వెల్లూర్ జి.రామభద్రన్

వెల్లూర్ జి.రామభద్రన్ (1929 – 2012) తమిళనాడుకు చెందిన మృదంగ వాద్య కళాకారుడు.[1]

వెల్లూర్ జి.రామభద్రన్
Vellore g ramabhadran mridangam artist.jpg
చెన్నైలో జరిగిన ఒక కచేరీలో రామభద్రన్
జననం
గోపాలాచారి రామభద్రన్

(1929-08-04)1929 ఆగస్టు 4
సేలం జిల్లా
మరణం2012 ఫిబ్రవరి 27(2012-02-27) (వయస్సు 82)
జాతీయతభారతీయుడు
వృత్తిమృదంగ విద్వాంసుడు
సుపరిచితుడుమృదంగ విద్వాంసుడు
తల్లిదండ్రులుకొన్నక్కోల్ టి.పి.గోపాలాచారి

ప్రారంభ జీవితంసవరించు

ఇతడు వెల్లూరు పట్టణంలో 1929 ఆగష్టు 4వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కొన్నక్కోల్ టి.పి.గోపాలాచారి వెల్లూరులో ఒక సంగీతసభ నిర్వాహకుడు. ఈ సంగీత సభ వెల్లూరు పట్టణంలో పిల్లలకు కర్ణాటక సంగీతంలో పోటీలు నిర్వహిస్తూ ఉండేది. కంచీపురం నయనపిళ్ళై, పాల్గాట్ మణి అయ్యర్, పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్ళై మొదలైన సంగీత విద్వాంసులు ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహించారు. 1936లో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఈ సభలో కచేరీ నిర్వహించింది.[2]
బాలుడైన రామభద్రన్ ఈ సంగీత కచేరీలతో ఆకర్షితుడై 8వ యేట నుండి తన తండ్రి వద్ద మృదంగం నేర్చుకున్నాడు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రజలు భయపడి మద్రాసు నుండి మారుమూల ప్రాంతాలకు తరలివెళ్ళారు. అలా 1942లో తిరుపర్కడల్ శ్రీనివాస అయ్యంగార్ మద్రాసు నుండి సేలంకు తరలి వెళ్ళాడు. దానితో రామభద్రన్‌కు అతని వద్ద గాత్ర సంగీతం నేర్చుకునే అవకాశం లభించింది.[2]
1950లో రామభద్రన్ చెన్నైకు తరలివెళ్ళి మైలాపూర్‌లో నివాసం ఉన్నాడు.

ప్రదర్శనలుసవరించు

ఇతడు మొట్టమొదటిసారిగా మదురై మణి అయ్యర్ కచేరీకి మృదంగ సహకారం అందించాడు. 1940లలో చెన్నైలో సంగీత సభలు ఎక్కువగా లేవు. ఇతడు మదురై మణి అయ్యర్‌తోపాటు తమిళనాడులోని అనేక దేవాలయాలలో కచేరీలలో పాల్గొన్నాడు.

ఇతడు అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, కె.వి.నారాయణస్వామి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, టి.వి.శంకరనారాయణన్, టి.ఎన్.శేషగోపాలన్, బి.రాజం అయ్యర్, పి.ఎస్.నారాయణస్వామి వంటి గాత్రవిద్వాంసులకు, టి.ఆర్.మహాలింగం, ఎన్.రమణి వంటి వేణుగాన విద్వాంసులకు, లాల్గుడి జయరామన్, టి.ఎన్.కృష్ణన్ వంటి వాయులీన విద్వాంసులకు మృదంగ సహకారం అందించాడు.[1] ఇతడు జాకిర్ హుసేన్, అల్లా రఖా, అంజద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా వంటి హిందుస్తానీ సంగీత విద్వాంసులకు కూడా వాద్యసహకారాన్ని సమకూర్చాడు.[2]

ఇతడు 1962లో మొదటిసారి అమెరికా దేశంలో పర్యటించి ఎస్.బాలచందర్, ఎన్.రమణి, ఉమయల్పురం కె.శివరామన్ మొదలైన వారి కచేరీలకు మృదంగ సహకారం అందించాడు.[2] ఇంకా ఇతడు ఐరోపా, అమెరికా, రష్యా ఖండాలలో పర్యటించాడు.[3]

తమిళ సినిమాసవరించు

ఇతడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సింధుభైరవి సినిమాలో కె. జె. ఏసుదాసు పాడిన మరి మరి నిన్నే అనే పాటకు మృదంగం వాయించాడు. చిత్రంలో గాయకుడిగా శివకుమార్, మృదంగ కళాకారుడిగా ఢిల్లీ గణేశ్ నటించారు.

అవార్డులు, సత్కారాలుసవరించు

 • 1975లో కృష్ణ గాన సభ, చెన్నై వారిచే సంగీత చూడామణి [2]
 • 2004లో మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి[4]
 • 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు[5]
 • 1998లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారిచే సంగీత కళాశిఖామణి[6]
 • 2012లో సంగీత నాటక అకాడమీ టాగూర్ రత్న

శిష్యులుసవరించు

ఇతడు అనేక మంది శిష్యులను మృదంగ కళాకారులుగా తయారు చేశాడు. ఇతని శిష్యులలో ప్రకాష్ రావు (న్యూజెర్సీ), రమేష్ శ్రీనివాసన్ (కాలిఫోర్నియా), అనత కులతుపుళ (త్రివేండ్రం) వంటి వారున్నారు.

మరణంసవరించు

ఇతడు 2012, ఫిబ్రవరి 27 వ తేదీన తన 82వ యేట మరణించాడు.[7]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Mridangam maestro no more - The Hindu". thehindu.com. Retrieved 2016-09-25.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 Ramabhadran Interview
 3. "Mridangam Maestro Vellore Ramabhadran dead". Archived from the original on 2014-01-08. Retrieved 2021-03-13.
 4. Recipients of Sangita Kalanidhi Archived 2016-03-04 at the Wayback Machine
 5. Instrumental - Carnatic Mridangam Archived 2015-05-30 at the Wayback Machine
 6. "Awardees of Sangeetha Kalasikhamani". Archived from the original on 2018-09-26. Retrieved 2021-03-13.
 7. Mridangam exponent dead

బయటి లింకులుసవరించు

 1. "Mari Mari Ninne" song video యూట్యూబ్లో
 2. Ramabhadran Solo యూట్యూబ్లో