మునగ

(మునగాకు నుండి దారిమార్పు చెందింది)

[1]ములక్కాడ లేదా మునగ ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది మొరింగా (Moringa) ప్రజాతిలో విస్తృతంగా పెంచే మొక్క. ఇది మొరింగేసి (Moringaceae) కుటుంబానికి చెందినది. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి.[2]

మునగ
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
ఎమ్. ఓలీఫెరా
Binomial name
మొరింగా ఓలీఫెరా

మునగ చెట్లు ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి పొడిగా ఉండే ఇసుక నేలలలో బాగా పెరిగినా, సముద్ర తీర ప్రాంతాలలో కూడా పెరుగుతాయి. ఇవి తొందరగా పెరిగి వర్షాభావాన్ని తట్టుకుంటాయి. వీటినిఆఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక, భారతదేశం, మెక్సికో, మలేషియా, పిలిప్పైన్స్ దేశాలలో పెంచుతున్నారు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఇది ఒకటి; దీనిలోని ప్రతీభాగం ఆహారంగాను లేదా ఇతర ప్రయోజనం కలిగివున్నాయి. మునగాకులను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.

ఆఫ్రికాకు చెందిన సాంప్రదాయ ఆహారంలో మొరింగా ఆహార కొరతను తీర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడగలదు.[3]

దక్షిణ భారత దేశంలో మార్చు

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు తెలుసుకుందాం. -మునగ శాస్ర్తీయ నామం ‘మొరింగ బలిఫెర’ ఇది మొరింగేసి కుటుంబంలోనిది. సులువుగా పెంచే, తొందరగా పెరిగే మొక్క లలో ఇది ఒకటి. దీన్ని పంటగా కూడా సాగు చేస్తున్నారు. విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ధి కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం.బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని వుపయోగిస్తారు. ఎరువుగా కూడా దీన్ని వుపయోగిస్తారు. వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రయోగాల, పరిశోధనల ఫలితంగా తక్కువ వ్యయంతో మునగ విత్తనాలతో నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూ లించి, నీటిని శుద్ధి చేయొచ్చు. సాగు : -ఉత్తర భారతదేశంలోని దక్షిణ పర్వత ప్రాంతల్లో ఇది పుట్టినట్లు తెలు స్తోంది. అన్ని ప్రాంతాల నేలలు అనుకూలం. 9-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సాగు చెట్లలో అధిక దిగుబడి కోసం ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరిస్తారు. కొమ్మలు కొందికి వాలినట్లు వుండి దృఢంగా వున్నా కూడా ఇది చాలా పెళుసు. చిన్న గాలులకు, తాకిడికి సైతం విరిగిపోతుంటాయి. అందుకే మునగ చెట్టు ఎక్కకూడదని అంటారు. ఈ చెట్టు పూలు తెల్లగా, గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. కాయలు మూడు పలకలుగా 50 సెంటీ మీటర్ల పొడువు, 1-2 సెంటీ మీటర్ల వెడల్పు వుండి కాడల్లా వుంటాయి. అందుకే ములగకాడ అని కూడా అంటారు. ఎండిన తరువాత కాయలు మూడు భాగాలుగా చీలి, 3 రెక్కలతో కూడిన విత్తనాలు బయటికి వస్తాయి. విత్తనాలు కొమ్మల కత్తిరింపుల ద్వారా ఇవి విస్తరిస్తాయి. మునగ కాయలు (Drumsticks) చెట్టులో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగం. వీటిని భారతదేశంలో చిక్కుడు మాదిరిగా వండుకుంటారు. కొన్నిసార్లు మునగ గింజల్ని వేపుకొని తింటారు. మునగ పువ్వులు పుట్టగొడుగులాగా రుచికరంగా ఉంటాయి.[4]

 
కలకత్తాలోని మునగాకులు.

మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము, పొటాషియం ఎక్కువగా కలిగివుంటాయి. ఆకుకూరలు క్రింద వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ సాస్ ల లోనూ ఉపయోగిస్తారు. మురుంగకాయ్ తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.[5]

 
కలకత్తాలోని మునగ చెట్టు కాండం.

మొరింగా విత్తనాలు సుమారు 38–40% వంట నూనె ఉంటుంది (ఎక్కువగా బెహెనిక్ ఆమ్లం కలిగివుండటం వలన బెన్ నూనె అంటారు). ఈ నూనె వాసనలేకుండా, క్లియర్ గా ఉంటుంది. నూనె తీయగా వచ్చిన పిప్పిని ఎరువుగానూ, నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చును.[6]

నీటిని శుద్ది చేయుటకు మార్చు

శాస్ర్తీయ పరిశోధనల్లో విత్తనాలతో నీటిని శుద్ధి చేసే ప్రక్రియ కార్పొరేట్‌ సంస్థ అయిన జాన్‌ విల్ల హాసన్స్‌ మునగపై శాస్త్ర పరంగా ప్రయోగాలు చేసి మునగ విత్తనాలతో నీటిని పరి శుద్ధం చేయొచ్చని నిరూపించారు. విత్తనాలను తీసి బాగా మెత్తగా రుబ్బి ఆ పదా ర్థాన్ని శుద్ధి చేయాల్సిన నీటిలో బాగా కలిపి ఒక గంట సేపు వుంచాలి. పిండితో పా టు బాక్టీరియా, మలినాలు అన్నీ నీటి అడుగుకు చేరుతాయి. పైన తేలిన నీటినివినియోగించుకోవచ్చు.

మునగలోని పోషకాలు మార్చు

విటమిన్‌ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. [7]పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు.అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్‌ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌం దర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు. ఇలా వద్దు చాలా మంది మునగ కాయ గుజ్జును మాత్రమే గోటితో తీసి తింటారు. చెక్క వదిలేస్తారు. ఇలా చేస్తే అందులోని పూర్తి పోష కాలు అందనట్టే. చెక్కను నమిలి సారాన్ని కూడా తీసుకోవాలి. పెరడు వున్న వాళ్లు మునగ కొ మ్మలను నాటితే ఆరు నెలలకే కాయలు వస్తా యి. హైబ్రిడ్‌ రకాలైతే మరీ ఎత్తు పెరగకుండా కాయలు ఎక్కువగా వస్తాయి. మునగ చెట్టు ఎక్కవద్దన్నారు కానీ మునగను తినవద్దనలేదు మన పె ద్దలు. భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే ము నగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే.

దీని చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్యవిధానాలలో ఉపయోగంలో ఉన్నాయి. జమైకాలో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారుచేస్తారు.

మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. అక్కడ దీనిని sojne ful అని పిలుస్తారు. వీటిని పచ్చి శెనగలు, బంగాళాదుంపలతో కలిపి వండుతారు.[8]

ఆయుర్వేదంలో మార్చు

ఆకుకూరలలో ప్రముఖమైనది మునగ. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు కాల్షియం పుష్కలంగా ఉంది.[9]

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్కి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.

అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గితే మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.

ఇతర దేశాల్లో మార్చు

వంద గ్రా. తాజా మునగాకుల్లో... నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్‌, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్‌, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్‌- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.

అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్‌, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.

అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు... ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్‌-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.

ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్‌ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు... మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ...పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్‌ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.

నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద నెక్స్ట్‌ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే...

100 గ్రా. ఎండిన ఆకుల్లో... పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్‌-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్‌... ఇలా చాలా లభిస్తాయి.

మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్‌ వెరైటీలూ కోఫ్తాలూ... అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో... ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్‌లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.

ఔషధగుణాలెన్నో మార్చు

మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్‌ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్‌ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్‌.

అంతేనా... రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్‌ నివారిస్తుందని ఇంటర్నేషనల్‌ ఐ ఫౌండేషన్‌ అంటోంది.

ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే... కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి.

రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో... కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే.

డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్‌ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.

ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి

మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.

సీజన్‌లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్‌ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్‌ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే.

‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్‌లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.

శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.

‘తరచూ జలుబు చేస్తోందా... జ్వరమొస్తోందా... అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్‌-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్‌లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్‌ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్‌ చెప్పడానికే సందేహిస్తాయి.

‘ఏమోయ్‌... ఇంకా పిల్లల్లేరా... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.

నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ

జీర్ణమయ్యేలా చేస్తాయి.

ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.

పూలు... తేనెలూరు..!

పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.

విత్తనంతో నీటిశుద్ధి మార్చు

విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు.

రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా...!

మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్‌. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు.

మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్‌ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. Telugu, TV9 (2024-02-18). "Drumstick leaves water: చిన్నగా ఉన్నాయని తక్కువగా చూడకండి..! ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?". TV9 Telugu. Retrieved 2024-04-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. telugu, NT News (2022-08-18). "లాభాల మునగ!". www.ntnews.com. Retrieved 2024-04-01.
  3. National Research Council (2006-10-27). "Moringa". Lost Crops of Africa: Volume II: Vegetables. Lost Crops of Africa. Vol. 2. National Academies Press. ISBN 978-0-309-10333-6.
  4. "మునగ నూనెతో అందంగా." EENADU. Retrieved 2024-04-01.
  5. ABN (2024-01-06). "Drumstick tree : మునగ నూనె రాస్తే జుట్టుకు ఎంత బలమంటే.. ఈ నూనెలోని పోషకాలు గురించి తెలుసా..!". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-01.
  6. Bharat, E. T. V. (2023-12-22). "మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!". ETV Bharat News. Retrieved 2024-04-01. {{cite web}}: zero width space character in |title= at position 45 (help)
  7. ABN (2024-01-06). "Drumstick tree : మునగ నూనె రాస్తే జుట్టుకు ఎంత బలమంటే.. ఈ నూనెలోని పోషకాలు గురించి తెలుసా..!". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-01.
  8. "చలవ చేసే మునగ..." EENADU. Retrieved 2024-04-01.
  9. [1]
"https://te.wikipedia.org/w/index.php?title=మునగ&oldid=4176089" నుండి వెలికితీశారు