వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2021)

2021 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.

1వ వారం
సత్యేంద్రనాథ్ బోస్
సత్యేంద్రనాథ్ బోస్ భారత దేశ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు. అతను 1920 లలో క్వాంటం మెకానిక్స్‌లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందాడు.అతనికి భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణను 1954 లో ప్రదానం చేసింది. ప్రస్తుతం విశ్వంలో వ్యాపించిఉన్నాయని భావిస్తున్న దైవకణాలకు ఆయన పేరుతో హిగ్స్-బోసన్ కణాలని పాల్ డిరాక్ నామకరణం చేశాడు. అతను స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. అతను భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, జీవ శాస్త్రము, లోహ సంగ్రహణ శాస్త్రము, తత్వ శాస్త్రము, కళలు, సాహిత్యం, సంగీతం వంటి అనేక రంగాలలో కృషిచేశాడు. విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివిన బోస్ అణు భౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపాడు. క్వాంటమ్ ఫిజిక్స్‌పై అధ్యయనం చేశాడు. విశ్వంలోని ప్రాథమిక కణాలపై పరిశోధనలో భాగంగా 1920లలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో కలిసి పనిచేశాడు. అతని అధ్యయనం వల్లే అణు భౌతికశాస్త్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
(ఇంకా…)
2వ వారం
చందమామ
చందమామ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది. చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి లు 1947 జూలైలో ప్రారంభించారు . కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం, ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన, వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి.
(ఇంకా…)
3వ వారం
కొండపల్లి శేషగిరి రావు
కొండపల్లి శేషగిరి రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. భారతీయ సాంప్రదాయ చిత్రలేఖనంలో కృషి చేశాడు. ఆయన వరంగల్ జిల్లా, పెనుగొండ గ్రామంలో ఒక బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. బెంగాల్ శాంతినికేతన్ లో చిత్రలేఖనం అభ్యసించి, జె ఎన్ టి యు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలు పెట్టాడు. అతని చిత్రలేఖనాప్రస్థానం అప్రతిహతంగా సాగింది. అతని చిత్రాలలో శకుంతల, దమయంతి, రామాయణం వంటి పురాణాలలోని వివిధ సన్నివేశాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. డాక్టరేట్లు, హంస అవార్డులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరించింది. అతని చిత్రాలను దేశ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియంలలో ప్రదర్శించారు. చిన్నతనంలోనే ఆయనలోని సృజనాత్మకతను పరిశీలించిన ఆ పాఠశాల డ్రాయింగ్‌ మాస్టర్‌ దీనదయాళ్‌ ఆనాడే కొండపల్లి గొప్ప కళాకారుడవుతాడని గ్రహించారు. చుట్టూ వ్యాపించి ఉన్న కళాసంపద ఆయన కళాభిమానాన్ని తట్టిలేపింది. వేయిస్తంభాల గుడిలోని ప్రతీ స్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్పింది. రామప్ప గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ గుడిలోని శిల్ప సౌందర్యం, శిల్పక్షేత్రాల శిల్పకళా సొగసులను సుదీర్ఘ, సునిశిత అధ్యయనంతో తన సొంతం చేసుకొన్న కొండపల్లి వాటినుంచి స్ఫూర్తిపొంది కొన్ని వందల చిత్రాలతో ఆ శిల్పకళకు దర్పణం పట్టారు. శిల్పుల మనోగతాల్ని, వారి అభిరుచిలో తొంగిచూసిన ప్రత్యేకతల్ని, విశిష్టతల్ని తాను అవగతం చేసుకోవడమే కాక ప్రజా బాహుళ్యానికి చాటే ప్రయత్నం చేశారు.(ఇంకా…)
4వ వారం
స్పేస్ షటిల్
స్పేస్ షటిల్ పాక్షికంగా మరల మరల వినియోగించదగిన అంతరిక్ష నౌకా వ్యవస్థ. భూ నిమ్న కక్ష్య లోకి వెళ్ళే నౌక ఈ వ్యవస్థలో భాగం. ఇది 1981 నుండి 2011 వరకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వారి అంతరిక్ష నౌకల కార్యక్రమంలో భాగంగా పనిచేసింది. అధికారికంగా ఈ కార్యక్రమం పేరు స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఎస్‌టిఎస్). పునర్వినియోగ అంతరిక్ష నౌకా వ్యవస్థ కోసం 1969 లో తయారు చేసిన ప్రణాళిక నుండి ఈ పేరును తీసుకున్నారు. ఆ ప్రణాళికలో అభివృద్ధి కోసం నిధులు సమకూర్చిన ఏకైక అంశం ఇది. నాలుగు కక్ష్య పరీక్షా యాత్రలలో మొదటిది 1981 లో జరిగింది. 1982 నుండి మొదలైన కార్యాచరణ యాత్రలకు ఇది నాంది పలికింది. మొత్తం ఐదు స్పేస్ షటిల్ ఆర్బిటర్ వాహనాలను నిర్మించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ (కెఎస్సి) నుండి 1981 నుండి 2011 వరకు ప్రయోగించిన మొత్తం 135 యాత్రల్లో అనేక ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రోబ్‌లు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ (HST) ను ప్రయోగించారు. కక్ష్యలో అనేక శాస్త్ర విజ్ఞాన ప్రయోగాలు నిర్వహించారు; అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం లోను, మరమ్మత్తుల్లోనూ ఇవి పాల్గొన్నాయి. స్పేస్ షటిల్ చేసిన యాత్రలన్నింటి మొత్తం యాత్రా సమయం 1322 రోజుల, 19 గంటల, 21 నిమిషాల 23 సెకన్లు.
(ఇంకా…)
5వ వారం
లెడ్(II) నైట్రేట్
లెడ్ (II) నైట్రేట్ ఒక అసేంద్రియ సమ్మేళనం. దీని రసాయన ఫార్ములా Pb(NO3)2. ఇది రంగులేని స్ఫటిక లేదా తెల్లని పొడి రూపంలో ఉంటుంది. ఇతర లెడ్ (II) లవణాల వలె కాకుండా ఇది నీటిలో కరుగుతుంది. ఇది మధ్య యుగం నుండి ఇది "ప్లంబ్ డల్సిస్"గా పరిచితమైన పదార్థం. దీని ఉత్పత్తిని తక్కువ స్థాయిలో లోహ లెడ్తో గానీ లేదా నత్రికామ్లం లోని లెడ్ ఆక్సైడ్ తో గానీ తయారుచేస్తారు. దీనిని ఇతర లెడ్ సమ్మేళనాల తయారీ కొరకు ఉపయోగిస్తారు. 19వ శతాబ్దంలో లెడ్ (II) నైట్రేట్ ను వాణిజ్య పరంగా యూరోప్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. చారిత్రాత్మకంగా దీని ప్రధాన ఉపయోగం, లెడ్ పెయింట్స్ కొరకు ఉపయోగించే వర్ణద్రవ్యాలను ఉత్పత్తి చేయడం. కానీ తక్కువ విషపూరితమైన లెడ్ నైట్రేట్ ఆధారిత రంగుల స్థానంలో టైటానియం ఆక్సైడ్ ద్వారా తయారుచేయబడిన రంగులు భర్తీ చేయబడినవి. ఇతర ప్రారిశ్రామిక ఉపయోగాలలో నైలాన్, పాలిస్టర్ లలో ఉష్ణ స్థిరీకరణ, ఫోటో ధర్మోగ్రాఫిక్ కాగితాలపై వాడే పూత ముఖ్యమైనవి. 2000 సంవత్సరం నుండి లెడ్ (II) నైట్రేట్ ను గోల్డ్ సైనైడేషన్ ప్రక్రియకు ఉపయోగిస్తున్నారు. లెడ్ (II) నైట్రేట్ విషపూరితమైనది, ఆక్సీకరన కారకం, ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ సంస్థచే "బహుశా మానవులకు క్యాన్సర్ కారకము"గా వర్గీకరింపబడింది.
(ఇంకా…)
6వ వారం
ఉత్తర సర్కారులు
ఉత్తర సర్కారులు అంటే స్థూలంగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నుండి ప్రకాశం జిల్లా ఉత్తర భాగం వరకూ గల ప్రాంతంతో పాటు దక్షిణ ఒడిషాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, నవరంగపూర్ ఇంకా మల్కనగిరి జిల్లాలు అని చెప్పవచ్చు. అయితే ఈ భౌగోళిక పరిధులు వివిధ కాలాల్లో వివిధ పాలకులకు అనుగుణంగా మారుతూ వచ్చాయి. తెలుగు ప్రజలుండే ఈ ప్రాంతాలు ప్రస్తుతం ఇప్పటి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఉన్నాయి. చాలా పురాతన చరిత్రకలిగిన ఆ ప్రాంతములలో ఫారసీ, ఉర్దూ మాటలు అనేకం రాజ్యపరిపాలనకి సంబంధించినవి వాడుకలోకి వచ్చాయి. ఆ మాటల్లో "సర్కార్" ఒకటి. తెలుగు నుడికారము తగిలించుకుని "సర్కారులు" అని సర్కారువారు పరిపాలించు ప్రాంతములు అయినట్టుగా చరిత్రలో కనబడుచున్నది. ఉత్తర సర్కారుల చరిత్రలో తరుచుగా వచ్చే ఇంకో మాట "సీమ". ఒక కేంద్రముతో కలిసియున్న భూభాగములని తెలుపుటకు వాడినట్లుగా కనబడుతున్నది. ఇంతేకాక. క్రీ.శ 15 వ శతాబ్దములో వచ్చిన విదేశీయ వర్తక కంపెనీ ప్రతినిధులు పోర్చుగీసు, ఫ్రెంచి, ఆంగ్ల దేశీయులు గూడా ఫారసీ-ఉర్దూ మాటలనే ఉపయోగించి ప్రభుత్వాలు నెలకొల్పి పరిపాలన సాగించారు. ఆవిధంగా అర్ధమైన సర్కారుల చరిత్రలో ఉత్తరసర్కారులు చాల ముఖ్యమైనవి. ఇవి బహుపురాతన చరిత్రాధారాలు కలిగిన తెలుగు ప్రాంతములు.
(ఇంకా…)
7వ వారం
అంటార్కిటికా
అంటార్కిటికా భూమికి అత్యంత దక్షిణ కొసన ఉన్న ఖండం. ఇక్కడే భౌగోళిక దక్షిణ ధృవం ఉంది. ఇది దక్షిణార్ధగోళం లోని అంటార్కిటిక్ ప్రాంతంలో ఉంది. అంటార్కిటిక్ వలయానికి దాదాపు పూర్తిగా దక్షిణంగా ఉంది. దక్షిణ మహాసముద్రం ఈ ఖండాన్ని పరివేష్ఠించి ఉంది. 1,42,00,000 చ.కి.మీ విస్తీర్ణంతో, ఇది ఐదవ అతిపెద్ద ఖండం. ఆస్ట్రేలియాకు దాదాపు రెండు రెట్లు ఉంటుంది. చదరపు కిలోమీటరుకు 0.00008 మంది జనాభాతో ఇది తక్కువ జనసాంద్రత కలిగిన ఖండం. అంటార్కిటికా 98% మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ మంచు సగటు మందం 1.9 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తర కొస వరకూ విస్తరించి ఉంది. అంటార్కిటికా అత్యంత శీతలంగా, అత్యంత పొడిగా, అత్యంత వేగంగా వీచే గాలులతో కూడుకుని ఉన్న ఖండం. దీని సగటు ఎత్తు అన్ని ఖండాల కంటే ఎక్కువ. అంటార్కిటికాలో ఎక్కువ భాగం ధ్రువ ఎడారి. తీరం వెంబడి వార్షిక అవపాతం 200 మి.మీ. ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇది ఇంకా చాలా తక్కువ. దాదాపు 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వర్షాలు పడలేదు. అయినప్పటికీ, ప్రపంచపు మొత్తం మంచినీటి నిల్వలలో 80% అక్కడే ఉన్నాయి. అంటార్కిటికాలో ఉన్న మంచు పూర్తిగా కరిగితే, ప్రపంచ సముద్ర మట్టాలను 60 మీటర్లు పెరుగుతాయి.
(ఇంకా…)
8వ వారం
ఆవర్తన పట్టిక
"ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసముల ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు, 7 అడ్డు వరుసలు గానూ, పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడినవి. ఈ పట్టికను నాలుగు బ్లాకులుగా విభజింపవచ్చు. వాటిలో s-బ్లాకు మూలకాలు ఎడమ వైపు, p-బ్లాకు మూలకాలు కుడి వైపున, d-బ్లాకు మూలకాలు పట్టిక మధ్య భాగం లోనూ, f-బ్లాకు మూలకాలు పట్టిక దిగువ భాగంలోనూ అమర్చబడి ఉన్నాయి. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అని, నిలువు వరుసలను గ్రూపులు అని వ్యవహరిస్తారు. ఈ గ్రూపులలో కొన్నింటికి హలోజనులు లేదా జడ వాయువులు వంటి పేర్లతో పిలుస్తారు. నిర్వచనం ప్రకారం ఆవర్తన ధర్మాలను కలిగియుండినప్పటికీ ఆ పట్టిక మూలకాల ధర్మములను, క్రొత్తగా వచ్చిన, ఇంకా కనుగొనబడని మూలకాల యొక్క ధర్మముల మధ్య సంబంధములను వివరించుటకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పట్టిక విస్తృతంగా రసాయన శాస్త్రం, ఇతర శాస్త్రాల్లో ఉపయోగిస్తారు.

పూర్వగాములు ఉన్నప్పటికీ డిమిట్రి మెండలీవ్ 1869 లో మొదటి సారి ఆవర్తన పట్టికను ప్రచురణ చేసిన వ్యక్తిగా గుర్తింబడ్డాడు.
(ఇంకా…)

9వ వారం
మిఖాయిల్ గోర్బచేవ్
మిఖాయిల్ సెర్గేయివిచ్ గోర్బచేవ్ రష్యన్ రాజకీయ నాయకుడు, మాజీ సోవియట్ యూనియన్ రాజకీయ నాయకుడు. అతను సోవియట్ యూనియన్‌కు ఎనిమిదవ, చివరి నేత. 1985 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. 1988 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ దేశాధినేతగా, 1988 నుండి 1989 వరకు సుప్రీం సోవియట్ ప్రెసీడియం ఛైర్మన్‌గా, 1989 నుండి 1990 వరకు సుప్రీం సోవియట్ ఛైర్మన్‌గా, 1990 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సైద్ధాంతికంగా, అతడు మొదట్లో మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి ఉన్నాడు, అయితే 1990 ల ప్రారంభంలో సామ్యవాద ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాడు. రష్యన్, ఉక్రేనియన్ మిశ్రమ వారసత్వానికి చెందిన గోర్బచేవ్, స్టావ్రోపోల్ క్రాయ్‌ లోని ప్రివోల్నోయేలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. జోసెఫ్ స్టాలిన్ పాలనలో పెరిగిన అతడు, యవ్వనంలో కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి ముందు కొన్నాళ్ళు సమష్టి పొలంలో హార్వెస్టర్లను నడిపాడు. అప్పట్లో మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతం ప్రకారం సోవియట్ యూనియన్‌ను ఏకపక్షంగా పరిపాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. మాస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి 1955 లో న్యాయ పట్టా పొందాడు.
(ఇంకా…)
10వ వారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం అని పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా రూపుదిద్దుకుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సోవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం, వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరిస్తారు. ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. షికాగోలో 1908 మే 3, న్యూయార్క్ లో 1909 ఫిభ్రవరి 28న జరిగాయి. 1910 ఫిభ్రవరి 27 రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది.
(ఇంకా…)

11వ వారం
ఆర్డిపిథెకస్
ఆర్డిపిథెకస్ హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి. ఇది అంత్య మయోసీన్‌లోను, తొలి ప్లియోసీన్ లోనూ ఇథియోపియా లోని అఫార్ ప్రాంతంలో జీవించింది. చింపాంజీల నుండి మానవులు వేరుపడిన తరువాత, వారి తొట్టతొలి పూర్వీకులలో ఒకటిగా దీన్ని భావించారు. ఈ ప్రజాతికి మానవ పూర్వీకులతో ఉన్న సంబంధం ఏమిటి, ఇది హోమినిన్నేనా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ ప్రజాతికి చెందిన రెండు శిలాజ జాతులను - 44 లక్షల సంవత్సరాల క్రితం తొలి ప్లయోసీన్‌లో నివసించిన ఆర్డిపిథెకస్ రామిడస్, సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన ఆర్డిపిథెకస్ కడబ్బా (అంత్య మయోసీన్లో) లను - శాస్త్ర సాహిత్యంలో వివరించారు. ప్రవర్తనా విశ్లేషణను బట్టి ఆర్డిపిథెకస్‌కు చింపాంజీలతో చాలా దగ్గరి పోలికలున్నాయి. తొలి కాలపు మానవ పూర్వీకులు, ప్రవర్తనలో చింపాంజీలా ఉండేవారని ఇది సూచిస్తుంది. ఎ. రామిడస్ కు1994 సెప్టెంబరులో ఈ పేరు పెట్టారు. రెండు అగ్నిపర్వత లావా పొరల మధ్య దొరకడం వలన వాటి కాలనిర్ణయం ఆధారంగా మొదటి శిలాజం 44 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. ఆర్డిపిథెకస్ రామిడస్ అనే పేరు అఫర్ భాష నుండి వచ్చింది, దీనిలో ఆర్డి అంటే "నేల" అని రామిడ్ అంటే "వేరు" అని అర్థం. పిథెకస్ అంటే గ్రీకు భాషలో "కోతి" అని అర్థం.
(ఇంకా…)
12వ వారం
జల వనరులు
జల వనరులు అంటే జీవజాలానికి ఉపయోగపడగల నీటి సహజ వనరులు. నీటి ఉపయోగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ, వినోద, పర్యావరణ కార్యకలాపాలు ఉన్నాయి. అన్ని జీవులకు పెరగడానికి, పునరుత్పత్తికీ నీరు ఆవశ్యకం. భూమిపై 97% నీరు ఉప్పు నీరే. మూడు శాతం మాత్రమే మంచినీరు; ఇందులో మూడింట రెండు వంతులు హిమానీనదాల్లోను, ధ్రువాల వద్ద ఉన్న ఐసు దుప్పట్లలోనూ ఘనీభవించి ఉంది. మిగిలిన మంచినీరు ప్రధానంగా భూగర్భజలం రూపంలో ఉంది. భూమి పైన, గాలిలోనూ కొద్ది భాగం మాత్రమే ఉంది. మంచినీరు పునరుత్పాదక వనరే అయినప్పటికీ ప్రపంచంలోని భూగర్భజలం క్రమంగా తగ్గుతోంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలలో ఈ క్షీణత చాలా ఎక్కువగా జరుగుతోంది. అయితే, వినియోగమైన జలంలో ఎంత మేరకు సహజంగా పునరుద్ధరణ జరుగుతోంది, పర్యావరణ వ్యవస్థలు ముప్పుకు గురౌతున్నాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. నీటి వినియోగదారులకు నీటి వనరులను కేటాయించే ఫ్రేమ్‌వర్కును (అటువంటి ఫ్రేమ్‌వర్క్ ఉన్న చోట) నీటి హక్కులు అంటారు.
(ఇంకా…)
13వ వారం
బాలాంత్రపు రజనీకాంతరావు
బాలాంత్రపు రజనీకాంతరావు వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన అవర్ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం తర్వాత, రజనీకాంతరావు రచించి స్వరపరిచిన మాదీ స్వతంత్రదేశం అనే గీతాన్ని ఆకాశవాణి ప్రసారం చేసింది. అతడు రచించి స్వరపరిచిన "కొండ నుండి కడలి దాకా" రూపకానికి జపాన్ వారి "నిప్పాన్ హోసో క్యొకాయ్" బహుమతి లభించింది. ఆకాశవాణిలో ఉషశ్రీతో ధర్మసందేహాలు కార్యక్రమాన్ని ప్రారంభించింది రజనీయే. తన సంగీతంలో లిరిసిజానికి కారణం రజనీ ప్రభావమేనని మంగళంపల్లి బాలమురళీకృష్ణ అన్నాడు.
(ఇంకా…)
14వ వారం
ఉప్పు సత్యాగ్రహం
భారతదేశంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా, మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెసు జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అనీ, దండి యాత్ర అనీ, దండి మార్చ్ అనీ కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ, 1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, వేలమంది సత్యాగ్రహులతో కలిసి 384 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి గుజరాత్ తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. ముప్పై సంవత్సరాల తరువాత, ఈ సత్యాగ్రహ ఆయుధం, ఈ దండి యాత్ర అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పైన, నల్లజాతీయుల పౌరహక్కుల కోసం ఆయన చేసిన పోరాటం పైనా బలమైన ప్రభావాన్ని చూపాయి.
(ఇంకా…)
15వ వారం
కస్తూరిబాయి గాంధీ
కస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త. ఆమె మహాత్మా గాంధీ కి భార్య. తన భర్త, కుమారునితో పాటు ఆమె భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమెను తన భర్త మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ప్రభావితం చేసాడు. ఆమె మహాత్మా గాంధీ భార్యగా 62 సంవత్సరాల పాటు అతనితో కలసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని నిర్భంధాలను కలిసి ఎదుర్కొన్నది. ఆమె గుజరాత్ రాష్ట్రం కాఠియావాడ్ ద్వీపకల్పంలోని పోర్‌బందర్‌లో సంపన్న మోద్ బనియా వైశ్య వర్ణానికి చెందిన కుటుంబంలో 1869 ఏప్రిల్ 11న జన్మించింది. ఆమె తల్లి వ్రజకున్పర్‌బా కపాడియా, తండ్రి గోకుల్ దాస్ మాకన్‌జీ కపాడియా. కస్తూరిబా పూర్తిపేరు "కస్తూర్ గోకుల్ దాస్ మాకన్‌జీ కపాడియా". గోకుల్ దాస్ అనేది తండ్రి పేరు. మాకన్‌జీ అనేది తాత పేరు. కపాడియా అనేది వారి ఇంటి పేరు. ఆడపిల్లలు చదువుకోవడం, మగ పిల్లలతో కలసి ఆడుకోవడం పోర్‌బందరు బనియాలలో చాలా దోషం. అంతే కాదు ఏడేళ్ళు దాటగానే పెళ్ళి చేయడం సంప్రదాయం. అందువల్ల ఆమె అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యురాలిలానే పెరిగింది.
(ఇంకా…)
16వ వారం
పరమాణు సిద్ధాంతం
భౌతిక రసాయనిక శాస్త్రాల్లో పరమాణు సిద్ధాంతం అంటే పదార్థం లక్షణాల్ని వివరించే ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పదార్థాలన్నీ విభజించడానికి వీలు కాని పరమాణువులతో (Atoms) కూడుకొని ఉంటాయి. ఇది పురాతన గ్రీసు దేశంలో తత్వ శాస్త్ర భావనగా మొదలై 19 వ శతాబ్దం మొదట్లో శాస్త్రీయ పరిశోధనా పరిధిలోకి వచ్చింది.

20 వ శతాబ్దం మొదట్లో విద్యుదయస్కాంతత్వం, రేడియో ధార్మికత మొదలైన వాటిమీద పరిశోధనలు చేస్తూ, అసలు విభజించడానికి వీలులేని పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు. కానీ వీటిలో కూడా ఎలక్ట్రాన్లు, న్యూట్రానులు, ప్రోటానులు అనే కణాలు కలగలిసిపోయి ఉంటాయని కూడా నిరూపించారు.

పరమాణువు ఆకృతి ఎలా ఉంటుందనే విషయమై థామ్సన్ ప్లమ్ పుడ్డింగ్ నమూనా, రూదర్‌ఫోర్డ్ నమూనా, బోర్ నమూనా, క్వాంటమ్‌ నమూనా వంటి వివిధ సిద్ధాంతాలు వచ్చాయి.
(ఇంకా…)

17వ వారం
గ్లోబల్ వార్మింగ్
గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితి మార్పు అనే మాటలను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూంటారు. కానీ, ఖచ్చితంగా చెప్పాలంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానంగా మానవుల వలన ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అది కొనసాగడం. శీతోష్ణస్థితిలో మార్పు అంటే గ్లోబల్ వార్మింగ్‌తో పాటు, దాని వలన అవపాతంలో (వర్షం, మంచు కురవడం వంటివి) ఏర్పడే మార్పులు కూడా చేరి ఉంటాయి.

గ్లోబల్ వార్మింగ్ వలన పంటల దిగుబడి తగ్గుతుంది, ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. సముద్ర మట్టాలు పెరగడంతో తీరప్రాంత మౌలిక సదుపాయాలు మునిగిపోతాయి. అనేక సముద్ర తీర నగరాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. పర్యావరణ వ్యవస్థలు మారిపోవడంతో అనేక జాతుల జీవులు అంతరించిపోవడం లేదా వలసపోవడం జరుగుతుంది. ఉద్గారాలను తగ్గిస్తామంటూ వివిధ దేశాలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలు భవిష్యత్తులో పెరిగే తాపాన్ని నియంత్రించడానికి సరిపోవు.
(ఇంకా…)

18వ వారం
వేబ్యాక్ మెషీన్
వేబ్యాక్ మెషీన్ అనేది వరల్డ్ వైడ్ వెబ్ ను ఆర్కైవు చేసే భాండాగారం. ఇది అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న లాభాపేక్షలేని సంస్థ. దీన్ని ఇంటర్నెట్ ఆర్కైవ్ సంస్థ స్థాపించింది. ఇది వినియోగదారులను వారి “పాత జ్ఞాపకాలకు తిరిగి” తీసుకు వెళ్తుంది. ఆయా వెబ్‌సైట్‌లు గతంలో ఎలా ఉండేవో చూడటానికీ వీలు కల్పిస్తుంది. దాని వ్యవస్థాపకులు బ్రూస్టర్ కహ్లే, బ్రూస్ గిలియట్. ఆన్‌లైన్లో లేని వెబ్‌పేజీల కాపీలను భద్రపరచడం ద్వారా "విజ్ఞానం యావత్తునూ సార్వత్రికంగా అందుబాటులో" ఉంచాలనే ఉద్దేశంతో వేబ్యాక్ యంత్రాన్ని అభివృద్ధి చేశారు.

2001 లో మొదలైనప్పటి నుండి, ఇది 452 బిలియన్లకు పైగా పేజీలను ఆర్కైవుకు చేర్చింది. వెబ్‌సైటు స్వంతదారు అనుమతి లేకుండా ఆర్కైవు పేజీలను తయారు చెయ్యటం కాపీహక్కుల ఉల్లంఘన అవుతుందా లేదా అనే విషయమై కొన్ని చోట్ల వివాదం తలెత్తింది.
(ఇంకా…)

19వ వారం
దక్షిణ భారతదేశం
దక్షిణ భారతదేశం భారత ద్వీపకల్పంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రాంతం. దీనికి సంస్కృత పదం దక్షిణం నుండి డెక్కన్ అనే పేరు కూడా వచ్చింది. దీనికి ఉత్తరాన నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలున్నాయి.

తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య గల దక్కన్ పీఠభూమితో దక్షిణ భారతదేశం భౌగోళికంగా కూడా వైవిధ్యమైనది. తుంగభద్ర, కావేరి, కృష్ణ, గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసల, విజయనగర రాజులు మొదలైన రాజులు పరిపాలించారు. ఈ రాజవంశాలలో కొన్ని శ్రీలంక, శ్రీవిజయలను జయించడం వలన ఇప్పటికీ వారి జీవన విధానాలలో దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం కనిపిస్తుంది.
(ఇంకా…)

20వ వారం
రక్తం
రక్తం మానవులు, ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను, ఆక్సిజన్‌నూ సరఫరా చేసే ద్రవం. అలాగే, జీవక్రియలో భాగంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది. దీన్ని నెత్తురు అని కూడా అంటారు. జీవి మనుగడకి రక్తం అత్యవసరం. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హీమటాలజీ' (Hematology) అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న పూర్వపదం ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది. రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న రక్తచందురం అనే ప్రాణ్యం (ప్రోటీన్). ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్‌ అంటారు.
(ఇంకా…)
21వ వారం
ఘట్టమనేని కృష్ణ
ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో పద్మాలయా పేరుతో సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జాన్రాలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
(ఇంకా…)

22వ వారం
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సినిమా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగాను, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలూ అందుకున్నాడు. కమల్ హాసన్, రజనీకాంత్ ల నుండి నగేష్, రఘువరన్ ల దాకా ఎంతోమంది నటులకు గాత్రదానం చేసిన డబ్బింగు కళాకారుడు బాలు.పాడుతా తీయగా వంటి సూపర్‌హిట్ టెలివిజన్ కార్యక్రమాలకు ఆద్యుడతడు. కోవిడ్ వ్యాధి కారణంగా భారతదేశం కోల్పోయిన సుప్రసిద్ధులలో ఒకడాయన.
(ఇంకా…)
23వ వారం
సుందర్‌లాల్‌ బహుగుణ
సుందర్‌లాల్ బహుగుణ (1927 జనవరి 9 - 2021 మే 21) గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమ ఆలోచన అతని భార్యకు వచ్చింది. దీనిని అతను కార్యరూపంలో చేపట్టాడు. హిమాలయాలలో అడవుల సంరక్షణ కోసం పోరాడాడు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు తెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతను భారతదేశ ప్రారంభ పర్యావరణవేత్తలలో ఒకడు. తరువాత అతను చిప్కో ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రజలతో కలసి పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా పర్యావరణ సమస్యలపై ఉద్యమాలను చేపట్టడం ప్రారంభించాడు. వృక్షాల కోసమే కాకుండా, అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కూడా పరితపించాడాయన.
(ఇంకా…)
24వ వారం
అంతర్జాతీయ ద్రవ్య నిధి
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వాషింగ్టన్ DC లో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. ఇందులో 189 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధినీ, స్థిరమైన ఆర్థిక వృద్ధినీ ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికీ కృషి చేస్తుంది. దాని వనరుల కోసం ఇది ప్రపంచ బ్యాంకుపై ఆధారపడుతుంది.

1944 లో అమెరికాలో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో, ప్రధానంగా హ్యారీ డెక్స్టర్ వైట్, జాన్ మేనార్డ్ కీన్స్ ల ఆలోచనల నుండి ఇది రూపుదిద్దుకుంది. 1945 లో 29 సభ్య దేశాలతో, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో అధికారికంగా ఉనికి లోకి వచ్చింది. చెల్లింపుల సంక్షోభాలు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నిర్వహణలో ఇది ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. సంస్థలో సభ్యత్వం ఉన్న దేశాలు కోటా విధానం ద్వారా ఒక సంచయానికి నిధులు చేకూరుస్తాయి. చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు ఈ సంచయం నుండి డబ్బు తీసుకుంటాయి. 2016 నాటికి, ఫండ్‌లో 477 బిలియన్ల ఎక్స్‌డిఆర్ (సుమారు $ 667 బిలియన్) లున్నాయి
(ఇంకా…)

25వ వారం
బ్రహ్మోస్
బ్రహ్మోస్, మధ్య పరిధి గల, ర్యామ్‌జెట్ ఇంజనుతో పనిచేసే, సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి), ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. భారత్‌కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, రష్యాకు చెందిన NPO మషినోస్ట్రోయేనియాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్‌లో ఈ క్షిపణిని తయారు చేస్తోంది. రష్యా క్రూయిజ్ క్షిపణి P-800 ఓనిక్స్ సాంకేతికతపై ఆధారపడి ఈ క్షిపణిని తయారు చేసారు. భారత దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యా లోని మోస్క్వా నది - ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడినదే బ్రహ్మోస్. హిందూ పురాణాల్లోని బ్రహ్మాస్త్రం ను ఈ పేరు ధ్వనింప జేస్తుంది.

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న నౌకా విధ్వంసక క్షిపణు లన్నిటిలోకీ బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైనది. ఈ క్షిపణి మ్యాక్ 2.8 - 3.0 వేగంతో ప్రయాణిస్తుంది.
(ఇంకా…)

26వ వారం
కె.వి.రెడ్డి
కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబరు 15) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.

కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగాడు. చిన్నతనంలో అతని అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు. చదువూ చక్కగానే చదివేవాడు. తర్వాతి కాలంలో తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణస్వామితో తాడిపత్రి లోనే కలిసి చదువుకున్నాడు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కె.వి. అక్కడే మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించాడు.
(ఇంకా…)

27వ వారం
పి.వి. సింధు
పూసర్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ కీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. 2013 ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. 2012 ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించిన సైనా నెహ్వాల్ తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
(ఇంకా…)

28వ వారం
రిషి వ్యాలీ పాఠశాల
రిషి వ్యాలీ పాఠశాల జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన భారతీయ ఆశ్రమ పాఠశాల. ఇది ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మదనపల్లె సమీపంలో ఉంది. ఇక్కడి విద్యా విధానం కృష్ణమూర్తి బోధనా దృక్కోణం ఆధారపడి ఉంది. సమాజ సేవ, పాఠ్యేతర కార్యకలాపాలు, చర్చలు, సమావేశాలు, ప్రత్యేక ఆసక్తులపై సమావేశాలూ విద్యార్థుల పాఠశాల విద్యలో భాగం. ఈ పాఠశాల బహుళశ్రేణి బోధన పద్ధతిని ఆవిష్కరించింది. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా, ప్రపంచంలో చాలా చోట్ల ఆదరణ పొందింది.

ఈ ఆశ్రమ పాఠశాల రిషి లోయలో 375 ఎకరాల విస్తీర్ణంలో, కొండలు, చిన్న గ్రామాల మధ్యలో ఉన్నది. కొండవాలు (ఆంగ్లంలో 'వ్యాలీ') ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడ ఋషులు నివసించేవారనే జానపద కథనాలున్నందునా ఈ ప్రాంతానికి "ఋషివ్యాలీ" లేదా రిషి వ్యాలి అనేపేరు వచ్చింది. హార్సిలీ హిల్స్ నుండి, ఈ లోయ ప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. ఇది మదనపల్లె పట్టణానికి 16 కి.మీ. దూరంలో, మదనపల్లె - కదిరి మార్గంలో ఉంది. ప్రధాన రహదారి నుండి, 5 కి.మీ. లోతట్టున ఈ పాఠశాల ఉంది. తిరుపతి నుండి రెండు గంటలు, బెంగుళూరు నుండి రెండున్నర గంటలు, చెన్నై నుండి ఐదు గంటల ప్రయాణంతో ఈ పాఠశాలను చేరవచ్చు.
(ఇంకా…)

29వ వారం
మైకేల్ ఫారడే
మైఖేల్ ఫారడే FRS (1791 సెప్టెంబరు 22 - 1867 ఆగస్టు 25) విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం అధ్యయనానికి కృషి చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త . అతని ప్రధాన ఆవిష్కరణలలో విద్యుదయస్కాంత ప్రేరణ, డయామాగ్నెటిజం, విద్యుద్విశ్లేషణ వంటి అంతర్లీన సూత్రాలు ఉన్నాయి.

ఫారడే పెద్దగా చదువుకోనప్పటికీ, చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలలో ఒకనిగా నిలిచాడు. ఏకముఖ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న విద్యుత్ వాహకం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంపై చేసిన పరిశోధనల ద్వారా భౌతిక శాస్త్రంలో విద్యుదయస్కాంత క్షేత్రం అనే భావనకు ఆధారాన్ని స్థాపించాడు. అయస్కాంతత్వం కాంతి కిరణాలను ప్రభావితం చేస్తుందని, ఆ రెండు దృగ్విషయాల మధ్య అంతర్లీన సంబంధం ఉందనీ ఫారడే నిరూపించాడు. విద్యుదయస్కాంత ప్రేరణ, డయా అయస్కాంత సూత్రాలను, విద్యుద్విశ్లేషణ నియమాలను కనుగొన్నాడు. అతడు చేసిన విద్యుదయస్కాంత రోటరీ పరికరాల ఆవిష్కరణలు విద్యుత్ మోటారు సాంకేతికతకు పునాది వేశాయి.

రసాయన శాస్త్రవేత్తగా ఫారడే, బెంజీన్‌ను కనుగొన్నాడు. క్లోరిన్ యొక్క క్లాథ్రేట్ హైడ్రేట్‌ను పరిశోధించాడు, బున్సెన్ బర్నర్ ప్రారంభ రూపాన్ని, ఆక్సీకరణ సంఖ్యల వ్యవస్థనూ కనుగొన్నాడు. "యానోడ్ ", "కాథోడ్ ", "ఎలక్ట్రోడ్" , "అయాన్" వంటి ప్రాచుర్యం పొందిన పరిభాషను కనుగొన్నాడు. ఫారడే రాయల్ ఇన్‌స్టిట్యూషన్‌లో రసాయన శాస్త్ర మొట్టమొదటి ఫుల్లెరియన్ ప్రొఫెసర్ అయ్యాడు.
(ఇంకా…)

30వ వారం
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 - 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబిదీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతన్ని అభ్యర్థిగా ప్రతిపాదించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచాడు. కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు.
(ఇంకా…)

31వ వారం
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకడు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, అతని మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించాడు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. అతని వద్ద శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలోను, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందాడు.అతనికి కుటుంబ పరంగా కొంతవరకు కవి, పండిత నేపథ్యం ఉంది. కడియద్దలో చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద వ్యాకరణం, ఆపైన కాశీలో పలువురు పండితుల వద్ద వ్యాకరణ, తర్క శాస్త్రాలు, వేద భాగం, సంస్కృత కావ్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం వంటివి అధ్యయనం చేశాడు. కాశీ నుంచి తిరిగి చర్ల బ్రహ్మయ్యశాస్త్రి శిష్యరికానికి వచ్చిన తర్వాత చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధానాలు చేయడానికి సంకల్పించాడు. బ్రహ్మయ్యశాస్త్రికి తన శిష్యుల్లో మరొకడైన దివాకర్ల తిరుపతిశాస్త్రిని జోడీగా స్వీకరించమని వేంకటశాస్త్రికి సూచించడంతో 1891లో కాకినాడలో జంటగా వారిద్దరి తొలి శతావధానం జరిగింది. తిరుపతి వేంకట కవులన్న పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలను ప్రదర్శించడంతో పాటు, యుక్తితో ఉద్ధండులైన పండితులను గెలిచి విజయవంతంగా అవధానం ముగించారు.
(ఇంకా…)
32వ వారం
గ్రంథచౌర్యం
వేరొక కర్త భాష, ఆలోచనలు, భావాలు లేదా వ్యక్తీకరణలను తమ స్వంత రచనగా సూచించడాన్ని గ్రంథచౌర్యం అంటారు. ఈ చర్యలను ఆంగ్లంలో ప్లేజియరిజం అని పేర్కొంటారు. శబ్ధకోష్ ఆంగ్ల-తెలుగు భాషా నిఘంటువు ప్లేజియరిజం అనే పదానికి కావ్యచోరత్వము, పదచోరత్వము, భావచౌర్యము, గ్రంథచౌర్యం అను అర్థాలున్నాయి. గ్రంథచౌర్యం అనేమాట గ్రంథాన్ని చౌర్యం చేయడమని అర్థం సూచిస్తున్నా, ప్లేజియరిజం పదం వలె ఈ పదాన్ని కూడా విస్తృతమైన పరిథిలో ఉపయోగిస్తారు. చలనచిత్రాలు, కథలు, పాటలు, స్వర రచనలు, కళాఖండాలు, మందుల సూత్రాలు నకలు చేయడము, ఇంకా పరిశోధనా వ్యాసాలు/సిద్ధాంత గ్రంథాలు పరిశోధనా ఫలితాల పూర్తిగా కానీ, కొంత భాగం కానీ చౌర్యం చేయడాన్ని గ్రంథచౌర్యంగా పరిగణిస్తారు. ఈ రకమైన చౌర్య కార్యకలాపాలు రచయితలు, కళాకారులు, పరిశోధకులకు నష్టం కలిగిస్తాయి.

హె.ఎం. పాల్, సాహిత్యంలో మూడు రకాల చౌర్యచర్యలను గమనించాడు- అబద్ధపు ప్రతులను సృష్టించటం (ఫోర్జరీ); బందిపోటుతనం; మూడవది గ్రంథచౌర్యం. ఈ చర్యలను కొందరు కీర్తికోసం, మరికొందరు ధనాశతోటీ చేస్తారని పేర్కొన్నాడు.
(ఇంకా…)

33వ వారం
టంగుటూరి అంజయ్య
టంగుటూరి అంజయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రి. అతను 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. టి. అంజయ్యగా సుపరిచితుడైన టంగుటూరి అంజయ్య అలియాస్ రామకృష్ణారెడ్డి తాళ్ళ 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లా, భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తరువాత ఉన్నత విద్యాభాసం చేయలేదు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల (24 పైసలు) కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీ కి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభ కు ఎన్నికైనాడు. 1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రి గా నియమించింది. అతను మర్రి చెన్నారెడ్డి తరువాత 1980 అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించాడు.
(ఇంకా…)
34వ వారం
చిరంజీవి
చిరంజీవి (జ. 1955 ఆగస్టు 22) తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)గా పనిచేశాడు. సినిమాల్లో తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించాడు. వీటిలో సింహభాగం తెలుగు సినిమాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ సినిమాలు. 39 ఏళ్ళకు పైబడ్డ సినిమా కెరీర్లో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య అవార్డు, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి సినీ రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.
(ఇంకా…)
35వ వారం
మహాభాగవతం

మహాభాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.

ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని 21 అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథం. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది.
(ఇంకా…)

36వ వారం
నాగార్జునసాగర్

నాగార్జున సాగర్ తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కృష్ణానదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణానదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ ప్రదర్శనశాలలో భద్ర పరచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలున్నాయి.
(ఇంకా…)

37వ వారం
టేబుల్ టెన్నిస్

టేబుల్ టెన్నిస్ ఒక అంతర్జాతీయ ఆట. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న తేలికపాటి బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక వల (నెట్) ఉంటుంది. ప్రారంభ సర్వీసు మినహా, నియమాలు సాధారణంగా ఈ క్రింది విధంగా ఉంటాయి: ఆటగాళ్ళు తమ వైపు వచ్చిన బంతిని తమ వైపు టేబుల్ మీద ఒక సారి బౌన్సయ్యేవరకు ఆగాలి, తర్వాత బంతి కనీసం ఒక్కసారైనా ప్రత్యర్థి వైపు బౌన్సయ్యేలా తిరిగి కొట్టాలి. నిబంధనల ప్రకారం బంతిని తిరిగి కొట్టడంలో ఆటగాడు విఫలమైనప్పుడు ఒక పాయింట్ కోల్పోతాడు. దీన్ని పింగ్-పాంగ్ అని కూడా అంటారు.

టేబుల్ టెన్నిస్‌ను 1926 లో స్థాపించిన ప్రపంచవ్యాప్త సంస్థ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటిటిఎఫ్) నిర్వహిస్తుంది. ఐటిటిఎఫ్‌లో ప్రస్తుతం 226 సభ్య సంఘాలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ అధికారిక నియమాలను ఐటిటిఎఫ్ హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్నారు. టేబుల్ టెన్నిస్ 1988 నుండి ఒలింపిక్ క్రీడగా ఉంది. 1988 నుండి 2004 వరకు ఇవి పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ పోటీలు ఉండేవి. 2008 నుండి, డబుల్సుకు బదులుగా జట్ల పోటీని ప్రవేశపెట్టారు.
(ఇంకా…)

38వ వారం
క్రియా యోగం

క్రియాయోగం, ఒక ప్రాచీన యోగ శాస్త్రం. ఇది ఇటీవల కాలంలో మహాయోగి మహావతార్ బాబాజీ శిష్యుడు లాహిరి మహాశయుల ద్వారా పునరుద్ధరింపబడి, పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చింది. యోగానంద సూచనల ద్వారా 1920 నుండి పాశ్చాత్య దేశాల్లో కూడా దీని సాధన మొదలైంది. పరమహంస యోగానంద తన ఆత్మకథలో, యోగవిద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన పతంజలి క్రియా యోగాన్ని పేర్కొంటూ "ఉచ్ఛ్వాశ నిశ్శ్వాసల గతిని విచ్ఛేదించడం ద్వారా జరిగే ప్రాణాయామంతో ముక్తిని సాధించవచ్చు" అని వ్రాశాడు. అలాగే ఇది "మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ప్రాణవాయువుతో నింపే ఒక మానసిక - శారీరక ప్రక్రియ" అని పేర్కొన్నాడు. క్రియా యోగశాస్త్రంలో ఆధ్యాత్మిక పురోగతిని త్వరితగతిని పొందేందుకు, భగవదనుభవం పొందేందుకు అనేక స్థాయిల్లో ప్రాణాయామం, మంత్రం, ముద్ర, ధ్యానం మొదలైన పద్ధతులు ఉన్నాయి. యోగానందకు ఈ విద్య గురు-శిష్య పరంపరాగతంగా శ్రీయుక్తేశ్వర్ గిరి, లాహిరి మహాశయులు, మహావతార్ బాబాజీ నుండి సంక్రమించింది.
(ఇంకా…)

39వ వారం
పాపం పసివాడు

పాపం పసివాడు వి. రామచంద్రరావు దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం. ఇందులో ఎస్. వి. రంగారావు, దేవిక, మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అట్లూరి శేషగిరిరావు శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు గొల్లపూడి మారుతీరావు అందించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం దర్శకత్వం వహించాడు. అమ్మా చూడాలీ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఎం. కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. బాలు ఎడిటర్ గా పనిచేశాడు.

1969లో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం. విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.

ఈ చిత్ర నిర్మాత ముందు సినిమా మోసగాళ్ళకు మోసగాడు ఎడారి నేపథ్యంలో తీశాడు. మరో సినిమా అదే వాతావరణంలో తీయాలనుకుని గొల్లపూడి మారుతీరావు చేత లాస్ట్ ఇన్ ది డెసెర్ట్ అనుసరించి కథను తయారు చేయించుకున్నాడు. 1972 మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం సుమారు 27 రోజులపాటు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టరు ద్వారా కరపత్రాలు పంచి పెట్టారు. ఈ చిత్రం వ్యాపారాత్మకంగా విజయం సాధించింది.
(ఇంకా…)

40వ వారం
అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన

పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన అట్లాంటిక్ విమానాన్ని భారత వాయుసేన విమానాలు కూల్చివేసిన ఘటనే అట్లాంటిక్ విమానం కూల్చివేత ఘటన. 1999 ఆగస్టు 10 న 16 మంది ప్రయాణీకులతో కూడిన పాకిస్తాన్ వాయుసేనకు చెందిన బ్రెగెట్ అట్లాంటిక్ గస్తీ విమానం భారత గగనతలాన్ని అతిక్రమించగా, భారత వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానాలు దాన్ని కూల్చివేసాయి. కార్గిల్ యుద్ధం ముగిసిన నెలలోపే జరిగిన ఈ సంఘటన అప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రెండు దేశాల సంబంధాలను మరింత తీవ్రతరం చేసాయి.

పాకిస్తాన్ సైన్యం, తమ దేశంలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలను సంఘటన స్థలానికి తీసుకువెళ్ళి చూపించింది. ఆ విమానం సరిహద్దును అతిక్రమించి ఉండొచ్చని దౌత్యవేత్తలు భావించారు. భారత ప్రతిచర్య సమర్థనీయం కాదని కూడా వాళ్ళు భావించారు. తరువాత పాకిస్తాన్ ఈ సంఘటనను అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకువెళ్ళి, భారత్ నుండి నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఈ కేసును విచారించే అధికార పరిధి తమకు లేదని చెబుతూ కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
(ఇంకా…)

41వ వారం
పడమటి కనుమలు

పడమటి కనుమలు భారతదేశపు పశ్చిమ తీరానికి సమాంతరంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. వీటినే సహ్యాద్రి పర్వతశ్రేణులు అని కూడా పిలుస్తారు. 1,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ పర్వత శ్రేణి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. జీవ వైవిధ్యానికి సంబంధించి, ప్రపంచంలోని ఎనిమిది ప్రధానకేంద్రాల్లో ఇది ఒకటి. దేశంలోని వృక్షజాలం, జంతుజాలాల్లో చాలా భాగం ఇక్కడ ఉంది. వీటిలో చాలా జాతులు భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. యునెస్కో అంచనాల ప్రకారం, పడమటి కనుమలు హిమాలయాల కంటే పాతవి. వేసవి చివరలో నైరుతి దిశలో వచ్చే వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాలను అడ్డగించడం ద్వారా ఇవి భారతీయ రుతుపవన వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి. పడమటి కనుమల్లో 7,402 జాతుల పుష్పించే మొక్కలు, 1,814 జాతుల పుష్పించని మొక్కలు, 139 క్షీరద జాతులు, 508 పక్షి జాతులు, 179 ఉభయచర జాతులు, 6,000 కీటకాలు, 290 మంచినీటి చేప జాతులూ ఉన్నాయి. ఇప్పటి వరకూ కనుగొనని అనేక జాతులు పడమటి కనుమలలో ఉండవచ్చని భావిస్తున్నారు. పడమటి కనుమలలో కనీసం 325 అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి.
(ఇంకా…)

42వ వారం
జవహర్ నవోదయ విద్యాలయం

జవహర్ నవోదయ విద్యాలయాలు (సంక్షిప్తంగా జె ఎన్ వి లు) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రధానంగా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్రప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల వ్యవస్థ. పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం కిందికి వచ్చే స్వతంత్ర సంస్థ నవోదయ విద్యాలయ సమితి ఈ పాఠశాలలను నడుపుతుంది. జేఎన్వీలు పూర్తిగా వసతి మరియు సహ-విద్యా పాఠశాలలు, ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుసంధానంతో, ఆరవ తరగతి నుండి 12 వ తరగతి (ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలను 11, 12 తరగతులంటారు) వరకు చదువు చెప్తారు.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను కనుగొనడం, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థతో సమానమైన విద్యను అందించడం జేఎన్వీలకు ప్రత్యేకంగా అప్పగించబడింది. జేఎన్వీలలో విద్య, వసతి మరియు కార్యకలాపాల కోసం నిధులు భారత ప్రభుత్వ విద్యా శాఖ అందిస్తుంది. ఇక్కడ విద్యార్థులు 7 సంవత్సరాల పాటు ఉచితంగా ఉండవచ్చు.

జేఎన్వీలు తమిళనాడు రాష్ట్రం మినహా భారతదేశమంతటా ఉన్నాయి. 30 సెప్టెంబర్ 2019 నాటికి, 636 జేఎన్వీలు 265,574 మంది విద్యార్థులతో నమోదు చేయబడ్డాయి, అందులో 206,728 (~ 78%) గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులున్నారు. 2019 లో జేఎన్వీలు 10 వ మరియు 12 వ తరగతుల్లో వరుసగా 98.57% మరియు 96.62% ఉత్తీర్ణతతో సిబిఎస్సి పాఠశాలల్లో అగ్రస్థానంలో నిలిచాయి.
(ఇంకా…)

43వ వారం
హోమీ జహంగీర్ భాభా
హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1966 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, వ్యవస్థాపక డైరక్టరు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. అతనిని "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు. అతను భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే కు వ్యవస్థాపక డైరెక్టర్‌. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న "టి.ఐ.ఎఫ్.ఆర్", "ఏ.ఇ.ఇ.టి" అణ్వాయుధాల సంస్థలకు అతను డైరెక్టర్‌గా పర్యవేక్షించాడు. అతనికి ఆడమ్స్ ప్రైజ్ (1942), పద్మభూషణ (1954) పురస్కారాలు లభించాయి. 1951, 1953 –1956లలో అతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు. యురేనియం నిల్వల కంటే దేశంలోని విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత ఆయనకు ఉంది. ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి భాభా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంగా మారింది. 1966 జనవరి 24 న మోంట్ బ్లాంక్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 కూలిపోవడంతో హోమి జె. భాభా మరణించాడు.
(ఇంకా…)
44వ వారం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. 162,970 కి.మీ2 (62,920 చ. మై.) విస్తీర్ణంతో ఇది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. 49,386,799 మంది నివాసితులతో పదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. దీనికి వాయువ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. భారతదేశంలో గుజరాత్ తరువాత 974 కి.మీ. (605 మై.) తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది. 1953 అక్టోబర్ 1న భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు భారతదేశంలో ఒక ప్రధాన బౌద్ధ తీర్థయాత్ర, బౌద్ధ అభ్యాస కేంద్రంగా ఉంది. దీనికి గుర్తుగా రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో శిధిలాలు, చైత్యాలు, స్థూపాల రూపాలున్నాయి. ప్రఖ్యాత వజ్రం కోహినూర్, అనేక ఇతర ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలు రాష్ట్రంలో ని కొల్లూరు గనిలో లభించాయి. రాష్ట్రంలో బియ్యం ప్రధాన ఉత్పత్తికావున దీనిని "రైస్ బౌల్ ఆఫ్ ఇండియా" అని కూడా పిలుస్తారు. భారతదేశ శాస్త్రీయ భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష. ఇది అత్యధికంగా మాట్లాడే భాషలలో భారతదేశంలో నాలుగవ స్థానంలో, ప్రపంచంలో పదకొండవ స్థానంలో వుంది. క్రీ.పూ 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ ప్రకారం, ఆంధ్రుల చరిత్ర వేదకాలంతో మొదలవుతుంది. ఆంధ్రులు ఉత్తర భారతదేశం లో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియవస్తుంది.
(ఇంకా…)
45వ వారం
పరమహంస యోగానంద

పరమహంస యోగానంద (జన్మనామం: ముకుంద లాల్ ఘోష్ 1893 జనవరి 5 – 1952 మార్చి 7) ఒక భారతీయ సన్యాసి, యోగి, ఆధ్యాత్మిక గురువు. ఆయన తాను స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF), యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా లక్షలమంది జనాలకు ధ్యానం, క్రియా యోగ పద్ధతులను నేర్పించాడు. ఈయన తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలో గడిపాడు. ఆయన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా తమ సన్యాసి పరంపర లక్ష్యాల మేరకు పాశ్చాత్య దేశాలకు ప్రయాణించి యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి వారి భౌతిక వాదాన్ని, భారతీయుల ఆధ్యాత్మికతను సమన్వయపరిచే పాత్ర పోషించాడు. అమెరికాలో యోగా ఉద్యమంపై ఆయన వేసిన చెరపలేని ముద్ర, ముఖ్యంగా లాస్ ఏంజిలస్ లో ఆయన నెలకొల్పిన యోగా సంస్కృతి ఆయనకు పాశ్చాత్యదేశాల్లో యోగా పితామహుడిగా స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
(ఇంకా…)

46వ వారం
శ్రీ శుకబ్రహ్మాశ్రమం

శ్రీ శుకబ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తిలో ఉన్న ఒక వేదాంత ఆశ్రమం, సేవా కేంద్రం. దీనిని మలయాళ స్వామి శిష్యుడైన శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి 1950 జనవరి 20 న స్థాపించాడు. అన్ని వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పంచడం, సామాజిక సేవ లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. మలయాళ స్వామి వేద సంకలనకర్తయైన వ్యాసుడి పేర శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపిస్తే ఆయన శిష్యుడైన విద్యాప్రకాశానందగిరి వ్యాస మహర్షి పుత్రుడైన శుక మహర్షి పేరుతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవం మలయాళ స్వామి చేతులమీదుగా జరిగింది. ఆశ్రమం ప్రారంభించినప్పటి నుండి 1998 లో విద్యాప్రకాశానంద మరణించే దాకా ఆయనే అధ్యక్షుడుగా వ్యవహరించాడు. ఆయన తదనంతరం ఈ ఆశ్రమానికి విద్యా స్వరూపానంద స్వామి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నాడు.
(ఇంకా…)

47వ వారం
మంగళూరు

మంగళూరు నగరం కర్ణాటక రాష్ట్ర ప్రధాన నగరాలలో ఒకటి. ఇందులో ఒక నౌకాశ్రయము కూడా ఉంది. ఈ నగరం భారత దేశ పశ్చిమాన అరేబియా సముద్ర తీరంలో పశ్చిమ కనుమలకు పశ్చిమాన ఉంది. మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా రాజధాని, అధికార పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి, దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరుతి దిక్కులో ఉంది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి, గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము. మంగళూరు దేవాలయాలకు, సముద్ర తీరాలకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాషైన తుళు, కేరళకు సరిహద్దులో ఉండడం వల్ల మళయాళం, కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంకణి భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష హిందీ, ఆంగ్లం కూడా ప్రజలు మాట్లాడగలరు. నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉంది.
(ఇంకా…)

48వ వారం
ప్రపంచ బ్యాంకు

ప్రపంచ బ్యాంకు ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసేందుకు గాను ఏర్పాటయిన సంస్థ ఇది. డిసెంబర్ 27, 1945 న ఏర్పాటైన ఈ సంస్థ జూన్ 25, 1946 నుంచి తన కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఇది మూలధన ప్రాజెక్టులను చేపట్టే ఉద్దేశంతో పేద దేశాల ప్రభుత్వాలకు రుణాలు గ్రాంట్లను అందిస్తుంది. ప్రపంచబ్యాంకు ప్రధానంగా విద్య, ఆరోగ్యం లాంటి మానవాభివృద్ధి రంగాల్లోనూ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతులు, ప్రభుత్వ రంగం వంటి రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. పేదరిక నిర్మూలన ఈ బ్యాంకు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికై మే 9, 1947 న ఫ్రాన్సుకు మంజూరు చేసిన 250 మిలియను డాలర్లు, బ్యాంకు అందించిన మొదటి ఋణం. ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబిఆర్‌డి), ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐడిఎ) అనే రెండు సంస్థల కలగలుపు. ఈ ప్రపంచ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు గ్రూపులో ఒక భాగం. ప్రపంచ బ్యాంకు గ్రూప్ అనేది ఐదు అంతర్జాతీయ సంస్థలతో కూడిన కుటుంబం. ప్రపంచ బ్యాంకుకు అది మాతృ సంస్థ.
(ఇంకా…)

49వ వారం
మొదటి ప్రపంచ యుద్ధం

మొదటి ప్రపంచ యుద్ధం, ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం1914 జూలై 28 నుండి 1918 నవంబరు 11 వరకు జరిగింది. దీనిని మహా యుద్ధం (గ్రేట్ వార్) అనీ, అన్ని యుద్ధాలనూ ముగించే యుద్ధం (వార్ టు ఎండ్ ఆల్ వార్స్) అని కూడా పిలుస్తారు. ఇది చరిత్రలో అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులూ మరణించారు. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ హత్య ఈ యుద్ధానికి నాంది పలికింది. ఆస్ట్రియా-హంగరీ సింహాసనానికి వారసుడైన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను 1914 జూన్ 28 న సారయెవోలో యుగోస్లావ్ జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్య చేయడంతో జూలై సంక్షోభం తలెత్తింది. ఈ హత్యకు స్పందనగా జూలై 23 న ఆస్ట్రియా-హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. దానికి సెర్బియా ఇచ్చిన సమాధానం వారిని సంతృప్తిపరచలేదు. రెండు దేశాలూ యుద్ధానికి సిద్ధపడ్డాయి.

ఈ యుద్ధంలో ఐరోపా లోని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి. అవి: ట్రిపుల్ ఎంటెంట్ (రష్యా సామ్రాజ్యం, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్), ట్రిపుల్ అలయన్స్ (జర్మనీ, ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ). తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్ కు మిత్రరాజ్యాలు అని, ట్రిపుల్ అలయన్స్ కు సెంట్రల్ పవర్స్ అనీ పేర్లు వచ్చాయి. ట్రిపుల్ అలయన్స్ స్థాపనోద్దేశం ఆత్మ రక్షణే కానీ, దాడి చెయ్యడం కాదు. ఈ కారణం వల్లనే ఇటలీ 1915 ఏప్రిల్ దాకా యుద్ధంలో దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రియా-హంగరీతో ఉన్న విభేదాల కారణంగా, అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ, అలయన్స్ నుండి బయటికి వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది. ఈ కూటములు రెండూ తరువాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి. ఓట్టోమన్ సామ్రాజ్యం, బల్గేరియాలు సెంట్రల్ పవర్స్‌తో చేతులు కలిపాయి.
(ఇంకా…)

50వ వారం
ప్రతిభా పాటిల్
ప్రతిభా పాటిల్ భారతదేశ 12వ రాష్ట్రపతి. ఆమె భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె రాజస్థాన్ గవర్నరుగా 2004 నుండి 2007 వరకు తన సేవలనందించింది. 1962లో తన 27వ యేట ఆమె మహారాష్ట్ర లోని జల్గాణ్ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. తరువాత ఆమె ముక్తాయ్‌నరగ్ శాసనసభ నియోజక వర్గం నుండి 1967 నుండి 1985 వరకు వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యురాలిగా ఎన్నిక అయింది. 1985 నుండి 1990 వరకు పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభకు ఎన్నిక అయింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో ఆమె 10వ లోక్‌సభకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందింది. తరువాత ఒక దశాబ్దం కాలంపాటు ఆమె రాజకీయాల్లో పదవీ విరమణ చేసింది. ఆమె మహారాష్ట్ర శాసన సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో అనేక కేబినెట్ మంత్రి పదవులను చేసింది. ఆమె రాజ్యసభ, లోక్‌సభలలో అధికార స్థానాలలో కూడా పనిచేసింది. 2004 నవంబరు 8న ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి 17వ గవర్నరుగా నియమింపబడింది.
(ఇంకా…)
51వ వారం
బ్లాక్ హోల్

బ్లాక్ హోల్ (కాలబిలం) అనేది ఎంతో బలమైన గురుత్వాకర్షణ త్వరణాన్ని ప్రదర్శించే స్పేస్‌టైమ్ ప్రాంతం. ఎంత బలమైన గురుత్వాకర్షణ అంటే, దాని ఆకర్షణ నుండి, ఏ కణమూ, చివరికి కాంతి వంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏదీ, దాని నుండి తప్పించుకోలేవు. ఏదైనా ద్రవ్యరాశి తగినంత సాంద్రతతో ఉంటే, స్పేస్‌టైమ్‌ను వంచి, బ్లాక్ హోల్ ను ఏర్పరుస్తుందని సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ఊహించింది. తిరిగి వెనక్కి రాలేని ఆ ప్రాంతపు సరిహద్దును ఈవెంట్ హొరైజన్ అంటారు. ఈవెంట్ హొరైజన్ను దాటిన వస్తువు గతి, దాని పరిస్థితులపై ఈవెంట్ హొరైజన్ విపరీతమైన ప్రభావాన్ని చూపినప్పటికీ, స్థానికంగా గుర్తించదగిన లక్షణాలేమీ గమనించలేం. అనేక విధాలుగా, బ్లాక్ హోల్ కూడా ఒక ఆదర్శవంతమైన బ్లాక్ బాడీ లాంటిదే. బ్లాక్ బాడీ లాగానే ఇది కూడా కాంతిని ప్రతిబింబించదు. అంతేకాకుండా, ఈవెంట్ హొరైజన్లు హాకింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయని క్వాంటం ఫీల్డ్ థియరీ ఊహించింది. ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉండే ఉష్ణోగ్రత వద్ద ఉన్న బ్లాక్ బాడీ విడుదల చేసే రేడియేషన్ ఏ స్పెక్ట్రమ్‌లో ఉంటుందో, ఆ స్పెక్ట్రమ్‌లోనే ఈ రేడియేషన్ ఉంటుంది. నక్షత్ర స్థాయి ద్రవ్యరాశి (స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్) ఉండే బ్లాక్ హోల్‌లకు ఈ ఉష్ణోగ్రత ఒక కెల్విన్ లో వందల కోట్ల వంతు ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వలన దీన్ని గమనించడం అసాధ్యం.
(ఇంకా…)

52వ వారం
మహా జనపదాలు

ప్రాచీన భారతదేశంలో సా.పూ ఆరు నుండి ఐదవ శతాబ్దం వరకు విలసిల్లిన 16 రాజ్యాలను మహాజనపదాలు అంటారు. వాటిలో రెండు గణతంత్రాలు కాగా, మిగతా వాటిలో రాచరికం ఉండేది. అంగుత్తార నికాయ వంటి పురాతన బౌద్ధ గ్రంథాలు పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల గురించి ప్రస్తావిస్తాయి. ఇవి భారతదేశంలో బౌద్ధమతం విస్తరించడానికి ముందు, భారత ఉపఖండంలో వాయవ్యంలోని గాంధార నుండి తూర్పున ఉన్న అంగ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. సా.పూ 6 వ -5 వ శతాబ్దాలను భారతీయ ప్రారంభ చరిత్ర తొలినాళ్ళలో ఒక ప్రధానమైన మలుపుగా పరిగణిస్తారు; సింధు లోయ నాగరికత నశించిన తరువాత భారతదేశంలో మొట్టమొదటి పెద్ద నగరాల ఆవిర్భావం, అలాగే వేద కాలం నాటి సనాతన ధర్మాన్ని సవాలు చేసే శ్రమణ ఉద్యమాలు (బౌద్ధమతం, జైనమతాలతో సహా) పెరిగాయి. పురావస్తు పరంగా, ఈ కాలం నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది.
(ఇంకా…)

ఇవి కూడా చూడండి

మార్చు