బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి

సినీ దర్శకుడు
(బి.యన్.రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (నవంబర్ 16, 1908 - నవంబర్ 8, 1977) సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు.[1] పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
బి. ఎన్. రెడ్డి
జననం
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి

(1908-11-16)1908 నవంబరు 16
మరణం1977 నవంబరు 8(1977-11-08) (వయసు 68)
ఇతర పేర్లుబి. ఎన్. రెడ్డి
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత
నోట్సు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు

బాల్యం

మార్చు

బి. ఎన్. రెడ్డి నవంబర్ 16, 1908న వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. బి. ఎన్. తండ్రి గారైన నరసింహారెడ్డి రంగూన్ (ఇప్పటి యాంగాన్)కు మద్రాసు(చెన్నై) నుంచి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవాడు.

సినిమాలకు ముందు

మార్చు

తండ్రి వ్యాపార రీత్యా మద్రాసులో పెరిగిన బి. ఎన్. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో వేషాలు వేసేవాడు. వరవిక్రయం నాటకంలో ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన గాంధీజీ ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. చదువు పూర్తయ్యాక బి. ఎన్. రంగూన్ వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో ఉధృతంగా సాగుతున్న స్వదేశీ ఉద్యమ ప్రభావం వల్ల విదేశీ వ్యాపారం చేసే ఆలోచన మానుకుని కలకత్తా వెళ్ళి శాంతినికేతన్లో కొంత కాలం గడిపాడు. అక్కడ ఆయన లలిత కళల పట్ల విశేషంగా ఆకర్షితుడయ్యాడు. రంగూన్లో ఉన్న రోజుల్లో అక్కడి జానపద కళా రూపాలను, వీధి ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీంచాడు. ఆ అనుభవాల ఫలితంగా ఆయన తిరిగి వచ్చాక చలన చిత్ర రంగం వైపు మొగ్గు చూపాడు. ముఖ్యంగా ప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు దేవకీబోస్ తీసిన 'సీత' చిత్రం చూశాక తనకు సినిమాలు తీయాలనే కోరిక కలిగిందని బి.ఎన్. చెబుతుండే వాడు.

అయితే అప్పట్లో చిత్ర రంగం లోని వారికి ఇప్పటిలా సంఘంలో గౌరవముండేది కాదు. మొదట్లో వచ్చినవన్నీ పౌరాణికాలే అయినా తర్వాత తర్వాత సినీమాధ్యమానికున్న విస్తృతినీ, సౌలభ్యాన్నీ, సమాజమ్మీద అది చూపగల ప్రభావన్నీ సరిగా గుర్తించిన కొందరు సంస్కరణవాదులు సినిమాల ద్వారా అప్పటి సామాజిక సమస్యలైన అస్పృశ్యత, బాల్యవివాహాలు, విధవావివాహనిషేధం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కలిగించి, వారి దృక్పథంలో మార్పు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దాంతో మార్పునంగీకరించని పెద్దలు, సంప్రదాయవాదులు సినిమాలు తీసేవారిని చెడిపోయిన వారుగాను, చూసేవారిని పోకిరీలుగానూ పరిగణించేవారు.

అంతేగాక అప్పట్లో (1952 వరకూ)సెన్సారింగు కూడా లేకపోవడం వల్లా, సినిమాల్లోని రాజకీయపరమైన అంశాలు తప్ప మిగిలిన విషయాల్లో బ్రిటిష్ ప్రభుత్వ ఉదాశీనత వల్లా కొందరు దర్శకులు ప్రేక్షకులను "రంజింపజేసే" ప్రయత్నాలు కూడా యథేచ్ఛగా చేసేవారు.(మన దేశంలో వెండితెరమీద ముద్దు సీన్లు 1922లో విడుదలైన 'పతిభక్తి' అనే మూకీ సినిమాలో మొదలయ్యాయి.) బి.ఎన్. పూర్తిగా సంస్కరణాభిలాషతోనే సినిమాలు తీశాడు గానీ అలాంటి చౌకబారు ప్రయత్నాలు అణుమాత్రమైనా చేయలేదు. మొదటి నుంచీ చివరి వరకూ విలువల పట్ల తనకున్న నిబద్ధతను వీడలేదు.

సినీ జీవితం

మార్చు

సినీరంగ ప్రవేశం

మార్చు

బి.ఎన్.రెడ్డి తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద(1931) దర్శకుడైన హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ లతో కలిసి 1938లో రోహిణి పిక్చర్స్ స్థాపించి 'రంగూన్ రౌడీ' అనే స్టేజి నాటకం ఆధారంగా గృహలక్ష్మి చిత్రాన్ని ప్రారంభించాడు. మద్యపానం, వేశ్యావ్యామోహం వల్ల కలిగే నష్టాలు, పాతివ్రత్య సంప్రదాయంలోని గొప్పదనం గురించి తీసిన ఈ చిత్రానికి హెచ్.ఎమ్.రెడ్డి దర్శకనిర్మాత కాగా, బి.ఎన్.రెడ్డి సహాయ దర్శకుడు, సహ నిర్మాత. దురదృష్ట వశాత్తూ చిత్ర రంగంలో తన తొలి అడుగైన 'గృహలక్ష్మి' లోనే దర్శకుడు ఒక "రసవత్తరమైన" దృశ్యం తీయబూనడంతో బి.ఎన్. ఆయనతో తెగతెంపులు చేసుకుని బయటికొచ్చేశాడు.(హీరో అయిన డాక్టరును వలలో వేసుకునే ఉద్దేశంతో ఒక జాణ 'అబ్బా, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి' అంటూ తన ఒంట్లోని వివిధ భాగాలను ఆ డాక్టరు చేత తడిమించుకునే ఆ దృశ్యం కాంచనమాల, నాగయ్యల మధ్య చిత్రించబడింది.)

వాహినీ పిక్చర్స్

మార్చు

అప్పట్లో రాయలసీమ బిర్లాగా పేరు పొందిన తాడిపత్రి వాస్తవ్యులు మూలా లక్ష్మినారాయణ స్వామి పెట్టుబడితో కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి వంటి మిత్రులతో కలిసి వాహినీ పిక్చర్స్ స్థాపించాడు. దాంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి క్లాప్ కొట్టినట్లయింది. వాహినీ చిత్రాలన్నింటికీ ఆయనే నిర్మాత కాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో భాగ్యరేఖ (పొన్నలూరి బ్రదర్స్), పూజాఫలం (శంభూ ఫిలిమ్స్) తప్ప మిగతావన్నీ వాహినీ చిత్రాలే.

మంగళ సూత్రం అనే స్వీయ అముద్రిత నవల ఆధారంగా ఆయన తీసిన తొలి చిత్రం వందేమాతరం 1939లో విడుదలైంది. దాంట్లో నిరుద్యోగ, వరకట్న సమస్యలను అద్భుతంగా చిత్రించడమే కాక వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. తర్వాత 1940లో బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహిస్తూ సుమంగళి తీశాడు. ఐతే విప్లవాత్మకమైన ఈ మార్పును ప్రేక్షకులు హర్షించలేక పోయారు. ఈ చిత్రం జనామోదం పొందలేక పోయింది. తర్వాత వివాహానికి ముందు లైంగిక సంబంధాలు, పెళ్ళి కాని తల్లులేదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో ఆయన 1941లో తీసిన దేవత దక్షిణ భారతదేశమంతటా సంచలనం సృష్టించింది.

తర్వాత కె. వి. రెడ్డి దర్శకత్వంలో భక్త పోతన(1942), యోగి వేమన(1947) నిర్మించాడు. ఈ సినిమాల్లో నాగయ్య నటన తారాస్థాయినందుకుని ఆయనను తెలుగులో తొలి మెగాస్టార్ ను చేసింది. అంతవరకూ కాంచనమాల లాంటి నటీమణులే సూపర్ స్టార్స్. మొదట్లో సుమంగళి చిత్రంలో నాగయ్యను వృద్ధ సంఘసంస్కర్త పాత్ర వేయమన్నప్పుడు ఆయన కళ్ళనీళ్ళపర్యంతమయ్యాడట. అయితే ఆ పాత్ర ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెస్తుందని నచ్చజెప్పి బి.ఎన్. ఆయనను ఒప్పించాడు. తర్వాత భక్తపోతన విషయంలోనూ దాదాపుగా అలాగే జరిగింది. ఆ పాత్రలు నిజంగానే తనకు గొప్ప పేరు తీసుకు రావడంతో నాగయ్య 1946లో తనే స్వయంగా త్యాగయ్య తీశాడు.

స్వర్గసీమ

మార్చు
 

వేశ్యావ్యామోహాన్ని గర్హిస్తూ బి.ఎన్. 1945లో తీసిన స్వర్గసీమ తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి వియత్నామ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. ఘంటసాల గాయకుడుగానూ, సంగీతదర్శకుడుగానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా భానుమతికి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీరచయితగా చక్రపాణి పరిచయమైన సినిమా కూడా ఇదే.

భక్త పోతన తర్వాత బి.ఎన్., కె.వి.రెడ్డి ల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం వాహినీ బ్యానర్ మీద నిర్మించే సినిమాలలో ఒకదానికి బి.ఎన్. దర్శకత్వం వహిస్తే రెండవదానికి కె.వి. వహించాలి. బి.ఎన్. స్వర్గసీమ తీశాక కె.వి. యోగివేమన తీశాడు. తర్వాత సినిమా తీయవలసిన బి.ఎన్. వాహినీ స్టూడియో నిర్మించే పనిలో తీరిక లేకుండా నిమగ్నమవడం వల్ల తిరిగి కె.వి.యే సినిమా తీయడానికి సిద్ధ పడ్డాడు. మాంత్రికుల కథల మీద మోజున్న కె.వి. బాలనాగమ్మ తీద్దామన్నాడు. కానీ బి.ఎన్. ససేమిరా ఒప్పుకోలేదు. సవతి తల్లిని కౄరంగా చూపే ఆ కథ సమాజానికి తప్పుడు సంకేతమిస్తుందని ఆయన భావన. "మంచి సందేశమివ్వక పోతే మాను. అంతే కానీ తప్పుడు సందేశమివ్వకు." అని ఆయన కె.వి.కి గట్టిగా చెప్పారు.కె.వి.కి ఆయన గురు తుల్యులాయె.దాంతో ఆయన ఆ కథ పక్కన పెట్టి బి.ఎన్. సూచన మేరకు షేక్స్పియర్ విషాదాంత నాటకం కింగ్ లియర్ను గుణసుందరి కథగా తీశారు-1949లో.(తర్వాత 1951లో చక్రపాణి-నాగిరెడ్డి ద్వయం కె.వి.రెడ్డికి పాతాళ భైరవిని అప్పగించి మాంత్రికుల కథల మీద ఆయనకున్న మోజును తీర్చారు).

మల్లీశ్వరి

మార్చు
 

తర్వాత శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు.ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం హంపి వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు వ్రాసిన ఒక కథ(ఎల్లోరాలో ఏకాంత సేవ) కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత మాటలు, పాటలు వ్రాయించారు. అదే "మల్లీశ్వరి"(1951). కృష్ణశాస్త్రికి అదే తొలి సినిమా.

ఇక్కడో విషయం చెప్పుకోవాలి: శంకరాభరణం తీస్తున్నప్పుడు అది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన సినిమా కాబట్టి అందులోని పాటలు ప్రముఖ సంగీత విద్వాంసుడైన బాలమురళికృష్ణ చేత పాడించాలనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే అంతటి మహా విద్వాంసుడి చేత తమకు కావలసిన రీతిలో పాడించుకునే చనువు, స్వేచ్ఛ, ధైర్యం ఎంతవరకు ప్రదర్శించగలమోననే సందేహంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అయితే సాహితీరంగంలో ఉద్ధండులైన కృష్ణశాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు(పా.ప.) లను చిత్రసీమలోనికి తీసుకువచ్చింది బి.ఎన్.రెడ్డే. కృష్ణశాస్త్రి తొలి సినిమా మల్లీశ్వరి కాగా పాలగుమ్మి వారి తొలి సినిమా బంగారుపాప. అలా సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్ఠులైనవాళ్ళను సినీరంగంలో ప్రవేశపెట్టి తెలుగు సినిమా గౌరవప్రతిష్ఠలను పెంచడమే గాక అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా బావుటాను సగర్వంగా రెపరెపలాడించిన స్రష్ట బి.ఎన్.

తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాతృలం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం." అన్నాడు.

మల్లీశ్వరి తర్వాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన సామాజిక వ్యంగ్యచిత్రం పెద్దమనుషులు(1954) సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయ్యేవాళ్ళ నిజస్వరూపాలను బట్టబయలు చేసింది ఈ చిత్రం. మనిషిలోని మంచిచెడ్డలను మనోరంజకంగా చిత్రించిన ఈ సినిమా ద్వారా మాటల రచయిత డి.వి.నరసరాజు చిత్ర రంగంలో ప్రవేశించారు. బి.ఎన్. తీసిన తర్వాతి చిత్రమే..

బంగారు పాప

మార్చు
దస్త్రం:Bangaru-paapa.jpg

ప్రపంచవ్యాప్తంగా సినీపండితులంతా ఒక్కసారి ఉలిక్కి పడి భారతీయ సినిమా వైపు దృష్టి సారించేలా చేసిన చిత్రం పథేర్ పాంచాలి. ఐతే అదే సంవత్సరం విడుదలై జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆ సినిమాకు దీటుగా నిలచిన తెలుగు చలనచిత్ర రాజం "బంగారుపాప". కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.

పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, ఎస్వీఆర్ అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. మల్లీశ్వరి కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.

ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప అడుగు తడబడి బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన బి.ఎన్. వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేక పోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథ చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని బి.ఎన్. బంగారుపాప తీయడానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్ తోనే 1957లో భాగ్యరేఖ తీశాడు. అలా అది తమ స్వంత సంస్థ వాహినీ వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అయింది. అయితే అది ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా హిట్టైంది.

అలా ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారనే విషయంలో తన అంచనాలు వరుసగా రెండు సార్లు తప్పవడంతో తొలిసారిగా తన సన్నిహితుల ఒత్తిడికి తలఒగ్గి తన ఆశయాలను, ఆదర్శాలను పక్కనపెట్టి 'రాజమకుటం(1960)' అనే యాక్షన్ సినిమా తీయడానికి సిద్ధమయాడు. షేక్స్పియర్ వ్రాసిన హామ్లెట్ ఈ చిత్రానికి మాతృక. అది ఆర్థికంగా హిట్టైనా ఆత్మికంగా ఆయనకు తృప్తినివ్వలేదు. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లో ఆయన అభిమాని ఒకరు "ఈ బి.ఎన్. కిదేం పోయే కాలం? ఈయన కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు?" అనడం ఆయనే స్వయంగా విన్నాడు. తాను "ఇరవైయేళ్ళుగా సంపాయించుకున్న పేరు ప్రతిష్టలు, గౌరవం ఈ ఒక్క సినిమా తో మట్టికొట్టుకు పోయినై." అని విపరీతంగా బాధ పడ్డాడు.

ఆ తర్వాత ఆయన శంభూ ఫిలిమ్స్ వారి 'పూజాఫలం(1964)', వాహినీవారి రంగులరాట్నం(1966-చంద్రమోహన్ నటించిన తొలి సినిమా), 'బంగారుపంజరం'(1969) సినిమాలు తీశాడు.

పని చేసిన సినిమాలు

మార్చు
సినిమా విడుదల తేదీ పాత్ర
గృహలక్ష్మి 1938 నిర్మాణ భాగస్వామి
వందేమాతరం 1939 దర్శకత్వం/నిర్మాత
సుమంగళి 1940 దర్శకత్వం/నిర్మాత
దేవత 1941 దర్శకత్వం/నిర్మాత
స్వర్గసీమ 1945 దర్శకత్వం/నిర్మాత
భక్త పోతన 1942 నిర్మాత
యోగి వేమన 1947 నిర్మాత
మల్లీశ్వరి 1951 దర్శకత్వం
బంగారు పాప 1954 దర్శకత్వం
భాగ్యరేఖ 1957 దర్శకత్వం
రాజ మకుటం 1960 దర్శకత్వం
పూజా ఫలం 1964 దర్శకత్వం
బంగారు పంజరం 1969 దర్శకత్వం
రంగుల రాట్నం 1966 దర్శకత్వం

విశిష్టతలు

మార్చు
  • ఎవరిచేతైనా తనకు నచ్చే విధంగా వచ్చేవరకూ పని చేయించడం బి.ఎన్. ప్రత్యేకత. 'మల్లీశ్వరి' లో రాయలవారితో కలిసి మారువేషంలో వచ్చిన అల్లసాని పెద్దన (పాత్రధారి రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు)మల్లీశ్వరి నృత్యం చూసి ఆశువుగా చెప్పవలసిన పద్యం కోసం కృష్ణశాస్త్రి గారి చేత ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా నూట ఎనిమిది పద్యాలు వ్రాయించి వాటిలోంచి ఒక్క పద్యాన్ని ఏరుకున్న పర్ఫెక్షనిస్టు బి.ఎన్.
  • చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ క్వాలిటీ విషయంలో అంత కచ్చితంగానూ ఉంటారు బి.ఎన్. మాటల్లోనూ, పాటల్లోనూ ప్రతి అక్షరాన్నీ తరచితరచి చూస్తాడు. పూజాఫలంలో సినారె వ్రాసిన "పగలే వెన్నెల..." పాటను తనకు నచ్చేటట్లు వచ్చేదాకా తిరగరాయించాడు. ఆ పాటకు స్వరాలు కూర్చింది సాలూరు రాజేశ్వరరావు. ఆయన మాల్కోస్ రాగంలో ఆలపించారు ఆ పాటను. అయితే బి.ఎన్. ఆ పాటలో పల్లవి చివర 'కన్నులుంటే' అనే పదాన్ని 'టే' తర్వాత కాస్త సాగదీసి పాడించారు. ఆ పాటకు ఆ సాగతీత నెమలికి పింఛం అమరినంత అందంగా అమరింది. ఆ సాగతీత లేకుండా ఆ పాటను ఇప్పుడు మనం ఊహించుకోనైనా లేం.
  • ఎక్‌స్టసీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి యోగసాధన అక్కర్లేదు. రాజమకుటం లోని 'సడి చేయకో గాలి...' పాట వింటే చాలు. అదీ బి.ఎన్. మార్కు పాట! తాననుకున్న ఎఫెక్టు వచ్చేవరకూ ఆయన అంత పట్టుదలగా పని చేయిస్తారు కాబట్టే ఆయన సినిమాలకు పనిచేసిన వారెవరూ తాము "చేశామని" చెప్పుకోరు. బి.ఎన్. తమ చేత "చేయించారని" మాత్రమే చెప్పుకుంటారు. ఆవిధంగా తానై శాసించక పోయినా పని 'రాబట్టుకోగలిగిన' ఒకేఒక్క దర్శకుడాయన.
  • ఆయనలోని మరో ప్రత్యేకత తన సినిమాలకు స్క్రిప్టు దశలో నే ఆయన చేసే సెన్సారింగ్. ఆయన తీసిన చివరి సినిమా బంగారు పంజరం(1969) స్క్రిప్ట్ లో హీరో తలుపు తట్టుతూ, అది తెరుచుకోవడం ఆలస్యమైతే "ఏం చేస్తున్నావ్?" అని అడిగే దృశ్యముంది. అప్పుడు అవతల్నించి హీరోయిన్ గొంతు "బట్టలు మార్చుకుంటున్నాను" అని వినిపించాలి. అయితే ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఏం ఊహించుకుంటారోనని ఆ దృశ్యాన్ని తొలగించారాయన. అదీ, విలువల పట్ల ఆయనకున్న నిబద్ధత!

గుర్తింపు-గౌరవాలు

మార్చు

తీరనికోరికలు

మార్చు
  • సినారె వ్రాసిన ప్రసిద్ధ గేయకావ్యం కర్పూరవసంతరాయలును, బీనాదేవి నవల పుణ్యభూమీ కళ్ళుతెరు!ను సినిమాలుగా తీయడం

మూలాలు

మార్చు
  1. 1969లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన దేవికారాణి విశాఖపట్నంలో జన్మించింది. కాని ఆమె బెంగాలీ కుటుంబానికి చెందినది. నట జీవితం అధికంగా హిందీ చిత్రరంగంలో గడచింది. తరువాత రష్యన్ చిత్రకారుడు స్వెటొస్లావ్ రోరిచ్‌ను పెళ్ళాడి బెంగళూరులో చివరి జీవితం గడిపింది. ఆమెను దక్షిణ భారతీయురాలిగా పరిగణిస్తే బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన రెండవ దక్షిణ భారతీయుడౌతాడు

బయటి లింకులు

మార్చు