ఉదయ ఘంటలు
ఉదయ ఘంటలు తెలంగాణా రచయితల సంఘం సంపాదకత్వంలో వెలువడిన అఖిలాంధ్ర కవుల గేయ సంపుటి[1]. దీనిని వట్టికోట ఆళ్వారుస్వామి ఆధ్వర్యంలో నడిచిన దేశోధ్ధారక గ్రంథమాల తన 15వ ప్రచురణగా 1953, డిసెంబరు నెలలో హైదరాబాదు నుండి వెలువరించింది. ఈ సంపుటిలో 56గురు సుప్రసిద్ధ కవులు రచించిన 82 శీర్షికలు ఉన్నాయి. ఈ గేయకవితలు దేశీయ సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యాలోపాలు, ప్రపంచ క్లిష్ట పరిస్థితులు, పీడిత మానవ సంఘటనలను ఇతివృత్తాలుగా కలిగి ఉన్నాయి. ఈ పుస్తకానికి కిర్మీరం పేరుతో సంపాదకీయం తెలంగాణా రచయితల సంఘం వ్రాసింది.
ఉదయ ఘంటలు | |
కృతికర్త: | 56మంది కవులు |
---|---|
సంపాదకులు: | తెలంగాణా రచయితల సంఘం |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | గేయకవితా సంపుటి |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | దేశోద్ధారక గ్రంథమాల, హైదరాబాదు |
విడుదల: | 1953 |
పేజీలు: | 200 |
గేయాల జాబితాసవరించు
పత్రికాభిప్రాయంసవరించు
- ఈ కావ్యములోని భావాలు, శైలి పాఠకులలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తించడమే కాక ప్రపంచసమస్యల పరిష్కారంపట్ల ఆసక్తిని రేకెత్తించగలవు. ఇందలి భావాలు కళారాధనను, తాత్కాలిక విప్లవాన్ని పురికొల్పేవి, శాశ్వతంగా ప్రపంచసమస్యల పరిష్కారమునకు దోహదమివ్వగలవి. కాని ప్రపంచసమస్యల పరిష్కారమునకు ఇందలి కవుల భావాలు ఆధారము కాకపోయినా ప్రజల హృదయాలు నవచైతన్యవిలసితములగుటకు, ప్రపంచ సమస్యల గురించి, వాని పరిష్కారావకాశములను పాఠకులు ఆలోచించి వ్యవహరించుట కవకాశములు విస్తృతము కాగలవు.[2] - గృహలక్ష్మి
- “మెరపువలె పరుగిడు, మా ఊహాతరంగాలకు, బక్కెద్దులనాపే, పగ్గాలు పనికొస్తాయా?” అని కాళోజీ నారాయణరావన్నట్లు ఈ సంపుటము నిండా బ్రతికి ఉన్న వ్యావహారికంలోనే తళుక్కుమంటున్నాయి భావాలు. మరణించిన మాటల కూర్పుకి పనికొచ్చే వృత్తాలు ఉదయఘంటలులో లేవు. అయితే “గ్రాంథికభాష”లోని కూర్పులు వింత నడకలతో ఉన్నాయి. పఠాభి నటరాట్టు, పుట్టపర్తి ఓ భ్రమరీ, సి.నారాయణరెడ్డి జలద గీతి, వి.దుర్గాప్రసాదరావు ఉషోబాల ఈ రకము. అయితే దీనికి ప్రతిగా యెంకిపాటల భాషమాత్రము ఎక్కువగా వినబడదు ఉదయఘంటలులో. మాత్రాచ్చందస్సూ, మాటలాడేభాషా, ఈ రెండూ బొమ్మా బొరుసూను ఉదయ ఘంటలుకి. ఇదివరకటి కవులు దర్శించని సౌందర్యం పొట్లపల్లి రామారావు చీమలబారులో, పుట్టపర్తి ఓ రజనీలో, నార్ల వెన్నెలలో, మాణిక్యరావు పిల్లలములో, నారాయణరెడ్డి గేయం రాయాలిలో, సుబ్బరామశాస్త్రి ఆంధ్రగీతిలో కనబడుతుంది.[3] - కిన్నెర
మూలాలుసవరించు
- ↑ తెలంగాణా రచయితల సంఘం (1953). ఉదయ ఘంటలు (1 ed.). హైదరాబాదు: దేశోద్ధారక గ్ర్రంథమాల. Retrieved 27 March 2015.
- ↑ సి.సి.పున్నయ్య (1954-11-15). "స్వీకారము". గృహలక్ష్మి. 23 (11): 616. Archived from the original on 2016-03-05. Retrieved 27 March 2015.
- ↑ "పుస్తక సమీక్ష". కిన్నెర. 6 (4): 239–240. 1954-05-01. Archived from the original on 2016-03-05. Retrieved 28 March 2015.