ఓగిరాల రామచంద్రరావు

సినీ సంగీత దర్శకుడు

ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 - జూలై 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. వాహిని వారి చిత్రాలెన్నింటికో ఈయన సంగీతం అందించారు. ఓగిరాల తెలుగు చలనచిత్రరంగంలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు, ఆయన మళ్ళీ పెళ్ళి (1939) చిత్రంలో వై.వి.రావుకి పాడారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939) చిత్రంలో శివుని వేషం వేశారు.

ఓగిరాల రామచంద్రరావు
Ogirala Ramachandra Rao.jpeg
జననంసెప్టెంబర్ 10, 1905
బెజవాడ, కృష్ణా జిల్లా,
మద్రాసు రాష్ట్రం
మరణం17 జూలై 1957(1957-07-17) (వయస్సు 51)
మద్రాసు,
మద్రాసు రాష్ట్రం
మరణ కారణముఫ్లూ జ్వరం
నివాస ప్రాంతంమద్రాసు
ఇతర పేర్లుఓగిరాల, ఓ.రామచంద్రరావు
వృత్తితెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు,
గాయకుడు,
నటుడు
క్రియాశీలక సంవత్సరాలు1939 నుండి 1957 వరకు
మతంహిందూ మతం
భార్య / భర్తవరలక్ష్మి
పిల్లలుఓగిరాల నరసింహమూర్తి,
మాచిరాజు కల్పకవల్లి
తండ్రిఓగిరాల జనార్దనశర్మ
తల్లిఓగిరాల సుబ్బమ్మ

జననంసవరించు

ఓగిరాల 1905 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన బెజవాడలో జన్మించారు. ఆయన కుటుంబానికి మూలాలు కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, చిరువోలు గ్రామంలో ఉన్నాయి.

నటునిగాసవరించు

ఓగిరాల వీలుకాని పరిస్థితుల్లో నటించవలసి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1939) చిత్రంలో శివుని వేషధారి మెడలో పాము వేసుకోవడానికి నిరాకరించడంతో ఓగిరాల ఆ పాత్రను ధరించారు.

సంగీతంసవరించు

సంగీత దర్శకునిగా ఓగిరాల దాదాపు ఇరవై చిత్రాలకు పనిచేశారు, ఆ చిత్రాలలో దాదాపు అన్నీ సంగీతపరంగా విజయం సాధించినవే.

వాహిని చిత్రాలుసవరించు

వాహిని వారి చాలా చిత్రాలకు ఈయన పనిచేశారు. అందులో నాగయ్యగారికి సహాయకునిగా స్వర్గసీమ (1945), యోగి వేమన (1947) వంటి చిత్రాలకు పనిచేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. గుణసుందరి కథ (1949), పెద్దమనుషులు (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి పనిచేసిన చిత్రాలు, ఈ రెండు చిత్రాలకు ఆయనకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా అద్దేపల్లి రామారావు పని చేయడం విశేషం.

ఇతర చిత్రాలుసవరించు

సంగీతదర్శకునిగా ఓగిరాలకు మొదటి చిత్రం మళ్ళీ పెళ్ళి (1939). నటి కాంచనమాలతో కలిసి ఆయన నా సుందర సురుచిర రూపా అనే పాట పాడారు. ఈ పాటను కాంచనమాల, వై.వి.రావు పైన చిత్రీకరించారు. చలనచిత్రరంగంలో బెజవాడ రాజారత్నం గాయనిగా స్థిరపడటానికి ఓగిరాల సంగీతం ముఖ్య కారణం. మళ్ళీ పెళ్ళి చిత్రంలో రాజారత్నంతో పాడించిన గోపాలుడే మన గోపాలుడే, చెలి కుంకుమమే పావనమే తదితర గీతాలు పాడించారు. ఆ పాటలన్నీ ఆ రోజులలో జనం నాలుకలపై నిత్యం నాట్యం చేస్తూ ఉండేవి. విశ్వమోహిని (1940) చిత్రంలో ఆయన రాజారత్నంతో పాడించిన ఈ పూపొదరింటా, భలే ఫేస్, మేళవింపగదే చెలియా వీణ వంటి పాటలు ఆయన సంగీతానికి ఒక గొప్ప ఉదాహరణ. 1940లో అటువంటి ఆహ్లాదకరమైన సంగీతంతో కూడిన పాటలు అందించిన ఘనత ఓగిరాలకే దక్కింది.

1941 నుండి ఓగిరాల, ఘంటసాల బలరామయ్య నిర్వహిస్తున్న ప్రతిభ పిక్చర్స్ చిత్రాలకు సంగీతం అందించడం మొదలు పెట్టారు. ఆయన సంగీతం అందించిన ప్రతిభ పిక్చర్స్ చిత్రాలు పార్వతీ కళ్యాణం (1941), గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాటీలు (1946). అక్కినేని నాగేశ్వరరావు రెండవ చిత్రం సీతారామ జననం (1944)లో, నాగేశ్వరరావుతో గురుబ్రహ్మ గురువిష్ణు శ్లోకం పాడించారు ఓగిరాల. ఘంటసాల బలరామయ్య తీసిన ముగ్గురు మరాటీలు (1946) చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, టి.జి.కమలాదేవి చేత ఛల్ ఛలో వయ్యారి షికారి అనే యుగళగీతం పాడించారు. అదే చిత్రంలో కన్నాంబ చేత సతీ భాగ్యమే భాగ్యము, తీరుగదా ఆశ అనే రేండు పాటలు పాడించారు. ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం జీవనము యమునా జీవనము, రాటము భారతనారి కవచము అనే రెండు పాటలు పాడింది. ఈ చిత్రంలో జీవనము యమునా జీవనము పాట ప్రేక్షకాదరణ పొందింది, అది రాజారత్నం పాడిన పాట కావడం విశేషం.

1949లో హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి రక్షరేఖ చిత్రానికి సంగీతం అందించారు. అదే సంవత్సరం విడుదలైన వాహిని వారి గుణసుందరి కథ పెద్ద విజయం సాధించింది. 1950లో విడుదలైన పరమానందయ్య శిష్యులు చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తితో కలిసి సంగీతం అందించారు, కానీ ఆ చిత్రం పరాజయం పొందింది. ఆ తర్వాత ఓగిరాల మాయా రంభ (1950), సతీ సక్కుబాయి (1954) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత విడుదలైన పెద్ద మనుషులు (1954) చిత్రం గుణసుందరి కథ అంత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత టి.వి.రాజుతో కలిసి శ్రీ గౌరీ మహత్యం (1956) చిత్రానికి సంగీతం అందించారు. భక్త రామదాసు (1964) చిత్రానికి ఓగిరాల, నాగయ్య, అశ్వత్థామ, హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రితో కలిసి సంగీత శాఖలో పనిచేశారు. 1957లో ఆ చిత్ర నిర్మాణం ప్రారంభమైన కొన్ని రోజులకే ఓగిరాల అనారోగ్యంతో మరణించారు.

ముఖ్య చిత్రాలుసవరించు

ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి గుణసుందరి కథ (1949), పెద్ద మనుషులు (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో అద్దేపల్లి రామారావు ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత, దర్శకుడు కె.వి.రెడ్డి గారే, రెండిట్లో నాయిక శ్రీరంజని జూనియరే.

గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. పి.లీల, టి.జి.కమలాదేవి, కస్తూరి శివరావు, శాంతకుమారి, మాలతి, ఘంటసాల తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు విశేష జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఓగిరాల పి.లీల చేత పాడించినవన్నీ భక్తి పాటలే, వాటిలో శ్రీ తులసి ప్రియ తులసి పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన కలకలా ఆ కోకిలేమో, చల్లని దొరవేలె చందమామ పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.

పెద్ద మనుషుల చిత్రంలో రేలంగికి ఘంటసాల పాడిన నందామయా గురుడ నందామయా, శివశివ మూర్తివి గణనాథా బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను కొసరాజు రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ పాట హిందీ చిత్రం అల్‌బేలాలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు, లీలనే పాడిన అంతభారమైతినా అంధురాలనే దేవ పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.

మరణంసవరించు

1957 సంవత్సరంలో భక్త రామదాసు (1964) చిత్ర నిర్మాణ సమయంలో ఓగిరాల ఫ్లూ జ్వరం బారినపడ్డారు, అలా అనారోగ్యంతో కొన్ని రోజుల తర్వాత మద్రాసులో జూలై 17, 1957న కన్నుమూశారు. మరణించినప్పుడు ఆయన వయాస్సు కేవలం యాభై రెండేళ్ళే. ఓగిరాల అంటే ఏంతో అభిమానమున్న ఘంటసాల ఆయన అంతిమయాత్రలో పాల్గొని రెండు మైళ్ళు నడిచారు.

సంతానంసవరించు

ఓగిరాలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ తండ్రి ఓగిరాల వద్ద లలిత సంగీతం నేర్చుకున్నా ఆ రంగం వైపు చూడలేదు. ఓగిరాల కుమారుడు నరసింహమూర్తి కార్పొరేషన్ బ్యాంకులో ఉన్నత పదవి నుండి విరమణ పొందారు. నరసింహమూర్తి కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించారు. బ్రతుకుతెరువు (1953)లో సూర్యకాంతం కొడుకుగా, దొంగరాముడు (1955)లో చిన్ననాటి రాముడి స్నేహితునిగా, అప్పు చేసి పప్పు కూడు (1959)లో సూర్యకాంతం, రమణారెడ్డి కొడుకుగా నటించారు. అప్పు చేసి పప్పు కూడులో రేలంగి, నరసింహమూర్తి కలిసి పండించిన హాస్యం మరువలేనిది.

చిత్రసమాహారంసవరించు

సంగీత దర్శకుడిగాసవరించు

నటునిగాసవరించు

నేపథ్యగాయకుడిగాసవరించు

లింకులుసవరించు

  1. The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in ఇంగ్లీష్). M.L. Narasimham. Archived from the original on 18 September 2019. Retrieved 29 September 2020. CS1 maint: discouraged parameter (link)