ప్రధాన మెనూను తెరువు
తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

తెలుగు కథ లేదా కత (Telugu Story) తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను మరియు ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తాయి. ఇతర సాహిత్య ప్రక్రియలన్నింటికన్నా కథకి ఆదరణ ఎక్కువ.

వ్యుత్పత్తిసవరించు

"కథ్" అనే ధాతువునుండి "కథ" అనే పదం పుట్టింది. దీనికి సంభాషించుట, చెప్పుట అనే అర్ధాలున్నాయి. అగ్ని పురాణంలో కథానిక ప్రస్తావన ఉందనీ, సంస్కృతంలో ఇతివృత్త భేదాన్ని బట్టి "కథా, ఆఖ్యాయికా, ఖండకథా, పరికథా" అనే భేదాలున్నాయని చెబుతారు. ఈనాడు తెలుగులో "కథ", "కథానిక" అనే పదాలు సమానార్ధకంగా వాడబడుతున్నాయి. ఇవి ఆంగ్లంలో "Short Story" అనే ప్రక్రియకు పర్యాయాలుగా వాడబడుతున్నాయి.[1]

కథ పర్యాయపదాలు చరిత్ర, గాథ, వృత్తాంతం. కథ ప్రకృతి అయితే కత వికృతి. కథలు చెప్పేవాడిని 'కథకుడు' అంటారు. కథలో ప్రధాన పురుషుడు 'కథానాయకుడు' మరియు ప్రధాన స్త్రీ 'కథానాయకురాలు'. కీర్తిశేషుడైన లేదా మరణించిన పురుషుడు 'కథాశేషుడు' మరియు మరణించిన స్త్రీ 'కథాశేషురాలు'.

బ్రౌన్ నిఘంటువు ప్రకారం కథ అనగా ఇంచుక సత్యమైన కల్పిత ప్రబంధము.[2] కథ చెప్పువాడిని "కథకుడు" అని కథ చెప్పే విధానాన్ని "కథనము" అని చెప్పే విషయాన్ని "కథితము" అని అంటారు.

అగ్నిపురాణంలోని ఒక శ్లోకంలో "దీర్ఘంగా కాక పొందికగా ఉండడం, ఉదాత్తత కలిగి ఉండడం, సంభ్రమాశ్చర్యాలు కలిగించి కరుణ అద్భుత రసాలను పోషించడం, ఆనందాన్ని కలిగించడం కథానిక లక్షణాలు" - అని చెప్పబడింది.

తెలుగు కథ - లక్షణాలుసవరించు

తెలుగు కథ లక్షణాలు తెలుపడానికి తెలుగు రచయితలు మరియు విమర్శకులు ఇచ్చిన నిర్వచనాలు క్రింద ఇవ్వబడినాయి[1].

 • బొడ్డపాటి కుటుంబరాయశర్మ - సాధారణముగా నాతి విస్ృత క్షేత్రము కలిగి, ఒకానొక సంవేదనముతో కూడి, స్వయం సంపూర్ణమై, దానిలోని విభిన్న తత్వములను ఏకోన్ముఖముగ చూపు ఇతివృత్తాత్మక గద్య కవితా శిల్పఖండమును కథానిక అనవచ్చును.
 • జె. నాగయ్య - ఒకానొక ఎత్తుగడ, నడక తీరు, ముగింపు, పరిమిత పాత్రలు, ఆపాత్రలకు తగు పోషణ, వస్తువిన్యాస వైశిష్ట్యము, ఒక జీవిత సత్యమును ప్రతిపాదించుట, అన్నింటిని మించి వస్త్వైక్యమునుండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ కథానిక.
 • పోరంకి దక్షిణామూర్తి (కథానికా వాఙ్మయం) - కథానిక ముఖ్య లక్షణాలు : సంక్షిప్తత, ఒకే అంశం లక్ష్యంగా ఉండడం, మనసు లగ్నమయ్యే లక్షణం (ఏకాగ్రత, నిర్భరత), స్వయంసమగ్రత, సంవాద చాతుర్యం, అసలు విషయాన్ని లక్ష్యంనుండి తప్పకుండా ఉంచడం (ప్రతిపాద్య ప్రవణత), పాఠకునిపై చూపే ప్రభావం గురించిన ఎఱుక (ప్రభావాన్విత)

"మంచి కథ" గురించి చెప్పిన అభిప్రాయాలు

 • పోరంకి దక్షిణామూర్తి - జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్పనైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి, హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి, పదే పదే చదవాలనిపింపజేసేది గొప్ప కథ.
 • వాకాటి పాండురంగారావు - ఒక కథను చదివిన తరువాత మనసు చలించాలి. మళ్ళీ చదివింపజేయాలి. ఈ కథ బాఘుంది అని పదిమందికీ చెప్పించ గలగాలి. మళ్ళీ పదేళ్ళో, ఇరవై యేళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి, స్పందన కలగాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది.

కథలలో రకాలుసవరించు

తెలుగు కథలలో ప్రస్తావించే రకాలు:[1]

 • (సైజును) పరిమాణాన్ని బట్టి : పెద్ద కథ (నవలిక), కథానిక, మినీకథ, గల్పిక, స్కెచ్, పేజీకథ, కాలం కథ, కార్డు కథ,
 • రంగాన్ని బట్టి - సినిమా కథ, రేడియో కథ, పత్రిక కథ
 • ఇతివృత్తాన్ని బట్టి - శృంగార కథ, ప్రేమకథ, హాస్య కథ, క్రైం కథ, రాజకీయ కథ, అభ్యుదయ కథ, విప్లవ కథ, స్త్రీవాద కథ, దళితవాద కథ.
 • ప్రాచుర్యాన్ని బట్టి - పేదరాశి పెద్దమ్మ కథ, తెనాలిరామకృష్ణ కథ, చందమామ కథ, కాశీమజిలీ కథ, బేతాళ కథ, తాతమ్మ కథ, ఉబుసుపోక కథ, పిట్ట కథ

చెప్పే విధానాన్ని బట్టి హరికథ, బుర్రకథ, యక్షగాన కథ, భాగవత కథ వంటి ప్రస్తావనలు కూడా ఉంటాయి గాని వాటిని కథా సాహిత్యంలో అంతగా పరిగణించడం లేదు.

చరిత్రసవరించు

మౌఖికంగా "కథ" అనే విషయం తెలుగునాట అనాదిగా ఉంటూవచ్చింది. కాని ఒక సాహితీ ప్రక్రియగా తెలుగు కథ రూపు దిద్దుకోవడానికి కొంత సమయం పట్టింది. "తెలుగు నవల పంథొమ్మిదో శతాబ్దంలోనే రూపు దిద్దుకొన్నా తెలుగు కథానిక ఇరవయ్యవ శతాబ్ది దాకా వేచి ఉండవలసి వచ్చింది. నవల, నాటకం, కావ్యం, పురాణ గాధ వంటి రూపాలలో కథ తెలుగు భాషకు సుపరిచితమే. బృహత్కథ తెలుగు నేల మీదనే ప్రభవించింది. కాని కథానిక, చిన్న కథ, కథ అనే ఆధునిక రూపాలలో అది కేఞలం ఇరవయ్యవ శతాబ్దిలోనే రూపు దిద్దుకొన్న ప్రక్రియ. దీనికి కారణాలు ఏమిటనేది ఆసక్తికరమైన ప్రశ్న"[3]

కథ అత్యంత ప్రాచీనమైన ప్రక్రియ. కథ అనే పదానికి"కత"అనేదివికృతి. ఎవరైన లేనివి కల్పించి మట్లాడితే“కతలు చెప్పకు”అని అంటుంటాం.అంటేకల్పిత వృత్తాంతం కలిగినది కథ అని అర్థం. విజ్ఞానాత్మకమైన పంచతంత్ర కథలుమొదలు సాహస ఔదార్యాది గుణ వర్ణనాత్మకమైన విక్రమార్కకథలు, అద్భుతమైన భేతాళకథలు, వినోదాత్మకమైనపేదరాశిపెద్దమ్మకథలు, హాస్యభరితమైనతెనాలిరామలింగనికథలు పిల్లలను అలరిస్తూవినోదాన్ని విజ్ఞానాన్ని అందించి వారుఉత్తమగుణ సంపన్నులుగా ఎదగడానికిదోహదంచేస్తున్నాయి. కథలుపద్యరూపంలో రచింపబడితే వాటిని కథాకావ్యాలు అంటారు.

తెలుగు సాహిత్యంలో మహభారత రచనతో కవిత్రయంవారు కథలను ప్రారంభించారు. అలాగే భాగవతంలోకూడ అనేక కథలు ఉన్నాయి. కాని వాటిని కథాకావ్యాలని చెప్పలేము. ఎందుకంటే అవి ఇతిహాస పురాణాలకు సంబంధించినవి. చిత్రవిచిత్రాలైన మహిమలతో, మలుపులతో, వినోదభరితంగా నీతులతో కూడుకొన్నకథలు గలవాటిని కథాకావ్యాలుగా విమర్శకులు పేర్కొన్నారు.క థలకే ఎక్కువప్రాధాన్యం గలవి కథాకావ్యాలు. కథాకావ్యాల్లో కథాకథన శిల్పానికి ప్రాముఖ్యంఉంటుంది. ఆనాటి సాంఘిక పరిస్థితులను అవి ప్రతిబింబిస్తాయి.సాధారణంగాచెప్పాలంటే చందమామ కథలు, కాశీమజిలీకథల వంటి పద్ధతి ఈ కథా కావ్యాల్లోకనిపిస్తుందనవచ్చు. తెలుగులో కథాకావ్యాలు12వ శతాబ్దం నుండి17వ శతాబ్దంవరకు వెలువడ్డాయి.మొదటి కథాకావ్యం దశకుమార చరిత్ర. దీనిని తిక్కన శిష్యుడు కేతన 13వ శతాబ్దంలో రచించి తిక్కనకే అంకితంఇచ్చాడు. కేతన కథాకావ్యరచనకు మార్గదర్శకుడు కాగా ప్రస్తుతం వచన రూపంలో వెలువడే కథలన్నిటికి కథాకావ్యాలేమార్గం వేసినట్లు చెప్పవచ్చు. లోకరీతిని, లోకనీతిని వివరించే ఈ కథాకావ్యాలు సమకాలీన సాంఘికచరిత్రకు ఆధారభూతమై తెలుగుసాహిత్యచరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్నిఆక్రమించాయి.

కథ అనే ప్రక్రియ తెలుగులో తొలిసారిగా గురజాడ అప్పారావు రచించిన 'దిద్దుబాటు' కథను పేర్కొంటారు. బండారు అచ్చమాంబ, ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ వంటి వారు గురజాడకు ముందే తెలుగు కథకు శ్రీకారం చుట్టారు. అయినా కూడా అన్ని మంచి లక్షణాలు గల మొదటి కథగా "దిద్దుబాటు"ను గౌరవిస్తున్నారు. తొలి తెలుగు కథ మేరంగి సంస్థానానికి చెందిన ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ (1864-1933) రాసిన "లలిత" (1903) అని ఒక అభిప్రాయం ఉంది. డా. భార్గవీరావు సంకలనం చేసిన "నూరేళ్ళ పంట"లో భండారు అచ్చమాంబ (1874-1904) రాసిన "స్త్రీవిద్య" మొదటి కథగా ముందుకు వచ్చింది. అలాగే మాడపాటి హనుమంతరావు (1885-1970) కథలు "మల్లికా గుచ్ఛము" పేరిట 1915లో ప్రచురితమయ్యాయి. కాని తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు (1862-1915). గురజాడ వ్రాసినవి ఐదు కథలు, ఒక నవలకి స్కెచ్. శిల్పరీత్యా సన్నివేశ ప్రధానంగా "దిద్దుబాటు" అనే కథ, మౌఖిక సంప్రదాయ కథన రీతిలో "మీ పేరేమిటి" అనే కథ ఉన్నాయి. ఇవి రెండూ ఒకే సంవత్సరంలో ప్రచురణకు వచ్చినందున ఈ రెంటినీ మొదటి కథలుగా గుర్తించవచ్చును.[3]

ఈ శతాబ్దపు కథా చరిత్రను మూడు దశలుగా విభజించవచ్చును.

1880-1930 మధ్యకాలంసవరించు

ఈ ప్రారంభదశలో కథకులు ప్రధానంగా సంస్కరణవాదులు. మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల చిత్రణ మొదలైన విషయాల దృష్టి సారించింది. కథలోని వాతావరణం మధ్యతరగతి సంస్కృతి, సంప్రదాయాలతో నిండివుంటుంది. ఈ దశలో వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చింతా దీక్షితులు, చలం, మునిమాణిక్యం, మొక్కపాటి నరసింహశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, భమిడిపాటి కామేశ్వరరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి రచయితలు ప్రముఖులు. వాడుక భాష కథల భాష అయింది.

1930-1970 మధ్యకాలంసవరించు

ఈ దశ తెలుగు కథకు మహర్దశ అని చెప్పవచ్చును. ఈ రెండవదశలో అభ్యుదయవాదులు, తాత్వికులు, కళాప్రియులు కథకులుగా కనిపిస్తారు. అక్రమాలతో రాజీపడలేని అభ్యుదయ దృక్పథంగల యువకులు కథారచయితలుగా ప్రజాజీవితానికి సన్నిహితులయ్యారు. వాస్తవికతకు భంగం కలగకుండా జీవితసత్యాన్ని నిరూపిస్తూ కథాశిల్పాన్ని పోషించడం వీరి లక్ష్యం. పండితులు, పరిశోధకులు, కళాకారులవంటివారు కథారంగం నుంచి నిష్క్రమించారు. పూర్తిగా మాండలిక శైలిలో కథలు రాయడం ఈ దశలో మొదలైంది. కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు, బలివాడ కాంతారావు, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం, కొమ్మూరి వేణుగోపాలరావు, శీలా వీర్రాజు, మంజుశ్రీ, హితశ్రీ, వాకాటి పాండురంగారావు, ముళ్ళపూడి వెంకటరమణ మొదలైనవారు కథాక్షేత్రంలో బంగారు పంటలు పండించారు. ఉత్తరాంధ్ర కథకత్రయం చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు ఈ దశలో కథారచనకు ఈ దశలో దిక్సూచులుగా నిలబడ్డారు.

ఈ దశ చివరభాగంలో మహిళా రచయితలు తెలుగు కథకు ప్రతిష్ఠతెచ్చారు. వీరిలో రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, లత, యద్దనపూడి సులోచనారాణి, రామలక్ష్మి, భానుమతి, మాలతీ చందూర్ వంటి వారెందరో మంచి కథలు రాశారు.

1970 తర్వాతకాలంసవరించు

మూడవదశలో విప్లవవాదం తత్సంబంధ అంశాలు ప్రధాన లక్షణాలు. విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావం దీనికి దోహదం చేసింది. కొండగాలి, ఇప్పుడు వీస్తున్న గాలి, కొలిమంటుకొంది వంటి కథా సంపుటాలు ఈ భావజాలాన్ని వ్యాప్తిచేశాయి. శ్రీకాకుళ పోరాటంతో రాజుకున్న ఈ నిప్పు తెలంగాణాకు వ్యాపించి అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య వంటి కథకులెందరో ఈ దిశలో రచనలు చేశారు. రాయలసీమ కథ ముందంజవేసింది. దళితవాదులు, స్త్రీవాదులు, మైనారిటీవాదులూ తమ కలంపోరుకు కథను ఆయుధంగా ఎంచుకున్నారు.

మహిళా రచయితలలో ముదిగంటి సుజాతారెడ్డి, ఓల్గా, కుప్పిలి పద్మ వంటి వారు పోరాటపటిమ కలిగిన రచనలు చేస్తున్నారు. చాగంటి తులసి వంటివారు హిందీ, ఒరియా భాషల నుండి అనువాదాలు చేస్తున్నారు.

కథలలో రకాలుసవరించు

కొన్ని ప్రసిద్ధ కథలు, కథకులుసవరించు

కథా నిలయంసవరించు

కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి వచ్చిన పురస్కారం అంతటినీ వెచ్చించి శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగులో రాయబడ్డ ప్రతి కథనీ ఈ గ్రంథాలయంలో భద్రపరచాలని స్థాపకుల ఆకాంక్ష.

తెలుగు సాహిత్యంలో ప్రచురించబడిన కథలను భావి తరాలవారికి పొందుపరచాలన్న బృహత్తర ఆశయంతో కాళీపట్నం రామారావు కథానిలయాన్ని స్థాపించాడు. తెలుగు కథకు అత్యుత్తమమైన ఇటువంటి రిఫరెన్సు గ్రంథాలయం ఏర్పరచే కృషి ఇంతకుముందు జరుగలేదని ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి అన్నాడు.

1997లో ఆరంభమైన ఈ "కథా నిలయం"లో (2000 నాటికి) 4,000 పైగా వారపత్రికలు, మాస పత్రికలు, విశేష పత్రికలు ఉన్నాయి. యువ, జ్యోతి, జాగృతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక, భారతి, జయంతి, సంవేదన, అభ్యుదయ వంటి అనేక పత్రికల అమూల్యమైన సేకరణ ఇది. 1944 నుండి భారతి పత్రిక ప్రతులు ఇక్కడ సేకరించారు. అంతకు పూర్వపు ప్రతులను కూడా సేకరించే ప్రయత్నం జరుగుతున్నది.

విమర్శలుసవరించు

 • తెలుగు కథలో సహజత్వం కొరవడిందని, పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఉంటున్నాయని, శిల్పప్రాధాన్యం తగ్గిందని, సొంత ఆలోచనలతో కథలు రాసేవాళ్లు తెలుగులో తక్కువని కొందరు ప్రముఖ విమర్శకులు చెబుతుంటారు.[4]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
 2. బ్రౌన్ నిఘంటువులో కథ పదానికి సంబంధించిన విశేషాలు.
 3. 3.0 3.1 వందేళ్ళ తెలుగు కథ - 20వ శతాబ్ది ప్రతినిధి కథల సంకలనం - సంకలనకర్త : చినవీర భద్రుడు - ప్రచురణ : ఎమెస్కో బుక్స్, విజయవాడ (2001)
 4. రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యాసం

వనరులుసవరించు

 • తెలుగు కథాసుధ, డాక్టర్ యు.ఎ.నరసింహమూర్తి, ఈనాడు 2009 ఫిబ్రవరి 7 న ప్రచురించిన వ్యాసం.
"https://te.wikipedia.org/w/index.php?title=తెలుగు_కథ&oldid=2327090" నుండి వెలికితీశారు