అయ్యగారి సాంబశివరావు

భారతీయ అణు శాస్త్రవేత్త
(ఏ. ఎస్. రావు నుండి దారిమార్పు చెందింది)

ఎ.యస్.రావు గా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు (1914–2003) భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదు లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు[1][2] పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు.

అయ్యగారి సాంబశివరావు
పౌరసత్వంభారతీయుడు

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఎ.యస్.రావు సెప్టెంబర్ 20, 1914పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో జన్మించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి విజ్ఞానశాస్త్రంలో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా ఉపకార వేతనాలకు ఎన్నికైనాడు. 1947లో స్టాన్‌ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ అణుశక్తి విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ హోమీ బాబా వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఇతను 2003, అక్టోబర్ 31న మరణించాడు.

విజయాలు

మార్చు

సాంబశివరావు హోమీ భాభా, విక్రం సారాభాయ్ లతో కలసి పనిచేశాడు. అతడు భారతదేశంలో గల యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించాడు. ఈ ముగ్గురు, మరికొంతమంది ప్రతిభావంతులలో ఒకరైన సూరి భగవంతం లతో కలసి ఒక ఎలక్ట్రానిక్స్ కమిటీ యేర్పాటు చేయబడింది. దీనిని "భాభా కమిటీ" అని అంటారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అధ్యయనం భారతదేశంలో ఎలా ఉండాలో పరిపూర్ణ నివేదికను, సూచనలను అందజేసింది.

భాభా కమిటీ నివేదిక భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి మొదటి నమూనా అయింది. ఇది రావుగారి నమ్మకానికి, ప్రయోగాత్మక అనుభవాలకు గుర్తుగా ఉంది. ఈ నివేదిక ప్రాప్తికి భారత ప్రభుత్వం స్వంతంగా ఇసిఐయల్ అనే సంస్థను 1967 ఏప్రిల్ 11 లో స్థాపించింది. దీనికి ఛైర్మన్ గా విక్రం సారాభాయ్, మొదటి బోర్డు డైరక్టర్ రావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించాడు. మొదటి పది సంవత్సరాలలో రావు ఇసిఐయల్ కు చుక్కానిగా ఉండి ఉత్పత్తి సామర్థ్యాన్ని, వ్యాపారాన్ని, సహాయాన్ని, ఉపాథి సామర్థ్యాన్ని విశేషంగా పెంచారు. ఈ సంస్థలో రావు అనుభవాల వలన భారత ప్రభుత్వం 1971 లో రావుగారిని ఎలక్ట్రానిక్స్ కమిషన్ లో ముఖ్య సభ్యునిగా నియమించింది.

డా. ఎ.ఎస్.రావు గారు ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త, ఇంజనీరు, వ్యవస్థాపకుడు, నాయకుడు. స్వదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ స్థాపించడంలో, భారత అణు రియాక్టర్లను నియంత్రించు వ్యవస్థలను అభివృద్ధిచేయుటకు కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఆయన ప్రసిద్ధ మానవతా వాది, సామ్యవాది. ఆయన మధ్య తరగతి ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన కాలంలో సామాన్య ప్రజలకు మరుగుదొడ్లు కట్టించుటకు విశేషకృషి చేయడం అతనికికు ప్రజలపై ఉన్న అభిమానానికి గుర్తుగా చెప్పుకోవచ్చు.

డా.ఎ.ఎస్ రావు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి భారత దేశ ఖ్యాతిని పెంపొందించిన వ్యక్తి. అతను 31 అక్టోబర్, 2003 న మరణించాడు.

ఎలక్ట్రానిక్స్ రంగానికి అపురూప సేవలు

మార్చు

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో కాస్మిక్ కిరణాలపై పరిశోధనల్లో డాక్టర్ ఏఎస్‌రావు అద్భుత విజయం సాధించారు. ఆసియా ఖండంలోనే మొదటిసారిగా భారత్ రూపొందించిన అణు రియాక్టర్ అప్సరకు కంట్రోల్, మానిటరింగ్ పరికరాలను సమకూర్చారు. బార్క్‌లో ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌కి డైరెక్టర్‌గా పనిచేసినపుడు డిజైన్, డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ అంశాల మీద పరిశోధనలు చేశారు. అప్పుడే స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్, అణుశక్తిరంగాలకు ఎలక్ట్రానిక్స్ వ్యాప్తి చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. దీంతో కేంద్రం హోమి జే బాబా నేతృత్వంలో విక్రమ్ సారాభాయ్, భగవంతం, ఏఎస్‌రావు సభ్యులుగా ఎలక్ట్రానిక్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతిపాదన నుంచి ఉద్భవించిందే ఈసీఐఎల్ సంస్థ.

ఈసీఐల్ ఆవిర్భావం

మార్చు

హైదరాబాద్‌లో ఈసీఐఎల్ సంస్థ ఆవిర్భావానికి డాక్టర్ ఏఎస్‌రావు కృషి మరవలేనిది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, అణు శాస్త్రవేత్త హోమి జె. బాబాతో ఉన్న పరిచయాలతో 1967 ఏప్రిల్ 11న కాప్రాపట్టణం కుషాయిగూడలో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ను స్థాపించి డాక్టర్ విక్రం సారాభాయ్ ఛైర్మన్‌గా, ఏఎస్‌రావు ఎండీగా వ్యవహరించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నలుపు-తెలుపు టీవీలు, కంప్యూటర్‌లను రూపొందించారు. సంస్థ స్థాపనతో దేశంలోని అనేక ప్రాంతాల వారికి ఉద్యోగావకాశాలు లభించాయి. ప్రస్తుతం ఇందులో సుమారు 3వేల మంది పనిచేస్తున్నారు. విభిన్న రంగాలకు ఉత్పత్తులను అందజేస్తూ సంస్థ ఆగ్రస్థానంలో నిలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, చంద్రయాన్ 32మీటర్ డీఎస్ఎన్ యాంటీనా, బ్రహ్మోస్ మిసైల్ చెక్అవుట్ వెహికల్, అణువిద్యుత్ కంట్రోల్ సిస్టమ్స్, మేజర్ అట్మాస్పెరిక్ చెరెంకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్) టెలిస్కోప్, నిషేధిత ప్రాంతాల్లో భద్రతకు రోడ్డు బ్లాకర్, ఎక్స్‌రే బ్యాగేజ్.. ఇలా రక్షణ, అంతరిక్షం తదితర రంగాలకు పలు ఉత్పత్తులను అందించింది.

పురస్కారాలు

మార్చు

రావుగారు శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి, యునైటెడ్ నేషన్స్ లోజరిగే అణుశక్తి ఉపయోగాల పై శాంతి సమావేశాల వంటి అనేక అంతర్జాతీయ సమావేశాలకు భారతదేశం తరపున పాల్గొన్నారు. ఆయన అనేక విజ్ఞాన పత్రికలకు సంపాదకునిగా, సలహా మండలి సభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ కు కూడా సంపాదకునిగా పనిచేశారు.[2]

హైదరాబాదులో ఏఎస్ రావు కాలనీ

మార్చు

ఈసీఐఎల్ ఉద్యోగులు 1980లో సొసైటీని ఏర్పాటు చేసి సుమారు 120 ఎకరాల్లో ఏఎస్‌రావు పేర కాలనీ ఏర్పాటు చేశారు. దీనికి అతను పూర్తిగా సహకరించారు. అతను జయంతి సందర్భంగా ఈసీఐఎల్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఈసీఈసీహెచ్‌సీ సొసైటీ లిమిటెడ్, ఏఎస్ రావు కాలనీ సంక్షేమ సంఘం, ఈసీఓఏ, ఈసీఐఎల్ కార్మిక సంఘం తదితర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏటా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏఎస్‌రావు అవార్డు కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబరులో విద్యార్థులకు సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

తపాలా కవరు

మార్చు

హైదరాబాదులోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అనే‌ కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు వ్యవస్థాపక సి.ఎం.డి ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ డా. A.S రావు (1914-2003) శత జయంతి సందర్భంగా భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల కవర్ ను 16-11-2014 న విడుదల చేశారు.

మూలాలు

మార్చు
  1. History of Electronics Corporation of India Ltd
  2. 2.0 2.1 "Dr A. S. Rao (1914-2003)". Archived from the original on 2008-04-23. Retrieved 2009-07-27.

బయటి లింకులు

మార్చు