అంకుర్ (సినిమా)
అంకుర్ (హిందీ: अंकुर, ఉర్దూ: اَنکُر, అనువాదం: అంకురం) 1974 నాటి హిందీ చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగళ్ తీసిన మొదటి చలనచిత్రం, అలానే అనంత్ నాగ్, షబానా ఆజ్మీ వంటి నటీనటుల తొలి చిత్రం.
అంకుర్ Ankur | |
---|---|
దర్శకత్వం | శ్యాం బెనగల్ |
రచన | శ్యాం బెనగల్ (స్క్రీన్ ప్లే) సత్యదేవ్ దూబే (సంభాషణలు) |
నిర్మాత | లలిత్ ఎం.బిజ్లానీ, ఫ్రెనీ వరైవా; బ్లేజ్ ఫిల్మ్ ఎంటర్ ప్రైజెస్ |
తారాగణం | షబానా అజ్మీ అనంత్ నాగ్ సాధూ మెహర్ ప్రియా తెండూల్కర్ ఖాదర్ అలీ దలీప్ తహిల్ |
ఛాయాగ్రహణం | గోవింద నిహ్లానీ కామత్ ఘనేకర్[1] |
సంగీతం | వన్ రాజ్ భాటియా |
విడుదల తేదీ | 1974 |
సినిమా నిడివి | 125 నిమిషాలు |
దేశం | భారత దేశం |
భాష | దక్కనీ |
ఇతివృత్తం
మార్చుపుట్టుకతో మాటలు రాని, వినిపించని కిష్టయ్య (సాధూ మెహర్) కుమ్మరి. అతని భార్య లక్ష్మి (షబానా అజ్మీ) ఊరి కామందు సూర్య (అనంత్ నాగ్) దగ్గర పనిచేస్తూంటుంది. కుండలు, ఇతర వస్తువులు మట్టితో తయారుచేసి అమ్ముకునే అతనికి అల్యూమినియం పాత్రలు మార్కెట్లోకి రావడంతో పని పోయింది. చేసే వృత్తి పాడైపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయిన భర్తను సరిజేసుకునేందుకు తన యజమానికి చెప్పి అతని వద్ద బండితోలే పనిలో పెడుతుంది లక్ష్మి. అప్పటికే తాగుబోతుగా తయారు కావడంతో రాబడికి మించి తాగుతూ, చివరకి కల్లు దొంగతనం చేస్తూ దొరికిపోతాడు కిష్టయ్య. దొంగతనం చేసినందుకు తల గొరిగి వదిలిపెట్టడంతో, ఆ అవమానంతో ఊళ్ళో తిరగలేక కిష్టయ్య ఊరొదిలి పారిపోతాడు.
భర్త వదిలిపెట్టిన స్త్రీ కావడం, అమాయకురాలు కావడం, వెనుకబడ్డ వర్గానికి చెందివుండడం వంటి కారణాలతో నిస్సహాయురాలైన లక్ష్మిని
సూర్య లొంగదీసుకుంటాడు. అతని వల్ల గర్భం రావడంతో తన మర్యాదకు భంగమౌతుందని భయపడి తీయించుకోమని బెదిరిస్తాడు. ఐతే ఆమె కడుపుతీపితో ఆ పనిచేయడానికి వ్యతిరేకించడంతో కోపగించుకుంటాడు. యజమాని భార్య కాపురానికి రావడంతో లక్ష్మిపై దొంగతనం నేరం మోపి పనిలోంచి తీసేస్తాడు. నిండు గర్భంతో ఉన్న లక్ష్మి తిండి, ఆలనా పాలనా చూసుకునే తోడు లేక ఒంటరిగా మిగిలిపోతుంది.
ఇంతలో హఠాత్తుగా కిష్టయ్య తిరిగి వస్తాడు. లక్ష్మి గర్భవతి కావడాన్ని చూసి చాలా సంతోషపడతాడు. భార్యని, పుట్టబోయే బిడ్డనీ చూసుకునేందుకు యజమానిని వేడుకుని బండి తోలే పని అడిగేందుకు బయలుదేరుతాడు. ఐతే వస్తున్న కిష్టయ్య చేతిలోని కర్ర, బిగించి కట్టిన తలపాగా, వచ్చే వేగం చూసి తాను అతనికి చేసిన ద్రోహానికి కొడదామనే వస్తున్నాడని యజమాని సూర్య అనుమానిస్తాడు. భయపడి అతని కన్నా ముందుగానే కొరడా తీసుకుని అతన్ని చావబాదుతాడు. ఇది లక్ష్మి, పాలేర్లు, ఆడుకుంటున్న పిల్లలు చూస్తున్నా వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ ఊరుకుంటారు. ఆఖరికి ఓ చిన్న పిల్లాడు చాటుగా రాయి తీసుకుని, యజమాని ఇంటిమీదికి విసురుతాడు. ఆ ఇంటి కిటికీ అద్దం భళ్ళున బద్దలవడంతో సినిమా ముగుస్తుంది.[2]
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుబెనగళ్ళ శ్యామసుందరరావు అసలు పేరు శ్యాం బెనగళ్, తెలంగాణాకు చెందిన తెలుగువాడు. ఆయన 1950ల్లో తెలంగాణా ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకున్న కథను ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు బెనగళ్. సినిమాకు తెలంగాణా ప్రాంతం నేపథ్యం కావడంతో సినిమా స్క్రిప్ట్ లో సంభాషణలు దక్కనీ భాషలో రాసుకున్నారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ సినిమాగా తీయడానికి అవకాశాల దొరకకపోవడంతో, యాడ్ ఫిల్మ్స్ తీసే కంపెనీలో చేరి పనిచేశారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు. కొన్నాళ్ళకు కంపెనీ లాభాల్లోకి వచ్చాకా, పై అధికారులను ఒప్పించి ఐదు లక్షల బడ్జెట్ మంజూరుచేయగా సినిమా తీశాడు.[2]
నటీనటుల ఎంపిక
మార్చుబెనగళ్ మొదట లక్ష్మి పాత్రకు సుచిత్రా సేన్‌ను తీసుకుందామని భావించారు. ఆమెకు పాత్ర నచ్చినా, సినిమా అంతా దక్కనీ భాషలో ఉండడంతో తాను సౌకర్యంగా నటించలేనంటూ సినిమా అంగీకరించలేదు. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుని, యాడ్ లలో పనిచేస్తున్న షబానా అజ్మీని కథానాయకగా తీసుకున్నారు. మరో ప్రధాన పాత్రకు అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు అనంత్ నాగ్‌ను తీసుకున్నారు. తర్వాతి కాలంలో ప్రసిద్ధ నటులైన వీరిరువురికీ ఇదే తొలి చిత్రం.[2]
చిత్రీకరణ
మార్చుసినిమాలో ఏ కొద్ది భాగాన్ని కూడా స్టూడియోల్లో తీయకుండా, అంతా తెలంగాణా జిల్లాల్లోని ఔట్ డోర్ లోనే చిత్రీకరించారు. సినిమాకు ఛాయాగ్రాహకునిగా గోవింద్ నిహలానీ పనిచేశారు.[2]
ప్రాచుర్యం
మార్చు1973లో అంకుర్, గరంహవా సినిమాలు విడుదల కావడంతో భారతీయ పారలల్ సినిమాల చరిత్రలో మైలురాయిగా నిలిచింది. భారతీయ పార్లల్ సినిమాలను గొప్ప స్థానానికి తీసుకువెళ్ళిన సినిమాగా ప్రఖ్యాతి చెందింది.
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Ankur (1974) - Cast and Credits New York Times.
- ↑ 2.0 2.1 2.2 2.3 మహమ్మద్, ఖదీర్ బాబు (2010). "వ్యవస్థ గర్భంలో చైతన్యబీజం అంకుర్". బాలీవుడ్ క్లాసిక్స్ (1 ed.). హైదరాబాద్: కావలి ప్రచురణలు. pp. 56–58.
- ↑ అంకుర్ - పురస్కారాలు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్.