బంగారుపాప

తెలుగు సినిమా
(బంగారు పాప నుండి దారిమార్పు చెందింది)

బంగారుపాప వాహిని పిక్చర్స్ పతాకంపై బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.వి.రంగారావు, కొంగర జగ్గయ్య, కృష్ణకుమారి, జమున తదితరులు నటించిన తెలుగు సాంఘిక చలనచిత్రం. జార్జ్ ఇలియట్ రాసిన సైలాస్ మర్నర్ నవలలోని కథాంశాన్ని స్వీకరించి తెలుగు వాతావరణానికి అనుగుణంగా మలచుకుని ఈ సినిమా కథ తయారుచేసుకున్నారు. కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది.

బంగారుపాప
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
రచన పాలగుమ్మి పద్మరాజు
తారాగణం ఎస్వీ.రంగారావు,
కొంగర జగ్గయ్య,
డి.హేమలతాదేవి,
కృష్ణకుమారి,
జమున,
రమణారెడ్డి
సంగీతం అద్దేపల్లి రామారావు
సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు
ఛాయాగ్రహణం బి.ఎన్.కొండారెడ్డి
కళ ఎ. కె. శేఖర్
నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, ఎస్వీఆర్ అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. మల్లీశ్వరి కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.

ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప విజయవంతము కాలేదు.

కథాసంగ్రహం

మార్చు

కోటయ్య అమాయకుడు. కోటయ్య గోపాలస్వామిని గురువులా పూజించాడు. రామి తన వలపులరాణి అనుకున్నాడు. రామితో తన పెళ్ళికి అంతా నిశ్చయమైపోయింది. కాని రహస్యంగా రామికీ, గోపాలస్వామికీ స్నేహం కుదిరిందని అతనికి తెలియదు. గోపాలస్వామి, రామి కలిసి తాము చేసిన దొంగతనాన్ని అతనికి అంటగట్టి అతన్ని జైలుకు పంపారు. భయంకరమైన పగ అతడి మనస్సును ఆవహించింది. మానవత్వంలో నమ్మకం పోయి అతను పశువుగా మారిపోయాడు. కొలిమి వదలని కోటయ్యకు కల్లుపాక, జూదపుశాల ఆవాసాలయ్యాయి. రామిని, గోపాలస్వామిని అంతమొందించడం అతని జీవిత ధ్యేయంగా మారింది.

సుందర్రామయ్య ఆ గ్రామంలోకల్లా పెద్ద గృహస్థుడు. కొడుకు మనోహర్‌కి ఒక సంబంధం స్థిరపరిచాడు. అప్పుడు మనోహర్ ఊళ్ళో లేడు. అయినా తను మాటిచ్చిన తరువాత కొడుకు కాదనలేడనే ధైర్యం సుందర్రామయ్యది. కాని తండ్రికి తెలియకుండా మనోహర్ శాంత అనే అమ్మాయిని పెళ్లాడి బెంగుళూరులో కాపురం పెట్టాడు. వాళ్లకొక ఆడపిల్ల కూడా పుట్టింది.

దేశాటనం చేసి ఇంటికి తిరిగి వచ్చిన మనోహర్‌కి పెళ్ళివార్త పిడుగులా తగిలింది. తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని తగాదా పెట్టాడు. తను మాటిచ్చిన తరువాత ఈ పెళ్ళి జరిగితీరాలన్నాడు తండ్రి. అప్పుడయినా నిజం చెప్పి సమస్యను పరిష్కరించగల ధైర్యం మనోహర్‌కి లేకపోయింది. అదే సమయానికి శాంత చంటిబిడ్డతో బయలుదేరి అతనింటికి వస్తున్నట్టు ఉత్తరం వ్రాసింది. ఎంత గొడవ జరిగినా, శాంత వచ్చాక ఏదో విధంగా పరిష్కారం లభిస్తుందని మనోహర్ సమాధానపడ్డాడు.

తన శత్రువైన గోపాలస్వామి రామదాసు అనే వర్తకుడికి ఇల్లు అమ్ముతున్నాడనీ, ఆరాత్రి స్టేషనులో దిగుతాడనీ కోటయ్యకు తెలిసింది. పగతీర్చుకునే సమయం వచ్చిందని పట్టరాని ఆవేశంతో అతడు కత్తికి పదును పెట్టాడు.

ఆ రాత్రి గాలివాన ప్రళయంగా విజృంభించింది. చీకట్లో కత్తి చేతబట్టి కోటయ్య స్టేషనుకు బయలుదేరాడు. దారిపక్కనే శాంత చెట్టుకింద పడి గిలగిల కొట్టుకొంటోంది. పాడుపడిన తూము కింద పసిపాప ఏడుస్తోంది. కోటయ్యలోని మానవత్వం మేల్కొని స్పృహ తప్పిన తల్లిని, పసిపిల్లను ఇంటికి మోసుకుపోయాడు. చెల్లెలు మంగమ్మ చేతికి బిడ్డను అప్పగించి డాక్టరుకోసం బయలుదేరాడు కోటయ్య. అతనికి సుందర్రామయ్య ఇంట్లో దొరికాడు డాక్టరు. కోటయ్య డాక్టరుకు ఈ కథ చెబుతున్నపుడు స్థాణువులా విన్నాడు మనోహర్. శాంత డాక్టరు వచ్చేలోపు మరణించింది.

అప్పుడు నిజం బయటపడినా చచ్చిపోయిన శాంత తిరిగిరాదు. తన చేయిదాటిన కథను త్రవ్వినట్టయితే తనకే గాక అందరికీ బాధ. అంచేత అగ్నిపర్వతం లోపల దహిస్తున్నా, తండ్రిమాటకు తలొగ్గి పార్వతిని పెళ్ళి చేసుకున్నాడు మనోహర్.

పగతో రగిలే కోటయ్య హృదయాన్ని పాప పండువెన్నెలతో నింపింది. పాప సాన్నిహిత్యం కోటయ్యలోని ప్రతి అణువుని మానవత్వంతో నింపి వేసింది. గర్భశత్రువైన గోపాలస్వామి చేజిక్కితే అతన్ని చంపడానికి బదులు, అతిథిగా గౌరవించాడు.

పార్వతికి పిల్లలు కలుగరు. ఆమె మేనల్లుడు శేఖర్ సుందర్రామయ్య ఇంట్లోనే పెరుగుతున్నాడు. వంశమర్యాదలకీ, సంప్రదాయాలకీ బందీ అయిన మనోహర్, నిజం వెల్లడించలేకపోయినా అతని పితృహృదయం పాపకోసం పరితపించేది. ఏదీ మిషతో కోటయ్యకు అతడు డబ్బిస్తుండేవాడు. పాపకూ, శేఖర్‌కూ స్నేహం కుదిరి అది ప్రేమగా మారింది. ఈ విషయం సుందర్రామయ్యకు తెలుస్తుంది.

సుందర్రామయ్య కోటయ్య ఇంటికి వచ్చి పాపా శేఖరం కలిసి తిరగడం మంచిదికాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తను స్వయంగా పాపకు చెప్పలేక చెల్లెలు మంగమ్మ చేత చెప్పిస్తాడు కోటయ్య.

శేఖర్‌కు వేరే పెళ్ళిచేస్తే సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని భావించి సుందర్రామయ్య, పార్వతి శేఖర్‌ని ఒత్తిడి చేస్తారు. శేఖర్ తను పాపను పెళ్ళి చేసుకోవడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పేస్తాడు. కోపం పట్టలేక పార్వతి కోటయ్య ఇంటికి వెళ్లి అతడిని అనరాని మాటలంటుంది. అదే సమయానికి పాపా శేఖర్‌లు అక్కడికి రావడం, పార్వతి ఎత్తిపొడుపు మాటలు అనడం, కోటయ్య కోపం ఆపుకోలేక పాప చెంపమీద కొట్టడం జరుగుతుంది. కూతురు ఇష్టం మీద కోటయ్య ఆ ఊరు వదిలి వెళ్లిపోవడానికి నిశ్చయిస్తాడు.

కోటయ్య, పాప ఊరు వదలి వెళ్లిపోతున్నారు. పాప బండి ఎక్కింది. ఇంతలో మనోహర్ కంగారుగా కారు దిగి కోటయ్యను తన ఇంటికి రమ్మని బతిమాలతాడు.

సుందర్రామయ్య ఇంటికి కోటయ్య రాగానే అతని ఎదుట డబ్బు కుప్పగా పోసి పాపను తమ ఇంట్లో వదలి, దానికి ప్రతిఫలంగా కావలసినంత డబ్బు తీసుకుని కోటయ్య ఊరు వదిలి దూరంగా పోవాలని ప్రతిపాదిస్తారు సుందర్రామయ్య ఇంటివాళ్లు. కోటయ్య తొలగిపోతే పాపను ఇంటికోడలుగా చేసుకోవడానికి వాళ్లు సిద్ధం. పదహారేళ్లు పెంచి పెద్దచేసిన పాపను ఒదిలి వెళ్లడానికి మొదట సంశయించినా తను ఒప్పుకుంటే పాప సుఖంగా జీవిస్తుందని భావించి కోటయ్య మనస్సును దిటవుపరచుకొని సరే అంటాడు. ఈ దృశ్యాన్ని గుమ్మంలో నిలబడి చూస్తున్న పాప తన తండ్రితో పంచుకోలేని సుఖం తనకు అక్కరలేదని చెప్పి తండ్రి చెయ్యి పట్టుకుని వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన శేఖర్ తనవాళ్లు పాల్పడ్డ నీచానికి వాళ్లను నిందిస్తాడు.

మనోహర్ మనస్సులో అంతవరకు పెరిగిన ఆశ చటుక్కుమని భగ్నమైపోతుంది. కూతురు గుమ్మం వరకూ పోయే సరికి అతని హృదయంలోని రహస్యం బయటపడుతుంది. అతడు జరిగిన కథంతా చెప్పేస్తాడు. నిజం తెలుసుకున్న పార్వతి పాపను దగ్గరగా తీసుకుంటుంది.

పాప, శేఖర్‌ల పెళ్ళి వైభవంగా జరిగి కథ సుఖాంతమౌతుంది[1].

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన జార్జి ఇలియట్ నవల సైలాస్ మార్నర్ నవలను తీసుకుని పలు మార్పులు చేర్పులు చేసుకుని ఈ కథ తయారుచేసుకున్నారు. ఈ సినిమాకి పాలగుమ్మి పద్మరాజు మాటలు రాయడంతో పాటు బి.ఎన్.రెడ్డితో పాటుగా ఆయన స్క్రీన్ ప్లే రాశారు.

నటీనటుల ఎంపిక

మార్చు

చిత్రీకరణ

మార్చు

పాటలు

మార్చు
 1. యవ్వన మధువనిలో వన్నెల పూవుల ఉయ్యాలా - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: పి.సుశీల, ఎ.ఎమ్. రాజా)
 2. వెన్నెల వేళలు పోయినా ఏమున్నది - పి.సుశీల
 3. తాధిమి తకథిమి తోలుబొమ్మా (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: మాధవపెద్ది సత్యం)
 4. పండు వెన్నెల మనసునిండా వెన్నెల - సుశీల, ఎ.ఎమ్. రాజా
 5. బ్రతుకు స్వప్నం కాదు - మాధవపెద్ది సత్యం
 6. ఏ కొర నోములు ఏమి నోచెనో - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి)
 7. ఘల్ ఘల్‌మని గజ్జలు మ్రోగ - పిఠాపురం నాగేశ్వరరావు
 8. కనులకొకసారైన కనపడని నా - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: పి.సుశీల
 9. వెడలె ఈ రాజకుమారుడు - ఎ.ఎమ్. రాజ, పి.సుశీల, మాధవపెద్ది సత్యం బృందం

పురస్కారాలు

మార్చు

సన్నివేశ చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
 1. సంపాదకుడు (1955-04-01). "బంగారుపాప కథాసంగ్రహం". సినిమారంగం. 2 (1): 90–92. Archived from the original on 5 March 2016. Retrieved 12 March 2015.
 2. "3rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 1 September 2011.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు