అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి

అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి (జ: 1883 - మ: 1935) ప్రఖ్యాత ఆశుకవి, శతావధాని.

జీవితవిశేషాలు

మార్చు

బాల్యము, విద్యాభ్యాసము

మార్చు

ఇతడు గుంటూరు జిల్లా, కాకుమాను మండలం, గార్లపాడు గ్రామంలో అవ్వారి వంశములో మహాలక్ష్మమ్మ, రామయ్య దంపతులకు 1883 సంవత్సరానికి సరియైన స్వభాను నామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జన్మించాడు.[1] ఇతడు కొమ్మూరులో నివసించే లక్ష్మీదేవమ్మ, వెంకటప్పయ్య దంపతులకు దత్తపుత్రుడిగా వెళ్లాడు. ఇతడు వెదుళ్ళపల్లిలో బొడ్డుపల్లి సుబ్బరాయశాస్త్రి వద్ద, తెనాలిలో ముదిగొండ చంద్రమౌళీశ్వరశాస్త్రి వద్ద, కోడితాడిపర్రులో జమ్ములమడక సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద, జంపనిలో కొలచలమ నృసింహశాస్త్రివద్ద విద్యాభ్యాసము చేశాడు. 1909లో అనగా సుమారు పాతికేళ్ల వయసులో కోనసీమలోను, కృష్ణా జిల్లా, చల్లపల్లిలో అద్దేపల్లి సోమనాథశాస్త్రి వద్ద, బందరులో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద శాస్త్రధ్యయనము చేశాడు. రాయప్రోలు సుబ్బారావు ఇతనికి బంధువు, బాల్యమిత్రుడు. ఇతడు గురుముఖముగా అభ్యసించిన దానికంటే స్వయంగా చదివి సాధించిన శాస్త్రపాండిత్యమే అధికము. తెనాలిలో పనిచేసే సమయంలో బ్రహ్మానందతీర్థస్వామి శిష్యుడిగా మారి బాపట్లలో అతని దగ్గర ప్రస్థాన త్రయమును చదువుకున్నాడు. ఆ సమయములో మల్లాది హనుమచ్ఛాస్త్రి ఇతని సహాధ్యాయిగా వుండేవాడు. ఇతడు బండ్లమూడి గురునాథశాస్త్రి వద్ద కూడా వేదాంత శాస్త్ర అధ్యయనము చేశాడు.

ఉద్యోగము

మార్చు

ఇతడు తన ముప్పది యేళ్ల వయసులో తెనాలి అద్వైత వేదాంత శిరోమణి కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరాడు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. ఈ సమయంలో ఇతడు నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి, విస్సా అప్పారావు, చెన్నాప్రగడ భానుమూర్తి మొదలైన పండితుల మన్ననలను సంపాదించాడు. తరువాత బ్రహ్మానందతీర్థ యతీంద్రుల బోధనలు విని ఆకర్షితుడై, అతనికి శిష్యుడిగా మారి అతని వద్ద బాపట్లలో శ్రీ శంకర విద్యాలయంలో నిరపేక్షముగా జీతము లేకుండా ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత బందరు హైస్కూలులో గురువు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి స్థానంలో రెండు సంవత్సరాలకు పైగా పనిచేశాడు. తర్వాత గాంధీజీ ప్రారంభించిన సహాయనిరాకరణోద్యమం పట్ల ఆకర్షితుడై ఖద్దరు స్వీకరించి, హైస్కూలు ఉపాధ్యాయ పదవికి రాజీనామా ఇచ్చి బాపట్లకు వెళ్లిపోయాడు. బాపట్లలో ఒక పర్ణశాలను నిర్మించుకుని, నిరాడంబరంగా జీవిస్తూ కొంత మంది శిష్యులకు పాఠాలు చెప్తూ, నాలుగు సంవత్సరాలు గడిపాడు. 1927లో తల్లాప్రగడ సూర్యనారాయణరావు ఆహ్వనం మేరకు కొవ్వూరులోని ఆంధ్రగీర్వాణ విద్యాపీఠంలో ఉపాధ్యాయుడిగా చేరి మరణించేవరకు అక్కడనే పనిచేశాడు.

కుటుంబము

మార్చు

ఇతని మొదటి భార్యకు ఇరువురు కుమార్తెలు జన్మించారు. ఆమె మరణానంతరము పది సంవత్సరాల తర్వాత ఇతడు తన పెంపుడు తల్లి, సోదరుల ప్రోద్భలముతో 1925 ప్రాంతాలలో లక్ష్మీనరసమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈమె వలన ఇతనికి సంతానం కలుగలేదు. మొదటి కుమార్తె పిన్నవయసులోనే మరణించగా రెండవ కుమార్తె కొలచలమ సుబ్బావధానికి వివాహం చేసుకుని పుత్ర పుత్రికా సంతానాన్ని పొందింది.

ఆశుకవిత్వము, అవధానము

మార్చు

ఇతడు తిరుపతి వెంకటకవుల ప్రోత్సాహముతో ఎంతో కృషిచేసి ఆశుకవిత్వంలో గంటకు వందకు పైగా నిర్దుష్టమైన, రసవంతమైన పద్యాలను చెప్పగలిగే శక్తిని సంపాదించాడు. కొప్పరపు కవులకు ఇతని గురువులైన తిరుపతి వేంకటకవులకు జరిగిన వివాదములో ఇతడు అనేక చోట్ల ఆశుకవితా ప్రదర్శనాలలో పోటీకి నిలిచి విజయం సాధించాడు. ఇతడు అష్టవధానాలను, శతావధానాలను, ఆశుకవితా ప్రదర్శనలను గార్లపాడు, సికందరాబాదు, గద్వాల, ముక్త్యాల, పెద్దాపురం, కందుకూరు, కావలి, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, కనిగిరి, వేమవరం, నాగులవరం, నందివెలుగు మొదలైన అనేక చోట్ల ప్రదర్శించాడు. ఇతడు రాయప్రోలు సుబ్బారావు, కాశీ కృష్ణాచార్యులు, పిశుపాటి చిదంబర శాస్త్రి లతో వివిధ సందర్భాలలో జంటగా ఆశుకవిత్వ ప్రదర్శనలు, అవధానాలు చేశాడు.

అవధానపద్యాలు

మార్చు

ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని:[2]

  • సమస్య: పద్మములు ముకుళించెను భానుజూచి

పూరణ:

చాలగ వియోగతా ప్రచారములకు
రాత్రివశలయి కృష్ణుని రమణులెల్ల
నమర నాతండు రామిచే నబలల ముఖ
పద్మములు ముకుళించెను భానుజూచి

  • సమస్య:మగువా తగునా మగవారలుండగా

పూరణ:

పగఁజూపి మాటలాడెదు!
మగలేవురు గల్గి కుల్కు మగువా తగునా!
మగవారలుండగా ని
ప్పగతులు నెదిరించి పలుకఁ బరిషత్సభలన్

రచనలు

మార్చు
  1. తెలుగు కావ్యాదర్శము[3]
  2. ఆంధ్రభాషావిలాపము
  3. శిథిలాంధ్ర వైభవము
  4. శివతత్వ సుధానిధి
  5. దైవబలము
  6. కావ్యనాటకాది పరిశీలనము[4]
  7. సీత
  8. మాఘపురాణము
  9. జీవన్ముక్తి - విదేహముక్తి
  10. సుగుణోపాసన - నిర్గుణోపాసన
  11. యజ్ఞోపవీత తత్త్వదర్శనము
  12. రుద్రాక్షాది మాలలు - ఫలములు[5]
  13. మేఘము
  14. ఆంధ్రధ్వని మొదలైనవి

బిరుదములు

మార్చు
  1. ఆశుకవితిలక
  2. విద్వదాశుకవి

మరణము

మార్చు

ఇతడు బాపట్లలో 1935, ఆగస్టు 15వ తేదీకి సరియైన యువ నామ సంవత్సర శ్రావణ బహుళ విదియ తిథినాడు రాత్రి 3 గంటలకు మరణించాడు.

మూలాలు

మార్చు
  1. తెలుగు కావ్యాదర్శము - గ్రంథకర్త జీవిత చరిత్రము - పుటలు i - xxxiii
  2. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 194–197.
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో తెలుగు కావ్యాదర్శము పుస్తకప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కావ్యనాటకాది పరిశీలనము పుస్తక ప్రతి
  5. ఆర్కీవులో రుద్రాక్షాది మాలలు-ఫలములు పుస్తక ప్రతి.

ఇవి కూడా చదవండి

మార్చు