పోకూరి కాశీపత్యవధాని

పోకూరి కాశీపత్యావధాని, అమోఘ పాండిత్య ప్రజ్ఞా ప్రాభవశాలి .

పోకూరి కాశీపత్యవధాని

జీవిత విశేషాలు

మార్చు

నందన సంవత్సర (1893, ఫిబ్రవరి) మాఘ శుద్ధ దశమి నాడు రామలక్ష్మాంబ, సుబ్బయాచార్యుల తృతీయ సంతానముగా, గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలంలోని బోదిలవీడు అనే గ్రామంలో విశ్వబ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. వీరు బోదిలవీడు,వెల్దుర్తి,రెంటచింతల గ్రామాలలో చదివారు. అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహము, నరస భూపాలీయము, మనుచరిత్ర, వసుచరిత్ర ఇత్యాదులను కూలంకషంగా చదివారు. గీర్వాణాంధ్ర భాషలలోని కావ్యాలు, ఛందోవ్యాకరణాది శాస్త్రాలు చదివి ఆకళింపు చేసుకొని గర్భ, బంధ, చిత్ర, ఆశు కవిత్వాలలో ఆరితేరారు. బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు వృద్ధాప్యదశ వఱకూ “మాచర్ల” లో జీవితము గడిపారు. 60 కి పైగా రచించిన అద్భుత కావ్యాలతో ఈ పుంభావసరస్వతి కీర్తి గాంచారు. గంటకు 200ల పద్యాలు ఆశువుగా చెప్పారు. గద్వాల సంస్థానము విద్యకు, పాండిత్య ప్రభలకు, లాలిత్య కళలకు ఆటపట్టై, “శ్రీమద్విద్వద్ గద్వాల” అని పేర్గాంచినది. అట్టి గద్వాలలో పోకూరి కాశీపత్యావధానులు “ఆస్థాన కవి” పదవిని అలంకరించారు.

అవధానాలు

మార్చు

ఇతను తొలిసారిగా 1916లో నరసరావుపేటలో అష్టావధానం చేశారు. పిఠాపురం, విజయనగరం, పెద్దాపురం, నూజివీడు, జటప్రోలు, బొబ్బిలి, ఉయ్యూరు, వెంకటగిరి, అమరావతి, మునగాల, గద్వాల, వనపర్తి, పోలవరం, లక్కవరం, చల్లపల్లి, గోపాలపేట, దోమకొండ, ఆత్మకూరు, అలంపురం, మద్రాసు తదితరప్రాంతాలలో అష్టావధానాలు, శతావధానాలు చేసి సన్మానాలు పొందారు.[1]

అవధానాలలో పూరణలు కొన్ని

మార్చు
  • సమస్య: కన్నులలో చన్నులమరె కాంతామణికిన్

పూరణ:

చెన్నులర బెస్త చేడియ
క్రన్నన వల వల్లెవాటుగాఁ గొని వేడ్కన్
మున్నీటికి జనునెడ వల
కన్నులలో చన్నులమరె కాంతామణికిన్

  • దత్తపది: భీష్మ - ద్రోణ - కృప - శల్య అనే పదాలతో రామాయణార్థంలో పద్యం

పూరణ:

మారుతీ భీష్మముగను లక్ష్మణుఁడు మూర్ఛ
పొందె నిక ద్రోణగిరి కేగి తొందరగను
కృప దలిర్పగ సంజీవి నెసఁగ దెచ్చి
యిడఁగదే నీదు కౌశల్యమిపుడు జూతు

రచనలు

మార్చు
  1. శుద్ధాంధ్ర నిర్యోష్ఠ్య నిర్వచన హరిశ్చంద్రోపాఖ్యానము
  2. సారంగధరీయము (త్ర్యర్థి కావ్యం)[2]
  3. సిద్ధయోగి చరిత్ర
  4. అలివేలుమంగా వేంకటేశ్వర సంవాదము
  5. వీర తిమ్మాంబాచరిత్రము
  6. నరసింహ నిరసనస్తుతి
  7. సత్యనారాయణవ్రతకల్పం
  8. శౌరి శైశవలీల
  9. సుజ్ఞాన ప్రబోధిని
  10. ధూర్జటి శతకము
  11. సునీతి శతకము
  12. కేశవేంద్ర శతకము
  13. మన్నెంకొండ వేంకటేశ్వరశతకము
  14. హనుమత్‌ ప్రభుశతకము
  15. నరసింహ ప్రభుశతకము
  16. శ్రీశైల మల్లేశ్వరశతకము
  17. కాశీపతి చమత్కృతి.[3]

రచనల నుండి ఉదాహరణ

మార్చు

షట్చక్రవర్తులలో మొదటి వాడు హరిశ్చంద్ర చక్రవర్తి కనుక - పోకూరి కాశీపత్యావధానులు ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ ను రచన గావించారు. విశ్వామిత్ర ముని మాతంగ కన్యలను పంపించాడు.వారు అవమానించబడినారని, క్రుద్ధుడైన ముని హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళాడు.సామ్రాట్టు ఆయన కాళ్ళపైన పడ్డాడు.కుపితుడై ఉన్న ఋషి రాజును పాదంతో తన్నగా, రాజు సహనం, ఓరిమిలను ప్రతిబింబించే దృశ్యాన్ని పోకూరి కాశీపత్యావధానులు చిత్రించిన పద్ధతి పదుగురి మెప్పు బడసినది. “మహర్షి పాదం నొప్పి పుట్టిందేమో”నని హరిశ్చంద్రుడు వ్యాకులపడుతూ, మహర్షి పాదాలను ఒత్తసాగాడు. (ఈ సంఘటన – “పారిజాతాపహరణము" ప్రఖ్యాత ప్రబంధము లోని ముక్కు తిమ్మనార్యుల ఘంటంలో నుండి వెలువడినట్టి సత్యభామ శ్రీకృష్ణుని తన వామ పాదముతో త్రోయుట” జ్ఞప్తికి వస్తుంది)

ఆ రీతిగా పాదసంవాహనం చేస్తూ, బహు నిదానముగా అన్నాడు ఇలాగ:-

“నే నెన్నైనను నీన
న్నానా- నే నా న నూననా నన్నననౌ;
నా నిన్ను నెన్న నన్నా;
నా నేనున్నాన నానినా నన్నన్నా.” (2-76)


ఏకాక్షరి అనగా ఒకే అక్షరముతో
పద్యం అంతా సాగుతుంది.

దీని సారాంశము

" నేను ఎన్నైనను ఈయను అన్నానా?
నేను ఆన (=ప్రమాణము) ను –
ఊననా? (=ఊనిక)- నన్ను (నిందిస్తూ) అననౌనా?
నిన్ను ఎన్నను- అని అన్నానా?
నేనున్ నానన్ (= లజ్జను) ఆనినాను , అన్నన్నా!”

వేరే సీను
-

రాజు చేత అసత్యం పలికించాలని, యత్నించి,
విఫలుడైన ముని ఇలాగ విచారించాడు:


“కినిసి సిరి~ దీసి నీలిగి;
తిని సిగ్గిడి కింగిరికిని దిగి తీరితి~ గి:
త్తిని జీరి నించి చిక్కిడి;
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ!” (2-135)

ఈ పద్దెములో కేవలము గుడుసులు మాత్రమే ఉన్నవి.
అన్ని అక్షరములూ 'గుడి- తలకట్టు' గా వాడబడినవి.

భావము:-

“ఇస్సీ! చక్రవర్తిపై కోపగించుకొని ఆతని ఐశ్వర్యము పోగొట్టి, నీలిగితిని.
సిగ్గు విడిచి, నీచ కార్యానికి (=కింగిరికిని) దిగితిని.
అగ్ని (= కిత్తి) వంటి భూపతిని పిలిచి, నిందించితిని.
చాలా చిక్కులు పెడితిని.
ఐనప్పటికిన్నీ ఈ ధరణీనాధుడు, రాణి (జియ్యా, ఇంతి)
కీర్తిని నిలుపుకున్నారు ".
మాతృ భాషా దేవి కిరీటములో
అమూల్య మణి శ్రీ కాశీపత్యావధాని.

త్రింశదర్థ పద్యరత్నం

మార్చు

వీరు ఒకే పద్యంలో 30 అర్థాలు వచ్చేటట్టు వ్రాశారు. వీరి పాండిత్యానికి ఇది పరాకాష్ట.

సన్మానాలు

మార్చు
  • 1950 లో ప్రొద్దుటూరులో ప్రజలు గండపెండేరము తొడిగి, ఏనుగుపై ఎక్కించి, ఊరేగించి, సన్మానించారు.
  • 1960 లో రాయచూరు, ఆదోని పట్టణాలలో ప్రజలు ఆప్యాయతతో -సువర్ణ కంకణములను తొడిగి, సత్కరించారు.
  • 1962లో ఢిల్లీలో ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేత సన్మానింపబడినారు.
  • 1966లో కర్నూలు జిల్లాలోని “హాలాహర్వి” లో “కనకాభిషేక గౌరవము”ను పొందారు.
  • 1968లో సిద్ధిపేట పురవీధులలో ప్రజలు వీరిని రథంలో ఊరేగించారు.
  • కాశీ, హైదరాబాదు, విశాఖపట్టణం మొదలైన నగరాలలో వీరు సన్మానించబడ్డారు.
  • దాదాపు 48 బంగారు పతకాలను,అగణిత బిరుదు సన్మానాలను పొందారు పోకూరి కాశీపత్యావధానులు.

బిరుదులు

మార్చు
  • కవిసింహ
  • కవిశిరోమణి
  • కవితాప్రవీణ
  • ఆశుకవి పుంగవ
  • కవిశిఖామణి
  • ఆశుకవికోకిల
  • అవధాన ప్రవీణ
  • చిత్రకవిత్వ పంచానన
  • కవి కళాపరిపూర్ణ
  • మహాకవిశేఖర

మరణము

మార్చు

వీరు 1974 డిసెంబరు 27వ తేదీన మాచర్లలో కన్నుమూశారు.[4]

మూలాలు

మార్చు
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 198–203.
  2. పోకూరి కాశీపత్యావధానులు (1990). సారంగధరీయము త్ర్యర్థికావ్యము.
  3. పోకూరి కాశీపత్యవధానులు (1998). కాశీపతి చమత్కృతి.
  4. "పలనాటి కవుల చరిత్ర", డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు, మాచర్ల, ప్రచురణ 2020, పేజీ నెం 32-39.

వెలుపలి లింకులు

మార్చు
  • పాటిబండ్ల మాధవ శర్మగారి షష్టిపూర్తి సన్మాన సంచిక: హైదరాబాదు; సెప్టెంబరు;1972
  • విశ్వబ్రాహ్మణ సర్వస్వము విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రథమభాగము) - రాపాక ఏకాంబరాచార్యులు - పేజీలు 54-56