అన్నమాచార్య కీర్తనలు

అన్నమాచార్య కీర్తనలు తెలుగులో పదకవితా సాహిత్యంలోనూ, భక్తి సంగీతంలోనూ, భజన సంప్రదాయంలోనూ, కర్ణాటక సంగీతంలోనూ కీలకమైన కృతులుగా పేరుపొందాయి. వీటిని 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యులు కూర్పు చేశాడు.

అన్నమాచార్య

కృతికర్త గురించి మార్చు

కర్ణాటక సంగీతం
విషయాలు

శృతిస్వరంరాగంతాళంమేళకర్త

కూర్పులు

వర్ణంకృతిగీతంస్వరజతిరాగం తానం పల్లవితిల్లానా

వాయిద్యాలు

వీణతంబురమృదంగంఘటంమోర్‌సింగ్కంజీరవయోలిన్

సంగీతకారులు

కర్నాటక సంగీతకారుల జాబితా

 
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో అన్నమయ్య విగ్రహం

ఇతను దక్షిణ భారతదేశానికి చెందిన మొట్టమొదటి ప్రముఖ సంగీతకారుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని కీర్తిస్తూ కొన్ని వేల సంకీర్తనలను రూపొందించాడు. వెంకటేశ్వరస్వామి వద్ద ఉండే నందకమనే కత్తి యొక్క అవతారమే అన్నమాచార్య అని భావిస్తారు. అన్నమయ్య వంశీకులు అన్నమాచార్యులు అపర హరి అవతారంగా కీర్తించారు.[1] తన సుదీర్ఘ జీవిత కాలంలో 32వేల సంకీర్తనలకు సంగీతాన్ని సమకూర్చి పాడాడు. అన్నమాచార్యులు స్వర పరచి పాడిన సంకీర్తనలను రాగి రేకులపై రచించి వాటిని తిరుమల సంకీర్తనా భాండాగారంలో భద్రపరిచారు. 12 Satakas (sets of hundred verses), Ramayana in the form of Dwipada,SsankIrtana Lakshanam (Characteristics of sankIrtanas), Sringaara Manjari, and Venkatachala Mahatmamyam. అతని రచనలు తెలుగు, సంస్కృతం, భారతదేశం యొక్క కొన్ని ఇతర భాషల్లో ఉన్నాయి.

మౌలిక లక్షణాలు మార్చు

ఈ గీతాలను పదాలు అంటారు. ఇవి జానపదుల ఆశు సంప్రదాయానికి చెందినవి. పాదంలో ఒక పల్లవి, అనంతరం మూడు లేక నాలుగు చరణాలు ఉంటాయి. పల్లవిలో ప్రతిపాదించిన అంశాన్ని, చరణాల్లో విస్తరించడం సాధారణంగా జరుగుతుంది. మరోలా చెప్పాలంటే చరణంలో ఏ భావాన్నైతే వివరించదలుచుకున్నాడో కవి దాన్నే సంక్షిప్తంగా పల్లవిలో నిక్షిప్తం చేస్తాడు. ప్రతి చరణం చివరిలోనూ పల్లవిని తిరిగి ఆలపిస్తారు, కనుక రచనా నిర్మాణంలోనే పల్లవిని చేరుకునేలా చరణంలోని చివరి భాగం ఉంటుంది. అన్నమయ్య పదాలు భగవంతుని కీర్తించే లక్షణం ఉన్నవి కనుక కీర్తనలని, రచనలు అనే అర్థంతో కృతులనీ కూడా వ్యవహరిస్తారు.
అన్నమాచార్యుల కీర్తనల్లో వేంకటేశ్వర చివరి చరణంలోని చరమ భాగంలో వస్తుంది. కీర్తన సాంప్రదాయంలో రచనకు కర్తృత్వాన్ని స్పష్టంచేసే ఈ పదాన్ని ముద్ర అంటారు. తిరువెంకట నాయక, శ్రీ వేంకటేశ్వర, తిరువెంకట గిరి వంటి పలు పదాలు వచ్చినా సాధారణంగా వాటిలోని సామ్యమైన వెంకట అన్న పదాన్ని ముద్రగా గుర్తిస్తారు. ఈ ముద్ర కారణంగానే జో అచ్యుతానంద వంటి గీతాలకు అన్నమయ్య కర్తా కాదా అన్న అనుమానాలు కలిగాయి. అలాగే ఏళ్ల తరబడి పురందరదాసు కీర్తనగా జమచేసిన నారాయణ తే నమోనమో వంటి కీర్తనలకు అన్నమయ్య కర్త అనీ నిర్ధారణ అయింది. వేంకటేశ ముద్రాంకిత పదాలను సేకరించి తాళ్ళపాక వారి కీర్తనలుగా గుర్తించి రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ,[2] వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు సంపుటాలలో చేర్చారు.
పల్లవిలో ప్రతిపాదించిన భావాలను శ్రోతల మనస్సులో మరిమరీ తిరిగేలా చరణాలను నిర్మిస్తూ, పల్లవిని అనుసంధానం చేస్తూ చివరగా అనూహ్యమైన పద్ధతిలో వేంకటేశుని ప్రస్తావనకు ముడిపెట్టి ముగించడంతో ఈ కీర్తనలు శ్రోతల హృదయాలను కవి ఆశించిన అపురూపమైన అనుభవం కలిగిస్తాయి.

శైలి మార్చు

అన్నమయ్య కీర్తనలను పదాలు అనే జానపద కవితా ప్రక్రియగా విభజించారు. అన్నమయ్య కీర్తనల్లో పెళ్ళిపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళపాటలు, ఏలపాటలు, సంవాదపాటలు, తుమ్మెదపాటలు, కోలాటపుపాటలు, సువ్విపాటలు, చిందుపాటలు, తందానపాటలు తదితర రకాలు ఉన్నాయి. కీర్తనల్లో గల విషయాన్ని బట్టి భక్తిపాటలు, శృంగారకీర్తనలు, వేదాంతకీర్తనలు, సాంసారికకీర్తనలు, వేడుకపాటలు మొదలైన విధంగా కూడా విభజించవచ్చు.[3]'న్నమయ్య పదాలు సాధారణంగా సుళువుగా, అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటాయి. అందరూ పాడుకోవడానికి వీలుగా అన్నమయ్య వాడుక భాషనే ఎంచుకున్నాడని మనం ఊహించవచ్చు. ఆయన పూర్తిగా సంస్కృతంలో రాసిన సంకీర్తనలను మినహాయిస్తే, మిగిలిన గీతాలలో సంయుక్తాక్షరాలు ఉన్న సంస్కృత పదాలు ఎక్కువగా వాడకుండా తేలికగా ఉండే దేశ్య పదాలను వాడాడు; సంస్కృత పదాలు అవసరమైన చోట వాటికి మారుగా లలితంగా ఉండే వాటి తద్భవ రూపాల వాడుకే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన గీతాలను వింటునప్పుడు ఆయన మన పక్కనే ఉండి మృదువైన కంఠంతో మనకు బోధ చేస్తున్నట్టో, మన హృదయంలో కూర్చొని మనలోని భావాలను మనకే అతి మధురంగా వినిపిస్తున్నట్టో అనిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ పాటలలో అంతర్లీనంగా వినిపించే గొంతు ఆ దేవదేవునికి కూడా సన్నిహితమైనదిగా మనకు స్ఫురించజేయడం ఈ గీతాల ప్రత్యేకత.

భావాలు మార్చు

అన్నమయ్య కీర్తనలను రాగిరేకులపై చెక్కడం పూర్తయిన కాలంలోనే ఆధ్యాత్మిక కీర్తనలు, శృంగార కీర్తనలు అనే విభజన చేశారు.

ఆధ్యాత్మిక కీర్తనలు మార్చు

ఈ పాటలలో కవి తన మనస్సులో చెలరేగే భావాలను మళ్ళీ, మళ్ళీ మనకు వినిపించడం కనిపిస్తుంది. ఈ సంకీర్తనలలో కవి చాలావరకూ తన వేదనను ఉత్తమ పురుషలో (first person) వివరిస్తాడు. ఎన్నో కీర్తనల్లో తనలో జరిగే అంతస్సంఘర్షణ, అశాంతి; కవి చేసుకునే ఆత్మవంచన, స్వయం-సమర్థన; నిరర్థకమైన జీవితం పట్ల నిరాసక్తత; తన మనస్సులోని అపరాధ భావం, ఆత్మనింద మనకు వివరంగా చిత్రీకరిస్తాడు కవి. ఒక్కోసారి హితబోధ చేసే సందేశాన్ని అందజేయడం కూడా కనిపిస్తుంది. మానవునిగా తన జీవనకాల పరిమితి గురించి ఈ కవికి బాగా తెలుసు. ఈ కాల పరిమితిని సద్వినియోగం చేసుకోకుండా తను వృథా జీవనం గడుపుతున్నానని కూడా తెలుసు. ఆ ఎరుకే కవి వేదనకు కారణం. ఈ రకమైన పశ్చాత్తాపంతో కూడిన ధోరణి వల్ల ఈ సంకీర్తనలో మాట్లాడుతున్న వ్యక్తికి, ఆ వ్యక్తిని సృష్టించిన కవికి భేదం మసకబారుతుంది. అన్నమయ్య మగగొంతుకతో వినిపించే ఈ అంతర్ముఖ పదసంకీర్తనలలో ఈ రెండు పురుష రూపాలను విడదీయలేము. పాటలోని కవి-వ్యక్తికి కలిగిన జ్ఞానోదయమే ఈ గీతాలను మనకు వినిపింపజేస్తుంది. అయితే, ఈ గీతాల్లో చివరి చరణంలో వినిపించే మరో గొంతుక, అన్నీ ఎరిగిన దేవునిది.
ఉత్తమపురుషలో సాగే ఇటువంటి కీర్తనలను రాగిరేకులపైకి ఎక్కించిన కాలంలో ఆధ్యాత్మిక సంకీర్తనలుగా అభివర్ణించారు. దాదాపుగా నాలుగోవంతు ఉండే ఈ కీర్తనల్లో నిజానికి ఆధ్యాత్మిక భావాల కన్నా అంతర్ముఖ భావాల మోహరింపు ఎక్కువ వుంటుంది.

శృంగార కీర్తనలు మార్చు

అన్నమాచార్య సంకీర్తనల్లో దాదాపు మూడువంతులు శృంగార కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనల్లో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన ప్రధానాంశం. కొన్ని కీర్తనల్లో అలిమేలుమంగ నాయికగా, మరికొన్ని కీర్తనల్లో ఎవరో తెలియని యువతి నాయికగా వుంటూ వస్తుంది. చాలావరకు కృతుల్లో కవి గొంతు నాయికది అవుతూంటుంది. కొన్ని కీర్తనల్లో నాయిక చెలికత్తెల గొంతును కూడా కవి స్వీకరిస్తారు. ప్రతీ శృంగార కీర్తనకూ చిత్రమైన భావాల మార్పులతో శ్రోతలను అన్నమయ్య ఆశ్చర్యపరిచారు.

విభజన,విమర్శ మార్చు

అన్నమయ్య సంకీర్తనలను ఆధ్యాత్మిక సంకీర్తనలుగా, శృంగార సంకీర్తనలుగా విభజించడం ఆయన సంకీర్తనల సంపుటి రచన దాదాపుగా పూర్తయినాకానే జరిగి ఉండవచ్చునని ప్రముఖ విమర్శకుడు వెల్చేరు నారాయణరావు భావించారు. సంకీర్తనలను భద్రపరిచే క్రమంలో, వాటి లక్షణాలను రచించే క్రమంలో ఈ విభజన స్థిరపడివుంటుంది తప్ప ఈ విభజనలో అన్నమయ్య స్వయంగా పాలుపంచుకుని ఉండరని ఆయన పేర్కొన్నారు. ఐతే ఈ రెండు విధాలైన కీర్తనల్లోనూ సుస్పష్టమైన విభజన కనిపిస్తూ ఒకదానికొకటి ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంతేకాక ఈ రెండు విభాగాలకూ లొంగని పలు కీర్తనలను ఆయన రచించారు.

రాగిరేకుల సంపుటాలు మార్చు

అన్నమాచార్య కీర్తనలను అపూర్వమైన రీతిలో రాగిరేకులపై రాయించి భద్రపరిచారు. 2,289 రాగిరేకుల్లో దాదాపు 13వేల సంకీర్తనలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. రాగిరేకుల సంపుటాలను బంగారువాకిలి ఎదురుగా ఉన్న సంకీర్తన భాండాగారంలో భద్రపరిచారు. ఇన్నివేల సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించడానికి ఎంతో సమయం, ధనం వెచ్చించాల్సి ఉంటుందని, బహుశా, ఇంత పెద్ద ప్రచురణా కృషి తెలుగు సాహిత్య చరిత్రలో అంతకు ముందెప్పుడూ కనీ వినీ ఎరుగనిదని ప్రముఖ సాహిత్యవిమర్శకుడు వెల్చేరు నారాయణరావు పేర్కొన్నారు. భాండాగారాన్ని గురించి, రాగిరేకులపై రాయించడాన్ని గురించీ అన్నమయ్య స్వయంగా 2 సంకీర్తనల్లో పేర్కొన్నారు. తగ ప్రాణములో నుండి పలికింతువు అక్షరముల, అంటూ వెంకటేశ్వరుణ్ణి పొగుడుతూ పరగ నవే వ్రాయింతువు, అని కూడా అంటాడు.[4] ఈ కీర్తనలో సంకీర్తనలు పలికించడాన్ని తర్వాత వాటినే వ్రాయించడాన్ని ప్రస్తావించగా, మరో కీర్తనలో భాండాగారాన్ని గురించి ప్రస్తావించారు. అందులో ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగ/తక్కినవి భాండారాన దాచి వుండనీ అని వుంటుంది.దాచుకో నీ పాదాలకు ఈ కారణంగా సంకీర్తనలను రాగిరేకులపై సంపూటీకరించడం, వాటిని భాండాగారాన దాచడం అన్నమయ్య జీవించివున్న కాలంలోనే జరిగిందని పరిశోధకులు తేల్చారు.
చాలా రేకుల్లో సంకీర్తనలు రాగిరేకులపై రాసిన వ్రాయసగాళ్ళ పేర్లు, సంకీర్తనలు రాసిన తేదీ వంటి వివరాలు ఉన్నాయి. 5వ రేకుపై రాగిరేకులపై రాయించి సంపూటీకరించే కృషిని అన్నమయ్య వంశీకుడైన పెదతిరుమలాచార్యులే స్వయంగా వహించినట్టు రాసివుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1920లలో శిలాశాసనాధికారిగా పనిచేసిన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి తానే స్వయంగా ఈ సంకీర్తనల రాగిరేకులను భాండారం నుండి దేవస్థాన కార్యాలయానికి తరలించినట్లు చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ రాగిరేకులు దేవాలయం వారి మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

సంకీర్తనల పరిష్కరణ మార్చు

వీటిని సేకరించి పరిష్కరించి ప్రకటించడంలో సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పండిత విజయరాఘవాచార్య, ఉదయగిరి శ్రీనివాసాచార్య, పి.టి.జగన్నాథరావు, గౌరిపెద్ది రామసుబ్బశర్మ తదితరులు కృషిచేశారు.

ప్రాచుర్యం మార్చు

ఆలయ సాంప్రదాయంలో మార్చు

తిరుమలలోని ఆలయ సాంప్రదాయంలో అన్నమాచార్య కీర్తనలు భాగమైనాయి. మేల్కొలుపు నుంచి నిద్ర వరకూ స్వామివారి నిత్యసేవా కార్యక్రమాల్లో అన్నమాచార్య కీర్తనలు వినిపిస్తారు.[5] అన్నమయ్య సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు వివిధ సందర్భాలకు అనువుగా ఎన్నో పదాలు రచించడంతో ఈ సంప్రదాయానికి వీలుదొరికింది.

సంస్థాగత ప్రచారం మార్చు

అన్నమయ్య సంకీర్తనలు 16వ శతాబ్ది నుంచే బహుళ ప్రాచుర్యం పొందాయి. తాళ్ళపాక అన్నమయ్య పదాలు రాసివున్న రాగిరేకులు అహోబిలం, సింహాచలం, కదిరి, శ్రీరంగం, చిదంబరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో దొరికాయి. రాగిరేకుల సంపుటాలు తంజావూరు సరస్వతీమహల్, పుదుక్కోటై వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు అనే పరిశోధకుడు అన్నమయ్య పదాలు స్వరసహితంగా తిరుమల ఆలయంలోని రెండు స్తంభాలపై చెక్కివున్నట్టు గమనించారు. అన్నమయ్య కీర్తనల రాగిరేకులు దక్షిణభారతదేశంలోని ఎన్నో గ్రామ దేవాలయాల్లో దొరుకుతున్నాయి. అయిదేసి రాగిరేకులు గుత్తుగా కట్టించి పలు దేవాలయాలకు తరలించేవారనీ, వాటితోపాటు ఆ కీర్తనలను గానం చేయగల గాయకులు కూడా వెంటావెళ్ళేవారని ఆధారసహితంగా వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ పేర్కొన్నారు. అన్నమాచార్య మనవడైన చిన తిరుమలాచార్యుడు గుంటూరు జిల్లా మంగళగిరి లోని నరసింహస్వామి ఆలయంలో అన్నమయ్య గీతాలు పాడటానికి ఏర్పాట్లు చేసినట్లు అక్కడ ఆయన వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ఆధారాలన్నీ క్రోడీకరించి షుల్మన్, వెల్చేరులు అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించడంతో పాటు ఈ గీతాలను వివిధ ఆలయాలకు వితరణ చేసే కార్యక్రమం కూడా పెద్ద సంస్థాగతమై ఉండివుండాలి. అని అభిప్రాయపడ్డారు.
కాలక్రమంలో ఆ వ్యవస్థలు బలహీనపడడంతో కొంత వెనుకబట్టినట్టు కనిపించినా తిరిగి 20వ శతాబ్దిలో అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా అన్నమయ్య పదాలను ప్రచారం చేస్తున్నారు.

సంగీత, నృత్య రంగాల్లో మార్చు

అన్నమయ్య సంకీర్తనలను సంగీత కచేరీల్లో పాడే సంప్రదాయం ఉంది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ప్రిన్స్ రవివర్మ, కె జె యేసుదాస్ తదితర ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు అన్నమయ్య కృతుల్ని కచేరీల్లో, రికార్డుల్లో ఆలపించడం కద్దు. దేవదేవం భజే, అదివో అల్లదివో తదితర కీర్తనలు కర్ణాటక సంగీత ప్రియులకు సుపరిచితమే. అదివో అల్లదివో, ముద్దుగారే యశోద వంటి కీర్తనలకు భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయాల్లో నృత్యం చేస్తూంటారు.

సాహిత్య రంగంలో మార్చు

సాహిత్యపరంగానూ అన్నమయ్య కీర్తనలకు ఎంతో ప్రాచుర్యం లభిస్తోంది. ఆశుసాహిత్య ధోరణిలోని కీర్తనలు కావడంతో చాలాకాలం మార్గకవిత్వ అభిమానులు, పోషకులు, విమర్శకులు, లాక్షణికులకు అన్నమయ్య పదాలపై దృష్టి లేకుండా పోయింది. మార్గ సాహిత్యంలోని కవులపై కాకున్నా రామదాసు, పురందరదాసు వంటి భజన సంప్రదాయ సాహిత్యకారులపై మాత్రం స్ఫుటంగా అన్నమయ్య ప్రభావం కనిపిస్తోంది.
గత అర్థశతాబ్ది నుంచి సాహిత్యరంగంలోని పరిణామాల వల్ల అన్నమాచార్య పదాలకు సాహిత్యపరమైన పరిశోధనలు పెరిగాయి. అన్నమయ్య వాడిన పదాలు జనబాహుళ్యంలోనివి కావడం, మార్గసాహిత్యములోని నిఘంటువులు వీటిని అర్థం చేసుకునేందుకు సహకరించవు. ఎందరో సాహిత్యవేత్తలు పరిశోధనలు చేసి అన్నమయ్య కీర్తనల పదకోశాలు నిర్మించారు.

ప్రముఖమైన కొన్ని కీర్తనలు మార్చు

ఈ జాబితాలో అన్నమాచార్య కీర్తనలలో ప్రాచుర్యం పొందిన కొన్ని కృతులు ఉన్నాయి:[6]

కీర్తన రాగం తాళం స్వరపరిచినవారు భాష
అదివో అల్లదివో శ్రీహరివాసము మధ్యమావతి తెలుగు
అలర చంచలమైన ఆత్మలందుండేవు రాగ మాలిక ఖండ చాపు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తెలుగు
అలరులు కురియగ ఆడెనదే ధీర శంకరాభరణం తెలుగు
అన్ని మంత్రములు ఇందే ఆవహించెనూ అమృతవర్షిణి తెలుగు
అంతర్యామి అలసితి సొలసితి తెలుగు
భావయామి గోపాలబాలం యమునా కళ్యాణి సంస్కృతం
భావములోన భాగ్యమునందున శుద్ధ ధన్యాసి ఖండ చాపు నేదునూరి కృష్ణమూర్తి తెలుగు
బ్రహ్మ కడిగిన పాదము ముఖారి ఆది తాళం తెలుగు
చక్కని తల్లికి చాంగు భళా తెలుగు
చాలదా హరినామ సౌఖ్యామృతము తెలుగు
చేరి యశోదకు శిశువితడు తెలుగు
చందమామ రావె తెలుగు
దేవదేవం భజే దివ్య ప్రభావం సంస్కృతం
డోలాయాం చల డోలాయాం
ఏమొకో చిగురుటధరమున తెలుగు
ఏ పురాణమున ఎంత వెదకినా తెలుగు
గోవిందా శ్రిత గోకుల బృందా
హరినామము కడు ఆనందకరము తెలుగు
ఇందరికి అభయమ్ము ఇచ్చు చేయి తెలుగు
ఇన్ని రాశుల యునికి ఇంతి చెలువగు రాశి తెలుగు
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి తెలుగు
ఇతరులకు నిన్నెరుగ తరమా తెలుగు
జో అచ్యుతానంద జోజో ముకుందా నవ్ రోజ్ తెలుగు
కంటి శుక్రవారము గడియ తెలుగు
కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు తెలుగు
క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని కురుంగి తెలుగు
కులుకక నడువరో కొమ్మలార తెలుగు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తెలుగు
మూసిన ముత్యాలకేలే మెరగులు తెలుగు
నల్లని మేని నగవు చూపులవాడు తెలుగు
నానాటి బ్రదుకు నాటకము రేవతి తెలుగు
నారాయణ తే నమోనమో సంస్కృతం
నెయ్యములలో నేరెళ్ళో తెలుగు
నిత్యపూజలివిగో నేరిచినానొహో తెలుగు
పలుకు తేనెల తల్లి తెలుగు
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా తెలుగు
శ్రీమన్నారాయణా శ్రీమన్నారాయణా నీ శ్రీపాదమే శరణు బౌళి రాగం ఆది తాళం తెలుగు
రాజీవ నేత్రాయ రాఘవాయ నమో
రామచంద్రుడితడు రఘువీరుడు తెలుగు
సిరుత నవ్వులవాడు సిన్నక్కా తెలుగు
షోడశ కళానిధికి షోడశోపచారములు తెలుగు
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బౌళి రాగం ఆది తాళం తెలుగు
త్వమేవ శరణం
వందేహం జగద్ వల్లభం హంసధ్వని ఖండ చాపు సంస్కృతం
వందే వాసుదేవం శ్రీపతిం
వేడుకొందామా వేంకటేశ్వరుని వేడుకొందామా తెలుగు
విన్నపాలు వినవలె వింత వింతలు తెలుగు

ఇవి చూడండి మార్చు

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. హరియవతార మీతడు అన్నమయ్య అరయ మా గురుడీతడు అన్నమయ్య: పెదతిరుమలాచార్యులు
  2. శృంగార సంకీర్తనలు xix సంపుటం. పు 6-8. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ. తితిదే. 1965
  3. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం: డా.వి.సిమ్మన్న(ఈమాట పత్రిక, జూలై 2000)
  4. '‘సత్యము సేయగవచ్చును’': అన్నమయ్య సంకీర్తన
  5. శృంగార సంకీర్తనలు:అన్నమాచార్యులు, తితిదే ప్రచురణ. 1992, పీఠిక పేజీ.xxviii
  6. sistla Archived 2020-09-23 at the Wayback Machine- 2008/07/21