గౌతు లచ్చన్న

భారతీయ రాజకీయవేత్త

గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 - ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్,[1] జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. తెలంగాణా కొరకు మర్రి చెన్నారెడ్డితో చేతులు కలిపాడు. తెలంగాణా రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. చౌదరి చరణ్ సింగ్, జయప్రకాష్ నారాయణ, మసాని లతో పనిచేశాడు.

గౌతు లచ్చన్న
సర్దార్ గౌతు లచ్చన్న
జననంగౌతు లచ్చన్న
(1909-08-16)1909 ఆగస్టు 16
(నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా
మరణం2006 ఏప్రిల్ 19(2006-04-19) (వయసు 96)
ఇతర పేర్లుసర్దార్
వృత్తిఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
ఆంధ్ర రాష్ట్ర మంత్రి
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు
పిల్లలుగౌతు శ్యాం సుందర్ శివాజీ
తండ్రిచిట్టయ్య,
తల్లిరాజమ్మ

తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, ఆచార్య గోగినేని రంగా ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.

బాల్యము, విద్యాభ్యాసము

మార్చు

సర్దార్ గౌతు లచ్చన్న: ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16 వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబములో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8 వ సంతానంగా పుట్టాడు. లచ్చన్న తాత, తండ్రులు గౌడ కులవృత్తే వారికి కూడుబెట్టేది.[2] ఈతచెట్లను కోత వేసి కల్లు నుత్పత్తి చేయడం, అమ్మడం చుట్టు ప్రక్క గ్రామాల్లో గల కల్లు దుకాణాలకు కల్లు సరఫరా చేయడం వారి వృత్తి. కుల వృత్తిలోకి తమ పిల్లలన్ని దించకుండా చదువులను చెప్పించాలని బారువాలో గల ప్రాథమిక పాఠశాలలో 1916లో వాళ్ళ నాన్న చిట్టయ్య చేరిపించాడు. లచ్చన్న బారువా ప్రాథమికోన్నత పాఠశాలలో 8 వ తరగతి వరకు చదివి ప్రక్కనే ఉన్న మందసా రాజావారి హైస్కూల్లో 9 వ తరగతిలో చేరాడు. అక్కడ లచ్చన్న చదువు కొనసాగలేదు. దురలవాట్లు, చెడుసహవాసాలు కొనసాగాయి. ఫలితంగా 9వ తరగతి తప్పాడు. శ్రీకాకుళంలో లచ్చన్నను ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ జగన్నాధం పంతులుగారి ఇంటిలో ఉండి చదువుసాగించాడు. ఆ స్కూల్లో డ్రిల్ మాష్టారు నేమాని నరసింహమూర్తి శిక్షణలో జాతీయ భావాల్ని అలవర్చుకున్నాడు. విద్యార్థి జీవితంలో మార్పు జీవన విధానంలో మార్పు. ఆలోచన ధోరణిలో మార్పు, జాతి, జాతీయత అనే ప్రాథమిక రాజకీయ పాఠాల్ని నరసింహమూర్తి వద్దనే నేర్చుకోవడం జరిగింది. లచ్చన్నకు ఆనాటికి 21 సవంత్సరాలు. 1929-30 విద్యా సంవత్సరం స్కూల్ పైనల్ పరీక్షకు ఎంపికై హాజరయ్యాడు.

స్వాతంత్ర్యోద్యమం

మార్చు

మెట్రిక్యులేషన్ చదువుతుండగానే 21వ ఏట గాంధీజీ పిలుపువిని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో దూకాడు. 1930 లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపినిచ్చాడు. దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారుచేసి ఆ డబ్బుతో ఆ ఉద్యమాన్ని నడిపాడు.[3] విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి అహుతి చేశాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటున్నప్పుడు లచ్చన్నను అరెస్టు చేసి టెక్కలి, నరసన్నపేట సబ్ జైళ్లల్లో నలభై రోజులు ఉంచారు. కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజుల శిక్షను అతను బరంపురం జైల్లో అనుభవించవలసి వచ్చింది.[4]

1932 వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి రాజమండ్రి జైల్లో ఐదు మాసాలు ఉంచారు. రాజకీయాలకూ, సంఘసంస్కరణలకు సంబంధమేర్పరచి గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాలు నడిపాడు.[5] అందులోని భాగమే అంటరానితనం నిర్మూలన. అంటరానితనం మీద కత్తి ఝుళిపించాడు లచ్చన్న.[6][7] అతను నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. బారువా గ్రామ వీధుల్లో యువజనులను వెంట వేసుకొని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. సవర్ణులలో ఆశ్చర్యం, హరిజనులలో ఆశలు రేకెత్తించేవి. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కలిగించాడు. లచ్చన్న చేసిన ఆర్థిక సహాయంతో కుశాగ్రబుద్ధులైన ఎందరో హరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల నలంకరించారు.

ఆచార్య గోగినేని రంగాతో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల సంబంధం. నిడుబ్రోలులో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకడు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని భావి జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి ఆయనను నడుము బిగించేటట్లు చేసింది. 1935లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఆ రోజుల్లో రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీలోని అంగాలే. 1939లో త్రిపురలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసాలో జరపాలని తీర్మానించారు. రాహుల్ సాంకృత్యాయన్ ఈ సభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభలు జయప్రదం కావడానికి ప్రధానకారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరూ, ఆయన కార్యదీక్ష దేశమంతటా తెలిసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయరైనాడు.

స్వాతంత్ర్యోద్యమంలో చివరి పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి, ఆయనను పట్టి యిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి మూడేళ్ళు జైల్లో ఉంచి 1945 అక్టోబరులో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైనాడు. 1947లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యాడు.

రాజకీయ జీవితం

మార్చు

1950లో ఆచార్య గోగినేని రంగా కృషి కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. 1952 లో సోంపేట నియోజకవర్గం నుండి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. [8] 1953 అక్టోబరు 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్రసంఘంలో కాంగ్రెస్ నుంచి నీలం సంజీవరెడ్డి, ప్రజా పార్టీ నుంచి తెన్నేటి విశ్వనాధం, కృషి కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులు. ప్రకాశం పంతులు మంత్రివర్గంలోనూ, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశాడు.

1961లో రాజాజీ స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖకు సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడు. 1978లో లచ్చన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. పభ్లిక్ అక్కౌంట్స్ ఛైర్మన్ గా ఆ రోజుల్లో పనిచేశాడు. కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చాడు.

మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు సర్దార్ వల్లభభాయి పటేల్. మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. ఒకరిది దేశస్ధాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్ అంటే సేనాని. స్వాతంత్ర్యోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా గౌడ చరిత్ర ఒక మంచి మనిషీ ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19 న కన్ను మూశాడు.

మూలాలు

మార్చు
  1. "Latchanna organised reception at Eluru to the soldiers of the Azad Hind Fauz founded by Netaji Subash Chandra Bose". Archived from the original on 2011-07-11. Retrieved 2016-05-23.
  2. "The Hindu". Archived from the original on 2006-05-22. Retrieved 2016-05-23.
  3. "The word "Cotaur" is the Anglicised version of the Telugu word "Cotauru" meaning "godown"". Archived from the original on 2010-05-29. Retrieved 2016-05-23.
  4. "At the age of 21, Sri. Latchanna was arrested in connection with the salt-cotaurs raid". Archived from the original on 2011-07-11. Retrieved 2016-05-23.
  5. "lathi-charged during the 1932 civil disobedience movement for hoisting the Congress flag at Baruva". Archived from the original on 2011-07-11. Retrieved 2016-05-23.
  6. "Latchanna was inspired by Mahatma Gandhi's fast-unto-death at Yeravada Central jail on the issue of untouchability". Archived from the original on 2011-07-11. Retrieved 2016-05-23.
  7. "Gandhi began a fast-unto-death while imprisoned in the Yeravada Central Jail of Pune in 1932 to eliminate discrimination and untouchability". Archived from the original on 2013-04-07. Retrieved 2016-05-23.
  8. "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.

వనరులు

మార్చు
  • సర్దార్ గౌతు లచ్చన్న జీవిత చరిత్ర / విజయకుమార్ దేవ్

ఇతర లింకులు

మార్చు