భారత జాతీయపతాకం

భారతదేశపు జాతీయ పతాకం
(జాతీయ పతాకాలు నుండి దారిమార్పు చెందింది)

భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో తిరంగా (హిందీ: तिरंगा) లేక ట్రైకలర్ (English: Tri-color) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా[N 1] 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం.

భారత జాతీయపతాకం జండా నిష్పత్తి: 2:3
పింగళి వెంకయ్య విగ్రహం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

చట్టప్రకారం జెండా ఖద్దరుతో తయారుచేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా మహాత్మా గాంధీ ఖద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారుచేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కే హక్కు ఉంది. ఈ కమిషన్‌ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగించిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది.

భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. 2002లో నవీన్ జిందాల్ అభ్యర్థన పరిశీలిస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సాధారణ పౌరులు జెండాను వాడుకునేందుకు వీలుగా కోడ్‌ను సవరించమని భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దాన్ని అనుసరించి భారతీయ కేంద్ర మంత్రివర్గం కోడ్‌ను పరిమితంగా వాడేందుకు సాధారణ పౌరులకు వీలునిస్తూ సవరించింది. 2005లో మరోసారి కోడ్‌ను సవరించి కొన్ని రకాల దుస్తుల మీద ఉపయోగించడం సహా మరికొన్ని అదనపు వాడుకలను అనుమతించారు. జెండాను ఎగురవేయడం, ఇతర జాతీయ, సాధారణ జెండాలతో కలిపి భారత జాతీయ పతాకాన్ని వాడేప్పుడు అనుసరించాల్సిన విధానాలకు ఆ కోడ్ వర్తిస్తుంది.

ప్రతీక

మార్చు
 
అశోకచక్రం

స్వాతంత్ర్యం పొందడానికి ముందు భారతదేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయ కాంగ్రెసు 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు హిందూమతానికి, ఆకుపచ్చ ఇస్లాం మతానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతాకాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు.

1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్నిరోజుల ముందు ఏర్పాటైన రాజ్యాంగసభ, కాంగ్రెస్ పార్టీ పతాకాన్నే అన్ని పార్టీలకు, అన్ని మతాలవారికి ఆమోదయోగ్యమైన మార్పులు చేసి జాతీయపతాకంగా స్వీకరించడానికి నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యమైన మార్పు రాట్నము స్థానంలో అశోకచక్రాన్ని చేర్చడం.

అంతకు ముందున్న జెండాలోని రంగులకు మతపరమైన అన్వయాలున్నందున స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, జాతీయపతాకానికి ఎటువంటి మతపరమైన అన్వయాలూ లేవని స్పష్టం చేస్తూ పతాకప్రాధాన్యతను ఇలా వివరించాడు: "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం."

ఐతే కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.

చరిత్ర

మార్చు
 
కలకత్తా జండా

20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యోద్యమం బాగా ఊపందుకున్నప్పుడు జాతీయోద్యమ స్ఫూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయపతాకం అవసరమైంది. 1904లో వివేకానందుడి శిష్యురాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్యభాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తులున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్థం వచ్చే బెంగాలీ మాటలు "বন্দে মাতরম (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్ర్య పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛతకు చిహ్నాలు.

 
1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన జండా

మొట్టమొదటి త్రివర్ణపతాకం 1905లో జరిగిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగష్టు 7కలకత్తాలోని పార్శీబగాన్ స్క్వేర్లో శచీంద్ర ప్రసాద్ బోస్ చే ఆవిష్కరించబడింది. ఈ పతాకాన్ని "కలకత్తా పతాకం" అంటారు. ఈ పతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలున్నాయి: పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామరపూలు, క్రింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో "వందేమాతరం" అనే అక్షరాలున్నాయి.

 
1917 లో హోంరూల్ ఉద్యమంలో వాడిన జండా

1907 ఆగష్టు 22 న మేడం భికాజీ కామా జర్మనీ లోని స్టుట్‌గార్ట్ లో మరో జండాను ఎగరేసింది. ఈ జండాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భారతంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్యనున్న కాషాయ పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అడుగున ఉన్న పట్టీలో స్తంభానికి దగ్గరగా నెలవంక, రెండో చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జండాను భికాజీ కామా, వీర సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మలు కలిసి తయారు చేసారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకారులు దీన్ని స్వీకరించాక, ఈ జండా బెర్లిన్ కమిటీ జండాగా పేరు పొందింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెసొపొటేమియాలో ఈ జండాను విస్తృతంగా ఉపయోగించారు. గదర్ పార్టీ జండాను కూడా అమెరికాలో భారతీయ చిహ్నంగా కొన్నాళ్ళు ఉపయోగించారు.

 
1921లో అనధికారికంగా స్వీకరించబడిన జెండా

1917లో తిలక్, అనీబిసెంట్లు హోంరూల్ ఉద్యమంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హోదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడివైపు తార-నెలవంక గుర్తులను వాడారు. దానికి దిగువన హిందువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలున్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది.

దానికి ఒక సంవత్సరం క్రితమే 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయపతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుభాని, ఎస్.బి.బొమ్మన్‌జీ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ ను ఏర్పాటుచేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాకాన్ని గాంధీజీకి చూపించగా, ఆయన దాంట్లో భారతదేశానికీ, దేశం తానెదుర్కొంటున్న సమస్యలనుంచి విముక్తి పొందడానికీ చిహ్నంగా నిలిచిన చరఖా (రాట్నము)ను చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలమీద రాట్నము గుర్తును రూపొందించి చూపాడు. ఐతే అది అన్నిమతాలకూ ప్రాతినిధ్యం వహించేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు.

గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకొక త్రివర్ణపతాకం పైనుంచి క్రిందకు వరుసగా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపుపట్టీలతో, మూడు పట్టీలమీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తుతో రూపొందించబడింది. ఆ మూడు పట్టీలు మైనారిటీ మతాలు, ముస్లిం, హిందూ మతాలకు సూచికలు. ఇది అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరకంగా స్వాతంత్ర్యపోరాటం సాగిస్తోన్న ఐర్లాండు పతాకాన్ని పోలి ఉంది. ఈ పతాకాన్ని అహమ్మదాబాదు కాంగ్రెసు సమావేశంలో ఆవిష్కరించారు. ఇది కాంగ్రెసు అధికారపతాకం కాకపోయినా జాతీయోద్యమంలో ఎక్కువగా వాడారు.

ఐతే ఆ జెండాలో మతాలకు చిహ్నాలుండడం చాలామందికి నచ్చలేదు. 1924లో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా సంస్కృత కాంగ్రెస్ హిందువులకు చిహ్నాలుగా కాషాయరంగును, విష్ణువు ధరించే గదను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లిం ఫకీర్లు-దర్వేషీల వైరాగ్యానికి చిహ్నమైన జేగురురంగును చేర్చాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సిక్ఖులు తమ మతచిహ్నంగా పసుపురంగును కూడా చేర్చాలని, లేనట్లైతే మతపరమైన సూచికలను పూర్తిగా తొలగించాలని కోరారు.

 
1931లో సూచించబడిన జెండా

ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1931 ఏప్రిల్ 2న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్ కమిటీని నియమించింది. "జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశించినవే కాబట్టి అభ్యంతరకరమైనవేనని" కమిటీ తీర్మానించింది. ఫలితంగా పూర్తిగా ఎర్రమట్టిరంగులో, పైభాగాన రాట్నము గుర్తుతో ఒక కొత్త జెండా తయారైంది. దీన్ని ఫ్లాగ్ కమిటీ ఆమోదించినా ఇది కూడా మతపరమైన భావజాలాన్నే సూచిస్తోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమోదించలేదు.

 
పింగళి వెంకయ్య రూపొందించిన 1931 నాటి జెండా. దీన్నే రెండవప్రపంచయుద్ధంలో అర్జి హుకుమతె ఆజాద్ హింద్ వాడుకొంది

తర్వాత 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయజెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది.

 
రెండవ ప్రపంచయుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వాడిన జెండా

అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ పతాకాన్ని స్వల్పమార్పులతో - చరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులి బొమ్మతో - వాడుకొంది. ఈ మార్పులు గాంధీ అహింసాయుత పద్ధతులకు, సుభాష్ చంద్ర బోస్ వీరోచిత పద్ధతులకు గల తేడాను ప్రతిబింబిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారతదేశపు గడ్డమీద మొదటిసారిగా బోస్ చేత మణిపూరులో ఆవిష్కరించబడింది.

స్వతంత్ర భారతదేశ జాతీయపతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగసభ, 1947 జూన్ 23న బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కె.ఎం.పణిక్కర్, సరోజినీ నాయుడు, రాజాజీ, కె.ఎం.మున్షీ, బి.ఆర్.అంబేద్కర్ లతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 1947 జూలై 14న కాంగ్రెస్ పతాకాన్నే అన్ని పార్టీలకు, మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయపతాకంగా స్వీకరించాలని నిర్ణయించింది. దాంట్లో మతపరమైన సూచికలేవీ ఉండరాదని తీర్మానించింది. హైదరాబాదుకు చెందిన సురయ్యా త్యాబ్జీ తెలుపు రంగులో చరఖా స్థానంలో సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చి జెండాకు తుది రూపునిచ్చింది.[1][2] ఈ కొత్త పతాకాన్ని స్వతంత్ర భారత జాతీయపతాకంగా ఉద్వేగభరిత వాతావరణంలో 1947 ఆగష్టు 15 నాడు ఆవిష్కరించారు.

పతాకాన్ని తయారుచేసే పద్ధతి

మార్చు

1951లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర రాం ప్రసాద్ (బి.ఐ.ఎస్.) జాతీయపతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందించింది. ఈ నిర్దేశకాలను మనదేశంలో అమల్లోకి వచ్చిన మెట్రిక్ మానానికి సరిపోయేటట్లు 1964లో ఒకసారి, 1968 ఆగష్టు 17న మరొకసారి సవరించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా కచ్చితమైనవి. వీటి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం.

పతాకం తయారీలో ఖాదీ లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige (పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండుపోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడుపోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసినవాళ్ళు పదిమందికంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీమీటరుకు కచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని, ఒక చదరపు అడుగు గుడ్డ కచ్చితంగా 205 గ్రాములుండాలని నిర్దేశకాలున్నాయి.

జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అవసరమైన ఖాదీ బట్ట ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్, బాగల్కోట్ జిల్లాల్లోని రెండు చేనేత యూనిట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతం దేశంలో జాతీయపతాకాలను తయారుచేయడానికి ప్రభుత్వ అనుమతి గల ఒకేఒక్క సంస్థ హుబ్లీలో ఉంది. జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) కి ఉన్నప్పటికీ ఆ అనుమతిని రద్దు చేసే అధికారం బి.ఐ.ఎస్.కు ఉంది.

నేసిన బట్టను పరీక్ష నిమిత్తం బి.ఐ.ఎస్.కు పంపిస్తారు. తిరిగొచ్చిన తర్వాత బ్లీచింగు చేసి రంగులద్ది, మధ్యలో అశోకచక్రాన్ని స్క్రీన్ ప్రింటింగు గానీ, స్టెన్సిల్ గానీ, ఎంబ్రాయిడరీ గానీ చేస్తారు. చక్రం రెండువైపులా ఒకేచోట స్పష్టంగా కనిపించాలి. జెండాపై వేసిన రంగులను బి.ఐ.ఎస్. పరీక్షించిన తర్వాతే పతాకాలను అమ్మటానికి అనుమతిస్తారు.

మనదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు కోట్ల జెండాలు అమ్ముడుపోతాయి. దేశంలోనే అతిపెద్ద పతాకం (6.3 × 4.2 మీ) మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన మంత్రాలయ భవనమ్మీద ఎగురుతోంది.

పతాక కొలతలు
కొలత మి.మీ.
1 6300×4200
2 3600×2400
3 2700×1800
4 1800×1200
5 1350×900
6 900×600
7 450×300
8 225×150
9 150×100

జాతీయపతాక నియమావళి

మార్చు

2002కు ముందు జాతీయ సెలవుదినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయపతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయపతాకాన్ని ఎగురవేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయపతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తనప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించాడు. ఆ కేసు సుప్రీమ్‌ కోర్టుకు వెళ్ళింది. సుప్రీమ్‌కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయపతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది. ఈ సవరణ 2002 జనవరి 26 న అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీమ్‌కోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్[3] కేసులో పేర్కొంది. జాతీయపతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణహక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారతరాజ్యాంగంలోని 51A ఆర్టికల్‌లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించవలసి ఉంటుంది.

వాస్తవంగా జెండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కూడా యూనిఫారాలు, బట్టలు, ఇతర వస్త్రాల పై జెండా వినియోగాన్ని ఒప్పుకోదు . 2005 జూలై లో, భారతదేశం ప్రభుత్వం కొన్ని రకాల వినియోగాన్ని అనుమతించటానికి సవరించారు. సవరించిన కోడ్ ప్రకారంలో దుస్తులలో జెండా వాడుక నిషేధిస్తుంది. pillowcases, చేతి రుమాలు లేదా ఇతర వస్త్రాలు పై embroidering నిషేధిస్తుంది .

దెబ్బతిన్న జెండాలు లేదా పాడయిపోయిన జండాలు నాశనము చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. పాడయిన లేదా చిరిగిపోయిన జెండాలను పక్కన పడెయ్యటం లేదా అగౌరవంగా నాశనం చేయకూడదు. అలాంటి వాటిని కాల్చడము /తగులబెట్టడం లేదా భూమిలో పాతిపెట్టడం చేయాలి. లేదా జెండా గౌరవాన్ని కాపాడే మరే ఇతర పద్ధతి ద్వారా మాత్రమే వాటిని నాశనము చేయాలి.

చిత్రమాలిక

మార్చు

గమనికలు

మార్చు
  1. ప్రస్తుత పతాకం పింగళి వెంకయ్య ఒరిజినల్ డిజైన్ నుంచి రూపొందించారు, కానీ అతని పేరునే సాధారణంగా జెండా రూపకర్తగా వ్యవహరిస్తారు.

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2022-08-15). "త్రివర్ణ పతాక కథ." Namasthe Telangana. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
  2. Saurav, Suman (2018-12-09). "Surayya Tyabji: The Woman Who Designed India's National Flag | #IndianWomenInHistory". Feminism In India (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2022-07-02. Retrieved 2022-08-15.
  3. (2004) 2 SCC 510

బయటి లంకెలు

మార్చు