అష్టా చమ్మా (సినిమా)

2008 సినిమా

అష్టా చమ్మా 2008లో విడుదలయిన హాస్యకథా చలనచిత్రం. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు రచయిత, దర్శకుడు. ఈ సినిమాలో స్వాతి, నాని, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య పాత్రలలో నటించగా తనికెళ్ళ భరణి సహాయక నటుడి పాత్రలో కనిపిస్తారు. అప్పటివరకూ సహాయదర్శకుడిగా పనిచేసిన నాని ఈ సినిమాతో కథానాయకునిగా పరిచయం అయ్యారు. అవసరాల శ్రీనివాస్ కు కూడా ఇది మొదటిచిత్రం.[1][2]

అష్టా చమ్మా
సినిమా పోస్టరు
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
రచనమోహన కృష్ణ ఇంద్రగంటి
నిర్మాతరామ్ మోహన్ పీ
తారాగణంస్వాతి
నాని
అవసరాల శ్రీనివాస్
భార్గవి
తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణంపీ.జీ. విందా
కూర్పుమార్తాండ్ కే వెంకటేష్
సంగీతంకల్యాణి మాలిక్
విడుదల తేదీ
సెప్టెంబర్ 5, 2008
దేశంభారత దేశము
భాషతెలుగు

కథ మార్చు

సినీనటుడు మహేష్ బాబు అభిమాని అయిన హైదరాబాద్ అమ్మాయి లావణ్య (కలర్స్ స్వాతి) అభిమానం హద్దుమీరి ఆయన్నే పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. హఠాత్తుగా మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ని పెళ్ళిచేసేసుకున్నాడని తెలిసి చాలా నిరుత్సాహపడిపోతుంది. అయితే సినీనటుడు మహేష్ ని పెళ్ళిచేసుకోలేకపోయినా కనీసం మహేష్ అన్న పేరున్న వ్యక్తినైనా పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రోజంతా మహేష్ బాబు సినిమా పాటలు పెట్టుకుని పిచ్చెక్కిస్తుండడంతో పక్కింటి కుర్రాడు ఆనంద్ (అవసరాల శ్రీనివాస్) ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. మహేష్ అనే పేరుండి, లావణ్యకు తగిన వరుడు కాగల వ్యక్తి కోసం తిరిగీ తిరిగీ చివరికి రియల్ ఎస్టేట్ బిజినెస్ తక్కువగానూ, జీవితన్నా ఎంజాయ్ చేయడం ఎక్కువగానూ చేసే మహేష్ (నాని)ని పట్టుకుంటాడు. మహేష్ ని లావణ్యకి పరిచయం చేసిన కొద్దిరోజులకే వారిద్దరూ ప్రేమించుకుంటారు.
లావణ్య మొదట తన పేరును చూసే ఇష్టపడిందన్న విషయం మహేష్ కి చెప్పేస్తుంది. మహేష్ వెంటనే ఆనంద్ ని కలిసి తన గతం చెప్తాడు. నిజానికి మహేష్ అసలు పేరు రాంబాబు. కోనసీమలోని లక్కవరం గ్రామంలో ఊరిపెద్ద కొడుకు. తల్లిదండ్రులు చనిపోయిన నాటి నుంచి చెల్లెలు వరలక్ష్మిని పాదాలు కందకుండా పెంచుతూంటాడు. ఊళ్ళోవాళ్ళకి ఏ తగవైనా పెద్దమనిషిగా రాంబాబే తీర్పుచెప్పాలి. ఇలా వయసుకు మించిన బరువుబాధ్యతలు, మంచితనం భరిస్తూన్న రాంబాబుకు వీటి నుంచి విముక్తి కోసం మైకేల్ జాక్సన్ పాటల క్యాసెట్ పెట్టుకుని వింటూంటాడు. ఆ క్యాసెట్ చిక్కుకుపోయి పాడైపోవడంతో, ఆ ఫ్రస్టేషన్లో ఊరిలోని బరువు బాధ్యతల నుంచి తప్పించుకుని ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వస్తూంటాడు. తన చెల్లెలు ఎందుకు వెళ్తున్నావంటే మహేష్ ని కలవడానికి అని చెప్తాడు. అలానే హైదరాబాద్ లో రాంబాబు అన్న తన పల్లెటూరి పేరు పక్కనపెట్టి మహేష్ అని చెప్పుకున్నాడు. లావణ్యకి ఈ విషయం తెలిసి ఎక్కడ తనని కాదంటుందోనని భయపడుతూంటాడు. మరోపక్క లావణ్యకి ఎలాగైనా ఎన్నారై పెళ్ళికొడుక్కే ఇచ్చిచేయాలనుకునే ఆమె పిన్ని మందిర (ఝాన్సీ) మహేష్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. తన ఊరికి తీసుకువెళ్ళమంటే, తన అసలు పేరు ఎక్కడ బయటపడుతుందోనని తప్పించుకోవాలని చూస్తాడు, దాంతో అతని ప్రవర్తన అనుమానంగా ఉందని తేల్చి తిరస్కరిస్తుంది మందిర.
రాంబాబు చెల్లెలు వరలక్ష్మి (భార్గవి) ఫోటో చూసి ఇష్టపడ్డ ఆనంద్ ఎవరికీ చెప్పకుండా లక్కవరం వెళ్ళి తనే వరలక్ష్మి అన్నయ్య మహేష్ ని అని పరిచయం చేసుకుంటాడు. అప్పటికే మహేష్ అనే కల్పితపాత్ర గురించి రాంబాబు గొప్పలు చెప్పడంతో, ఆ మహేష్ పై క్రష్ పెంచుకున్న వరలక్ష్మి మహేష్ అనే పేరుతో వచ్చిన ఆనంద్ ని ప్రేమిస్తుంది. ఆమె ప్రేమ దక్కించుకోవాలనుకున్న ఆనంద్ తన పేరును మహేష్ గా మారిస్తే మంచి సంభావన ఇస్తానంటూ ఊరి పురోహితుడు సర్వశర్మ (తనికెళ్ళ భరణి) దగ్గరకి వెళ్తాడు. వరలక్ష్మి ప్రేమ విషయం వాళ్ళింట్లో ఆయాగా పనిచేస్తున్న అమ్మాజీ (హేమ) రాంబాబుకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో రాంబాబు హడావుడిగా బయల్దేరి లక్కవరం వచ్చేస్తాడు. రాంబాబు తమ ప్రేమను అడ్డుకుంటున్నాడన్న కోపంలో రాంబాబుకు ఓ సమస్య సృష్టిస్తే తమ జోలికి రాడన్నట్టుగా ఆనంద్ హైదరాబాదులో ఉన్న లావణ్యకి ఫోన్ చేసి పిలిపించేస్తాడు. అప్పటికే మందిర, తన స్నేహితురాలు అమృతతో ఊరు వెళ్ళడంతో అదను చూసుకుని లావణ్య లక్కవరం వచ్చేస్తుంది. లక్కవరం రాగానే కొంత అయోమయం తర్వాత లావణ్యకి తాను ప్రేమించిన వ్యక్తి మహేష్ కాదు రాంబాబు అనీ, వరలక్ష్మికి తాను ప్రేమించింది కూడా మహేష్ ని కాదు ఆనంద్ ని అనీ తెలిసివస్తుంది. దాంతో వారిద్దరూ అలుగుతారు.
లావణ్య వెంటనే ఊరొదిలి వెళ్ళిపోదామనుకుంటుంది, కానీ బస్సులు తర్వాతి రోజు వరకూ లేకపోవడంతో ఆ ఊళ్ళోనే ఉండాల్సివస్తుంది. ఎలాగైనా లావణ్యని దక్కించుకుందామనుకున్న రాంబాబు తన పేరును మహేష్ గా మార్చమని సర్వశర్మ దగ్గరకి వస్తాడు. అప్పటికే అమ్మాజీని ప్రేమిస్తున్న సర్వశర్మ తన పెళ్ళి చేస్తేనే రాంబాబు పేరుమారుస్తానంటాడు. మహేష్ అన్న పేరును రాంబాబుకే త్యాగం చేస్తున్నట్టు ఆనంద్ కూడా ప్రకటిస్తాడు, దాంతో అతని మనసు మళ్ళీ నచ్చి ఆనంద్ అని పేరున్నా ఫర్వాలేదంటూ వరలక్ష్మి అతన్ని పెళ్ళిచేసుకుంటానంటుంది. ఈలోగా ఆ ఊరికి ఆఘమేఘాల మీద మందిర లక్కవరం వచ్చేస్తుంది. ఆమె అగ్గిమీద గుగ్గిలమైపోయినా చివరకు కుర్రాడికి నిజంగానే పదిహేను కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తివుందని తెలిసి మెత్తబడుతుంది. వారిద్దరి పెళ్ళికీ ఒప్పుకుంటుంది, అయితే మహేష్ నే పెళ్ళిచేసుకుంటానని పట్టుపట్టిన లావణ్య మాత్రం అంగీకరించదు.
ఈలోగా ఆ ఇంట్లో అమ్మాజీని చూసిన మందిర ఆమెను పట్టుకుని నిలదీస్తుంది. దాంతో అమ్మాజీ తన చిన్నప్పుడు అమృత ఇంట్లో పనిచేసేప్పుడు వాళ్ళ కొడుకుని రైల్వేస్టేషన్లో ఆడిస్తూండగా తనకిష్టమైన నటుడు సూపర్ స్టార్ కృష్ణ రావడంతో ఆయన్ని చూసేందుకు పిల్లాణ్ణి మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ టవల్ లో పెట్టి పక్కన వదిలేస్తుంది. ఆ విషయాన్ని చెప్పగానే రాంబాబు ఇంట్లోంచి ఆ పింక్ టర్కీటవల్ దానిపై ఎం అనే అక్షరంతో సహా తీసుకువచ్చి చూపిస్తాడు. రాంబాబు పసిపల్లాడిగా ఉండగా అదే టవల్ లో దొంగ రైల్లో వదిలేస్తే హైదరాబాద్లో రైలెక్కుతున్న లక్కవరం భూస్వామి శివకుమార్, ఆయన భార్య రాజమ్మ తెచ్చుకుని రాంబాబు అన్న పేరుపెట్టి పెంచుకుంటారు. ఈ విషయం చనిపోయేప్పుడు రాంబాబుకు చెప్పి, పింక్ టర్కీ టవల్ ఇస్తారు. చివరకు మందిర స్నేహితురాలు అమృత తప్పిపోయిన కొడుకే రాంబాబు అని తెలుస్తుంది. ఫోన్లో ఈ వార్త విన్న అమృత దంపతులు వెంటనే లక్కవరం ప్రయాణమై వస్తారు. అంతా సంతోషంగా జరిగినా తనకు మహేష్ అనే పేరున్నవాడే కావాలని పట్టుబట్టిన లావణ్య మాత్రం రాంబాబుని పెళ్ళాడేందుకు ఒప్పుకోదు. దాంతో అమృత పర్సులోంచి తన కొడుకు చిన్ననాటి ఫోటో తీసి, దానివెనుక తాను పెట్టిన పేరుందని చదవమని చెప్తుంది. ఆ పేరు మహేష్ కావడంతో లావణ్య ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. అక్కడితో రాంబాబు ఉరఫ్ మహేష్ - లావణ్య, ఆనంద్ - వరలక్ష్మి, సర్వశర్మ - అమ్మాజీల పెళ్ళిళ్ళు జరుగుతాయి. అయితే మందిరాదేవి పవన్ కళ్యాణ్ అన్న పేరుతో ప్రేమలో పడడంతో సినిమా ముగుస్తుంది.

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

అష్టాచమ్మా సినిమా కథకు మూలం ప్రముఖ ఆంగ్ల నాటకకర్త ఆస్కార్ వైల్డ్ రాసిన ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ నాటకం. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఆ నాటకాన్ని ఆధారం చేసుకుని, తెలుగు వాతావరణానికి తగిన మార్పులు చేస్తూ అష్టాచెమ్మా సినిమా కథ రాసుకున్నారు. మోహనకృష్ణ గ్రహణం, మాయాబజార్ సినిమాలు చేశాకా మూడవ అవకాశాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న రామ్ మోహన్ ఇచ్చారు. అప్పుడు ఆయనకు చెప్పిన రెండు కథల్లో ఒకటైన ఈ సినిమా కథను ఆయన ఎంచుకున్నారు. అయితే సినిమా ప్రకారం హీరోయిన్ కి ఓ పేరంటే విపరీతమైన ఆసక్తివుండాలి. అలాంటి పేరు ఏం పెడదామా అని ఆలోచిస్తూంటే అదే సమయంలో ఘనవిజయం సాధించిన పోకిరి సినిమా, తద్వారా అమ్మాయిలకు అత్యంత ఆకర్షణీయమైపోయిన హీరో మహేష్ బాబు గుర్తుకువచ్చి అదే పేరంటే హీరోయిన్ కి ఇష్టమన్నట్టు పెట్టేశారు. సినిమాకు వర్కింగ్ టైటిల్ గా "హలో హలో ఓ అబ్బాయి" ఉండేది. "కథ కంచికి" వంటి పేర్లు ఆలోచించి చివరకు అష్టా చమ్మా అన్న పేరును ఖరారుచేశారు. హీరోయిన్ పిన్ని అయిన మందిరాదేవి పాత్ర హీరోయిన్ కి వచ్చిన ప్రేమలేఖలు తనకు వచ్చాయనుకుని ప్రేమించే ఓ లవ్ ట్రాక్ కూడా సినిమాలో ఉండేది, అయితే అది ప్రధాన కథకు ప్రతిబంధకం అవుతోందని భావించి షూటింగ్ కు ముందు తొలగించారు.[3]

నటీనటుల ఎంపిక మార్చు

మొదట సినిమాకి హీరోయిన్ గా భూమికని తీసుకుందామని భావించారు. భూమిక స్క్రిప్ట్ విని, సినిమాలో పనిచేయడానికి అంగీకరించి డేట్స్ ఇస్తానన్నారు. సినిమాకు కథానాయకుని పాత్ర కోసం ముందు గోపీచంద్ ని, ఆ తర్వాత ఉదయ్‍కిరణ్ను సంప్రదించి కథ వినిపించారు. వారికి కథ నచ్చినా, ఆ పాత్రకు తాము సరిపోమని భావించి అంగీకరించలేదు. సంపంగి సినిమాలో చేసిన దీపక్ ని ఎవరో సూచించగా ఆయన వచ్చి కలిశారు. ఆయన ఈ సినిమాలో పనిచేసేందుకు ఒకే కానీ అష్టాచమ్మా సినిమా నిర్మాత, దర్శకులకు అతను సరిపోడేమోనని అనుమానం. సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రకు కలర్స్ స్వాతిని తీసుకున్నారు. అప్పటికి ఆమె యాంకరింగ్ మాత్రమే కాక డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాల్లో నటించారు. ఇక రెండో హీరో పాత్రకు తగ్గ వ్యక్తి చాన్నాళ్ళు దొరకలేదు. తర్వాతి కాలంలో దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న నందినీ రెడ్డి ఆ పాత్రకు బాపు, కె.రాఘవేంద్రరావు, మణిరత్నంల సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న నానిని సూచించారు.
ఇంతలో భూమికకు భరత్ ఠాకూర్ తో పెళ్ళికుదరడంతో ఆమె సినిమాలో నటించలేనని చెప్పడంతో మళ్ళీ హీరోహీరోయిన్ల వెతుకులాట ప్రారంభించారు. నిర్మాత రామ్మోహన్ సినిమాలో రెండవ జంటగా ఉన్నవాళ్ళనే హీరోహీరోయిన్లు చేసేస్తే ఎలావుంటుందని ఆలోచన వచ్చింది. దాంతో సినిమాకు నాని, స్వాతి హీరోహీరోయిన్లు అయ్యారు. రెండవ జంట కోసం వెతకడం ప్రారంభించారు. సినిమాలో అవకాశం కోసం విదేశాల్లో ఉన్న అవసరాల శ్రీనివాస్ మోహన కృష్ణకు ఫోటోలు పంపారు. మోహనకృష్ణకు అతని ఫోటోలు నచ్చలేదు, అలా చెప్పినా వదలకుండా శ్రీనివాస్ వీడియో పంపించారు. వీడియోలో ఎత్తుగా, తమాషాగా ఉన్న శ్రీనివాస్ మోహనకృష్ణకు నచ్చడంతో ఆనంద్ పాత్రకు ఎంపికచేశారు. వరలక్ష్మి పాత్రకు ఎవరు సరిపోతారో అంటూ చాలా ప్రయత్నాలే చేశారు. ఆ ప్రయత్నాలు తెలిసిన మోహనకృష్ణ కుటుంబసభ్యులు అప్పటికి అమృతం సీరియల్ లో పనిచేస్తున్న భార్గవిని సూచించారు. ఆమెకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పి, లంగావోణీలో రమ్మని సూచించారు. భార్గవిని లంగావోణీలో చూసి సరిపోతారని భావించి వరలక్ష్మి పాత్రకు ఎంపికచేశారు.[3]

చిత్రీకరణ మార్చు

సినిమా షూటింగ్ హైదరాబాద్, అమలాపురం, బొప్పాయిలంక, గూడాల ప్రాంతాల్లో పూర్తిచేసుకున్నారు.[3]

విడుదల మార్చు

మార్కెటింగ్, విడుదల మార్చు

సినిమా పూర్తయిన రెండు నెలల వరకూ విడుదల చేయలేదు. చిన్న సినిమాలు విడుదల చేసేందుకు సరైన సమయం చూసుకుని మరీ చేయాలన్నది నిర్మాత రామ్మోహన్ అంచనా. అందుకు తగ్గట్టే 2008 సెప్టెంబరు 5 తేదీని సరైన సమయంగా ఎంచుకుని ప్రకటించారు. సినిమా ప్రచారానికి కొత్త తరహా విధానాలు అవలంబించారు. వినూత్నంగా సినిమా విడుదలకు వారం రోజుల ముందే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రీమియర్ షో వేశారు. ఇలాంటి సినిమాలు విడుదలైన వారం, పదిరోజుల వరకూ నెమ్మదిగా బావుందన్న పేరుతెచ్చుకుని ఆ తర్వాత ఊపందుకుంటాయి. ఈలోగా థియేటర్ ఓనర్లు తీసేస్తే చాలా ఇబ్బందికరమైన స్థితి ఎదురవుతుంది. ఆ సమస్య పరిష్కరించేందుకు ఇలా ముందుగా ప్రదర్శన జరిగి, విడుదలయ్యేనాటికి బావుందన్న మాట వ్యాపిస్తే సినిమా విజయం మరింత ముందుగానే సాధ్యపడుతుందన్న ఆలోచనతో చేశారు. సినిమా బాగోలేదన్న పేరు తెచ్చుకుంటే మాత్రం చాలా సమస్యలు ఎదురుకావచ్చు. అయితే తన సినిమాను నమ్మి, రామ్మోహన్ ధైర్యం చేసి ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోల్లో సినిమా చాలా బావుందన్న టాక్ వచ్చింది.[3]

స్పందన మార్చు

సినిమా ప్రీమియర్ షోలోనే చాలా బావుందన్న స్పందన రావడంతో విడుదల నాటికి టాక్ మరింత పుంజుకుంది. సినిమా ఆర్థికంగా విజయం సాధించడమే కాక విమర్శకుల నుంచీ ప్రశంసలు పొందింది.

థీమ్స్, ప్రభావాలు మార్చు

అష్టా చమ్మా సినిమా ప్రముఖ ఆంగ్ల నాటకకర్త ఆస్కార్ వైల్డ్ రాసిన ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ నాటకం ఆధారంగా రూపొందించారు. సన్నివేశాలు, పాత్రలు మాత్రమే కాకుండా సినిమాలోని "ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి", "అమ్మానాన్నలు పోయారా, మరీ అంత కేర్ లెస్ ఏంటయ్యా నువ్వు" మొదలైన డైలాగులు కూడా దాన్నించి తీసుకున్నారు.[ఆధారం చూపాలి] సినిమాలో హీరోయిన్ ప్రముఖ హీరో మహేష్ బాబు అభిమాని, పలుమార్లు ఆయన పేరు కలవరిస్తూన్నట్టు ఉంటుంది. చిత్రీకరణకు ముందే మహేష్ బాబును కలిసి సినిమా నిర్మాత, దర్శకులు అందుకు అనుమతి తీసుకున్నారు.[3] మహేష్ బాబు నటించిన పోకిరి, అతిథి సినిమాల పాటలు కూడా సినిమాలో కొంత ప్రాధాన్యత కలిగివుంటాయి. కథానాయిక లావణ్య తన చిన్నతనంలో "ఎవ్వరు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో.. అదే లావణ్య" అంటూ పోకిరి సినిమాలో మహేష్ డైలాగును పోలిన డైలాగ్ చెప్పినట్టు, ఆ డైలాగ్ విని అప్పటికి చిన్న కుర్రాడిగా ఉన్న పూరీ జగన్నాధ్ రాసుకున్నట్టు ఉంటుంది.

పాటల జాబితా మార్చు

. నమ్మాలో లేదో , గానం.శ్రీరామచంద్ర మైనంపాటి , మానసవీణ

హాల్లో అంటూ , గానం.సుష్మ , శ్రీకృష్ణ

అందించు అష్టా చెమ్మా, గానం.శ్రీకృష్ణ

తిడతారా కొడతారా , గానం.శ్రీరామచంద్ర మైనంపాటి

అష్టా చెమ్మా థీమ్ , గానం.సుష్మ .

పురస్కారాలు మార్చు

ఫిలింఫేర్ సౌత్ అవార్డ్
  • ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి - స్వాతి
నంది బహుమతి
  • అక్కినేని కుటుంబకథా చిత్రం నంది పురస్కారం - రాం మోహన్
  • ఉత్తమ నటి నంది - స్వాతి

ఇతర విశేషాలు మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. Rajamani, Radhika (2008-09-01). "టెకింగ్ ఆన్ ఆస్కార్ వైల్డ్!". Rediff.com. Archived from the original on 7 సెప్టెంబరు 2008. Retrieved 2008-09-07.
  2. "మోహన కృష్ణ ఇంటర్వ్యూ". Idlebrain.com. 2008-07-10. Archived from the original on 9 సెప్టెంబరు 2008. Retrieved 2008-09-09.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 ఇంద్రగంటి, మోహనకృష్ణ (26 జూలై 2015). "మహేష్... ఆ పేరులోనే ఓ మత్తుంది". సాక్షి. Retrieved 24 ఆగస్టు 2015.