పల్లెల్లో పండగలు

పండగలు అంటే పల్లెల్లో జరిగేవే పండగలు. పండగలను సంపూర్ణంగా ఆస్వాదించాలంటే పల్లెలకు వెళ్లాల్సిందే. పట్టణాలలో కూడా పండగలను భారీ ఎత్తున జరుపుకుంటారు, వినాయక చవితి, దీపావళి, దసరా, మొదలగు పండగలను బారీ ఎత్తున పట్టణాలలో జరుపు కుంటారు. నిజమైన పండుగ వాతావరణము పల్లెల్లోనే కనబడుతుంది. పట్టణాలలోని పండగలు వ్వక్తి గతమైనవి. కాకుంటే ఆ కుటుంబానికి పరిమితం. కాని పల్లెల్లో పండగ అంటే సామాజికమైనది. పల్లెవాసులంతా ఏకమై ఆప్యాయతతో ఎంతో ఆనందంగా జరుపు కుంటారు. ఇప్పుడు పల్లెల్లో కూడా పండగలను చేసుకునే పద్ధతిలో అప్పట్లో వుండే ఆప్యాయత కొంత తగ్గిన మాట వాస్తవమే. కాని సుమారు యాబై సంవత్సరాల క్రితం పల్లెల్లో పండగలు ఎలా జరిగాయో కొంత తెలుసు కుందాము. వ్వవసాయదారులైన పల్లె వాసులు తమ వ్యవసాయ పనులన్ని ఒక్క కొలిక్కి వచ్చి పంటలన్నీ ఇంటికొచ్చి న సమయాన వచ్చేదే సంక్రాంతి పండగ. మిగతా పండగలు ఎలా వున్నా రైతుకు ప్రాముఖ్యానిచ్చేదే సంక్రాంతి. ఇవి వరుస పండగలు.

ఇది ఈ వరుసలో మొదటి పండగ. ఆ రోజు తెల్లవారి జామునే కోడి కూయంగానే నిద్ర లేచి ఆ ముందు రోజే సమకూర్చుకున్న పాత తట్టలు, బుట్టలు, చాట, పొరక ఇతరమైనవి ఇంటిలో వాడుకుని పాతబడిన వస్తువులను ఒక్కొక్కటిగా వేసి మంట పెట్టి చలి కాచుకుంటారు. అది బాగా చలికాలం గనుక సమకూర్చిన పాత వస్తువులు సరిపోవుగనుక ఇంకా కొంత చెత్త, చెదారం, వాడాకు, కంపలు మొదలగునవి వేసి మంటలో చలి కాచు కుంటారు. చలి కాచు కోవడమే ప్రధాన వుద్దేశంగా వుండేది. ఆ విధంగా తెల్లారిందాక మంట వేస్తూనే వుంటారు. ఇక ఆ తర్వాత కోళ్లను కోయడం, వూర్లో ఎవరైనా వేటను కోస్తే అక్కడికెళ్ళి కూర తెచ్చుకొని, వడలు చేసి తినడం. ఇదే పండగ. పందుల్ని తినే వాళ్లుంటారు. వారికీరోజు నిజమైన పండగ. ప్రస్తుతం ఈ పండగను ఎక్కువగా జరుపు కొనుట లేదు. గతంలో చలికాలంలో మామూలుగా తెల్లవారి జామున చలి మంటలేసి చుట్టు చేరి చలి కాచు కుంటూ కబుర్లు చెప్పుకునే వారు. ప్రస్తుతం అలాంటి దృశ్యం ఎక్కడా కనబడదు. రాను రాను కనుమరుగై పోయే టట్టున్నది. ఈ పండగ నెలంతా కోడి పందాలు జరుగుతాయి. అ పందాలకు ఆ చుట్టు పక్కల చాల వూర్ల నుండి కోడి పుంజులను తెచ్చి వాటికి కత్తులను కట్టి వదిలే వారు. అవి అతి భయంకరంగా పోట్లాడు తుంటే ఆనందించే వారు. వాటి కెంత పౌరుష మంటే, ప్రాణం పోయిందాక పోరాడు తూనే వుంటాయి. ఎవో కొన్ని "కోస" పుంజు లుంటాయి అవి మధ్యలోనే పారిపోతాయి.ఆ విధంగా గెలిచిన వాడు మరొక పుంజుతో ఇల్లుచేరి ఓడిన పుంజును కోసి కూర చేసుకునే వాడు.

 
సంక్రాంతి పండగ రోజుల్లో కనిపించే గంగి రెద్దు

దీన్ని పెద్ద పండగ అని కూడా అంటారు. (పెద్దల పండగ). ఈ రోజున పెద్దలు తమ తల్లి దండ్రులు చనిపోయిన వారు వారి పిండ ప్రధానము చేయు కొరకు ఉపవాసముండి స్నానం చేసి అయ్యవారి రాక కొరకు ఎదురు చూస్తుంటారు. అయ్యవారు అంటే ఆ ప్రాంత బ్రాంహడు. కొన్ని పల్లెలకు కలిపి ఒక బ్రాంహడు వుంటాడు. అన్ని శుభాసుభ కార్యాలకు అతను రావలసిందే. వేరెవ్వరు రావడానికి వీలు లేదు. ఇది అతని ఇలాకా. ఆ అయ్యవారు వచ్చి నంత వరకు ఆ గృహస్తుడు ఉప వాసముంటాడు. ఆతను వచ్చాక పూజా కార్యుక్రమాలు ప్రారంబించి గృహస్థుని చేత అతని పెద్దలకు తర్పణ, ఇస్తాడు, కాకులకు పిండ ప్రధానం చేయిస్తాడు. ఇలా పెద్దలకు తర్పణ ఇస్తున్నందుకే దీన్ని పెద్దల పండగ అన్నారు. పూజానంతరం, గృహస్తుడిచ్చిన దక్షిణ; అనగా బియ్యం, కూరగాయలు, పప్పులు మొదలగునవి తీసుకొని మరొక్కరింటి కెళతాడు. ఈరోజున మాంసం వండరు. ఈ రోజున అనేక పిండి వంటలు చేస్తారు. ఈరోజు తప్పక వుండవలసిన పిండి వంట అరిసెలు పిల్లలకు పిండిపంటలే పండగ. ఈరోజు నుండే గొబ్బెమ్మ పాటలు పాడతారు ఆడ పిల్లలు. ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను తీరుస్తారు. గొబ్బెమ్మ అంటే ఆవు పేడను ముద్దగా చేసి ముగ్గు మధ్యలో పెట్టి మధ్యలో గుమ్మడి పూలు పెడ్తారు. ఆ ఊరి ఆడపిల్లలందరూ కలిసి ఒక జట్టుగా చేరి అలంకరించుకొని, ఒక పళ్లెంలో పసుపు ముద్దను వుంచి దానిపై దీపం పెట్టి, చుట్టు తంగేడు పూలను అలంకరించి ప్రతి ఇంటికి వచ్చి ఆ పళ్లేన్ని క్రింద పెట్టి దాని చుట్టు తిరుగుతు తమ రెండు చేతులు తట్టుతూ గొబ్బెమ్మ పాటలు పాడతారు. ఆ ఇంటి వారు దీపంలో నూనె పోసి వారికి బియ్యం కొంత డబ్బులు ఇవ్వాలి. చివరి రోజున ఆ పిల్లలందరు వచ్చిన బియ్యాన్ని పొంగలి పెట్టి తిని ఆనందిస్తారు. ఇది ఆ వూరి ఆడపిల్లల సంబరం. ఈ తతంగం అంతా ఏ వూరి ఆడపిల్లలు ఆవూర్లోనే అడతారు. పక్క ఊరికెళ్లరు. కానీ.... ఇంతవరకు వ్యవసాయదారుల పొలాల్లో కూలి చేసిన ఆడవాళ్లు, ముఖ్యంగా హరిజనులు ఈ రోజున ప్రతి రైతు ఇంటి ముందు గొబ్బెమ్మ పాటలు పాడి ఆడతారు. వారికి రైతు కుటుంబం ధాన్యం, డబ్బులు శక్తాను సారం బారీగానే ఇస్తారు. ఇచ్చినది తక్కువనిపిస్తే వారు వెళ్లరు. బలవంతం చేస్తారు... సాధించు కుంటారు. అదే విధంగా పరా ఊరు నుండి కొంత మంది హరిజన మహిళలు వచ్చి గొబ్బెమ్మ పాటలు పాడతారు కాని ఇచ్చింది తీసుకుని వెళతారు. ఇలాంటి వారు యాచకులు కాదు. కేవలం సంక్రాంతి సందర్భంగానే గొబ్బెమ్మ పాటలు పాడి ఆసిస్తారు. అలాగే గంగి రెద్దుల వాళ్లకు కూడా ఇది పెద్ద పండగే. వారు గంగి రెద్దును ఆడించి రైతుల మెప్పించి బహుమతులను పొందుతారు.

పశువుల పండగే ఈ వరుసలో చివరిది. ఈ రోజున పిండి వంటలదే పండుగ. సాయంకాలం ఊరి బయట కాటమ రాజు వద్ద పొంగిళ్లు పెట్టి పూజ చేస్తారు. కాటమ రాజుకు పూసిస్తే పశుగణాభి వృద్ది బాగా అవుతుందని నమ్మకం. కాటమ రాజు అంటే అక్కడేమి గుడి వుండదు. ఒక చెట్టు క్రింది రెండు రాళ్లను పెట్టి వాటిని కడిగి విబూతి పట్టెలు పెట్టి ఆ ప్రాంతమంతా శుభ్రం చేస్తారు. అక్కడి పూజారి ఆ వూరి చాకిలే. ఆ దేవుని ముందు వూరి ఆడవారందరు కొత్త కుండలో బియ్యం, పాలు, బెల్లం తెచ్చి అక్కడే పొయ్యిలు ఏర్పాటు చేసి పొంగలి వండుతారు.. ఇంత లోపల చాకలి దేవుని వద్ద అలంకరణ పూర్తి చేస్తాడు. అందరు తలొక పొంగలి ముద్దను తీసి దేవుని ముందు కుప్పగా పెడ్తారు. చాకలి పూజా కార్యక్రమం కానిస్తాడు. అప్పటికే వూర్లో వున్న ఆవులను ఎద్దులను అన్నింటిని ఇక్కడికి తోలుకొస్తారు. కోళ్లను మొక్కుకున్న వాళ్లు చాకలికి తమ కోళ్లను దేవుని బలి ఇవ్వమని ఇస్తారు. అతను వాటిని కోసి దేవుని ముందు వేస్తాడు. పూజానంతరం పొంగలిని తలా కొంత ప్రసాదంగా తీసుకొని ఒక పెద్ద పొంగలి ముద్దను పశువుల కాపరికి ఇచ్చి తినమని, అతని వీపుకు ఇంకొక ముద్దను కొడతాడు చాకలి. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పొంగలిని తింటూ పశువులకున్న పగ్గాలను, దారాలను తీసేసి తరుముతాడు. అవి తలోదిక్కుకు వెళ్లి పోతాయి. అప్పటికి చేలన్నీ పరిగిలి పోయి వుంటాయి కనుక అవి ఎక్కడ ఏ చేల్లో దూరినా అడగడానికి లేదు. ఆరాత్రికి పాలు తాగే దూడలను కూడా కట్టడి చేయరు. అనగా పశువులకు స్వాతంత్ర్యం అన్నమాట. అదే పశువుల పండుగ. ఆ సందర్భంలోనే ఒక నెల నుండి కాటమరాజు ముందు ఆదారిన వచ్చి పోయే, పశువుల కాపరులు, రైతులు అక్కడ ఒక కంపో, కర్రో వేస్తుంటారు. ఈ నాటికి అది ఒక పెద్ద కుప్ప అయి వుంటుంది. ఆ కుప్పను చిట్లా కుప్ప అని అంటారు. పశువుల కాపరి ఆ కుప్పకు నిప్పు పెట్టి పశువులను బెదిరించి తరిమెస్తాడు. ఆ మంట ఆరిపోయిన తర్వాత అందరు అక్కడి నుండి నిష్క్రమిస్తారు. ఇంటి కెళ్లి...దేవుని వద్ద కోసిన కోళ్లలు బాగు చేసుకుని కూర వండుకుని తింటారు.

ఈ పండుగకు జరిగే జల్లికట్టు చిత్తూరు జిల్లా, తమిళ నాడులో బారి ఎత్తున జరుగు తుంటాయి. వీధుల్లో డప్పులను వాయించి అలంక రించిన పశువులను తరుము తారు. అలా రెండు మూడు సార్లు పశువులను తరిమాక ఆ తర్వాత అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు రంగులతో అలంక రించిన బలమైన ఎద్దులలు, కోడెలను.... తరుముతారు. ఊరి పెద్దలు, ముందుగా వాటి కొమ్ములకు రంగులు పూసి ఒక తువ్వాలు కట్టి అందులో వంద రూపాయలు .... వారి స్థాయిని బట్టి ఐదు వందల రూపాయలను కట్టి అల్లి వద్ద నిలిపి డప్పులతొ వాటిని బెదిరించి తరుముతారు. ధైర్యం వున్న వారు వాటిని పట్టి లొంగ దీసుకొని దాని కొమ్ములకు కట్టిన బట్టలోని డబ్బులు తీసుకోవచ్చు. దాని కొరకు కొంత మంది బలవంతులు తయారుగా వుంటారు. కొన్ని ఎద్దులు, లేదా కోడెలు తమ యజమానిని తప్ప ఇతరుల నెవ్వరిని దరి చేరనియ్యవు. అలాంటి వాటిమీద చెయ్యి వేయడమే ప్రమాదం. అటు వంటి వాటిని బెదర గొట్టిన తర్వాత వాటిని లొంగ దీసు కోవడం చాల ప్రమాధ కరమైన పని. అయినా కొందరు ఈ సాహసానికి పూను కుంటారు. ఇంకొన్ని ఎద్దులుంటాయి. అవి వట్టి బెదురు గొడ్డులు. వాటిని బెదిరిస్తే అవి చేసే వీరంగం అంతా ఇంతాకాదు. వాటిని ఆపడం అతి కష్టం. వీటి వలన ప్రమాదం ఎక్కువ. ఎందు కంటే ఇవి బెదిరి పోయి ఇరుపక్కల క్రీడను చూస్తున్న జనంలోకి దూరి పోతాయి. ఈ క్రీడలో చాల మందికి గాయాలవు తుంటాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా జరుగు తుంటుంది. ఇలాంటి క్రీడను ప్రభుత్వాలు నిషేధించినా ఫలితం లేదు. ఇటు వంటి క్రీడ ఫలాన పల్లెలో జరుగుతుందని ముందుగానే ఆ చుట్టు ప్రక్కల పల్లెల్లో దండోర వేసి తెలియజేసి వుంటారు. దాంతో ఆ చుట్టు ప్రక్కల రైతులు తమ ఎద్దులను కోడెలను అలంకరించుకొని అక్కడికి తీసుకెళతారు.

పశువుల పండగ సందర్భంగా సంబరం

మార్చు

ఆ రోజున ఇంటి కొక్కరు చొప్పన పల్లె వాసులు తెల్లవారక ముందే ఒక కత్తి, సంచి తీసుకొని పక్కనే వున్న అడవికి బయలు దేరుతారు. అనేక రకాల వన మూలికలు, ఆకులు, కాయలు, చెట్టు బెరడు, గడ్డలు, పువ్వులు, వేర్లు, మొదలగు నవి తీసుకొని వస్తారు. కొన్ని తప్పనిసరిగా వుండవలసిన మూలికలు కొన్ని వున్నాయి అవి తీసుకొని మిగతా ఎన్ని రకాల మూలికలు ఎన్ని వీలైతే అన్ని తీసుకొని వస్తారు. ఇంటికి వచ్చి, వాటి నన్నింటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఆ తర్వాత రోట్లో వేసి బాగా దంచి పొడి లాగ చేస్తారు. చివరిలో అందులో ఎక్కువ మోతాదులో వుప్పు వేసి ఇంకా బాగా దంచు తారు. దాన్ని ఉప్పుచెక్క అంటారు. ఇది పశువులకు సర్వ రోగ నివారిణి. పశువులను/ ఎద్దులను దగ్గర్లోని చెరువుకు గాని, బావి వద్దకు గాని తీసుకెళ్లి స్నానం చేయించి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు చెక్కను తినిపిస్తారు. పశువులు ఉప్పు చెక్కను ఇష్టంగా తినవు. కాని బలవంతంగా తినిపిస్తారు కొన్ని సన్న జీవాలు అనగా గొర్రెలు, మేకలు ఉప్పు చెక్కను ఇష్టంగా తింటాయి. అనేక రకాల వనమూలికలతో తయారైన ఈ ఉప్పుచెక్క అత్యంత మధురమైన వాసన వస్తుంది. ఈ వుప్పు చెక్క తయారికి కావలసిన కొన్ని వనమూలికలు: మద్ది చెక్క (బెరడు) నేరేడు చెక్క, మామిడి చెక్క, కరక్కాయ, నల్లేరు, అడవి గుమ్మడి, అడవి ఉల్లి, మన్నేరు గడ్డ, ఎలక్కాయ, ఉసిరి కాయ, చలువ వేర్లు, అలా ఈ జాబితా చాల పెద్దది. అన్నీ తేవాలని లేదు గాని వీలైనన్ని ఎక్కవ సేకరించాలు. అందులో కొన్ని తప్పని సరైనవి కొన్ని వుంటాయి. ఈ ఆచారం ఎక్కువగా చిత్తూరు జిల్లాలోను ఆ పరిసర ప్రాంతాలైన తమిళనాడు లోను ఎక్కువ. ఆ రోజుల్లో వున్నవన్ని దేశీయ ఆవులే/ గేదెలే. రెండు మూడు లీటర్ల పాలిస్తే అదే పెద్ద గొప్ప. పెద్ద ఇళ్లలో అలాంటి ఆవులు ఒక మంద వుండేవి. మిగతా వారి వద్ద ఒకటి రెండు ఆవులు/ గేదెలు వుండేవి. ఆరోజుల్లో పాలు ఎవ్వరు అమ్మేవారు కాదు. అంతా ఇంటి కొరకే. పాలు లేని వారికి వీరు మజ్జిగ ఇచ్చేవారు. మజ్జిగ చిలకగా వచ్చిన వెన్నను నేయిగా చేసి దానిని అమ్మే వారు. నెయ్యి అమ్మగా వచ్చిన ఆదాయం ఆడ వారి సొంతం. ఈ ఆవులకు ప్రత్యేకించి మేత ఏమి వేసే వారు కాది. బయటకు తీసుకెళ్లి పొలాలలో, మైదానాలలో మేపించి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చేవారు. వాటికి అదే మేత. అప్పట్లో భయలలో, చేల గట్ల మీద పచ్చిక చాల వుండేది. పాలిచ్చే ఆవులకు/ గేదెలకు మాత్రం రాత్రులందు కొంత మేత వేసే వారు. వరి పొలాల్లోని గట్టుల మీద, చెరకు తోటల్లోను దొరికే పచ్చి మేత వేసే వారు. మేకలు, గొర్రెలు మాత్రం మందలు, మందలుగా వుండేవి. వాటిని సమీపం లోని అడవులకు తీసుకెళ్లి మేపుకొచ్చేవారు. వీటిని పాలు పిండడం చాల తక్కువ.

దేశ వాలీ రకాలైన ఆవులు, ఎద్దులు ఇప్పుడు లేవు. ఎక్కడో అరుదుగా ఎద్దులు, ఎద్దులు బండి, మడక కనబడతాయి. ఈ పనులన్ని ట్రాక్టర్లు చేస్తున్నాయి. కాని ఇప్పుడు ఇంచు మించు ప్రతి ఇంట్లోను ఒక పాడి ఆవు ఉంది. అది కచ్చితంగా జర్సీ ఆవు లేదా మంచి జాతి ఆవు అయి వుంటుంది. వీటికి ప్రతి రోజు మంచి ఆహారం పెట్టాలి, ప్రతి రోజు స్నానం చేయించాలి చాల జాగ్రత్తగా చూసుకోవాలు. వాటి పరిసరాలు శుభ్రంగా వుంచాలి. ఇవి పూటకు ఐదారు లీటర్ల పాలిస్తాయి. ఇలా రెండు పూటలా ఇస్తాయి. ప్రస్తుతం రైతుల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడుతున్నాయంటే ఈ ఆవుల చలువే. దానికి తగ్గట్టు చిన్న పల్లెల్లో కూడా పాల డిపోలు వెలిశాయి. రెండు పూటలా వారు పాలు కొంటారు. వాటిని శీతలీకరించి పట్నాలకు పంపుతున్నారు. వర్షాబావంతో గుక్క తిప్పుకో లేక తిక మక పడుతున్న రైతుకు ఈ జర్సీ ఆవులు, పాల డిపోలు కొండంత అండ. ప్రస్తుతం పట్నాలలో సంవృద్దిగా చిక్కని పాలు కావలిసినన్ని దొరుకు తున్నాయంటే అదంతా పల్లె టూరి రైతుల చలువే. గతంలో పట్న వాసులు పాలకు ఎంత కట కట పడ్డారొ అందరికి తెలిసిన విషయమే. పసి పిల్లలకు అరుదుగా దొరికే నీళ్ల పాలు కూడా దొరక చాల అవస్తలు పడ్డారు. దానికి నివారణగా అప్పట్లో పాల పొడి డబ్బాలు కూడా దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్యంకూడ "పాల వెల్లువ" పథకానికి తగినంత చేయూత నందిస్తున్నది. దాన్ని అంది పుచ్చుకున్న పల్లెటూరి రైతు కొంతలో కొంత సుఖంగా జీవనం సాగించుకుంటూ పోతున్న పరువును కొంతలో కొంతైనా నిలబెట్టు కుంటున్నాడు. గొర్రెలు, మేకలు. చాల మంది రైతులకు గొర్రెలు, మేకలు మందలు వుండేవి. వాటిని తమ ఇంటి ముందున్న దొడ్లల్లో వుంచేవారు. వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టే వారు కాదు. కాని వాటి పిల్లలను గిడుగులో మూసి, గిడుగు పై బాగానికి వేప మండలను కట్టి వుంచు తారు. సాయంత్రం వాటి తల్లులు వచ్చునంత వరకు ఆ ఆకులే వాటి ఆహారము. ప్రతి రోజు వాటిని దగ్గరున్న అడవికి తీసుకెళ్లి మేపుకొని వచ్చేవారు. పొట్టేళ్లను మాత్రామే మాంసానికి అమ్మేవారు, కొనేవారు.

కనుమ పండగ.

ఇక ఆ సాయంకాలం గ్రామం నుండి వరదరాజ స్వామి వారిని పల్లకిలో వూరేగింపుగా మేళ తాళాల మధ్య ఆ చుట్టు పక్కల పల్లెలన్నీ వూరేగిస్తారు. ప్రతి ఇంటి ముందు స్వామి వారికి హారతి ఇచ్చి, కొబ్బరి కాయ కొట్టి పూజ చేస్తారు. ఇలా ఆస్వామి వారి ఊరేగింపు అయిన తర్వాత సాయంకాలం నాలుగ్గంటల సమయంలో మైదానంలో గాని, కొండ దగ్గర గాని గుడి ముందున్న జమ్మి చెట్టు కింద పూజ చేసి, అదే విదంగా ఒక పొట్టేలుకు కూడా పూజచేసి అపొట్టేలును కొండ వాలులో లేదా మైదానంలో సుమారు ఒక కిలో మీటరు దూరంలో ఒక చెట్టుకు కట్టి తుపాకీలతో దాన్ని కాల్చే ప్రయత్నం చేస్తారు. తుపాకితో ఎవరు దాన్ని కొట్ట గలిగితే అది వారికే. అది చావ నక్కర లేదు. రక్తం కారితే చాలు అలా దాన్ని ఎవరు కాల్చలేక పోతే అది ఊరేగింపులో మంగళ వాద్యాలు వాయించిన మంగలి వారికి చెందు తుంది. అందు కొరకు మంగలి వారు దానికి దెబ్బ తగల కుండా వుండేందుకు కొన్ని కనికట్టు విద్యలు పూజలు చేస్తుంటారు. పొద్దు పోవు నంతవరకే తుపాకి వారికి అవకాశం. పొద్దు గుంకింతర్వాత దాన్ని ఎవరూ కాల్చలేక పోతే అది ఇక మంగల వారి పరమే. దీన్ని "పార్వేట" అంటారు. ఈ పార్వేటను చూడ్డానికి జనం చాల మందే వస్తారు. ప్రస్తుతం ఈ పండగకు ఆదరణ చాల వరకు తగ్గి పోయింది. ఈ పార్వేట ఉత్సవానికి మాతృక తిరుమలలో జరిగే స్వామి వారి పార్వేట ఉత్సవం. ఆ రోజున స్వామి వారికి వేటగాని వేషం ధరింప జేసి గోగర్బం ఎదురుగా వున్న పార్వేట మిట్టకు ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ స్వామి వారు వేటాడి నట్టుగా కొన్ని కార్యక్రమాలు చేసి తిరిగి ప్రధాన ఆలయానికి ఊరేగింపుగా తీసు కెళతారు. ఈ సాంప్రదాయంతో తిరుపతి చుట్టు ప్రక్కల ఈ పార్వేట ఉత్సవం జరుగుతుంది.

గంగ పండగ:

మార్చు
 
దామలచెరువు గ్రామసమీపాన ధనుకొండ గంగమ్మ వద్ద పొంగళ్ళు పెడుతున్న దృశ్యం

రైతులు చేసుకునే పండగలలో వాటి ప్రధాన్యత రీత్యా గంగ పండగ రెండొ స్థానంలోకి వస్తుంది. ఇది మేనెలలో వస్తుంది. అప్పటికి వ్వవ సాయ పనులు అన్నీ పనులు పూర్తి అయి వుంటాయి. రైతులకు వ్వవ సాయ కూలీలకు ఇది ముఖ్యమైన పండుగ. ఈ పండగకు మాతృక తిరుపతిలో బారి ఎత్తున జరిగే గంగ జాతర. అందు చేత ఈ పండుగ చిత్తూరు జిల్లాలోనే ప్రాముఖ్యత. ఇతర జిల్లాలలో ఈ పండగ వున్నట్లు లేదు. ఇది ముఖ్యంగా వ్వవ సాయ కూలీల పండగ. ఇంకా చెప్పాలంటే హరిజనుల పండుగ. వారి ఈ పండగ రోజున ముఖ్యంగా పులి వేషం..... ఇంకా ఇతర వేషాలు వేసి ఆడి పాడి రైతులను మెప్పించి వారి నుండి రైతు స్తోమతను బట్టి బహుమతులను అనగా ధాన్యం, బెల్లం, వస్త్రాలు బహుమతిగా పొందు తారు. ప్రధానమైన పల్లెల్లో ఈ రోజున దున్న పోతును బలి ఇస్తారు. వీధి మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన గుడిలోని అమ్మోరును పూజించి గుడి ముందు ఆడి పాడి తెల్ల వార జామున బలి కార్యక్రమం కానిస్తారు. ఆ భయాన దృస్యాన్ని చిన్న పిల్లలు చూడ కూడదని ఆ సమయాన్ని నిర్ణ యిస్తారు. ఈ విచిత్ర వేష దారులు అనేక బూతు పాటలు పాడుతూ ఆడుతూ వీధుల్లో తిరుగుతారు. ఈ పండుగ రైతులకు వ్వవ సాయకూలీలలకు ప్రత్యేకం. ప్రస్తుతం దున్న పోతు బలులు తిరుపతిలో గంగ జాతరలో గాని ఇతర పల్లెల్లో గాని జరగడం లేదు. కానీ...... సాధారణ పల్లెల్లో జరిగే కార్యక్రమం ఏమంటే .... హరిజనుల (ఇంత కాలం రైతుల పొలాల్లో పనిచేసిన కూలీలు) వేసే వివిధ వేష దారణతో ఆడి పాడి కొంత ధాన్యాన్ని బట్టలను ఉదారంగ పొందు తారు. వీరు ఇంత కాలం ఏరైతులవద్ద పనిచేశారో వారి పల్లెలకే వెళతారు. వేరొకరి ఇళ్లకు వెళ్ళరు. పొద్దంతా వీరి ఆట పాటలతో మురిసి పోయిన పల్లె వాసులు సాయంత్రం కాగానే గంగమ్మకు పొంగిలి పెడ్తారు. దీని కొరకు ఒక వేప చెట్టు వుంటుంది. అక్కడ చాకలి ఒక రాయిని గంగమ్మ తల్లిగా ఏర్పాటు చేసి చుట్టు వేపాకు మండలతో చిన్న పందిరిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆ పల్లె వాసులందరు పొంగిలి పెట్టి గంగమ్మ తల్లికి మొక్కు కుంటారు. సర్వ సాధారణంగా ప్రతి ఒక్కరు కోడిపుంజును బలి ఇస్తారు. ఈ పూజా కార్యక్రమాన్ని చాకలి విర్వహిస్తాడు. ప్రతి పలంగా అతనికి బలి ఇచ్చిన కోడి తల, అక్కడ కొట్టిన కొబ్బరి కాయ పై చిప్ప చాకలికి చెందు తారు. ఆ విధంగా ఆరోజు గంగ పండుగ పరి సమాప్తం అవుతుంది. పొంగలి: సాధారణంగా పొంగలి అంటే తమిళ నాడు ప్రాంతంలో.... తమిళనాట చేసే అల్పాహారము. బియ్యంలో పెసర పప్పు, మిరియాలు వేసి అన్నాన్ని మామూలుకన్న కొంచెం ఎక్కువగా మెత్తగా వండతారు. ఇడ్లి, దోసె, వడ, పంటి పదార్తాలతో బాటు ఇదొక అల్పాహారం. కాని ఈ ప్రాంతంలో పొంగలి అంటే దేవుని ముందు అప్పటి కప్పుడు పల్లె వాసులు అందరు కొత్త పొయ్యిలు ఏర్పాటు చేసి, కొత్త కుండలో, కొత్త బియ్యం వేసి అందులో కొత్త బెల్లం ఇతర సుగంద ద్రవ్యాలు వేసి అప్పటి కప్పుడు తయారు చేసే ప్రసాదమే పొంగలి.

గంగ జాతర, చిత్తూరు జిల్లా వ్వాప్తంగా గంగ జాతరలకు ప్రసిద్ధి ప్రతి పల్లెలోను గంగమ్మ గుడి వుంటుంది. ఒక వేళ లేకున్నా గంగ పండగ నాడు ఒక వేప చెట్టు కింద తాత్కాలికంగా గంగమ్మను నిలిపి పూజ, బలి మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి... 1. తిరుపతి లోని గంగ జాతర. 2. చౌడే పల్లి వద్దనున్న బోయ కొండ గంగమ్మ జాతర., 3. గంగాధర నెల్లూరు దగ్గర వున్న బాటగంగమ్మ. ఈ మూడు ప్రాంతాలలో బారీ ఎత్తున జరిగే జాతరలకు చుట్టు ప్రక్కల వున్న రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. గంగ జాతరలో.... భక్తులు ముఖాలకు మసి బొగ్గు బొట్లు పెట్టుకొని వేపాకు మండలను మొలకు కట్టుకొని వూగడం సర్వ సాథారణం. కొంతమంది పూనకం వచ్చి వింత శబ్దాలు చేస్తూ ఊగు తుంటారు. నోరు కొట్టుకుంటూ వింత శబ్దాలు చేస్తు పాటలు పాడటము ఆచరమె.

ఉపవాసం, జాగారణ ఈ పండగ ప్రత్యేకలు. పొద్దున అందరూ స్నానాదికాలు కానిచ్చి శివాలయలో పూజ చేసి గుగ్గిళ్ళ ప్రసాదాన్ని ప్రతి ఇంటీకి పంచడం సాంప్రదాయం. సాయంత్రం గుగ్గిళ్ళను పంచడం ఒక పద్ధతి. శివాలయాల్లో రాత్రంతా ఎన్నో కార్యక్రమాలు, అనగా, నాటకాలు, బుర్ర కథలు, హరికథలు, ఇలా ఎన్నో జరుగుతాయి. రాత్రంతా నిద్ర పోకుండా జాగారణ చేయడానికి ఈ ఏర్పాటు. ఊర్లలోని అన్ని గుడులలో ఈ రాత్రికి చాల కార్యక్రమాలు జరుగుతాయి. జాగారణ చేయడానికే ఈ ఏర్పాటు.

దీన్నే దీపాల పండగ అని కూడా అనే వారు. ఎందు కంటే ఈరోజు ఇళ్లల్లో, చుట్టు ప్రక్కల, దిబ్బల్లో, దీపాలు పెడ్తారు. సాయంకాలం పిల్లలకు బలే సరదా. గోగు పుల్లలతో పొడవాటి కట్టలు కట్టి వాటి కొనలకు మంట పెట్తారు. దీన్ని "సుడ్దు" అంటారు. దాన్ని ఎత్తుకుని, అరుస్తూ పాటలు పాడుతారు. ఆ పాట ఎలా వుంటుందంటే "డేహేరి మాముళ్లో, డేహేరి గుళ్లారిగో .. అంటూ పెద్దగా అరుస్తారు. పెద్ద పిల్లలైతే ఏదో బూతు పాటలు పాడతారు. అక్కడ నుండి కాటమ రాజు వద్దకు వచ్చి అక్కడ దీవించి (దీవించడం అంటే... కాలుతున్న సుడ్తును దేవునిముందు కిందికి పైకి ఆడించడము) ఆ తర్వాత అక్కడే అందరి సుడ్దులను కుప్పగా వేసి కాలుస్తారు. దీన్ని "అవ్వ గుడిసె" అంటారు మంట ఆరి పోయిం తర్వాత ఆ నిప్పుల్లో నడవడం ఆచారం అవి గోగు పుల్లల నిప్పులు గాన చూడ్డానికి ఖణ ఖణ లాడుతూ ఎర్రగా వుంటాయి గాని ఎక్కువగా కాలవు. మెత్తటి నిప్పులు. ఇదొక సరదా. ఈ పండగ కూడా పూర్తిగా కను మరుగైనది. కేవలం ఇండ్లల్లో దీపాలు మాత్రం పెడ్తున్నారు. దీపాలు పెట్టడ మెందుకంటే ఇది కార్తీక మాసం. కార్తీక దీపం పెట్టాలి. ఎత్తైన కొండలపై పెద్ద మంటలు పెడతారు. అవి రాత్రంతా కాలుతుంటాయి. దానినే కార్తీక దేపం అంటారు.

ఇదికూడా పిల్లల పండగే. ఇండ్లల్లో రకరకాల పిండివంటలు చేసితినడం పిల్లలచేత టపాకాయులు కాల్పించడం ఆచారం. ఇప్పుడు పట్టణాలల్లో ఈ పండగ సందర్భంగా బారిఎత్తున టపాకాయులు కాలుస్తున్నారు. కానీ ఆరోజుల్లో ఇప్పుడున్న రకాల టపా కాయలు లేవు. వున్నా పల్లెటూర్లలో అవి అందు బాటులో వుండేవి కావు. పైగా రైతులు కూడా అంత డబ్బు పెట్టి కొనేవారు కాదు. నాలు గైదు రకాల టపాకాయ లుండేవి. వాటిల్లో ముఖ్యంగా కాకర పువ్వొతులు, చిట పటలు, సీమ టపాకాయలు,కేఫ్ బిళ్లలు, పాము బిళ్లలు. బత్తాసు పుల్లలు, మొదలగునవి. ఆరోజుల్లో "పెట్లొప్పు" అనే ఒక పదార్థం దొరికేది. అది గందకం పొడి. దాన్ని ఇనుముతొ చేసిన "రోలు - రోకలి" అనే పరికరంతో వాడే వారు. ఆ పరికరాన్ని "తవ్వలు" అనే వారు.రోలు అనే దానికి ముందు ఒక చిన్న గుంట వెనక ఒక రంధ్రం దారం కట్ట డానికి వుండేది., అదే విదంగా రోకలి చిటెకెన వేలు సైజులో వేలు పొడవు వుండి ఒక వైపు రంధ్రం వుండేది దారం కట్ట డానికి. ఈ రెండింటికి ఒక దారం కట్టి రోట్లో కొంచెం పెట్లొప్పు వేసి, అందులో రోకలి పెట్టి దారం పట్టుకొని ఒక బండ కేసి రోకలి వున్న వైపున కొట్టితే పెద్ద శబ్దం వస్తుంది. ఒక రూపాయి ఐతే సుమారు ఒక పలం పెట్లొప్పు వచ్చేది. దాన్ని ఒక చిటికెడు ఆ ఇనుప రోట్లో వేసి అందులో రోకలి పెట్టి రాతికేసి కొట్టితే ఎంతో శబ్దం వస్తుంది. ఒక పలం పెట్లొప్పు సుమారు ఒక గంట కొట్ట వచ్చు. దీన్ని కొంచెం పెద్ద పిల్లలు ఆడే వారు. చిన్న పిల్లలు చూచే వారు. ఈ పెట్లొప్పు ప్రస్తుతం ఎక్కడా కనబడడం లేదు. ఈ పండగ ఇప్పుడు ఇంకొంచెం ప్రభావితమై ఆదునిక మైన టపాకాయలతో కొత్త పోకడలతో అలరారు చున్నది. పాత కాలంనాటి రోలు--- రోకలి పరికరం ఇఫ్ఫుడు లేదు. ఈ తరం వారికి అదంటే ఏమిటో తెలియదు. అల్లాంటి దాన్నొక దాన్ని తయారు చేయించి దాచి పెట్టి నేటి తరాల వారికి, బావి తరాల వారికి చూపించాలని పిస్తోంది.

 
నాగదేవతలకు పూజ చేయుచున్న భక్తురాలు.

నోముల నెలలోనే నాగుల చవితి అనే పండగ వస్తుంది. ఏకారణం చేతనో గాని దీన్ని అందరు జరుపుకోరు. దీన్ని జరుపుకునే వారు మాత్రం పుట్టలో పాలు పోసి, నాగ దేవతకు పూజ చేసి పుట్టకు నూలు దారాన్ని చుట్టుతారు. ఇది అందరికి వుండదు. ఎవరైతే నోములు నోచుకునే వారు మాత్రం చేసు కుంటారు. ఇది ఈచుట్టు పక్కల మాత్రమే ఉంది. ఈ సందర్భంగా అనేక పిండి వంటలు చేసి తమ బంధువులకు ముఖ్యంగా ఆడ పడుచులకు ఇవ్వడం ఆనవాయితీ. పీండి వంటలతో బాటు "నోము దారాలు" అనగా పసుపు దారాలు ఇవ్వడం అచారం. దీనిని నోములు నోచు కోవడము అని అంటారు. అదే విధంగా మొలకల పౌర్ణమి రోజున వివిధ రకాల ధాన్యం గింజలను మొలకలెత్తించి ఊరి బయట, పొలాల్లో పెట్టి చిన్న పాటి పండగ చేసుకుంటారు. దానికి తమ బందు మిత్రులనందరిని ఆహ్వానిస్తారు.

ఇది తిరుపతి, ఆ చుట్టు పక్కల ప్రాంతానికే పరిమిత మైన పండగ. ఎందుకంటే ఇది శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించిన పండగ. తిరువళనెల మూడో శనివారం ఈ పండగ జరుపు కుంటారు. ఈ రోజు ఇల్లు వాకిలి అలికి, ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కట్టి పిండి వంటలు చేసి మద్ద్యాన్నం వరకు వుపవాస ముంటారు. స్నానాంతరం ప్రతి ఒక్కడు నొసటన నామాలు దిద్దుకుంటారు. నట్టింట తళిగ వేసి పూజ చేసి గోవిందా....గోవిందా... అని గట్టిగా అరుస్తారు. తరువాత పూజానంతరం తళిగలో వున్న ఆహారాన్ని తిని ఉపవాస దీక్షను విరమిస్తారు. అన్నింటి కన్నా ఈ పండగను చాల భక్తి శ్రద్ధలతో జరుపు కుంటారు. ఈ పండగను ఇప్పుడు కూడా జరుపు కుంటున్నారు., కానీ నొసటన నామాలు దిద్దు కోవడం, గట్టిగా అరచి గోవిందులు పెట్టడం తగ్గింది. జనం నామాలూ' పెట్టు కోడానికి, గట్టిగా అరచి గోవిందులూ' పెట్ట డానికి సిగ్గు పడు తున్నట్లున్నారు.

గతంలో ఈ పండగను ఏ వూర్లోను జరుపుకున్న దాఖలాలు లేవు. పాఠశాలల్లో మాత్రం అప్పటి కప్పుడు బంక మట్టితో వినయాకున్ని చేసి పూజించేవారు. దాన్ని పిళ్ళారాయుని పండగ అనే వారు. ఇప్పుడిప్పుడు కొందరు తమ ఇళ్లల్లో వినాయకుని నిలిపి పూజిస్తున్నారు. చాల పల్లెల్లో వినాయకుని గుడి వున్నందున గుడిలో తప్పక పూజ చేస్తున్నారు. ఈ పండగ మహా నగరాల్లో అభివృద్ధి చెందుతూ వున్నందున పల్లెల్లో కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందు చున్నది. ఇప్పుడిప్పుడే వినాయకుని బొమ్మలు అమ్ము తున్నారు.

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ. తిరుపతి చుట్టు ప్రక్కల పల్లెల్లో మాత్రం ఆరోజున చెరువు గట్టున ఒక ఏటను బలి యిచ్చి ఆ రక్తంతొ కలిపిన అన్నాన్ని పంట పొలాలపై చల్లుతారు. దాన్ని పొలి అంటారు. అలా చేస్తే పంట పొలాలకు చీడ పీడలు లేకుండా పుష్కలంగా దిగుబడి వస్తుందని నమ్ముతారు రైతులు.

సంవత్సరాది పండగను బాగానే జరుపు కుంటారు. కొత్త బట్టలు వేసుకుని, అనేక పిండి వంటలతో సంబరంగా వుంటుంది. ఈరోజే తెల్లవారి ''వేపాకు బెల్లం'' కలిపి ప్రతి ఇంటికి పంచుతారు. దగ్గర్లో వున్న గుడికెళ్లి వేపాకు బెల్లం నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. నగరాల్లో లాగ ఉగాది పచ్చడి లాంటి పదార్థం చేయరు. కాని ఇప్పుడిప్పుడే ఉగాది పచ్చడి చేయుట ఆరంబించారు. వేపాకు కలిపిన బెల్ల (కొత్త బెల్లం) మే ఉగాది పచ్చడి.

మొత్తంమీద పల్లెల్లో పండగలు జరుపుకునే విధానము పరిశీలిస్తే... గతంలో వున్నంత ఉత్సాహంగాని, కలివిడి తనంగాని ఇప్పుడు లేదు. ఏదో మొక్కుబడిగా పండగలను జరుపుకుంటున్నారు గాని దానిలో ప్రాణం లేదు. పండగలు పల్లెల్లో సామూహిక కార్యక్రమము. ఈ సాంప్రదాయం మెల్ల మెల్లగా కనుమరుగవుతున్నది.

ఇవి కూడా చూడండి

మార్చు