కొంగర జగ్గయ్య

సినీ నటుడు
(జగ్గయ్య (నటుడు) నుండి దారిమార్పు చెందింది)

కొంగర జగ్గయ్య (డిసెంబర్ 31, 1928 - మార్చి 5, 2004) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన అతను కంఠం కారణంగా అతను "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు. భారత ప్రభుత్వం 1992 లో ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డ్ ను ఇచ్చి సత్కరించింది.

కొంగర జగ్గయ్య
కళా వాచస్పతి కొంగర జగ్గయ్య
జననండిసెంబర్ 31, 1928
మోరంపూడి ఆంధ్రప్రదేశ్
మరణంమార్చి 5, 2004
చెన్నై
ఇతర పేర్లుకళా వాచస్పతి, "కంచు కంఠం" జగ్గయ్య
వృత్తినాటకం, సినిమా, రాజకీయం
పదవి పేరునాలుగవ లోక్‌సభ సభ్యులు
పదవీ కాలం1967- 1972
రాజకీయ పార్టీజాతీయ కాంగ్రెస్ పార్టీ
మతంహిందువు
పురస్కారాలు1992 లో పద్మభూషణ్ అవార్డ్

బాల్యము , యుక్త వయసు

మార్చు

జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928, డిసెంబర్ 31 న ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు.[1] విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు. ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పనిచేశాడు.

ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు. ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడినది. ఈ కాలేజీలో ఎన్.టి.రామారావు, కొంగర జగ్గయ్య ఇద్దరు సహ విద్యార్థులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు; జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందాడు. చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందాడు. విజయవాడలో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశాడు. డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవాడు. ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు వ్రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు. అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి నాటకాలు వేశారు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పని చేసే టప్పుడే ఢిల్లీ రాజ్య పతనం అనే నాటకంలో జమునతో వేషం వేయించారు జగ్గయ్య గారు.

సినిమాలలో

మార్చు

త్రిపురనేని గోపిచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాలలో అరంగేట్రం చేసాడు.[1] అయితే ఈ సినిమాగానీ, దీని తదుపరి చిత్రాలు కాని పెద్దగా విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి ఒక సంవత్సరం సెలవు పెట్టాడు. తర్వాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. అర్ధాంగి, బంగారు పాప చలన చిత్రాల విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. 1950ల నుండి 1970ల వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసాడు. మరణించేవరకు కూడా అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే ఉండేవాడు. కొన్ని చలన చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాలలో సహాయనటునిగా, హాస్య పాత్రలలో, ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. "కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రోటీన్ హీరో పాత్రలు సరిపోవు." అని నమ్మిన వాడు కాబట్టే అతను విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించాడు. అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వచూపిన వాళ్లను కూడా అదే కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవాడు!

అప్పట్లో సాంఘిక చిత్రాల్లోని ప్రతినాయక పాత్రలు కూడా పౌరాణిక ప్రతినాయక పాత్రల్లానే ఉండేవి. ఆ పద్ధతి మార్చాలని జగ్గయ్య ప్రతినాయక పాత్రలను ఎంచుకున్నాడు. కథానాయకుడు అందంగా ఉంటే ప్రతినాయకుడు కూడా అందంగానే ఉంటాడు. మన మధ్య తిరిగే మామూలు మనిషిలానే ఉంటాడు. అలా చూపించాలనే అతను ప్రతినాయక పాత్రలు చేశాడు. ప్రతినాయకుడు అంటే, వికారంగా, కౄరంగా ఉండాలనే అభిప్రాయం పోగొట్టాడు. "విలన్ కూడా లవబుల్ గానే ఉండాలి. అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు. అలాంటి పాత్రల్లో అభినయ సునిశితత్వాన్నిప్రదర్శించడానికి మంచి అవకాశముంటుంది." అనేది అతను అభిప్రాయం. అతను దాదాపు 500 చిత్ర్రాల్లో నటించాడు. అతను నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి.

జగ్గయ్య గురించి చెప్పేటప్పుడు అతను కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠాన్ని ఎంతోమందికి అరువు ఇచ్చాడు. 100కు పైగా సినిమాలలో డబ్బింగు చేసాడు. తమిళ చిత్రరంగ నటుడు శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలలో జగ్గయ్యే అతనుకు గాత్రధారణ చేసేవాడు. అంతేకాదు తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చాడు.

పేరు తెచ్చిన పాత్రలు

మార్చు
  • బంగారు పాప లో: బంగారు పాపలో అతను పోషించింది చాలా సున్నితమైన, సంక్లిష్టమైన పాత్ర. పాతికేళ్ళ వయసులోనే ఆ చిత్రంలో వృద్ధునిగా నటించాడు. తెలుగు స్వతంత్రలో ఒక చలన చిత్రం మీద సమీక్ష రావడమే ఒక గొప్ప విశేషమైతే అందులో పాత్రికేయుడు ఖాసా సుబ్బారావు బంగారు పాప మీద సమీక్ష వ్రాస్తూ "హామిలీషియన్ (షేక్స్ పియర్ నాటకం హామ్లెట్ లోని ప్రధాన పాత్ర అయిన హామ్లెట్ తో పోల్చదగిన అని అర్థం) రోల్ ప్లేయ్డ్ బై మిస్టర్ జగ్గయ్య ఇస్ సుపర్బ్ లీ కన్విన్సింగ్." అని వ్రాశాడు. అది తనకు కొన్ని సంవత్సరాల పాటు ఉత్తేజాన్నిచ్చిందని జగ్గయ్య అన్నాడు.
  • అర్థాంగి లో: బంగారు పాప తర్వాత వెంటనే అర్థాంగి చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించాడు. ఈ రెండు చిత్రాలు అతను్ను వైవిధ్యమైన నటుడిగా నిలబెట్టాయి.
  • అల్లూరి సీతారామరాజులో పోషించిన రూథర్ ఫర్డ్ పాత్ర: ఇది అతను జీవితంలో మరపురాని పాత్ర. ఆ సినిమా తీసే నాటికి రూథర్ ఫర్డ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి కాదు. అతను ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికి ఉన్నారు. అతను 1940 వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు. కృష్ణా జిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. అప్పటి ఐ.సి.ఎస్. అధికార్లలో చాలా మందికి అతను బాగా తెలుసు. వాళ్ళను వాకబు చేసి జగ్గయ్య రూథర్ ఫర్డ్ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి తెలుసుకున్నాడు. అప్పుడు అతనుకు రూథర్ ఫర్డ్ చాలా మంచి వ్యక్తి అని, అతనుకు సీతారామరాజు అంటే గౌరవం ఉండేదని తెలిసింది. అయితే రూథర్ ఫర్డ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు. అతను వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా అతను సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఇది తెలిశాక జగ్గయ్య చిత్ర రచయిత మహారథిని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్ లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందా అయిన వ్యక్తిలా మార్చి వ్రాయాలని కోరాడు. అలా ఆ పాత్ర చిత్రణ మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో బాటు సీతారామరాజు పాత్ర మరింతగా ఎలివేట్ అయింది. ఆ సినిమా చూశాక పి.వి.నరసింహారావు జగ్గయ్యకు ఫోన్ చేసి "మీ పాత్ర పోషణ అద్భుతం." అని ప్రశంసించారట.

నిర్మాతగా

మార్చు
  • పదండి ముందుకు (1962): (రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం) నిజానికి ఈ సినిమాకు నిర్మాత జగ్గయ్యే అయినా పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తిది. ఈ సినిమాను 1930లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో డాన్సులు, డ్యుయెట్ల వంటి ఆకర్షణలు లేకుండా తీశారు. ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది. ఈ సినిమా రష్యాలో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ తో బాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి సంభాషణలతో బాటు చిత్రం చివర్లో వచ్చే 'మంచికి కాలం తీరిందా' అనే పాటను కూడా జగ్గయ్యే వ్రాశాడు. ఇది మహమ్మద్ రఫీ పాడిన తొలి తెలుగు పాట. కృష్ణ ఒక చిన్న పాత్ర చేశారు.
  • శభాష్ పాపన్న

రాజకీయాలు

మార్చు

జగ్గయ్య విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాలలో చాలా చురుకుగా ఉండే వాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషలిస్టు గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి. వాటిని నిషేధించిన తరువాత జయప్రకాష్ నారాయణ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో చేరాడు. 1956లో జవహర్‌లాల్ నెహ్రూ పిలుపుకు స్పందించి, తిరిగి కాంగ్రేసులో చేరాడు.

1962 వ సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గయ్యను ఎన్నుకున్నారు. ఆ సందర్భంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని కలిశారు. తన లోక సభ అభ్యర్థిత్వాన్ని గురించి నెహ్రూని అడగగా నిజమేనని చెప్పారు. కాని జగ్గయ్య గారిని పోటీ చేయొద్దని చెప్పారు నెహ్రూ. స్వతంత్ర పార్టీ నాయకుడు ఆచార్య ఎన్. జి. రంగా అక్కడి నుండి పోటీ చేస్తున్నారు, అలాంటి నాయకులు పార్లమెంటుకు రావాలి. కనుక పోటీ చేయవద్దని వారించారు. కాంగ్రెస్ పోటి చేయక పోయినా రంగా గారు కమ్యూనిస్ట్ చేతిలో ఓడి పాతారన్నారు జగ్గయ్యగారు. అయినా పరవా లేదు అంతటి మహానాయకుని ఓటమికి కాంగ్రెస్ కారణం కాకూడదు అని అన్నారు నెహ్రూ. (ఆనాటి రాజకీయ నాయకుల నైతిక విలువలకు ఇదొక మచ్చుతునక).

1967లో నాలుగవ లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రేసు పార్టీ తరుపున పోటీ చేసి, 80 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన జగ్గయ్య గెలిస్తే పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందని భావించిన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఇతను గెలుపు కోసం ఎంతో కృషి చేసింది. నామినేషన్ వేసిన రోజునుంచి జగ్గయ్య గెలుస్తాడా లేదా అన్న అనుమానం చాలామందిలో ఉండేది. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. అయినా పెద్దల ఆశీస్సులతో, పరిశ్రమ వర్గాల ప్రోత్సాహంతో ధైర్యంగా రంగంలోకి దిగి గెలుపొందారు. అలా జగ్గయ్య లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అయ్యాడు.[1][2]

భారి మెజారిటీతో జగ్గయ్య గెలిచారన్న వార్త వినగానే చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఎంతో ఆనందించారు. 13 మంది నిర్మాతలు (ఎన్. త్రివిక్రమరావు, డి.వి.ఎస్. రాజు, రామానాయుడు, ఎస్. భావనారాయణ, బి. విఠలాచార్య, ఎన్. రామబ్రహ్మం, ఎం. జగన్నాథరావు, యు. విశ్వేశ్వరరావు, ఏ.ఎస్.ఆర్. ఆంజనేయులు, తోట సుబ్బారావు, పి. గంగాధరరావు, పుండరీకాక్షయ్య, కె. సోమశేఖరరావు) ఒక కమిటీగా ఏర్పడి 1967 మార్చి 4వ తేదీన చెన్నైలోని న్యూ ఉడ్ లాండ్స్ హోటల్ లో జగ్గయ్యను సన్మానించారు. ఈ సభకు ఎన్టీఆర్ అధ్యక్షత వహించగా, డి.వి.ఎస్. రాజు, బి.ఎన్. రెడ్డి, చిత్తూరు నాగయ్య, జమున, రేలంగి, సి.ఎస్. రావు, ఇంటూరి మొదలైన వారు తమ అభినందనలను తెలియజేశారు.

సాహిత్యంలో కృషి

మార్చు

నోబెల్ పురస్కారము అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్రనాథ ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ (Sacrifice) ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించాడు.

పురస్కారాలు, సన్మానాలు

మార్చు

మరణము

మార్చు

2004, మార్చి 5 న 76 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించాడు.[3].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 ఫిలించాంబర్.కాం Archived 2005-12-26 at the Wayback Machine లో జగ్గయ్య జీవిత విశేషాలపై ఒక వ్యాసం.
  2. తెలుగుసినిమా.కాం Archived 2006-01-04 at the Wayback Machine లో జగ్గయ్య సంస్మరణార్ధం ప్రచురించిన ఒక వ్యాసం.
  3. ది హిందు Archived 2004-04-13 at the Wayback Machine పత్రికలో జగ్గయ్య మరణం సందర్భంగా మార్చి 6, 2004లో వచ్చిన వార్త.

బయటి లింకులు

మార్చు

రెండవ సంపుటి