భువనచంద్ర

సినీ గేయ రచయిత
(భువన చంద్ర నుండి దారిమార్పు చెందింది)

భువనచంద్ర తెలుగు సినీ గేయ రచయిత.

భువనచంద్ర
భువనచంద్ర
జననంఊరకరణం పూర్ణానంద ప్రభాకర గురురాజు
ఆగష్టు 17
నూజివీడు దగ్గర గుళ్ళపూడి
ప్రసిద్ధితెలుగు సినీ గేయ రచయిత
భార్య / భర్తశేషసామ్రాజ్య లక్ష్మి
పిల్లలుశ్రీనివాస్
తండ్రిసుబ్రహ్మణ్య శర్మ
తల్లిచంద్రావతి

జీవిత విశేషాలు

మార్చు

భువనచంద్ర నూజివీడు దగ్గర గుళ్ళపూడి లో జన్మించారు.[1] ఈయనకు ముగ్గురు అన్నలు, నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదవ యేట నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువాత చింతలపూడి వచ్చేశారు. ఈయన బడిలో చదివే వయసులో చింతలపూడి గ్రంథాలయంలో చందమామ మొదలైన కథల పుస్తకాలు మొదలుకొని పెద్ద పుస్తకాలను సైతం ఆసక్తిగా చదివే వాడు. రోజూ పాఠశాల నుంచి వచ్చేటపుడు గోడపై సినిమా పోస్టర్ల పై ఉన్న ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ, శ్రీశ్రీ మొదలైన పేర్లను చూసి, వాటిపక్కన సుద్ద ముక్కలతో తనపేరు రాసుకునేవాడు. అలా రచయిత కావాలన్న కోరికకు ఆయనకు చిన్నతనంలోనే బీజం పడిందని చెప్పవచ్చు.

చింతలపూడి గ్రామంలో విశ్వనాథాశ్రమం ఉండేది. దానికి స్వామీజీ బోధానందపురి మహరాజ్. అప్పట్లో అక్కడ రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అందులో భాగంగా అక్కడ హరికథలు, దేవీ భాగవతం, యోగావాశిష్టం మొదలైన ఎన్నో కార్యక్రమాలు జరుగుతుండేవి. ఒకసారి ఈయన మిత్రుడు రంగా ప్రసాదం కోసమని బలవంతంగా ఆ దేవాలయానికి ఈడ్చుకునివెళ్ళాడు. అలా కార్యక్రమాలు ఆయన చెవినపడ్డాయి. తరువాత ఇంకా వినాలనిపించింది. తరువాత అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. అలా ఆయన జీవితంలో ఏదో తెలియని మార్పు సంభవించింది. ఆ రోజు నుంచీ, స్కూలు, గ్రంథాలయం, ఆపై ఆశ్రమం ఆయన దినచర్యగా మారింది. స్వామీజీ ప్రసంగాలను నిత్యం వింటూ, మనిషంటే ఏమిటి? దేవుడంటే ఏమిటి? ఇలాంటి తాత్విక చింతనలతో కొద్ది కాలం గడిపేవాడు. చదువు పూర్తయిన తరువాత ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగం వచ్చింది.

1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఆయన పనిచేశాడు. సరిహద్దు గ్రామాల్లోంచి వెళుతున్నపుడు ప్రజలు ఇచ్చే రొట్టెలు, యుద్ధం చేసి తిరిగి వస్తుంటే దారిపొడవునా సెల్యూట్‌లు, పంజాబీ, గుజరాతీ మహిళలు కట్టిన రాఖీలు ఆయనకు అపురూపమైన సగర్వంగా గుర్తుంచుకోగలిఏ జ్ఞాపకాలు. ఎయిర్‌ఫోర్స్ లో ఉండగానే చిన్న చిన్న వ్యాసాలు, కథలు రాసి వివిధ పత్రికలకు పంపేవాడు. ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ పుస్తక పఠనం వదల్లేదు. సర్వీసులో ఉండగా దాదాపు నాలుగువేల పాటలు రాశాడు. ఎయిర్‌ఫోర్స్ లో పద్దెనిమిదేళ్ళు తర్వాత సర్వీసు పూర్తయింది. పన్నెండు వేల జీతంతో ఓఎన్‌జీసీలో ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ సినీ రచయిత కావాలన్న బలమైన కోరికవల్ల ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అవకాశాల కోసం మద్రాసు బయలుదేరాడు.

సినీపరిశ్రమలో

మార్చు

అలా మద్రాసు చేరిన ఆయన్ను చంద్రమోహన్ మొదట జంధ్యాల ఇంటికి తీసుకునివెళ్ళారు. ఆయన తీస్తున్న పడమటిసంధ్యారాగం సినిమాకు అవకాశం ఇస్తామన్నారు కానీ దురదృష్టవశాత్తూ అందులో ఆయన ఒక్కపాటా రాయలేకపోయారు. ఆ తర్వాత విజయ బాపినీడుని కలిసి ”నాకూ పెళ్ళాం కావాలి” అనే సినిమా ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఖైదీ నెం. 786లో ఆయన రాసిన ”గువ్వా... గోరింకతో...” అనే పాట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, పెద్దరికం మొదలైన హిట్ సినిమాలకు పాటలు రాశాడు. ఇటీవల రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలోని ”రారా.. సరసకు రారా..” అనేపాట అత్యంత ప్రేక్షకాధరణ పొందింది.

ఆయన భార్య శేషసామ్రాజ్య లక్ష్మి, కొడుకు శ్రీనివాస్. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. ఏనిమల్ ప్లానెట్ను అమితంగా ఇష్టపడే ఆయన అందులో ప్రకృతిలో మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, పక్షుల గురించి తెలుసుకోవడమంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎనిదిన్నరేళ్ళ వయసులో చదివిన ఒక కథ ప్రభావంతో ఆయన అప్పటి నుంచీ మాంసాహారాన్ని పూర్తిగా మానివేశాడు.

పనిచేసిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. మే 3, 2009 ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైన భువన చంద్ర ఇంటర్వ్యూ ఆధారంగా

బయటి లింకులు

మార్చు