విద్యాసాగర్ రెడ్డి

సాగర్ గా పిలవబడే విద్యాసాగర్ రెడ్డి (1952 మార్చి 1 - 2023 ఫిబ్రవరి 2) ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి.[1] ఇతడు దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. శ్రీను వైట్ల లాంటి ఇతడి చాలా మంది శిష్యులు విజయవంతమైన దర్శకులుగా పేరుతెచ్చుకున్నారు. ఇతడు తెలుగు ఫిలిం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరింఛాడు.

విద్యాసాగర్ రెడ్డి
Vidyasagar Reddy
జననం1 మార్చి 1952 [1]
మరణం2023 ఫిబ్రవరి 2(2023-02-02) (వయసు 70)
చెన్నై
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1990 - 2023

బాల్యము - విద్యాభ్యాసము మార్చు

వీరిది మంగళగిరి వద్ద నిడమర్రు అనే గ్రామం. నాన్న నాగిరెడ్డి ఊరికి మున్సబుగా పనిచేస్తుండే వారు. ఇతడు 1952 మార్చి 1 న పుట్టాడు. వీరికి విజయవాడలో గవర్నర్ పేటలో ఆస్తులు వుండేవి అప్పట్లో, మద్రాసులో చదువులు బావుంటాయన్న వుద్దేశంతో అమ్మ, అమ్మమ్మా, ఇతడూ, అన్నయ్యా, చెల్లెళ్ళూ, తమ్ముళ్ళనీ తీసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. మద్రాసులో తేనాంపేటలో వుంటూ ఇతడు కేసరి హైస్కూల్లో చదువుకుంటూ వుండేవాడు. పాఠశాలలో ఉండగా బయట కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటూ వుండేవాడు. అప్పట్లో తెలుగు వాళ్ళకీ, తమిళ పిల్లలకీ పెద్దగా పడేది కాదు. పైగా ఆంధ్రా నుంచీ వచ్చే తెలుగు వాళ్ళని లోకల్స్ బాగా ఏడిపించడానికి ప్రయత్నించేవాళ్ళు. అలాంటి వాటిని వ్యతిరేకిసూ అక్కడికి వచ్చిన తెలుగు పిల్లలకి భరోసాగా వుండేవాళ్ళు. అల్లు అరవింద్ అప్పట్లో వీరికి సీనియర్. ఇంకా చాలా మంది సినిమా వాళ్ళ పిల్లలు వీరి స్కూల్లోనే చదువుకుంటూ వుండేవాళ్ళు.

సినీరంగ ప్రవేశము మార్చు

1969 మే నెలలో ఎస్సెల్సీ పాసయ్యాడు. ఐతే తరువాత చదువుల మీద అంత ఆసక్తి చూపించలేదు. అలా ఖాళీగా తిరుగుతున్న ఇతడిని ఎక్కడైనా సెటిల్ చెయ్యాలని వీరి కుటుంబానికి సన్నిహితుడైన ఒక పెద్ద మనిషి' ని అమ్మ ఓ రోజు అడిగిందట. బాబూ..నువ్వేదో సినిమాల్లో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావట గదా. మా సాగర్ ఖాళీ గా వున్నాడు. వాడికి నీతోబాటు ఎక్కడైనా చిన్న అవకాశం ఇప్పించరాదూ అని. దానికతను అమ్మా, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో చేరాలంటే చాలా మంచి గుణాలు ఉండాలి. సహనం, ఓర్చు, అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి. మీవాడిలా దూకుడు స్వభావం వున్నవాళ్ళు అక్కడ ఇమడలేరు . అని ఇతడి గురించి ఒక ఉచిత సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళాడట.

మొదటి సినిమా మార్చు

ఆ రోజు రాత్రి ఇతడు ఇంటికి తిరిగివచ్చాక అమ్మని చూస్తే ఎందుకో చాలా దిగులుగా వున్నట్లనిపించి అడిగాడు అమ్మా ఏం జరిగింది..ఎందుకలా డల్ గా వున్నావు అని. ఇంతకాలం నీగురించి తెలీని విషయాలు చాలా తెలుసుకున్నానురా.. అంటూ జరిగిన విషయం చెప్పి నీకు అవకాశం రాలేదన్న బాధకంటే నిన్ను అతను నానా మాటలు అన్నందుకు చాలా బాధ వేసింది అంది. ఆ మాటలు ఇతడిలో పట్టుదల పెంచాయి. ఇతడిని ఎందుకూ పనికిరానన్న పెద్ద మనిషి పనిచేసే సినీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లోనే చేరిమంచి పేరు తెచ్చుకుని ఆ పెద్ద మనిషికి గుణపాఠం నేర్చాలి అనుకున్నాడు. ఇతడికున్న పరిచయాలతో అప్పట్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్ మల్లికార్జునరావు తమ్ముడు శ్రీహరి గారి వద్ద ఇంటిగౌరవం అనే సినిమాకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో సహాయకుడిగా చేరాడు.సరిగ్గా చెప్పాలంటే చలన చిత్ర రంగంలో ఇతడి మొట్టమొదటి సినిమా ఇంటిగౌరవం ఔతుంది. పట్టుదలతో చేరాడు కాబట్టి రోజుకి దాదాపు 18 గంటలు కష్టపడి పనిచేసేవాడు. అక్కడే ఎడిటింగ్ రూమ్ ఇన్-ఛార్జ్గా కూడా ఇతడినే ఉండమనడంతో కేవలం శ్రీహరి సినిమాలే కాకుండా అక్కడ ఎడిటింగ్ జరిగే అన్ని సినిమాలకీ సహాయకుడిగా వుంటూ అన్ని మెలకువలూ నేర్చుకుంటున్నాడు అనుకుంటున్న సమయంలో ఒక ఆటంకం ఎదురైంది. ఒకప్పుడు ఇతడిని ఎందుకూ పనికిరానన్న పెద్ద మనిషే మళ్ళీ ఇతడి గురువు గారి వద్దకు వచ్చాడు. ఇతడికీ, ఇతడి గురువు గారికీ మధ్య రెండు మెట్లు ఉన్నాయి. మధ్యలో ఇతడు వచ్చి చేరి మంచి పేరు తెచ్చుకుంటున్న సాగర్ ని ఎలా అణగదొక్కాలా అని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సాగర్ లో రోషం పెరిగింది. స్కూలు సమయంలోనే ఎన్నో పోలిటిక్స్ లో తిరిగిన వాడిని, చివరికి వీడి పోలిటిక్స్ కి బలికావడమా..అనిపించి ఆ పనికి ఉద్వాసన చెప్పేశాడు. ఆ విధంగా ఇతడి మొదటి చలన చిత్ర రంగప్రవేశం 18 నెలల తర్వాత తాత్కాలికంగా ఆగిపోయింది..!

మళ్ళీ రోడుమీద పడ్డాడు. ఇంటి వద్ద నుంచీ డబ్బులు వస్తాయి, అమ్మా వాళ్ళంతా మద్రాసులోనే ఉన్నారు కాబట్టి దేనికీ ఇబ్బంది అంటు ఏమీ లేదు. అలా వుండగా..అప్పటి ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారి అబ్బాయి ఇతడికి మిత్రుడు. ఒకసారి కనబడి సాగర్.ఏం చేస్తున్నావు? అని అడిగాడు. విషయం చెప్పాడు. ఖాళీ గా ఎందుకూ నాన్నగారు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందులో దర్శాకత్వ శాఖలో చేరు అని సలహా ఇచ్చి ఇతడిని డైరెక్టర్ వద్దకి తీసుకెళ్ళాడు. సినిమా పేరు ముహమ్మద్ బిన్ తుగ్లక్ . దర్శకుడు బి.వి.ప్రసాద్ . అప్పటికే సాగర్ వాళ్ళ అన్నయ్య బి.హెచ్. రెడ్డి బి.వి.ప్రసాద్ వద్ద అమ్మకోసం అనే సినిమాకి సహాయకుడిగా పనిచేసి ఉన్నాడు కాబట్టి సాగర్ కి ఆయన వద్ద సహాయకుడిగా పనిచేసే అవకాశం తేలికగానే దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే దర్శకత్వ శాఖలో సాగర్ మొదటి సినిమా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్.[1]

ఆ విధంగా దర్శకత్వ శాఖలో ఇతడి ప్రస్థానం మొదలైంది. వీరి గురువుగారు బి.వి.ప్రసాద్ గారి వద్దనే నీడలేని ఆడది మొదలుకొని చాలా సినిమాలకి సహాయకుడిగా చేసూ సహాయ దర్శకుడు స్థాయికి చేరుకున్నాడు. వారి వద్ద ఇతడు సహాయ దర్శకుడుగా చేసిన చివరి సినిమా నాయుడుగారి అబ్బాయి అలానే ఎ. కోదండరామిరెడ్డి వద్ద కిరాయి కోటిగాడు ఇతడు సహాయ దర్శకుడుగా చేసిన చివరి సినిమా. ఈ విధంగా 12–13 ఏళ్ళు గడిచాయి. ఇన్ని సంవత్సరాల్లో చాలా సార్లు చాలామంది మిత్రులు ఇతడితో సినిమాలు తీయాలని ఇతడి వద్దకి వచ్చారు కానీ సాగరే వాళ్ళని ఇంకా నాకు సొంతంగా డైరెక్షన్ చేసే మెచ్యూరిటీ రాలేదు. సేఫ్ గా వుండడానికి వేరే పెద్ద డైరెక్టర్ తో తీయండి " అని రికమెండ్ చేసే వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయించి మొత్తం ప్రోజెక్ట్ లో సహాయం చేస్తుండేవాడు.

1980 మొదట్లో కృష్ణగారితో ఎక్కువ సినిమాలకి చేస్తున్నప్పుడే నేనూ డైరెక్షన్ చెయ్యగలనన్న నమ్మకం కలిగాక నటశేఖర సవాల్ అనే కథ సిద్దం చేసుకుని కృష్ణగారిని కలవడం జరిగింది. కిరాయి కోటిగాడు హిట్ తర్వాత ఆయన చాలా బిజీ అవడంతో కొంతకాలం ఆగమని చెప్పారు. ఇంతలో విజయనిర్మల గారి వద్ద సహాయకుడిగా వుండే విఠల్ వచ్చి సాగర్ .నువ్వు కృష్ణగారితో సినిమాకి ప్రయత్నిస్తున్నావని తెలిసింది. ఆయన ఇంకా డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ లోగా నరేష్ హీరోగా నాకో సినిమా చేసిపెట్టు అని అడిగాడు. ఆ విధంగా మొదలైంది ఇతడి దర్శకత్వంలో మొదటిసినిమా రాకాసిలోయ. విజయ నరేష్, విజయశాంతి, రాజేష్, ముచ్చర్ల అరుణ, రంగనాథ్, దీప. మొదటిది ఎలాంటి సినిమా తీయాలి అనుకున్నప్పుడు కమ్మర్షియల్ గా సేఫ్ కావాలంటే యూక్షన్ సినిమానే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. ఐతే యూక్షన్ తో బాటు, సాహసం కూడా తోడైతే బావుటుందని రాకాసి లోయ సినిమా ఎన్నుకోవడం జరిగింది.

ఈ రాకాసి లోయ కథ వెనుక ఒక చిన్న తమాషా ఉంది. వీరు స్కూలు రోజుల్లో చదువుకునేప్పుడు చందమామలో చదివిన సీరియల్ పేరు రాకాసిలోయ.సినిమా, దర్శకత్వం ఇలాంటివే మీ తెలీని రోజుల్లోనే స్కూలు పిల్లలం అంతా కల్సి అరే ఎప్పటికైనా మనం పెద్ద వాళ్ళమయ్యాక ఈ సీరియల్ ని సినిమాగా తియ్యాలి రా. అనుకునే వాళ్ళు. ఐతే చిన్నవయసులో వీరికో అనుమానం వచ్చింది.మరి రాకాసిలోయ సినిమా తియ్యాలంటే చందమామ బొమ్మల్లో వున్న దృఢకాయులైన రాక్షసులు కావాలి కదా, మరి వాళ్ళని వెదికి తెచ్చినా వాళ్ళని ఎలా మచ్చిక చేసుకుని యూక్షన్ చేయించాలో అని అనుమానం వస్తే మాలో ఒకడు. ఒరేయ్ .మనం విజయా గార్డెన్ మొత్తం అద్దెకి తీసుకుని పైన మొత్తం రూఫ్ వేయించేద్దాం. ఈ రాకాసిలోయ రాక్షసుల్ని అందులో పెట్టి పైనుంచీ హెలికాప్టర్స్ తో ఆహారం వేయిద్దాం. కెమేరాలు కూడా పైనుంచీ లోనికి పంపించి చిత్రీకరణ చెయ్యాలి. అన్నాడు. అలా వుండేవి చిన్నతనంలో వీరి ఆలోచనలు.

ఐతే ఈ రాకాసిలోయకీ చిన్నప్పటి చందమామ రాకాసిలోయ కథకీ సంబధం లేదు. సినిమా విజయవతంగా పూర్తె 1983 లో విడుదలై వాణిజ్యపరంగా విజయాన్ని నమోదు చేసుకుంది. అదీ దర్శకుడిగా ఇతడి మొదటిసినిమా అనుభవం. తరువాత వెంటనే సుమన్ తల్వార్, భాను చందర్ కాంబినేషన్ తో 'డాకు ' అనే సినిమా తీశాడు. ఒక ఆంగ్లసినిమా స్ఫూర్తిగా తీసిన ఆ సినిమా కూడా విజయవంతమైనది . అప్పుడు ఒక పొరబాటు చేశాడు. ఇతడే నిర్మాతగా కూడా మారి నరేష్ మనోచిత్రల కాంబినేషన్ తో 1986 లో మా వారి గోల అనే కామెడీ సినిమా తీశాడు. ఘోరంగా విఫలమైన ఆ సినిమా ఇతడికి పెద్ద సెట్ బాక్ నిర్మాతని కూడా ఇతడే అవడం వల్ల తరువాత చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా ఫెయిలైతే నిర్మాత బాధలు ఎలా వుంటాయో అప్పుడు తెలిసింది. సినిమా ఫెయిలైతే దర్శకుడు కష్టపడి ఎలాగైనా మరో ఛాన్స్ తెచ్చుకోవచ్చు కానీ, నిర్మాత దెబ్బతింటే కోలుకోవడం చాలా కష్టం అని స్వయంగా తెలుసుకున్నాక ఇంక నేను సినిమాలు ఎలానూ తియ్యలేను, కాకుంటే డైరెక్షన్ చేసి మరొకర్ని ఇరుకున పెట్టడం మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చి అస్త సన్యాసం చేశాను.!

అలా మూడేళ్ళు గడిచాక జయసింహా రెడ్డి అని చాలా మంచి మిత్రుడూ, ఇతడి శ్రేయోభిలాషీ, ఒకసారి కల్సి సాగర్.నువ్వు యాక్షన్ సినిమాలు తీసి సక్సెస్ అయ్యావు, అనవసరంగా కామెడీ తీసి చేతులు కాల్చుకున్నావు. మళ్ళీ యాక్షన్ ఎందుకు టై చెయ్యకూడదూ.." అని ఇతడిలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాడు. ఆ ప్రోద్భలంతో 1989 ప్రాంతాల్లో భానుచందర్ తో స్టూవర్టుపురం దొంగలు అనే సినిమా తీశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇతడి సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా ఈ సూవర్ట్ పురం దొంగలు .ఈ చిత్రం 1990 జనవరి 9న రిలీజైంది. అంతకు వారం ముందే చిరంజీవి స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ విడుదలైంది. ఆ సమయంలో అటూ ఇటూగా అదే టైటిల్ తో వున్న వీరి చిన్న సినిమా రిలీజ్ చెయ్యడం సాహసమే కానీ అనూహ్యంగా వీరి సినిమా ఘన విజయం సాధించింది, అప్పట్లో ఒక పేపర్ వాళ్ళు 4. దొంగల్ని చూసి పారిపోయిన పోలీసులు అని రాసింది కూడా. ఈ విధంగా 1990 లో సెకండ్ ఇన్నింగ్స్ లో లభించిన సూవర్ట్పురం దొంగలు విజయం తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తరువాత ఇతడు తీసిన సినిమాలన్నీ అసభ్యతకి తావు లేకుండా కుటుంబ కథా చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం౦ ఇతడికెంతో తృప్తినిచ్చింది. అలానే ఇతని వద్ద శిష్యరికం చేసి ఈ తరంలో ఘన విజయాలు సాధిస్తున్న యువ దర్శకుల్ని గమనించినప్పుడు కూడా ఇతడికి ఎంతో ఆనందంగా వుంటుంది[1]

దర్శకత్వం వహించిన చిత్రాలు మార్చు

మరణం మార్చు

సాగర్‌ అనారోగ్యంతో బాధపడుతూ 2023 ఫిబ్రవరి 2న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 రెడ్డి, విద్యాసాగర్. "మొదటి సినిమా-సాగర్" (PDF). కౌముది.నెట్. కౌముది.నెట్. Retrieved సెప్టెంబరు 1, 2015.
  2. telugu (2 February 2023). "టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. ప్రముఖ దర్శకుడు సాగర్‌ కన్నుమూత". Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.

బయటి లంకెలు మార్చు