ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.[1] వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు వస్తారు. మేడారం జాతరకు నిర్వహణకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.75 కోట్లు,[2] కేంద్ర ప్రభుత్వం రూ.2.5కోట్లు విడుదల చేశాయి.[3]ఈ ఏడాది జాతరకు ప్రభుత్వం అంచనా దాదాపుగా కోటి 20 నుండి 35 లక్షల భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.[4]

సమ్మక్క సారలమ్మ జాతర

జాతర తేదీలు

మార్చు
  • 16 ఫిబ్రవరి 2022 బుధవారం రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చుట
  • 17 ఫిబ్రవరి 2022 గురువారం రోజున చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వచ్చుట
  • 18 ఫిబ్రవరి 2022 శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుట
  • 19 ఫిబ్రవరి 2022 శనివారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వన ప్రవేశం

మొదటి రోజు

మార్చు

కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలైంది. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో గల ఈ గ్రామంలోని చిన్న ఆలయంలో గద్దెపైకి కన్నెపల్లి నుంచి ప్రతిష్టించిన సారలమ్మ మేడారం గద్దె వద్దకు చేరుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు (పూజారులు) మేడారంలోని గద్దెలకు వచ్చి, ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి చేరుకున్నారు. అక్కడ వడ్డెలు రెండు గంటలపాటు గోప్యంగా పూజలు చేసి, దేవతారూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చి వరం పడుతున్న వారిపై నుంచి నడిచి వెళ్తారు. ఉత్సవ కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు సారలమ్మను మోస్తున్న వడ్డె వెంట నడుస్తారు. అతడిని దేవదూతగా భావిస్తారు. గ్రామ మహిళలు మంగళహారతులు ఇచ్చి, నీళ్లార బోసి కొబ్బరికాయలు కొడుతూ మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. జంపన్నవాగు దాటుతున్న క్రమంలో వాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు రెండుచేతులు పైకెత్తి అమ్మ వారికి స్వాగతం పలుకుతారు. అదే రోజు సారలమ్మ గద్దెపైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపైన ప్రతిష్టించారు. పగిడిద్ద రాజు రాత్రి 10.40కి, గోవిందరాజు 10.42కు, సారలమ్మ 10.45 గంటలకు గద్దెలపై కొలువుదీరారు.[5]

రెండోరోజు

మార్చు

రెండో రోజు (17 ఫిబ్రవరి 2022) సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వచ్చింది. ఆరోజు ఉదయం 6 గంటల నుంచే కార్యక్రమం మొదలై, మొదట వడ్డెలు మేడారానికి సమీపంలోని చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేసి అనంతరం సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాల (పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకలగుట్టపైకి వడ్డెల బృందం బయలుదేరారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు ప్రత్యేక పూజలు చేసి తల్లి రూపాన్ని చేతపట్టుకున్న ప్రధాన పూజారి కొకెర కృష్ణయ్య[6] తన్మయత్వంతో ఒక ఉదుటున చిలుకలగుట్ట దిగాడు. సమ్మక్క తల్లి రాకకు సూచనగా ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరిణెను 9.19 గంటల సమయంలో రాత్రి గద్దెలపైకి చేర్చడంతో మాఘశుద్ధ పౌర్ణమి ఘడియలతో మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది.[7][8]

మూడోరోజు

మార్చు

గద్దెలపై ఆసీనులైన సమ్మక్క-సారలమ్మలు మూడోరోజు శుక్రవారం (18 ఫిబ్రవరి 2022) అశేష భక్తజనానికి దర్శనమిచ్చారు. జంపన్నవాగులోపుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకొని కోర్కెలు తీర్చమని సారలమ్మలు వేడుకొని కోర్కెలు తీరిన వారు కానుకలు చెలించారు. వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరె, సారెలు పెట్టి, ఒడి బియ్యం పోసి, తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం (బెల్లం) నైవేద్యం పెట్టారు.[9][10]

నాలుగోరోజు

మార్చు

సమ్మక్క సారలమ్మ మహా జాతరను మూడు రోజులుగా కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క-సారలమ్మలు నాలుగో రోజు శనివారం (19 ఫిబ్రవరి 2022) సాయంత్రం తిరిగి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వనప్రవేశం చేశారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఈ ప్రక్రియ ముగిసింది. దేవతలను గద్దెలపైకి చేర్చే క్రమంలో రక్షణ కల్పించిన విధంగానే పోలీసులు వన ప్రవేశం సమయంలోనూ కట్టుదిట్టమైన రక్షణతో వనాలకు సాగనంపారు. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిదరాజును పూనుగొండ్లకు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది.

మేడారం జాతర రూట్‌ మ్యాప్‌

మార్చు

మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఈ రూట్‌మ్యాప్‌ ద్వారా సొంత వాహనాల్లో మేడారం చేరుకోవచ్చు.[11]

హైదరాబాద్‌ వైపు నుండి వచ్చేవారు

మార్చు

హైదరాబాద్‌ నుంచి మేడారం వెళ్లే భక్తులు నేషనల్‌ హైవే–163 ద్వారా జనగామ మీదుగా రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో భువనగిరి–ఆరెపల్లి బైపాస్‌ ఎక్కాలి. ఆరెపల్లి నుంచి నేరుగా ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, పస్రా.. నార్లాపూర్‌ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడ్, హనుమకొండ మీదుగా వెళ్లాలి. పార్కింగ్‌ : నార్లాపూర్‌

ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట వైపు నుండి వచ్చేవారు

మార్చు

ఖమ్మం, ఇల్లెందు, మహబూబాబాద్,నర్సంపేట, మల్లంపల్లి , పస్రా నుంచి నార్లాపూర్‌ చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, రేగొండ, పరకాల మీదుగా గుడెప్పాడు, వరంగల్‌ నుంచి పోవాల్సి ఉంటుంది. పార్కింగ్‌ : వెంగ్లాపూర్, నార్లాపూర్‌

ఆదిలాబాద్, కరీంనగర్‌, నిజామాబాద్‌ వైపు నుండి వచ్చేవారు

మార్చు

హుజూరాబాద్, పరకాల, రేగొండ, గణపురం, వెంకటాపురం(ఎం), జగాలపల్లి క్రాస్‌ నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, గారెపల్లి నుంచి మంథని, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్‌ చేరుకుంటారు. పార్కింగ్‌ : నార్లాపూర్, కొత్తూరు

లింగాల, గుండాల వైపు నుండి వచ్చేవారు

మార్చు

ఇల్లెందు, రొంపేడు, గంగారం, పూనుగొండ్ల, లింగాల, పస్రా, నార్లాపూర్, మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, పరకాల, రేగొండ మీదుగా గూడెప్పాడ్, వరంగల్‌ నుంచి నర్సంపేట చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్‌ : వెంగ్లాపూర్‌

రామగుండం, మంథని వైపు నుండి వచ్చేవారు

మార్చు

రామగుండం, గోదావరిఖని, మంథని, కాటారం, గారేపల్లి ఎడమవైపు నుంచి కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌లోనే వెళ్లాలి.

పార్కింగ్‌ : కాల్వపల్లి, నార్లాపూర్‌

కాళేశ్వరం, మహారాష్ట్ర వైపు నుండి వచ్చేవారు

మార్చు

కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వ పల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా కరీంనగర్‌ చేరుకోవాలి. పార్కింగ్‌ : ఊరట్టం

వాజేడు, ఛత్తీస్‌గఢ్‌ వెంకటాపురం(కె) వైపు నుండి వచ్చేవారు

మార్చు

ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు వాజేడు, జగన్నాథపురం నుంచి ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, మల్యాల, ఊరట్టం నుంచి మేడారం చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌మీదుగా వెళ్లాలి. పార్కింగ్‌ : ఊరట్టం

మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం వైపు నుండి వచ్చేవారు

మార్చు

కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం నుంచి చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రూట్‌లో ఏదైనా ట్రాఫిక్‌ సమస్య వస్తే అత్యవసరంగా ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ పార్కింగ్‌ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్‌ : ఊరట్టం

ఆర్టీసీ సేవలు

మార్చు

మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా బస్సులు నడుపుతున్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ 3,845 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.[12] మేడారం జాతరకు వెళ్లలేని వారి కోసం ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకునే వీలు కల్పిస్తుంది.[13] సమ్మక్క సారక్క జాతర కోసం ఆర్టీసీ మేడారం విత్ టీఎస్ ఆర్టీసీ పేరుతో ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసింది.

ఏదైనా కారణాల వల్ల మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మకు మొక్కు చెల్లించుకోలేని భక్తుల కోసం దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్థానికంగా 5 కేజీల వరకు బంగారం (బెల్లం)ను కొని సమీపంలోని ఆర్టీసీ కార్గో కార్యాలయంలో ఇస్తే, దాన్ని తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించి, జాతర ముగిసిన తర్వాత ఆ భక్తులకు ప్రసాదం, పసుపు, కుంకుమ, అమ్మవార్ల ఫొటోలను అందజేస్తారు. కార్గో ద్వారా బెల్లం మొక్కు చెల్లించుకునేందుకు 200 కిమీల వరకు రూ.400, ఆపై కిమీలకు రూ.450 ఛార్జీ పెట్టారు. [14]

హెలికాప్టర్ సేవలు

మార్చు

మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బెంగళూరుకి చెందిన తుంబి ఏవియేషన్ సంస్థతో కలిసి బేగంపేట ఎయిర్​పోర్టులో హెలికాప్టర్ సేవలను ఫిబ్రవరి 15న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు.[15] జాయ్​రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలను ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు అందించారు.[16]టికెట్ బుకింగ్‌ కోసం 94003 99999, 98805 05905 నంబర్లకు లేదా info@helitaxii.com వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు:[17]

హెలికాప్టర్​ సర్వీస్ రూట్లు ప్రత్యేకత టికెట్​ ధర
జాయ్​రైడ్​ సర్వీస్ మేడారంలో గగన విహారం 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం(ఏరియ‌ల్ వ్యూ) 3,700
షటిల్​ సర్వీస్ హనుమకొండ -మేడారం కేవలం 20 నిమిషాల్లో జాతరకు 19,999
చార్టర్ సర్వీస్ హైదరాబాద్ -మేడారం 5 సీట్లు, వీఐపీ దర్శనం 75,000
చార్టర్ సర్వీస్ కరీంనగర్ -మేడారం 5 సీట్లు, వీఐపీ దర్శనం 75,000
చార్టర్ సర్వీస్ మహబూబ్​నగర్-మేడారం 5 సీట్లు, వీఐపీ దర్శనం 1,00,000

మేడారం జాతరలో హరిత హోటల్‌ పక్కన తొలిసారిగా హాట్ ఎయిర్‌ బెలూన్‌, పారా సెయిలింగ్‌ రైడ్‌లను ఏర్పాటు చేశారు. హాట్ ఎయిర్‌ బెలూన్‌ రైడ్‌కు రూ.1,000, పారా సెయిలింగ్‌కు రూ.500గా నిర్ణయించినట్లు, హాట్ ఎయిర్‌ బెలూన్‌లో నలుగురు, పారా సెయిలింగ్‌ ద్వారా ఒకరు ఆకాశంలో 5 నుంచి 10 నిమిషాల వరకు విహరించవచ్చు.[18]

జాతరకు విచ్చేసిన రాజకీయ ప్రముఖులు

మార్చు

మేడారం హుండీ ఆదాయం

మార్చు

2022 మేడారం జాతరలో మొత్తం 517 హుండీలు ఏర్పాటు చేయగా, ఎనిమిది రోజులపాటు హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండలంలో హుండీల కౌంటింగ్ లో మొత్తం 10కోట్ల 91లక్షల 62వేల రూపాయల ఆదాయం లభించింది. హుండీ ఆదాయంలో 33శాతం పూజారులకు, 67 శాతం దేవాదాయ శాఖకు చెందుతుంది. సమ్మక్క సారలమ్మ ఆలయ యంత్రాంగం సహా దేవాదాయశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఇవీ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (25 April 2021). "మేడారం జాతర-2022 తేదీలను ప్రకటించిన పూజారులు". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  2. Prabha News (9 November 2021). "మేడారం జాతరకు రూ.75 కోట్లు". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  3. V6 Velugu (13 February 2022). "మేడారం జాతరకు కేంద్ర నిధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (19 February 2022). "ముగిసిన మేడారం జాతర: కోటి 35 లక్షల మంది హాజరు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  5. Sakshi (17 February 2022). "మేడారం గద్దెపైకి సారలమ్మ.. చిలకలగుట్ట నుంచి రానున్న సమ్మక్క". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  6. Sakshi (17 February 2022). "సమ్మక్కను తీసుకొచ్చేది తనే.. కోటికొక్కడు". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  7. Namasthe Telangana (18 February 2022). "పురివిచ్చుకొన్న మేడారం". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  8. Sakshi (18 February 2022). "జన సమ్మోహనం.. జగజ్జనని ఆగమనం". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  9. Andhra Jyothy (19 February 2022). "వరాల తల్లులకు జేజేలు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  10. Eenadu (19 February 2022). "తనివితీరా దర్శనం... తన్మయత్వంలో భక్తజనం". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  11. telugu (12 February 2022). "మేడారం జాతర రూట్‌ మ్యాప్‌". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  12. Andhra Jyothy (13 February 2022). "మేడారం జాతరకు 3,845 బస్సులు : టీఎస్ ఆర్టీసీ". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  13. ETV Bharat News (16 February 2022). "మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు అదరహో." Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  14. Sakshi (7 February 2022). "మేడారం వెళ్లి మొక్కులు చెల్లించలేని వారికి కార్గో పార్శల్‌ సర్వీసులు.. ఎప్పటినుంచంటే". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  15. Eenadu (16 February 2022). "మేడారం జాతరకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  16. Zee News Telugu (12 February 2022). "మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లొద్దామా..! పూర్తి వివరాలివిగో." Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  17. Prime9News (16 February 2022). "మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  18. ETV Bharat News (12 February 2022). "మేడారం జాతరలో హాట్ ఎయిర్‌ బెలూన్‌, పారా సెయిలింగ్‌ రైడ్లు". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  19. Eenadu (19 February 2022). "ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునేందుకే రోడ్డు మార్గంలో వచ్చా: తమిళిసై". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  20. Namasthe Telangana (18 February 2022). "వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా : కేంద్ర గిరిజ‌న శాఖ మంత్రి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  21. Namasthe Telangana (19 February 2022). "వనదేవతల సేవలో." Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.