భద్రకాళీ దేవాలయం (వరంగల్)

(భద్రకాళీ దేవాలయము నుండి దారిమార్పు చెందింది)

భద్రకాళీ దేవస్థానం[1]తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉంది. ఆమె 8 చేతులతో - కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకం: ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది.[2] ఇక్కడికి సమీపంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఉంది.

భద్రకాళీ దేవాలయం (వరంగల్)
శ్రీ భద్రకాళీ అమ్మవారు.
శ్రీ భద్రకాళీ అమ్మవారు.
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:వరంగల్
ప్రదేశం:వరంగల్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:భద్రకాళి
ప్రధాన దేవత:భద్రకాళి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. 625)
ఆలయ ప్రాంగణంలో గోశాల

స్థలపురాణం

మార్చు

ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లూ 'ప్రతాపరుద్ర చరిత్రం' 'సిద్ధేశ్వర చరిత్రం' గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను కారుమాటలతోనైన జయించాలనే ఉద్దేశంతో "ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా?" అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి, "రేపు పౌర్ణమి" అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితినుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసులలో ప్రధానుదైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై "నీ మాట నే నిలుపుతా" నని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటినుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు సృష్టమవుతుంది.

సా.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. అదీకాక హైదరాబాదు సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా దాదాపు సా.శ. 1950 వరకూ ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణేష్ శాస్త్రి, స్థానిక ముడుంబై రామానుజా చార్య నగరంలో ఉండిన ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు. అదే రాత్రి మగన్‌లాల్ సమేజాకు అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు, వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించినదట. మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునురుద్దరణకు నావంతు సహకారం అందిస్తానని శాస్త్రికి మాట ఇవ్వగా గణేశ శాస్త్రి ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా మగన్‌లాల్ సమేజా కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది. అమ్మవారి మహిమకు ముగ్ధుడైన మగన్‌లాల్ సమేజా ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు.[3] ఆ సందర్భంలో అతనికి హరి రాధాకృష్ణమూర్తి , తాండ్ర వెంకటరామనర్సయ్య , అడ్లూరి సీతారామశాస్త్రి , వంగల గురువయ్య , టంకసాల నరసింహారావు , మహాతపస్విని మంగళాంబిక ఇత్యాది మహనీయులు ఎందరో చేసిన సహకారం చిరస్మరణీయం.

ఆలయ నిర్మాణ విశేషాలు

మార్చు

సా.శ.625 లోనే నిర్మించిపబడిందని స్థానికుల కథనం. వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి, పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండశిలమీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కటం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది. రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూలస్తంభాలు చతురస్త్రాకారంలో ఉన్నాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానము, ఆ స్తంభాలను నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపస్తుంది. అంతేకాక దేవాలయములోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీద: "మహేశశ్చారు సంధత్తే మార్గణం కొనకాచలే! మంత్రి విఠన ఎఱ్ఱస్తు మార్గణే కనకాచలమ్!!"

అనే శ్లోకం కన్పిస్తుంది. ఈ శాసనపాఠం పురాతత్త్వ శాఖవారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో (పు.307) ఉంది. ఈ శ్లోకంలోని ఎఱ్ఱన సా.శ.10వ శతాబ్దిలో కాకతిపురంను పాలించినట్లు గూడూరు శాసనాన్ని బట్టి తెలుస్తుంది. ఇతని తండ్రి విఠనామాత్యుడని, అతనికి మీసరగండడనే బిరుదు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉంది. అది

"మంత్రిమీసరగండేన, విఠనామాత్య సూనునా!ఎరయాఖ్యేన సమోదాతా, న భూతో న్ భవిష్యతి!!"

అనే శ్లోకం. ఈ రెండు స్తంభశాసనాలను బట్టి ఈ దేవాలయం సా.శ.10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని ఊహింపవచ్చును. లేదా కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతియైన ఆడిదం మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కన్పిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింబడిందో సరిగ్గా చెప్పలేము. ఏమైనప్పటికీ కనీసం వెయ్యు సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీ భద్రకాళీ దేవాలయం.

1950లో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీనకాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి - "తనరు భద్రేశ్వరి యనంగ భయదంబుగాగ" - అన్న సిద్ద్శ్వరచరిత్ర (పు.24) లోని మాటలే నిదర్శనము! అలాంటి రౌద్రస్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. (దక్షిణాచార సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంత స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి). అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీచండీయంత్ర ప్రతిష్ఠ చేసి, ప్రతి సంవత్సరమూ శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతి నిత్యము దూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు.

గర్భాలయానికి రెండువైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి. ఆవి బహుశా యెగులో సిద్ధులో తపస్సు చేసుకోటానికి ఉపయోగించేవేమో అనిపిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంది. అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్ళేదారిలో, చెఱవు ప్రక్కన ఉండిన ఒక పెద్ద కొండమీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించి పోయింది. 1966లో వరంగల్-ఖాజీపేట ప్రధాన రహదారిగుండా శ్రీ భద్రకాళీ దేవాలయానికి బి.టి. రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేయబడినవి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ స్థపతి గణపతి స్థపతి గారి నేతృత్వంలో దక్షిణభారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహా మండపం, శాలాహారదులు నిర్మింపబడ్డాయి.

భద్రకాళి చెరువు

మార్చు
 
భద్రకాళీ చెఱవు

ఆమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉంది. దానినే భద్రకాళి చెరువు అంటారు. వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా కూడా ఈ చెరువు నుండే జరుగుతుంది.

ఇతర ఆలయాలు

మార్చు

మహామండపంలో దక్షిణంవైపున ఒక శిలమీద చెక్కిన పార్వతీపరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళీ అమ్మవారు ఉన్న భూమియలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీనకాలపువే అనిపిస్తుంది. అదీకాక, ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కాక పార్వతీపరమేశ్వరుల రూపంలో ఉండటం విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహాశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందుభాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణేశ్వరుడు, ఆంజనేయస్వామి ప్రతిష్ఠలు ఉన్నాయి. ఇటీవలనే శ్రీవల్లభ గణపతి దేవాలయం మరియి పవిత్ర పరిక్రమ కూడా నిర్మింపబడినవి.

ఆగమ సంస్కృత విద్యాలయం

మార్చు

వైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడంగాలతో కూడిన వేద విద్యాలయాన్ని (శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయం) ఆలయ ప్రాంగణంలో ఇటీవలనే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో సర్వశ్రేయోనిధి సహకారంతో నెలకొల్పారు. ప్రకృతి రమణీయతతో బాటు నిరంతరం వేద ఘోషతో దేవాలయ ప్రాగణం దర్శింప వచ్చిన భక్తులకు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతిని కలిగిస్తోంది.

దేవాలయపు పండుగలు, ఉత్సవాలు

మార్చు
  • ప్రతి నిత్యము జరిగే ధూపదీప నైవేద్యాదులు కాక ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి.
  • ఆషాఢమాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని "శాకంభరి"గా అలంకరిస్తారు. ఆనాడు రకరకాల కూరగాయల దండలతో శోభిల్లే అమ్మవారి రూపం మాటల్లో వర్ణించలేనిది.
  • ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో అలంకరించబడి పూజింపబడుతుంది (గోప్త్రీ గోవింద రూపిణీ - "లలితా సహస్రనామం").
  • వైశాఖ శుద్ధ పంచమి "శంకర జయంతి" రోజున శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కళ్యాణోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) దేదీప్యమానంగా జరుగుతాయి.
  • 1940లో జరిగిన సంప్రోక్షణకు పూర్వం ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారని ప్రతీతి. కాని ప్రస్తుతం దక్షిణాచార సంప్రదాయం ప్రకారం - ఉషకాలార్చన, అభిషేకం, ఆవరణార్చన, చతుషష్ఠి ఉపచార పూజ, సహస్రనామం, అష్టోత్తర శతనామ పూజలు మొదలైనవి వేదోక్తంగా జరుగుతున్నాయి.
  • 2019, అక్టోబరు 9న విజయదశమి సందర్భంగా నిపుణులచే రూపొందించబడి విజయవాడ నుంచి వచ్చిన తెప్పోత్సవ పడవలో హంస వాహనంపై భద్రకాళీ భద్రేశ్వరులకు జలక్రీడోత్సవం, తెప్పోత్సవం నిర్వహించారు.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Bhadrakali Temple – Bhadrakali Temple History". Durga-puja.org. Retrieved 22 January 2020.
  2. ఈనాడు, వరంగల్లు (1 June 2018). "ఓరుగల్లు వరప్రదాయిని భద్రకాళి!". Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 22 January 2020.
  3. "Bhadrakali Temple". Cityofwarangal.com. 24 April 2012. Archived from the original on 30 ఏప్రిల్ 2018. Retrieved 22 January 2020.
  4. ఆంధ్రజ్యోతి, వరంగల్లు (10 October 2019). "శోభాయమానంగా భద్రకాళి కల్యాణోత్సవం". Archived from the original on 22 జనవరి 2020. Retrieved 22 January 2020.

బయటి లింకులు

మార్చు