అత్తిలి

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం

అత్తిలి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన తణుకు నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6864 ఇళ్లతో, 25004 జనాభాతో 2160 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12509, ఆడవారి సంఖ్య 12495. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2687 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 409. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588553.[2].

అత్తిలి
పటం
అత్తిలి is located in ఆంధ్రప్రదేశ్
అత్తిలి
అత్తిలి
అక్షాంశ రేఖాంశాలు: 16°41′17.88″N 81°36′21.38″E / 16.6883000°N 81.6059389°E / 16.6883000; 81.6059389
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
మండలంఅత్తిలి
విస్తీర్ణం21.6 కి.మీ2 (8.3 చ. మై)
జనాభా
 (2011)[1]
25,004
 • జనసాంద్రత1,200/కి.మీ2 (3,000/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు12,509
 • స్త్రీలు12,495
 • లింగ నిష్పత్తి999
 • నివాసాలు6,864
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్534134
2011 జనగణన కోడ్588553

చరిత్ర

మార్చు

ప్రాచీన, మధ్య యుగాల్లో వేంగి సీమలో భాగమై పానార విషయంలో అంతర్భాగంగా నేటి అత్తిలి గ్రామం కేంద్రంగా అత్తిలి విషయం లేదా అత్తిలి నాణ్డు (నాడు) ఉండేది.[3] నేటి తణుకు, భీమవరం తాలూకాల్లోని పలు గ్రామాలు సైతం ప్రాచీన కాలంలో అత్తిలి నాణ్డులో అంతర్భాగంగా ఉండేవి. విప్పర్రు, కోరుకొల్లు, ఆరవల్లి, ఈడూరు, కంచుమర్రు వంటి గ్రామాలు శాసనాల్లో అత్తిలి నాణ్డు లేక అత్తిలి విషయానికి చెందిని అని పేర్కొని ఉన్నాయి.[4] చరిత్రకారుడు ముప్పాళ్ళ హనుమంతరావు కృష్ణాజిల్లాలోని కైకలూరు, కొల్లేరు సరస్సుల మధ్యనున్న ప్రాంతమంతటినీ అత్తిలి విషయంగా గుర్తిస్తూ రాశాడు. ఈ ప్రకారం ఉత్తరాన గోదావరి, దక్షిణాన ఈనాటి తాడేపల్లిగూడెం అత్తిలి విషయానికి సరిహద్దులు.[5]

నిరవద్యపురం శాసనం ప్రకారం చారిత్రకంగా అత్తిలిలో చెప్పుకోదగ్గ కోట ఒకటి ఉండేది. అత్తిలి కోట వర్ణన ఇలా ఉంది: ఎత్తైన ప్రాకారాలు, లోతైన కందకం, వెడల్పైన వలయం, చుట్టూ చెట్లు, బీళ్ళు, కోట రక్షకులైన పాలివాళ్ళు, కోటలో సిద్ధేశ్వరస్వామి, కోటకు తూర్పుగా మాన్యాలు, మొగల్తూరు నుంచి ప్రధాన మార్గం, గోస్తనీ తీరంలో కోట పాటిభూమి. ప్రస్తుతం హైస్కూలు ఉన్నచోట చుట్టూ కోట, అగడ్త ఉండేదని చెప్పేవారంటూ ఫెయిర్స్ & ఫెస్టివల్స్ అన్న గ్రంథం నమోదుచేసింది. ఐతే, ఆ కోట ఆనవాళ్ళు సైతం ఈనాడు లేవు.[6]

మొదటి చాళుక్య భీముడి అత్తిలి తామ్రశాసనంలో (సా.శ.892-921 కాలం) వేశ్యాంగన అయిన చల్లవకు అత్తిలి గ్రామంలో వంద పోక చెట్లు గల భూమిని, వెయ్యి పుట్ల వడ్లు పండే పొలాన్ని, నివసించేందుకు నివేశన స్థలాన్ని రాసి ఇచ్చినట్టు ఉంది.[7][8] పదో శతాబ్దంలో అత్తిలిలో సర్వలోకాశ్రయ జినభవనం అన్న జైన మత భవనం ఉండేదనీ, ఈ జిన భవనంలో ప్రఖ్యాతుడైన జైనముని అర్హనంది జీవించేవాడనీ,[నోట్స్ 1] అతడిని వేంగి చాళుక్య రాజైన రెండవ అమ్మరాజు గౌరవించి, పోషించేవాడని శాసనాధారాలు ఉన్నాయి. ఐతే, ఈ జిన భవనం అన్నది ఇప్పుడు ఆధారాలు కూడా లభించనంతగా కాలగర్భంలో కలిసిపోయింది.[9] 11వ శతాబ్దికి చెందిన వేంగీ చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని రెండవ భార్య మేలమ్మ తెలుగు చోళుల వంశానికి చెందినది, ఈమె అత్తిలి ఆడబడుచు. ఈమె తండ్రి ఆచంట సూరపరాజు ఆనాడు అత్తిలి విషయాన్ని మహామండలేశ్వర బిరుదు కలిగి పరిపాలించేవాడు. సా.శ.1093 ప్రాంతంలో అత్తిలినాడును విజయాంక రక్షణుడు అనే రాజు పరిపాలించినట్టు, ఇతను పలు దానాలు చేసినవాడనీ, బంధువర్గాన్ని పోషించాడనీ శాసన ఆధారం చెప్తోంది.[10]

రెడ్డిరాజుల అంతర్యుద్ధంలో గెలిచి, అప్పటివరకూ పరిపాలిస్తున్న కుమార గిరి రెడ్డిని సా.శ. 1402లో తరిమివేసి కొండవీటి సింహాసనాన్ని పెదకోమటి వేమారెడ్డి సింహాసనాన్ని అధిష్టించాడు. కుమారగిరి మరణానంతరం రాజమహేంద్రవరంలో రెడ్డిరాజ్యాన్ని స్థాపించిన అతని బావమరిది కాటయ వేమారెడ్డికి, కొండవీటి పాలకుడైన పెదకోమటి వేమారెడ్డికి మధ్య ఈనాటి పశ్చిమగోదావరి ప్రాంతంలో పలు యుద్ధాలు జరిగాయి. కాటయవేమునికి సాయంగా మొదటి దేవరాయలు పంపిన విజయనగర సేనలతో పెదకోమటి వేమారెడ్డి సామంతుడైన అన్నదేవ చోడుడికి మధ్య అత్తిలి పొలిమేరల్లో జరిగిన యుద్ధం "అత్తిలి యుద్ధం"గా చరిత్రకెక్కింది. ఈ యుద్ధంలో అన్నదేవ చోడుడు విజృంభించి కుమారగిరికి సాయంగా వచ్చిన విజయనగర సేనలను ఓడించి పదివేలమంది సైన్యాన్ని అత్తిలి కోటలో బంధించాడనీ, వారు శరణంటే దయదలచి వదిలిపెట్టాడనీ శాసనాధారాలు చెప్తున్నాయి.[11][నోట్స్ 2]

15-17 శతాబ్దాల మధ్యకాలంలో మొగల్తూరు సంస్థానంలో అత్తిలి సంస్థానం ఒక భాగంగా మారింది. కొచ్చెర్లకోట వెంకట్రాయ మంత్రి అత్తిలి, ఆచంటలకు సంస్థానాధిపతిగా వ్యవహరించాడు. మొగల్తూరు పాలకులు అత్తిలిలోని వివిధ కులాలు, వృత్తుల వారికి మాన్యాలు దానమిచ్చినట్లు చారిత్రకాధారాలు ఉన్నాయి.[12] బ్రిటీష్ పరిపాలనా కాలంలో అత్తిలి తణుకు తాలూకాలో భాగమైంది. 1908లో అత్తిలికి చెందిన కానుమిల్లి జగ్గారాయుడు, సూరంపూడి శ్రీమన్నారాయణమూర్తి వందేమాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కృతులయ్యారు. 1930-32లో ఉప్పు సత్యాగ్రహం సమయంలో రాంపల్లి అగ్నిహోత్రుడు, తమ్మన సుబ్బారావు ఉద్యమాల్లో పాల్గొని జైలుపాలయ్యారు. 1941లో జాతీయోద్యమంలో భాగంగా కాటూరి సూరన్న, కొత్తపల్లి చంద్రరావు కార్యకలాపాలకు జైలుశిక్ష అనుభవించారు. రాంపల్లి అగ్నిహోత్రుడు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా 1932లో సత్యాగ్రహోద్యమంలో, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు.[13] క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 1942 ఆగస్టు 9న అత్తిలిలో అజ్జరపు సుబ్బారావు నేతృత్వంలో స్థానికులైన కాటూరి సూరన్న, కొత్తపల్లి చంద్రరావు, రాంపల్లి అగ్నిహోత్రుడు, దామిశెట్టి వెంకన్న, యడ్లపల్లి వీరన్న, తదితరులు సభ ఏర్పాటుచేశారు. రిజర్వు పోలీసులు సభ సమీపంలో నిలిచారు. సాయంత్రం కొందరు విద్యార్థులు అత్తిలి రైల్వేస్టేషనులో రికార్డు తగులబెట్టారు. రైలు పట్టాలు ఊడపెరికారు. టెలిగ్రాఫ్ స్తంభాల తీగలు నాశనం చేశారు. గ్రామస్థులు ఊరిలో పాఠశాల రికార్డులు తగులబెట్టారు. ఇలా క్విట్ ఇండియా ఉద్యమంలో అత్తిలి ప్రాంతం కూడా పాల్గొంది.[14]

పరిపాలన, రాజకీయాలు

మార్చు

పూర్వ నియోజకవర్గ హోదా

మార్చు

ప్రస్తుతం అత్తిలి తణుకు శాసనసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అయితే, 1956 నుంచి 2009 వరకూ అత్తిలి శాసనసభ నియోజకవర్గం ఉండేది.[15] అత్తిలి నియోజకవర్గం తొలి నుంచి తుది వరకూ స్థానికేతరులకు ఆటపట్టుగానే కొనసాగింది. బయట నుంచి అత్తిలికి వచ్చి నిలబడిన అభ్యర్థులే తొలి నుంచి గెలుపొందారు, ఒక్క చోడగం అమ్మన్నరాజా (1955) మినహాయించి అందరూ క్షత్రియ కులస్తులే. అత్తిలి ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నికైన దండు శివరామరాజు 1999లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అత్తిలి శాసనసభ నియోజకవర్గం విభజించి అందులోని అత్తిలి, ఇరగవరం మండలాలను తణుకు శాసనసభ నియోజకవర్గంలో విలీనం చేశారు.[16]

స్థానిక పాలన

మార్చు

1891లో అత్తిలి గ్రామ పంచాయితీ ఏర్పాటయింది. ఆనాటి చట్టం ప్రకారం చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామాలతో కలిపి అత్తిలి యూనియన్ బోర్డుగా ఈ పంచాయతీ ఏర్పాటైంది.[17] 1919లో ప్రజాస్వామికంగా ఎన్నికైన కాటూరి రామయ్య అత్తిలి పంచాయితీ తొలి అధ్యక్షునిగానూ, 17 సంవత్సరాల పాటు (1932-38, 1939-49, 1957-58) అత్తిలి పంచాయితీ అధ్యక్షుడిగా పనిచేసిన కానుమిల్లి వెంకట్రామయ్య అత్యధిక కాలం అత్తిలి పంచాయితీ అధ్యక్షునిగా వ్యవహరించిన నేతగానూ గ్రామ చరిత్రలో నిలుస్తున్నారు.[18] 1950ల వరకూ కమ్మ కులస్తులు ఎక్కువగా, కాపు, బ్రాహ్మణ కులస్తులు కొన్నిమార్లు పంచాయితీ బోర్డు అధ్యక్షులుగా ఉండేవారు. 1959 నుంచి మాత్రం అత్తిలి పంచాయితీ అధ్యక్ష స్థానం ప్రధానంగా కాపు కులస్తుల చేతిలోనే ఉంటూ వస్తోంది.[19] 1974-75 సంవత్సరానికి గాను అత్తిలి పంచాయితీ జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ పంచాయితీగా పురస్కారాలు సాధించింది. మేకల వీరన్న అప్పట్లో పంచాయితీ అధ్యక్షునిగా ఉండేవాడు. ఇతను అధ్యక్షత వహించి పనిచేసిన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గొప్ప పేరు సంపాదించాడని అత్తిలినాణ్డు విషయము గ్రంథకర్త కానూరి బదరీనాథ్ పేర్కొన్నాడు.[20]

అత్తిలి పంచాయితీ అధ్యక్షులు
పాలనా కాలం పంచాయితీ బోర్డు అధ్యక్షుడు పాలనా విశేషాలు, రాజకీయాంశాలు
1918 ఆగస్టు 29 - 1919 ఏప్రిల్ 29 ప్రత్యేక అధికారి పాలన (కొల్లి సుదర్శనరావు)
1919 ఏప్రిల్ 30-1919 సెప్టెంబరు 29 కాటూరి రామయ్య అత్తిలికి తొలి పంచాయితీ అధ్యక్షుడు.[21]
1919 సెప్టెంబరు 30 - 1922 జూలై 5 సూరంపూడి సుబ్బారావు
1919 జూలై 6 - 1922 జూలై 11 నిడదవోలు సూరయ్య వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యాడు. అత్తిలి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు, రహదారులు అభివృద్ధి చేయడానికి కృషిచేసాడు.[22]
1932 జూలై 12 - 1938 డిసెంబరు 6 కానుమిల్లి వెంకట్రామయ్య ఇప్పటివరకూ అత్తిలికి అత్యధిక కాలం అధ్యక్షునిగా పనిచేసిన నేత ఇతనే. 17 సంవత్సరాల పైచిలుకు ఈ పదవిలో పనిచేశాడు.[18]

ఐదుసార్లు ఎన్నికయ్యాడు. ఇతనిపై ఆరోపణలు, వివాదాలతో పాటు అభివృద్ధి చేశాడన్న మంచి పేరు కూడా ఉంది.

సిమెంటు మురుగు కాల్వలు, మరుగుదొడ్లు, గ్రామచావడి వంటివి ఏర్పాటుచేసాడు.[23]

1938 డిసెంబరు 7 - 1939 మార్చి 9 ప్రత్యేక అధికారి పాలన
1939 మార్చి 10 - 1949 మార్చి 31 కానుమిల్లి వెంకట్రామయ్య
1949 ఏప్రిల్ 1 - 1950 జూన్ 28 ప్రత్యేక అధికారి పాలన
1950 జూన్ 29 - 1953 జూన్ 30 వైట్ల పట్టాభిరామయ్య ఇతను పరిపాలనా కాలంలో అవకతవకలకు పాల్పడ్డాడని, పదవిలో రాణించలేదని అత్తిలి పంచాయితీపై అధ్యయనం చేసిన ఎం.ఎస్.ప్రకాశశాస్త్రి రాశాడు.[23]
1953 జూలై 1 - 1954 ఫిబ్రవరి 22 యడ్లపల్లి చౌదరయ్య ఇతను గ్రంథాలయ స్థాపన, రామాలయ నిర్మాణం, పంచాయితీకి వాటర్ ట్యాంకర్ కొనివ్వడం వంటివాటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.[24]
1954 ఫిబ్రవరి 23 - 1954 డిసెంబరు 4 యడ్లపల్లి వీర రాఘవులు
1954 డిసెంబరు 5 - 1956 జూలై 30 వైట్ల బాపన్న జిల్లాలో కింగ్ మేకర్‌గా, పరిషత్ ఛైర్మన్ అల్లూరి బాపినీడు కార్యకలాపాలు కూడా అత్తిలిలో కూర్చుని నడిపినవాడు.

బాపన్న తన రెండేళ్ళ పాలనా కాలంలో అత్తిలి అభివృద్ధికి తోడ్పడ్డాడు. తర్వాత మేకల వీరన్న పరిపాలన కాలంలో కూడా అతనికి సలహాలతో సాయం చేశాడు.

1956 జూలై 31 - 1957 జనవరి 31 ప్రత్యేక అధికారి పాలన
1957 ఫిబ్రవరి 1 - 1958 అక్టోబరు 30 కానుమిల్లి వెంకట్రామయ్య
1958 నవంబరు 1 - 1959 అక్టోబరు 11 ప్రత్యేక అధికారి పాలన
1959 అక్టోబరు 12 - 1961 మార్చి 9 జొన్నల పెద గోపాలస్వామి అంతవరకూ ప్రధానంగా కమ్మవారి చేతిలో ఉన్న పంచాయితీ బోర్డు అధ్యక్ష పదవి ఇతనితో మొదలుకొని కాపు కులస్తుల ప్రాబల్యంలో కొనసాగింది.
1961 మార్చి 10 - 1964 మే 22 బండి విశ్వేశ్వరరావు జొన్నల పెద గోపాలస్వామితో బండి విశ్వేశ్వరరావు పోటీపడి తుదకు రెండేళ్ళు ఒకరి, మిగిలిన కాలం మరొకరు పదవి చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ జొన్నల పెద గోపాలస్వామి రాజీనామా చేయగా ఇతను పదవి చేపట్టి రెండేళ్ళు పరిపాలించాడు.
1964 మే 29 - 1981 జూన్ 11 మేకల వీరన్న 1964 మొదలుకొని 15 సంవత్సరాలు మేకల వీరన్న అత్తిలి పంచాయితీ అధ్యక్షునిగా కొనసాగి, ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగిన రెండవ వ్యక్తి అయ్యాడు.

ఇతని నేతృత్వంలో పంచాయితీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. తద్వారా 1974-75 సంవత్సరంలో అత్తిలి పంచాయితీకి జాతీయ అవార్డు లభించింది.[25]

1981 జూన్ 12 - 1984 జూలై 30 నల్లూరి వెంకట్రావు హోమియో వైద్యునిగా చేసిన సేవ వల్ల, రాజకీయంగా అండదండల వల్ల పంచాయితీ అధ్యక్షునిగా రూపాయి కూడా ఖర్చు చేయకుండానే గెలవగలిగాడు.

ఇతని అధ్యక్షతన అత్తిలిలో మంచినీటి ట్యాంకులు నిర్మాణం చేసి, వాటర్ లైన్స్ వేశారు.

1984 ఆగస్టు 1 - 1988 మార్చి 30 ప్రత్యేక అధికారి పాలన
1988 మార్చి 31 - 1995 అక్టోబరు 20 జొన్నల నర్సింహారావు ఆనాటి జిల్లా బోర్డు అధ్యక్షుడు యర్రా నారాయణస్వామి అండదండలతో పంచాయితీ అధ్యక్షునిగా ఎన్నికై, నారాయణస్వామి సహకారంతో అభివృద్ధి చేశాడు.

శ్మశానం బాగుచేయించడం, బస్టాండ్, తితిదే కళ్యాణ మండపం నిర్మాణం వంటి కార్యక్రమాలు ఇతను చేయించాడు.

అధ్యక్షుడు కాక ముందు అత్తిలికి డిగ్రీ కళాశాల రావడానికి స్వంత సొమ్ము డిపాజిట్ గా సమకూర్చి కళాశాల కరస్పాండెంటుగా అభివృద్ధికి పాటుపడ్డాడు.

1995 అక్టోబరు 21 - 2001 జూలై 21 కేతా సత్య పద్మావతి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పద్మావతి పదవీ కాలంలో మంచినీటి ట్యాంకులు, సిసి రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం జరిగింది.
2001 ఆగస్టు 17 - 2006 ఆగస్టు 22 బుద్దరాతి భరణీ ప్రసాద్ ఇతని పదవీ కాలంలో పలు భవనాల నిర్మాణం జరిగింది.
2006 ఆగస్టు 23 - 2011 ఆగస్టు 22 తీర్థాల నాగమణి ఈమె యాదవ కులానికి చెందివుండి అత్తిలికి అధ్యక్షురాలైన తొలి వ్యక్తి.

అత్తిలికి చెందిన జిల్లా స్థాయి రాజకీయ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు ప్రోద్బలంతో, సహకారంతో ఈమె విజయం సాధించి అభివృద్ధి పనులు చేసింది.

2011 ఆగస్టు 23 - 2013 ఆగస్టు 1 ప్రత్యేక అధికారి పాలన
2013 ఆగస్టు 2 - 2018 ఆగస్టు 2 కందుల కల్పన ఈమె వెంకట్రామా థియేటర్ యజమాని కందుల శ్రీనివాసరావు భార్య. ఈమె పరిపాలనా కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది.

2017లో అత్తిలికి లభించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయితీ పురస్కారాన్ని కల్పన అందుకున్నది.

2018 మార్చి నుండి ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన

ప్రస్తుతం మేజర్ పంచాయితీగా ఉన్న అత్తిలిని నగర పంచాయితీ చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.[26]

జనాభా వివరాలు

మార్చు
అత్తిలి జనాభా 
CensusPop.
195111,749
196115,07428.3%
197117,62716.9%
198121,73223.3%
200124,531
201125,0041.9%
[27][28]

కులపరంగా అత్తిలిలో కాపులు (తెలగ కాపులు), కొప్పు వెలమలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బ్రాహ్మణులు, కమ్మ కులస్తులు సంఖ్యపరంగా అత్యధికులు కాకున్నా తొలినాళ్ళలో పంచాయితీ అధ్యక్షులుగా, సర్పంచులుగా పనిచేసి ప్రముఖ స్థానం కలిగివుండేవారు.[29]

ఆర్థికం

మార్చు

వాణిజ్యం

మార్చు

అత్తిలి వ్యాపారస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాక పశ్చిమ గోదావరి జిల్లాలోని సుదూర ప్రాంతాల్లో కూడా వ్యాపార నైపుణ్యాలకు పేరు పొందారు. అత్తిలి వ్యాపారస్తుల్లో నిత్యం చిన్న చిన్న వ్యాపారాలు చేసే చిల్లర వ్యాపారస్తుల నుంచి టోకు వ్యాపారాలు చేసే పెద్ద వ్యాపారస్తుల దాకా ఉన్నారు. అత్తిలి నుంచి పలు ప్రాంతాల్లో జరిగే వారపు సంతలకు వెళ్ళి, అక్కడ కూరగాయల దుకాణాలను ఏర్పరిచి వ్యాపారం చేసుకుని తిరిగిరావడం దినచర్యగా ఉన్న చిల్లర వర్తకులు అనేకులు ఉన్నారు. అత్తిలి వ్యాపారులకు ఎంతటి పేరు వచ్చిందంటే చుట్టు పక్కల ప్రాంతాల వ్యాపారస్తులకు కూడా అత్తిలి వ్యాపారస్తులనే పిలిచేంతగా ఈ ఊరు పేరుపడింది. అత్తిలి చిల్లర వర్తకులు ఇంటి వద్ద ఉన్నప్పుడు వేరే జీవన సరళి కలిగివున్నా సంతలకు వెళ్ళేప్పుడు వేరే వేషధారణ వేస్తారు. భుజాన తువ్వాలు, మెడలో కాటా, సాదా బట్టలతో రోజూ తెల్లవారుజామునే సంతలకు వెళ్తూ ఉంటారు. వర్తక వ్యాపారాల వల్ల ఎంతగా ఆర్థికంగా స్థిరపడి ఉన్నా సంతలకు, అమ్మకాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి వేషధారణనే అవలంబిస్తారు. క్రమేపీ వారాంతపు సంతల పద్ధతు మటుమాయం అవుతూ ఉండడంతో వీళ్లు ఊరూరా ఆటోలతో సంచార వ్యాపారాలు సాగిస్తున్నారు.[30] తాడేపల్లిగూడెం మార్కెట్ పచ్చి బియ్యం ఎగుమతిలో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా నిలుస్తోంది. ఉల్లిపాయలు, ఇతర ఆహారదినుసుల ఎగుమతులు, దిగుమతుల్లో ఈ మార్కెట్ ప్రఖ్యాతమైంది. అయితే, ఈ తాడేపల్లిగూడెం మార్కెట్లో అత్తిలికి చెందిన వ్యాపారస్తులే సింహభాగం వ్యాపారం చేస్తున్నారు.[31] అలానే, అత్తిలి గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ కేంద్రంగానూ నిలుస్తోంది. అత్తిలి మార్కెట్ ద్వారా జీలకర్ర, సోంపు, అల్లం, ఇతర ఎగుమతులు జరుగుతున్నాయి.[32] 1953లో స్థాపించిన అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.[33] 1982లో అత్తిలి ప్రాంతానికి చెందిన చిల్లర వర్తకులంతా కలిసి "శ్రీ వెంకటేశ్వర చిల్లర వర్తక సంఘం" స్థాపించారు. దీన్ని సేవా కార్యక్రమాలు, ప్రమాదాల్లో ఉపశమనం కలిగించే సంస్థగా నిర్వహిస్తున్నారు.[30]

వ్యవసాయం

మార్చు

ప్రధానమైన వృత్తి కల్పిస్తున్నదీ, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమైన ఉత్పత్తులు అందిస్తున్నదీ వ్యవసాయ రంగమే. 1851-52లో ఆర్థర్ కాటన్ గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాకా ఏర్పడ్డ గోదావరి డెల్టాలో సాగునీటి సౌకర్యం మెరుగుపడి లబ్ధిపొందిన ప్రాంతాల్లో అత్తిలి కూడా భాగం. ఈ ఊరి మీదుగా ప్రవహించే గోదావరి కాలువను అత్తిలి కాలువ అని వ్యవహరిస్తారు. అత్తిలి కాలువ గోదావరి డెల్టాలోని 11 ప్రధానమైన కాలువల్లో ఒకటి.[34] ఈ కాలువ నీరు చుట్టుపక్కల ప్రాంతాలతో సహా అత్తిలిలో కూడా ఎన్నో వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తోంది. అత్తిలిలో ప్రధానంగా పండించే పంటలు వరి, కొబ్బరి. ఈ ఊరిలో వ్యవసాయ భూమిగా ఉన్న 1763 హెక్టార్లు భూమికి కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం లభిస్తోంది, 33 హెక్టార్లు బంజరు భూమిగా ఉండగా, వ్యవసాయేతర వినియోగంలో 363 హెక్టార్ల భూమి ఉంది.[2]

ప్రముఖులు

మార్చు
  • కూసంపూడి శ్రీనివాస్ - ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జనసేన పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి.
  • కారుమూరి నాగేశ్వరరావు - పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తణుకు శాసనసభ్యుడు.
  • బ్రహ్మానందం - సుప్రసిద్ధ హాస్యనటుడు. ఆయన సినీరంగ ప్రవేశానికి ముందు అత్తిలి ఎస్.వి.ఎస్.డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు.
  • అన్నెం శేషారావు ఎం.ఎల్.సి 1968
  • ఆవేటి పూర్ణిమ

విద్యా సౌకర్యాలు

మార్చు

అత్తిలిలో 20వ శతాబ్ది తొలినాళ్ళలోనే ఒక ఆంగ్లో వర్నాక్యులర్ ఉన్నత పాఠశాల ఉండేది. 1975లో పెనుగొండ శాసనసభ్యుడు వంక సత్యనారాయణ చొరవతో పెనుగొండతో పాటు, అత్తిలికి డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు డిగ్రీ కళాశాల శాంక్షన్ చేయడానికి 2 లక్షల రూపాయలు స్థానికులు ముందుకు వచ్చి డిపాజిట్ చేయాలంటే జొన్నల నరసింహారావు, మద్దాల నాగేశ్వరరావు స్వంత డబ్బును డిపాజిట్ చేశారు. అలా శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల ఏర్పడింది.[35]

ప్రస్తుతం గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, 2 ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ఇంజనీరింగ్, మేనేజిమెంటు, పాలీటెక్నిక్ కళాశాలలు తణుకులోను, సమీప వైద్య కళాశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరులోను ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

అత్తిలిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 8 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు నలుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది, ముగ్గురు నాటు వైద్యులు ఉన్నారు. 12 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

అత్తిలిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

సంస్కృతి

మార్చు

ఆలయాలు

మార్చు
 
ఉమా సహిత సిద్ధేశ్వరస్వామి ఆలయం

పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. వాయుపురాణంలో పానార సీమలో ఉన్నట్టుగా ప్రస్తావించిన 23 పుణ్యక్షేత్రాల్లో అత్తిలిలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం ఒకటి.[36] ఈ లింగాన్ని అత్రి మహర్షి ప్రతిష్ఠించినట్టుగా తద్వారా అత్రీశ్వర స్వామిగానూ ఈ శివునికి పేరు వచ్చినట్టుగా వాయుపురాణంలోని గోస్తనీ నదీ ప్రాదుర్భావ కథనంలో కనిపిస్తుంది.[37] అత్తిలి గ్రామంలో పలు తావుల్లో శివలింగాలు ఉండేవని, శివాలయం సమీపంలోని లింగాల దొడ్డిలో అయితే అంతా శివలింగాల మయంగా ఉండేదని స్థానికులు చెప్తూంటారు.[38] ఈ ప్రాంతంలో అత్రి మహర్షి జీవించేవాడనీ, ఇది ఆయన తపో యజ్ఞభూమి అని చెప్తారు. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి.[28] మొదట్లో అత్రి అన్న పదమే తరువాతి కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందిందని స్థానిక రచయితలు భావిస్తారు.[38] ఉమా సిద్ధేశ్వరస్వామి ఆలయానికి 1200 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు ఆధారాలు లభిస్తున్నాయి. ఈ ఆలయానికి నూజివీడు జమీందారులు 33 ఎకరాల భూమిని ఇచ్చారు. వారిలో మేకా వెంకటాద్రి అప్పారావు ప్రత్యేకంగా ఆలయానికి ఎంతో వితరణ చేశారు. ఆలయం సమీపంలోని సిద్ధన్న బావి లేక గంగ బావి అన్న బావి విషయంలోనూ ఐతిహ్యం ఉంది. అనసూయా దేవి తనకు ప్రత్యక్షమైన గంగాదేవిని ఇక్కడ గంగ నీరు వచ్చేట్టు చేయమని కోరగా ఈ నీటి ఆకరం ఏర్పడిందని చెప్తారు. కార్తీకమాసంలో ఈ బావి నుంచి నేరుగా గంగా జలం వస్తుందని భక్తుల విశ్వాసం.[39] ఉమా సిద్ధేశ్వరస్వామి ఆలయంలో తపస్వి సాగిలపడి నమస్కరిస్తున్నట్టు గర్భాలయంలో ఒక విగ్రహం ఉంటుంది. ఇది అత్రిదేనని, స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు చెప్తారు.

 
వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం

గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఈ ప్రాంతంలో మంచి ప్రసిద్ధి ఉంది.[28] 1928 నుండి ఏటా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను వైభవోపేతంగా చేస్తున్నారు. స్వామివారి కల్యాణం 9 రోజుల పాటు, మొత్తంగా తిరునాళ్ళు 15 రోజులపాటు సాగుతాయి. ఉత్సవంలో సంత, వివిధ వస్తువుల ప్రదర్శన, అమ్మకాలు, మ్యాజిక్ ప్రదర్శనలు, సర్కస్ డేరాలు వంటివి ఎన్నో భాగంగా ఉంటాయి. స్వామివారి ఊరేగింపులు, షష్ఠినాడు ఉచిత అన్నదానం, హరికథలు, బుర్రకథలు, నాటకాలు వంటి కళాప్రదర్శనలు గ్రామ కమిటీ, ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేస్తాయి. ఉచిత అన్నదాన సత్రాన్ని ఇందుకోసం నిర్మించారు. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు షష్ఠికి తరలివస్తారు.[40] ఆలయం ఎలా ఏర్పడింది అన్న విషయంపై పలు కథనాలు ఉన్నాయి. అన్నిటిలోనూ ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో, అంటే ఆనాటి మంచినీటి చెరువు కట్టపై ఒక సర్పం తరచు కనిపిస్తూ, మాయం అవుతూ ఉండేదని ఉంది. ఆ ప్రదేశంలోనే ఈనాడు ఉన్న ఆలయాన్ని గ్రామస్తులందరూ ఏకమై నిర్మించారని చెప్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి కమిటీ వారి ప్రకారం ఆలయ నిర్మాణం అన్నది 1910లో జరిగింది. ఆలయంలోని ఏకశిలపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రూపాలతో మూలవిరాట్టు ఉంటుంది.[41]

 
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా షష్ఠి సందర్భంగా ఉపయోగించే కళ్యాణమండపం

గ్రామంలో మరో రెండు ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఒకటి - వేణుగోపాలస్వామి ఆలయం, రెండవది - ఆంజనేయస్వామి ఆలయం. ఈ రెండిటికీ వెయ్యేళ్ళ పైబడి చరిత్ర ఉందని చెప్తారు. వేణుగోపాలస్వామి ఆలయం గురించి కూడా వాయుపురాణంలో ప్రస్తావన ఉంది.[42] కొల్లపాటి వెంకమ్మ, పోలేరమ్మ, మహంకాళమ్మ-వెంకమ్మల ఆలయాలు ఉన్నాయి. కొల్లపాటి వెంకమ్మ జాతరను సంక్రాంతి నుండి ప్రారంభించి 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈమె కొల్లపాటి వంశస్థుల ఆడపడుచు అని, కలలో కనిపించి ఆ వంశంలో పూర్వీకునితో గాజులు వేయించుకుందని, ఆనాటి నుంచి ఈ దేవత ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్తారు. కొల్లపాటి వంశస్థులు సిరిబొమ్మను ఊరేగించి సమర్పిస్తారు. దాదాపు 80 ఏళ్ళ నుంచి ఈ జాతర జరుగుతోంది. పోలేరమ్మకు ఉగాదికి 9 రోజులు ముందు నుంచి ప్రారంభించి జాతర చేస్తారు. 2015లో అత్తిలి చెరువు తవ్వుతూండగా విజయ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.[43]

సినిమాలు, నాటక రంగం

మార్చు

సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిర్మాత, మేకప్ మేన్ కాకిత జయకృష్ణ అత్తిలి నుంచి సినీ రంగానికి వెళ్ళి విజయవంతులైన వారు. కాకిత జయకృష్ణ పుట్టింది మండలంలోని కొమ్మరలో కాగా అత్తిలిలో టైలర్‌గా పనిచేసేవాడు. మేకప్‌మాన్‌గా సినిమా పరిశ్రమలో కెరీర్‌ ప్రారంభించి,నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించాడు.[44][45][నోట్స్ 3]

అత్తిలి అన్న పేరు సినిమా రంగంలోనూ, తద్వారా తెలుగు ప్రేక్షకుల్లోనూ నలిగిన పేరు. ఈ పేరు విక్రమార్కుడు వంటి సినిమాల్లో పాత్రల పేర్లు (అత్తిలి సత్తిబాబు), "అమెరిక గర్ల్ అయినా, అత్తిలి గర్ల్ అయినా" వంటి పాటల్లో ప్రస్తావనలు ఉన్నాయి.[46][47][48] అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ సినిమా అంతా అత్తిలిలోనే జరిగినట్టుగా చూపించారు.[49] బ్రహ్మానందం సినిమాల్లో పలుమార్లు సంభాషణల్లో, పాత్రల నేపథ్యంలో వాడి అత్తిలి పేరును మారుమ్రోగించాడు.[50]

నోట్స్

మార్చు
  1. జైనముని అయిన అర్హనందికి చామెకాంబ అన్న శిష్యురాలు ఉండేది. ఈమె రెండవ అమ్మరాజు ప్రియురాలు, గొప్ప సౌందర్యవతియైన వారకాంత, నాట్యకారిణి. ఈమెను ప్రోత్సహించే నిమిత్తం అర్హనంది నిర్వహించే సర్వలోకాశ్రయ జినభవనపు భోజనశాల నిర్వహణకు అత్తిలి సమీపంలోని కలుచుంబఱ్ఱు (నేటి కంచుమర్రు) గ్రామాన్ని అమ్మరాజు దానమిచ్చినట్టు దానశాసనం ఉంది.
  2. మరికొన్ని యుద్ధాలు గుండుగొలను, కోసూరు, కాకరపర్రు గ్రామాల వద్ద జరిగాయి. మొత్తంగా ఈ యుద్ధాల్లో కాటయవేమారెడ్డిని చంపి పెదకోమటి వేమారెడ్డి, అతనికి సహాయంగా పోరాడిన అన్నదేవ చోడుడు విజేతలుగా నిలిచారు.
  3. జయకృష్ణ కృష్ణంరాజు, జయసుధ, జయప్రద, విజయశాంతి వంటి నటులకు వ్యక్తిగత మేకప్ ఆర్టిస్టుగా పనిచేశాడు. నిర్మాతగా మారి తీసిన సినిమాల్లో మొదటి దశలో ఎక్కువ శాతం కృష్ణంరాజు హీరోగా తీసినవే. ఇతను చిరంజీవిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ, అతనికి తొలి పారితోషికం ఇచ్చిన నిర్మాతగా కూడా పేరొందాడు. ఇతని వద్ద మేకప్ నేర్చుకుని మేకప్‌మేన్ అయిన శిష్యుడు ఎ. ఎం. రత్నం కూడా ఇతనిలానే నిర్మాత అయ్యాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. 2.0 2.1 "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 5.
  4. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 6.
  5. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 54, 55.
  6. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 118.
  7. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 76.
  8. "'తూర్పుచాళుక్యులు(సా.శ.624-1076) '". ఈనాడు ప్రతిభ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  9. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 88, 89.
  10. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 98.
  11. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 119, 120.
  12. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 128, 129.
  13. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 131.
  14. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 132.
  15. Staff (2019-04-08). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నిడుద‌వోలు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి". telugu.oneindia. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  16. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 139–154.
  17. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 166.
  18. 18.0 18.1 కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 171.
  19. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 171–181.
  20. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 177, 178.
  21. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 173.
  22. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 174.
  23. 23.0 23.1 కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 175.
  24. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 176.
  25. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 178.
  26. "నగర పంచాయతీగా ఆకివీడు, అత్తిలి , చింతలపూడి". Akividu - Welcome to Mana Akividu Info.Com. Retrieved 2020-11-07.
  27. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 163.
  28. 28.0 28.1 28.2 మండల గణాంక దర్శిని - అత్తిలి మండలం (PDF). అర్థగణాంక శాఖ. 1985. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.{{cite book}}: CS1 maint: bot: original URL status unknown (link)
  29. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 164–166.
  30. 30.0 30.1 "అత్తిలి.. ఇట్స్‌ బ్రాండ్‌ నేమ్‌". సాక్షి. 2016-11-12. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  31. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 188.
  32. "మళ్ళీ మనమే నంబర్‌ 1". www.andhrajyothy.com. 2018-12-06. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  33. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 167.
  34. "గోదారోళ్ల గుండెల్లో కొలువై." Sakshi. 2019-07-24. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  35. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 179.
  36. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 8.
  37. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 7.
  38. 38.0 38.1 కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 10.
  39. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 16.
  40. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 20.
  41. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 21.
  42. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 17.
  43. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, pp. 18, 19.
  44. "నిర్మాత జయకృష్ణ కన్నుమూత". Sakshi. 2016-03-30. Archived from the original on 2020-11-16. Retrieved 2020-11-16.
  45. కానూరి బదరీనాథ్, అత్తిలినాణ్డు విషయము 2019, p. 200.
  46. "విక్రమార్కుడు సినిమాలో అసలు సిసలైన పోలీస్ గా కనిపించి దుమ్మురేపిన రవితేజ..! - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  47. "అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా...అంటున్న విజయదేవరకొండ...! | INS Media". www.ins.media. Archived from the original on 2020-11-16. Retrieved 2020-11-09.
  48. "'జింతాత జిత జిత జింతాత తా..' గుర్తుందా!". సాక్షి. 2020-06-23. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  49. "Athili Sathibabu LKG - Telugu cinema Review - Allari Naresh & Kausha, Vidisha". www.idlebrain.com. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.
  50. "గురుబ్రహ్మి". Sakshi. 2014-09-04. Archived from the original on 2020-11-09. Retrieved 2020-11-09.

ఆధార గ్రంథాలు

మార్చు
  • బదరీనాథ్, కానూరి (2019), అత్తిలినాణ్డు విషయం, తణుకు: బదరీనాథ్ ప్రచురణలు
"https://te.wikipedia.org/w/index.php?title=అత్తిలి&oldid=4315561" నుండి వెలికితీశారు