గురజాడ కృష్ణదాసు వెంకటేష్

భారతీయ సంగీత స్వరకర్త (1927-1993)

జి.కె.వెంకటేష్ లేదా గురజాడ కృష్ణదాసు వెంకటేష్ (సెప్టెంబర్ 21, 1927 - నవంబర్ 17, 1993) ప్రఖ్యాత దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలకు సంగీతము సమకూర్చినప్పటికీ కన్నడ చిత్రరంగములో 1960ల నుండి 1980ల వరకు అనేక కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఒక సాంఘిక సినిమా కన్నడ నాట ఒకే థియేటర్లో ఒకే రోజు మూడు ఆటల చొప్పున సంవత్సరానికి మూడు మాసాల పాటు ఏకథాటిగా నడిచింది. ఆ సినిమా పేరు బంగారద మనష్య, ఈ సినిమాకు సంగీతదర్శకుడు జి.కె.వెంకటేషే. ఈ సినిమాను తెలుగులో బంగారు మనిషిగా తిరిగి తీశారు.

గురజాడ కృష్ణదాసు వెంకటేష్
జి. కె. వెంకటేష్
జననంజి. కె. వెంకటేష్
సెప్టెంబర్ 21, 1927
హైదరాబాద్, బ్రిటిష్ ఇండియా
మరణంనవంబరు 17, 1993 (వయసు 66)
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుజి. కె. వెంకటేష్
వృత్తిసంగీత దర్శకత్వం, నేపథ్య గానం
పదవీ కాలం1946 - 1993

తొలి జీవితం

మార్చు

జి.కె.వెంకటేష్ స్వస్థలం హైదరాబాదు, ఆయన పెరిగింది మద్రాసులో. ఆయన జీవితంలో ఒక వింత ఏమిటంతే ఆయన ఎన్నడు స్కూలుకి వెళ్ళి చదువుకోలేదు. ఆయన తండ్రి సంగీత విద్వాంసుడు, ఆయన నుంచి వెంకటేష్‌కి సంగీతం వారసత్వంగా లభించింది. వెంకటేష్ వారు ఐదుగురు సోదరులు, అందరూ సంగీతంలో ఆరితేరినవారే, ఆపై ఒక్కొక్కరు ఒక్కో వాద్య విద్యలో నైపుణ్యం సంపాదించారు. వెంకటేష్ వీణ వాయించడంలో నైపుణ్యం సాధించాడు. తండ్రిగారు రంగస్థల నటుడు కూడా కావడం వలన వెంకటేష్ వేషాలు కూడా వేశాడు. తనకు సంగీతం, నటన తెలుసు గనక మద్రాసు వెలితే అవకాశాలు దొరకవచ్చని 1938లో మద్రాసు వెళ్ళాడు, అప్పుడాయనకి పదకొండేళ్ళు. అతన్ని జూపిటర్ సంస్థ మూడు రూపయిలు నెల జీతానికి తీసుకుంది, అయితే వసతి, భోజనం అంతా సంస్థ వారే చూసుకునేవారు. తమిళం నేర్చుకుని కణ్ణగి, కుబేర-కుచేల, మహామాయ, భక్త మీరా వంటి చిత్రాలలో బాలనటుడుగా వేషాలు వేశారు. ఆప్పుడే అదే సంస్థలో బాలనటుడిగా పనిచేస్తున్న ప్రముఖ సంగీతదర్శకుడు ఎమ్.ఎస్.విశ్వనాథన్ పరిచమయ్యాడు. వారిద్దరికి సంగీతం తెలుసుగనక సంస్థవారు కోరస్ గీతాలు పాడించారు. కడారు నాగభూషణం తమిళంలో హరిశ్చంద్ర సినిమా తీస్తే అందులో విశ్వనాథన్, వెంకటేష్ లోహితుని స్నేహితుల వేషాలు వేశారు. తొలినాళ్ళలో తమిళ చిత్రరంగంలో విశ్వనాధన్ తో కలసి పనిచేశారు. సంతోషం అనే చిత్రం (ఎన్టీ రామారావు కథానాయకుడు) లో విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత దర్శకత్వంలో నేపథ్యగానం కూడా చేశారు. కన్నడ చిత్రరంగంలో స్టార్ సంగీత దర్శకునిగా వెలుగొందారు. తెలుగులో తొలిసారిగా నాటకాల రాయుడు (భగవాన్ హిందీ చిత్రం అల్బెలా చిత్రం ఆధారంగా నాగభూషణం హీరోగా నిర్మితమైంది) ద్వారా పరిచయమయ్యారు. తర్వాత జమీందారు గారి అమ్మాయి చిత్రానికి సంగీతమిచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, పి.సుశీలకు మంచిపేరు తెచ్చిన మ్రోగింది వీణ పాట ఈ చిత్రంలోనిదే. తరువాత అమెరికా అమ్మాయి (ఒక వేణువు వినిపించెను, జి.ఆనంద్ పాటలలో అత్యుత్తమమైనది), చక్రధారి (మానవా ఏమున్నది ఈ దేహం, ఎక్కడున్నావు, నువ్వెవరయ్యా నేనెవరయ్యా (రామకృష్ణ), విఠలా విఠలా (రికార్డులలో ఆనంద్, చిత్రంలో బాలు), తరం మారింది మొదలైన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

జి.కె.వెంకటేష్ కన్నడ చిత్ర సీమలో బి.కె.సుమిత్ర, బెంగుళూరు లత, సి.అశ్వద్థ, సులోచన వంటి అనేక ప్రతిభ గల నూతన గాయకులను పరిచయం చేశాడు. రాజ్ కుమార్ను గాయకుడుగా పరిచయం చేసింది కూడా వెంకటేషే. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఎల్.వైద్యనాథన్, శంకర్ గణేష్ వంటివారు జి.కె.వెంకటేష్ శిష్యులే. కన్నడ చిత్రరంగంలో 600కు పైగా సినిమాలకు సంగీతం అందించిన వెంకటేష్, భక్త తుంబుర, హూస నీరు చిత్రాలకు కర్ణాటక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు.

జి.కె.వెంకటేష్ వద్ద సహాయకుడిగా 200 కన్నడ చిత్రాలలో పనిచేసిన ఇళయరాజా ఆ తర్వాత స్వతంత్రంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ సంగీత దర్శకుడయ్యాడు. అవసాన దశలో వెంకటేష్ కు సినిమాలు లేక, సినిమా నిర్మాతగా నష్టపోయిన దశలో ఇళయరాజా ఈయన్ను అక్కున చేర్చుకొని చనిపోయేవరకు తన సంగీత బృందంలో శాశ్వత స్థానం కల్పించాడు.

జి.కె.వెంకటేష్ 1993 నవంబర్ 17మద్రాసులో మరణించాడు.

చిత్రసమాహారం

మార్చు
 1. అత్తగారు కొత్తకోడలు (1968)
 2. నాటకాల రాయుడు (1969) : నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే
 3. శ్రీదేవి (1970)
 4. మా ఇలవేల్పు (1971)
 5. కోడలు పిల్ల (1972)
 6. పసి హృదయాలు (1973)
 7. శ్రీవారు మావారు (1973) : పూలు గుస గుసలాడేనని జతగూడేనని
 8. జమీందారు గారి అమ్మాయి (1975) : మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
 9. అమెరికా అమ్మాయి (1976) : పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట ఈ పాట
 10. ఆడవాళ్లు అపనిందలు (1976) : కనులు కనులు కలుసుకుంటే
 11. తరం మారింది (1977)
 12. చక్రధారి (1977) : విఠలా పాండురంగ విఠలా
 13. తీర్ధయాత్ర (1978)
 14. రావణుడే రాముడైతే (1979) : రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
 15. రక్తసంబంధం (1980)
 16. ఓ ఇంటి భాగోతం (1980)
 17. జాతర (1980) : మాఘమాస వేళలో
 18. సన్నాయి అప్పన్న (1980) : సన్నాయి రాగానికి యీ చిన్నారి నాట్యానికి
 19. మరో మలుపు (1982)
 20. జగన్మాత (1987)

బయటి లింకులు

మార్చు