వినాయకుడు

హిందూ దేవుడు
(విఘ్నేశ్వరుడు నుండి దారిమార్పు చెందింది)

వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు.[4] ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.[5] హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు.[6] గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది.[7] గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు.[8] గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు),[9] కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా[10] భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు.[11][3] ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.

గణేశుడు
నారింజరంగు ధోతి ధరించి, ఏనుగు తల ఉన్న వ్యక్తి పెద్ద తామరపై కూర్చున్నాడు. అతని శరీరం ఎరుపు రంగులో ఉంది. వివిధ బంగారు కంఠహారాలు, కంకణాలు, మెడలో పాము ధరిస్తాడు. అతని కిరీటం యొక్క మూడు స్థానాలపై, తామరమొగ్గలు పరిష్కరించబడ్డాయి. అతను తన రెండు కుడి చేతుల్లో రోసరీ (దిగువ చేతి), మూడు మోదకాలు నిండిన ఒక కప్పును పట్టుకున్నాడు, వంపు తిరిగిన తొండంతో పట్టుకున్న నాల్గవ మోదకాన్ని రుచి చూడబోతున్నట్లుంటుంది. తన రెండు ఎడమ చేతుల్లో, అతను పై చేతిలో ఒక కమలం, దిగువ గొడ్డలిని పట్టుకున్నాడు, అతని భుజంపై వాలి ఉంది.
బసోహ్లి మినియేచర్, c. 1730. ఢిల్లీ నేషనల్ మ్యూజియం.[1]
  • కొత్త ప్రారంభాలు, విజయం, విజ్ఞానం
  • ఆటంకాలను తొలగించేవాడు[2][3]
అనుబంధందేవుడు, బ్రహ్మము (గాణాపత్యం), సగుణ బ్రహ్మ (పంచాయతన పూజ)
నివాసంకైలాస పర్వతం (తల్లిదండ్రులైన శివ పార్వతులతో కలిసి) ,
గణేశలోకం
మంత్రంఓం శ్రీ గణేశాయనమః
ఓం గం గణపతయేనమః
ఆయుధములుపరశు, పాశం, అంకుశం
గుర్తులుఓం, మోదకం
భర్త / భార్య
తోబుట్టువులుషణ్ముఖుడు
అశోకసుందరి
పిల్లలుశుభ
లాభ
సంతోషి మాత
వాహనంఎలుక
పాఠ్యగ్రంథాలుగణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షము
పండుగలువినాయక చవితి, వినాయక జయంతి, సంకటహర చతుర్థి
తండ్రిశివుడు
తల్లిపార్వతి

ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు.[12] సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు.[13] కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు.[14] శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు.[15][16] గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.[17]

గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.

పద వ్యుత్పత్తి

మార్చు

వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు వాడుతుంటారు.

గణం అంటే ఒక సమూహం. పతి లేదా ఈశ అంటే యజమాని, నాయకుడు అని అర్థం.[18] ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు.

హిందూ మతంలో వినాయకుని ప్రాముఖ్యత

మార్చు
 
5వ శతాబ్దికి చెందిన పాలరాతి వినాయక విగ్రహం. - గర్దెజ్, ఆఫ్ఘనిస్తాన్‌లో లభించింది. ప్రస్తుతం కాబూల్ "దర్గా పీర్ రత్తన్ నాథ్"లో ఉంది. - విగ్రహ పీఠంపై ఇలా వ్రాసి ఉంది "మహావినాయకుని గొప్ప సుందర మూర్తి"- షాహి రాజు ఖింగలునిచే ప్రతిష్ఠింపబడింది.[19]

భారతదేశంలో వినాయకుడిని గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లైయార్ వంటి అనేక నామాలతో అర్చిస్తారు. హిందూమతంలో పూజింపబడే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలలోను, అన్ని ప్రాంతాలలోను బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు.[4][20] శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలలోను, భారతదేశం వెలుపల చీనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండొనీడియా వంటి దేశాలలోను కూడా వినాయకుడి అర్చన ఉంది.[21][22][23]

వినాయకునికి అనేక నామములు, పేర్లు ఉన్నాయి. కాని అంతటా అత్యంత ప్రస్ఫుటంగా గుర్తింపబడే లక్షణాలు - ఏనుగు ముఖం, ఎలుక వాహనం[8][24], అడ్డంకులు తొలగించే గుణం[11], విద్యా, బుద్ధి ప్రదాత [10]. ధార్మిక, లౌకిక కార్యక్రమాల (వ్రతము, యజ్ఞము, పరీక్షలు వ్రాయడం, ఇల్లు కట్టడం వంటివి) ఆరంభంలో వినాయకుడిని స్తుతించే లేదా పూజించే ఆనవాయితీ సర్వసాధారణం[25].

వైదిక కాలంనుండి, అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుని సూచిస్తున్నప్పటికీ సా.శ. 4వ, 5వ శతాబ్దాలలో, ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా అనిపిస్తుంది.[26] తరువాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యున్నతమైన భగవంతుడు (దేవదేవుడు) అని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది.[17] వినాయకుని గురించి తెలిపే ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు - గణేశ పురాణము, ముద్గల పురాణము, గణపతి అథర్వశీర్షము.

స్వరూపం

మార్చు
 
13వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం - మైసూర్ జిల్లా, కర్ణాటక

భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది.[27] కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది.[28] నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాలు, చిత్రాలు కనిపిస్తుంటాయి.

సా.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది.[29] 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి.[30] వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా కుడిప్రక్క చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన (7వ శతాబ్దానికి చెందిన) గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు.[31] సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు.[32] నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు.[33]

విగ్రహాలు, చిత్రాలు

మార్చు
 
చతుర్భుజ గణపతి - నూర్పూర్ శైలి చిత్రం - 1810 కాలానికి చెందినది.[34]

ఆది నుండి వినాయకుడిని ఏనుగుతలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది.[35] ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.

 
సింహాచలం లో వినాయక విగ్రహం

వినాయకునికి ఏక దంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు.[36][37] ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం".[38] అలాగే పెద్ద పొట్ట కూడా మొదటి నుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం.[39] ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి.[40] భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది.[41] వినాయకునికి రెండు చేతుల నుండి, 16 చేతుల వరకు చూపుతారు.[42] సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు.[43] పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు.[44] 9వ, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతుల వరకు ఉన్న ప్రతిమలు చెక్కారు.[45] వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది.[46] గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు.[47] మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది.[48] ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (మొలతాడు లాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది. వినాయకుడి నుదురు మీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు.[49] గణేశ పురాణం ప్రకారం వినాయకుని తల మీద తిలక చిహ్నం, చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు[50]

వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంథంలో చెప్పబడింది.[51] ఉదాహరణకు హేరంబ గణపతిని, ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.

వాహనం

మార్చు
 
తన వాహనమైన ఎలుకపై సవారీ చేస్తున్న వినాయకుడు.

అధికంగా వినాయకునికి వాహనంగా ఎలుకను చూపుతారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయక విగ్రహాలలో వాహనాన్ని చూపలేదు.[52] ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు చెప్పబడినాయి. (వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు.[53] గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక.[54] జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. (చూపబడినాయి) [55]

7వ శతాబ్దం నుండి మధ్య, పశ్చిమ భారతంలో వచ్చిన శిల్పాలలో ఎలుకను చూపడం మొదలయ్యిందని Martin-Dubost అభిప్రాయపడ్డాడు.[56] లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక వాహనం గురించి వ్రాయబడింది. తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది.[57] గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది.[58]. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.[59]

ఎలుక వాహనం సంకేతాన్ని అనేక విధాలుగా వివరిస్తారు - ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం.[60][61] పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి[62] ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.[63]

ఇతర విశేషాలు

మార్చు
ఓంకారము
 
ఓకారం రూపపు ఆభరణంలో వినాయకుడు

హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు. వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు. (ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో) [64] గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:

గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.[65]

మూలాధార చక్రము

కుండలినీ యోగము ప్రకారము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు.[66] గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు.[67]

వినాయక స్వరూపానికి తాత్విక వివరణ

మార్చు
 
మంగళూరులోని "కుద్రోళి భగవతి" మందిరంలో అలంకృత గణేశవిగ్రహం.

వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.

  • వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం) ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
  • వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
  • ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
  • మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
  • చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
  • చేతిలో పాశము - విఘ్నాలు కట్టిపడవసే సాధనము
  • విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
  • మాల - జ్ఙాన సముపార్జన
  • పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
  • పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
  • ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.

వినాయకుని గూర్చి కథలు

మార్చు

వినాయకుని జననం, ఏనుగు తల

మార్చు
 
వినాయకునికి స్నానం చేయిస్తున్న పార్వతీ పరమేశ్వరులు - 18వ శతాబ్దం కాలపు కాంగ్రా శైలి చిత్రం - అలహాబాదు మ్యూజియంలో ఉన్నది

వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కథ, వినాయక చవితి వ్రతంలో చదివేది: గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. శివుని తన శరీరములో దాచుకొన్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం, తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలి వద్ద కాపలా ఉంచింది. ఆ బాలుడు ద్వారము దగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు.

బ్రహ్మవైవర్త పురాణములోని కథ: శివుని ఉపదేశము ప్రకారము పార్వతి విష్ణువును పూజించి, పుణ్యకవ్రతము మాచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మ వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు.

మరొక కథ ప్రకారం (వరాహ పురాణం) - శివుని నవ్వు నుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన (దిష్టి తగులకుండా?) శివుడు అతనికి ఏనుగు తల, బాన పొట్ట ఉండేలా చేశాడు.

గణాధిపత్యం, చంద్రునినవ్వు, పార్వతిశాపం

మార్చు

వినాయక వ్రత కల్ప విధానములో వినాయకునికి గణాధిపత్యం ఎలా లభించిందీ, గణపతని చూసి నవ్విన చంద్రుడు పార్వతీదేవి శాపానికి ఎలా గురైంది ప్రస్తావించి ఉంది.

గణాధిపతి స్థానానికి వినాయకుడూ, కుమారస్వామీ పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు - "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చెసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది". కుమార స్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయుణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించింది.

గణాధిపతియైన వినాయకుడు లోకముల పూజలు అందుకొని, సుష్టుగా భోజనం చేసి, కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదిచూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు (దృష్టి దోషానికి) వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి "నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురు గాక" అని శపించింది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడయినాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు.

లోకుల ప్రార్థనలు మన్నించిన పార్వతి 'భాద్రపద శుద్ధ చవితి' నాడు (చంద్రుడు నవ్విన నాడు) మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా శ్యమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని ఋజువు చేసుకొన్నాడు. కాని శక్తి హీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు "భాద్రపద శుద్ధ చవితి" నాడు వినాయకుని పూజించి, ఈ కథ విని, అక్షతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు

సిద్ధి, బుద్ధి

మార్చు

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెళ్ళి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.

కాకిరూపంలో గణపతి

మార్చు

(తమిళనాట ప్రచారంలో ఉన్న గాథ) అగస్త్యమహర్షి ఒకసారి కోపించి కావేరీనదీ జలాలను తన కమండలంలో బంధించివేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి, ఇంద్రుడు ప్రార్థించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని త్రాగుతున్నట్లు నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోయాడు. మళ్ళీ కావేరి నది మామూలుగా ప్రవహించసాగింది. తన తొందరపాటును తెలిసికొని అగస్త్యుడు వినాయకుని స్తుతించాడు.

భూకైలాస్ కథ

మార్చు

(తెలుగునాట ప్రసిద్ధి చెందిన నాటకము) ఒకసారి రావణుడు శివుని మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు. శంకరుడే లింగరూపుడై రావణుని చేతికి వచ్చాడు. కాని ఎక్కడ నేలమీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమౌతానని చెప్పాడు. సంధ్యా వందనసమయం అయినందున రావణుడు ఆ లింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాల బ్రహ్మచారి రూపంలో వస్తాడు. రావణుడు శివలింగాన్ని పట్టుకోమని కోరాడు. కాని ఆయన "నేను నీ అంత బలవంతుని కాను. మోయలేకపోయినప్పుడు మూడుసార్లు పిలిస్తాను. నువ్వు రాకుంటే క్రింద పెట్టేస్తాను" అని షరతు విధించి ఆత్మలింగాన్ని తీసికొన్నాడు. సంధ్యావందనం మధ్యలో మూడుసార్లు పిలిచినా సమయానికి రావణుడు రాలేకపోయాడు. బరువు మోయలేనివానివలె గణపతి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు. ఆవిధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రము. రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే ఐదు భాగాలుగా విడి పోయి, సముద్రతీరములోని ఐదు చోట్ల పడితే ఆ ఐదు కూడా పుణ్యక్షేత్రాలగా వెలిశాయు. అ క్షేత్రాలలో కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర ఒకటి.

మహాభారతానికి వ్రాయసకాడు

మార్చు

వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమవేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్థునికోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు - వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకొన్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు - తాను చెప్పినదానిని పూర్తిగా అర్థం చేసుకొనే గణపతి వ్రాయాలి. అలా ఒప్పందం ప్రకారం భారత కథా రచన సాగింది. తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనుకనే మహాభారతం అనన్య మహాకావ్యమైనది.

పండుగలు, ఆచారాలు, దేవాలయాలు

మార్చు

పూజ, పండుగలు

మార్చు
 
2013 వినాయక చవితికి ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠింపబడిన వినాయకుడు

‌అనేక ధార్మిక, లౌకిక కార్యక్రమాలలో వినాయకుని పూజించడం సర్వసాధారణం. ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటపుడు ముందుగా వినాయకుని పూజిస్తారు గనుక అతనిని "ప్రథమపూజ్యుడు" అంటారు. అలాగే పెళ్ళి, పుట్టినరోజు, శంకుస్థాపన, గృహప్రవేశం, క్రొత్త వాహనం కొనడం, పరీక్షలకు సిద్ధం కావడం, వ్యాపారం మొదలు పెట్టడం, ముహూర్తం నిశ్చయించడం, జాతకం వ్రాయడం, ఉత్తరం వ్రాయడం - ఇలా ఎన్నో సందర్భాలలో వినాయకుని పూజిస్తారు లేదా స్మరిస్తారు.[68] వినాయకుని బొమ్మ లేదా ప్రతిమ లేని హిందూ గృహం అరుదు. అన్ని కులాలు, సంప్రదాయాలు, శాఖలలోను, అన్ని ప్రాంతాలలోను వినాయకుని పూజ జరుగుతూ ఉంటుంది.[69] ముందుగా వినాయకుని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరంగా ఉంటాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.[70] శైవులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనుల - ఇలా అన్ని శాఖలలోను వినాయకుని పూజించే ఆచారం ఉంది.[71] సంగీత నృత్యప్రదర్శనలు (ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో), సమావేశాలు, ఉత్సవాలు కూడా వినాయకుని ప్రార్థనతో మొదలవుతుంటాయి.[72] ఓం శ్రీ గణేశాయ నమః, ఓం గం గణపతయే నమః వంటి ప్రార్థనా మంత్రాలను తరచు ఉచ్ఛరిస్తుంటారు.[73]

వినాయకునికి అధికంగా లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలుగునాట పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాలు నివేదన చేస్తారు. ఎర్ర చందనం పూస్తారు. గరిక, మారేడు వంటి పత్రులను పూజలో వాడుతారు. వినాయకుని మందిరం వద్ద జిల్లేడు చెట్టు ఉండడం కూడా సాధారణంగా చూడవచ్చును.

ఇలా సందర్భానుసారంగాను, నిత్య పూజా కార్యక్రమంలో భాగంగాను చేసే పూజలు మాత్రమే కాకుండా వినాయకునికి సంబంధించిన రెండు పండుగలు జరుపుకొంటారు. అవి -

  1. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు (ఆగస్టు / సెప్టెంబరు నెలలలో) వచ్చే వినాయక చవితి
  2. మాఘ కృష్ణ చతుర్థి నాడు (జనవరి / ఫిబ్రవరి నెలలలో) వచ్చే వినాయక జయంతి
  3. ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం సంకటహర చతుర్థి
వినాయక చవితి
 
వినాయక చవితి అనంతరం విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసే దృశ్యం - హైదరాబాదు

భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వచ్చే వినాయకచవితి దాదాపు దేశమంతటా పెద్దయెత్తున నిర్వహింపబడుతుంది.[74] ఈ పండుగలో గమనించదగిన ముఖ్యాంశాలు

  1. మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పత్రితోను పూలతోను పూజ చేయడం
  2. లడ్డూలు, పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, పాలతేలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పదార్థాల నివేదన
  3. వీధివీధినా గణపతి ప్రతిష్ఠ, సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
  4. 9రోజుల ఉత్సవాల తరువాత, 10వ రోజున ఉత్సవ విగ్రహాల నిమజ్జనం

ఈ విధంగా ఈ పండుగ కుటుంబ పరిధిలోను, సామాజికంగాను కూడా జరుపుకునే పండుగగా రూపు దిద్దుకొంది. అంతకు ముందు ఇంటిపూజకే పరిమితమైన పూజా విధానం 1893లో బాల గంగాధర తిలక్ అధ్వర్యంలో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలుగా రూపుదిద్దుకొన్నాయి.[75] హిందూ సమాజంలో వివిధ వర్ణాల మధ్య సుహృద్భావాన్ని పెంచడానికి, జాతీయతాభావాన్ని ప్రోత్సహించడానికి ఈ విధమైన ఉత్సవాలు ఉపయోగపడుతాయని అతని లక్ష్యం.[76][77] అతను నెలకొలిపిన సంప్రదాయం (మైదానాలలో విగ్రహాలను ప్రతిష్ఠించడం, 10వ రోజున నిమజ్జనం చేయడం) ఇప్పటికీ కొనసాగుతున్నది.[78]

దేవాలయాలు

మార్చు

దేశంలో కొన్ని మందిరాలు ప్రధానంగా వినాయకుని మందిరాలుగా ఉంటాయి (ఉదాహరణకు కాణిపాకం). అయితే అనేక (దాదాపు అన్ని) దేవాలయాలలోను వినాయకుని ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. కోటలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు, వీధులు, రావిచెట్టు - ఇలా అనేక స్థానాలలో గణపతి విగ్రహం ప్రతిష్ఠిస్తుంటారు. ప్రత్యేకంగా వినాయకుడు ప్రధాన దైవంగా ఉన్న లేదా గణపతి పూజకు ప్రాముఖ్యత ఉన్న కొన్ని ఆలయాలు - [79]

 
కర్పగ వినాయక మందిరం, పిళ్ళైయార్ పట్టి, తమిళనాడు

అష్ట వినాయక మందిరాలు

మార్చు

మహారాష్ట్రలో పూణె సమీపంలో (100 కిలోమీటర్ల పరిధిలో) ఉన్న ఎనిమిది ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు.

  1. మోరెగావ్, అష్టవినాయక మందిరం
  2. సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్
  3. బల్లాలేశ్వర మందిరం, పాలి
  4. వరద వినాయక మందిరం, మహాడ్
  5. చింతామణి మందిరం, తియూర్
  6. గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి
  7. విఘ్నహర మందిరం, ఒజార్
  8. మహాగణపతి మందిరం, రంజనగావ్

వీటిలో ముందుగా మోరేశ్వర మందిరాన్ని దర్శించే సాంప్రదాయం ఉంది.

కాణిపాకం
 
కాణిపాకం దేవాలయం లోపలి దృశ్యం

కాణిపాకం, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి ముప్పై నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.

కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయని, స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ది వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

ఇతర దేశాలు, మతాలలో

మార్చు
 
"నర్తించే గణపతి. సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు".[80] ఈ స్వరూపాన్ని "మహారక్త" అని కూడా అంటారు.[81]
 
9వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహం - పంబన్ మందిరం, జావా, ఇండొనేషియా

వాణిజ్య, ధార్మిక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతల పూజా సంప్రదాయాలు నెలకొన్నట్లే వినాయకుని పూజించడం కూడా అందిపుచ్చుకొన్నారు.[82] ఇది ప్రధానంగా 10వ శతాబ్దంలో జరిగింది. ముఖ్యంగా వ్యాపారులు పూజించే దేవతామూర్తులలో వినాయకుడు ముఖ్యుడుగా ఉన్నాడు[83]. మలయా ద్వీపకల్పంలోని అనేక భాగాలలో వినాయకుని విగ్రహాలు లభించాయి. ముఖ్యంగా శైవాలయాలలో వినాయకుని పూజ కూడా సర్వసాధారణం. వినాయకుని మూర్తిచిత్రీకరణలో స్థానిక సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తుంది.[84]. క్రమంగా ఈ సంస్కృతి బర్మా, థాయిలాండ్, కంబోడియాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రధానంగా బౌద్ధ సమాజమైన థాయిలాండ్‌లో వినాయకుడు విఘ్ననివారకునిగా పూజలందుకొంటున్నాడు.[85]

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ, బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేశ విగ్రహాలు లభించాయి.[86]

మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగాను, మరొకొన్నిసార్లు హిందూ రాక్షసునిగాను కూడా చూపబడింది.[87] గుప్తుల కాలం చివరిభాగంలోని బౌద్ధ శిల్పాలలో వినాయకుని శిల్పాలున్నాయి.[88] బౌద్ధ దేవతగా వినాయకుడు అధికంగా నృత్యముద్రలో చూపబడ్డాడు. ఉత్తర భారతదేశం, నేపాల్, టిబెట్‌లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి.[89] నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. వాహనం సింహం.[90] టిబెట్టులో వినాయకుని చిత్రీకరణ tshogs bdag అనబడింది.[91] ఒకోమారు దేవునిగాను, ఒకోమారు మహాకాలుని పాదాలక్రింది నలుగుతున్నట్లుగాను చూపారు. మరికొన్ని చోట్ల విఘ్ననివారకునిగా చూపారు[92] కొన్ని వైవిధ్యాలతో వినాయకుడు చీనా, జపాన్ సంప్రదాయాలలో కూడా దర్శనమిస్తాడు. ఉత్తర చైనాలో 531 సంవత్సరానికి చెందిన ఒక విగ్రహం లభించింది.[93] జపాన్‌లో 806 కాలంలో వినాయకపూజ గురించి ప్రస్తావించినట్లు ఆధారం లభించింది.[94]

జైన గ్రంథాలలో గణేశపూజ ప్రస్తావింపబడలేదు కాని చాలామంది జైనులు వినాయకుని పూజిస్తారు. వారు కుబేరుని కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది.[95] వ్యాపార వృత్తులలో జైనులు అధికంగా పాల్గొనడం ఇక్కడ గమనించాలి. 9వ శతాబ్దానికి చెందిన జైన గణేశ విగ్రహం ఒకటి లభించింది.[96] రాజస్థాన్, గుజరాత్‌లలో జైనమందిరాలలో వినాయక విగ్రహాలున్నాయి.[97]

అవీ ఇవీ

మార్చు

32 గణపతులు

మార్చు

ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32

  1. శ్రీ గణపతి
  2. వీర గణపతి
  3. శక్తి గణపతి
  4. భక్త గణపతి
  5. బాల గణపతి
  6. తరుణ గణపతి
  7. ఉచ్చిష్ట గణపతి
  8. ఉన్మత్త గణపతి
  9. విద్యా గణపతి
  10. దుర్గ గణపతి
  11. విజయ గణపతి
  12. వృత్త గణపతి
  13. విఘ్న గణపతి
  14. లక్ష్మీ గణపతి
  15. నృత్య గణపతి
  16. శక్తి గణపతి
  17. మహా గణపతి
  18. బీజ గణపతి
  19. దుంఢి గణపతి
  20. పింగళ గణపతి
  21. హరిద్రా గణపతి
  22. ప్రసన్న గణపతి
  23. వాతాపి గణపతి
  24. హేరంబ గణపతి
  25. త్ర్యక్షర గణపతి
  26. త్రిముఖ గణపతి
  27. ఏకాక్షర గణపతి
  28. వక్రతుండ గణపతి
  29. వరసిద్ధి గణపతి
  30. చింతామణి గణపతి
  31. సంకష్టహర గణపతి
  32. త్రైలోక్యమోహనగణపతి

ప్రార్థనలు, కీర్తనలు

మార్చు
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే

(అగజ) పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్ని వేళలా ఎన్నో విధములైన సంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం

వినాయకుని ప్రార్థనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్థించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్థనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

ప్రత్యేకతలు

మార్చు
  • పత్రితో పూజ చేయడం గణపతి ఆరాధనలో ఒక ప్రత్యేకత. 21 పత్రులు లేదా 108 పత్రులు పూజకు వాడాలని శాస్త్రము. ఈ పత్రులన్నింటికీ ఆయుర్వేద వైద్య విధానంలో మంచి ఔషధీగుణాలున్నాయి.
  • ఏ మాత్రము ఆదరణకు నోచుకోని జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు వినాయకుని పూజకు వాడతారు.
  • తెలుగు వారు వినాయకునికి ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పళ్లు నైవేద్యం పెడతారు. ఇవన్నీ నాగరికత పెరగక ముందు వంటలు. నూనెలూ, వేపుళ్ళూ, దినుసులూ అవసరం లేదు. బహుశా వినాయకుని పూజ అతి ప్రాచీన సంప్రదాయం గనుక ఇలా జరిగి ఉండవచ్చును.
  • వినాయకుడి చిత్రం పెళ్ళి శుభలేఖల్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం. సంప్రదాయవాదులకూ, ఆధునికులకూ కూడా ఇది సామాన్యం
  • వినాయకుడి చిత్రాన్ని గీయడానికి చిత్రకారులు ఎన్నో మెళకువలూ, విధానాలూ రూపొందించారు. ఒకటి రెండు చిన్న గీతలునుంచి క్లిష్టమైన డిజైనులవరకూ ఎన్నో విధాలుగా వినాయకుని చిత్రించారు. ఎక్కువగా ఓంకారాకృతిలో వినాయకుని చిత్రించడం సామాన్యం.
  • ఇప్పుడు పల్లెల్లోనూ, చిన్న నగరాల్లోనూ, మహానగరాల్లోనూ వినాయక చవితికి విగ్రహాలు వీధివీధినా ప్రతిష్ఠించి, పూజలు జరిపి, పెద్దయెత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజున నిమజ్జనమైతే ఒక పెద్ద కార్యక్రమమైపోతున్నది. ప్రజలకూ, ప్రభుత్వానికీ ఇది పెద్ద సవాలుగా పరిణమిస్తున్నది.

ఇవికూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ganesha getting ready to throw his lotus. Basohli miniature, circa 1730. National Museum, New Delhi. In the Mudgalapurāṇa (VII, 70), in order to kill the demon of egotism (Mamāsura) who had attacked him, Gaṇeśa Vighnarāja throws his lotus at him. Unable to bear the fragrance of the divine flower, the demon surrenders to Gaṇeśha." For quotation of description of the work, see: Martin-Dubost (1997), p. 73.
  2. Heras 1972, p. 58.
  3. 3.0 3.1 Getty 1936, p. 5.
  4. 4.0 4.1 Rao, p. 1.
    • Brown, p. 1. "Gaṇeśa is often said to be the most worshipped god in India."
    • Getty, p. 1. "Gaṇeśa, Lord of the Gaṇas, although among the latest deities to be admitted to the Brahmanic pantheon, was, and still is, the most universally adored of all the Hindu gods and his image is found in practically every part of India."
    • Rao, p. 1.
    • Martin-Dubost, pp. 2–4.
    • Brown, p. 1.
  5. * Chapter XVII, "The Travels Abroad", in: Nagar (1992), pp. 175–187. For a review of Ganesha's geographic spread and popularity outside of India.
    • Getty, pp. 37–88, For discussion of the spread of Ganesha worship to Nepal, Chinese Turkestan, Tibet, Burma, Siam, Indo-China, Java, Bali, Borneo, China, and Japan
    • Martin-Dubost, pp. 311–320.
    • Thapan, p. 13.
    • Pal, p. x.
  6. 8.0 8.1 Martin-Dubost, p. 2.
  7. విఘ్నాలను తొలగించడంలో గణేశుని పాత్ర ఏమిటో తెలుసుకోవడానికి గణపతి ఉపనిషత్తుపై వ్యాఖ్యానం చూడండి. 12 వ శ్లోకం Saraswati 2004, p. 80
  8. 10.0 10.1 Heras 1972, p. 58
  9. 11.0 11.1 These ideas are so common that Courtright uses them in the title of his book, Ganesha: Lord of Obstacles, Lord of Beginnings. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Vignesha" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  10. "Gananam Tva Ganapatim - In sanskrit with meaning". Green Message.
  11. Brown, Robert L. (1991). Ganesh: Studies of an Asian God (in ఇంగ్లీష్). SUNY Press. ISBN 978-0791406564.
  12. Narain, A.K. "Gaṇeśa: The Idea and the Icon" in Brown 1991, p. 27 harv error: multiple targets (2×): CITEREFBrown1991 (help)
  13. Gavin D. Flood (1996). An Introduction to Hinduism. Cambridge University Press. pp. 14–18, 110–113. ISBN 978-0521438780.
  14. Vasudha Narayanan (2009). Hinduism. The Rosen Publishing Group. pp. 30–31. ISBN 978-1435856202.
  15. 17.0 17.1 For history of the development of the gāṇapatya and their relationship to the wide geographic dispersion of Ganesha worship, see: Chapter 6, "The Gāṇapatyas" in: Thapan (1997), pp. 176–213.
    • Narain, A.K. "Gaṇeśa: A Protohistory of the Idea and the Icon". Brown, pp. 21–22.
    • Apte, p. 395.
  16. For photograph of statue and details of inscription, see: Dhavalikar, M. K., "Gaņeśa: Myth and Reality", in: Brown 1991, pp. 50, 63 harv error: multiple targets (2×): CITEREFBrown1991 (help).
  17. See:
    • Brown, p. 1. "Gaṇeśa is often said to be the most worshipped god in India."
    • Getty, p. 1. "Gaṇeśa, Lord of the Gaṇas, although among the latest deities to be admitted to the Brahmanic pantheon, was, and still is, the most universally adored of all the Hindu gods, and his image is found in practically every part of India."
  18. See:
    • Rao, p. 1.
    • Martin-Dubost, pp. 2–4.
    • Brown, p. 1.
  19. to Jains, Buddhists, and beyond India.
  20. See:
    • Chapter XVII, "The Travels Abroad", in: Nagar (1992), pp. 175–187. For a review of Ganesha's geographic spread and popularity outside of India.
    • Getty, pp. 37-88, For discussion of the spread of Ganesha worship to Nepal, Chinese Turkestan, Tibet, Burma, Siam, Indo-China, Java, Bali, Borneo, China, and Japan
    • Martin-Dubost, pp. 311–320.
    • Thapan, p. 13.
    • Pal, p. x.
  21. See:
    • Thapan, p. 254.
    • Commentary on Gaṇapati Upaniṣad, verse 12 in Saraswati 2004, p. 80 for Ganesha's role as an eliminator of obstacles
  22. Getty, p. 5.
  23. Narain, A. K. "Gaṇeśa: The Idea and the Icon" in Brown 1991, p. 27 harv error: multiple targets (2×): CITEREFBrown1991 (help)
  24. Pal, p. ix.
  25. See:
    • Martin-Dubost, for a comprehensive review of iconography abundantly illustrated with pictures.
    • Chapter X, "Development of the Iconography of Gaņeśa", in: Krishan 1999, pp. 87–100, for a survey of iconography with emphasis on developmental themes, well-illustrated with plates.
    • Pal, for a richly illustrated collection of studies on specific aspects of Ganesha with a focus on art and iconography.
  26. Ellawala, p. 159.
  27. Brown, p. 175.
  28. See photograph 2, "Large Ganesh", in: Pal, p. 16.
  29. See:
    • Martin-Dubost, pp. 197–198.
    • photograph 9, "Ganesh images being taken for immersion", in: Pal, pp. 22–23. For an example of a large image of this type being carried in a festival procession.
    • Pal, p. 25, For two similar statues about to be immersed.
  30. See:
    • Pal, pp. 41–64. For many examples of Ganesha dancing.
    • Brown, p. 183. For popularity of the dancing form.
  31. Four-armed Gaṇeśa. Miniature of Nurpur school, circa 1810. Museum of Chandigarh. For this image see: Martin-Dubost (1997), p. 64, which describes it as follows: "On a terrace leaning against a thick white bolster, Gaṇeśa is seated on a bed of pink lotus petals arranged on a low seat to the back of which is fixed a parasol. The elephant-faced god, with his body entirely red, is dressed in a yellow dhoti and a yellow scarf fringed with blue. Two white mice decorated with a pretty golden necklace salute Gaṇeśa by joining their tiny feet together. Gaṇeśa counts on his rosary in his lower right hand; his two upper hands brandish an axe and an elephant goad; his fourth hand holds the broken left tusk."
  32. Nagar, p. 77.
  33. Getty, p. 1.
  34. Heras, p. 29.
  35. Granoff, Phyllis. "Gaṇeśa as Metaphor". Brown, p. 90.
  36. "Ganesha in Indian Plastic Art" and Passim. Nagar, p. 101.
  37. Granoff, Phyllis. "Gaṇeśa as Metaphor". Brown, p. 91.
  38. See:
    • Br. P. 2.3.42.34
    • Thapan, p. 200, For a description of how a variant of this story is used in the Mudgala Purana 2.56.38–9
  39. For an inconographical chart showing number of arms and attributes classified by source and named form, see: Nagar, pp. 191–195. Appendix I.
  40. For history and prevalence of forms with various arms, and the four-armed form as one of the standard types, see: Krishan 1999, p. 89.
  41. See:
    • Krishan 1999, p. 89, For two-armed forms as an earlier development than four-armed forms.
    • Brown, p. 103. Maruti Nandan Tiwari and Kamal Giri say in "Images of Gaṇeśa In Jainism" that the presence of only two arms on a Ganesha image points to an early date.
  42. Martin-Dubost, p. 120.
  43. See:
    • Martin-Dubost, p. 202, For an overview of snake images in Ganesha iconography.
    • Krishan 1999, pp. 50–53, For an overview of snake images in Ganesha iconography.
  44. See:
    • Martin-Dubost, p. 202.For the Ganesha Purana references for Vāsuki around the neck and use of a serpent-throne.
    • Krishan 1999, pp. 51–52. For the story of wrapping Vāsuki around the neck and Śeṣa around the belly and for the name in his sahasranama as Sarpagraiveyakāṅgādaḥ ("Who has a serpent around his neck"), which refers to this standard iconographic element.
  45. See:
    • Martin-Dubost, p. 202. For text of a stone inscription dated 1470 identifying Ganesha's sacred thread as the serpent Śeṣa.
    • Nagar, p. 92. For the snake as a common type of yajñyopavīta for Ganesha.
  46. See:
    • Nagar, p. 81. For third eye or Shaiva tilaka with three horizontal lines.
    • the dhyānam in: Sharma (1993 edition of Ganesha Purana) I.46.1. For Ganesa visualized as trinetraṁ (having three eyes).
  47. See:
    • Nagar, p. 81. For citation to Ganesha Purana I.14.21–25 and For citation to Padma Purana as prescribing the crescent for decoration of the forehead of Ganesha
    • Bailey (1995), pp. 198–199. For translation of Ganesha Purana I.14, which includes a meditation form with moon on forehead.
  48. "The Colors of Ganesha". Martin-Dubost, pp. 221–230.
  49. Krishan, pp. 48, 89, 92.
  50. Krishan, p. 49.
  51. See:
    • Krishan, pp. 48–49.
    • Bailey (1995), p. 348. For the Ganesha Purana story of Mayūreśvara with the peacock mount (GP I.84.2–3).
  52. See:
    • Krishan, p. 49.
    • Maruti Nandan Tiwari and Kamal Giri, "Images of Gaṇeśa In Jainism", in: Brown, pp.101-102.
  53. See note on figure 43 in: Martin-Dubost, p. 144.
  54. Citations to Matsya Purana 260.54, Brahmananda Purana Lalitamahatmya XXVII, and Ganesha Purana 2.134–136 are provided by: Martin-Dubost, p. 231.
  55. Martin-Dubost, p. 232.
  56. For Mūṣakavāhana see v. 6. For Ākhuketana see v. 67. In: Gaṇeśasahasranāmastotram: mūla evaṁ srībhāskararāyakṛta ‘khadyota’ vārtika sahita. (Prācya Prakāśana: Vārāṇasī, 1991). Source text with a commentary by Bhāskararāya in Sanskrit.
  57. For a review of different interpretations, and quotation, see: Grimes (1995), p. 86.
  58. A Student's Guide to AS Religious Studies for the OCR Specification, by Michael Wilcockson, pg.117
  59. Krishan pp. 49–50.
  60. See:
    • Martin-Dubost, p. 231.
    • Rocher, Ludo. "Gaṇeśa's Rise to Prominence in Sanskrit Literature", in: Brown (1991), p. 73. For mention of the interpretation that "the rat is 'the animal that finds its way to every place,'"
  61. For examples of both, see: Grimes, pp. 79–80.
  62. Chinmayananda, p. 127. In Chinmayananda's numbering system, this is upamantra 8.
  63. Tantra Unveiled: Seducing the Forces of Matter & Spirit By Rajmani Tigunait; Contributor Deborah Willoughby ; Published 1999; Himalayan Institute Press; p. 83; ISBN 0-89389-158-4
  64. Chinmayananda, op. cit., p. 127. In Chinmayananda's numbering system this is part of upamantra 7. 'You have a permanent abode (in every being) at the place called "Muladhara"'.
  65. Krishan pp.1-3
  66. K.N. Somayaji, Concept of Ganesha, p.1 as quoted in Krishan pp.2-3
  67. Krishan p.38
  68. For worship of Ganesha by "followers of all sects and denominations, Saivites, Vaisnavites, Buddhists and Jainas" see Krishan 1981–1982, p. 285
  69. Nagar, Preface.
  70. Grimes p.27
  71. For the fourth waxing day in Māgha being dedicated to Ganesa (Gaṇeśa-caturthī) see: Bhattacharyya, B., "Festivals and Sacred Days", in: Bhattacharyya, volume IV, p. 483.
  72. The Experience of Hinduism: Essays on Religion in Maharashtra ; Edited By Eleanor Zelliot, Maxine Berntsen, pp.76-94 ("The Ganesh Festival in Maharashtra: Some Observations" by Paul B. Courtright); Published 1988; SUNY Press; ISBN 0-88706-664-X
  73. See:
    • Brown (1991), p. 9.
    • Thapan, p. 225. For Tilak's role in converting the private family festivals to a public event in support of Indian nationalism.
  74. See:
    • Momin, A. R., The Legacy Of G. S. Ghurye: A Centennial Festschrift, p. 95.
    • Brown (1991), p. 9. For Ganesha's appeal as "the god for Everyman" as a motivation for Tilak.
  75. For Tilak as the first to use large public images in maṇḍapas (pavilions or tents) see: Thapan, p. 225.
  76. "Karpaga vinayakar temple".</
  77. This work and its description are shown in Pal, p. 125.
  78. For a representation of this form identified as Maharakta, see Pal, p. 130.
  79. Nagar, p. 175.
  80. Thapan, p. 152.
  81. Getty, pp. 55–66.
  82. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Brown అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  83. See:
    • Nagar, p. 175.
    • Martin-Dubost, p. 311.
  84. Getty, pp. 37–45.
  85. Getty, p. 37.
  86. Getty, p. 38.
  87. Getty, p. 40.
  88. Wayman, Alex (2006). Chanting the Names of Manjushri. Motilal Banarsidass Publishers: p.76 . ISBN 81-208-1653-6
  89. See:
    • Getty, p. 42
    • Nagar, p. 185.
  90. Martin-Dubost, p. 311.
  91. Martin-Dubost, p. 313.
  92. Krishan, p. 121.
  93. Krishan, p. 122.
  94. Thapan, p. 158.

ఆధార గ్రంథాలు

మార్చు
  • వినాయకచవితి వ్రతకల్పము - మైలవరపు శ్రీనివాసరావు రచన, ఇతర రచనలు

బయటి లింకులు

మార్చు