భారతదేశ అత్యున్నత న్యాయస్థానం

భారతదేశ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ.
(అత్యున్నత న్యాయస్థానము నుండి దారిమార్పు చెందింది)

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, దీనిని తెలుగు వాడక భాషలో, ఆంగ్ల పదం సుప్రీం కోర్టు అనే ఎక్కువుగా వాడతారు. ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానాలపై నియంత్రణాధికారం కల్గిఉంటుంది.

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


చరిత్ర

మార్చు

2019లో తీర్పులు భారతీయ భాషలలోకి అనువదించి ప్రకటించడం మొదలు పెట్టింది.

నియామకాలు

మార్చు
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 33+1=34ప్రధాన న్యాయమూర్తితో కలిపి (34) మంది న్యాయమూర్తులు ఉంటారు. 104 రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో చేశారు. ఈ కోర్టులలో
  • భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను
  • భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను
  • రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.
  • ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా ఉన్నత న్యాయస్థానంలో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా ఎవరైనా ఈ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:

  • భారతదేశ పౌరుడై ఉండాలి.
  • కనీసం 5 సంవత్సరాల కాలం ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా 10 సంవత్సరాలు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాద వృత్తి నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.

అధికార పరిధి

మార్చు
  • భారత సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానంగా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం అరవ భాగం, ఐదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది. భారత దేశం రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
  • భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం కూర్పు, అధికార పరిధిని నిర్దేశించాయి. ప్రధానంగా, ఇది రాష్ట్రాలు, ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటి‌షన్‌లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం 1950 జనవరి 28న స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 24,000 పైగా కేసులను విచారించి తీర్పులు వెలువరించింది.

సుప్రీంకోర్టు భవనం

మార్చు
  • సుప్రీంకోర్టు భవనం ప్రధాన భాగం 22 ఎకరాల చతురస్రాకార స్థలంలో నిర్మించబడింది, సిపిడబ్ల్యుడికి నేతృత్వం వహించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ముఖ్య వాస్తుశిల్పి గణేష్ భైకాజీ డియోలాలీకర్ దీనికి నమూనా తయారు చేశాడు. ఇండో-బ్రిటీష్ వాస్తు శైలిలో సుప్రీంకోర్టు భవనాన్ని నిర్మించారు. అతని తరువాత శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్ సుప్రీం కోర్టు భవన నిర్మాణానికి నేతృత్వం వహించడు.న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లోమార్చబ డింది.న్యాయస్థానంలోని త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించే విధంగా ఈ భవనం నమూనా తయారు చేయబడింది, భవనం యొక్క మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది.1979లో రెండు కొత్త భాగాలు-తూర్పు భాగం, పశ్చిమ భాగం ఈ సముదాయానికి జోడించబడ్డాయి. భవనంలోని వివిధ భాగాల్లో మొత్తం 15 కోర్టు గదులు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మిగిలిన ధర్మాసనాలన్నింటి కంటే పెద్దది. ఇది మధ్య భాగంలో ఉంటుంది.

న్యాయస్థానం ఏర్పాటు

మార్చు
  • భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, 1950 జనవరి 28న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లో దీనిని ప్రారంభించారు. దీనికి ముందు ప్రిన్సెస్ ఛాంబర్‌లో 12 ఏళ్లపాటు, 1937 నుంచి 1950 వరకు, భారత సమాఖ్య న్యాయస్థానాన్ని నిర్వహించారు. ఇప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన సముదాయం సిద్ధమయ్యే వరకు, అంటే 1958 వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఈ ఛాంబర్‌లోనే కొనసాగాయి.
  • సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అత్యున్నత న్యాయస్థానం న్యాయవాదుల సంఘంగా ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా వికాష్ సింగ్ కొనసాగుతున్నాడు.

కూర్పు

మార్చు
 
భారత అత్యున్నత న్యాయస్థానం
  • అసలు భారత రాజ్యాంగం (1950) ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 తక్కువ-హోదా కలిగిన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించింది-అయితే న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్‌కు విడిచిపెట్టింది. ప్రారంభ సంవత్సరాల్లో, తమ వద్దకు వచ్చే కేసులపై సుప్రీంకోర్టు యొక్క సంపూర్ణ ధర్మాసనం విచారణ నిర్వహించేది. న్యాయస్థానం యొక్క పని పెరిగిపోవడం, కేసులు అధిక సంఖ్యలో పేరుకుపోవడంతో 1950లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 8 వద్ద ఉండగా, దానిని 1956లో 11కి, 1960లో 14కి, 1978లో 18కి,1986లో 26కి, 2008లో 31కి 2019లో 34 మందికి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో, ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన చిన్న ధర్మాసనాలు విచారణలు జరపడం ప్రారంభమైంది (వీటిని డివిజను బెంచ్‌గా సూచిస్తారు) ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (దీనిని రాజ్యంగ ధర్మాసనంగా సూచిస్తారు) అవసరమైన సమయంలో మాత్రమే, ఒక అభిప్రాయ భేదం లేదా వివాదాన్ని పరిష్కరించేందుకు కొలువు తీరుతుంది. అవసరం ఏర్పడినప్పుడు, ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనానికి కేసును బదిలీ చేయవచ్చు.
  • భారత అత్యున్నత న్యాయస్థానంలో భారత రాష్ట్రపతి చేత నియమించబడిన భారత ప్రధాన న్యాయమూర్తి, గరిష్ఠంగా 30 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఇదిలా ఉంటే, న్యాయమూర్తులను నియమించేందుకు అత్యున్నత న్యాయస్థానంతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి. ఈ నియామకాలు సాధారణంగా అనుభవ ప్రాతిపదికన, ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలు లేకుండా జరుగుతాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత పదవీ విరమణ చేస్తారు. సుప్రీంకోర్టుకు ఒక వ్యక్తి న్యాయమూర్తిగా నియమించబడాలంటే, అతను తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి, అంతేకాకుండా కనీసం ఐదేళ్లపాటు, ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వహించి ఉండాలి లేదా వరుసగా ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ న్యాయస్థానాల్లో న్యాయమూర్తిగా పనిచేయాలి లేదా కనీసం పదేళ్లపాటు ఏదైనా ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పని చేయాలి లేదా ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నత న్యాయస్థానాల్లో వరుసగా 10 ఏళ్లపాటు న్యాయవాదిగా పని చేయాలి, లేదా రాష్ట్రపతి దృష్టిలో ఆ వ్యక్తి ఒక విలక్షణ న్యాయవేత్తగా పరిగణించబడాలి. ఒక ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఈ కోర్టులో న్యాయమూర్తులుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి.
  • అత్యున్నత న్యాయస్థానంలో ఎప్పుడూ విస్తృతమైన ప్రాంతీయ ప్రాతినిధ్యం పాటించబడుతోంది. మైనారిటీ మత, జాతులకు చెందినవారు కూడా అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తుల్లో భాగంగా ఉంటారు. 1987లో అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా నియమించబడిన మొదటి మహిళగా జస్టిస్ ఫాతిమా బీవీ గుర్తింపు పొందింది. ఆమె తరువాత న్యాయమూర్తులు సుజాతా మనోహర్, రుమా పాల్‌లు కూడా అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులుగా విధులు నిర్వహించారు.
  • అత్యున్నత న్యాయస్థానంలో అడుగుపెట్టిన దళిత వర్గానికి చెందిన మొట్టమొదటి న్యాయమూర్తిగా కె.జి. బాలకృష్ణన్ గుర్తింపు పొందాడు, 2000వ సంవత్సరంలో అతను అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 2007లో అతను మొట్టమొదటి దళిత భారత ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందాడు. అసాధారణంగా, న్యాయమూర్తులు బి.పి. జీవన్ రెడ్డి, ఎ. ఆర్. లక్ష్మణన్ భారత లా కమిషన్ ఛైర్మన్‌లుగా నియమించబడ్డారు, వీరిలో ఎవరూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకపోవడం గమనార్హం. ప్రధాన న్యాయమూర్తి వారి పదవీకాలం అయిపోవడానికి నెల రోజులు ముందు తరువాత న్యాయమూర్తి పేరును ప్రకటించాలి. అయితే 48వ ప్రధాన న్యాయమూర్తి ఎల్ వి రమణ ప్రస్తుతం 2021 సంవత్సరం నుండి 2022 ఆగస్టు నెల వరకూ కొనసాగుతాడు.

అధికార పరిధి

మార్చు
  • సుప్రీంకోర్టు అసలైన, పునర్విచారణ సంబంధ, సలహా అధికార పరిధిని కలిగివుంది.

అసలు అధికార పరిధి

మార్చు
  • భారతదేశ ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మధ్య ఏదైనా వివాదం లేదా భారత ప్రభుత్వం, ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రాలు ఒకవైపు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరోవైపు ఉన్న (త్రైపాక్షిక) వివాదం లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదంపై ఇది ప్రత్యేక అసలు అధికార పరిధి (అజమాయిషీ) కలిగివుంది, న్యాయబద్ధమైన హక్కు యొక్క అస్థిత్వం లేదా పరిధి ఆధారపడివున్న (చట్టపరమైన లేదా వాస్తవానికి సంబంధించిన) ఏదైనా ప్రశ్నకు సంబంధించిన వివాదంపై దీనికి ప్రత్యేక అజమాయిషీ ఉంటుంది. అంతేకాకుండా, రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టుకు విస్తృతమైన మూల అధికారాన్ని అందజేసింది. వీటిని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు నిందితుడిని న్యాయస్థానానికి తీసుకురమ్మనే ఆదేశాలు, ప్రవర్తకాధిలేఖ, నిషేధం, అధికారాన్ని ప్రశ్నించే ఉత్తర్వు, ఉత్ప్రేషణాధిలేఖ లకు సంబంధించిన ఉత్తర్వులతో కూడిన మార్గనిర్దేశాలు, ఆదేశాలు జారీ చేసేందుకు అధికారం కలిగివుంది.

పునర్విచారణ అధికార పరిధి

మార్చు
  • సివిల్, క్రిమినల్ రెండు రకాల కేసుల్లో ఒక హైకోర్టు యొక్క ఏదైనా తీర్పు, నిర్ణయం లేదా తుది ఆదేశానికి సంబంధించి రాజ్యాంగంలోని 132 (1), 133 (1) లేదా 134 అధికరణల పరిధిలో సంబంధిత హైకోర్టు జారీ చేసిన ఒక ధ్రువపత్రంతో సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికారానికి అర్థించవచ్చు. ఏదైనా మిలిటరీయేతర భారతీయ కోర్టు వెలువరించే తీర్పు లేదా ఆదేశంపై పునర్విచారణకు విజ్ఞప్తి చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక లీవ్ జారీ చేయగలదు. సుప్రీంకోర్టు యొక్క పునర్విచారణ అధికార పరిధిని విస్తరించే అధికారం పార్లమెంట్ కలిగివుంది, సుప్రీంకోర్టు (క్రిమినల్ అప్పీలేట్ జ్యురిడిక్షన్) యాక్ట్, 1970ను అమలు చేయడం ద్వారా క్రిమినల్ విజ్ఞప్తుల సందర్భంలో ఈ అధికారాన్ని పార్లమెంట్ ఉపయోగించింది.
  • పౌర విషయాల్లో (ఎ) సాధారణ ప్రాముఖ్యత కలిగివున్న చట్టాన్ని కేసు గణనీయమైన స్థాయిలో సవాలు చేస్తుంటే, (బి) ఒక విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని భావిస్తే అటువంటి కేసులను హైకోర్టులు సుప్రీంకోర్టుకు పంపుతాయి. హైకోర్టు (ఎ) ఒక నిందితుడిని నిర్దోషిగా విడిచిపెట్టినప్పుడు లేదా అతడికి మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్ష వరకు విధించినప్పుడు లేదా కనీసం పదేళ్ల కంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు లేదా (బి) తన పరిధిలోని ఏదైనా దిగువ కోర్టు నుంచి వచ్చిన కేసుపై విచారణ నుంచి హైకోర్టు తప్పుకున్నప్పుడు, అటువంటి విచారణలో నిందితుడికి మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ కారాగార శిక్ష విధించబడినప్పుడు లేదా (సి) సుప్రీంకోర్టుకు పునర్విచారణకు పంపేందుకు తగిన కేసుగా హైకోర్టు భావించిన క్రిమినల్ కేసు లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. ఒక హైకోర్టు క్రిమినల్ కేసు విచారణలో వెలువరించిన తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షను పునర్విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టుకు తదుపరి అధికారాల ఇవ్వడంపై ఆలోచనలు జరపడానికి పార్లమెంట్ అధికారం ఇవ్వబడింది.

సలహా అధికార పరిధి

మార్చు
  • రాజ్యాంగంలోని 143వ అధికరణ పరిధిలో భారత రాష్ట్రపతి ప్రత్యేకంగా సిఫార్సు చేసే విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు, సుప్రీంకోర్టు ప్రత్యేక సలహా అధికార పరిధిని కలిగివుంది.

న్యాయ స్వాతంత్ర్యం

మార్చు
  • వివిధ మార్గాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వాతంత్ర్యాన్ని కల్పించేందుకు రాజ్యాంగం ప్రయత్నిస్తుంది. సాధారణంగా ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండా, అనుభవం ప్రాతిపదికన న్యాయమూర్తులు నియమించబడతారు. సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిని తొలగించడానికి ఒక్కొక్క లోక్‌సభలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు హాజరైన ఓటింగ్‌లో మెజారిటీ సభ్యులు సంబంధిత న్యాయమూర్తి తొలగింపు ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలి, అనంతరం అదే సమావేశ కాలంలో రాష్ట్రపతి సమ్మతిపై జారీ అయిన ఆదేశాలతో, నిరూపించబడిన దుష్ప్రవర్తన లేదా అసమర్థత ప్రాతిపదికన సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిని తొలగించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క జీతభత్యాలు నియామకం కూడా తరువాత తగ్గించలేరు. సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి మరే ఇతర న్యాయస్థానంలో లేదా భారతదేశంలోని మరే ఇతర అధికారిక యంత్రాంగంలో పని చేయడం నిషేధించబడింది.

ధిక్కారాన్ని శిక్షించే అధికారాలు

మార్చు

భారతదేశంలోని మరే ఇతర న్యాయస్థానాన్ని లేదా తనను ధిక్కరించిన ఎవరినైనా శిక్షించేందుకు రాజ్యాంగంలోని 129, 142 అధికరణ పరిధిలో సుప్రీంకోర్టుకు అధికారం ఇవ్వబడింది. మహారాష్ట్ర మంత్రి స్వరూప్ సింగ్ నాయక్ విషయంలో సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని ఉపయోగించి ఒక అసాధారణ చర్య తీసుకుంది, 2006 మే 12న కోర్టు ధిక్కార నేరంపై అతడికి కోర్టు 1 నెల జైలు శిక్ష విధించింది. మంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి జైలుకు పంపబడటం ఇదే తొలిసారి.

జమ్మూ కాశ్మీర్

మార్చు
  • జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడొక విషయాన్ని గుర్తించాలి, చారిత్రక కారణాల వలన భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా, జమ్ము & కాశ్మీర్ ఒక ప్రత్యేక హోదా కలిగివుంది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ జమ్ము & కాశ్మీర్ కోసం కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. భారత రాజ్యాంగం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి పూర్తిగా వర్తించదు. రాజ్యాంగంలోని 370 అధికరణ ఈ విషయాన్నే తెలియజేస్తుంది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం వివిధ మార్పులు, మినహాయింపులతో వర్తిస్తుంది. కన్‌స్టిట్యూషన్ (ఆప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్) ఆర్డర్, 1955 (జమ్ము- కాశ్మీర్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ ఆదేశం, 1954) ప్రకారం ఈ మినహాయింపులు కల్పించారు. అంతేకాకుండా, భారతదేశంలో మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా, జమ్ము- కాశ్మీర్ సొంత రాజ్యాంగాన్ని కలిగివుంది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం అనేక మార్పులతో వర్తింపజేయబడుతున్నప్పటికీ, కన్‌స్టిట్యూషన్ (అప్లికేషన్ టు జమ్ము అండ్ కాశ్మీర్) ఆర్డర్, 1954 రాజ్యాంగంలోని 141 అధికరణను ఈ రాష్ట్రానికి కూడా వర్తింపజేసింది. అందువలన సుప్రీంకోర్టు ప్రకటించే చట్టం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని హైకోర్టుతోసహా, అన్ని కోర్టులకు సమానంగా వర్తిస్తుంది.

చారిత్రాత్మక తీర్పులు: న్యాయ-అధికార వ్యవస్థల మధ్య వివాదాలు

మార్చు

భూసంస్కరణలు (ప్రారంభ వివాదం)

మార్చు
  • 'జమీందార్లు (భూస్వాములు) వద్ద నుంచి సేకరించిన భూమి పునఃపంపిణీకి ఉద్దేశించిన రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను కొన్ని న్యాయస్థానాలు జమీందార్లు యొక్క ప్రాథమిక హక్కులను ఈ చట్టాలు అతిక్రమిస్తున్నాయనే కారణంతో కొట్టిపారేశాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసిన పార్లమెంట్, 1955లో భూమి పునఃపంపిణీని అమలు చేయడంలో తన అధికారాన్ని రక్షించుకునేందుకు నాలుగో రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ప్రైవేట్ ఆస్తుల నిబంధనలతోపాటు, ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదని అభిప్రాయపడుతూ, 1967లో గోల్కానాథ్ v. పంజాబ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఈ సవరణలకు వ్యతిరేకంగా స్పందించింది.

రాజ్యాంగ విరుద్ధంగా పరిగణించబడిన ఇతర చట్టాలు

మార్చు
  • ప్రభుత్వం తీసుకొచ్చిన బ్యాంకుల జాతీయీకరణ బిల్లును 1969 ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించగా, 1970 ఫిబ్రవరి 1న, సుప్రీంకోర్టు ఈ బిల్లు ఆమోదయోగ్యం కాదని తీర్పు చెప్పింది.
  • భారతదేశంలోని పాత రాచరిక రాష్ట్రాలకు చెందిన మాజీ పాలకుల పట్టాలు, ప్రత్యేకార్హతలు, వారికి చెల్లించే భత్యాలను రద్దు చేసిన రాష్ట్రపతి ఆదేశాన్ని 1970 సెప్టెంబరు 7న సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా తిరస్కరించింది.

పార్లమెంట్ నుంచి స్పందన

మార్చు
  • సుప్రీంకోర్టు నిర్ణయాలకు స్పందనగా, 1971లో భారత పార్లమెంట్ రాజ్యాంగంలోని ఎటువంటి నిబంధనను అయినా, ప్రాథమిక హక్కులతోసహా, సవరించేందుకు తనకు వీలు కల్పించే ఒక సవరణను ఆమోదించింది.
  • సరైన భూమి పరిహారానికి సంబంధించిన పరిపాలనాపరమైన నిర్ణయాలు న్యాయవ్యవస్థ-పరిధిలో లేకుండా చేసే 25వ సవరణను భారత పార్లమెంట్ ఆమోదించింది.
  • రాచరిక ప్రత్యేకార్హతలు, వారికి చెల్లించే భత్యాలు రద్దు చేసే ఒక రాజ్యాంగ అధికరణను కొత్తగా చేరుస్తూ, భారత రాజ్యాంగానికి పార్లమెంట్ ఒక సవరణను ఆమోదించింది.

సుప్రీంకోర్టు నుంచి ప్రతి-స్పందన

మార్చు

రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని సౌకర్యం కోసం మార్చకూడదని కోర్టు తీర్పు చెప్పింది. 1973 ఏప్రిల్ 24న, కేశవానంద భారతీ v. కేరళ రాష్ట్రం కేసులో, ఈ సవరణలు రాజ్యాంగబద్ధమైనప్పటికీ, అవి రాజ్యాంగం యొక్క "ప్రాథమిక నిర్మాణాన్ని" మార్చరాదని సూచిస్తూ, పార్లమెంట్ ఆమోదించిన ఈ సవరణలను తన విచక్షణాధికారంతో తోసిపుచ్చింది, ఈ నిర్ణయానికి ప్రధాన న్యాయమూర్తి సిక్రీ నేతృత్వం వహించారు.

అత్యవసర పరిస్థితి, భారత ప్రభుత్వం

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పాలించిన ఒక శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం తీవ్రంగా తగ్గించబడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలోని భారత అత్యవసర స్థితి (1975-1977) సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆమోదించిన నివారక నిర్బంధ చట్టాల పరిధిలో జైలులోని వ్యక్తుల రాజ్యాంగ హక్కులపై ఆంక్షలు విధించబడ్డాయి. హెబియస్ కార్పస్ కేసు (బంధితుడిని హాజరు పరచాల్సిందిగా న్యాయ స్థానం జారీ చేసే ఆదేశం) గా ప్రాచుర్యం పొందిన జబల్‌పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ v. శివ కాంత్ శుక్లా కేసులో ఐదుగురు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులతో కూడిన ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యవసర పరిస్థితి సందర్భంగా రాష్ట్రం యొక్క అనియంత్రిత అధికారాల హక్కుకు మద్దతుగా తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు ఎ.ఎన్. రాయ్, పి. ఎన్. భగవతి, వై.వి. చంద్రచూద్, ఎం.హెచ్. బెగ్‌లతో కూడిన ధర్మాసనంలో ఎక్కువ మంది న్యాయమూర్తులు ఈ కింది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు:

(అత్యవసర పరిస్థితి ప్రకటన పరిధిలో) నిర్బంధ ఆదేశం న్యాయబద్ధతను సవాలు చేస్తూ హెబియస్ కార్పస్‌ను లేదా ఇతర ఉత్తర్వును లేదా ఆజ్ఞ లేదా ఆదేశాన్ని కోరుతూ 226వ అధికరణ పరిధిలో హైకోర్టులో ఎటువంటి రిట్ పిటిషన్‌నైనా దాఖలు చేసే హక్కు ఎవరికీ ఉండదు.

న్యాయమూర్తి హన్స్ రాజ్ ఖన్నా ఒక్కడు మాత్రమే ఈ కింది విధంగా భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు:

వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకునే వారందరికీ విచారణ లేకుండా నిర్బంధమనేది ఒక శాపం... ఈ భిన్నాభిప్రాయం చట్టం గురించి లోలోపల రుగులుతున్న కోపంతో చేసే దీర్ఘ యోచనకు, న్యాయమూర్తి న్యాయస్థానం మోసగించబడిందని భావించిన సందర్భాన్ని తరువాతి నిర్ణయం సరిచేయబడే భవిష్యత్ రోజు వివేకానికి ఒక విజ్ఞప్తి అని పేర్కొన్నారు.

ఈ కేసులో తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ముందు న్యాయమూర్తి ఖన్నా తన సోదరితో మాట్లాడుతూ: నేను నా తీర్పును సిద్ధం చేసుకున్నాను, ఈ తీర్పు వలన నాకు ప్రధాన-న్యాయమూర్తి పదవి దక్కకపోవోచ్చని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జనవరి 1977లో ప్రధాన న్యాయమూర్తి పదవికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సిఫార్సు చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆ సమయానికి అత్యంత అనుభవజ్ఞుడిగా ఉన్న ఖన్నాను విస్మరించి ఆయన స్థానంలో మరొకరిని నియమించింది, ఈ విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి అత్యంత అనుభవజ్ఞుడై ఉండాలనే సంప్రదాయానికి ప్రభుత్వం భిన్నంగా ప్రవర్తించింది. వాస్తవానికి, ఒకే విధమైన తీర్పును వెలువరించిన కారణంగా ఇతర న్యాయమూర్తుల కీర్తి గతంలోనే ఉండిపోయింది. న్యాయమూర్తి ఖన్నా మాత్రం ఈ భిన్నాభిప్రాయంతో భారతదేశ న్యాయ సమాజంలో ఒక చిరస్మరణీయ వ్యక్తిగా నిలిచిపోయారు.

న్యూయార్క్ టైమ్స్ ఈ కింది అభిప్రాయాన్ని వెలిబుచ్చింది: "ఒక నిరంకుశత్వ ప్రభుత్వానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ లొంగిపోవడం ప్రజాస్వామ్య సమాజ వినాశనానికి చివరి అడుగు; భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం పూర్తిగా లొంగిపోవడానికి దగ్గరగా ఉంది."

అత్యవసర పరిస్థితి సందర్భంగా, ప్రభుత్వం 39వ సవరణను తీసుకొచ్చింది, ప్రధాన మంత్రి ఎన్నికకు న్యాయపరమైన సమీక్షను ఇది పరిమితం చేస్తుంది; అంతేకాకుండా పార్లమెంట్ చేత ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ ఈ ఎన్నికను సమీక్షిస్తుంది. ముందు కేశవానంద్ నిర్ణయం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఈ నిరోధకానికి (1975) న్యాయస్థానం సాధువు మాదిరిగా అంగీకరించింది.తరువాత, పార్లమెంట్, అత్యవసర పరిస్థితి సందర్భంగా ఎక్కువ మంది ప్రతిపక్ష సభ్యులు జైలులో ఉన్నప్పుడు, 42వ సవరణను ఆమోదించింది, ధ్రువీకరణకు సంబంధించిన ప్రక్రియాపరమైన విషయాలకు మినహాయింపును ఇచ్చి, రాజ్యాంగానికి చేసిన ఎటువంటి సవరణను అయినా సమీక్షించే అధికారం ఏ న్యాయస్థానానికి లేకుండా చేయడానికి ఈ సవరణ చేయబడింది. అయితే అత్యవసర పరిస్థితి అనంతరం కొన్ని సంవత్సరాలకు, సుప్రీంకోర్టు 42వ అధికరణ యొక్క సంపూర్ణతను తిరస్కరించింది, మినెర్వా మిల్స్ కేసు (1980) విషయంలో న్యాయ సమీక్షకు సంబంధించిన అధికారాన్ని తిరిగి పొందింది.

అత్యవసర పరిస్థితి సందర్భంగా ఒక చివరి చర్యగా, ప్రధాన న్యాయమూర్తితో కుదిరిన ఏకాభిప్రాయంతో, న్యాయమూర్తులను దేశవ్యాప్తంగా ఇష్టమొచ్చినట్లు మార్చారు, దీనిని V.R. కృష్ణా అయ్యర్ హైకోర్టు స్వాతంత్ర్యంపై ఒక కత్తిపోటుపై వర్ణించారు.

1980-తరువాత: నిశ్చయార్థక సుప్రీంకోర్టు

మార్చు

న్యాయమూర్తి ఖన్నా సూచించినట్లుగా లోలోపల రుగులుతున్న కోపంతో చేసిన దీర్ఘ యోచనతో, అదృష్టవశాత్తూ భారతదేశంలో న్యాయశీలత జరిగిన అన్యాయాలు అత్యవసర పరిస్థితి తొలగించబడిన కొద్ది కాలానికే సరిచేయబడ్డాయి.

1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ పరాజయం పాలైన తరువాత, మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ (గతంలో ఆయన హెబియస్ కార్పస్ కేసులో అవిచారిత నిర్బంధితుడి కోసం వాదించారు) అత్యవసర పరిస్థితి ప్రకటించడాన్ని మరింత కష్టతరం చేసేందుకు అనేక సవరణలు తీసుకొచ్చారు, సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని చాలావరకు పునరుద్ధరించారు. కేశవానంద కేసులో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం ఇందిరా గాంధీ యొక్క కేసులో మరింత బలపడింది, మినెర్వా మిల్స్ కేసుతో ఇది బాగా పటిష్ఠపరచబడింది.

అత్యవసర పరిస్థితి తరువాత రాజ్యాంగంలోని 21 అధికరణ (జీవనం, వ్యక్తిగత స్వేచ్ఛ) కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన సృజనాత్మక, విస్తృత అర్థ వివరణ ప్రజా హిత వ్యాజ్యానికి ఒక కొత్త న్యాయ శాస్త్ర మీమాంసను పెంపొందించింది, ఈ పరిణామం పరిమితం చేయని అనేక ముఖ్యమైన ఆర్థిక, సామాజిక హక్కులతోసహా (రాజ్యాంగబద్ధంగా రక్షించబడిన, అమలు చేయలేని హక్కులు), ఉచిత విద్య, జీవనోపాధి, పరిశుభ్ర పర్యావరణం, ఆహారం, అనేక ఇతర హక్కులను బాగా ప్రోత్సహించింది. పౌర, రాజకీయ హక్కులు (ఇవి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల విభాగంలో సంప్రదాయబద్ధంగా పరిరక్షించబడ్డాయి) కూడా విస్తరించబడ్డాయి, వీటికి మరింత మెరుగైన భద్రత లభించింది. ఈ కొత్త అర్థ వివరణలు అనేక ముఖ్యమైన సమస్యలపై వ్యాజ్యం దాఖలు చేసేందుకు విస్తృత అవకాశం కల్పించాయి. ADM జబల్‌పూర్ కేసులో అత్యవసర పరిస్థితి సందర్భంలో కూడాజీవించే హక్కును తీసేసుకోరాదని తీర్పు చెప్పిన న్యాయమూర్తుల్లో 21వ అధికరణకు విస్తరించిన అర్థ వివరణకు మార్గదర్శకుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాన న్యాయమూర్తి P N భగవతి కూడా ఒకరు కావడం గమనార్హం.

ఇటీవలి ముఖ్యమైన కేసులు

మార్చు

2000 సంవత్సరం తరువాత సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో కోయెల్హో కేసు (I.R. కోయెల్హో v. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (తీర్పు 2007 జనవరి 11న ఇవ్వబడింది) ఒకటి. 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంపూర్ణ ఏకాభిప్రాయంతో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని మరోసారి నొక్కివక్కాణించింది. మాజీ ప్రభుత్వ న్యాయమూర్తి సోలీ సోరాబ్జీ ఈ తీర్పుపై మాట్లాడుతూ, I.R. కోయెల్హో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించిందన్నారు. వాస్తవంలో కోర్టు మరింత ముందుకెళ్లి, న్యాయస్థానం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంగా పరిగణిస్తున్న ఎటువంటి ప్రాథమిక హక్కునైనా ధిక్కరించే రాజ్యాంగ సవరణను, దాని యొక్క ప్రభావం, పరిణామాల ఆధారంగా తిరస్కరించవచ్చని అభిప్రాయపడింది. ఈ తీర్పు నిర్దిష్ట ప్రాథమిక హక్కుల సిద్ధాంతాలకు సంబంధించి పార్లమెంట్ యొక్క రాజ్యాంగ అధికారంపై మరింత పరిమితులు విధించింది. ప్రాథమిక హక్కులను అతిక్రమించే విధంగా రాజ్యాంగాన్ని సవరణలు చేయరాదని గోలక్ నాథ్ కేసులో వెల్లడించిన నిర్ణయాన్ని వాస్తవానికి కోయెల్హో కేసులో తీర్పులో పునరుద్ధరించింది, ఈ తీర్పు కేశవానంద భారతి కేసులో తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉంది. బాగా గౌరవించబడిన ఈ తీర్పు స్పష్టతకు అనుకూలంగా లేదు. ఇది 'హక్కుల పరీక్ష సారాంశం' వంటి అస్పష్ట అంశాలను పరిచయం చేసింది. 21, 14, 19 అధికరణల నిబంధనలు, వాటి కింద అంతర్లీనంగా ఎటువంటి నియమాలు ఉన్నాయి? అనే అంశాలను వ్యక్తపరిచింది. కోయెల్హో తీర్పును వివరించడంలో తదుపరి చిక్కులను చూసేందుకు ప్రవక్తలు అవసరం లేదు, ఇది ప్రబలమైన అనుమానాన్ని కలిగిస్తుంది." ప్రసిద్ధ భారతీయ బ్లాగు 'లా అండ్ అదర్ థింగ్స్'లో పేర్కొనబడినట్లు, ఓస్లోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రస్తావించబడింది.

ఇదిలా ఉంటే, అశోక కుమార ఠాగూర్ v. భారత సమాఖ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరో ముఖ్యమైన తీర్పును వెలువరించింది; ఈ కేసులో ధర్మాసనం "సంపన్న శ్రేణి" ప్రమాణాలకు సంబంధించి కేంద్రీయ విద్యా సంస్థల (ప్రవేశాల్లో రిజర్వేషన్లు) చట్టం, 2006ను సమర్థించింది. ముఖ్యంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాల సుప్రీంకోర్టు సమీక్షకు ఆచరించే 'కఠిన పరిశీలనా' ప్రమాణాలను అనుసరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇదే సమయంలో, అనుజ్ గార్గ్ v. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (2007) కేసులో న్యాయస్థానం కఠిన పరిశీలనా ప్రమాణాలు వర్తింపజేసింది ()

అరావళి గోల్ఫ్ కోర్స్, ఇతర కేసుల్లో, సుప్రీంకోర్టు (ముఖ్యంగా న్యాయమూర్తి మర్కండేయ కట్జు) క్రియాశీల పాత్ర తీసుకోవడం గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

న్యాయమూర్తుల అవినీతి , దుష్ప్రవర్తన

మార్చు

2008లో సుప్రీంకోర్టును వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి, న్యాయవ్యవస్థ అగ్రభాగంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు పన్ను చెల్లింపుదారుల డబ్బుతో విలాసవంతమైన వ్యక్తిగత సెలవులు అనుభవించడం, వ్యక్తిగత ఆస్తి వివరాలను బహిర్గతం చేసేందుకు నిరాకరించడం, న్యాయమూర్తుల నియమాకంలో రహస్యాలు నుంచి, సమాచార హక్కు చట్టం కింద కూడా తమ ఆస్తి వివరాలు బయటపెట్టకపోవడం వరకు ప్రతి అంశం వివాదాస్పదమైనంది. భారత ప్రధాన న్యాయమూర్తి K.G.బాలకృష్ణన్ తన పదవిపై చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకు పాత్రమయ్యాయి, తన పదవి ప్రజా సేవకుడి హోదా కాదని, ఇది ఒక రాజ్యాంగ అధికారమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన తరువాత తన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గారు. విధులను నిర్వహించడంలో విఫలమవుతుండటంపై న్యాయవ్యవస్థ ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ఇద్దరి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ న్యాయవ్యవస్థలో అవినీతి ప్రధాన సవాలుగా ఉందని, దీనిని తక్షణమే నిరోధించాల్సిన అవసరం ఉందని సూచించారు.

భారత ప్రభుత్వ కేంద్ర మంత్రివర్గం దేశ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జాతీయ న్యాయ మండలి పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇటీవల న్యాయమూర్తుల విచారణ (సవరణ) బిల్లు 2008ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది, ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణలపై దర్యాప్తు జరపనుంది. అయితే, ఈ బిల్లు కూడా హాస్యాస్పదంగా ఉందని, ప్రజలను నోరునొక్కేందుకు, ఆరోపణలను అణిచివేసేందుకు ఇది ఉద్దేశించబడిందని ఆరోపణలు వచ్చాయి. బిల్లు ప్రకారం, న్యాయమూర్తులతో కూడిన ఒక కమిటీ న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలను విచారిస్తుంది, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులపై ఎటువంటి విచారణ చేపట్టరాదు, ఇది సహజమైన న్యాయ సిద్ధాంతాలకు విరుద్ధం, న్యాయమూర్తులపై చేసిన ఏదైనా ఫిర్యాదు "పసలేనిదని" లేదా "విసిగించేదని" తేలితే, సదరు ఫిర్యాదు చేసిన పౌరుడికి శిక్ష లేదా జరిమానా విధించవచ్చు, ఈ చర్యలు న్యాయమూర్తులపై వాస్తవమైన ఫిర్యాదులు చేయాలనుకునే వారిని నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి.

సీనియర్ న్యాయమూర్తులు

మార్చు
  • న్యాయమూర్తి B N అగర్వాల్, న్యాయమూర్తి V S సిర్పుర్కార్, G S సింఘ్వీ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా అభిప్రాయపడింది :
    "న్యాయమూర్తులందరూ అవినీతి కళంకం లేనివారు అని మేము ధృవీకరించడం లేదు. నల్ల గొర్రెలు అన్నిచోట్లా ఉంటాయి. ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి ఉందనేది మాత్రమే ప్రశ్న."
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి అగర్వాల్:
    "రాజకీయ నాయకులు, న్యాయవాదులు , సమాజం నడవడిక సంగతేంటి? మేము అవినీతి జరుగుతున్న సమాజం నుంచే వచ్చాం, స్వర్గం నుంచి దిగిరాలేదు. చూసేందుకు ఇక్కడ మీరే స్వర్గం నుంచి దిగివచ్చినట్లు అనిపిస్తుంది, అందువలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు."
  • న్యాయమూర్తి అరిజిత్ పసాయత్, న్యాయమూర్తి V S సిర్పుర్కార్, న్యాయమూర్తి G S సింఘ్వీ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం :
    "ఎవరైనా న్యాయమూర్తి యొక్క సర్వశ్రేష్ఠ యోగ్యత గురించి కాకుండా, కొంత మంది న్యాయమూర్తులు చాలా నిజాయితీపరులుగా పౌరులు వర్గీకరించడం వలన ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వ్యవస్థ. వేళ్లు పెకలించేందుకు మనం సరైన పద్ధతిని గుర్తించాలి."
    "ఇప్పుడున్న విధానం పాతబడిపోయిందా? కొన్ని చిన్న మార్పులతో, ఈ విధానం ఇప్పటికీ సమర్థవంతంగా ఉంటుందా?"
  • న్యాయమూర్తి G S సింఘ్వీ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం :
    "వేరు పాతుకుపోయింది." పడిపోతున్న ప్రమాణాలను సూచిస్తున్న, విచారణ నుంచి తమకు రక్షణ కల్పించుకోవాలని న్యాయమూర్తుల కోరికను ప్రశ్నిస్తున్న సీనియర్ న్యాయవాది అనీల్ దేవాన్, సొలిసిటర్ జనరల్ G. E. వాహన్‌వతిలతో న్యాయమూర్తులు ఏకీభవిస్తున్నట్లు కనిపించింది.

సీనియర్ ప్రభుత్వ అధికారులు

మార్చు
  • భారత మాజీ రాష్ట్రపతి, APJ అబ్దుల్ కలాం :
    "కేసులు సుదీర్ఘకాలం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి కొనసాగితే, పౌరులు న్యాయవ్యవస్థేతర చర్యలను ఆశ్రయిస్తారు.."
  • భారత రాష్ట్రపతి, ప్రతిభా పాటిల్ : న్యాయ సంస్కరణలపై జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ
    "న్యాయం అందించడంలో జరుగుతున్న జాప్యం నుంచి న్యాయవ్యవస్థ తప్పించుకోలేదు, దీని వలన ఘాతకాలు ప్రోత్సహించబడే భయంకరమైన ప్రమాదం పొంచివుంది."
    "మన న్యాయ వ్యవస్థ అందరికీ సంపూర్ణ న్యాయం అందిస్తుందని , నిజం, విశ్వాసం, ఆశలకు వెలుగుగా ఉంటుందని మనం పెట్టుకున్న అంచనాలపై తీవ్ర ఆత్మపరీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది."
    "వాస్తవానికి, అసమగ్రత , కళంకాల్లో న్యాయ యంత్రాంగం తన భాగం లేకుండా లేదు."
  • భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, Y. K. సభర్వాల్ :
    "న్యాయం అందించే వ్యవస్థ దాని యొక్క అధో స్థితికి చేరుకుంది"
  • లోక్‌సభ స్పీకర్, మీరా కుమార్ :
    "ఈ దేశ పౌరురాలిగా, అనేక దశాబ్దాలు అనుభవం ఉన్న న్యాయవాదిగా, నాకు ఒక న్యాయవ్యవస్థ అధికారిపై ఆరోపణలకు సంబంధించి గుసగుసలు వినిపించినా కూడా వేదన కలిగిస్తుంది … అయితే నిజమేమిటంటే, న్యాయవ్యవస్థ అధికారులపై ఆరోపణలు వాస్తవికత సంతరించుకుంటున్నాయి. కేవలం 20 శాతం మంది న్యాయమూర్తులు మాత్రమే అవినీతిపరులని ఒక ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. మరో న్యాయమూర్తి ఇటువంటి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఎటువంటి అంతర్గత ప్రక్రియలు లేవని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందువలన, దీనికి సంబంధించి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని న్యాయమూర్తులే నొక్కివక్కాణిస్తున్నారు. ఈ యంత్రాంగాన్ని ఏ విధంగా తీసుకురావాలి , దీనిని ఎవరు తీసుకురావాలనే ప్రశ్న ఉదయిస్తుంది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేని ఒకేఒక్క విలక్షణ వ్యవస్థగా న్యాయ విభాగం ఉంది. ఈ మొత్తం సందర్భంలో, న్యాయవ్యవస్థను జవాబుదారీగా చేసే ప్రక్రియలో బయటి అంశాలను చేర్చాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది."
  • అదనపు సొలిసిటర్ జనరల్, G. E. వాహన్‌వతి : ఢిల్లీ హైకోర్టు చేపట్టిన ఒక విచారణలో
    "CJIకి తెలియజేసిన ఆస్తుల వంటి న్యాయమూర్తుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రస్తుత RTI పరిధిలో బహిర్గతం చేయడానికి వీలు లేదు, దీనికి సంబంధించి తగిన విధంగా సవరణలు చేయాలి."
    "(న్యాయమూర్తుల ఆస్తులకు సంబంధించి) తెలియజేసిన సమాచారం స్పష్టంగా వ్యక్తిగత సమాచారం మాత్రమే, వీటిని బహిర్గతం చేయడం ఎటువంటి ప్రజా కార్యకలాపానికి సంబంధించిన విషయం కాదు."

ప్రణబ్ ముఖర్జీ :
"నిర్మాణాత్మక విమర్శలు ప్రోత్సహించబడాలి." న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యాలు, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కారణమవుతున్నాయనే వాదనకు ఆయన కూడా గొంతు కలిపారు. న్యాయవ్యవస్థ ప్రాథమిక సదుపాయాలను పటిష్ఠపరచాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

న్యాయ దేవత

మార్చు

బ్రిటీష్ కాలం నాటి నుంచి న్యాయ దేవత (లేడీ ఆఫ్‌ జస్టిస్‌) ప్రతిమ కళ్లకు గంతలు కట్టి, ఒక చేతిలో ఖడ్గం పట్టి ఉంటుంది. న్యాయ దేవత వేషధారణ కూడా విదేశీవనితలా ఉంటుంది. అయితే, నూతనంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం భారతీయ సంప్రదాయ చీరకట్టుతో కొత్త విగ్రహాన్ని రూపొందించింది. కళ్ల గంతలను తొలగించి, న్యాయ దేవత చేతిలో ఉండే ఖడ్గం స్థానంలో రాజ్యాంగం ప్రతిని ఉంచింది. 2024 అక్టోబరులో సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఈ నూతన విగ్రహం ఏర్పాటు చేసింది. న్యాయదేవత మరో చేతిలో కనిపించే త్రాసు అలాగే ఉంటుంది. బ్రిటిష్‌ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ భారతదేశంలో కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయ దేవత విగ్రహంలోనూ మార్పులు సూచించిన జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

మార్చు

సూచనలు

మార్చు