బలిజేపల్లి లక్ష్మీకాంతం

తెలుగు కవి, నటుడు
(బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నుండి దారిమార్పు చెందింది)

బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (డిసెంబరు 23, 1881 - జూన్ 30, 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల మరియు సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది.

బలిజేపల్లి లక్ష్మీకాంతం
Balijepalli.jpg
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
పుట్టిన తేదీ, స్థలండిసెంబరు 23, 1881
బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా
మరణంజూన్ 30, 1953
శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
కలం పేరుబలిజేపల్లి లక్ష్మీకాంత కవి
జాతీయతభారతీయులు
పౌరసత్వంభారత దేశము
విద్యమెట్రిక్యులేషన్
పూర్వవిద్యార్థిహిందూ కళాశాల గుంటూరు
రచనా రంగంనాటక రచయిత, కవి,అవధాని,నటుడు
గుర్తింపునిచ్చిన రచనలుసత్య హరిశ్చంద్ర నాటకం
ప్రభావంభాగవతుల చెన్నక్రిష్ణన్
బంధువులుబలిజేపల్లి సీతారామయ్య

జీవిత సంగ్రహంసవరించు

వీరు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా ఇటికంపాడులో 23 డిసెంబర్, 1881 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి మరియు ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ భాగవతుల చెన్నకృష్ణయ్య వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.

కర్నూలులో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు హిందూ కళాశాలలో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి అవధానాలు ప్రదర్శించారు.

చల్లపల్లి రాజావారి సాయంతో 1922లో గుంటూరులో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో గుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో నక్షత్రకుడు పాత్ర వీరికిష్టమైనది.

తర్వాత కాలంలో చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.

వీరు 30 జూన్, 1953 సంవత్సరం కాళహస్తిలో పరమపదించారు.

బలిజేపల్లి రచనలుసవరించు

 • శివానందలహరి శతకం (శంకరుని కృతికి ఆంధ్రీకరణం)
 • స్వరాజ్య సమస్య (పద్య కృతి)
 • బ్రహ్మరథం (నవల)
 • మణి మంజూష (నవల)
 • బుద్ధిమతీ విలాసము (నాటకము)[1] : శివ భక్తాగ్రేసరుల్లో ఒకరిగా పేరొందిన శిరియాళుని కథను ఇతివృత్తంగా స్వీకరించి ఈ నాటకాన్ని రచించారు.
 • సత్యహరిశ్చంద్రీయము (నాటకము)[2]
 • ఉత్తర గోగ్రహణము (నాటకము)
 • సాత్రాజితీ పరిణయము (నాటకము)
 • ఉత్తర రాఘవము (భవభూతి రచించిన నాటకానికి ఆంధ్రీకరణం)[3]

చిత్ర సమాహారంసవరించు

 1. లవకుశ (1934) (మాటలు మరియు పాటల రచయిత)
 2. హరిశ్చంద్ర (1935) (రచయిత)
 3. అనసూయ (1936) (రచయిత)
 4. మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు మరియు మాటల రచయిత)
 5. వర విక్రయం (1939) (నటుడు మరియు మాటల రచయిత)
 6. భూకైలాస్ (1940) (మాటల రచయిత)
 7. విశ్వమోహిని (1940) (మాటల చయిత)
 8. బాలనాగమ్మ (1942) (నటుడు మరియు రచయిత)
 9. తాసిల్దార్ (1944) (నటుడు మరియు మాటల రచయిత)
 10. రక్షరేఖ (1949) (నటుడు, కథ మరియు మాటల రచయిత)
 11. బ్రహ్మరథం (1947) (నటుడు, కథ మరియు పాటల రచయిత)
 12. భీష్మ (1944) (నటుడు)
 13. నా చెల్లెలు (1953)
 14. మంజరి (1953) (నటుడు మరియు మాటల రచయిత)
 15. జీవిత నౌక (1951) (మాటలు మరియు పాటల రచయిత)[4]

సత్య హరిశ్చంద్రసవరించు

ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు కొన్ని పద్యాలు:

మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.

మూలాలుసవరించు

తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
 • నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002 పేజీలు: 370-72.

బయటి లింకులుసవరించు