సమ్మక్క సారక్క జాతర

మేడారం అనే గ్రామం లో జరిగే ఒక గిరిజన జాతర

సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.

జాతర దృశ్యం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.[1] భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా.

ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. "దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర"గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1996 లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది.

ఎవరీ సమ్మక్క-సారక్కలు?

మార్చు
 
జాతరలో జన సముద్రం

నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతములోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్లినప్పడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులూ, సింహాలూ ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్ళి చేసాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు "పగిడిద్దరాజు" కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు, అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.

ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

జాతర విశేషాలు

మార్చు
 
జాతరలో మరొక దృశ్యం.

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు.[2] దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు.మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళె కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర, ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర.

తెలంగాణ కుంభమేళా

మార్చు
 
జంపన వాగులో స్నానం చేసే భక్తులు

తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ ల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు,ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణేలను తీసుకు వస్తారు.పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.[3]

హెలికాప్టర్‌ సేవలు

మార్చు

2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే జాతరకు ఫిబ్రవరి 13వ తేదీనుంచి హెలికాప్టర్‌ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఈమేరకు హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో భక్తులను మేడారం చేర్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ భక్తులను జాతరకు చేర్చడమే కాక జాతర విహంగ వీక్షణానికి హెలికాప్టర్లలను ఏర్పాటుచేసింది. పూర్తివివరాలు https://helitaxii.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.[4]

మూలాలు, వనరులు

మార్చు
  • వార్త దినపత్రిక ఆధ్యాత్మిక పేజి - శ్రీకాకుళం ఎడిషన్ - వ్రాసినవారు : డా.వందన శేషగిరిరావు-శ్రీకాకుళం.

ఇవి కూడా చూడండి

మార్చు

సూచనలు

మార్చు
  1. "తెలంగాణ రాష్ట్ర పండగలలో - సమ్మక్క సారలమ్మ మహా జాతర" (PDF).
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (14 February 2016). "సమ్మక్క కొలువైన చిలుకల గుట్ట". ఠాకూర్ ప్రతాప్‌సింగ్. Retrieved 23 February 2018.
  3. Jhathara. "Thelangana sampada". Archived from the original on 18 డిసెంబరు 2012. Retrieved 5 September 2012.
  4. "Telangana News: ఆదివారం నుంచి మేడారానికి హెలికాప్టర్‌ సేవలు". EENADU. Retrieved 2022-02-12.

బయటి లింకులు

మార్చు