గౌరిపెద్ది రామసుబ్బశర్మ

గౌరిపెద్ది రామసుబ్బశర్మ శతావధాని. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించే దిశగా కృషిచేశాడు. ప్రముఖ అవధానులు గండ్లూరి దత్తాత్రేయశర్మ, నరాల రామారెడ్డి, చక్రాల లక్ష్మీకాంతరాజారావు మొదలైనవారు ఇతని శిష్యులు. శ్రీదేవీమాహాత్మ్యము అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించాడు.

గౌరిపెద్ది రామసుబ్బశర్మ
గౌరిపెద్ది రామసుబ్బశర్మ

జీవితవిశేషాలు మార్చు

ఇతడు 1922, సెప్టెంబరు 10 తేదీకి సరియైన దుర్మతి నామ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశినాడు చిత్తూరు జిల్లా, గర్నిమిట్ట గ్రామంలో జన్మించాడు.[1] ఇతడు బాల్యంలో మర్మాల చంగయ్య వద్ద విద్యాభ్యాసం చేశాడు. తరువాత తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి పట్టాను పొందాడు. ఆ సమయంలో చేట్లూరు రాఘవాచార్యులు, వెంకట వరదాచార్యులు, సుదర్శనాచార్యులు ఇతని గురువులు. తరువాత మండలీక వేంకటశాస్త్రి వద్ద వేదాంతం, ప్రస్థానత్రయం చదువుకొన్నాడు. అంతే కాక ఆయుర్వేదము, మంత్రశాస్త్రము, జ్యోతిషము, ధర్మశాస్త్రములలో కూడా పాండిత్యం గడించాడు. ఇతడు 1948 నుండి 51 వరకు కడపలోని రామకృష్ణ హైస్కూలులో సంస్కృతాంధ్రోపాధ్యాయునిగా పనిచేశాడు. తరువాత 1951 నుండి 1974 వరకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో గీర్వాణాంధ్ర భాషలలో ఉపన్యాసకుడిగా పనిచేశాడు. ఈ సమయంలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మతో కలిసి అన్నమాచార్య సంకీర్తనలపై పరిశోధన చేశాడు. 1974లో అన్నమాచార్య ప్రాజెక్టులో నియుక్తుడై తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు అనేకం పరిష్కరించి ప్రచురించాడు.

అవధానాలు మార్చు

ఇతడు తొలి అవధానం తన 40 సంవత్సరాల వయసులో 1962లో ప్రొద్దుటూరులో చేశాడు. ఆ తరువాత ఇతడు ప్రొద్దుటూరు, కడప, తణుకు, భద్రాచలము, చిత్తూరు, నెల్లూరు, వరంగల్లు, బెంగళూరు, ఒంటిమిట్ట, కోడూరు, మదనపల్లి, పీలేరు, కర్నూలు, సంతవేలూరు, అనంతపురం, కదిరి,ధర్మవరం, మడకశిర, కళ్యాణదుర్గం, తూంగుండ్రం, అరగొండ, తిరుపతి, పుంగనూరు, చంద్రగిరి, పుత్తూరు,వెంకటగిరి, శ్రీకాళహస్తి,మంగళంపేట మొదలైన చోట్ల 60 వరకు అవధానాలు చేశాడు.

ఇతడు అవధానాలలో చెప్పిన పద్యాలు కొన్ని:

  • సమస్య: సహగమనము చేసి యతని సతి జీవించె.

పూరణ:

ఇహమున్ బరమున్ దెలియక
అహమున్ కైకేయి రాము నడవికి పంపెన్
సహియించి వనికి పతితో
సహగమనము చేసి యతని సతి జీవించెన్.

  • సమస్య: కలలో గర్భము నిల్చె కోమలిని లోకంబింక నిందింపదే

పూరణ:

 అలఘ స్వాంతుడు కామశాస్త్ర ధిషణా ఖ్యాతుండు ప్రాయంబునన్
లలితాంగీమణి నూత్నయవ్వన సముల్లాస స్ఫురద్రూప తాన్
వలపుల్ మానసమందు నాడగను నిర్వక్రంబులౌ రాకపో
కలలో గర్భము నిల్చె కోమలిని లోకంబింక నిందింపదే

రచనలు మార్చు

  1. శృంగార సంకీర్తనలు[2] (పరిష్కరణ)
  2. ఆధ్యాత్మ సంకీర్తనలు[3] (పరిష్కరణ)
  3. శ్రీదేవీమాహాత్మ్యము
  4. పాండురంగ మహాత్మ్యము (పరిష్కరణ)

మూలాలు మార్చు

  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 323–326.
  2. గౌరిపెద్ది, రామసుబ్బశర్మ. శృంగార కీర్తనలు (తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) (ద్వితీయ ed.). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. pp. 1–353. Retrieved 17 July 2016.
  3. గౌరిపెద్ది, రామసుబ్బశర్మ. ఆధ్యాత్మ సంకీర్తనలు (తాళ్లపాక అన్నమయ్య విరచితములు) (ద్వితీయ ed.). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. pp. 1–431. Retrieved 17 July 2016.