మగ్దూం మొహియుద్దీన్

స్వాతంత్ర సమరయోధుడు, ఉర్దూ కవి.
(మక్దూం మొహియుద్దీన్ నుండి దారిమార్పు చెందింది)

మగ్దూం మొహియుద్దీన్ (ఫిబ్రవరి 4, 1908 - ఆగష్టు 25, 1969) స్వాతంత్ర్య సమరయోధుడు, మహాకవి, కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.

మగ్దూం మొహియుద్దీన్ - مخدوم محی الدین
మగ్దూం మొహియుద్దీన్
పుట్టిన తేదీ, స్థలం(1908-02-04)1908 ఫిబ్రవరి 4
మెదక్, హైదరాబాద్ స్టేట్
మరణం1969 ఆగస్టు 25(1969-08-25) (వయసు 61)
హైదరాబాద్
వృత్తిఉర్దూ కవి
జాతీయతభారతీయుడు
కాలంPre and Post Independent India
రచనా రంగంగజల్
విషయంఉద్యమాలు

సంతకం
మగ్దూం మొహియుద్దీన్
మగ్దూం మొహియుద్దీన్

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

మగ్దూం మొహియుద్దీన్ తెలంగాణ లోని మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతను పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి (మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ). వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌లో ఉండేవాడు. అతను తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ ఔరంగజేబు సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. అలాగే, మరో తాత (తంవూడికి తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తరవూపదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు. ఆ రకంగా ఆ కుంటుంబమంతా హైద్రాబాద్ దక్కన్ పరిసరాలకు చేరింది. అతను తండ్రి గౌస్ మొహియొద్దీన్ నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే నాలుగేళ్ళయినా రాకముందే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. పిన తండ్రి కొడుకు నిజాముద్దీన్ మఖ్దూమ్‌ను వెన్నంటి ఉన్నాడు. పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో మఖ్దూమ్ సూఫీ మత సాంప్రదాయంలో క్రమశిక్షణతో పెరిగాడు.

తొలి జీవితం - రచనా ప్రస్థానం

మార్చు

బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. అతను రాసిన ‘గోథే ప్రేమ లేఖలు’ ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. (ఆ పత్రిక సంపాదకుడు అబ్దుల్ ఖాదరీ సర్వరీ తర్వాతి కాలంలో కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశాడు).

ఉస్మానియా యూనివర్సిటీలో మఖ్దూమ్ (1934-37) హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ తన తొలి కవిత ‘టూర్’ 1934లో రచించాడు. మఖ్దూమ్, కవి గా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. మఖ్దూమ్ ‘మర్షదే కామిల్’ అనే మరో నాటకం రాశాడు. 1937లో మఖ్దూమ్ తన 29వ యేట ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. ‘ఉర్దూ నాటకం’పై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు.

నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు.‘‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాద్‌లో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. సరోజినీ నాయుడు నివాసమైన గోల్డెన్ త్రెషోల్డ్లో డాక్టర్ జయసూర్య, జె.వి.నరసింగరావులతో కలిసి సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతుండేవాడు. చార్మినార్ సిగట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, అల్విన్, షాబాద్ సిమెంట్, ఎన్ ఎస్సార్ రైల్వే ఎంప్లాయిస్, ఎలక్ట్రిసిటీ, సి.డబ్ల్యు.డి. మున్సిపాలిటీ, బటన్ ఫ్యాక్టరీ వంటి వందల కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహో రాత్రులు వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా అతను వాగ్ధాటికి ఎదురుండేది కాదు. విషయం సూటిగా, స్పష్టంగా, దృఢంగా, బలంగా చెప్పేవాడు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు.

హాస్యప్రియుడు

మార్చు
  • తన జూనియర్, హాస్టల్ మేట్ ఒకతను ఎప్పుడూ పచ్చ శాలువా కప్పుకుని తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు అతని శాలువాను ఎవరో దొంగిలించాడు. అది తెలిసి అతణ్ణి ఆట పట్టించడానికి మఖ్దూమ్ ‘పిలా దుశాల’ అనే పాట రాశాడు. హాస్యోక్తులు చిందిస్తూ, లయబద్దంగా సాగే ఆ పాట హైద్రాబాద్ విద్యార్థిలోకంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా, మంచి స్నేహితుడిలా ఉండే మఖ్దూమ్ విద్యార్థులందరికీ ఆత్మీయుడిగా ఉండేవాడు.
  • హైద్రాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫూల్‌చంద్ గాంధీ ఆరోగ్యశాఖ మంత్రి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన మఖ్దూమ్ ఆ శాఖలోని అవకతవకలు ఎత్తి చూపుతూ ‘‘ఫూల్ చన్ద్ - కాంటే బహుత్’’ (పువ్వులు కొంచెం - ముళ్ళేమో ఎక్కువ) అని చలోక్తి విసిరాడు.ఎంతటి గాఢమైన విషయాన్నైనా సున్నితమైన హాస్యాన్ని జోడించి, టూకీగా చెప్పేవాడు.
  • అతను జైల్లో ఉన్నప్పుడు అన్నంలో ఒకసారి ఉడికిన తేలు బయటపడింది. ‘‘శాఖాహారులకు ఇలా బలవంతంగా మాంసాహారం వడ్డించడం తగదు’’ అన్నాడు. నాసిరకం కూరలని నిరసిస్తూ ఆకుకూరలతో తాళ్ళు పేని జైలర్‌కు బహూకరించాడు.

విశేషాలు

మార్చు
  • మఖ్దూం బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్‌ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం
  • మఖ్ధూం ప్రతీ ఉదయం ఒక్కపైసాతో తాందూరీ రొట్టె తిని సాయంత్రంవరకు గడిపేవాడు.
  • ఈయన చదివే ఉర్దూకవితలను దాశరథి తెలుగులో అనువదిస్తూ గానం చేసేవాడు.
  • బెర్నార్డ్ షా నాటకానికి ఉర్దూ అనువాదాన్ని టాగోర్ సమక్షం‌లో ప్రదర్శించగా రవీంద్రుడు వేదికపైకివచ్చి మఖ్దూం‌ను అభినందించాడు.
  • సొంత ఇల్లులేని మఖ్దూం మజీదులోనే జీవించాడు
  • మఖ్దూం “సారా సంసార్ హమారాహై/ పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్కన్/ హం అమెరికీం/ హం ఆఫ్రింగీ/ హం చీనీ/ జాం బజాన్ వతన్” అంటూ అంతర్జాతీయ వాదాన్ని ప్రకటించాడు.
  • దొంగల బెడదకు భయపడి ఒక మంచి తాళం కొనమని భార్య అడిగితే “ మఖ్దూం ఇల్లుదోచుకోవడానికి ఎవడూ శ్రమ తీసుకోడు” అని చెప్పాడు.
  • మఖ్దూం మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆబాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావింఛాడు.

ఉద్యమాలు - పదవులు - రాజకీయాలు

మార్చు

మఖ్దూం కార్మిక నాయకుడు, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. హైద్రాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం.హైద్రాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడు (1952) శాసనమండలి సభ్యుడు, ప్రతిపక్ష నేత (1956-1969), భారత కార్మిక వర్గ విప్లవ చరివూతలో ముఖ్య పాత్రధారి. ఎఐటియుసికి జాయింట్ సెక్రటరీ.నిజాముకు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించాడు. ఢిల్లీలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సమాఖ్య (ఎ.ఐ.టి.యు.సి.) జాయింట్ సెక్రటరీగా కొంత కాలం ఢిల్లీలో ఉన్నాడు.1952-55 మధ్య చైనా, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు తిరిగి వచ్చాడు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యాలయం వియాన్నాలో (1953-54) పనిచేశాడు.

సాహిత్యము

మార్చు

ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్త, గాయకుడు, నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించాడు.అతను రాసిన ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ ‘ఎక్ చంబేలీకె మండ్వే తలే’ అనే గీతాలు ప్రసిద్ధి పొందాయి.ఉర్దూ మహాకవిగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.

  • 'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్ (గేయం) సుప్రసిధ్ధి.
  • 1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
  • 1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
  • 1966లో బిసాతే రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించాడు.
  • 1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
ఏ జంగ్ హై జంగే ఆజాదీ
ఆజాదీ కె పర్చమ్ కె తలె
హం హింద్ కె రహ్నే వాలోం కి
మెహకూమోం కి మజ్బూరోం కి
దహెఖానోం కి మజ్దూరోం కి
ఆజాది కే మత్వాలోం కి
యే జంగ్ హై జంగే ఆజాదీ’’

అనే అతను గీతం అంతర్జాతీయ గీతంగా రూపుదిద్దుకుంది. (ఇది స్వాతంత్ర్య సమరం. మేం అమెరికన్‌లం, మేం ఆఫ్రికన్‌లం, చైనీయులం, ప్రపంచమంతా మేమే - ప్రపంచమంతా మాదే’)

సారా సంసార్ హమారా హై
పూరబ్, పశ్చిమ్, ఉత్తర్, దక్కన్
హం అమెరీకి, హం ఆఫ్రంగి
హం చీనీ జాం బాజానె వతన్’’

మఖ్దూమ్ కవిత్వాన్ని గజ్జెల మల్లాడ్డి చాలావరకు తెలుగులోకి అనువదించాడు. అతను జీవితం గురించి, సాహిత్య కృషి గురించి డా॥ రాజబహుదూర్ గౌర్, దేవులపల్లి మదన్ మోహన్‌రావు ప్రభృతులు రాశాడు. అంజుమనే తరఖి ఉర్దూ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వంటి సాహిత్య, సాంస్కృతిక సంస్థలలో ముఖ్యుడు మఖ్దూమ్.

1969, ఆగష్టు 25 తేదీన గుండెపోటుతో ఢిల్లీలో చనిపోయాడు. అతను పేరిట హైద్రాబాద్, హిమాయత్‌నగర్‌లో సి.పి.ఐ. రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్ భవన్ నిర్మించారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు