అరుంధతి (2009 సినిమా)

అరుంధతి 2009 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా. అనుష్క, సోనూ సూద్, అర్జన్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది.

అరుంధతి
(2009 తెలుగు సినిమా)
TeluguFilmPoster Arundhati.JPG
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం శ్యామ్ ప్రసాద్ రెడ్డి
రచన చింతపల్లి రమణ
తారాగణం అనుష్క (అరుంధతి, జేజెమ్మ),
సోనూ సూద్ (పశుపతి) ,
దీపక్ (రాహుల్),
సాయాజీ షిండే (అన్వర్),
మనోరమ,
కైకాల సత్యనారాయణ,
అన్నపూర్ణ,
ఆహుతీ ప్రసాద్,
చలపతిరావు
సంగీతం కోటి
గీతరచన సి. నారాయణ రెడ్డి
ఛాయాగ్రహణం కె. సెంథిల్ కుమార్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ మ‌ల్లెమాల ఎంంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ జనవరి 16, 2009[1]
భాష తెలుగు

కథసవరించు

అరుంధతి (అనుష్క) గద్వాల సంస్థానం మహారాజు యొక్క మునిమనుమరాలు. చిత్ర ప్రారంభంలో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆమె హైదరాబాద్ నుంచి పెళ్ళి కోసం గద్వాలకు వస్తుంది. ఆమెకు కాబోయే భర్తయైన రాహుల్ (అర్జన్ బజ్వా) గొంతుతో ఊరి బయట ఉన్న కోట దగ్గరకు రమ్మని ఫోన్ వస్తుంది. దాంతో ఆమె ఆ కోట దగ్గరికి వెళుతుంది. అక్కడ కొన్ని భయబ్రాంతులతో కూడిన అనుభవాలకు లోనవుతుంది.

నటీనటులుసవరించు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

భారీవ్యయంతో, ఎంతో కష్టపడి నిర్మించిన అంజి సినిమా పరాజయం పాలవడంతో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిరుత్సాహపడ్డారు. ఆయనను ఆ నిరుత్సాహం నుంచి తప్పించేందుకు వాళ్ళ కుటుంబసభ్యులు ప్రతి వీకెండ్ పార్టీలు నిర్వహించేవారు. ఆ క్రమంలో ఓ వీకెండ్ పార్టీకి వచ్చిన ఆయన బంధువు ఒకామె గద్వాల సంస్థానం గురించిన రకరకాల వివరాలు చెప్పారు. అదే పార్టీలో ఆయన తాతగారు చెప్పిన వెంకటగిరి సంస్థానంలో జరిగిన మరో కథ చర్చకు వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిన్నతనం నుంచి అప్పుడప్పుడు వింటూవచ్చిన కథను ఆమె మళ్ళీ వివరించారు. గద్వాల రాజు కుమార్తె ఓ పనివాడితో ప్రేమలో పడింది. ఓసారి రాజా వారు, ఇతరులూ కూడా కోటలో లేని సమయంలో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. హఠాత్తుగా రాజు తిరిగివస్తే వారిద్దరూ లోపల ఏకాంతంగా ఉండడం తెలిసింది. ఉగ్రుడైన రాజు వాళ్ళను గదిలోనే ఉంచి, బయట నుంచి సమాధిలా గోడకట్టేశారు. లోపలున్నవాళ్ళు పెట్టిన కేకలు లోపలినుంచి మార్మోగాయి. అలా క్రమంగా వారు లోపలే మరణించారన్నది ఆ కథ సారాంశం. అయితే ఆసారి విన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఆ కథను చాలామంచి సినిమా కథగా మలచవచ్చన్న ఆలోచన తట్టింది. తర్వాత అంజి సినిమాకి గ్రాఫిక్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కడం ఆయనకు ఉత్సాహం కలిగించింది. అంజికి గ్రాఫిక్స్ వర్క్ చేసినవాళ్ళతో ఏర్పాటైన పార్టీలో మరో గ్రాఫిక్స్ అద్భుతాన్ని సృష్టిద్దామని ఆయన ప్రతిపాదించారు. దాంతో సినిమా స్క్రిప్టు పని ప్రారంభించారు.

శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్టు టీం ఆధ్వర్యంలో జరిగిన స్క్రిప్ట్ అభివృద్ధిలో సమాధి అయిపోయిన వెంకటగిరి రాజకుమారి, ఆమె ప్రియుడు కథను లైన్ గా తీసుకుని దాన్ని గద్వాల నేపథ్యంలోకి మార్చారు. మరణించింది ప్రేయసీ ప్రియులు కాక ఓ మంత్రశక్తులున్న కీచకునిగా మార్పుచేశారు. స్క్రిప్టు అభివృద్ధి చేశాకా పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రం తంతు నుంచి అరుంధతి అన్న పేరు తీసుకుని టైటిల్ గా నిర్ణయించారు. సినిమాకి మొదట దర్శకునిగా తమిళ దర్శకుడు సభాపతిని తీసుకుందామని భావించారు. ఆయనకు కథ వివరించి ట్రయల్ షూట్ చేయమని అవకాశం ఇచ్చారు. ఆ ట్రయల్ షూట్ చేశాకా వచ్చిన ప్రాడక్ట్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నచ్చలేదు. సీరియల్ నటులతో, వీడియో కెమెరాపై ఇంతకన్నా క్వాలిటీ ఎలా వస్తుందని సభాపతి ప్రశ్నించడంతో, సినిమాలో నటించబోయేవాళ్ళనే పెట్టి సినిమాకు వినియోగించే కెమేరా ఇచ్చి మరో ప్రయత్నం చేయమన్నారు శ్యామ్. అయితే అంత రియల్ టైం నటులు, ఎక్విప్మెంట్ తో సభాపతి తీసిన ట్రయల్ వెర్షన్ కూడా నిర్మాత నచ్చకపోవడంతో అవకాశం సభాపతి చేజారిపోయింది. చివరికి సినిమా అవకాశం తనతో ఎన్నో సినిమాలు తీసిన వెటరన్ డైరెక్టర్ కోడి రామకృష్ణకే ఇచ్చారు శ్యామ్.[4]

నటీనటుల ఎంపికసవరించు

సినిమాలో అరుంధతి పాత్రకు రాజసం ఉట్టిపడే, మంచి ఎత్తుగా ఉండే కథానాయిక కావాల్సివచ్చింది. అలాంటి కథానాయిక కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఆ క్రమంలో మమతా మోహన్ దాస్ అయితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆమెను కథతో సంప్రదించారు. కానీ ఆమెతో కొందరు - శ్యామ్ సినిమా అంటే సంత్సరాల పాటు నిర్మాణం సాగుతూంటుందని, దాని వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతావని చెప్పడంతో ఆమె సినిమాను తిరస్కరించారు. ఆపైన వెతకగా అనుష్క దొరికారు. ఆమె అప్పటికి నాగార్జున సూపర్ సినిమాలో రెండవ కథానాయికగా నటించి, రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన విక్రమార్కుడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఆమెకు రాగా, రాజమౌళిని సలహా అడిగినప్పుడు ఆయన - శ్యామ్ చాలా గొప్ప ఫిలిమ్ మేకర్ అనీ, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని సలహా ఇచ్చారు. ఆపైన అనుష్క ఈ సినిమాను అంగీకరించారు. సినిమాలో మరో కీలకమైన పాత్ర ప్రతినాయకుడిది. ఈ పాత్రకు తమిళనటుడు పశుపతిని తీసుకుందామని భావించి పాత్రకి పశుపతి అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఆయనకు అఘోరా వేషం బాగానే సరిపోయినా, అరుంధతిని మోహిస్తూ ఆమె దగ్గరగా నిలబడే సన్నివేశాల్లో తేలిపోయినట్టు అనిపించడంతో ఆయనని తీసుకోలేదు. అశోకా అన్న హిందీ సినిమా చూస్తూండగా అందులో నటించిన సోనూ సూద్ ఈ పాత్రకు సరిపోతారన్న నమ్మకం కలిగింది శ్యామ్ కు. అప్పటికి కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాని సోనూ సూద్ ను ఇందులో పశుపతి పాత్రకు తీసుకున్నారు. ఫకీర్ పాత్రకు ముందు నసీరుద్దీన్ షా అయితే బావుంటుందనుకున్నా వీలుదొరకలేదు. నానా పటేకర్, అతుల్ కులకర్ణి వంటి వారిని సంప్రదించగా డేట్స్ కుదరకపోవడంతో వాళ్ళు నటించలేదు. దాంతో ఆ అవకాశం షాయాజీ షిండేకి దొరికింది.[4]

చిత్రీకరణసవరించు

సినిమా చిత్రీకరణ బనగానపల్లె, అన్నపూర్ణ స్టూడియో వంటి ప్రాంతాల్లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్లు సినిమా కోసం తీసుకుని వాటిలో ప్యాలెస్ సెట్ వేశారు. మొదటి ఫ్లోరులో సగం, మరో ఫ్లోరులో సగం సెట్ వేసి చిత్రీకరణ జరిపారు. ఆ సెట్లో పదిహేను నిమిషాలు స్క్రీన్ టైం వచ్చే ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని చిత్రీకరించారు. ఆ సెట్ వేసేందుకు, అందులో చిత్రీకరించేందుకు దాదాపు 4నెలల సమయం, రూ.85 లక్షల వ్యయం అయ్యాయి. బనగానపల్లెలోని పాత కోటలో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ కోటను సినిమా అవసరాలకు తగ్గట్టు వార్నిష్ చేయించి, కడియం నుంచి తెప్పించిన 25 లారీల పూలమొక్కలతో ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటుచేసి అలంకరించారు. అక్కడ జరిపిన షూటింగ్ దాదాపు 45 రోజులు పట్టింది. క్లైమాక్స్ లో భయానక దృశ్యాల కోసం కోటలో భారీ ఎత్తున ఫైన్ డస్ట్ తెప్పించి వాడి దానిలో షూటింగ్ చేశారు. ప్రణాళికలో 55 రోజుల్లో సినిమా తీసేస్తామని భావించగా 200రోజులకు షూటింగ్ ఎగబాకింది. ఐతే సినిమా మొత్తం షూటింగ్ పూర్తయ్యాకా చూసుకున్న చిత్రబృందం అవుట్ పుట్ తో సంతృప్తి చెందలేదు. దాంతో బాగున్న భాగాలు ఉంచి, నచ్చని భాగాలను రీ-షూట్ చేశారు. దాంతో చిత్రీకరణ మరో 40 రోజులు పెరగింది. వెరసి మొత్తం షూటింగ్ 264 రోజులు జరిగింది.[4]

గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్సవరించు

అరుంధతి సినిమాకు గ్రాఫిక్స్ వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివే కీలకమైనవి. దాంతో సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని నడిపించే రాహుల్ నంబియార్ కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారు. సినిమాలో కథాచర్చల దశ నుంచీ రాహుల్ నంబియార్ పాలుపంచుకున్నారు. ఆ దశ నుంచే విలన్ మేకప్, సెట్లు ఎలావుండాలో స్కెచ్ లు వేసుకుని, అందులో ఆయా విభాగాలు చేసేవి ఏమిటో, తాను క్రియేట్ చేయాల్సినవేమిటో స్పష్టత సాధించారు. చిత్రీకరణలో దాదాపు అంతటా ఆయన పాలుపంచుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ జతచేయాల్సిన సన్నివేశాల్లో నటుల కదలికలు ఎలావుండాలి, కెమెరా కోణాలు ఎటుండాలి వంటివన్నీ రాహుల్ స్వయంగా చూసుకునేవారు.[4] సినిమా చిత్రీకరణ పూర్తయ్యాకా, ముందు చేసుకున్న ప్రయత్నాలను కొనసాగిస్తూ విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చారు.

విడుదలసవరించు

అరుంధతి సినిమాని 2009 సంక్రాంతి నాటికి విడుదల చేశారు. సినిమా నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఈ భారీ చిత్రాన్ని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సరిగా ముందుకు రాకపోవడం, వచ్చినవారు కూడా నిర్మాత లాభాలు కళ్ళజూసే రేటు చెప్పకపోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డి స్వయంగా అన్ని ఏరియాల్లోనూ విడుదల చేసుకున్నారు. సినిమా మంచి విజయాన్ని సాధించింది. 35 ప్రింట్లతో సినిమాను విడుదల చేయగా, మరుసటి వారానికి 290 ప్రింట్లకు, ఆపై వారం 360 ప్రింట్లకు పెరిగి 2009 సంక్రాంతి హిట్ గా నిలిచింది.[4]

పాటలుసవరించు

 • చందమామ నువ్వే నువ్వే నువ్వే
 • కమ్ముకున్న చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా (గానం: కైలాష్ ఖేర్)
 • భూ భూ భుజంగం

పురస్కారాలుసవరించు

ఈ చిత్రం 2009 లో 7 నంది పురస్కారాలను సాధించింది.[5]

 • 2009 నంది ఉత్తమ ప్రతినాయకుడు- సోనూ సూద్
 • 2009 నంది ప్రత్యేక జ్యూరీ - అనుష్క
 • 2009 నంది ఉత్తమ కళాదర్శకుడు- అశోక్
 • 2009 నంది ఉత్తమ అలంకరణ కళాకారుడు- రమేశ్ మహతో
 • 2009 నంది ఉత్తమ బాల నటి- బేబి దివ్య నగేశ్
 • 2009 నంది ఉత్తమ పురుష అనువాద కళాకారుడు - రవిశంకర్
 • 2009 నంది ఉత్తమ దుస్తుల కూర్పు- దీపాచందర్

మూలాలుసవరించు

 1. Sakshi (16 January 2022). "అరుంధ‌తికి 13 ఏళ్లు". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 2. Sakshi (11 September 2016). "అమ్మాళీ... ఎంత బొమ్మాళీ!!!! వదలా నిన్నొదలా..." Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 3. News18 Telugu (10 June 2021). "అరుంధతిలో ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా." Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 4. 4.0 4.1 4.2 4.3 4.4 పులగం, చిన్నారాయణ. "వదల బొమ్మాళీ... వదల". సాక్షి. Retrieved 9 August 2015.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-06. Retrieved 2010-11-27.