కుట్టి పద్మిని
కుట్టి పద్మిని దక్షిణ భారతదేశపు సినిమా నటి. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఈమె తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది.[1] ఈమె తన మూడవయేట 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఈమె ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలైన నటులతో కలిసి నటించింది. ఈమె తమిళనాడు రాష్ట్రం నుండి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకున్న తొలి కళాకారిణి.[2]
కుట్టి పద్మిని(kutty padmini) | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, సినిమా నిర్మాత, వాణిజ్యవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1959-ప్రస్తుతం |
పిల్లలు | కీర్తన, రిధినెక, ఆర్య |
వ్యక్తిగత జీవితం, నేపథ్యం
మార్చుకుట్టి పద్మిని మద్రాసులోని ఒక సాంప్రదాయ అయ్యంగార్ కుటుంబంలో 1956, జూన్ 5వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి శ్రీనివాస చక్రవర్తి ఎం.జి.ఎం.ఇండియా కంపెనీకి జనరల్ మేనేజర్‌గా పనిచేసేవాడు. అతడు కొన్ని సినిమాలకు నిర్మాత కూడా. ఈమె తల్లి రాధాబాయి ఆ కాలంలో పేరు గడించిన సినిమానటి. ఆమె వందకు పైగా తమిళ సినిమాలలో నటించింది. వాటిలో జంటిల్‌మేన్, అగ్ని నక్షత్రం వంటి సినిమాలు ఉన్నాయి. కుట్టిపద్మిని తన 3వ యేటనే సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. బాల్యం నుండే సినిమాలలో పనిచేయడం వల్ల ఈమె చదువు కొనసాగలేదు. కానీ ప్రైవేటుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ సాహిత్యంలో బి.ఎ. చదువగలిగింది.
వృత్తి
మార్చుకుట్టి పద్మిని తన మూడవయేట సినిమా ప్రపంచంలోనికి అడుగు పెట్టింది. ఈమె పలు చిత్రాలలో బాలనటిగా నటించింది. వాటిలో ముఖ్యంగా పేర్కొనవలసినది 1965లో విడుదలైన కుళందయుం దైవముం. ఈ చిత్రంలో జమున, జైశంకర్‌లతో కలిసి నటించింది. ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలోని ఈమె నటనకు గాను ఈమెకు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా తరువాత ఈమెతోనే తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పునర్నిర్మించబడింది. ఈ చిత్రంలోని నటనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈమెను సత్కరించాయి.[3] ఈమె ఇంకా పసమలర్, నవరాత్రి, లేత మనసులు, ఒడయిల్ నిన్ను, తిరువరుచెల్వర్, తిరుమల్ పెరుమై మొదలైన చిత్రాలలో బాలనటిగా ప్రేక్షకుల మొప్పును పొందింది.[4]
సహాయ నటిగా
మార్చుఈమె సహాయనటిగా అనేక చిత్రాలలో నటించింది. పెన్మణి అవల్ కన్మణి, అవల్ అప్పడితాన్, అవర్ గళ్ మొదలైన సినిమాలలో నటించింది.కణ్ సిమిత్తం నేరం సినిమాలో శరత్‌కుమార్ సరసన నటించింది.
నిర్మాతగా
మార్చుఈమె 1983లో నిర్మాతగా మారి అనేక తమిళ టి.వి.సీరియళ్ళను నిర్మించింది. ఈమె తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా అనేక తమిళ, హిందీ సీరియళ్ళను నిర్మించి, దర్శకత్వం వహించి, కథలను అందించి, నటించింది. నిర్మాతగా ఈమె తమిళ సినిమా రంగానికి అనేక మంది కొత్త కళాకారులను తన టి.వి.సీరియళ్ల ద్వారా అందించింది.
సినిమాలు
మార్చుఈమె నటించిన తెలుగు సినిమాల జాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | వివరాలు |
---|---|---|---|
1959 | దైవబలం | ||
1959 | ఇల్లరికం | ||
1960 | శాంతి నివాసం | ||
1961 | భక్త జయదేవ | ||
1962 | మంచి మనసులు | ||
1963 | ఇరుగు పొరుగు | ||
1965 | అంతస్తులు | ||
1966 | ఆస్తిపరులు | అమ్ములు | |
1966 | శకుంతల | భరతుడు | |
1966 | నవరాత్రి | ||
1966 | లేత మనసులు | పప్పి / లల్లి (ద్విపాత్రాభినయనం) | |
1967 | చిక్కడు దొరకడు | ||
1969 | ఏకవీర | ||
1969 | కథానాయకుడు | ||
1969 | విచిత్ర కుటుంబం | ||
1970 | పసిడి మనసులు | ||
1971 | విచిత్ర దాంపత్యం | ||
1971 | అమాయకురాలు | ||
1972 | విచిత్రబంధం | ||
1972 | కులగౌరవం | ||
1978 | చిలిపి కృష్ణుడు | కాలేజి స్టూడెంట్ | |
1982 | AnthaBanthalu | As a patient | |
1985 | జీవిత బంధం | ||
1986 | కారు దిద్దిన కాపురం | ||
1988 | ఇల్లు ఇల్లాలు పిల్లలు | ||
1996 | పవిత్ర బంధం |
అవార్డులు, సన్మానాలు
మార్చు- ఉత్తమ బాల నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం - "కుళందయుం దైవమం" చిత్రానికి.
- కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు "ఒడెయిల్ నిన్ను" చిత్రానికి.
- మద్రాసు రోటరీ క్లబ్బు వారిచేత సన్మానం.[5]
మూలాలు
మార్చు- ↑ jointscene.comలో కుట్టి పద్మిని ప్రొఫైల్
- ↑ "డైరెక్టొరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్" (PDF). iffi.nic.in. Archived from the original (PDF) on 2016-04-15. Retrieved 2017-06-18.
- ↑ గై, రాండర్. "కుళందయుం దైవముం 1965". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-06-19.
- ↑ రాజ్యాధ్యక్ష, ఆశిష్; విల్మన్, పాల్ (2014-07-10). ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781135943189.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-02. Retrieved 2017-06-27.