కడిమిళ్ళ వరప్రసాద్

కడిమిళ్ళ వరప్రసాద్ గురుసహస్రావధాని. వరప్రసాద శతావధానిగా సుప్రసిద్ధులు.[1]

కడిమిళ్ళ వరప్రసాద్

జీవిత విశేషాలు సవరించు

ఆయన పూర్తి పేరు కడిమిళ్ళ శ్రీరామచంద్ర వరప్రసాదరావు. ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జూలై 1 1956 న భారతీ, వేంకటరామయశాస్త్రుల దంపతులకు జన్మించారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో పెరిగారు. తండ్రి పౌరోహిత్య వృత్తిని స్వీకరించి స్వగ్రామమయిన తూర్పుగోదావరి జిల్లా ఏడిదలోనే జీవనాన్ని సాగించారు. వరప్రసాద్ ఏడిద గ్రామంలోనే పదవ తరగతి వరకు చదివించారు. కడిమిళ్ళ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలలో నాటకాలలో నటుడిగా పాత్రలను వేసేవారు.

హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే కవితలల్లడం, ఉపన్యాసాలివ్వడం, నాటకాలలో పాత్రలు ధరించడం మొదలయిన రంగాలలో పాల్గొనడమే కాక ప్రజ్ఞావంతునిగా పేరు తెచ్చుకున్నారు.తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరలో ఉన్న పొడగట్లపల్లి గ్రామంలోని శ్రీమతి పెన్మెత్స సూరయ్యమ్మ సత్యనారాయణరాజు ఓరియంటల్ కళాశాలలో 1979 వ సంవత్సరంలో ఆ కళాశాలలో చేరి భాషా ప్రవీణ చదివారు. భాషాప్రవీణ చదవమని సూచించిన దొంతుకుర్తి రామజోగిశర్మగారి దగ్గర శబ్దమంజరిని చదువుకున్నారు శ్రీ వరప్రసాద్. అంటే ప్రాచ్యవిద్యకు సంబంధించినంతవరకు కడిమిళ్ళవారి తొలిగురువు రామజోగిశర్మగారే.

కవిగా సవరించు

పొడగట్లపల్లిలో భాషాప్రవీణ ప్రవేశం చదువుతున్నరోజుల్లో ఎలాగయినా పధ్యం రాయాలనే ఉబలాటం పెరిగింది. ఒకరోజు ఆరుబైట పండువెన్నెలలో పడుకుని ఎంత ప్రయత్నించినా నిద్ర రావడంలేదు. ఎలాగైనా పద్యం వ్రాయాలి ఎలా? ఎలా మొదలు పెట్టాలి? అనే ఆలోచనలతో ప్రయత్నించి, ప్రయత్నించి చివరకు ఒక కందపద్యాన్ని పూర్తి చేసారు.

"ఆకసమందున్న శశీ!
నా కనులకు మోదమిచ్చి నావుర భళిరా!
నేకందము పలుకంగా
నా కంఠము నందు నిల్చి నన్నేలుమురా!"

అది 1974 వ సంవత్సరం కడిమిళ్ళ జీవనమార్గాన్ని నిర్దేశించింది. అక్కడనుండి తాను ప్రతిరోజు పద్యాలు రాసి అందరకు చూపిస్తూ ఉంటే అంత చిన్న వయస్సులో పద్యాలు రాస్తున్నందుకు అందరూ ఆశ్చర్యంలో ఉబ్బి తబ్బిబ్బు అయ్యేవారు. రాసిన ప్రతి పద్యం శ్రీ ఉపద్రష్ట రామలింగస్వామి దిద్దేవారు. అందుకే ఆయనను తొలి గురువుగా కడిమిళ్ళ ప్రకటించారు.

కె.కోటారావుగారు అనే ఆంధ్రోపన్యాసకులు శ్రీ కడిమిళ్ళకు ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. తరగతిగదిలోనే ఆశువుగా ఒక పాదం చెప్పి మిగిలిన మూడు పాదాలు కడిమిళ్ళను పూర్తి చేయమనేవారు. ఈ విధంగా అశువును బాగా అలవాటు చేసింది కోటారావుగారే. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా మొదటి సంవత్సరం, చివరి భాగంలో (1975) ఆనాటి సుప్రసిద్ధ అవధానులు కొవ్వూరు సంస్కృత కళాశాల ఆంధ్రోపన్యాసకులు, మధురకవి, అవధాన శేఖరులు అంటే ఏమిటో తెలియని కడిమిళ్ళకు ఆ అవధానం చూడగానే తనకు కూడా అవధానం చేయాలనే కోరిక అంకురించింది. అంకురించినదే తడవు విడివిడిగా అన్ని అంశాలు అభ్యాసం చేసి భాషాప్రవీణ రెండో సంవత్సరంలో (1976) తొలి అష్టావధానానికి కొందరి విద్యార్థులను మాత్రం కూడగట్టుకుని ఉపాద్యాయులు లేకుండా ప్రయోగాత్మకంగా అవధానం చేసి సఫలీకృతులయ్యారు. ఈ సంగతి విన్న కోటారావుగారికి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా ఉదయించి వారిచ్చే ప్రోత్సాహాన్ని ద్విగుణీకృతం చేసారు. విద్యార్థి దశలో ఉండగానే మండపేట, పెనుగొండ, నూజివీడు మొదలయిన ప్రాంతాలలో అవధాన ప్రదర్శనలు ఇచ్చి వార్తా పత్రికలకు ఎక్కి చిన్నవయస్సులోనే అవధానిగ ప్రాచుర్యాన్ని పొందడం కడిమిళ్ళలో గల విశేషం. అంతేకాదు పొడగట్లపల్లి కళాశాల స్థాపించిన తరువాత అవధానం చేసిన మొదటి విద్యార్థిగా గుర్తింపు పొందారు.[2]

అవధాన గురువుగా సవరించు

ఎంతోమందిని కవులు, అవధానులుగా తీర్చిదిద్ది తగిన ప్రోత్సాహాన్నందిస్తూ, వారి ప్రథమ కుమారుడు రమేష్ ని కూడా కవిగా తీర్చిదిద్దారు. ఆయన అనేక మంది పండితులను అవధానులుగా తీర్చిదిద్దారు. వారిలో కోట వేంకట లక్ష్మీనరసింహం, అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు, వద్దిపర్తి పద్మాకర్, మరడాన శ్రీనివాసరావు. అదే విధంగా మానికి శ్రీను అనే శిష్యుడు తోలేటి పార్థసారథి అనే మరొక శిష్యుడు కడిమళ్ళవారి ప్రేరణతో కొన్ని శతకాలు రచించి ప్రచురించారు.శ్రీ చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్ర్తి, శ్రీ భాగవతులు, కొన్ని కృతులను రచించి ప్రచురించుటం జరిగింది.[3]

అవధాన ప్రస్థానం సవరించు

  • 1985 సెప్టెంబరు 2,3,4 తేదీలనందు శృంగేరీ పీఠాధిపతి జగర్గురు భారతీ తీర్థస్వామి నల్లకుంటలోని శంకరమఠంలో శతావధానం. మూడురోజుల పాటు సాగిన ఆనాటి శతావధానంలో సర్వశ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, పుల్లెల శ్రీరామచంద్రుడు, శ్రీ పేరాల భరత శర్మ, శలాక రఘునాథశర్మ వంటి ఉద్దండులు పృచ్చకులుగా కూర్చోవడమేకాక ప్రతీ ప్రయోగాన్ని సునిశితంగా గమనించారు.
  • 1985 నవంబరు నెలలో విజయవాడ లబ్బీపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో భువనవిజయ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆనాడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమానంద భారతి అధ్యక్షులుగా ఉన్నారు. సరస్వతీ కంఠాభరణ డా||ప్రసాదరాయ కులపతి సంచాలకులుగా ఉన్నారు. కడిమిళ్ళవారి అవధాన గురువులయిన శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. విజయవాడలో కూడా 50 సమస్యలు 50 వర్ణనలు పూర్తిచేసి నూటికి నూరు ధారణ చేయగా అశేష ప్రజానీకం ఎంతో ఆనందించింది.
  • తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో త్రివేణి ఆధ్వర్యంలో మృగశీర్ష వెంకటరమణమూర్తి, ద్వాదశి నాగేశ్వర శాస్త్రి, కందుకూరి పుండరీకాక్షులు మొదలగువారి నేతృత్యంలో రావూరి వేంకటేశ్వర్లుగారి సంచాలకత్వంలో ఉషశ్రీ అప్రస్తుతంతో ఒక శతావధానం నిర్వహించారు. ఈ శతావధానంలో సమస్యలు 25, దత్తపదులు 25, వర్ణనలు 25, ఆశువులు 25, అనే పద్ధతిని స్వీకరించి 75 పద్యాలను ధారణచేశారు.
  • రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం టౌనుహాలులో బేతవోలు రామబ్రహ్మంగారి సంచాలకత్వంలో సాయంకాలం 5:00 గంటలకు ప్రారంభించి, రాత్రి 10:00 గంటలకు ఒకే శతావధానం నిర్వహించి సభ్యులను ఆశ్చర్యపరిచారు.
  • 1992 నవంబరు 14,15 తేదీలలో పెద్దాపురంలో మరొక శతావధానం జరిగింది.
  • 1995 ఫిబ్రవరి 11,12 తేదీలలో కీ||శే|| కొమ్మూరి శేషగిరి రావుగారు (గాంధీ) శ్రీ గోపాల శ్రీనివాసరావు, శ్రీ రాణి సుబ్బయ్య దీక్షితులు మొదలగువారి నేతృత్వంలో శ్రీ గరికిపాటి నరసింహారావు సంచాలకత్వంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్య కళామందిరంలో మరొక శతావధానం జరిగింది.
  • 1995 ఏప్రియల్ 1,2 తేదీలలో యువనామ సంవత్సరము సందర్భంగా న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో బెనర్జి - గుమ్మి వెంగళరెడ్డిగార్ల ఆధ్వర్యంలో చక్రావధానుల కేశాప్రగడ రెడ్డప్ప ధచేజీగారి ఆర్డినేషన్ లో శతావధానం జరిగింది.
  • 1995 జూలై 8,9 తారీకులలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాటి శాసనసభ్యులు శ్రీ వి.వి.ఎస్.చౌదరిగారి నేతృత్యంలో శ్రీ పున్నమరాజు ఉమమహేశ్వరరావు మొదలగు వారి కార్యనిర్వహణలో ప్రసాదరాయ కులపతి, బేతవోలు రామబ్రహ్మంగార్ల సంయుక్త సంచాలకత్వంలో శతావధానంలో సంస్కృతం నుండి తెలుగునకు, తెలుగునుండి సంస్కృతానికి అనువాదాలను కూడా నిర్వహించి మెప్పు పొందారు.
  • 1996 మే 29,30,31, జూన్ 1,2,3 తేదీలలో అనగా ఆరురోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో డా||కడిమిళ్ళ ద్విశతావధానాన్ని నిర్వహించి తన సామర్ధ్యాన్ని ప్రకటించుకున్నారు.
  • 2000 మార్చి 4,5 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో అవధాన భోజశ్రీ వడ్డి శ్యామసుందరరావు నేతృత్యంలో గరికిపాటి ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ గరికిపాటి కాళిదాసు నిర్వహణలో శివరాత్రి మహాపర్వ సందర్భంగా మరొక శతావధానం
  • 2001 ఆగస్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు, కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.

జంట అవధానాలు సవరించు

  • 2002 నవంబరు 9,10 తేదీలలో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడెంలో తెలుగు సాహిత్య సమాఖ్య, శ్రీ వడ్డి శ్యామసుందరరావు గార్ల నేతృత్వంలో నెమ్మలూరు సత్యనారాయణ మూర్తి, కొత్తపల్లి ఉదయబాబు, భారతం శ్రీమన్నారాయణ, ఆకాశం అప్పల నరసింహమూర్తి గార్ల కార్యనిర్వహణలో జరిగిన శిష్యుడు కోట వేంకట లక్ష్మీనరసింహంతో కలిసి జంటకవుల శతావధానం.
  • 2004లో మే 8 నుండి మే 25 వరకు పశ్చిమగోదావరిజిల్లా తణుకులో కోట వేంకట లక్ష్మీనరసింహంతో కలిసి జంటకవుల సహస్రావధానం.

సన్మానాలు సవరించు

  • చదువుకునే రోజులలో పెనుగొండలో అష్టావధానం, నేత్రావధానాలను చేసి "అష్టావధాన సమ్రాట్",
  • విజయవాడ శతావధానంలో "అవధాన సార్వభౌమ" అను బిరుదు పొందారు.
  • రాజమండ్రి శతవధానంలో మహాకవి శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తి స్వయంగా "భారతీపుత్ర" అను బిరుదు ఇచ్చారు.
  • విజయవాడ రాష్ట్రీయ పండిత పరిషత్తువారు ‘పండితరత్న’ అను బిరుదు ఇచ్చారు.
  • అమలాపురం శతావధానంలో రావూరి వెంకటేశ్వర్లుగారు, బేతవోలు రామబ్రహ్మంగారి ద్వారా ‘అవధాన చూడామణి’ అను బిరుదమును ప్రకటింపచేసారు.
  • అదే సభలో వక్కలంక లక్ష్మీపతిరావు ‘శతావధాన చక్రవర్తి’ అను బిరుదు ప్రకటించారు.
  • ఖమ్మం జిల్లా పాల్వంచలోని సాహితీ విద్యుల్లత అనే సంస్ద ‘అవధాన కళానిధి’ అనే బిరుదుతో సత్కరించారు.
  • పెద్దాపురం శతావధానంలో సంస్కృతాంధ్ర శతావధాని చిఱావూరి శ్రీరామశర్మగారు ‘శతావధానసార్వభౌమ’ అను బిరుదు ప్రకటించారు.
  • కిర్లంపూడి, మండపేట శతవధానాలలో ‘సువర్ణ ఘంటాకంకణ’ సత్కారాలు జరిగాయి.
  • భీమవరంలో బోండా సూర్యనారాయణమూర్తిగారు ‘కనకాభిషేకం’ చేసారు.
  • కడిమిళ్ళ, కోట కవులను జంటగా కొయ్యలగుండెం పురవవీథులలో పల్లకిలో ఊరేగించి సత్కరించారు.
  • నరసాపురంలో ‘ప్రతిభా పురస్కారం’
  • పాలకొల్లులో లయన్స్ క్లబ్ ‘టాప్10’ అవార్డు
  • తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ‘సత్యా’ అవార్డు
  • ‘విశాఖ కల్చరల్ అవార్డు’.
  • ‘అధికారభాషా సంఘం’ పురస్కారం
  • డా||కడిమిళ్ళను 2003 డిశంబరు 15వ తేదీన హైదరాబాదు నగరంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నగదు పురస్కారంతో పాటు అవధాన రంగంలో ‘ప్రతిభాపురస్కారాన్ని’ అందించి సత్కరించారు.
  • సర్వధారి విజయదశమి నాడు (9-10-2008) పెద్దాపురం బచ్చు ఫౌండేషన్ వారు నగదు పురస్కారంతో సత్కరించారు.

రచనలు సవరించు

  • అహంకార శతకం.
  • తాంబూలం-1995
  • శ్రీ సంగమేశ్వర శతకం -1977
  • చింతాభికాష్టకం -1979
  • మనజాతి - 1991
  • మధుజీవనం - 1992
  • త్యాగసింధువు -1997
  • అమృతవర్షిణి - 1997
  • అవథాన చంద్రిక -2003
  • సహస్రశారద - 2005
  • పెంపుడు చిలుక - 2006
  • ఏడుచేపలు - 2--7
  • గాండీవం (కవితా సంపుటి)
  • దాసోహం (హిందీ)
  • గురువందనం (హిందీ)

మూలాలు సవరించు

  1. "Sri Kadimilla Varaprasad". ✍pedia. 2010-03-02. Retrieved 2018-05-26.
  2. "జీవనరేఖలు". kadimilla.com/. కడిమిళ్ళ వరప్రసాద్. Retrieved 28 July 2015.[permanent dead link]
  3. "అవధాన గురువుగా". kadimilla.com/. కడిమిళ్ళ వరప్రసాద్. Retrieved 28 July 2015.[permanent dead link]

ఇతర లింకులు సవరించు