గుణగ విజయాదిత్యుడు
గుణగ విజయాదిత్యుడు సా.శ.849 - 892 మధ్య కాలంలో ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజు. వీరినే "వేంగి చాళుక్యులు"ని కూడా అంటారు. ఇతని రాజధాని వేంగి. (ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు సమీపంలో ఉన్న పెదవేగి అనే గ్రామం.)
తూర్పు చాళుక్య రాజులలో గుణగ విజయాదిత్యుడు అగ్రగణ్యుడు అనవచ్చును. ఇతను మహా పరాక్రమశాలి. చాళుక్య విజయ ధ్వజాన్ని గంగానది మొదలు కావేరి పర్యంతం వీర విహారం చేయించినవాడు. ఇతని కాలంలో వేంగి బలగౌరవాలు ఇనుమడించినాయి.[1]
పూర్వ రంగం
మార్చువేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్రచరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. తూర్పు చాళుక్యులనబడే వీరు తీరాంధ్రాన్ని మాత్రమే పాలించారు. వేంగి చాళుక్యులు పశ్చిమ (కన్నడ) ప్రాంతంనుండి దండెత్తి వచ్చినవారు అయినా కాని వీరు ఆంధ్రులకొక వ్యక్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సాధించగలిగారు. "జన్మభూమిశ్చాళుక్యానాం దేశో వేంగితి పశ్రుతః" అని చాటి ప్రజా క్షేమాన్ని కాంక్షించి పాలించారు. నాటివరకు రాజాస్థానాలలో ఆదరణ లేని తెలుగు భాషను ఆదరించి విశేష ప్రచారం తెచ్చిపెట్టారు.అందు చేత తూర్పు చాళుక్యుల చరిత్రయే ఈ యుగంలో ఆంధ్రుల చరిత్ర అనడంలో సందేహానికి తావుండరాదు[1]. శాతవాహనుల కాలంలో సంస్కృతం పండిత భాష, ప్రాకృతం రాజభాష, తెలుగు పామరుల భాష[2]. వేంగి చాళుక్యుల కాలంలోనే తెలుగు పండిత భాషగాను, ప్రజల భాషగాను, రాజభాష గాను మూడు వన్నెల ఔన్నత్యాన్ని సమకూర్చుకొంది. మార్గకవితను సేవించుచుండిన ఆంధ్రులకు తెలుగు కవితను పుట్టించి, తెలుగు నిలిపిన యశము చేకూర్చిన ఘనత చాళుక్య రాజులకు దక్కింది[3].
సా.శ. 624లో (ఈ సంవత్సరం పై విభిన్నాభిప్రాయాలున్నాయి) బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని (ఏలూరు దగ్గర జరిగిన యుద్ధంలో) జయించాడు. అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు (624-641) అన్న ఆశీస్సులతో వేంగిని స్వతంత్రరాజ్యంగా పాలించనారంభించాడు. ఇతడు మహావీరుడు. పరిపాలనా దక్షుడు. క్రమంగా తూర్పు చాళుక్యుల రాజ్యం దక్షిణాన నెల్లూరు నుండి ఉత్తరాన శ్రీకాకుళం వరకు విస్తరించింది. తరువాతి మూడు శతాబ్దాలలో వారికి రాష్ట్రకూటులతోను, దక్షిణాన పల్లవులతోను, బోయ నాయకులతోను, చోళులతోను, పరామారులతోను ఎడతెరగని పోరులు జరిగాయి. ఒక దశలో పశ్చిమ చాళుక్య రాజు సత్యాశ్రయుడు తిరిగి చాళుక్య దేశాన్ని ఒక పాలన క్రిందికి తీసికొనిరావాలని ప్రయత్నించాడు కాని అది సాధ్యం కాలేదు.
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధ్రువుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పోరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు శాసనాలు చెబుతున్నాయి.
తరువాతి రాజులలో గుణగ విజయాదిత్యుడు (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి యుద్ధంలో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు.
గుణగ విజయాదిత్యుని వంశ క్రమం
మార్చు- వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు కుబ్జ విష్ణువర్ధనుడు (624-641)
- అతని కొడుకు జయసింహ వల్లభుడు (641-73) 33 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. రాజ్యాన్ని బాగా విస్తరించాడు. అనేక బోయకొట్టాలను ఆక్రమించాడు. కృష్ణానది దక్షిణాన పల్లవులతో వైరుధ్యం ఈ కాలంలో ఆరంభమయ్యింది.
- తరువాత ఇంద్ర భట్టారకుడు (ఏడు రోజులు మాత్రం), రెండవ విష్ణు వర్ధనుడు (673-81), అనంతరం మంగి యువరాజు (జయసింహ వల్లభుని తమ్ముని కొడుకు) (681-705) పాలించారు.
- రెండవ జయసింహుడు 705-715 మధ్య కాలంలో పాళించాడు. ఇతని మరణానంతరం వేంగిలో అంతఃకలహాలు ప్రబలినాయి. జయసింహునికి అంతానం లేనందున తమ్ముని కొడుకులు రాజ్యార్హులయ్యారు. వారిలో పెద్దవాడైన మూడవ విష్ణువర్ధనునికి రాజ్యాధికారం ఉండగా చిన్నవాడైన కొక్కిలి సింహాసనాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసి, పారిపోయి ఎలమంచిలిలో స్వతంత్ర రాజ్యం స్థాపించుకొన్నాడు. (మూడు తరాల అనంతరం ఎలమంచిలి తిరిగి వేంగి రాజ్యంలో విలీనమయ్యింది.)
- వేంగి రాజ్యానికి వారసుడైన మూడవ విష్ణు వర్ధనుడు (718-52) 24 సంవత్సరాలు పాలవ సాగించాడు.
- ఇతని కుమారుడు విజయాదిత్యుడు (753-770). ఇతని కాలంలో కర్ణాటకలో (బాదామి) చాళుక్యులనోడించి రాష్ట్రకూటులు అధికారంలోకి వచ్చారు. తరువాత రాష్ట్రకూటులకు తూర్పు చాళుక్యులకు ఎడతెరిపి లేకుండా యుద్ధాలు సాగాయి. ఈ సంఘర్షణ సుమారు రెండు వందల సంవత్సరాలు సాగింది. రాష్ట్రకూట రాజు కృష్ణుని సైన్యం విజయాదిత్యుని ఓడించి అపార ధనరాసులు కప్పంగా పట్టుకెళ్ళారు. వేంగి రాజ్యంలో కొంత భాగాన్ని కూడా వశం చేసుకొన్నారు.
- విజయాదిత్యుని కొడుకు నాలుగవ విష్ణువర్ధనుడు (771-806) కూడా రాష్ట్రకూటుల చేత పరాజితుడై కప్పం చెల్లించడమే కాక తన కుమార్తె శీలమహాదేవిని రాష్ట్రకూట రాజు ధ్రువునికి ఇచ్చి పెళ్ళి చేశాడు.
- నాలుగవ విష్ణువర్ధనుని మరణానంతరం అతని కుమారులు - పెద్దవాడు రెండవ విజయాదిత్యుడు, రెండవవాడు భీమసలుకి - రాజ్యాధికారానికి కలహించుకొన్నారు. రాష్ట్రకూటుల సహాయంతో భీమసలుకి రాజై రాష్ట్రకూటుల చెప్పుచేతల్లో ఉన్నాడు. వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తిన్నది.
- సింహాసనాన్ని కోల్పోయిన రెండవ విజయాదిత్యుడు బెజవాడ స్థావరంగా 12 సంవత్సరాలు రాష్ట్రకూటులతోను, భీమసలుకితోను పోరు సాగించాడు. 813లో సలుకిని పారద్రోలి వేంగి సిహాసనాన్ని ఆక్రమించాడు. అంతటితో ఆగక రాష్ట్రకూటులపై వీరవిహారం చేసి స్తంభపురి (కాంబే?) ని ధ్వంసం చేశాడట. గుజరాత్‌ను పాలిస్తున్న రాష్ట్రకూటరాజు వేంగితో సంధి చేసుకొని తన కుమార్తె శీలమహాదేవిని విజయాదిత్యుని కుమార్తెకిచ్చి పెళ్ళి చేశాడు. వేంగి ప్రతిష్ఠ కొంత పునరుద్ధరింపబడింది. రెండవ విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి, అందుకు గుర్తుగా 108 శివాలయాలు నిర్మించాడట.
- రెండవ విజయాదిత్యుని అనంతరం అతని కుమారుడు ఐదవ విష్ణువర్ధనుడు (846-47) ఒక్క సంవత్సరం మాత్రం పాలించాడు. ఇతడు "కలి విష్ణువు" లేదా "కలి విష్ణు వర్ధనుడు" అన్న పేరుతో ప్రసిద్ధుడయ్యాడు.
కలివిష్ణువు కుమారుడు "మూడవ విజయాదిత్యుడు". ఇతనినే "గుణగ విజయాదిత్యుడు" అని వ్యవహరిస్తారు. "గుణకనెల్ల" అనగా "గుణాలచే అందమైనవాడు" అని అర్ధం.[1] ఇతడు తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు అనవచ్చును.
గుణగ విజయాదిత్యుని రాజ్యం
మార్చుగుణగ విజయాదిత్యుని తొమ్మిది శాసనాలు లభించాయి. రాష్ట్రకూటుల శాసనాల వల్లకూడా ఇతని చరిత్ర కొంత తెలుస్తున్నది. ఇతని పాలనాకాలం (848-891) యుద్ధాలతో, దండయాత్రలతో గడిచింది. ఇతని యుద్ధాలలో యుద్ధ తంత్రజ్ఞులు, చతుర్విధోపాయ చతురులు, ప్రభు భక్తి పరాయణులు అయిన నలుగురు బ్రాహ్మణ సేనానులు తోడ్పడినట్లు తెలుస్తున్నది. వారు వారు కడియరాజు, అతని కొడుకు పాండురంగడు, వినయడి శర్మ, రాజాదిత్యుడు. వీరిలో పాండురంగడు దక్షిణాన పల్లవులకు తోడ్పడుతున్న బోయనాయకులను ఓడించి నెల్లూరును ధ్వండం చేసి 12 బోయకొట్టాలను ఆక్రమించాడు. కొట్టములు నశించడంతో బోయలు వ్యవసాయ వాణిజ్య వృత్తులలో స్థిరపడి శెట్టి, రెడ్డి, నాయుడు, కమ్మ కులాలలో విలీనమయ్యారు.[1]
గుణగుని కాలంలో రెండు ప్రధాన ఘట్టాలున్నాయి. మొదటి ఘట్టంలో అతడు రాష్ట్రకూటుల చేత పరాజితుడై అమోఘవర్షుని ఆజ్ఞను శిరసావహించవలసి వచ్చింది. రెండవ ఘట్టంలో విజయాదిత్యుడి సైన్యం పండరంగని నాయకత్వంలో రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణ, అతని బావ మరిది సంకిల ల ఉమ్మడి సైన్యాన్ని జయించి, వారల రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపధంలో అత్యున్నత స్థానం సాధించాడు.
మొదటి ఘట్టంలో అమోఘవర్షుడు వింగవల్లి వద్ద జరిగిన భీకర యుద్ధంలో గుణగుడు ఘోరంగా పరాజితుడై అమోఘవర్షునికి సామంతుడయ్యాడు. ఇతడు రాష్ట్రకూట సామంతులైన తూర్పు గాంగులను, నొలంబ పల్లవ మొదలగు వారి తిరుగుబాటును అణచుటలో అమోఘవర్షునికి గొప్ప సహాయం చేశాడు. వినయడిశర్మ అనే సేనాని సహాయంతో గంగవాడిపై దాడి జరిపి గుణగుడు మంగి (పొలల్చోర నొలంబాధిరాజు) అనే నొలంబరాజును ఓడించాడు. ఈ కాలంలోనే గుణగుడు శరణార్ధియైన ఒక చోళరాజును కాపాడినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
సా.శ. 880లో అమోఘవర్షుడు మరణించగా అతని కొడుకు రెండవ కృష్ణుడు రాజయ్యాడు. ఆ సమయంలో రాష్ట్రకూటుల రాజ్యం కల్లోలితమయ్యింది. ఇది అదనుగా చూసుకొని గుణగుడు స్వతంత్రించడమే కాకుండా పండరంగ సేనాపతి అధ్వర్యంలో రాష్ట్రకూట రాజ్యంపై జైత్రయాత్ర నిర్వహించాడు. ఈ జైత్రయాత్రలో రాష్ట్రకూట రాజు కృష్ణుడు, అతని బావమరది సంకిలుడు (శంకరగణ రణ విగ్రహ) ఓడిపోయారు. అనంతరం గంగా నర్మదా నదుల మధ్య దేశం దాహళ రాజ్యాన్ని, వేములవాడ చాళుక్యాధిపతి బడ్డెగను ఓడించారు. పశ్చిమంగా పురోగమించి దాహళ దేశపు కిరణపురాన్ని, అచల పురాన్ని ధ్వంసం చేశాడు. రాష్ట్రకూటులనుండి సార్వభౌమ సూచకమైన పాళి ధ్వజాన్ని, గంగాయమునా తోరణాన్ని గ్రహించి, దక్షిణాపధ పతిత్వాన్ని సూచించే "సుమదిత పంచమహాశబ్ద" బిరుదాన్ని స్వీకరించాడని సాతులూరు, ధర్మవరం శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇతడు సాధించిన విజయ పరంపరలతో తూర్పు చాళుక్యుల అధికారం ఉత్తరాన మహానది నుండి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు విస్తరించింది. దక్షిణాపధంలో వారు "చండ చాళుక్యులు" అన్న పేరుతో ప్రసిద్ధులయ్యారు.
అనంతరీకులు
మార్చుగుణగునికి సంతానం లేదు. అందుచేత తమ్ముడు విక్రమాదిత్యుడు యువరాజుగా ఉన్నాడు. అతని కొడుకు చాళుక్య భీముడు గుణగ విజయాదిత్యుని రాజ్య వారసుడయ్యాడు.
ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, కళింగ రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
తెలుగు పద్య శాసనాలు
మార్చుతెలుగు సాహిత్య చరిత్ర గుణగ విజయాదిత్యునికి ప్రత్యేక స్థానమున్నది. తెలుగుభాషలోని తొలి మూడు పద్య శాసనాలూ గుణగ విజయాదిత్యునివి, అతని సేనాని పండరంగనివి.
గుణగ విజయాదిత్యుని సేనాని వేయించిన తరువోజ ఛందస్సులోని అద్దంకి పద్య శాసనము, తెలుగుభాషలో తొలి పద్యశాసనముగా (తొలి పద్యముగా) ప్రసిద్ధి చెందింది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు.
- పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
- బలగర్వ మొప్పగ బైలేచి సేన
- పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
- బంచిన సామంత పదువతో బోయ
- కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
- గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
- కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
- కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
గుణగ విజయాదిత్యునివే మరో రెండు తెలుగు పద్య శాసనాలు కందుకూరు, ధర్మవరం లలో లభించాయి. అవి తొలి సీస, ఆటవెలది పద్యాలను కలిగి ఉన్నాయి.
- శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
- శివ పద వర రాజ్య సేవితుండ
- ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
- దండమోద్య సిఘాసనుండగణిత
- దానమాన్యుండు దయా నిలయుండును
- భండన నండన పండరంగు
- ...................................కొలది లేని
- కొట్టము ల్వోడిచి గుణక నల్ల
- తాని పక్ష పాతి................
- ....................విభవ గౌరవేంద్ర..
ఈ సీస పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇచ్చారు.
- కిరణపురము దహళ నిరుతంబు దళెనాడున్
- అచలపురము సొచ్చెనచలితుండు
- వల్లభుండు గుణకె నల్లుండు (వంచి) నన్
- బండరంగ చూరె పండరంగు
ఈ ఆటవెలది పద్యము గుణగ విజయాదిత్యుని దాహళదేశ దండయాత్ర గురించి తెలుపుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చు- బోయ నాయకులు
- వేంగి
- తూర్పు చాళుక్యులు
- రాష్ట్రకూటులు