మైమ్ మధు

(అరుసం మధుసూదన్ నుండి దారిమార్పు చెందింది)

మైమ్ మధు గా పేరు గాంచిన అరుసమ్ మధుసూదన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మైమ్ (మూకాభినయం) కళాకారుడు, నటుడు.[1][2] వరంగల్లుకు చెందిన ఇతను అంతర్జాతీయ స్థాయి కళాకారుడిగా పేరు గాంచాడు.[3]

మైమ్ మధు
Mime Madhu.jpg
జననంఅర్సం మధుసూదన్
అక్టోబర్ 6, 1977
వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
నివాసంహైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
చదువురంగస్థల కళల్లో పి. జి
విద్యాసంస్థలుహైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం
వృత్తిమైమ్ కళాకారుడు, నటుడు
జీవిత భాగస్వామిమహాలక్ష్మి (సబ్రినా)
వెబ్ సైటుఇండియన్ మైమ్ అకాడమీ

జీవిత విశేషాలుసవరించు

వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ మండలానికి చెందిన భీమారం గ్రామంలో వినాయకచవితి ఉత్సవాలప్పుడు పదిహేడేళ్ల వయసులో ఏకపాత్రాభినయం చేశాడు మధు. అదే మధు మొదటి ప్రదర్శన. ఈ కళనే మైమ్ అంటారనీ అందులో శిక్షణ పొందే ఉద్దేశంతో మైమ్‌ కళలో పేరున్న ఓ వ్యక్తి దగ్గరికెళ్లాడు. శిష్యుడిగా చేరడానికి వెళ్ళాడు. కానీ ఆయన ఇతన్ని తిరస్కరించాడు. ఎలాగైనా మైం లో నైపుణ్యం సంపాదించుకోవాలనే పట్టుదలతో మైమ్‌ గురించి ఆరా తీశాడు. తమ ప్రాంతంలోనే పి. నాగభూషణం, కళాధర్‌ అనే కళాకారులున్నారనే విషయం తెలిసింది. నాగభూషణాన్ని ఒప్పించి ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు. మధుకు ఈయనే తొలి గురువు. మెళకువలు ఒంట పట్టించుకుంటూనే ఆయనతో కలిసి వందల ప్రదర్శనలిచ్చాడు.

డిగ్రీలో ఉన్నపుడు అతడి కాలేజీలోని ప్రేక్షక సభ అనే ఓ సాంస్కృతిక సంస్థ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కళాకారుడిగా ఎంపికయ్యాడు. సరిగ్గా అదే సమయంలో భారత ప్రభుత్వం కోల్‌కతాలో జరిగే జాతీయ ఐక్యతా సమ్మేళనానికి ఇద్దరు కళాకారులను పంపమని ప్రేక్షకసభను కోరింది. ఆ ఇద్దరిలో ఒకడిగా వెళ్లాడు మధు. కోల్‌కతా లో పేరొందిన మైమ్‌ కళాకారుడు నిరంజన్‌ గోస్వామిని కలిసి ఆయన శిష్యుడిగా చేరాడు. ఆయనతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చాడు.

తర్వాతి ప్రపంచమంతటా పేరున్న మైమ్‌ ఆర్టిస్ట్‌ టోనీ మోంటనారోతో కలిసి పని చేశాడు. యు.ఎస్‌. మైమ్‌ థియేటర్‌ మోంటనారో పేరు మీద ఏటా ఒక్కరికి స్కాలర్‌షిప్‌ ఇస్తుండేవాళ్లు. 2000లో ఆ స్కాలర్‌షిప్‌ ఎంపికయ్యాడు మధు. కానీ వెళ్ళడానికి అతని ఆర్థిక స్థోమత సరిపోలేదు. చినజీయర్ స్వామి ఇతని ప్రదర్శన చూసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. ఈ సహాయంతో అమెరికాలో నెలరోజుల పాటు శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తయ్యాక అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలిచ్చాడు. మైమ్‌లో పరిపూర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఇండియా తిరిగొచ్చాక యోగా నేర్చుకున్నాడు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి రంగస్థల కళల్లో స్నాతకోత్తర విద్యను అభ్యసించాడు. కేరళ యుద్ధవిద్యయైన కలరిపయట్టు నేర్చుకున్నాడు. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది.

ఇండియన్‌ మైమ్‌ అకాడెమీ స్థాపనసవరించు

మధు హైదరాబాద్‌లో స్థిరపడ్డాక ఇండియన్‌ మైమ్‌ అకాడెమీ అనే సంస్థను ప్రారంభించాడు. సామాన్య ప్రజల నుంచి తెరపై హావభావాలు పలికించే నటులందరికీ ఉపయోగపడేలా ఓ కోర్సు రూపొందించాడు. అంతేకాదు ఒకనాటి తన అనుభవాన్ని మనసులో పెట్టుకొని కళపై అభిమానంతో తన దగ్గరికొచ్చే పేద పిల్లలకు ఉచితంగా మైమ్‌లో శిక్షణనిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి మైమ్‌ కళతో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాడు.

అందుకున్న అవార్డులు, సత్కారాలుసవరించు

  • 2003లో థియేటర్‌ ఆర్ట్‌ విభాగంలో నంది అవార్డు.
  • 2007లో కేంద్రప్రభుత్వ ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ సంగీత నాటక అకాడెమీ అవార్డు.
  • ప్రపంచంలోనే అతి కొద్దిమంది మైమ్‌ కళాకారులకిచ్చే 'టోనీ మాంటెనారో' స్కాలర్‌షిప్‌.
  • జపాన్‌ 'మిన్‌ తనక' స్కాలర్‌షిప్‌.

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ (25 June 2017). "వావ్.. మైమ్". Retrieved 6 October 2017. Cite news requires |newspaper= (help)[permanent dead link]
  2. ఆంధ్రజ్యోతి (26 July 2017). "అంతర్జాతీయ మైమ్ ఫెస్టివల్‌కు 'మైమ్' మధు". Retrieved 6 October 2017. Cite news requires |newspaper= (help)
  3. "తెలుగు వెలుగు: మాటలుండవు కానీ". Ramoji Foundation. రామోజీ ఫౌండేషన్. 1 February 2019. Retrieved 9 March 2019.

ఇతర లింకులుసవరించు

ఇండియన్ మైమ్ అకాడమీ వెబ్సైట్లో మధు బయోగ్రఫీ

"https://te.wikipedia.org/w/index.php?title=మైమ్_మధు&oldid=2889402" నుండి వెలికితీశారు