గౌతమిపుత్ర శాతకర్ణి (సినిమా)

గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన 2017 నాటి తెలుగు సినిమా. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, శ్రియ జంటగా నటించగా, ప్రముఖ హిందీ నటి హేమా మాలిని ప్రధాన పాత్రను పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ నటించిన 100వ సినిమా. జనవరి 12, 2017న విడుదలయింది.

గౌతమీపుత్ర శాతకర్ణి (సినిమా)
దర్శకత్వంజాగర్లమూడి రాధాకృష్ణ
రచనబుర్రా సాయి మాధవ్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేజాగర్లమూడి రాధాకృష్ణ
కథజాగర్లమూడి రాధాకృష్ణ
నిర్మాతబిబో శ్రీనివాస్ (సమర్పకుడు)
జాగర్లమూడి సాయిబాబు
వై. రాజీవ్ రెడ్డి
పంగులూరి సుహాసిని
తారాగణంనందమూరి బాలకృష్ణ
శ్రియా సరన్[1]
ఛాయాగ్రహణంజ్ఞాన శేఖర్
కూర్పుసూరజ్ జగ్‌తప్
అర్రం రామకృష్ణ
సంగీతంచిరంతన్ భట్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుశ్రేష్ఠ్ మూవీస్
విడుదల తేదీ
12 జనవరి 2017 (2017-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

అఖండ గణ రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని ఒక్క రాజ్యంగా మార్చే లక్ష్యంతో తన తల్లి గౌతమి బాలాశ్రీ (హేమా మాలిని)కి ఇచ్చిన మాటకు కట్టుబడి యుద్ధాలు చేస్తుంటాడు శాతకర్ణి (నందమూరి బాలకృష్ణ).

కుంతల రాజ్యాన్ని జయించిన శాతకర్ణి కళ్యాణ దుర్గం రాజు ఖాంజీ (మిళింద్ గునాజి)కి, సౌరాష్ట్ర రాజు నహపాణుడు (కబీర్ బేడి)కి సామంతులుగా మారమని తన దూతల ద్వారా లేఖలు పంపడంతో కథ ఆరంభం అవుతుంది. అయతే, ఆ లేఖను అంగీకరించకుండా నహపాణుడు ఓ దూతను చంపగా, ఖాంజీ మరో దూతను బంధించి యుద్ధానికి సిద్ధమవుతారు. మొదటి యుద్ధంలో ఖాంజీని ఓడించి కళ్యాణ దుర్గాన్ని సొంతం చేసుకుంటాడు శాతకర్ణి.

నహపాణుడు తన సామంత రాజులను తన రాజ్యాన్ని రక్షించవలసినదిగా ఆజ్ఞాపిస్తూ వారి కొడుకులను తన వద్ద బంధీలుగా ఉంచుకుంటాడు. ఆ పరిస్థితిలో నహపాణుడుతో యుద్ధానికి తన కొడుకు పులోమావి (మాస్టర్ స్నేహిత్ చౌదరి)ని తీసుకొనివెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు శాతకర్ణి. దానికి అడ్డుపడుతుంది అతడి భార్య వాశిష్ఠి దేవి (శ్రియా సరన్). ఆవిడ మాటను కాదని బలవంతంగా పులోమావిని యుద్ధానికి తీసుకొనివెళ్ళి నహపాణుడిని జయించి గణ రాజ్యాలన్నింటినీ ఒకే రాజ్యంగా మలిచి అతడి రాజధాని అయిన అమరావతికి తిరిగొస్తాడు.

తాను జయించిన 33 రాజ్యాల రాజులనుండి సొంతం చేసుకున్న 33 రాజఖడ్గాలను కరిగించి ఒకే ఖడ్గంగా మార్చి రాజసూయ యాగం చేయాలని శాతకర్ణి తల్లి ఆదేశిస్తుంది. భార్య ప్రక్కన లేని మగవాడు యాగానికి అనర్హుడని గౌతమి బాలాశ్రీ అభ్యర్ధన మేరకు యాగం ముగిసేవరకు ఉండి, ఆ తరువాత తన బిడ్డలతో తన పుట్టింటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది వాశిష్ఠి. రాజసూయ యాగంలో అగ్రతాంబూలం తన తల్లికి ఇవ్వాలని సంకల్పించిన శాతకర్ణిని సామంతులు వారించగా, తల్లి గొప్పతనం గురించి అందరికి వివరించి, ఇకపై తాను గౌతమిపుత్ర శాతకర్ణిగా, తన కొడుకు వాశిష్ఠిపుత్ర పులోమావిగా రాజ్యాన్ని పాలిస్తారని చెప్పి, తన తల్లికి అగ్రతాంబూలం ఇస్తాడు శాతకర్ణి. ఆ రోజు నుండి శాలివాహన శకాన్ని ప్రారంభిస్తూ ఆ రోజుని ఉగాది పర్వదినంగా ప్రకటిస్తాడు. తన తప్పు తెలుసుకున్న వాశిష్ఠి కూడా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంది.

ఇదిలావుండగా, భారతదేశం సరిహద్దుల్లో తన సైన్యంతో పొంచివున్న డెమెత్రియస్ (డేవిడ్ మనుచరావ్), రాజసూయ యాగాన్ని అనువుగా తీసుకొని, సింధు రాజ్యం నుండి ఆక్రమించడం మొదలుపెడతాడు. ఖాంజీ సాయంతో శాతకర్ణిని అంతం చేయడానికి తన మనుషులను పంపుతాడు. కానీ వారిని హతమార్చి, మోసం చేసినందుకు ఖాంజీని కూడా చంపుతాడు శాతకర్ణి. తనకన్నా మిక్కిలి సైన్యమున్న డెమెత్రియస్ ను ఎదురుకోవడానికి తన సైన్యంతో సింధు రాజ్యానికి బయలుదేరుతాడు. తనకేవో చెడు శకునాలు కనిపించాయని, ఆ యుద్ధానికి వెళ్ళవద్దని, వెళితే శాతకర్ణి ప్రాణాలకే ప్రమాదమని అంటుంది వాశిష్ఠి. తన ప్రాణంకన్నా తన ఆశయమే గొప్పదని ఆమెకు నచ్చజేప్తాడు శాతకర్ణి. ఆ శకునాలను గురించి గౌతమి బాలాశ్రీ బౌద్ధమత గురువుని సంప్రదించగా, ఆ శకునాలు నిజమేనని, విషానికి విరుగుడుగా ఓ మందునిస్తాడు గురువు.

తనకన్నా తక్కువ సైన్యం ఉన్నప్పటికీ తనతో ధీటుగా పోరాడే శాతకర్ణిని అడ్డుకునేందుకు తన సహాయకురాలు, కళ్యాణదుర్గం యుద్ధంలో శాతకర్ణి చేతిలో మరణించిన పరితస్ అనే గ్రీకు సైన్యాధ్యక్షుడి ప్రియురాలు అథెనా (ఫరాహ్ కరీమ)ను పంపుతాడు డెమెత్రియస్. అథెనా రాయబారిగా నటించి శాతకర్ణి ఒంట్లో విషం నింపి అతడు కుప్పకూలేలా చేస్తుంది. బౌద్ధ గురువిచ్చిన విరుగుడు మందుతో చికిత్స పొందుతూ మరుసటి రోజున యుద్ధానికి వెళ్ళలేకపోతాడు శాతకర్ణి. అతడి ఆశయాన్ని అర్థం చేసుకున్న సామంతులు డెమెత్రియస్ సేనను ఎదురుకోవడం మొదలుపెడతారు. ఇంతలో శాతకర్ణి తిరిగొచ్చి డెమెత్రియస్ ను ఓడించి అతడిని చంపకుండా, భారతదేశపు సమైక్యతను దెబ్బతీయడం ఎవరివల్ల కాదని ప్రపంచానికి తన మాటగా చాటిచెప్పమని చెప్పడంతో కథ ముగుస్తుంది.

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

ఈ సినిమా ఏప్రిల్ 8, 2016న ఉగాది సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ప్రకటించబడింది. ఆ తరువాత సినిమా ప్రారంభోత్సవం ఏప్రిల్ 22, 2016న హైదరాబాదు లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, నటులు చిరంజీవి, దగ్గుబాటి వెంకటేష్, దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావు, బోయపాటి శ్రీను, శ్రీవాస్, నిర్మాతలు సాయి కొర్రపాటి, అక్కినేని రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.[7][8][9]

కథానాయికగా మొదట్లో అనుష్క శెట్టి, నయనతార ల పేర్లు వినిపించాయి. కానీ ఆ ఆవకాశం శ్రియ శరన్ కు దక్కింది. సినిమాలో ముఖ్య పాత్ర అయిన గౌతమి బాలశ్రీగా ప్రముఖ హిందీ నటి హేమమాలిని ని ఎంచుకున్నారు. సంగీత దర్శకుడిగా మొదట దేవీశ్రీప్రసాద్ ను ఎంచుకున్నా, డేట్స్ విషయంలో సర్దుబాటు కుదరక దేవీ తప్పుకున్నారు.[10] ఆ తరువాత ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, దర్శకుడు క్రిష్ తో ఇదివరకే కంచె సినిమాకు పనిచేసిన చిరంతన్ భట్ కి సంగీత బాధ్యతలను అప్పగించడం జరిగింది.[11] ఈ సినిమాలోని పాత్రలకు దుస్తులు, నగలు సమకూర్చే బాధ్యతను నీతా లుల్లాకు అప్పజెప్పారు.[12] క్రిష్ తన కంచె సాంకేతికవర్గంలో భాగమైన ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళా దర్శకుడు సాహి సురేష్ లనే ఈ సినిమాలోనూ భాగం చేశారు.

ఈ సినిమా చిత్రీకరణ మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్, హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటి లో చేశారు. చిత్రీకరణ మొత్తం 79 రోజుల్లో ముగించారు. సినిమాలో భాగంగా వచ్చే మూడు యుద్ధ ఘట్టాలలో మొదటిది మధ్యప్రదేశ్ లో, విరామం ముందొచ్చే రెండోది మొరాకోలో, చివరగా వచ్చేది జార్జియాలో చిత్రీకరించారు. జార్జియాలో తీసిన యుద్ధంలో 300 గుర్రాలు, 20 రథాలు, 1000 మంది సైనికులను ఉపయోగించారు.[13][14]

ప్రచార చిత్రం విడుదల

మార్చు

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రచారచిత్ర విడుదల కార్యక్రమాన్ని 2016 డిసెంబరు 16 న కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు భారీగా పాల్గొన్నారు.

మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.[15]

సంగీతం

మార్చు

చిరంతన్ భట్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. సినిమాలో వచ్చే కథా గానాన్ని బుర్రా సాయిమాధవ్ రచించారు. లహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయిన ఈ సినిమా పాటల ఆవిష్కరణ డిసెంబర్ 26, 2016న తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రు మునిసిపల్ హైస్కూల్ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.[16][17]

సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."ఎకిమీడా"సిరివెన్నెల సీతారామశాస్త్రిఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషాల్3:46
2."గణ గణ గణ"సిరివెన్నెల సీతారామశాస్త్రిసింహా, ఆనంద్ భాస్కర్, వంశీ3:25
3."మృగనయన"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్4:57
4."సాహో సార్వభౌమ"సిరివెన్నెల సీతారామశాస్త్రివిజయ్ ప్రకాష్, కీర్తి సగాథియ3:25
5."సింగముపై లంఘించెను (కథా గానం)"బుర్రా సాయిమాధవ్విజయ్ ప్రకాష్4:23
మొత్తం నిడివి:20:33

మూలాలు

మార్చు
  1. "Gautamiputra Satakarni (Music)". Maa Stars.
  2. "Gautamiputra Satakarni (overview)". Filmibeat.
  3. "PHOTOS: Hema Malini, Shriya, Balakrishna turn regal for Gautamiputra Satakarni, see pics". The Indian Express. 2016-12-03. Retrieved 2016-12-17.
  4. "Confirmed: Shiva Rajkumar plays an extended cameo in Gautamiputra Satakarni : Celebrities, News ". India Today. 2016-10-31. Retrieved 2016-12-17.
  5. "Kannada actor Shiva Rajkumar in Balakrishna's Gautamiputra Satakarni". The Indian Express. 2016-10-29. Retrieved 2016-12-17.
  6. "Ravi Prakash". IMDb. Retrieved 2016-10-23.
  7. "Gautamiputra Satakarni (Opening)". Movie Dhamaka.[permanent dead link]
  8. "Gautamiputra Satakarni (Movie Launch)". Celebrity Profiles. Archived from the original on 2019-06-22. Retrieved 2018-09-14.
  9. "Gautamiputra Satakarni (Celebrities Gathering)". IB times.
  10. "Gautamiputra Satakarni (First Music Director)". greatandhra.com. Archived from the original on 2019-01-15. Retrieved 2018-09-14.
  11. "Gautamiputra Satakarni (Final Music Director)". The Indian Express.
  12. "Gautamiputra Satakarni (Costume Designer)". The Hindu.
  13. "Balakrishna's 'Gautamiputra Satakarni' shoot in Georgia: 1,000 soldiers, 300 horses, 20 chariots to be used for climax". International Business Times. 2016-07-03. Retrieved 2018-09-14.
  14. "'Gautamiputra Satakarni': A historical @ historic locations". Indiaglitz. 2016-12-05. Retrieved 2018-09-14.
  15. http://www.sakshi.com/news/movies/gautamiputra-satakarni-theatrical-trailer-432607
  16. "Gautamiputra Satakarni (Audio Release)". Blasting News.
  17. "Gautamiputra Satakarni (Audio Launch)". Pics25.com. Archived from the original on 2017-12-21. Retrieved 2018-09-08.

.

బయటి లంకెలు

మార్చు