తెలంగాణ సారస్వత పరిషత్తు

సాహితీ సంస్థ

తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. ఇది మొదట నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుతో 1943, మే 26న లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైంది. 1949లో దీనిని ఆంధ్ర సారస్వత పరిషత్తుగా పేరు మార్చారు. దేవులపల్లి రామానుజరావు ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశాడు. 2015 ఆగస్టులో ఈ సంస్థ పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు. ఇది బొగ్గులకుంట ప్రాంతంలో ఉంది.

తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్
సంకేతాక్షరంTSP (Telangana Sarashwath Parishad Hyderabad)
స్థాపన1949
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాద్,తెలంగాణ ఇండియా 504001
కార్యస్థానం
ఉత్పాదనsగ్రంథం సర్వస్వము
మాసపత్రిక, పుస్తకాలు,
సేవలు
సేవలుసాహితీ గ్రంథం ముద్రణ, ప్రచురణ,, సంబంధిత
కార్యక్రమాలు, సేవలు
సభ్యులుజీవితకాల, వార్షిక, సంస్థాగత,
వ్యక్తిగత సభ్యులు
అధికారిక భాషతెలుగు
అధ్యక్షుడుఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలంగాణ తొలి అధ్యక్షుడు
కార్యదర్శిడా.జె. చెన్నయ్య తెలంగాణ తొలి కార్యదర్శి

చరిత్ర

మార్చు

ఆంధ్రమహాసభ పదవ సమావేశాలు హైదరాబాదు‌లో జరుగుతున్నపుడు లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు ప్రభృతులు 1943 మే 26న రెడ్డి హాస్టల్లోని గ్రంథాలయంలో సమావేశమై, ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారానికై "నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్"ను ఏర్పాటుచేశారు[1]. దాని ప్రథమ మహాసభ 5 రోజుల తర్వాత (అనగా జూన్1న) జరిగింది. ఆ తర్వాత నుండి సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు, పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అడవి బాపిరాజు వంటి మహామహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారాన్ని విశాలాంధ్ర అంతటా విస్తరించి విశాలాంధ్రోద్యమాన్ని వేగతరం చేశారు. దేవులపల్లి రామానుజరావు ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశాడు.

ఈ పరిషత్తు తన కార్యకలాపాలతో తెలంగాణా ప్రజల్లో సంచలనాత్మక అస్థిత్వ చైతన్యాన్ని కలిగిస్తే ఉలిక్కిపడిన నిజాం, ముస్లిం/ఉర్దూ దురహంకారులు, గుండాలు పరిషత్తు సమావేశాలకు ఎన్నో ఆటంకాలు కలిగించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నిజాం రజాకార్ల (ముస్లిం దురహంకార స్వచ్ఛంద సైనికుల) అణచివేత చర్యలు తీవ్రతరం కావడంతో 16 నెలలు అజ్ఞాతవాసం చేసిన పరిషత్ పోలీస్‌చర్య అనంతరం నిజాం రాష్ట్రం భారతదేశంలో కలవడంతో నూతనోత్సాహంతో తన 5వ సమావేశాన్ని తూప్రాన్లో జరుపుకొంది. ఆంధ్ర సారస్వత పరిషత్ తన శాఖలను తెలంగాణాతో పాటు ఆంధ్ర, రాయలసీమలకు, బీదర్, గుల్బర్గా, బెంగుళూరు, రాయచూర్ మొదలైన కర్ణాటక ప్రాంతాలకు, సేలం, హోసూర్, కె.జి.కండ్రిగ, మద్రాస్ మొదలైన తమిళ ప్రాంతాలకు, బొంబాయి, పూనా, షోలాపూర్, నాందేడ్, దేగ్లూర్ మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలకు, మారిషస్ దేశానికి కూడా విస్తరించింది. అలా 1973 నాటికి ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖల సంఖ్య 375కి చేరింది.

ఈ కృషిలో మధ్యతరగతి మేధావులదే కాదు, నస్పూరు (ఆదిలాబాద్ జిల్లా), వనపర్తి వంటి సంస్థానాధీశుల పాత్రా ఉంది.

హైదరాబాదు లోని బొగ్గులకుంట ప్రాంతంలో కొంత స్థలాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుంది. లీజు కాలం ముగియడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొనే పరిస్థితి వచ్చింది. దానితో పాతికలక్షలు పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డబ్బులో ఎక్కువ మొత్తం రెడ్డి లాబ్స్ అధినేత అంజిరెడ్డి విరాళంగా ఇచ్చాడు. సి.నారాయణ రెడ్డి తన ఎం.పి. నిధుల నుండి పాతిక లక్షలతో ఈ సంస్థ ప్రాంగణంలో పండిత శిక్షణ కళాశాలకు భవనాన్ని నిర్మించాడు. ఈ సంస్థ 1973లో రజతోత్సవాలను, 1994లో స్వర్ణోత్సవాలను, 2004లో వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంది.

ఆశయాలు

మార్చు

కార్యవర్గం

మార్చు

కార్యక్రమాలు

మార్చు

హైదరాబాదు, ఇతర తెలంగాణా జిల్లాల్లో సంక్రాంతి, ఉగాది మొదలగు పండుగల సమావేశాలు, ఆంధ్ర మహాకవుల జయంత్యుత్సవాలు, కవిసమ్మేళనాలు, ప్రబోధ సప్తాహములు నిర్వహించడం, ఖండవల్లి బాలేందు శేఖరం గారి ఆంధ్రుల చరిత్ర (1944) వంటి గ్రంథాలను ప్రచురించడం, తెలుగు భాషా సాహిత్యాల్లో మెట్రిక్ స్థాయిలో ప్రవేశ పరీక్షలు జరిపి (1944 జూలై నుండి) హైదరాబాదు ప్రభుత్వానికి తెలుగు ఉపాధ్యాయులను పంపడం మొదలైన కార్యక్రమాలను చేపట్టింది. గ్రంథ ప్రచురణ, గ్రంథాలయ నిర్వహణ, తెలుగులో బోధన, పరీక్షల నిర్వహణ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది పరిషత్. పండిత, ప్రజా, బాల సారస్వతాలు అనే మూడు విభాగాల్లో సుమారు రెండువందల పుస్తకాలను ప్రచురించి అతితక్కువ ధరలకు విక్రయించింది. తెలుగునాట మొట్టమొదటిసారిగా జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించింది పరిషత్తే. పరిషత్ ప్రచురించిన సురవరం ప్రతాపరెడ్డి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర"కు 1955లో వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డే తెలుగులో మొదటిది. రామాయణ, భారత, భాగవతాది ప్రఖ్యాత గ్రంథాలెన్నింటిపైనో వ్యాఖ్యానాలు, హాస్య విమర్శలను పరిషత్ ప్రచురించింది. ఎన్నో ప్రఖ్యాత గ్రంథాలను సేకరించి గ్రంథాలయాన్ని నిర్వహించింది. 1952లో హైదరాబాదు‌లో నిర్వహించిన అఖిల భారత గ్రంథాలయ మహాసభలకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా పనిచేసింది. లక్ష్మణరాయ పరిశోధక మండలికి, తెలంగాణా రచయితల సంఘ స్థాపనకు, అఖిల భారత తెలుగు రచయితల సమావేశాలకు, యువభారతి సాహిత్య కార్యక్రమాలకు, తెలుగు లిపి సంస్కార కార్యక్రమాలకు, సారస్వత వేదికకు కేంద్రంగా పనిచేసింది.

1950 నుండే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయం పొందినా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషలో విద్యాబోధనను వ్యతిరేకించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రభుత్వ వ్యవహారాలూ తెలుగులో జరిగేటట్లు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించింది. 1945 అక్టోబరు నుండి ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలను నిర్వహించింది. 1951 మార్చి నుంచి ఉన్నత స్థాయిలో విశారద పూర్వభాగం, 1953 మే నుండి విశారద ఉత్తరభాగం పరీక్షలను నిర్వహించి విశారదను ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా ప్రవేశ పరీక్ష (ఓరియంటల్ లాంగ్వేజ్ ఎంట్రన్స్) తో సమానంగా గుర్తించేటట్లు చూసింది. ఈ పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు దాని శాఖలన్నింటిలోనూ నిర్వహించినట్లే, 1964 దసరా (అక్టోబరు 22) నుండి తెలుగు పండిత శిక్షణ కళాశాలను 1962లో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించిన భవనంలో నిర్వహించింది. డి.ఓ.యల్., బి.ఓ.యల్, ఎం.ఓ.యల్ కోర్సులను 1965 సంక్రాంతి (జనవరి15) నుండి సాయంకాలం కళాశాలలో, ఆగస్టు 27 నుండి డే కళాశాలలో నిర్వహించింది.

బడికి పోలేని పిల్లలు, స్త్రీ పురుష వయోజనుల్లో తెలుగు విద్యను వ్యాప్తి చేయడానికి హైదరాబాదు‌లో 1950 జూన్‌లో వయోజన విద్యా శిక్షణ కేంద్రమును స్థాపించి 1950-54 మధ్య తెలంగాణాలో 64, సింగరేణి, కొత్తగూడెం, బెల్లంపల్లి మొదలైన బొగ్గు గనుల కార్మికుల కోసం 16, బొంబాయి తదితర రాష్ట్రేతర ప్రాంతాల తెలుగు కార్మికుల కోసం మరికొన్ని అన్నీ కలిపి సుమారు 130 వయోజన/ రాత్రి పాఠశాలలను, 1954-56 మధ్య ప్రభుత్వ సహకారంతో 19 సాంఘిక సంక్షేమ విద్యా కేంద్రాలను నడిపింది. పరిషత్ తెలుగు సాంస్కృతిక కళలనూ పోషించింది. తన వార్షికోత్సవాలలో 1952 అక్టోబరు నుండి నటరాజ రామకృష్ణ చేత హైదరాబాదు‌లోని పలుచోట్ల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఇప్పించింది. కొండపల్లి శేషగిరి రావు, కె.రాజయ్యల చేత చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది. 'రసరంజని' నాటకాలకు ఉచితంగా ఆడిటోరియాన్నిచ్చింది. అయ్యదేవర కాళేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు పరిషత్‌ను విశాలాంధ్రోద్యమ కేంద్రంగా నడిపారు.

పురస్కారాలు

మార్చు

ప్రచురణలు

మార్చు
  1. ఆంధ్రమహాభాగవతోపన్యాసములు - మల్లంపల్లి సోమశేఖరశర్మ
  2. హిందువుల పండుగలు - సురవరం ప్రతాపరెడ్డి
  3. భాగవత పాఠపరిశోధనము - దీపాల పిచ్చయ్యశాస్త్రి
  4. శ్రీ శివరాత్రి మహాత్మ్యము - శ్రీనాథుడు
  5. శివరాత్రి మహాత్మ్యము - బిరుదురాజు రామరాజు
  6. ప్రాక్పశ్చిమ తత్త్వశాస్త్ర చరిత్ర (రెండు భాగాలు) - సరిపెల్ల విశ్వనాథ శాస్త్రి
  7. మనదేశం-తెలుగుసీమ - దేవులపల్లి రామానుజరావు
  8. నా రేడియో ప్రసంగాలు - దేవులపల్లి రామానుజరావు
  9. సినారె సాహిత్యసమాలోచన - దేవులపల్లి రామానుజరావు
  10. కృష్ణ శతకము - బూర్గుల రామకృష్ణారావు
  11. పరుశురామ పంతుల లింగమూర్తి - దివాకర్ల వెంకటావధాని
  12. ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - దివాకర్ల వెంకటావధాని
  13. సాహిత్య సోపానములు - దివాకర్ల వెంకటావధాని
  14. దశరూపకసారము - గడియారం రామకృష్ణశర్మ
  15. పరిణతవాణి (6 సంపుటాలు) - సంపాదకుడు: డా.సి.నారాయణరెడ్డి
  16. తెలుగులో వెలుగులు[2] - చేకూరి రామారావు
  17. తెలుగు సాహిత్య వికాసం - కె.కె.రంగనాథాచార్యులు
  18. నూరేళ్ల తెలుగునాడు - కె.కె.రంగనాథాచార్యులు
  19. తెలుగు సాహిత్యం మరోచూపు - కె.కె.రంగనాథాచార్యులు
  20. తెలుగులో తొలి సమాజ కవులు - కె.కె.రంగనాథాచార్యులు
  21. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్నధోరణులు - కె.కె.రంగనాథాచార్యులు
  22. తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక - కె.కె.రంగనాథాచార్యులు
  23. భాషా చారిత్రక వ్యాసావళి - తూమాటి దొణప్ప
  24. సురవరం ప్రతాపరెడ్డి జీవితము, రచనలు - మద్దసాని రాంరెడ్డి
  25. తెలుగు సాహిత్యములో రామకథ - పండా శమంతకమణి
  26. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీతలైన కవయిత్రులు-వారి కావ్యాలు - జి. సుమిత్రాదేవి
  27. స్త్రీల రామాయణపు పాటలు - కృష్ణశ్రీ
  28. స్త్రీల పౌరాణికపు పాటలు - కృష్ణశ్రీ
  29. పల్లెపదాలు - కృష్ణశ్రీ
  30. త్రిలింగ శబ్దానుశాసనమ్‌ - మండ లక్ష్మీనృసింహకవి
  31. ఆంధ్రమహాభారతంలో కృత్-తద్ధిత ప్రయోగముల విశ్లేషణము - కండ్లకుండ అళహసింగరాచార్యులు
  32. విముక్తి (భక్త నందనార్ చరిత్ర) - డి. సుబ్రహ్మణ్యం
  33. ఆంధ్రులు - చరిత్ర[3] - నేలటూరి వేంకటరమణయ్య
  34. వాఙ్మయ వ్యాసమంజరి - నేలటూరి వేంకటరమణయ్య
  35. తెలుగు హాస్యము (తెలుగు సాహిత్యములో హాస్యరసము) - ముట్నూరి సంగమేశం
  36. ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం - ఎల్లూరి శివారెడ్డి
  37. సాహిత్యానువాదం - సమాలోచనం - ఎల్లూరి శివారెడ్డి
  38. మన హాస్యము - మునిమాణిక్యం నరసింహారావు
  39. మన జాతి నిర్మాతలు - డి.చంద్రశేఖరరెడ్డి
  40. తెలుగు సాహిత్యం చారిత్రక నేపథ్యం - డి.చంద్రశేఖరరెడ్డి
  41. తెలుగు పీఠిక - డి.చంద్రశేఖరరెడ్డి
  42. తెలుగు ఉర్దూ పారశీకముల ప్రభావము - కె.గోపాలకృష్ణరావు
  43. నీతి పద్య మంజరి
  44. మన నవల - పరిశీలన - బి.రుక్మిణి
  45. భారతీయ విజ్ఞానవేత్తలు - పుల్లెల శ్రీరామచంద్రుడు
  46. పరిశోధన (వ్యాస సంకలనం) - నాయని కృష్ణకుమారి
  47. తెలుగు జానపద గేయ గాథలు - నాయని కృష్ణకుమారి
  48. రసరంజని (తెలుగు నాటక ప్రయోగ సంస్థ)
  49. విమర్శక వతంసులు (వ్యాస సంపుటి) - ఎస్వీ సత్యనారాయణ
  50. తెలుగులో-పదకవిత
  51. తెలుగు నాటక సాహిత్యం
  52. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
  53. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు - దేవులపల్లి రామానుజరావు
  54. తెలంగాణ మాండలికాలు కావ్యప్రయోగాలు - రవ్వా శ్రీహరి
  55. తెలుగు జానపద సాహిత్యము - చింతపల్లి వసుంధరారెడ్డి
  56. మా ఊరు మాట్లాడింది - సి.నారాయణరెడ్డి
  57. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు’ (వ్యాస సంకలనం)
  58. బంజారాల వివాహ ఆచార పద్ధతులు - అజ్మీర సిల్మానాయక్
  59. తెలంగాణ చరిత్ర - జి. వెంకట రామారావు
  60. ప్రాచీన తెలంగాణ కవుల కవితా ప్రాభవం (వ్యాస సంకలనం)
  61. తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర - ముదిగంటి సుజాతారెడ్డి
  62. పరిణత వాణి (ఆత్మకథ ప్రసంగ వ్యాసాలు)
  63. కుతుబ్‌షాహీల తెలుగు సాహిత్య సేవ (వ్యాస సంకలనం)

మూలాలు

మార్చు