రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు, నిర్మాత
(రాం గోపాల్‌ వర్మ నుండి దారిమార్పు చెందింది)

రామ్ గోపాల్ వర్మ (జ. ఏప్రిల్ 7, 1962) ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ), భూత్ (హిందీ). ఫాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు చిత్రాలు నిర్మించింది.

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)
రామ్ గోపాల్ వర్మ బూత్ రిటర్న్స్ ప్రచార సమయంలో (సెప్టెంబర్ 2012)
జననం
రామ్ గోపాల్ వర్మ

(1962-04-07) 1962 ఏప్రిల్ 7 (వయసు 62)
విద్యాసంస్థవెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ , ఆంధ్ర ప్రదేశ్
వృత్తిసినీ దర్శకుడు, నిర్మాత , రచయిత
క్రియాశీల సంవత్సరాలు1989–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరత్న వర్మ
పిల్లలురేవతి వర్మ (కూతురు)[1][2]

మొదటి సంవత్సరాలు

మార్చు

రామ్ గోపాల్ వర్మ 1962లో తూర్పుగోదారి జిల్లాలో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాదులోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు.[3] అయితే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. ఇంజినీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపారు. తరువాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది.

ఆయనకి, ఆయన మేనమామకి సినిమాలు అంటే తగని మక్కువ. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. సినిమా పేర్లలో దర్శకుడి పేరు,"ఫిల్మ్ బై" అని వేసే పేర్లను చూసి చాలా ఉత్తేజం చెందేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఉత్తేజం చెందిన వర్మ, తన పేరుని కూడా అలా సినిమా టైటిల్స్ లో మొదటిసారి ఉదయం (శివ తమిళ వెర్షన్) సినిమాలో చూసుకుని మురిసిపోయారు. ఆయనకు తన కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదు. తన మేనమామ కూడా పిచ్చితనం అనే అనుకునేవాడు. దక్షిణ భారతంలో చెన్నై లాంటి నగరాల్లో నిర్మించే చిత్రాల్లోకంటే ముంబైలో నిర్మితమయ్యే చిత్రాల్లో ప్రతిభ కొరవడింది అని ఆయన భావించేవారు. ఆయన తనకి ఎటువంటి దురలవాట్లు లేవని చెప్తారు. మద్యం సేవించడం ఒక వ్యసనంగా ఆయన ఒప్పుకోరు. వర్మకి నచ్చిన దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, శేఖర్ కపూర్, గోవింద్ నిహ్‌లానీ మొదలగు వారు. కానీ ఆయనపై ఎవరి ప్రభావం లేదు. ఆయనది సొంత శైలి. సినీ విశ్లేషణల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరో అపరిచితులు నా సినిమా గురించి రాసే విశ్లేషణల గురించి నేనెందుకు బాధపడాలి? ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను? అని ప్రశ్నిస్తారు.

వృత్తి

మార్చు

రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్.ఎస్. క్రియేషన్స్ నిర్మించిన రావుగారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి సహాయ నిర్దేశకునిగా మొదలు పెట్టారు. తెలుగు, భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా, 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు.

తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమాలు క్షణక్షణం (వెంకటేష్, శ్రీదేవి నాయికానాయికలు) హాలీవుడ్ లో నిర్మించిన ఆధారము, ఇది తన కాలేజి మనసు దోచిన సత్య (తరువాత రోజులలో ఇదే పేరుతో ఒక సినిమా కూడా నిర్మించాడు) తో సంబంధానికి ఒక జ్ఞాపకం, రాత్రి (రేవతి ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ద్విభాషా హారర్ చిత్రం), అంతం (నాగార్జున, ఊర్మిలా మటోండ్కర్ నాయికానాయికలుగా అపరాధి - పోలీస్ కథతో నిర్మించిన మరో ద్విభాషాచిత్రం) కానీ ఇది వాణిజ్యపరంగా శివలా విజయం సాధించలేదు. తరువాత గోవిందా గోవిందా (నాగార్జున, శ్రీదేవి నాయికానాయికలు) దీనిలో విలన్లు వేంకటేశ్వరస్వామి వజ్రపు కిరీటాన్ని దొంగిలించటానికి స్వామి అరచేతులమీద కాళ్ళు పెట్టటంతో వివాదాస్పదం అయ్యింది. భారతీయ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఈ దృశ్యాన్ని తొలగించాలని కోరారు. అనవసరమైన ప్రచారం కలిగినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ కలిగించింది.

తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమా జగపతిబాబు, ఊర్మిలా మటోండ్కర్ నాయికానాయికలుగా నిర్మించిన గాయం కూడా నేరప్రపంచపు చీకటిసామ్రాజ్యం నేపథ్యంలో వచ్చిన మరొక హింసాత్మక కథ. దీనికి తమిళ సినిమా దర్శకుడు మణి రత్నం స్క్రీన్ ప్లే అందించారు. ఇది నగరాలలో బాగానే ఆడింది. తరచుగా తన సినిమాలలో ఊర్మిళ (నటి) నే హీరోయిన్ గా తీసుకోవడం వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వచ్చిన పుకార్లకు ఆజ్యం పోసింది.

వర్మ తన సొంత సినిమా నిర్మాణసంస్థ వర్మ కార్పోరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ, మనీ మనీ, గులాబి, సైకో, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒక రోజు, దెయ్యం (చివరి రెండు సినిమాలకు తనే దర్శకత్వం వహించారు) అనే తెలుగు సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ తరువాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు.

హిందీ సినిమా పరిశ్రమను ప్రేమకథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న రోజుల్లో వర్మ సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉండేవి, విషయాన్ని లోతుగా అన్వేషించేవి. భారతీయ సినిమా ఇలాంటి నిజానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసినప్పటికీ, వర్మ తనదైన శైలిలో ముందుకు సాగిపోయారు.

వర్మ హిందీ సినిమాల దండయాత్ర (బాలీవుడ్లో సాధారణంగా అనుకొనే మాట) రంగీలా చిత్ర ఘనవిజయంతో ఆరంభమైంది. ఈ సినిమాతో ఊర్మిళ (నటి) మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి రంగప్రవేశం చేశాడు. రంగీలా తర్వాత వచ్చిన సినిమా దౌడ్.

సత్యా సినిమా వర్మకు ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం. అతి తక్కువ బడ్జెటుతో తారలెవరూ లేకుండా తీసిన ఈ సినిమా అనేకమంది నటులు, సాంకేతికులకు ప్రాణం పోసింది. అందులో ముఖ్యమైన వారు మనోజ్ బాజ్‌పాయి, చక్రవర్తి, మకరంద్ దేశ్‌పాండే, అనురాగ్ కశ్యప్ (చిత్రానికి కథ, సంభాషణలు సమకూర్చాడు), సందీప్ చౌతా (నేపథ్య సంగీతం సమకూర్చాడు). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆ తరువాత బాలీవుడ్లో అనేక అనుకరణలకు మాతృక అయ్యింది. కొందరు విమర్శకులు ఈ హింసాత్మక చిత్రంలో వర్మ మాఫియాను glorify చేశాడని విమర్శించారు.

కౌన్, భూత్, కంపెనీ వంటి చిత్రాలలో కథాగమనానికి అడ్డుతగలకుండా ఉండేందుకు భారతీయ చిత్రాలలో సర్వసాధారణమైన పాటలను కత్తరించివేశారు. నేపథ్య సంగీత విషయములో వర్మ చాలా శ్రద్ధ చూపుతారు. చాలాకాలం తన సినిమాలలో సంగీత దర్శకుడు సందీప్ చౌతాతో కలిసి పనిచేశారు.

రామ్ గోపాల్ వర్మ తన అన్ని సినిమాలలోనూ ప్రధాన స్రవంతిలోని బాలీవుడ్ చిత్రాలను నిర్మించే వ్యక్తులను వారి శైలిని తన వ్యంగ్య చతురతతో విమర్శిస్తూనే ఉన్నారు. ఈయన సినిమాలు దాదాపు అన్నీ సమకాలీన సమాజానికి అద్దంపడతాయి . నేపథ్యం సాధారణంగా ఎపుడూ ముంబాయి నగరములోనే ప్రారంభమౌతుంది కానీ కథానుసారముగా విస్తరణకు అవకాశముంటుంది. విమర్శకులు, వర్మ సినిమాలు కేవలం స్థూలదృష్టికోణాన్ని చిత్రీకరించకుండా, కథానాయికనాయకుల అంతరంగములోకి లోతుగా చొచ్చుకుపోయి వాళ్ళ ప్రేరేపణలను వెలికితీసే ప్రయత్నం చేస్తాయి అని అంటారు.

ఇటీవల విడుదలైన వర్మ చిత్రం నాఛ్ ఇప్పటివరకు తన అత్యుత్తమ సినిమా అని చాటుకున్నారు (తన అన్ని సినిమాల నిర్మాణం తర్వాత ఈయన ఇలానే చాటుకొంటూ ఉంటారు). నాఛ్ సినిమా ప్రపంచముపై తనదైన ముద్ర వేయాలనుకునే ఒక నృత్యదర్శకురాలికి, సినిమాలలో గొప్పస్థాయికి ఎదగాలగుకుంటున్న ఒక వర్ధమాన నటునికి మధ్య సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. నాఛ్ వ్యాపారపరంగా అంత విజయవంతము కాలేదు. ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ "నేను నాఛ్ లో మున్సిపల్ స్కూలుకు అయాన్ ర్యాండ్ ఇవ్వటానికి చాలా శ్రమపడ్డాను." అని ప్రేక్షకుల అవగాహనా స్థాయికి అందని సినిమా తీసానని చెప్పుకున్నారు.

వర్మ తరువాతి సినిమా సర్కార్ జూన్, 2005లో విడుదలయింది. నిజ జీవితంలో తండ్రి-కొడుకులయిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి-కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని చెప్పారు. ఈ సినిమా మౌలికంగా పితృస్వామ్యము, స్వాభిమానము గురించి అని వర్మ అభిప్రాయం. భారతీయ రాజకీయాల నేపథ్యములో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనుకునే రాజకీయనాయకుడు సర్కార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

వర్మ భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనంతగా చాలా వేగంగా సినిమాలను నిర్మిస్తున్నారు. తన ఆఫీస్ పేరు The Factory(ద ఫ్యాక్టరీ). తను ఎంపిక చేసిన దర్శకులతో తన నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలను నిర్మిస్తున్నారు. తన సినిమాలకు ప్రతిభ వున్న క్రొత్త వారిని ఎంపిక చేయటం వర్మ అలవాటు. తను పరిచయం చేసిన వారందరి కెరీర్ బాగా వుండటంతో కావలసిన వాళ్ళు కింగ్ మేకర్ అని అంటారు. మనోజ్ బాజ్ పాయ్, ఆఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్, రాజ్ పాల్ యాదవ్ వీళ్ళంతా సినిమా తెరకు వర్మ ద్వారా పరిచయం అయిన వాళ్ళే. తను ఉదార స్వభావుడు కానని, తన స్వార్థం కోసమే క్రొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నానని వర్మ ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. సినిమా పత్రికలు వారు 'స్పాన్సర్' చేసే అవార్డులంటే వర్మకు ఇష్టముండదు, తను ఎప్పుడూ బహుమతి ప్రదానోత్సవాలకు హాజరు కాలేదు.

అవార్డులు , నామినేషన్లు

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డును రామ్ గోపాల్ వర్మ మూడుసార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ, క్షణ క్షణం, ప్రేమకథ చిత్రాలకు గెలుచుకున్నారు. సత్య' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డును గెల్చుకున్నారు.

చిత్ర సంకలనము

మార్చు
చిత్రము విడుదల తేది భాష బాధ్యతలు
మా ఇష్టం 2022, 6 మే తెలుగు దర్శకుడు
డీ కంపెనీ 2021, 15 మే తెలుగు దర్శకుడు
థ్రిల్లర్ 2020, 14 ఆగష్టు తెలుగు దర్శకుడు
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు 2019, నవంబరు 29 తెలుగు దర్శకుడు
లక్ష్మీస్ ఎన్‌టిఆర్ 2019 తెలుగు దర్శకుడు
ఆఫీసర్ 2018 జూన్ 1 తెలుగు దర్శకుడు
వంగవీటి 2016 డిసెంబరు 23 తెలుగు దర్శకుడు
ఎటాక్ 2016 ఏప్రిల్ 1 తెలుగు దర్శకుడు
కిల్లింగ్ వీరప్పన్ 2016 జనవరి 7 తెలుగు,తమిళ్,హింది దర్శకుడు
అనుక్షణం 2014 సెప్టెంబరు 12 తెలుగు దర్శకుడు
సత్య 2 2013 నవంబరు 8  తెలుగు, హిందీ దర్శకుడు
26/11 ఇండియాపై దాడి 2013 మార్చి 1  తెలుగు, హిందీ దర్శకుడు
శివ (2006 చిత్రం) 2006 హిందీ దర్శకుడు
మిస్టర్. య మిస్. డిసెంబరు 2, 2005 హిందీ నిర్మాత
జెమ్స్ సెప్టెంబరు 16, 2005 హిందీ నిర్మాత
మై వైఫ్'స్ మర్దర్ ఆగస్టు 19, 2005 హిందీ నిర్మాత
సర్కార్ జులై 1, 2005 హిందీ దర్శకత్వం & నిర్మాత
డి జూన్ 3, 2005 హిందీ నిర్మాత
నాచ్ నవంబరు 12, 2004 హిందీ నిర్మాత
వాస్తు శాస్త్ర 2004 హిందీ నిర్మాత
మధ్యాహ్నం హత్య 2004 తెలుగు నిర్మాత
గాయబ్ జులై 16, 2004 హిందీ నిర్మాత
అబ్ తక్ చప్పన్ ఫిబ్రవరి 27, 2004 హిందీ నిర్మాత
ఏక్ హసీనా థి జనవరి 16, 2004 హిందీ నిర్మాత
మై మాధురి ధిక్షిత్ బననా చహ తా హు అక్టోబరు 10, 2003 హిందీ నిర్మాత
డర్న మనా హై జులై 25, 2003 హిందీ నిర్మాత
భూత్ మే 30, 2003 హిందీ దర్శకత్వం & నిర్మాత
రోడ్ సెప్టెంబరు 27, 2002 హిందీ నిర్మాత
కంపెనీ ఏప్రిల్ 12, 2002 హిందీ దర్శకత్వం & నిర్మాత
లవ్ కెలియె కుచ్ భి కరేగ జూన్ 29, 2001 హిందీ నిర్మాత
ప్యార్ తూనె క్యా కియ ఏప్రిల్ 27, 2001 హిందీ నిర్మాత
జంగిల్ జులై14, 2000 హిందీ దర్శకత్వం & నిర్మాత
మస్త్ అక్టోబరు 15, 1999 హిందీ దర్శకత్వం & నిర్మాత
శూల్ 1999 హిందీ కథ,నిర్మాత
ప్రేమ కథ 1999 తెలుగు దర్శకత్వం
కౌన్ February 26, 1999 హిందీ దర్శకత్వం & నిర్మాత
దిల్ సె 1998 హిందీ నిర్మాత
సత్య జులై 3, 1998 హిందీ దర్శకత్వం & నిర్మాత
దౌడ్ జులై 13, 1997 హిందీ కథ, స్క్రీన్ ప్లే,కూర్పు, దర్శకత్వం & నిర్మాత
W/O వర ప్రసాద్ 1997 తెలుగు నిర్మాత
దెయ్యం 1996 తెలుగు దర్శకత్వం & నిర్మాత
గులాబి 1996 తెలుగు నిర్మాత
అనగనగా ఒక రోజు 1995 తెలుగు దర్శకత్వం & నిర్మాత
రంగీలా సెప్టెంబరు 8, 1995 హిందీ కథ, దర్శకత్వం & నిర్మాత
మని మనీ 1994 తెలుగు నిర్మాత
మని 1993 తెలుగు నిర్మాత
తిరుడ తిరుడ 1994 తమిళం స్క్రీన్ ప్లే
గాయం, దేశం 1993 తెలుగు, తమిళం దర్శకత్వం
గోవిందా గోవిందా 1993 తెలుగు దర్శకత్వం
అంతం, ద్రోహి అక్టోబరు 25, 1992 తెలుగు,హిందీ దర్శకత్వం
క్షణ క్షణం 1991 తెలుగు దర్శకత్వం
రాత్రి, రాత్ 1991 తెలుగు, హిందీ దర్శకత్వం
శివ (1989 సినిమా) డిసెంబరు 7, 1990 తెలుగు, తమిళం, హిందీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు రోల్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సంగీత దర్శకుడు Notes
2018 గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ [4][5] మియా మల్కోవా [6] రామ్ గోపాల్ వర్మ Strike Force LLC M. M.కీరవాణి 2018 జనవరి 27 [7]

మూలాలు

మార్చు
  1. "Ram gopal varma rare and unseen photos". Tirupati Buzz. 28 January 2011. Archived from the original on 3 April 2012. Retrieved 22 September 2012.
  2. "» Ram Gopal Varma has a secret daughter!". Chitramala.in. 15 October 2009. Archived from the original on 15 April 2013. Retrieved 22 September 2012.
  3. "హ్యాపీ బర్త్ డే: రాంగోపాల్ వర్మ". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 7 April 2017. Retrieved 7 April 2017.
  4. "Women Praising RGV's GST!". The Hans India. Archived from the original on 2018-01-27. Retrieved 2019-06-21.
  5. "YouTube". www.youtube.com.
  6. "Pornstar Mia Malkova's 'God, Sex And Truth' Released, Director RGV Says Watch It With Good Quality Headphones".
  7. "STRIKE FORCE, LLC: watch". STRIKE FORCE, LLC. Archived from the original on 2018-06-14. Retrieved 2019-06-21.

బయటి లింకులు

మార్చు