గోల్కొండ

హైద్రాబాద్ సమీపం లో ఒక పురాతన కోట
(గోల్కొండ కోట నుండి దారిమార్పు చెందింది)

గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

గోల్కొండ
గోల్కొండ కోట
గోల్కొండ is located in Telangana
గోల్కొండ
తెలంగాణ లో దేవాలయ ఉనికి
సాధారణ సమాచారం
నిర్మాణ శైలిhistorical
భౌగోళికాంశాలు17°23′N 78°24′E / 17.38°N 78.40°E / 17.38; 78.40
పూర్తి చేయబడినది1600s
సాంకేతిక విషయములు
పరిమాణం18
గోల్కొండ దుర్గం గూర్చి శిలాఫలకం

చరిత్ర

మార్చు
 
గోల్కొండ కోట దృశ్యము.

"మంగలవరమ్" నుండి"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మానుగల్లు[1] అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయులకు, ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో గుల్బర్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు సంఘర్షణలు జరిగాయి[2]. మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ నాయకుడు కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడు[3]. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపయ నాయకుడుపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపయ నాయకుడు ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ నాయకుడు మహమ్మద్ షాతో సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు.

1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు.[4] ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు.

కోటలు

మార్చు
 
గోల్కొండ కోట దృశ్యము

గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది, అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.

బారాదరి

మార్చు

ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి గోషామహల్‌ బారాదరి హైదరాబాదు భూమార్గము కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరంన ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరం, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణం, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.

దర్వాజలు

మార్చు

కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారా దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు. సమయములలో శత్రువుల పోకడలను గమనించుటకు వీలుగా బాలాహిసార్‌ ద్వారముల కెదురుగా నిర్మింపబడిన తెరవంటి గోడ. బాలాహిసార్‌ గేటుకు వెలుపలి భాగములో ఒక రంధ్రము ఉంటుంది. యుద్ధ సమయములో శత్రువు గేటు ద్వారా ఏనుగులతో తోయించే సమయంలో దీని నుండి కాగుతున్న నూనెను కాని, కరిగిన లోహమునుకాని పోసేవారు.వైబ్రేషన్‌: బాలాహిసార్‌ గేటు మధ్యభాగంలో మెట్లకు ఎదురుగా నిల్చొని చప్పట్లు కొడితే... తిరిగి బాలాహిసార్‌ ఎత్తయిన భాగము నుండి మారుమోగుతుంది.

ఆయిల్‌ స్టోర్‌ హౌస్‌

మార్చు

ఇది నూనె దాచి ఉంచే కట్టడం. ఇది 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున ఒకే రాతితో మలచబడింది. దీనిలో 12,000 గ్యాలన్ల నూనె నిల్వచేసి, సప్లయి చేసేవారు

బాలాహిసార్‌

మార్చు

ఇది 15 మైళ్ళ విస్తీర్ణముతో కొండల మీద నిర్మించపబడింది. ఇక్కడ చాలా కట్టడములున్నాయి. వాటిలో కుతుబ్‌షా భవనములు, దర్బార్‌ ఎ-ఆల్‌ అనే జనరల్‌ శాసనసభ హాల్‌ (విధాన సభ), దర్బార్‌ -ఎ-ఖాన్‌ అనే ముఖ్యమైన విధాన మండపములున్నాయి. ఇంకా నూతులు, మందుగుండు సామాను దాచి ఉంచు గది, ఆయుధ కర్మాగారం, మసీదులు, దేవాలయాలు, భక్త రామదాసును బంధించిన జైలు, నీటి రిజర్వాయరు, పెద్ద తోట, స్నాన గదులు, తుపాకులు, మందు గుండు సామాను దాచి ఉంచు గది, కుడివైపు దర్బార్‌-ఎ-ఆమ్‌ అనే శాసనసభ హాలుకు పోవుటకు మార్గము... ఎడమవైపు రాజభవనము నిర్మింపబడింది.

కోట బురుజులు

మార్చు

ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పెట్లా బురుజు, మూసా బురుజు,మజ్ను బురుజు ప్రసిద్ధి గాంచినవి. పెట్లా బురుజు కోటకు ఉత్తర పడమర మూలగా వుంటుంది. దీని మీద అలంగిరీ జయమునుకు గుర్తుగా ఫిరంగి అమర్చబడి ఉంది. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది. ఒక మణుగు (165 పౌండ్ల బరువు గల) ఫిరంగి గుళ్ళు ఉంచే వీలుంది. ఇది చూడ్డానికి చాలా అందంగా వుంటుంది. కోటకు దక్షిణముగా మూసా బురుజు ఉంది. 1666 సంవత్సరములో (1977 హిజ్రి) కమాండర్‌ మూసా ఖాన్‌ ఆధిపత్యములో ధర్మాచారి అనే మేస్త్రీ దీన్ని నిర్మించాడు. దీని మీదుగా మీరాన్‌ అను ప్రసిద్ధిగాంచిన సైన్యాధిపతి హతుడౌతాడు. అతని స్థానంలోమూసా ఖాన్‌ నియమితుడవుతాడు. బురుజు మీద ఫిరంగి అమర్చి వుంటుంది. ఇది కూడా పెట్లా బురుజు ఫిరంగి మాదిరిగా దాడిచేయడానికి వీలుగా ఉంటుంది.

కుతుబ్‌షా రాజుల స్నానం

మార్చు
 
కోటలో బాలహిస్సార్ లోపలికెళ్ళగానే కుడి ప్రక్కన శవ స్నానాల గది.

బాలాహిసార్‌ గేటు నుండి లోనికి ప్రవేశించేటపుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది ఉంది. కొంచెము నగీనా తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్ళు... చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినది. ఈ కుళాయిలను చెరువు నుండి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భములలో ఉపయోగించేవారు. ఎవరయినా రాజ వంశస్థులు దివంగతులైనపుడు ఇక్కడ వేడి నీటితో స్నానము చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుండి బయటకు తీసుకెళ్లేవారు.

కఠోరా హౌస్‌

మార్చు

కుతుబ్‌షాహీలు స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు ఇది కోటలోని 'బాలాహిసార్‌' కు ఉత్తర దిశగా నిర్మితమై ఉంది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. దీనిని ఒక చెరువు నుండి వచ్చే నీటితో నింపేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌస్‌ను రాజులు, మరి కొందరు ప్రముఖులు వినోద స్థలముగా ఉపయోగించేవారు.

నగీనా బాగ్‌

మార్చు

తోటకు దక్షిణముగా ఆర్కులలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నాయి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. నగీనా గార్డెన్‌ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతివైపు ఒక కట్టడము ఉంది. ఇది రక్షకభటుల కోసం నిర్మించిన భవనము. కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో, రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గములోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం ఉంది.

బడీ బౌలి

మార్చు

బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బావిలో ఒక మూల రాయి ఉంది. అది వేసవి కాలములో నీరు కిందపడడానికి ఉపయోగపడేది. ఈ బావికి దగ్గరలో రెండు వరండాలున్న ఒక భవనముంది. దీనిలో రాజులు కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకించేవారు.

డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ

మార్చు

బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్‌ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో ఉంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు.

ఎల్లమ్మ దేవి

మార్చు

అక్కన్న మాదన్న, అబ్దుల్‌ హసన్‌ తానీషా కాలములో కట్టినది దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో బోనాల జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు.

దాద్‌ మహల్‌

మార్చు

రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ ఉంది.. బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలము వుంటుంది. ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.

బాలా హిస్సారు దర్వాజా

మార్చు
 
గోల్కొండ కోట లోపలి ద్వారము: బాల హిస్సార్

అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాత మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపించును. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడములో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమయిన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీలద్వారా వెనుక ద్వారము తెరుచుకొనును. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనము కనిపించును. కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపములో అబుల్ హసన్ లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్మకము. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది - జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరు వలె ఉంటుంది.

దేవాలయాలు, మసీదులు

మార్చు
 
గోల్కొండ కోటలో రామదాసు బందిఖానా

హిందూ ఉద్యోగులలో ముఖ్యులయిన అక్కన్న మాదన్నల కార్యాలయములు పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉంటాయి. అక్కడ మనము గండశిల నుండి నిర్మించిన కాకతీయుల కాలమునాటి హిందూ దేవాలయమును కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయముగా సంబోదిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య కట్టడము "తారామతి" నిర్మించిన మసీదు. ఆక్కడి గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం అప్పటి సమర్ధవంతమయిన ఏర్పాట్లకు ఇవి సాక్ష్యాలు.

1518లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కటించిన మసీదు మూలలలో ఉండే మినారుల వలన చాలా బాగా కనిపిస్తుంది. మసీదు ప్రాంగణం కోట బురుజుల వరకు విస్తరించి ఉంది. మసీదుకు దగ్గరలోనే గండశిలలో ఒక చిన్న రామ మందిరము ఉంది. అబుల్ హసన్ తానాషా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తున్న రామదాసును, డబ్బులు దుర్వినియోగ పరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయన ఇక్కడ రాళ్ళపైన రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల రూపాలను చెక్కాడు.

రాచమందిరాలు

మార్చు
 
గోల్కొండ కోటలోని రాచమందిర శిథిలాలు

ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు, రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు, చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు.

దర్బారు హాల నుండి కొండపాదమున ఉండే ఒక రాచమందిరమునకు దారి చూపే రహస్య సొరంగ మార్గము ఉండేదని ఒక అభిప్రాయము. ఇస్లాముమత వాస్తుశాస్త్రము ఆధారముగా నిర్మించిన కుతుబ్ షాహీ నవాబుల సమాధులు గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరమున నిర్మించారు. ఈ సమాధుల చుట్టూ వనములు, వాటి మధ్య అందమయిన రాతి శిల్పాలు ఉన్నాయి.

కోట బయట రెండు వెర్వేరు మండపాలను బండరాళ్ళతో నిర్మించారు. వాటిని తారామతి మందిరము, ప్రేమతి మందిరము అని పెలిచేవారు. వీటిలో అక్కాచెళ్ళెలయిన తారామతి, ప్రేమతి నివసించేవారు. వారు రెండంతస్తుల పైన ఒక వృత్తాకారపు వేధికపై తమ ప్రధర్శనలు ఇచ్చేవారు. దానిని కళామందిరమని పిలిచేవారు. దానిని గోల్కొండ కోట పైన ఉన్న రాజుగారి దర్బారునుండి తిలకించవచ్చును.

గోల్కొండ కోట గైడ్ మ్యాపు

మార్చు
 

ఇతరాలు

మార్చు
 
గోల్కొండ కోట ఒక దృశ్యం

కోట ప్రవేశద్వారం వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగానికి వినిపిస్తుంది. కోటలోకి ప్రవేశించే ప్రతి సందర్శకుడు ఇలా ఒకసారి చప్పట్లు కొట్టి ఆ అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఆ అనుభూతిని పదిలంగా గుండెల్లో దాచుకొని వెళతారు. ఈ ఇంద్రజాలం ఇవాళ ఒక సరదా. ఆనాడు శత్రువు రాక గురించి హెచ్చరించే వ్యూహం.ఇంకా అనేకానేక భద్రతా చర్యల్లో భాగం. కోటలోని ప్రతి మలుపు, ప్రతి ప్రాకారం విస్మయం గొలిపే దృశ్యం.నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నాన శాలలు, వంటశాలలు మొదలుకొని ఆశ్వశాలలు, నూనె నిల్వ చేసే గది ఉన్నాయి. ఆరోజుల్లోనే (క్రీశ1518) వేడినీటి శాలలు, చప్పట్లు కొడితే అల్లంత దూరాన వినిపించే సౌకర్యం వంటివి ఆశ్చర్యచకితులను చేస్తాయి.

కోటలోని రాజభవనాలు, శయన మందిరాలు, స్నానవాటికలు, రాజ ప్రముఖుల భౌతికకాయాలకు చివరిస్నానం చేయించే స్నాన మందిరాలు, తోటలలకు, ఫౌంటెన్లకు రాళ్ళతో నిర్మించిన ఆక్వడెట్లు, రామదాసు బందీఖానా, మసీదులు, మందుగుండును నిల్వచేసే స్టోర్‌ రూములు, సైనికుల నివాసాలు, మంత్రుల కార్యాలయాలు, ఉద్యానవనాలు, హబ్సికమాన్లు, రాజు ఏకాంత మందిరం, తారామతి మసీదు, బారదారి (దర్బారు హాలు) ఇబ్రహీం మసీదు, నయాఖిల్లా వంటివి ఇప్పటికీ సందర్శకుల్ని మరపురాని అనుభూతులకు లోను చేస్తున్నాయి.

దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవు కలిగిన అగడ్తలు, మూడు ప్రాకారాలు, మొత్తం ఎనిమిది మహాద్వారాలు, కోట గోడలపై 15 నుంచి 18 మీటర్ల ఎత్తున వున్న దాదాపు 87 బురుజులతో కూడిన గోల్కొండ కోటలో, కోట సమీపంలో వున్న చాలా ప్రాంతాలు అన్యాక్రాంతమై ఉన్నాయి.

గోల్కొండ కోట దక్కన్‌లోనే అతి పెద్ద దుర్గం. ఇంతటి విస్తీర్ణం, వైవిధ్యం, వాస్తు వైభవం వున్న మరో కోట దక్షిణ భారతదేశంలో లేదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన మహాదుర్గం గోల్కొండ. ఇలాంటి కట్టడాన్ని పున:నిర్మించడం, పున:సృజించడం దుర్లభం.

గొర్రెల కాపరుల గొర్రెలు మేపుకునే ప్రాంతంలో వున్న కొండ కాబట్టి దీనిని మొదట్లో గొల్లకొండ అన్నారన్నది ఒక కథనం. ఇదే కాలక్రమాన గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. కాకతీయలు కాలంలో నిర్మించగా 1363 సంవత్సరంలో బహుమనీ సుల్తానుల అధీనంలోకి వచ్చింది. వారి పతనం తర్వాత 1518లో కుతుబ్‌షాల పరమైంది ఈ ప్రాంతం. కుతుబ్‌షాల రాజధానిగా మారిన తర్వాత గోల్కొండ కోటను ఇంకా బాగా పటిష్ఠపరిచారు.

వజ్రాల గనిగా పేరొందిన కోట గోల్కొండ. కుతుబ్‌షాల పాలనలో వుండగా ఔరంగజేబు కోట మీద భీకరమైన దాడి చేశాడు. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట దాదాపు ఎనిమిది నెలల యుద్ధం తర్వాత మొగలాయిల అధీనంలోకి వచ్చింది. ఔరంగజేబు యుద్ధానంతరం తిరిగి వెళుతూ మొగలుల దక్కన్‌ ప్రతినిధిగా ఆసఫ్‌జాను నియమించాడు. ఆయన నిజాం ఉల్‌ ముల్క్‌ అనే బిరుదును ధరించి స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో గోల్కొండ కోట నిజాం పాలకుల పరమైంది. ఇక్కడ జామా మసీదు కూడా ఉంది.

 
గోల్కొండ కోట ప్రధాన ద్వారం పైన నగిషీ

అవార్డులు

మార్చు
  • గోల్కొండ కోట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ఉంది. 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో 16 సమాధులు, 23 మసీదులు, ఆరు బావులు ఉన్నాయి.[5] పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)ల నుండి కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్లబావికి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’ అవార్డు వచ్చింది. కట్టడాల విశిష్టత, పౌరులు, పౌరసంస్థలు పునరుద్ధరించిన తీరు తదితర అంశాలపై జ్యూరీ సభ్యులు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి అవార్డుకు ఎంపికచేశారు.[6][7]

సమీప భవనాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "Archived copy". Archived from the original on 2 July 2018. Retrieved 4 February 2017.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. Sarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair
  3. మహమ్మద్ కాసిం ఫెరిష్తా, Translation by John Briggs, History of the Rise of Mahomedan Power in India, Vol. 2, 1829, pp. 310-319, Longman and others, London
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  5. Telugu, TV9 (2022-11-29). "Golconda Stepwells: యునెస్కో గుర్తింపుతో కాలరెగరేస్తున్న16వ శతాబ్దం నాటి మెట్లబావి.. చారిత్రక సంపదకు గుర్తింపుతో సర్వత్రా హర్షం". TV9 Telugu. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ABN (2022-11-28). "Golkonda: గోల్కొండ మెట్లబావి.. దోమకొండకు యునెస్కో సలాం". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-27. Retrieved 2022-11-30.
  7. "UNESCO Awards: గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు". Sakshi Education. 2022-11-28. Archived from the original on 2022-11-30. Retrieved 2022-11-30.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=గోల్కొండ&oldid=4350568" నుండి వెలికితీశారు