లొట్టపీసు పూలు (కథా సంపుటి)
ఈ వ్యాసంలోని సమాచారం సరైనదేనని రూఢీ చేసుకునేందుకు మరిన్ని మూలాలు కావాలి . (నవంబరు 2021) |
లొట్టపీసు పూలు శీలం భద్రయ్య రచించిన కథా సంపుటి.

రచనా నేపథ్యం
మార్చుతెలుగు కథాసాహిత్యానికి ఈ కథలు చక్కని జోడింపు, మైలు రాయిగా నిలుస్తాయి. మంచి కథలకు ప్రాంతీయత, సరిహద్దులు, మాండలిక భాషాబేధాలు ఉండవనేది “లొట్టపీసు పూలు” కథల సంపుటి నిజం చేసింది. చెరువులో “లొట్టపీసు చెట్లు” వేగంగా విస్తరించినట్టు, తెలుగువారున్న ప్రతిచోటుకు ఈ కథలు పరివ్యాప్తమయ్యాయి. విమర్శవ్యాసాలపై కేంద్రసాహిత్య అకాడమి అవార్డు పొందిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు, జి. లక్ష్మీనర్సయ్య గారు వంటి ప్రసిద్ద విమర్శకుల మన్ననను త్వరగానే పొందింది. తెలంగాణ భాషాభిమానులకైతే ఈ కథలు చక్కని విందు. కథల్లో రచయిత భాషతో బాటు పాత్రల భాష కూడా ఇంపైన ఇంటి పలుకుబడి ఉంటుంది. ఈ కథల్లో గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను చూపుతూ, అవసరమైన చోట సామెతలు, జాతీయాలను ఒడుపుతో ఉపయోగించాడు. గ్రామీణ నేపథ్యం లేని ఈ తరం పాఠకులకు అర్ధం కాని మాండలిక పదాలు కూడా కథాగమనంలో అర్ధమయ్యే విధంగా కథను మలచడం మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. “లొట్టపీసు పూలు” శీర్షికను బెట్టిన రచయిత భాష, భావ దృక్పథాన్ని మరింత పరిశీలనగా చూడాల్సిన అవసరముంది. అట్టడుగు, సామాన్య వర్గాల భాష, వస్తువును ఎంపిక జేసుకుని జన సామాన్య భాషకున్న గౌరవాన్ని గుర్తుజేసిన రచయిత శీలం భద్రయ్య. కవితాత్మక వాక్యనిర్మాణం, కథానిర్మాణ శైలి, శిల్ప నైపుణ్యం రచయితను అరుదైన రచయితల సరసన నిలబెడుతుంది. ఈ తరానికి ఈ కథలు ఒక కొత్త రచనా ఒరవడికి దిక్సూచి. ఈరోజుల్లో ఎంతో మంది కథలు రాస్తున్నారు. ఎక్కువగా తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకోలేకపోతున్నారు. శీలం భద్రయ్య తన మొదటి కథా సంపుటికే తన “శైలి, భాష, వస్తు నేపథ్యాన్ని” స్థిరబరుచుకున్నాడు.
ఇతివృత్తాలు
మార్చుశీలం భద్రయ్య రాసిన “లొట్టపీసు పూలు” వస్తుపరంగా వైవిధ్యం ఉన్న కథలు. ఇందులో చారిత్రక తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంతో “ఇస పురుగు”, “కేంపు చెరువు”, “బంచెర్రాయి”, “కోదండం”, “కొత్తదొర”, “మాయబారి” కథలు, నాటి, నేటి సామాజిక రుగ్మతల నేపథ్యంలో రాసిన “టముకు, “లత్త”, “లొట్టపీసు పూలు”, “అగ్గువబతుకులు”, “ఖూని”, “శూర్పణఖ” కథలు, సామాజిక బాధ్యతను గుర్తుజేసే “కర్తవ్యం”, “తోడు”, “వెలుగు చుక్క” కథలు ఉన్నాయి.
లొట్టపీసు పూలు-తెలంగాణ కథలు పై ప్రముఖుల అభిప్రాయాలు
మార్చు- "తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ, చక్కని తెలంగాణ యాసలో ఈ పుస్తకాన్ని రాసిన తీరు అభినందనీయం. ఇవాల్టి మన సౌకర్యవంతమైన జీవనానికి కారణమైన, నాటి మహనీయుల జీవితాల గురించి యువత తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. “లొట్టపీసు పూలు” లాంటి పుస్తకాలు ఈ దిశగా యువతను ప్రేరేపించగలవు అని ఆశిస్తున్నాను. ఈ పుస్తకంలోని కొన్ని కథలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలాన్ని ఆవిష్కరించాయి. నాటి ప్రజల జీవన స్థితిగతులను వివరించాయి. వీటన్నింటి గురించి యువత తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయం, యాసల కలబోత అయిన ఈ పుస్తకాన్ని రాసిన మీ అభిరుచిని అభినందిస్తున్నాను. ఈ తరహా నేపథ్యంతో, యువతకు మన చరిత్రను తెలియజేసే విధంగా మరిన్ని పుస్తకాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను."
- మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి
- “లొట్టపీసు పూలు” కథలన్నీ సినిమా మాధ్యమానికి పూర్తి అనుగుణ్యత కలిగిన కథలు. ఈ కథల్లో ప్రారంభాలు అద్భుతంగా ఉన్నాయి. పాఠకుల కళ్ళను రచయిత సులువుగా అక్షరాల వెంట పరిగెత్తించగలిగాడు. పాఠకునికి ఆసక్తికర కథాలోకానికి మార్గాన్ని నిర్మించే నాటకీయ లక్షణాలు ఈ కథల్లో ఉన్నాయి. ఇది మంచి కథకుని లక్షణం." -మామిడి హరికృష్ణ, సంచాలకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి
- "తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంతో కూడుకున్న ఇతివృత్తాలతోపాటు సమకాలీన మానవానుబంధాలకు, జీవన విధానానికి అద్దం పడుతూ మీరు రచించిన ఈ కథలు చిరకాలం పాఠకుల మన్ననలు పొందుతాయని ఆశిస్తున్నాను. మరెన్నో రచనలతో మీరు తెలంగాణ సాహితీ ప్రక్రియలో ఉన్నతశ్రేణి కథారచయితగా ప్రఖ్యాతి గడించాలని కోరుకుంటూ..." - చెరుకూరి రామోజీరావు, స్థాపకులు, ఈనాడు సంస్థలు
- "ఈ కథలన్నీ ఒకేసారి చదివితే, పాఠకులకు ఒక వివేకాన్ని కలిగిస్తాయి. ఒక చింతనను రేకెత్తిస్తాయి. ఈ కథలు పాఠకులను అద్వాన్నపుటెడారులలో వదిలేసి వెళ్లిపోవు. ఒక యువరచయిత మనం నివసించే సమాజాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో చెప్పి, మనల్ని కూడా ఆలోచించమంటాడు." -ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి, ప్రముఖ సాహితీ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత,అధ్యక్షులు, అభ్యుదయ రచయితల సంఘం
- 'లొట్టపీసు పూలు' కథలు ఇటీవల సాహిత్య వాతావరణంలో హల్ చల్ చేసిన కథలు. తెలంగాణ చరిత్రను, వర్తమాన గ్రామీణ జీవితాన్నీ తగిన సాంస్కృతిక నేపథ్యం నుంచి ప్రవేశపెట్టిన కదలివి. ఆర్థిక, సాంఘిక, రాజకీయ పార్శ్వాలను, గ్రామీణ బహుజన సాంస్కృతిక వాస్తవికత ద్వారా చిత్రించటంలో కథకుడు తగిన కళా నైపుణ్యాలనూ, మెలకువనూ ప్రదర్శించాడు. పాఠకుల అంచనాలకు అందకుండా కథను నడపటంలో రచయిత చూపెట్టిన నేర్పరితనం వల్ల ఈ కథలు బోరు కొట్టవు. ఏవగింపు కలిగించవు. కథనాన్నీ, సంభాషణలన్నీ అచ్చనైన గ్రామీణ తెలంగాణా సహజ నుడితో నింపటం ఈ రచయిత ప్రత్యేకత. మనకు తెలీని, నిఘంటువులకెక్కని ఎన్నో తెలంగాణ గ్రామీణ మాటలూ, పదాలూ, సామెతలూ, పలుకుబడులూ ఈ కథల్లో స్థానిక వర్షాన్ని కురిపిస్తాయి. కుల, వర్గ, లింగ దృక్పధంతో జీవితాన్ని చూస్తూ, అధిక సంఖ్యాకుల ఆర్తినీ, ఆకాంక్షల్నీ, తండ్లాటల్నీ, తిరుగుబాట్లనీ మెరుగైన తాజా శిల్పంతో నమోదు చేయడం కథకుని ప్రతిభను పట్టిస్తుంది." - జి. లక్ష్మీనర్సయ్య కవి, రచయిత, దళిత బహుజన ఉద్యమకారులు, సామాజిక విశ్లేషకులు, సాహిత్య విమర్శకులు
- "శీలం భద్రయ్య కథల్లో వాస్తవికత ఉంది. కాల్పనికత ఉంది. అణిచివేత తిరుగుబాటు ఉంది. ప్రతి కథలో కవితాత్మక శైలి కల్గిన వాక్యాలు విస్తృతంగా ఉన్నాయి." -డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సాహిత్య పరిశోధకులు, విమర్శకులు
- ‘లొట్టపీసుపూలు’ సంపుటిలోని అన్ని కథలు ఫ్రెష్‌గా, వివక్ష రూపాల్ని, మూఢనమ్మకాల వల్ల బలవుతున్న బహుజన బతుకుల్ని, చదువు ఆసరా అవుతుందని చిత్రించాయి. ఇంతవరకు సాహిత్యంలోకి రాని బహుజన బతుకులను ఒక్కటొక్కటిగా లెక్కగడుతున్న భద్రయ్య కథలు ఇప్పటి అవసరం. సబాల్టర్న్ దృక్కోణంతో విస్మరణకు గురైన కోణాలను చిత్రికగడుతున్న భద్రయ్యకు అభినందనలు" - సంగిశెట్టి శ్రీనివాస్ , తెలంగాణ సాహిత్య పరిశోధకులు, సభాల్టర్న్ బహుజన పత్రికా సంపాదకులు, సాహిత్య విమర్శకులు, సామాజిక విశ్లేషకులు
- "భద్రయ్య కథల్లో వస్తు వైవిధ్యం అపారంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని అన్ని పొరల్ని తెలంగాణ సంస్కృతిని తనదైన కోణంలో ఆవిష్కరించిన కథలు" - డా॥ వెల్దండి శ్రీధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్
- "శీలం భద్రయ్య కథల్లో యాస ప్రాణవాయువు. ఈ కథల్లో రచయిత తనదైన కొత్త మౌఖిక కథన శైలిని, తెలంగాణ భాషను సహజంగా, అత్యంత ఆత్మీయతల కలబోతగా కథలను రాశాడు. గతం వర్తమానాల మధ్య ఖాళీలను పురించే సాహిత్యం చేసే బాధ్యతను ఈ కథలు భుజానికి ఎత్తుకున్నాయి. ఈ కథలు చదివితే తెలంగాణ కథా శిఖరాలు నెల్లూరి కేశవస్వామి, వట్టికోట, కాంచనపల్లి, పాకాల యశోదారెడ్డి, దాశరధి, అల్లం రాజయ్య రాసిన కథలను గుర్తు చేశాయి. -డా. ఎస్. రఘు, సహాయాచార్యులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలంగాణ పాఠ్యపుస్తక సంపాదకులు
- "శీలం భద్రయ్య రాసిన కథాసంపుటికి ‘లొట్టపీసుపూలు’ అని పేరు పెట్టడంలోనే మట్టి బతుకుల వెతలను, కథావస్తువులుగా స్వీకరించాడన్న విషయం అర్థమవుతుంది. ఆధిపత్యవర్గాలవారిచే అట్టడుగు వర్గాల వారు ఏవిధంగా పీడింపబడుతున్నారో, ఎలా చులకనగావింపబడుతున్నారో ఈ కథల ద్వారా మనకు తెలుస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జరిగిన దొరల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను ప్రధాన వస్తువుగా చేసుకొని రాయబడిన కథలు ఇందులో ఆరున్నాయి. అట్టడుగు సమాజంలో నిరాదరణకు గురి కాబడ్డ వ్యక్తుల జీవితాలను తలకెత్తుకుని, వాటిని తన కథల్లో వస్తువుగా చేసుకొని ఆసక్తిగా చెప్పడం జరిగింది. కల్మషం లేని వివక్షకు గురైన జీవితాలకు ప్రతీకగా ‘లొట్టపీసు పూలను’ స్వీకరించడం జరిగింది. - డా. తండు కృష్ణ కౌండిన్య, సహాయాచార్యులు, తెలుగు శాఖ, నాగార్జున ప్రభుత్వ కళాశాల
- తెలంగాణ తెలుగుభాషానుడికారానికి, జీవద్భాష వైవిధ్యానికి, సాహిత్య వైభవానికి ముఖ్యమైన చిరునామా. కేంపుచెరువు(మూసిప్రాజెక్టు). దీని కేంద్రంగా శీలం భద్రయ్య రాసిన “లొట్టపీసుపూలు” కథాసంపుటిలో కథలు అట్టి జీవద్భాషా వారసత్వంను, వైవిధ్యాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈ కథలద్వారా నల్గొండజిల్లా భాషానుడికారాన్ని, మూసి కథావైభవాన్ని తెలంగాణ పాఠకలోకానికి కానుకగా ఇచ్చాడు. ఈ కథలలో సాధారణ పాఠకునికి ఆసక్తికరమైన కథనం ఉంటుంది. విమర్శకునికి విస్తృత చర్చకు అవకాశం ఉంటుంది. కథలు పాత కాలానివి. కథనం కొత్తది. వాడిన భాష మధురమైనది. సహజమైనది. ప్రతికథలో నాటికాలానికి చెందిన పాత్రల బానిసత్వపు సంకెల్లున్నాయి. అవి తెంచుకోడానికెత్తిన పురుటినొప్పుల పిడికిళ్ళున్నాయి. పాత్రల గొప్పతనాన్ని అల్లడంలో రచయిత లోకజ్ఞానాన్ని వినియోగించి కథలను అందించాడు. కథలు ఎలారాయాలనే సందేహానికి సమాధానంగా “అందొచ్చిన చేయికి పొందిక కుదిరినట్టు” ఈతరం కథకులుగా శీలం భద్రయ్య నిలబడతాడు." - వేముల ఎల్లయ్య, ప్రముఖ నవలా రచయిత, తెలంగాణ భాషా నిఘంటువు, విమర్శకులు
- "శీలం భద్రయ్య వృత్తిరిత్యా ఉపాధ్యాయులు. ఉద్యమకుటుంబంనుండి వచ్చినవాడు. పల్లెల్లో పుట్టిపెరిగి పల్లెవాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. పల్లె జనం జీవితాలతో మమేకం అయినవాడు కనుకనే పూర్తి గ్రామీణ వాతావరణాన్ని కండ్లకు కట్టినట్టు మనముందు ఉంచగలిగాడు. దాదాపు డెబ్బై అయిదు సంవత్సరాల కిందటి నిజాం పాలనలో జనం బతుకు చిత్రాలు శీలం భద్రయ్య “లొట్టపీసు కథలు”. ఈ కథలలో శీలం భద్రయ్య పరకాయప్రవేశం చేసి కథలను పండించాడు. ముఖ్యంగా నిజాం నిరంకుశపాలన, దొరలు, జాగీర్దాల దౌర్జన్యాలు, రజాకార్ల ఆగడాలు, ఆకృత్యాలు, కమ్యునిస్టు పోరాటాలు, నిజాం వ్యతిరేకపోరాటాలు వంటివి తన కథలలో ప్రతిబింబించాడు. ఈ కథలు మనలను తెలంగాణ సాయుధపోరాట కాలానికి తీసుకెళ్తాయి. నాటి మట్టి మనుషుల పోరాటాలు ఈ కథలలో చూస్తాము." - మేరెడ్డి యాదగిరిరెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, కథా రచయిత
- "తెలంగాణతనం కలిగిన సహజమైన తెలంగాణ భాష శీలం భద్రయ్య సొంతం. ఆయన కథల్లో ఫోటోగ్రఫిక్ శిల్పం కనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఉంటుంది. కథకుడు పక్కన కూర్చొని చెప్పినట్లుగా కథ ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల కమర్షియల్ కథకుడిగా కనిపిస్తాడు." - డా. వి. జయప్రకాశ్, కవి, రచయిత, విమర్శకులు
ముందుమాట
మార్చుకథా సూచిక
మార్చు- ముందుమాటలు
- డా.వెల్దండి శ్రీధర్ వ్యాసం
- వేముల ఎల్లయ్య వ్యాసం
- మేరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాసం
- డా.వి.జయప్రకాశ్ వ్యాసం
కథలు
మార్చు- ఇసపురుగు
- కేంపు చెర్వు
- బంచెర్రాయి Archived 2021-11-03 at the Wayback Machine[1]
- కర్తవ్యం
- లొట్టపీసు పూలు[2]
- టముకు
- వెలుగు చుక్క
- తోడు
- కోదండం
- కొత్తదొర
- లత్త Archived 2021-11-06 at the Wayback Machine[3]
- మాయబారి
- అగ్గువబతుకులు Archived 2021-11-05 at the Wayback Machine
- ఖూని
- శుర్పణఖ
మూలాలు
మార్చు- ↑ [1] Archived 2021-11-03 at the Wayback Machine బంచెర్రాయి కథ ఫిబ్రవరి 2021 వ సంవత్సరంలో "తెలుగు వెలుగు" పత్రికలో అచ్చయింది. ఈ కథను చదవాలంటే పక్కనే ఉన్న 1 పక్కన పైకి చూపుతున్న బాణం గుర్తు నొక్కండి.
- ↑ శీలం భద్రయ్య (జూలై 2021). లొట్టపీసు పూలు. హైదరాబాదు: శీలం పబ్లికేషన్స్. p. 128. ISBN 978-93-5426-350-7.
- ↑ "లత్త… కథ…శీలం భద్రయ్య – Cineevaali". cineevaali.com. Archived from the original on 2021-11-06. Retrieved 2021-11-04.
బయటి లింకులు
మార్చు- https://drive.google.com/file/d/13p80sLo8YJ6vk74QuuxO9nQcNiXn8LHU/view?usp=sharing
- https://www.andhrajyothy.com/telugunews/lottapisu-pulu-stories-19210816033287
- లొట్టపీసు పూలు కథపై విశ్లేషణ[1]
- https://drive.google.com/file/d/1dFYpFExvL8avUEV3zB5tCSYDz7V0wMOD/view?usp=sharing
- https://drive.google.com/file/d/1J3rVxElHdRuzvnwwQp33BfEREI5H7RAt/view?usp=sharing
- https://drive.google.com/file/d/1ftUsDbL1HOMEb4BV_At0XsqkzSKcFNbD/view?usp=sharing
- https://drive.google.com/file/d/19QdfRlyaf4WbLVYfgUxGnzXURM4FISGG/view?usp=sharing
- https://drive.google.com/file/d/164tY4TBQScig9FNeih_rzWK12lFj984X/view?usp=sharing