ్యాలోలత్వ వ్యతిరేకత, విధవా పునర్వివాహం వంటి సంఘ సంస్కరణ లక్ష్యాలను గిరీశంలాంటి మోసగాడు భుజాన వేసుకోవడం వల్ల వాటి ఉద్దేశాలకే భంగకరంగా నాటకం రాశాడని కొందరు విమర్శకులు భావించారు. కానీ మరికొందరు విమర్శకులు సంఘ సంస్కరణోద్యమ లక్ష్యాలతో గురజాడకు ఏమీ వ్యతిరేకత లేదనీ, వాటి ఆచరణపైనే అతని అభ్యంతరమని, అలా సంస్కరణోద్యమ ఆచరణలోని కప్పదాట్లను ఎత్తిచూపడమే గిరీశం పాత్ర సాధించిన లక్ష్యమని విశ్లేషించారు. కన్యాశుల్కంలో గిరీశం పాత్ర చివరి దాకా ఏ మార్పూ లేకుండా, మారదామన్న సంకల్పం కూడా రాకుండా తన వంకర బుద్ధిని కొనసాగిస్తూ సాగుతుంది. బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం వంటి అతికొద్ది మంది విమర్శకులు దీన్ని అసహజమని, ఆ పాత్ర సహజ వికాసాన్ని దెబ్బతీసశారని విమర్శించారు. నిజానికి ఇలా మారని లక్షణమే ఆ పాత్రని చిరంజీవిని చేశాయని చాలామంది విమర్శకుల అభిప్రాయం.[4]

ఇతర రూపాల్లో

మార్చు

కొండుభొట్టీయం నాటకంలో గురజాడ మళ్ళీ గిరీశాన్ని ప్రవేశపెట్టినా, ఆ పాత్రకీ అసలు అతనే కన్యాశుల్కంలో సృష్టించిన పాత్రకీ సంబంధం లేదు. కొండుభొట్టీయంలోని గిరీశంలో అతని సహజ లక్షణమైన ఉత్సాహం కనిపించదు. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవడం, దేన్నీ లోతుగా పట్టించుకుని మనసుకెక్కించుకోకపోవడం వంటి కన్యాశుల్కం గిరీశం లక్షణాలు ఇతనిలో కనిపించవు. కాబట్టి కేవలం అనుకరణ పాత్రగా విమర్శకులు కొట్టిపారేశారు. ఐతే, అక్కడా ఇక్కడా లెక్చర్లు దంచానని గిరీశం పాత్ర కన్యాశుల్కంలో అన్న మాటను పట్టుకుని గరీశం లెక్చర్లు రాసిన ముళ్ళపూడి వెంకటరమణ మాత్రం మౌలికమైన గిరీశం స్వభావాన్ని పట్టుకున్నాడు. అందుకే సాహిత్య విమర్శకుడు ఎమ్వీయల్ "మాటలోను, చేతలోను [కన్యాశుల్కంలోని] గురజాడ గిరీశానికి అచ్చుకట్టినట్టు కనపడతాడు ముళ్ళపూడి గిరీశం" అంటాడు.[7] అయితే భాష విషయంలో విజయనగరం మాండలీకాన్ని ఉపయోగిస్తూ, గురజాడకు విధేయంగా ఉంటూనే ముళ్ళపూడి వెంకటరమణ గిరీశంతో తనదైన శైలిలో లెక్చర్లిప్పించాడు. అందుకే ముళ్ళపూడి వెంకటరమణ శైలిలోని పదాల చమక్కులు ఇందులోనూ కనిపిస్తాయి.[12]

ప్రాచుర్యం

మార్చు

కన్యాశుల్కం నాటకం, దానితో పాటు గిరీశం పాత్ర తెలుగు నాట చాలా ప్రాచుర్యం పొందాయి. "తెల సంస్కారం లేని జుట్టుతో, పొడుగు లాల్చీ వేసుకుని కొంచెం నిర్లక్ష్యముగా నడచిపోతూంటే గిరీశం ఫోజులో ఉన్నావని చమత్కరించడం చాలాసార్లు విన్నామ"ని ఆ పాత్ర తీరుతెన్నులు తెలుగు వారి నిత్యజీవితంలో చేరిపోవడాన్ని గురించి రాశాడు ఎస్.టి.నరసింహాచారి. ప్రగతి వారపత్రికలో 1969 మార్చి 21న కె.వి.రమణారెడ్డి రాసిన "గిరీశం:ది పొయెట్" అన్న వ్యాసానికి సమాధానంగా కొడవటిగంటి కుటుంబరావు మరొక వ్యాసం రాశాడు, క్రమేపీ ఆ చర్చలోకి మరింత మంది వచ్చి ఆ వ్యాస పరంపర నాలుగు నెలల పాటు సాగి ఆగస్టు 8న ముగుస్తూ పాత్రలోని విభిన్న కోణాలను ఆవిష్కరించింది. ఈ గొలుసుకట్టు వ్యాసాలు సాహిత్య విమర్శకులను ఈ పాత్ర ఎన్ని విధాల ఆకర్షించిందన్నది, ఎంతగా దుర్భేద్యంగా నిలిచిందన్నదీ తెలుసుకోవడానికి ఒక సూచిక.

ఇత సాహిత్య రచనల్లో, సినిమాల్లో

మార్చు

గిరీశం పాత్ర విపరీతమైన ప్రజాదరణ పొందడంతో ఇతర సాహిత్య రూపాల్లోనూ, సినిమాల్లోనూ గిరీశం పాత్రను రచయితలు ప్రవేశపెట్టారు. కన్యాశుల్కం రెండు కూర్పులు, దాని ఆధారంగా వచ్చిన సినిమా కాకుండా గిరీశం కనిపించే సినిమాలు ఇవి:

  • గురజాడ అప్పారావు రాసిన "కొండుభొట్టీయం" అన్న అసంపూర్ణ నాటకంలో గిరీశం పాత్ర వస్తుంది. సంఘ సంస్కారం గురించి మాట్లాడుతూ, వేరే అంతస్థులో ఉన్నట్టు కనపడతాడు. ఒక విధంగా చూస్తే పేరు, పైపైన లక్షణాలే తప్ప మిగతా అంతా వేరే పాత్రలా కనిపిస్తుంది.[4] గురజాడ తన సృష్టిని తానే బలహీనంగా అనుకరించినట్టుగా కనిపిస్తుంది ఈ సందర్భంలో.
  • కన్యాశుల్కంలో గిరీశం డైలాగుల్లో పలుమార్లు ఫలానా చోట లెక్చర్లిచ్చాను అనడాన్ని తీసుకుని ముళ్ళపూడి వెంకటరమణ "గిరీశం లెక్చర్లు" రాశాడు. ఇవి గిరీశం లెక్చర్లు ఇస్తున్నట్టు సాగే వ్యంగ్య వ్యాసాలు. వీటిలో గిరీశం సినిమాల గురించి, రాజకీయాల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూంటాడు.
  • బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకట రమణ రాసిన రాంబంటు సినిమాలో ప్రతినాయకుడి పాత్ర గిరీశం పాత్రే. పేరు, రూపం, తీరుతెన్నులు అంతా గురజాడ రూపొందించగా ప్రాచుర్యం పొందిన గిరీశం పాత్రనే స్వీకరించారు. ఈ పాత్రను కోట శ్రీనివాసరావు ధరించాడు.

సంభాషణలు

మార్చు

కన్యాశుల్కంలో గిరీశం సంభాషణల్లో కొన్ని తెలుగు సాహిత్యంలోనే కాక జన జీవితంలో భాగంగా నిలిచిపోయాయి. కొందరు గిరీశం ఏకపాత్రాభినయం చేస్తూ, ఈ డైలాగులు చెప్పి జనాన్ని మెప్పించారంటే వాటి ప్రజాదరణ అర్థమవుతుంది.[13] వాటిలో కొన్ని:

  • నాతో మాట్లాడ్డవేఁ ఒక ఎడ్యుకేషన్‌
  • మనవాళ్ళు వుట్టి వెధవాయలోయ్‌
  • సూత ఉవాచ: ఖగపతి యమృతముతేగా, భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్, పొగచెట్టై జన్మించెను పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ
  • కుప్పుసామయ్యర్‌ మేడ్‌ డిఫికల్ట్‌
  • ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చెస్తూంటేనేగాని పోలిటిషను కానేరడు.
  • షేక్‌స్పియర్‌ పడ్డ అవస్థలో పడ్డాం!

పాత్రధారణ, రూపకల్పన

మార్చు

రంగస్థలంపై నాటకంగా కన్యాశుల్కం ప్రదర్శనల్లో గిరీశం పాత్రధారణకు పేరొందినవాడు జె.వి.రమణమూర్తి. 43 సంవత్సరాల పాటు నటన, దర్శకత్వం వహిస్తూ కన్యాశుల్కం ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ క్రమంలో గిరీశంగా రంగస్థలంలో వెయ్యిసార్లకు పైగా నటించి మెప్పించాడు.[14] 1990లో దూరదర్శన్ లో 13 వారాల పాటు ప్రసారమైన కన్యాశుల్కం టీవీ సీరియల్లోనూ జె.వి.రమణమూర్తే గిరీశంగా నటించాడు.[15] 1955లో విడుదలైన వినోదా వారి కన్యాశుల్కం సినిమాలో గిరీశం పాత్రను ఎన్.టి.రామారావు పోషించాడు.[6] 2005లో మాటీవీలో టీవీ సీరియల్ గా కన్యాశుల్కం వచ్చినప్పుడు అందులో గిరీశంగా గొల్లపూడి మారుతీరావు నటించాడు.[15] గొల్లపూడి రంగస్థల మీద కూడా పలుమార్లు ఈ పాత్ర ధరించాడు. అలనాటి గోవిందరాజుల సుబ్బారావు నుంచి నేటి ఉత్తేజ్ వరకు పలువురు నటులు రంగస్థలంపై ఈ పాత్ర పోషించినవారిలో ఉన్నారు. నిష్ఠల చలపతిశాస్త్రి, మండపాక కొండలరావు వంటివారితో గురజాడ అప్పారావే నటింపజేసి ఒక ఒరవడి పెట్టడంతో గోవిందరాజు సుబ్బారావు వంటి గొప్ప నటుడు పోషించినా వ్యతిరేక వ్యాఖ్యలే ఎదురయ్యాయి.[4] క్రమేపీ మెరుగుపెట్టుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దాని తీరుతెన్నులు బోధపరుస్తూ గోవిందరాజు సుబ్బారావు నటించసాగాడు. గిరీశం నాటకం ప్రకారం యువకుడే అయినా పలువురు నటులు 50 ఏళ్ళు దాటిన వయసులో ఈ పాత్ర ధరించారు. బాహ్య లక్షణాలు, వయసు ప్రతిబంధకంగా నిలిచినా సంభాషణలు రసవత్తరంగా చెప్పి మెప్పించారు.[16]

"బెంగాలీ కట్టుతెల్లధోవతి, పొడుగుచేతుల బనీను కనిపించేలా పలచటి నీలంరంగు వాయిల్ చొక్కా, లేత కనకాంబరం వన్నె చైనాసిల్కు తలపాగా, వెండిపొన్ను బెత్తం వగైరాలు" నాటక రంగం మీద గిరీశం పాత్ర తీరుతెన్నులు. గురజాడ సాహిత్యాన్ని చదివి ఆకళించుకుని, బాపు ఊహించి గీసిన బొమ్మల్లో గిరీశం తీరు వేరేగా ఉంది.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 శ్రీనివాస చక్రవర్తి. "గిరీశం పాత్రలోని కీలకం". In మొదలి, నాగభూషణశర్మ; ఏటుకూరి, ప్రసాద్ (eds.). కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం. pp. 479–483. Retrieved 4 March 2019. మొదట "పరిశోధన" ప్రత్యేక సంచికలో ప్రచురితం[permanent dead link]
  2. 2.0 2.1 2.2 2.3 "గిరీశం". ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు. హైదరాబాద్: మోనికా బుక్స్. 2002. p. 164, 165. Archived from the original on 2019-01-09. Retrieved 2019-03-04. 1958-62 మధ్యలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన తెలుగు వెలుగు శీర్షికకు పుస్తకరూపం
  3. గురజాడ, అప్పారావు (1909). "  సప్తమాంకము".   కన్యాశుల్కము. వికీసోర్స్. 
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 కె.వి.రమణారెడ్డి. "గురజాడ వారి గిరీశం". In మొదలి, నాగభూషణశర్మ; ఏటుకూరి, ప్రసాద్ (eds.). కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం. pp. 498–507. Retrieved 8 March 2019.[permanent dead link]
  5. గురజాడ, అప్పారావు (1897). "  పంచమాంకము".   కన్యాశుల్కము (తొలికూర్పు). వికీసోర్స్. 
  6. 6.0 6.1 "ఎన్టీఆర్‌ 'కన్యాశుల్కం' 60 ఏళ్లు". www.andhrajyothy.com. 25 August 2015. Archived from the original on 28 సెప్టెంబరు 2015. Retrieved 4 March 2019.
  7. 7.0 7.1 ఎమ్వీయల్ 1973, p. 116.
  8. రాంభట్ల కృష్ణమూర్తి. "గిరీశం - శకారుడూ". In మొదలి, నాగభూషణశర్మ; ఏటుకూరి, ప్రసాద్ (eds.). కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం. pp. 484–488. Retrieved 4 March 2019. మొదట "పరిశోధన" ప్రత్యేక సంచికలో ప్రచురితం[permanent dead link]
  9. రామతీర్థ. "ప్రశ్న, ప్రజ్ఞ, ప్రగతి: కన్యాశుల్కం త్రినేత్రాలు". www.prajasakti.com. Retrieved 4 March 2019.
  10. ద్వానా, శాస్త్రి. "కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి". ఈమాట. Archived from the original on 7 జనవరి 2014. Retrieved 4 March 2019.
  11. 11.0 11.1 11.2 యస్.టి.నరసింహాచారి. "గిరీశం పాత్ర చిత్రణం". In మొదలి, నాగభూషణశర్మ; ఏటుకూరి, ప్రసాద్ (eds.). కన్యాశుల్కం: నూరేళ్ళ సమాలోచనం. pp. 489–497. Retrieved 4 March 2019. మొదట "పరిశోధన" ప్రత్యేక సంచికలో ప్రచురితం[permanent dead link]
  12. ఎమ్వీయల్ 1973, p. 123.
  13. సి.హెచ్.సుశీలమ్మ 1996, p. 52.
  14. ఆచారం, షణ్ముఖాచారి. "సితార - వేదికపైనా... వెండితెరపైనా... వెలిగిన నటుడు!". సితార. Archived from the original on 9 నవంబరు 2018. Retrieved 4 March 2019.
  15. 15.0 15.1 "నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం". Sakshi. 14 August 2017. Retrieved 4 March 2019.
  16. జి.ఎల్.ఎన్., మూర్తి. "కన్యాశుల్కం నాటకానికి కొత్త వెలుగులు". sarasabharati-vuyyuru.com. సరసభారతి ఉయ్యూరు. Retrieved 4 March 2019.

ఆధార గ్రంథాలు

మార్చు

నోట్స్

మార్చు

ఉల్లేఖన లోపం: తెరిచే <ref> ట్యాగు సరిగ్గా లేదు, లేదా దాని పేరు సరైనది కాదు

"https://te.wikipedia.org/w/index.php?title=గిరీశం&oldid=4315034" నుండి వెలికితీశారు