జయంతి (జనవరి 6, 1945 - జూలై 26, 2021) ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి. ఆమె అసలు పేరు కమల కుమారి. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు.[1]

జయంతి
జననం (1945-01-06) 1945 జనవరి 6 (వయసు 78)
శ్రీకాళహస్తి
మరణం26 జులై 2021
బెంగళూరు
వృత్తినటి, రాజకీయ నాయకురాలు
తల్లిదండ్రులు
  • బాలసుబ్రహ్మణ్యం (తండ్రి)
  • సంతానలక్ష్మి (తల్లి)

తొలి జీవితం సవరించు

జయంతి 1945, జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించారు.[2] తండ్రి బాలసుబ్రహ్మణ్యం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి మద్రాసు చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలనే కోరిక ఉండేది. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు తోటి విద్యార్థినులతో కలిసి ఒక కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి కమలకుమారి రూపురేఖల్ని చూసి ‘జెనుగూడు’ అనే సినిమా కోసం ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదనే ఉద్దేశంతో ఆమె పేరును జయంతిగా మార్చారు.[3]

బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ ఎన్.టి.రామారావు కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదేకవీరుని కథ కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో ఎన్టీఆర్ సరసన నాయికగా నటించారు.

సినిమా జీవితం సవరించు

చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహపరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చారు. కన్నడ చిత్రసీమలో జయంతి స్థానం ఉన్నతమైనది. కన్నడ మెగా హీరో రాజ్ కుమార్తో అందరు హీరోయిన్లకన్నా ఎక్కువగా 30 సినిమాలలో జయంతి నటించారు. ఆమె మాతృభాష తెలుగైనా కన్నడం చాలా చక్కగా మాట్లాడతారు. అమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు.

ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

అవార్డులు సవరించు

1965లోనే 'మిస్‌ లీలావతి' అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్‌ డ్రస్‌లో నటించారు. అనూహ్యంగా ఈ సినిమాలోనే ఆమెకు భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు శ్రీమతి ఇందిరా గాంధీ చేతుల మీదుగా లభించింది.[4]

రాజకీయాలు సవరించు

జయంతి 1998 లోక్‌సభ ఎన్నికలలో లోకశక్తి పార్టీ తరపున చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసారు. అయితే మూడో స్థానంతో సంతృప్తి పడవలసి వచ్చింది. మళ్ళీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు.

నటించిన సినిమాలు సవరించు

మరణం సవరించు

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జయంతి, 2021 జూలై 26న బెంగళూరులోని తన నివాసంలో మరణించింది.[5]

మూలాలు సవరించు

  1. ఆంధ్రజ్యోతి. "ఎన్టీఆర్‌ని పలుకరిద్దామని వెళితే." Archived from the original on 19 అక్టోబరు 2015. Retrieved 25 July 2017.
  2. మద్రాసు ఫిలిం డైరీ (1 August 2017). 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 129.
  3. Fernandes, Ronald Anil (December 23, 2003). "Straight from the Heart:As this month's guest at Maneyangaladalli Mathukathe, cine actress Jayanthi held her audience spellbound with her usual charm". Deccan Herald. Retrieved 2006-12-24.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-03. Retrieved 2009-04-23.
  5. EENADU (26 July 2021). "ప్రముఖ నటి జయంతి కన్నుమూత - telugu news senior actress jayanthi died". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.

బయటి లింకులు సవరించు