లక్ష్మీదీపక్
లక్ష్మీదీపక్ తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు హైదరాబాద్లో 1935లో జన్మించాడు. ఇతని అసలు పేరు లక్ష్మీనారాయణ. ఇతడి చదువు ఉర్దూ మాధ్యమంలో సాగింది. ఇతడు హైస్కూలు చదువుకొనే సమయంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడై దర్శకుడు కావాలనే కోరికను పెంచుకున్నాడు. హిందీ సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని 1958లో బొంబాయి వెళ్ళాడు. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. తిరిగి హైదరాబాదు వచ్చేశాడు. హైదరాబాదులో ఇతనికి అట్లూరి పూర్ణచంద్రరావు, ప్రత్యగాత్మ, గుత్తా రామినీడులు పరిచయమయ్యారు. రామినీడు ఇతనికి తొలిసారిగా చివరకు మిగిలేది సినిమాలో సహాయ దర్శకుడిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చాడు. తరువాత రామినీడు , హేమాంబరధరరావుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నాడు. మద్రాసులో ఇతడు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో ఇతనికి నటుడు ప్రభాకరరెడ్డి పరిచయమై స్నేహితుడిగా మారాడు. ప్రభాకరరెడ్డి తన స్వంత బ్యానర్ బి.ఎస్.మూవీస్ బ్యానర్‌పై పచ్చని సంసారం సినిమా తీస్తూ ఇతడికి మొదటి సారిగా దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ పేరును లక్ష్మీదీపక్‌గా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఇతడు సుమారు 30 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడి సినిమాలు ఎక్కువ భాగం విజయవంతమయ్యాయి. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవడమే ఇతని విజయాలకు కారణం. ఇతని మొదటి, చివరి సినిమాలకు ప్రభాకరరెడ్డి నిర్మాత కావడం గమనార్హం. ఎన్నో ఉదాత్తమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఇతడు 2001, జూన్ 10వ తేదీన మరణించాడు[1].
చిత్రాల జాబితా
మార్చుసహాయ దర్శకుడిగా
మార్చు- చివరకు మిగిలేది
- కలిమిలేములు
- కలవారి కోడలు
- దేవత
- పొట్టిప్లీడరు
- వీలునామా
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
- ఆడపడుచు మొదలైనవి.
దర్శకుడిగా
మార్చు- పచ్చని సంసారం
- కూతురు కోడలు
- జగత్ జెంత్రీలు
- పండంటి కాపురం
- అన్బు సహోదర్‌గళ్ (తమిళం)
- గాంధీ పుట్టిన దేశం
- నాకూ స్వతంత్రం వచ్చింది
- కార్తీక దీపం
- మహా పురుషుడు
- ధైర్యవంతుడు
- గూడుపుఠాణి
- హారతి
- ఇంటి కోడలు
- వయసొచ్చిన పిల్ల
- వింతఇల్లు సంతగోల
- ఈ కాలపు పిల్లలు
- ఏడడుగుల అనుబంధం
- ధర్మచక్రం
- సన్నాయి అప్పన్న
- తెలుగునాడు
- ఇంటింటా దీపావళి
మూలాలు
మార్చు- ↑ మన లక్ష్మీదీపక్ - హెచ్.రమేష్ బాబు - బతుకమ్మ(ఆదివారం అనుబంధం) - నమస్తే తెలంగాణ - 10 జూన్ 2012 - పేజీలు 12,13